నగరాలు

పట్టణాలు ఖాళీ

పల్లెలు రద్దీ

పండుగ సంక్రాంతి

గొట్టాలు ఊదరగొట్టే

వాతావరణం గతం

వర్తమానం విషమం

పల్లె తరిమితే

పట్టణీకరణ 

బహుళ అంతస్థులే అభివృద్ధి భ్రాంతుల ప్రజ

పండుగకి పల్లెకు పయనం

ద్రవ్యం పల్లెల్లో జొరబడింది 

ప్రపంచీకరణ తో పల్లె విధ్వంసం

పాలు పెరుగు మజ్జిగ నెయ్యి ల మార్పిడి లేదు

అంతా పెట్టుబడి సంకలో సేద తీరు

రాశుల కొద్దీ ధాన్యం లేదు

వాణిజ్య పంటల ధాటికి నేల నిస్సారంగా

పెట్టుబడి అమ్మేదే ఎరువు

పెంట దిబ్బల్లేవు

చెరువు మట్టి తోలేది లేదు

అదే నేల కిందికి మీదికి దున్నితే ఏం వుంటది! సారం!!

పంటలో కంకి లేదు

కంకి మీద పక్షి వాలింది లేదు

పక్షి రెట్ట నేలను తాకింది లేదు

దిష్టి బొమ్మ లు లేవు మనిషి అలికిడి లేదు

నాటు నుండీ కోత దాకా యాంత్రికత

పల్లె వృత్తులన్నీ

పడకేసినయి

కొలిమి లేదు బాడిస చెక్కుల్లేవు

కుండా లేదు కుంచం లేదూ

ఎవుసం ఎండమావి గా

ట్రాక్టర్ మింగిన ఎడ్లు

ఇంకెక్కడి గంగిరెద్దులు

ఊరూరా డూడూ బసవన్నలు లేరు

ఆడించే కళాకారులు  కానరారు

సంధ్య రాక ముందే మేలుకొలుపే కోడి లేదు

కోళ్ళ గూళ్ళు లేవు

మూడు నెలల కోత కోళ్ళ అంగళ్లే పల్లెల నిండా

వాకిట ముగ్గులు

మధ్యలో గొబ్బెమ్మలు

వీధి వీధి న హరిదాసు కీర్తనలు లేవు

డి జె ల హోరు యే 

ధాన్యం లేక జోలెలు పోయి డిజిటల్ యాప్ లు

పశువులు లేవు

కొమ్ముల కి రంగుల్లేవు

అలంకరణ లేదు ఆలంబన లేదు

అంతా పెట్టుబడి పెట్టిందే తిండి 

పెట్టుబడి నేర్పింది యే పండుగ

చివరాఖరికి మనిషి ని మింగేస్తున్నా

గాఢ నిద్ర నటన లో మనిషి

లేపే వాడున్నా లేవనీయని మత్తులో

( నేను చూసిన మా పల్లెలు)

Leave a Reply