కిటికీ పక్కన సీటు

ప్రపంచాన్ని కిటికీలో నుండి చూడడం

మీకు అనుభవమేనా..

చల్లని గాలి తనువును తాకుతుంటే

జ్ఞాపకాలు మనసును తాకుతుంటాయి

పరిసరాలు వెనక్కు పోతుంటే

పాత గుర్తులన్ని ముందుకొస్తుంటాయి. 

బస్సుతో పాటు టైరు ఆడుతూ 

బస్ వెనకాలే పరిగెత్తే పసివాడు

మళ్ళీ మన పసితనాన్ని గుర్తు చేస్తాడు

బస్ కోసం పరిగెత్తుతూ 

వస్తున్న తల్లెంట 

వెనకాలే ఏడుస్తూ వస్తున్న చిన్నోడు

మన బాల్యాన్ని 

బావిలోనుండి నీళ్ళు

తోడినట్లుగా తొడుతుంటాడు.

ఐదో తరగతి చదివే పిల్లవాడి తల్లిని

కండక్టర్ టికెట్ అని అడిగితే

మావోడు ఒకటో తరగతే అని

అమ్మ చెబితే..

అమ్మ అమాయకత్వ ఆన్సర్ కి 

బస్ ఎక్కినప్పుడల్లా

మన చదువు మీద మనకే 

ఎన్ని సార్లు అనుమానం వచ్చిందో..

ఇప్పుడది మన పెదాల మీద

ముసి ముసి నవ్వును విరబూయిస్తుంది.

ఊరికి ముందు స్వాగత తోరణాల లాగా

ఎర్రని రక్తం రంగు గల స్థూపాలు

ఉద్యమానికి స్వాగతమంటూ ఆహ్వానాలు

ఉద్యమాన్ని మరవకంటూ

పిడికిలి బింగించి వీడ్కోలు చెప్పే

సుత్తి కొడవలి స్థూపాలు. 

దొరలతో, రజాకార్ల తో

దాగుడుమూతల 

యుద్ధమాట ఆడిన

మట్టి మనుషుల ధీరత్వాన్ని 

తాత కథలుగా చెప్పిన యాది.

పాత గోడల మీద

తమ రక్తంతో రాసినట్లుగా 

ఎర్రని విప్లవ నినాదాలు

చూస్తుంటేనే పిడికిలి బిగుసుకుంటుంది

సింహాల్లా గాండ్రించిన 

దొరల గడీలు

నేడు గరక మొలసి వనికిపోతున్నాయి.

ఊరు దాటితే వచ్చే అడవి

ఊరోధిలి ఉద్యమమై

ఎగిసిన కన్న కొడుకు

కొడుకును పోగొట్టుకున్న కన్న తల్లులు

కడుపుశోకంతో నిలబడి దుఃఖిస్తున్నట్లుగా

మోడులైన చెట్లు వీరుల తల్లులను 

గుర్తుచేస్తుంటే, 

కన్నీళ్ల ధారలు కడుపుమీదికి పారుతుంటాయి

కళ్ళు మూసి వీరులకు జోహార్లు అర్పించాలి.

కండక్టర్ విజిలేస్తాడు

మనం దిగే ఊరొచ్చింది

జ్ఞాపాకాలన్నీ సర్దుకొని

ఆశయాల మూట భుజానేసుకొని

ఒక్కొక్క అడుగు ముందుకు

మును ముందుకే.. 

Leave a Reply