కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి  చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల లో మనం పోగుచేసుకున్నవి వున్నాయా లేదా అని  వెతకడం , అరవైల నాటి రచనల మీద మనకున్న అతి అంచనా అవుతుంది.ఎంత గొప్ప రచయితైనా  తన కాల భావజాలాన్ని దాటి విషయం చూసుండాలనుకోవడం మన అత్యాశ కాక మరేమవుతుంది.కారా మాస్టారు కథల్లో కొన్ని వైరుధ్యాలు గురించి యీ అత్యాశతో కొన్ని విషయాలను తరచి చూద్దామనే ప్రయత్నమే యీ వ్యాసం.

కారా కథల్లో వర్గమూ-కులమూ.

యజ్ఞం కథలో  గ్రామ పంచాయతీ మెంబరైనా అప్పల్రాముడు ధర్మమండపం మెట్ల కిందనే కూర్చుంటాడు.ఆ పంచాయతీ లోకి వచ్చి వున్న వాడ ఆడవాళ్ల ను కొలువు కూర్చున్న గ్రామ దేవతల్లా వున్నారంటాడు రచయిత.ఈ రెండు విషయాలలో , మొదటిది వాస్తవం, రెండవది రచయిత దృక్పథం.ఆ కూర్చొన్న మాల స్త్రీ లైనా నేలమీదే వున్నారు.అప్పల్రాముడూ నేలమీదే వున్నాడు.అప్పల్రాముడి రుణానికే విముక్తి లేనప్పుడు, పంచాయతీ మెంబరుగా గౌరవాన్ని గురించిన ప్రశ్న రచయితకు కథావస్తువు కాగలదా అనేది మనం ఆలోచించాలి.కారా కథల్లో నేరుగా కుల ప్రస్తావన వస్తుంది.కేవలం అది సూచనగా మాత్రమే వుంటుంది.యజ్ణం , హింస , నోరూం , ఆర్తి , చావు , జీవధార మొదలైన కథల్లో పాత్రలు, యిప్పటి సూత్రీకరణ ప్రకారం దళిత బహుజనులే. యజ్ణం లో పంచాయతీ ఒక మాల కుటుంబం ముప్పై సంవత్సరాల క్రితం చేసిన చిల్లర అప్పు పెరిగి పెరిగి ,ఆ కుటుంబానికున్న కాసింత పొలం చెల్లేసుకోవడానికి యేర్పడిన సందర్భానిది. హింస కథ , ఒక వూరి గొల్ల పడుచు , చేసిన చిన్న పొరపాటుకు జీవితం పడుపువృత్తికి బలైపోవడం. ఆ ప్రభావం ఆమె చెల్లెలి మీద యెలా వుండబోతుందో సూచన యివ్వడం. ఆర్తి కథలో , వియ్యపురాల్లైన, ఎర్రెమ్మ , బంగారమ్మ కుటుంబాల మధ్య తలెత్తిన సమస్యను  వూర్లో పెద్ద రైతూ, వూరి పెత్తనం చేతుల్లో వున్న , నాయుడు రెండు పక్షాలనూ తిట్టి సర్దుబాటు చేస్తాడు.భార్యాభర్తలను ఒకటి చేస్తాడు.ఈ క్రమంలోనే ఒక మాట అంటాడు , “ఔనర్రా , నేను చూస్తానే వుంటాను.మీ మాలపేట్లో రోజూ యే వారో ఓ వార, యెందుకో ఒకందుకు తిట్టుకుంటూనే వుంటారు కదా.ఎందుకోసవలా తన్నుకు సస్తారు?ఏం మీకు పంచుకుందికి ఆస్తులున్నాయని తన్నుకుంటారా ?కలుపుకుందికి భూవులున్నాయని తన్నుకుంటారా?లేకపోతే ఒక నీటికాడ తగువా?ఒకదారి కాడ తగువా?దేనికి మీ తగువులు?”అనడుగుతాడు.అప్పుడు,  ఏం చెప్తారా జనం?యేం చెబితే నాయుడికి బోధపడుతుంది , అంటాడు కారా మాస్టారు.నిజానికి యీ కథలో  మాలవాడ లోని జనాల అజ్ణానానికి పేదరికమే కారణమనే కథాకథనం చెబుతుంది. అప్పుడు, కారా కథకుడిగా నాయుడికి యేం చెబితే బోధపడుతుంది అన్న మాట, కారాకూ అన్వయించి యిప్పుడు  అడుగుతున్నారు బహుజన విమర్శకులు.

 నోరూం కథ , కొత్తగా పెళ్లి చేసుకున్న మాలజంట తీరికగా ఒక రాత్రి గడపడానికి కూడా నోచుకోలేక పోవడం. చావు కథ , కూలీ పనులున్న చలి కాలంలో చనిపోయిన మాల ముసలిదాన్ని , కాల్చడానికి ఆమె బంధువులు చచ్చేచావు. జీవధార కథ పల్లెటూరి నుంచి పట్నపు శివార్లలో బాడిగ కొట్టాలలో వుంటున్న బీసీ కులాల స్త్రీలు  మంచినీళ్ల కోసం పడేపాట్లు. ఈ కథల్లో పాత్రలను రచయిత  కులంతో సూచిస్తాడు. అయితే కథలో ఆయా పాత్రల ఘర్షణకూ వారి కులానికీ సంబంధమున్నప్పటికీ , ఆ ఛాయలకు వెళ్లడు.కారా లోని భావజాలం వర్గ దృష్టితోనే కథను నడుపుతుంది.కథలో  రూపుదిద్దుకున్న సమస్యకు సామాజిక స్థితిగతుల వైపునుంచి విషయాన్ని వ్యక్తీకరించాల్సిన అగత్యాన్ని ఆర్థిక విషయ పరికల్పనతో ముగించడం కన్పిస్తుంది .ఎంత గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించినా సామాజిక వాస్తవికతలో గెంతులకు కారా గురైన ప్రాపంచిక దృక్పథమే కారణం. ఇంకో మాటలో చెప్పాలంటే అది ఆయన కాలానికున్న పరిమితి కూడా.

గ్రామీణ-పట్టణ వైరుధ్యాలు.

కారా కథల్లో కథాస్థలాలు గ్రామీణ , పట్టణ రెండు నేపథ్యాలగానూ వుంటాయి.అభివృధ్ధి గురించి విమర్శించాల్సినప్పుడు గ్రామీణుల వలస కోసం పట్టణప్రస్థావన వస్తుంది. యజ్ణం కథలో సీతారాముడు మెరుగైన జీవితం కోసం పట్టణానికి పోయి వుంటాడు.అక్కడి పైపై మెరుపులకు అతడి భార్య వేరే వాడితో వెళ్లిపోయుంటుంది.ఆ పరాభవాన్ని మోసుకుని తిరిగి పల్లెకొచ్చి, భూమి మీద బతుకుదామనుకుంటున్నప్పుడే , పల్లెటూరి దుర్మార్గ న్యాయం  పొలాన్ని , అప్పుకు చెల్లైపోయే స్థితి యేర్పరుస్తుంది. హింస కథలోని గొల్ల పడుచు ,పల్లెటూరి పోగాకు పొలాల పందిళ్లలో, కొట్లలో ఆ ఘాటుకు మతిచెడి ఒకడి మోసానికి బలవంతంగా లొంగిపోయి , అది బయటపడి, అత్తకూ, మొగుడికీ ముఖం చూపడానికి చెల్లక , తలదాచుకోవడానికి పొరిగింటి చుట్టాలున్నారని పట్నానికి పోతుంది.అక్కడ యేవో పనులు చేసుకుంటూ కొన్ని రోజులుందామనుకున్నది , యింకా యేవో బలవంతాలకు దిగజారి ‘సబ్బారపు సంజీవమ్మ కంపెనీలో ‘తేలుతుంది. ‘పట్నం మట్టి తొక్కిన ఒంటరి ఆడది, వయసులో వున్నది , ఒక సారి కాలుజారింది-సాయిలా ఫాయిలాగా నెగ్గడవంటే-సామాన్యమా?’ అంటాడు రచయిత. నోరూం  కథలో  పల్లెటూరి నూకరాజు కు పట్నం లాడ్జిలో ఒక రాత్రి భార్యతో గడపడానికి రూం దొరకదు.పల్లెటూరి యిరుకిరుకు తనాల నుంచి అనువైన చాటు లాడ్జిలో దొరుకుతుందనే ఆశను ‘ఆ పల్లెటూరి తనమే’ పట్నపు గుమాస్తా తో తిరస్కారానికి గురౌతుంది.ఈ కథలో జీవితాల్లో సంసారాలకున్న యిరుకును, గ్రామీణ పట్టణ రెండు నేపథ్యాల్లోనూ చూపిస్తాడు రచయిత. ఆ యిరుకుకు , సమాధానం మాత్రం పట్టణంలో చిత్రిస్తాడు. జీవధార కథ నగర శివార్లలో బతికే పల్లెటూరి ఆడవాళ్ల బిందెనీటీ కష్టాలు. పట్నం మనుషులు జాలీ దయా లేనివారనీ, వాళ్లను లొంగదీసుకోవడానికి పల్లెటూరి మొండితనాలూ ,మొరుటుతనాలూ చూపించాల్సిందేనని చెబుతుంది.

 ఈ కథల్లోని పాత్రలు పట్టణానికి బతకడానికి వచ్చినవాళ్లే అయ్యుంటారు.గ్రామీణ వలసల కోసమే పట్టణ ప్రస్థావన తెస్తాడు కారా మాష్టారు.కథల్లో అంతర్గత తర్కం మెరుగుపడటానికి పట్టణ ప్రస్థావన వుపయోగపడుతుంది. కథల్లో ఘర్షణ పెరగడానికి దోహదం చేస్తుంది.కారా ప్రధానంగా గ్రామీణ రచయిత.పట్టణాన్ని , గ్రామచిత్రాలను మెరుగైన రంగుల్లో చూపడానికి దోహదం చేసే అంశంగా మాత్రమే వుపయోగించుకున్నాడు.

ఉక్రోషమూ-చైతన్యమూ.

కారా కథల్లో పాత్రల ప్రవర్తనలను పరిశీలిస్తే , కొన్ని పాత్రలు వుక్రోషంతో వ్యవహరిస్తే , కొన్ని పాత్రలు చైతన్యంతో వ్యవహరిస్తాయి. చాలా కథల కథా గమనంలో ఆయా పాత్రల వ్యవహారంలోని భావమే కథాగమనాన్ని నిర్ధేశిస్తుంటుంది.ముందుకు తీసుకెళ్లడమో , ముగింపు నివ్వడమో చేస్తుంది.యజ్ణం కథ ముగింపులో , సీతారాముడి వుక్రోషమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. సీతారాముడికి , యీ పంచాయతీ కారణంగా వున్న కాసింత పొలం అన్యాయమైన అప్పుకు చెల్లైపోతే, యిక బతకడానికేముంది , కంబారితనం తప్ప , అనే ఆలోచన వుక్రోషాన్ని రేపుతుంది.ఆ వుక్రోష ఫలితంగా కన్నకొడుకును చంపి మూటగట్టుకొని వచ్చి ,  ధర్మమండపం ముందు విప్పిచూపుతాడు.దాంతో ధర్మపన్నాలు పలికే వాళ్ల కథ ముగుస్తుంది.

 యజ్ణం కథలో, పేరు లేని ఒక పాత్ర , చైతన్యానికి ప్రతీక గా కన్పిస్తుంది. పంచాయతీ జరగడానికి ముందు రాత్రి మాలపేటలోని యర్రన్న యింటికి చుట్టపుచూపుగా వచ్చుండిన పెద్దమనిషే ఆ పాత్ర. అప్పల్రాముడి యింటి సమస్య మీద మాల యువకులు అప్పల్రాముడిని నిలదీస్తున్నప్పుడు , ఆ సమస్య వింటుండిన పెద్ద మనిషి అంటాడూ , ‘ఓయోయ్ బుల్లోళ్లో ఆయన్నని నాబం నేదు.జరుగుతున్న దగా యెక్కడో మీకు తెల్నట్టే ఆయినికీ తెలవదు.దీనికంతటికీ కీలకం యిక్కడెక్కడా నేదు.పైనెక్కణ్ణుంచో వొచ్చిన ముప్పు మనందర్నీ ముంచుతోంది’ అంటూ  అభివృద్ధి పేరుతో జరుగుతున్న పరిణామాల్లోని లోతులను వివరిస్తాడు. ఈ సందర్భంగా మొత్తం కథలో జరుగుతున్న దగాను గుర్తించే పాత్ర యిదొక్కటే. మాలపేట యువకులకు వూర్లో  జరుగుతున్న పరిణామాల పట్ల అరకొర పరిజ్ఞానమే వుంది.సీతారాముడికి చేజారిపోతోన్న ఆస్తి పట్ల వుక్రోషం వుంది. అప్పల్రాముడికి కట్టుబాట్లు తప్పించుకోలేని బానిసత్వం వుంది. మొత్తం విషయం మీద సమగ్రమైన చైతన్యాన్ని ప్రోది చేసింది మాత్రం ఆ పేరులేని పాత్రనే.

నోరూం కథలో ,  లాడ్జిలో ఆశాభంగానికి గురైన నూకరాజు వుక్రోషంతో ఆ రాత్రి నగరంలో ఆ మూల నుంచి యీ మూలకు తిరుగుతూ , చివరకు సెకెండ్ షో సినిమా కైనా భార్యతో పాటు పోవాలనుకొని , కిక్కిరిసిన సినిమా హాళ్ల ముందుకొస్తాడు.’నూకరాజు కోపం , ఈ విధంగా సినిమా చూసేవారిమీదా , సినిమా తీసేవారిమీదా, దానిని తీయించేవారిమీదా, అంచెలంచెలుగా పెరుగుతున్న సమయంలోనే అతడు సరిగ్గా సినిమా మొగసెంటర్లోకి వచ్చేడు’ సరిగా ఆ వేళకే కథలోని యింకో పాత్ర (ఈ పాత్ర పేరు దేవుడు , యితను కూడా నూకరాజు సమూహానికి చెందిన వాడే, నూకరాజు కంటే వయస్సులో పెద్దవాడు.టౌన్లో వున్నా , మురికివాడల్లో వుండేవాడు, నూకరాజు రూం అడిగిన లాడ్జిలో వాచ్ మెన్ గా వుంటాడు.నూకరాజు లాగే ఇరుకిరుకు సంసారం చేసేవాడే.. అయితే ఒకరికొకరు తెలీదు.) భార్యా భర్తల నిద్దరినీ చూసి, అంతకుముందు లాడ్జిలో చూసుండటం వల్ల, వాళ్ల మీద సానుభూతి తో ‘ఏం బుల్లా,యే వూరూ’ మీరల్లా లాడ్జింగ్ కి రాలేదా.నాకూ అక్కడే పని. పాపం మీకు రూం దొరకలేదా, అనబోయి నీకా బొట్టె ఏవవుద్దీ , అడుగుతాడు అలవాటుగా. అంతే వుక్రోషంతో వూగిపోతున్న నూకరాజు, ‘లంజకొడకా నా ఆడదాన్ని మాట్లాడవలసిన అవసరం నీకేంరా,ఎవరనుకున్నావురా మనుసులో ‘ అని ఎడాపెడా బూటుకాలితో తంతాడు.చావుదెబ్బలు తినిపిస్తాడు.పక్కనున్న జనాలు ఆపితే ఆ రాత్రి రిక్షా ఎక్కి భార్యా తో వెళ్లిపోతాడు.నోరూం కథ , ఏ తప్పులేని ముసలివాడి మీద, అందునా సానుభూతి చూపించిన వాడిమీద వుక్రోషపు దాడితో ముగుస్తుంది.

 ఆర్తి కథలో కూడా ఎర్రెమ్మ అనే గంపెడు సంతానం వున్న బీద మాలకులస్థురాలు , ఇలాంటి వుక్రోషంతోనే వియ్యపురాలి చేతిలో తన్నులు తింటుంది. పండగ ముందు రోజుల్లో కూతుర్ని యింటికి పిలుచుకుపోతే కూలీనాలీ కి చేదోడుగా , ఆదాయవనరుగా వుంటుందని , న్యాయం తన వైపే వున్నా , కోడలితో అదే కూలీనాలీ చెయించుకొని నాలుగు రూకలు వెనకేసుకుందామని ఆశించే  వియ్యపురాలుతో కాదనిపించుకొని , మొరటుగా వ్యవహరించి, దెబ్బలు తింటుంది.కూతురైతే  , దెబ్బలు తిన్న తల్లిని అనునయిస్తూ పుట్టింటికి వస్తుంది. నీ తల్లి ముఖ్యమనుకొని పోయినావంటే మళ్లీ మళ్లీ యీ యింటికి రాలేవని అత్త అంటుంది.కథలో అదే వివాదం ,కొడుకు కోడల ‘యిడబావు’లెట్టె బంగారమ్మకూ , ఎర్రెమ్మకూ. కథ లో ప్రారంభ ముగింపు ల్లో ఎర్రెమ్మ వుక్రోషంతో వ్యవహరించి దెబ్బలు తింటుంది.ఈ తగవు చివరికి ఆ వూరి నాయుడు దగ్గరకు చేరుతుంది .వూర్లో పెద్ద రైతూ, వూరి పెత్తనం చేతుల్లో వుంది గాబట్టి, నాయుడు రెండు పక్షాలనూ తిట్టి సర్దుబాటు చేస్తాడు.భార్యాభర్తలను ఒకటి చేస్తాడు.ఈ కథలో  సమస్య మీద వెలుగు పరిచే చైతన్యం నాయుడే.రచయితే అన్నట్లు , నాయుడికి కూడా భోధపడని అసలు సత్యం వేరే వున్నా, కథ రూపొందించిన పరిధి మేరకు నాయుడు చైతన్యానికి గుర్తు.

చావు కథ లో, అప్పారావు అనే పాత్ర మాలపేటలో చైతన్యానికి ప్రతీక. ముసలి నారమ్మ శవాన్ని ఆ రాత్రి పొద్దు  , వాళ్ల కులాచారం ప్రకారం కాల్చడానికి కట్టెలు కోసం వూర్లో నాయుళ్ల యిల్లిల్లూ తిరిగి కాదనిపించుకొనీ , ముసలమ్మ ను పూడ్చిపెడదామనీ కులపెద్ద సూరన్న అన్నప్పుడు , అప్పారావు ఆవేశంతో మాట్లాడిన మాటల్లో ‘దళిత చైతన్యం’కన్పిస్తుంది.

“ఒరేయ్ ఓరి సూరయ్య తాతా;నిన్ను తిట్టడానికి నాకు నోర్రాదు.కానీ తక్కిన లంజికొడుకులంత యినండి.వంద తరాలే అయ్యిందో , యెయ్యి తరాలే అయ్యిందో , యీ యిన్నాళ్ల మట్టి ఆల్లక్కడా మనవిక్కడా , ఆల్లలాగా మనవిలాగా ఉణ్ణానికి కారణం నాకియ్యాళ తెలిసింది….”   ఆ ,తెలిసిన సత్యమేమిటంటే , జంతువులు కంటే హీనంగా బతుకుతున్నా , తెగింపు లేనితనం , జీవశ్చవాలలాగా బతకడానిక అలవాటు పడటం.ఆఖరుగా అప్పారావు అంటాడు , “చచ్చిన శవాల కోసం నా నేడవనూ ఏడవను.నా ఏడుపల్లా బతికున్న శవాల గురించే..”
ఆ మాటలతో , పెద్దల్ని ఎదిరించి  మాల యువకులు కొందరు, వూర్లో కి పోయి, కట్టెలు తెచ్చి ముసలి నారమ్మ శవాన్ని దహనం చేస్తారు.
కారా గారి అన్ని కథల్లో మాదిరిగానే ,ఈ కథలో కూడా ఆర్థికత చాలా చోట్ల కథా కథనంలో బలంగా వున్నా,
కుల వాస్తవికతను యీ కథలో కారా మాస్టారు సరిగ్గా చిత్రించాడని చెప్పవచ్చు. మొత్తం కారా మాస్టారు కథల్లో అప్పారావు పాత్ర దళిత చైతన్యం తో వ్యవహరించింది.

 కారా గారిలోని సామ్యవాద చైతన్యాన్ని ప్రతిబింబించిన యింకో నిలబడే పాత్ర శాంతి కథలోని విశ్వనాధం .ట్రేడ్ యూనియన్ నాయకుడైన విశ్వనాధం, పట్టాభిరామయ్య లాంటి పెట్టుబడీదారున్ని ఎదురించి నిలబడి ,  శ్రామిక వర్గపు వాదనను బలంగా వినిపిస్తాడు.కార్మికశక్తితో , సకల పీడనలకూ పరిష్కారముందనే సత్యాన్ని సగర్వంగా చాటుతాడు.సకల వుక్రోషాలకూ పరిష్కారం శ్రామిక ఐక్యతలో వుందని ఉద్ఘాటిస్తాడు.విశ్వనాధమూ , అప్పారావూ కలిసి పనిచేయాల్సిన కాలంలో కన్నుమూసిన కారా మాస్టారు , వాళ్లిద్దరూ ఒక్కరే అనే అనుకొని వుండొచ్చు. వాస్తవానికి వాళ్లిద్దరూ వేర్వేరుగా వున్నారనీ , పెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన నేటి కాలంలో  వాళ్లిద్దరూ సమైక్యంగా పోరాటంలో  నిలబడాల్సిన అవసరాన్ని గుర్తించాలని కోరుకుందాం.

Leave a Reply