(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు)

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినిపిస్తున్న మాటల్లో కార్పొరేటీకరణ ఒకటి. హిందుత్వ ఫాసిజంలాగే ఈ మాట కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తయారు చేస్తున్నదనే అవగాహనకు ఇప్పుడు సాధారణ పరిశీలకులు కూడా వచ్చారు. ఆదానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలోకి వచ్చాడనే వార్తతో పాపులర్‌ మీడియాలో కూడా కార్పొరేటీకరణ గురించిన చర్చ మొదలైంది. దేశ సంపదను  సంపన్నులకు  ప్రభుత్వం  కట్టబెట్టడం ఏమిటనే విమర్శ మొదలైంది. 

 నిజానికి కార్పొరేటీకరణ ఎప్పుడో మొదలైంది. అప్పటి నుంచే దాని మీద విమర్శ కూడా ఆరంభమైంది. కాకపోతే ఇప్పుడు కార్పొరేటీకరణ చాలా భారీ ఎత్తున జరుగుతోంది. బాహాటంగా సాగుతోంది. గతంలో దీని గురించి అందరికీ ఇంతగా తెలిసేది కాదు. అర్థమయ్యేది కాదు. బీజేపీ వల్ల ఒక మేలు ఏమంటే ` దానికి ఏదీ చాటుమాటు వ్యవహారం కాదు. ఏదైనా నేరుగా, బట్టబయలుగా  చేస్తుంది. ఇట్లా చేయగల  స్థితికి రాజకీయంగా, సామాజికంగా బీజేపీ ఎదిగింది. అలాగే మన ఆర్థిక వ్యవస్థలోని వైరుధ్యాలు కూడ ఆ దశకు చేరుకున్నాయి.  ఇక ఏ దాపరికం అక్కరలేని విశ్వరూపాన్ని ఇలా ప్రదర్శించగల తీరానికి అది చేరుకున్నది.  

  ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం కార్పొరేటీకరణ వెనుక ఉన్న రాజకీయాలను చెప్పడమే.  అప్పుడే ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రాధాన్యత తెలుస్తుంది. కార్పొరేటీకరణను ఎదుర్కోవడంలో సిలింగేర్‌ పోరాటం ఎందుకు గొప్ప ఉదాహరణో అర్థమవుతుంది.   

                              0 0 0

 ఆర్థికమే అన్నిటినీ నిర్ణయిస్తుందనే మొరటు సూత్రీకరణ మార్క్సిస్టులు చేశారని చాలా మంది విమర్శిస్తుంటారు. అది ఏ రకంగానూ నిజం కాదు. నిజానికి మార్క్సిస్టులే ఆర్థిక విషయాల చర్చలో సహితం రాజకీయాలతో సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఉత్పత్తి వ్యవస్థకు ఉండే సొంత తర్కాన్ని దృఢంగా పరిశీలిస్తూనే ఈ పని చేస్తారు. విశ్లేషణ సౌకర్యం కోసం దాన్ని తప్పక వేరు చేసుకోవాల్సిందేగాని  నిజానికి ఏవీ వేర్వేరు కాదు. మొత్తంలో భాగం. అందులో ఉండే ప్రతి దానికి దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. దేని చరిత్ర దానికి ఉంటుంది. ఆర్థిక రంగం ప్రత్యేకత అలాంటిదే. అది మిగతా వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  అదే సమయంలో ఇతర  సామాజిక అంశాల ప్రభావానికి  ఆర్థిక వ్యవస్థ పని తీరు  లోనవుతూ ఉంటుంది. దేన్నయినా మొత్తంలోంచి వేరు చేసి చూసినప్పుడు మనకు కనిపించే దానికి, అన్నిటిలో భాగంగా ఉన్నప్పుడు కనిపించే స్వభావానికి తేడా ఉంటుంది. ఒక  నిర్దిష్ట అంశం  విడిగా దాని సొంత  తర్కం ప్రకారం  పని చేసినా, దానితోపాటు మిగతా అన్నిటి సంబంధాల్లో భాగంగా దాని వాస్తవ పని విధానం ఉంటుంది. ఇందులో దేన్నీ విస్మరించ కూడదు.   

ఈ పద్ధతిలో కార్పొరేట్‌ రాజకీయాలను విశ్లేషించాలి. రోజువారీ విషయాల్లో  బాహాటంగా సాగుతున్న కార్పొరేట్‌ రాజకీయాలకు మన దేశంలో చారిత్రక, రాజకీయ, ఆర్థిక మూలాలు ఉన్నాయి.  అంతర్జాతీయ పరిణామాలతో ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వాలు మారితే కార్పొరేటీకరణ సమస్య తీరదు.  కాబట్టి దాని మూలాల దగ్గరికి వెళ్లాల్సిందే.   భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని దిగుమతి చేసిన వలసవాద రాజకీయ పాలనా చట్రం,  వలసరూపం నుంచి బైటపడ్డాక సామ్రాజ్యవాదం అలవర్చుకున్న కొత్త దోపిడీ పని విధానంలాంటి రెండు మూడు  కోణాల్లో కార్పొరేట్‌ రాజకీయాలను చూడాలి.     

                                                                              1

కార్పొరేటీకరణ ఒక ఆర్థిక ప్రక్రియ. ఆర్థిక వ్యవస్థ తన సొంత తర్కంతోపాటు రాజకీయాల మీద, వాటి ఆధారంగా  సాగే వర్గ ప్రయోజనాల మీద ఆధారపడిన ఒక ఆంతరంగికం నిర్మాణం.  ఇప్పటి దాకా చరిత్రలో ముందుకు వచ్చిన ఆర్థిక వ్యవస్థలన్నీ దోపిడీ వర్గ సంబంధాల మీద ఏర్పడ్డవే. వర్గ రాజకీయాలు లేకుండా ఇవి కొనసాగడం లేదు. వలస పాలన ద్వారా దిగుమతి అయిన పార్లమెంటరీ వ్యవస్థ,  మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనే రెండు చక్రాల మీద కార్పొరేటీకరణ ఇవాళ ఈ రూపాన్ని తీసుకున్నది.  ఇది కేవలం రాజకీయమే కాదు.  పూర్తిగా రాజకీయార్థిక విషయం. ఈ కోణం నుంచి మిగతా సామాజిక విషయాలన్నిటినీ  చూడాలి. వాటిని కూడా  రాజకీయాలతో  ఎంతగా మేళవిస్తే  అంత స్పష్టంగా కనిపిస్తాయి. వాస్తవాల వెనుక ఉన్న సత్యం కనిపిస్తుంది.  

 ఈ మొత్తాన్ని బూర్జువా రాజకీయాల వైపు నుంచి చూడవచ్చు.  ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథం నుంచీ చూడవచ్చు. ఈ రెండోదానిలోనే విమర్శనాత్మకత ఉంటుంది.  అందువల్లనే  మార్పు దిశగా మానవ ఆచరణను నడిపించే రాజకీయ కార్యక్రమం ప్రత్యామ్నాయ రాజకీయాల నుంచే బలపడుతుంది.  

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చాక  సామాజిక సాంస్కృతిక సంబంధాల ఊర్థ్వ చలనం  కంటే  ఈ దేశంలోని పెట్టుబడిదారీ వర్గం ఊర్థ్వ చలనమే ఎక్కువ జరిగింది. రాజ్యానికి సంబంధించిన ఒక రూపంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పాలకవర్గాల చేతిలో పనిముట్టుగా ఈ కర్తవ్యాన్ని డెబ్బై అయిదేళ్లుగా నిర్వహిస్తున్నది. దీనికి రాజ్యాంగం మార్గదర్శకత్వం వహించింది. ఈ బూర్జువా వర్గ అభివృద్ధిని చూపించే పాలక మేధావులు దేశం ప్రగతి పథంలో ముందకు దూసుకెళ్లుతున్నదని విశ్లేషిస్తున్నారు.

ఈ విశ్లేషణ గత యాభై అరవై ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో ఒక  భావజాలంగా సమాజాన్ని ఆవరిస్తూ వచ్చింది. ఇప్పుడు మనం మోదీ గురించి మాట్లాడుకుంటున్నాం కాని` రాజీవ్‌గాంధీ ‘21వ శతాబ్దంలోకి భారతదేశం’ అనీ, వాజ్‌పేయి ‘దేశం వెలిగిపోతోంది’ అని చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకోవాలి. 

నిజానికి దేశం ముందుకు పోతోందని పాలక పక్ష మేధావులు చెబుతున్న మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. అవి ఏమంటే` అప్పటికి దేశంలో చాలా బలహీనంగా ఉండిన పెట్టుబడిదారీ వర్గం అనేక ఇరుకుమార్గాల్లో మెల్లగా బలపడటం, సామ్రాజ్యవాదం తన ఆంతరంగిక సంక్షోభాలను తీర్చుకోడానికి ఎన్నుకున్న కొత్త పద్ధతులకు తగిన రీతిలో భారత పెట్టుబడిదారీ వ్యవస్థ తయారు కావడం. తద్వారా సామ్రాజ్యవాద దోపిడీకి తగిన స్థాయిలో సువిశాల మార్కెట్‌, మానవ వనరులు ఉన్న భారత బూర్జువా వర్గం  దళారీ  పని చేయగల సామర్థ్యాన్ని గతం కంటే పెంచుకోవడం.  

దీని కోసం పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ దళారీ బూర్జువావర్గానికి అన్ని రకాలుగా సేవలు చేస్తూ వచ్చింది. దాని ఎదుగుదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వచ్చింది. ఈ మేరకు  పాలన చేస్తూ చట్టాలను తయారు చేస్తున్నది. ఉన్న చట్టాలను మార్చేస్తున్నది. పెట్టుబడి అవసరాలకు తగినట్లు అత్యున్నత న్యాయస్థానం నుంచి తీర్పులు కూడా వెలువడుతూ వచ్చాయి.  అంటే  వలసకాలం కంటే మరింత సమర్థవంతంగా, సామ్రాజ్యవాదంలోని మారిన  దోపిడీ పద్ధతులకు అనుగుణంగా ఆ వర్గం  తగిన స్థాయిలో ఎదగడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని  అన్ని వ్యవస్థలూ దోహదం చేశాయి. అధికార మార్పిడీ తర్వాతి రాజకీయాల్లోనే ఇది ఉన్నది. భగత్సింగ్‌లాంటి విప్లవకారులు దీన్ని ఊహించారు. అయితే తొలి రోజుల్లో దానికి ఆ శక్తి కూడా లేదు.  మొదటి ఇరవై ఏళ్లు ఒక వైపు పంచవర్ష ప్రణాళికల పేరుతో  ప్రజల సంపద నుంచి  తయారైన మౌలిక వనరుల మీద ఆధారపడి, ఇంకో వైపు సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడిని, సాంకేతికతను ఆశ్రయించి ఆ వర్గం బతికి బట్టకట్టింది.    ప్రభుత్వం  మొద‌టి నుంచి  త‌న పాల‌నా విధానాల ద్వారా ఆ వర్గం ఏజెంట్‌గా     దాన్ని బలోపేతం చేసింది. మెల్లగా ఆ వర్గ ప్రయోజనాల కోసం  ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌ రంగానికి తెగనమ్మే వ్యూహం  ప్రకారమే ఇది జరిగింది. ఈ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టడానికి  ప్రభుత్వానికి డెబ్బై అయిదేళ్లు పట్టింది.    కోవిడ్‌ నేపథ్యంలో పెట్టుబడిదారీ వర్గం బలహీనపడిపోయిందని, దాని ఉద్దీపనకు లక్షల కోట రూపాయల ప్రజా ధనాన్ని అందిస్తూ నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేయడం వంటి ఎన్నో  తాజా ఉదాహరణలు చెప్పవచ్చు.  భారత ప్రభుత్వం చాలా విధేయంగా, నిస్సిగ్గుగా, చట్టబద్ధంగానే పెట్టుబడిదారీ వర్గం అవసరాలు చూడ్డం మొదటి నుంచి ఒక విధానంగానే ఉన్నది. 

గత డెబ్పై ఐదేళ్లుగా అన్ని ప్రభుత్వాలూ  ఈ పని చేశాయి. ఎవరు సమర్థవంతంగా చేయగలరో గుర్తించి ఆ పార్టీలను అధికారంలోకి తేవడం మొదలైంది. క్రమంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో అంకెలు తప్ప వాటి వెనుక ఓటర్ల పాత్ర తగ్గుతూ కార్పొరేట్ల ప్రమేయం పెరిగింది. ఈ నేపథ్యంలో కార్పొరేటీకరణ పెరిగింది. ఆ రకంగా భారత ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు.. అనే సుభాషితం పూర్తిగా మారిపోయి కార్పొరేట్ల చేత, కార్పొరేట్ల కొరకు అని  ఎప్పుడో మారిపోయింది. 

విచిత్రం ఏమంటే ప్రజల చేత, ప్రజల కొరకు అని బయల్దేరి లౌకికవాద, సామ్యవాద, సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్న దశ నుంచి మతతత్వ, దళారీ పెట్టుబడి, సామ్రాజ్యవాద ప్రయోజనాల పరిరక్షణగా భారత ప్రజాస్వామ్యం మారిపోయింది. ఇది పూర్తి స్థాయిలో సాక్షాత్కారం కావడమే ఇవ్వాల్టి ప్రత్యేకత. బీజేపీ ఒడుపు చూసి  కాంగ్రెస్‌ నిస్సహాయంగా ఉండిపోయినా, ప్రాంతీయ పార్టీలన్నీ దాసోహం అన్నా, ఇప్పటికిప్పుడు ఏదో ప్రమాదం జరిగిపోయిందని మేధావులు దిగ్భ్రాంతికి లోనయినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలన్నిటినీ బీజేపీ ధ్వంసం చేసిందని గుండెలు బాదుకున్నా`సారాంశం ఏమంటే సామ్రాజ్యవాద, కార్పొరేట్‌స్వామ్యం నగ్నంగా ప్రదర్శితం కావడమే. దిగ్భ్రాంతికి గురికావాల్సింది ఈ నగ్న స్వభావం బట్టబయలైనందుకే.  

ఇది ఏకబిగిన జరగలేదు.  భారత ప్రజాస్వామ్యం మొదటి రెండు మూడు దశాబ్దాలు గడిచిపోయాక అది చాలా  క్రియాశీలంగా మారింది.  సమాజంలోని మారుమూలన్నిటికీ విస్తరించింది. ఎన్నికల రూపంలో  సమాజం అంచుల్లో ఉన్న ప్రజలను కూడా ఓటర్లుగా మార్చేసింది. పాలనా రూపంలో విస్తరించి పౌరులందరినీ తన పథకాలకు లబ్ధిదారులుగా మార్చేసింది.  సామ్రాజ్యవాద మార్కెట్‌లో ప్రజలను సరుకుల కొనుగోలుదారులుగా మార్చేసింది.  దాదాపుగా ఈ మూడు పనులను ప్రభుత్వం డెబ్బయి ఏళ్ల కింద ఆరంభించి ఇప్పుడు చాలా వరకు  పూర్తి చేయగలిగింది.  ఈ పని  చాలా సంక్లిష్ల మార్గాల్లో జరిగింది. ఇది భారత సమాజ విస్తృతినే కాదు, అది అనేక  సంక్లిష్ట తలాలుగా విడిపోయిందని కూడా తెలియజేస్తుంది. అన్ని తలాల్లో పైన చెప్పిన పనులు  ఓపికగా చేసింది. దీనికి మూలం ఎన్నికల రాజకీయాల్లోని సంఖ్యా సమీకరణాలు. నెంబర్‌తో నిమిత్తం లేకుండా మాదే అధికారమని, మేమే అధికారంలో ఉంటామని, నెంబర్‌ తగినంత లేకున్నా అధికారంలోంచి దిగిపోమని ఒక్క నాయకుడుగాని, ఒక్క పార్టీగాని అనకపోవడంలోనే భారత ప్రజాస్వామ్యం బలం ఉన్నది. ఆ నెంబర్‌ ఎలా అయినా సాధించవచ్చు.  

ఓట్లను కొనే దగ్గరి నుంచి ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికారంలోకి రావడానికి తగిన  నెంబర్‌ కోసం ప్రజాప్రతినిధులనే కొనే దశలోకి చేరుకుంది. ఒకప్పుడు ఏపీలో చంద్రబాబునాయుడు, ఈ మధ్య కర్ణాటకలో, మహారాష్ట్రలో జరిగిన ఉదంతాలు దీనికి ఉదాహరణ. ఇక్కడ గవర్నర్ల పాత్ర, న్యాయస్థానాల పాత్ర కూడా ఉన్నది. కానీ నెంబర్‌ తగినంత ఉంటేనే అధికారంలో ఉండాలనే ఒక్క ప్రమాణం మాత్రమే భారత రాజకీయాల్లో జీర్ణమైపోయింది. ఆ రకంగా  భారత ప్రజాస్వామ్యం ‘సుస్థిర ప్రజాస్వామ్యం’. ఈ కట్టుబాటు లేకుంటే మెజారిటీ ప్రజలు సులభంగా తన పరిధిని దాటి పోతారనే ఎరుక ఈ ప్రజాస్వామ్యానికి ఉన్నది. అది తీవ్ర సంక్షోభానికి దారి తీస్తుంది. ఆ రకంగా ప్రజల్లో విమర్శనాత్మకత పెరగకుండా, తనకు లోబడి ఉండేలా, సాధికారతను నిలబెట్టుకొనేలా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇన్నేళ్లుగా చేయగలిగింది. 

తాజాగా బీజేపీ ఒక్కో రాష్ట్ర ప్రభుత్వాన్నే కూలగొట్టి కబళించడం, ప్రాంతీయ పార్టీలను లోబరుచుకోవడం, జాతీయ ప్రతిపక్ష నాయకులను ఆ పార్టీలకు దూరం చేసి తనలో కలిపేసుకోవడం.. వంటివి చూసినప్పుడు దేశంలో ఏకపార్టీ పాలన రాబోతోందా?   సమాఖ్య భావన  మరింతగా రూపంలో కూడా బలహీనపడుతుందా? హిందూ రాజ్యానికి తగినట్లు రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయా? అనే సందేహం కలగవచ్చు.  దీనికి హిందుత్వ ఫాసిజం ఎంత కారణమో, దానికి రహదారి వేసిన భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యమూ అంతే కారణం.  పెద్ద ఎత్తున  కార్పొరేట్‌ సంస్థలకు దేశసంపద  హక్కుభుక్తం కావడానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నియంతృత్వ దశ నుంచి హిందూ ఫాసిజంగా మారడానికి ఈ దేశ రాజకీయార్థిక వ్యవస్థ తగిన పునాదిని సమకూర్చింది. దానితో ముడిపడిన భారత నాగరికతా, సాంఘిక సాంస్కృతిక క్రమం ఉన్నది.  అయితే దీన్ని తిరగేసి చూస్తే ఎన్నికల రాజకీయాల్లోని  విశాలమైన ఆటస్థలం కుంచించుకపోయి ఏకపార్టీ పాలన, హిందూరాజ్యం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని వర్గ ప్రయోజనాలకు నష్టం చేస్తాయి. అనేక పార్టీలు, అనేక రూపాల్లో అనేక వాగ్దానాలు, ఓట్ల  బేరసారాలు, క్రయ విక్రయాలు, అనేక ఎంపిక అవకాశాలు ఉండటం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. బహుశా ఇంత విశాలమైన ఆటస్థలం ఉండటం మొదటి నుంచీ దాని సహజ లక్షణం. అందువల్లే అది ఇన్నేళ్లపాటు స్థిమితంగా ఉండగలిగింది. ప్రాతినిధ్య రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని సాంతం రద్దు చేసి ఏకపక్ష నిరంకుశ పాలన చేపడితే పార్లమెంటరీ వ్యవస్థకు బైట ప్రజలు మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా మారతారు. అప్పుడు పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది. దాన్ని భారత పాలకవర్గం అనుమతిస్తుందా? అనేది సందేహమే. అది ఆ వర్గ ఆర్థిక స్థిరత్వానికి  నష్టం చేస్తుంది. 

బీజేపీ పాలనతో కార్పొరేటీకరణ ఎంత వేగవంతమైనా, అది ఫాసిస్టు స్వభావంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏకపార్టీ, హిందుత్వ రాజ్యాంగం  నడవడం కార్పొరేట్‌ శక్తులకు మేలు చేయదు. ప్రాతినిధ్య, పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ఈ దేశ దళారీ బూర్జువా వర్గానికి తగిన దోపిడీ రాజ్య రూపం అని,  కార్పొరేటీక‌ర‌ణ‌కు అదే అనువైన‌ద‌ని  చరిత్ర రుజువు చేసింది. 

అయితే రాజ్యాంగం తయారైన రోజుల్లో ఉన్న జాతీయ, అంతర్జాతీయ వాతావరణం  మెల్లగా కనుమరుగైపోతున్నది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక కొత్త ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రపంచంలోకి చేరుకుంటున్నది. దీనికి తగినట్లు గత ముప్పై నలభై ఏళ్లలో తన పని పద్ధతులను మార్చుకుంటున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇప్పుడు పని చేస్తున్న తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఒక రకంగా ఇది పూర్తి కొత్త దశ.  అధికార మార్పిడీ కాలం నాటి ఆదర్శాల వల్ల రాజ్యాంగంలో భాగమైన కార్మిక హక్కులు, పౌరహక్కులు మొదలైనవన్నీ దానికి భారంగా మారిపోయాయి.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కార్పొరేట్‌ రాజకీయాలు నేరుగా నడిపించగల దశకు  చేరుకోవడమే దీనికి కారణం.  కాబట్టి రాజ్యాంగ విలువలు, ఆదర్శాలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలు .. అన్నీ కార్పొరేట్‌ ప్రపంచ విస్తరణకు తగినట్లు మారిపోయిన దశ ఇది.  ఒక పక్క ఇంత పెద్ద సంక్షోభంలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజల సమ్మతిని సంపాదించడానికి ఈ దశలో అనేక  పద్ధతులు అనుసరిస్తున్నది. 

  సరిగ్గా ఇలాంటిదే చట్టబద్ధపాలన. పాశ్చాత్య దేశాల్లో కూడా చట్టబద్ధ పాలన అనేది దాని సమగ్ర అర్థంలో అమలు కాలేదు, కావడం లేదు. చట్టబద్ధ పాలనను  పెట్టుబడిదారీ వ్యవస్థ తన దోపిడీ కోసమే  వాడుకున్నది.  చట్టబద్ధ పాలన ఆధునికతలో భాగమే అయినా, అది నేరుగా భూస్వామ్య వ్యతిరేక విప్లవాల్లోంచి  బూర్జువా రాజ్యంలో భాగమైంది. అయినా  దీని వల్ల ప్రజా జీవితం కొంత క్రమబద్ధమైంది.  కొన్ని రక్షణలు దొరికాయి. ఆ మేరకు సామాజిక జీవితం నాగరికంగా తయారైంది. 

అయితే ఇండియాలో దిగుమతి  అయిన చట్టబద్ధ పాలనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అది పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణమే అయినా, అంతకంటే ఎక్కువగా అధికారమార్పిడీ తర్వాత రాజకీయాధికారం చేజిక్కించుకున్న దళారీ పాలకవర్గ సాధికారతకు   తప్పనిసరి అయింది. చట్టబద్ధ పాలనకు ఉన్న నాగరికతా స్వభావాన్ని విస్మరించకుండా అదెలా పాలకవర్గానికి సాధికారతను అందిస్తున్నదో పరిశీలించవచ్చు. పాలకవర్గం రోజువారీ పాలనలో ఎన్నో రకాలుగా చట్ట ఉల్లంఘనకు పాల్పడవచ్చు.  కానీ చట్టబద్ధ పాలనకు, ఆర్థిక దోపిడీకి సమన్వయం సాధించడమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకత. దీనికి పునాది రాజ్యాంగంలోని ఆస్తి హక్కులో ఉన్నది. రాజ్యాంగబద్ధమైన దోపిడీకి తగిన  చట్టాలను పాలకవర్గం తయారు చేసుకున్నది. అమలు చేస్తున్నది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగంలోనే ఈ వెసులుబాటు ఉన్నది. ఇది దానిలోని వైరుధ్యం కాదు. దాని  దాని సహజ లక్షణం.  చట్టబద్ధపాలన సారం ఇదే. 

ఇట్లా చెప్పుకుంటూపోతే బూర్జువా ప్రజాస్వామ్య రాజకీయాల్లోని బలం అంతా వాటి రూపంలో ఉన్నది. రూపానికి ఉండే ప్రభావం, పాత్ర అందరికీ తెలిసిందే. ఈ రూపం వల్ల సాధారణ ప్రజా జీవితంలో ఈ డెబ్బై అయిదేళ్లలో కొన్ని మార్పులు వచ్చాయి. సమాజం ఒక గాడిలో నడుస్తున్నది. ఒక వ్యవస్థగా ప్రజాస్వామ్యం నిలదొక్కుకోడానికి తగిన సాంఘిక మార్పులు కొన్ని వచ్చి చేరాయి. ఇవి సాధించడం కూడా దాని స్వభావంలోనే ఉన్నది. ఈ రూపభ్రాంతి వల్లనే కోర్టులో ఒక తీర్పు ప్రజానుకూలంగా వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదనీ, పార్లమెంట్‌లో ఒక ప్రజా వ్యతిరేక చట్టం  తయారైతే ప్రజాస్వామ్యమే లేదని అనుకుంటూ ఉంటారు.  బైటికి కనిపించే వీటిలో దేన్నీ ఎక్కువ చేయడానికి లేదు. తక్కువ చేయడానికీ లేదు. అన్నిటినీ కలిపి చూడాలి. అప్పుడు ఈ దేశంలో బూర్జువా డెమోక్రసీ కూడా సరిగా అమలు కావడం లేదనే అనవసర ఆందోళన తగ్గుతుంది.  అసలు బూర్జువా డెమోక్రసీ కూడా ఏర్పడలేని సామాజిక స్థితి ఉన్నదని, దాన్ని సాధించగల రాజకీయార్థిక, చారిత్రక ప్రయాణంలో మన సమాజం కుంటుపడిరదని తేలుతుంది. అప్పుడు  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి వగచడం కంటే, ఈ చారిత్రక ప్రయాణమే  ఇంత వక్రమార్గంలో ఎందుకు సాగుతున్నదనే దాని మీద కేంద్రీకరించడానికి వీలవుతుంది. ఈ పని చేయాలంటే ఇప్పటికే స్థిరపడి ఉన్న గుదిబండ వాదనలను, నిర్ధారణలనలు నిర్దాక్షిణ్యంగా దించేసుకోవాల్సి వస్తుంది.  

దీనికి రాజకీయాలు మాత్రమే సరిపోవు. రాజకీయార్థిక దృక్పథం కావాలి. సాంఘిక సాంస్కృతిక విషయాలను కూడా ఆ దృక్పథంతో చూడాలి. ఇందులో అతి ముఖ్యమైనది వర్గం. బూర్జువా వర్గాన్ని తీర్చిదిద్దడానికి, దానికి సేవ చేయడానికి, దాని చేతిలో పనిముట్టులా పని చేయడానికి తగిన రాజ్యం అవసరమైంది. దాని కోసం ఇలాంటి ప్రజాస్వామ్యం తప్పనిసరైంది. ఇది కేవలం ఏదో కుట్రపూరితంగా జరిగిందని అనుకుంటే పొరబాటే. ఈ చారిత్రక యుగమే రాజకీయ, పాలనాపరంగా బూర్జువా ప్రజాస్వామ్యానికి తగినపద్ధతిలో ఏర్పడింది.  ప్రపంచ యుద్ధాల నాటికి  సామ్రాజ్యవాదం, సోషలిజం అనే రెండు మార్గాలు ఉన్నప్పటికీ    ప్రత్యక్ష వలస నుంచి బైటపడిన భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే రాజ్య రూపం స్థిరపడింది.  డెబ్బై అయిదేళ్లుగా దాని విస్తరణే భారత సమాజ  చరిత్ర.  ఇంకోలా చెప్పాలంటే టాటా బిర్లాల దగ్గరి నుంచి అంబానీ ఆదానీల దాకా దేశంలోని పెట్టుబడిదారీ వర్గం ఎదిగిన చరిత్ర ఇది.  ప్రభుత్వ రంగాలను, సహజ వనరులను, అపారమైన సంఖ్యలో ఉన్న ప్రజల శ్రమశక్తిని ఈ వర్గం తాను కొల్లగొడుతూ, సామ్రాజ్యవాద పెట్టుబడి దోపిడీకి వాహికగా, దళారీగా వ్యవహరించడానికి ఎన్నుకున్న పని తీరులో ఒక ముఖ్యమైన అంశం   ప్రైవేటీకరణ. దాని ఉన్నత రూపం కార్పొరేటీకరణ. 

2 thoughts on “కార్పొరేట్‌ రాజకీయాలు-ప్రత్యామ్నాయం : సిలింగేర్‌ ఉదాహరణ

  1. ✊✊
    మా సత్యం
    సిలింగేర్
    —పాణి
    కొత్త చూపుతో
    సిలింగేర్ ఉద్యమ మూలాలను, నేపథ్యాన్ని కాలానుగుణంగా సరికొత్త వ్యూహముతో జరుగుతున్న మార్పును అధ్యయనం చేస్తు అంతర్లీనంగా దాగి ఉన్న ఒక మహత్తర పోరాటాన్ని నేటి ఉద్యమ తరానికి మరింత శక్తివంత నిర్మాణానికి ‘సిలింగేర్’
    ఉద్యమ నేపథ్యం ఒక నమూనా. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి ఒక ప్రేరణాత్మకమైన రాజీపడని ఉద్యమ నిర్మాణానికి తోడ్పడుతుంది.
    పాణి గారు
    యుద్ధ ప్రతిపాదికన గత సంవత్సరం నుంచి జరుగుతున్న సిలింగేర్ ఉద్యమ రూపాన్ని రాజకీయ, సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన, వైజ్ఞానిక, సాంకేతిక, మేధోపరమైన,
    సైనిక పరిణామాలన్నీ
    సిలింగేర్ ఉద్యమ చరిత్రలో భాగమే.
    నిష్పాక్షిక దృష్టితో గతి తార్కిక చారిత్రక భౌతికవాదం దృష్టితో పరిశీలించి విశ్లేషించి నిక్షిప్తం చేశారు. ఇంగ్లీషులోకి అనువాదమవుతే బాగుంటుంది ఇతర రాష్ట్రాల్లోని, దేశాల్లోని ప్రజలు చదవడానికి అవకాశం ఉంటుంది.
    పాణి గారికి ఉద్యమాభి వందనాలు
    వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిలింగేర్ ఉద్యమం వర్ధిల్లాలి.

  2. ✊✊
    మా సత్యం
    సిలింగేర్
    —పాణి
    కొత్త చూపుతో
    సిలింగేర్ ఉద్యమ మూలాలను, నేపథ్యాన్ని కాలానుగుణంగా సరికొత్త వ్యూహముతో జరుగుతున్న మార్పును అధ్యయనం చేస్తు అంతర్లీనంగా దాగి ఉన్న ఒక మహత్తర పోరాటాన్ని నేటి ఉద్యమ తరానికి మరింత శక్తివంత నిర్మాణానికి ‘సిలింగేర్’
    ఉద్యమ నేపథ్యం ఒక నమూనా. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి ఒక ప్రేరణాత్మకమైన రాజీపడని ఉద్యమ నిర్మాణానికి తోడ్పడుతుంది.
    పాణి గారు
    యుద్ధ ప్రతిపాదికన గత సంవత్సరం నుంచి జరుగుతున్న సిలింగేర్ ఉద్యమ రూపాన్ని రాజకీయ, సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన, వైజ్ఞానిక, సాంకేతిక, మేధోపరమైన,
    సైనిక పరిణామాలన్నీ
    సిలింగేర్ ఉద్యమ చరిత్రలో భాగమే.
    నిష్పాక్షిక దృష్టితో గతి తార్కిక చారిత్రక భౌతికవాదం దృష్టితో పరిశీలించి విశ్లేషించి నిక్షిప్తం చేశారు. ఇంగ్లీషులోకి అనువాదమవుతే బాగుంటుంది ఇతర రాష్ట్రాల్లోని, దేశాల్లోని ప్రజలు చదవడానికి అవకాశం ఉంటుంది.
    పాణి గారికి ఉద్యమాభి వందనాలు
    వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిలింగేర్ ఉద్యమం వర్ధిల్లాలి.

Leave a Reply