“ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటి లోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి”- మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టో.
1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ “స్ట్రైక్”. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్రనిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన రాజకీయ చిత్రం! దీని నిడివి 82 నిమిషాలు.
కథలోకి వెళ్లి క్లుప్తంగా చెప్పుకోవాలంటే – ఒక మెటల్ ఫ్యాక్టరీలో 25 రూబిళ్లు ఖరీదు చేసే ఒక మైక్రోమీటర్ మాయమవుతుంది. ఆ నేరాన్ని యాజమాన్యం ‘యాకోవ్’ అనే కార్మికుడి మీదకు నెడుతుంది. అవమాన భారంతో అతను ఉరి వేసుకుని మరణిస్తాడు. యాకోవ్ ఉరి తీసుకునే ముందు తనకు జరిగిన అన్యాయం గురించి వాస్తవాలను వివరిస్తూ తన సహ కార్మిక సోదరులకు రాసిన ఒక లేఖను వదిలి వెళ్తాడు. ఆ లేఖతో పాటు, యాకోవ్ వేళ్లాడుతున్న శవాన్ని చూసిన కార్మికులు పట్టరాని ఆగ్రహంతో పని అక్కడికక్కడే ఆపేసి, మిల్లింగ్ గది వదిలేసి మెరుపు సమ్మెకు దిగుతారు. కొలిమి కిటికీల ద్వారా రాళ్లు, వదులుగా ఉన్న మెటల్ ని విసురుతూ సమ్మె చేస్తున్న కార్మికులు కొలిమి పనికి ఆటంకం కలిగిస్తారు. అప్పుడు యాజమాన్యం మండిపడుతూ ఫ్యాక్టరీ ఆవరణ గేట్ల లోపలే కార్మికులందర్నీ నిర్బంధిస్తుంది. కోపించిన శ్రామికులు కార్యాలయాన్ని ఆక్రమించి ఒక అధికారిని బలవంతంగా ఒక బండి చక్రానికి గట్టి కొండ పక్కనున్న వాగు నీటిలో ముంచుతారు. ఆ రోజు నుంచి కార్మికులు పనిని స్తంభింపచేయడం వల్ల ఫ్యాక్టరీ ఖాళీగా ఉండి, కళావిహీనమై పోతుంది. రాబడి ఆగిపోయినందువల్ల యాజమాన్యం ఆగ్రహం రోజు రోజుకీ పెరిగి పోతూ ఉంటుంది. శ్రామికులు ఐక్యంగా ఉండి తమ డిమాండ్లు రూపొందిస్తారు.
1) 8 గంటల పని దినం కావాలి.
2) యాజమాన్యం శ్రామికులను మర్యాదగా, సాటి మనుషులుగా చూడాలి.
3) 30% వేతనం పెంచాలి.
4) బాల కార్మికులకు (మైనర్లకు) 6 గంటల పని దినం ఇవ్వాలి.
ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో తయారైన ఒక రాతప్రతిని కార్మికులు యాజమాన్యం ముందుంచు తారు. ఈ దరఖాస్తును యాజమాన్యం-వాటాదారులు కలిసి కూర్చుని, సిగార్ల పొగను పీలుస్తూ, రకరకాల పానీయాలు సేవిస్తూ, మహా విలాసంగా తమ సమావేశంలో చర్చిస్తారు. ఇంతకీ చర్చల అనంతరం ఏం సెలవిస్తారనుకున్నారు? వాటాదారుల ఆదేశాలతో 8 గంటల పని దినం చట్ట విరుద్ధమైనదనీ, 30% వేతన పెంపకంతో సహా మిగిలిన రెండు డిమాండ్లూ కూడా న్యాయ సమ్మతమైనవి కావనీ యజమానులు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు!
రోజుల తరబడి సమ్మె కొనసాగుతుంది. రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికుల కుటుంబాలు పసిబిడ్డలతో సహా ఆకలి బాధలకు అల్లాడిపోతుంటారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఏ మాత్రం సానుభూతి చూపదు. తాను పట్టిన పట్టు వీడదు. శ్రామికుల నిరసన తీవ్రరూపం దాలుస్తుంది. పోలీసులు రకరకాలుగా ప్రలోభపెట్టడంతో శ్రామిక వర్గంలోనే ఉన్న కొంతమంది దుష్ట కార్మికులు పోలీసులతో కుమ్మక్కై సోదర కార్మికులకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచే భ్రష్టత్వానికి పాల్పడతారు. యాజమాన్యపు గూఢచారులు జరుగుతున్న పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా కాపలా కాస్తుంటారు. ఆకలి మంటలను సహిస్తూ, సర్వ శక్తులూ కేంద్రీకరించి సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్యాలు -వాటాదారులు కలిసి అగ్నిమాపక విభాగంతో, పోలీసులతో దాడి చేయిస్తారు. ఇంతలో సైనిక సిబ్బంది నలు వైపులా చుట్టు ముట్టడంతో కార్మికులు చెల్లా చెదురవుతారు.
“మాలో పిరికి వాళ్లు లేరు. దేశద్రోహులు లేరు. మా చివరి రక్తపు బొట్టు వరకూ మేము మా డిమాండ్లను సాధించు కోవడానికి మా శాయశక్తులా పాటుపడతాం,” అని నినదించిన శ్రమజీవులందరూ అమరులవుతారు. ఆ ఆవరణమంతా శ్రమ జీవుల శవాల గుట్టలతో నిండిపోతుంది. సినిమా ఒక విషాద నెత్తుటి టోన్ లో ముగుస్తుంది.
స్థూలంగా ఇదీ కథ. కానీ ఈ సినిమాని ఐసెన్ స్టీన్ దృశ్యకావ్యంగా మలిచిన విధానం వివరించాలంటే అదొక గొప్ప వచన కావ్యమే అవుతుంది. ప్రస్తుతానికి నా శక్తి మేరకు ప్రస్తావిస్తాను.
అదొక నిశ్శబ్ద యుగం. ఇంకా టాకీలు రాలేదు. ఈ నిశ్శబ్ద సినిమా “ సమ్మె” లో ప్రధానంగా మూడు గొప్ప లక్షణాలను ఐసెన్ స్టీన్ ఆవిష్కరించారు.
1. ముందు తరాల విప్లవ చరిత్ర
2. సమూహాల కథ
3. మాంటేజ్ తాకిడి – అంటే (రెండు విరుద్ధ సంఘటనల మధ్య ఘర్షణ సృష్టించి తాను ప్రతిపాదించ దలచుకున్న మూడో విషయాన్ని ప్రేక్షకులకు స్ఫురింపజేయడం).
ముందు తరాల పోరాటాలు గనక గమనిస్తే ఫ్యూడల్, భూస్వామ్య విధానాల తర్వాత వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధునిక పరిశ్రమలను సృష్టించింది. ఆ పరిశ్రమలలో పనిచేయడానికి, అహర్నిశలూ రెక్కలు ముక్కలు చేసుకుని సర్వ సంపదల్ని సృష్టించే శ్రమజీవుల్ని తయారు చేసింది. ఆనాటి కార్మికుల వెతలు చెప్పనలవి కానివి. గంటల తరబడి రోజంతా గొడ్డుచాకిరి చెయ్యాల్సి వచ్చేది. పోనీ ఇంతా పనిచేస్తే వచ్చేది ఒక డాలరో, డాలరున్నరో. దానితో కడుపు నిండేది కాదు. షికాగో లాంటి మహానగరాల్లో మండిపోయే ధరలు! ఆకాశాన్నంటే ధరలకు, అధిక పనిగంటలకూ వ్యతిరేకంగా షికాగో నగరంలో అలజడి రేగింది. రోజంతా పని, అంతులేని పనిగంటలు, వెట్టి చాకిరీ; రోజులు గడిచేకొద్దీ కార్మికులు విసిగిపోయారు. పని వేళల కోసం, పని స్థలంలో కనీస సౌకర్యాల కోసం, చేసిన చాకిరికి సరైన కూలి కోసం; మరీ ముఖ్యంగా 8 గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎక్కడివారక్కడ ఆందోళనలు, ఉద్యమాలు, సమ్మెలు చేశారు.
ఫలితంగా చిలికి చిలికి ఉధృతమైన ఉద్యమాలన్నీ వడగళ్ల వానగా రూపుదిద్దుకుని 1886 మే 3 న షికాగోలో బద్దలైంది. ఆరోజు 25000 మందితో కార్మికులు గొప్ప ఊరేగింపులో పరిసరాలు హోరెత్తేలా కదం తొక్కారు. తర్వాత రోజు హే మార్కెట్లో జరుగుతున్న కార్మిక సభపై పోలీసులు అతి కౄరమైన వికృత వీరంగం చేశారు. “మతియాస్ డేగన్” అనే ఒక పోలీసు అధికారిని గుర్తు తెలియని వ్యక్తి పేల్చినందుకు, దుర్మార్గంగా అనేకమంది కార్మికుల్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికా ప్రభుత్వం ఒక బూటకపు ఎన్ కౌంటర్ జరిపి ఆనాటి కార్మిక నాయకులు పార్సన్స్, స్పైజ్, ఎంగెల్స్ లను ఉరి తీసింది. దీని ఫలితంగా 1890 లో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల సమావేశం మే 1వ తేదీని “అంతర్జాతీయ కార్మిక పోరాటదినం” గా పాటించాలని తీర్మానించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు షికాగో వీరుల బలిదానాన్ని స్మరించుకుంటూ మేడేని తమ విముక్తి పోరాటాలదినంగా జరుపుకుంటున్నారు.
మహత్తరమైన ఈ మే డే పోరాటాలతో పాటు 1917 లో రష్యన్ కార్మిక వర్గం దేశంలోని జాతులన్నిటినీ ఏకం చేసి జరిపిన అక్టోబర్ విప్లవం అంతర్జాతీయంగా వ్యాపించి ఉన్న కార్మిక ప్రపంచానికి ఒక గొప్ప దీపస్థంభం లాగా, అద్భుతమైన వర్గపోరాటంగా రూపుదిద్దుకుంది.
తనకు గొప్ప ప్రేరణ నిచ్చిన 19 వ శతాబ్దంలోని తన ముందు తరాల ఉద్యమాల నన్నిటినీ, విప్లవ పోరాట ప్రభావాలనన్నిటినీ ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు ఐసెన్ స్టీన్!
ఇక ఈ సినిమా రెండో లక్షణం-సమూహాల కథ. కార్మిక సమూహాల కథ. ఇది ఏ ఒక్కరి కథా కాదు. ప్రాంతం రష్యా కావచ్చు గానీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కోట్లాది శ్రమజీవుల కథ. వస్తువు విశ్వజనీన మైనది. సినిమా ప్రారంభమే వ్లాదిమిర్ లెనిన్ కొటేషన్ నుండి మొదలవుతుంది.
“The strength of the working class is organization. Without organization of the masses, the proletarian is nothing. Organized it is everything. Being organized means unity of action,
unity of practical activity.”
తర్వాత బాతులు, బాతు పిల్లలు, పిల్లి పిల్లలు, పందిపిల్లలు, మొదలైన జంతువుల యొక్క ఫుటేజ్ కనిపిస్తుంది. కార్మికులు ఐక్యంగా ఉండి వళ్లంతా కళ్లు చేసుకుని, ఎంతో శ్రద్ధాసక్తులతో డిమాండ్లను రూపొందిస్తారు. యాజమాన్యం-వాటాదారులు అసలు వర్కర్స్ ని ఏ మాత్రం ఖాతరు చెయ్యకుండా ఆ దరఖాస్తు ఫారం గురించి అసలే మాత్రం పట్టించుకోకుండా, కనీస బాధ్యత లేకుండా దానితోనే టేబిల్ మీద చిందిన వైన్ ని తుడుచుకుంటారు. కార్మికులు ప్రాణాలుగ్గబట్టి రాసిన దరఖాస్తులోని విషయాలు శ్రమ జీవులకు జీవన్మరణ సమస్యలు. అవే సమస్యలు యాజమాన్యాలకు అసంబద్ధంగా, పనికిమాలిన పిచ్చి చేష్టలుగా కనిపిస్తాయి. వేళ్లతో లెక్కించదగినంత మంది యజమానులు వేలాది జీవితాలను నిరంకుశంగా శాసిస్తున్న విధానాన్ని (అచ్చం ఇప్పటి కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నట్లే) ప్రేక్షకుల కందించి ఆలోచించమంటారు ఐసెన్ స్టీన్. ఉద్రిక్తతలు, కష్టాలు, శ్రామికవర్గ త్యాగం మొదలైన ఉద్విగ్న సందర్భాలను తన కథనం ద్వారా ఏకైక దృశ్య భాష మూకీలో ప్రదర్శించడంలో ఒక అద్భుతమైన అవగాహన, మేధావితనం స్పష్టమవుతుంది. వందల మంది తారాగణంతో సినిమా ఆద్యంతం అద్భుతమైన వివరాల నందిస్తూ, శ్రామికవర్గ విలువల్ని పటిష్టం చేస్తూ, శ్రామికవర్గ ప్రచారాన్ని చిత్రీకరించడంలో వల్లమాలిన నేర్పరితనం చూపిస్తారు ఐసెన్ స్టీన్. ఇది చాలా ప్రతిభావంతమైన సమూహాల కథా కథనం!
ఇక మూడోది మాంటేజ్ ఆవిష్కరణ. మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లో ఆకర్షణ అని అర్ధం . “ప్రతి చిత్రం ఓ పుట్టుక. ఓ కొత్త జన్మ ఎత్తడం,” అన్న ఐసెన్ స్టీన్ రెండు పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణలో ఓ నూతన శక్తి ఆవిర్భవిస్తుందనే మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని ఆధారంగా చేసుకుని “మాంటేజ్” కి అన్వయించారు. దీనికి ఆయనే ఆద్యుడు. ఇంతకుముందు మాంటేజ్ దర్శకులు వెర్టోవ్, పుడోవ్ కిన్ లాంటి వారున్నప్పటికీ ఐసెన్ స్టీన్ వాళ్లకి భిన్నమైనవారు. ఐసెన్ స్టీన్ ఈ సినిమా తీస్తున్న సమయానికి రష్యా ప్రజలు 80% నిరక్షరాస్యులు. రోజు రోజుకీ, క్షణ క్షణానికీ ఉధృతమవుతున్న విప్లవోద్యమంతో ప్రేక్షకుణ్ణి మమేకం చెయ్యడానికీ, రాజకీయ ఆలోచనలు చెప్పడానికీ ఐసెన్ స్టీన్ మాంటేజ్ ని ఎన్నుకున్నారు. దృశ్య భాష ద్వారా రాజకీయ సందేశాలను తెలియజేసేందుకు మాంటేజ్ లోని విస్తారమైన అవకాశాలను వాడుకుని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి, చైతన్య పరచడానికి ప్రయత్నించారు. “విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్యపరచడానికి సినిమాకు మించిన కళారూపం మరొకటి లేదని“ అన్న లెనిన్ సూత్రీకరణను నూటికి నూరుపాళ్లూ వాడుకున్నారు ఐసెన్ స్టీన్.
మాంటేజ్ ని అర్థం చేసుకోవడానికి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేసుకుంటారు ఐసెన్ స్టీన్. ఉదాహరణకి సైన్యం చేతిలో
కార్మికులు చనిపోతున్న కౄరదృశ్యాన్ని పశువుల వధ జరుగుతున్నట్లు గ్రాఫిక్ చిత్రాలతో చూపించి ప్రేక్షకుల దిమ్మ తిరిగేట్లు చేస్తారు! యాకోవ్ మీద దొంగతనం ఆపాదిస్తున్న సీన్ లో యాకోవ్ క్లోజ్ అప్, మేనేజర్ క్లోజ్ అప్ రెండూ కనిపిస్తాయి. రెండు షాట్స్ ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయి. యాకోవ్ ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు అతని పట్ల సహానుభూతితో ఐడింటిఫై అవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఐసెన్ స్టీన్. మేనేజర్ క్లోజ్ అప్ షాట్ చూస్తున్నప్పుడు మేనేజర్ నేరుగా తన మీదే దొంగతనం నేరారోపణ చేస్తున్నట్లు ప్రేక్షకుడు ఫీలవుతాడు. ఈ రెండు షాట్లనుంచి ఐసెన్ స్టీన్ సాధించదలచుకున్న మూడో ప్రయోజనం-దొంగైనందుకు మేనేజర్ యాకోవ్ ని తిట్టడమే కాదు, తాను దొంగగా భావిస్తున్న యాకోవ్ పక్షం వహిస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా తిడుతున్నట్లు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చెయ్యడం. ఇది ఒక అత్యద్భుతమైన ప్రయోగం! తెలుగులో మన మహాకవి శ్రీ శ్రీ కూడా తన రచనల్లోని చరమరాత్రి కథల్లోనూ, “గుమస్తా కల” మొదలైన రేడియో నాటికల్లోనూ మాంటేజ్ ని ప్రయోగాత్మకంగా శక్తివంతంగా వాడి విజయం సాధించారు.
విప్లవ కాలంలో ఇంజనీరింగ్ చదువు మాని రెడ్ ఆర్మీలో పని చేసిన చైతన్యశీలి ఐసెన్ స్టీన్. 27 ఏళ్ల వయసులో 1925 లో ఐసెన్ స్టీన్ దృశ్యీకరించిన మొట్ట మొదటి ఈ సినిమా ఒక సృజనాత్మక విస్ఫోటనం. ప్రపంచ సినిమా ప్రేక్షకుణ్ణి దిగ్భ్రాంతికి గురి చేసింది! ఐసెన్ స్టీన్ “స్ట్రైక్” తర్వాత తీసిన “బ్యాటిల్ షిప్ పొటోంకిన్“, “అక్టోబర్” చిత్రాలను పరిశీలిస్తే ఐసెన్ స్టీన్ వ్యక్తిత్వంలోనే కార్మిక రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉందనీ, శ్రమజీవుల పట్ల అపూర్వమైన ప్రేమాభిమానాలున్నాయనీ అర్థమవుతుంది. తన ముందు తరాల విప్లవ పోరాట ప్రభావాలన్నీ ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు!
చూడగానే మనసు చలించే గొప్ప దృశ్యాలు చాలా ఉన్నాయీ సినిమాలో! ఒక నెత్తుటి ముఖం, ఒక మండే ఆయుధం ఉపయోగించి, సాధించదలచుకున్న మూడో ప్రయోజనాన్ని స్ఫురింపజేస్తారు!
సైన్యం సమ్మెను విధ్వంసకరంగా అణిచివేయడం చూపించి, అసలు సైన్యం ప్రజలకు సేవ చెయ్యాలి. కానీ ధనస్వామ్యానికీ, బూర్జువా, కులీన వర్గాలకు సేవ చేస్తుందని చెప్పకనే చెప్తారు ఐసెన్ స్టీన్.
యాజమాన్యం-వాటాదారుల విలాసవంతమైన జీవితాలనూ వాళ్లకి కార్మికుల పట్ల ఉన్న ఏహ్య భావాన్నీ తెలిపే సీన్ ని ప్రతి మనిషీ చూచి తీరాలి! యాజమాన్యం – వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను జూస్ తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు. అంటే శ్రమిస్తున్న మనుషుల మీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్లను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతి హీనంగా చూస్తున్నారని దీని అర్థం.
పరిశ్రమల యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాలనేర్పరచుకొని, గూఢచార వ్యవస్థ ద్వారా చైతన్యవంతులైన కార్మికుల గురించీ, వారి నాయకుల గురించీ రహస్య సమాచార సేకరణ చేసేవారు. అలా కనిపెట్టిన సమాచారాన్ని బట్టి యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల ద్వారా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేవారు. నాయకులను జైళ్ల పాలు చేసేవారు. నేటికీ జరుగుతున్నదదే!
కార్మికుల పక్షం వహించిన ఐసెన్ స్టీన్, ఎంతో శ్రమకోర్చి ఎన్నో అద్భుతమైన సీన్లను ఈ చిత్రంలో ఎంతో హృద్యంగా దృశ్యీకరించారు.
కార్మికులందరికీ, శ్రామిక సమూహాలన్నిటికీ, ఆ మాటకొస్తే విశ్వ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలందరికీ చెందిన సామాజిక ఇతివృత్తంతో, మాంటేజ్ టెక్నిక్ ని సమర్థవంతంగా ఉపయోగించి, ఈనాటికీ వర్తించేలా స్ట్రైక్ సినిమాని రూపొందించి చలన చిత్ర చరిత్రలో తొలి దృశ్యీకరణతోనే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఐసెన్ స్టీన్. ఆయన ఎవరి మెప్పు కోసం ఈ సినిమా తియ్యలేదు. సమాజంలోని అట్టడుగు మనుషులు, జంతువుల కంటే హీనంగా చూడబడుతున్న మనుషుల పక్షం వహించి, వారి పట్ల ఆయనకున్న నిజాయితీ, నిబద్ధతలను చాటి చెప్పారు. మన పక్షం వహించిన ఇంత అద్భుతమైన వ్యక్తి, ఈ భూమి మీద ఒకప్పుడు సంచరించారంటేనే మనసు సంతోషంతో నిండిపోతుంది. ఇంకో వెయ్యి సంవత్సరాలకైనా మన దేశంలో ఇటువంటి సినిమాని ఆశించలేము! ప్రేక్షకుల హృదయాలలో లేని జుగుప్సాకరమైన అభిరుచులను వెలికితీసి రెచ్చగొట్టే మన దర్శకనిర్మాతలు, కళ ప్రజలకోసం అని గుర్తించి ఎప్పటికైనా ఇంతటి ఉత్తమ విలువలను పోషించే చిత్ర నిర్మాణం చెయ్యగలరా?
మన ముందు తరాలవారి ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినం ఇవాళ కార్పొరేట్ శక్తుల చేతుల్లో హరించుకుపోయి; మన తరాలు, మన భావి తరాలు మళ్లీ గంటల తరబడి పని చేసే స్థితిలోకి నెట్టబడ్డారు. ఇంకా విచిత్రమేమిటంటే ఇంటి నుంచి పని చెయ్యడం ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నారు. దానివల్ల కార్మికులకు సమకూర్చవలసిన సౌకర్యాల నుంచి, కార్మికులు హక్కులుగా పొందవలసినవాటి నుంచి యాజమాన్యం ఏ మాత్రం బాధ్యత వహించకుండా హాయిగా తప్పించుకుంటుందని కార్మికులు కూడా గమనించడం లేదు.మార్క్స్ చాలా లోతుగా విశ్లేషించి చెప్పిన శ్రమ దోపిడికి ఇదొక పరాకాష్ఠ!
కూలిపోతున్న జీవితాలను నిలబెట్టడానికే కాదు, మనల్ని మనం నిలబేట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి తీరాలి!
(మేడే సందర్బంగా. మాతృక సౌజన్యంతో.. )