సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్‌, స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిచ్‌ వంటి రేటింగ్‌ సంస్థలు, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్‌) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం నుండి 5.9 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్భణం 4.9 శాతం ఉంటుందని అంచనా వేసింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారిపోతున్నట్టు 2022-23 ఆర్థిక సర్వే బయటపెట్టింది. పట్టు తప్పుతున్నదని, కట్టు వీడుతున్నదని అది హెచ్చరికలు పంపింది. గత తొమ్మిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ నిర్వాకం దేశ ఆర్థిక రంగాన్ని నష్టాల అంచుల్లో నిలబెడుతున్నట్టు విస్పష్టంగా సూచించింది. నరేంద్ర మోడీ సర్కారు ఎంత దాచాలని ప్రయత్నించినా ఇందులో చేదు వాస్తవాలను దాచలేకపోయింది. దేశ వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత పతనం కాబోతున్నదని సర్వే చెప్పింది. ఇప్పటికే ఆకాశాన్నంటిన ధరలు మరింత పెరిగి దేశ ప్రజలను ఇంకా ఆగమాగం చేయనున్నాయని పేర్కొంది. అంకెల గారడి, అబద్ధాల పేరడితో ఈ నిజాలను దాచటానికి ప్రయత్నించిన మోడీ ప్రభుత్వం.. రాబోయే కష్టాలకు ప్రపంచవ్యాప్త పరిణామాలే కారణమని ముందే ఒక సాకును వెతుక్కున్నది. ఎప్పుడో పోయిన కరోనాను, రేపు రాబోయే మాంద్యాన్ని, రష్యా-యుక్రెయిన్‌ యుద్ధాన్ని సంక్షోభిత వాతావరణ పరిస్థితులను చూపిస్తూ జరుగబోయేదానికి తన బాధ్యత ఏమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేసింది.

 మరోవైపు అంతర్జాతీయ నివేదికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఆక్స్‌ఫామ్‌ సంస్థ నివేదిక, గ్లోబల్‌ రిస్క్‌ రిపోర్ట్‌-2023 నివేదిక వివిధ దేశాల, ప్రాంతాల, జాతుల వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గ్లోబల్‌ రిస్క్‌ నివేదిక-2023 పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. అందులో రానున్న రెండేళ్లలో ప్రపంచాన్ని అత్యంత దారుణంగా కుదిపేసేది ‘జీవన వ్యయం’ అని, రానున్న దశాబ్ద కాలంలో జీవన ప్రమాణాలను ప్రభావితతం చేసేది పర్యావరణ మార్పులు అని పేర్కొంది. ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోకుంటే సామాజిక సంక్షోభం ఏర్పడి ప్రభుత్వ విధాన నిర్ణయ వ్యతిరేక ఉద్యమంగా మారే అవకాశముందని హెచ్చరించింది.

2014లో మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి మూడీస్‌, ఫిచ్‌ నివేదికలు భారత్‌లో కుటుంబాల సగటు ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడిరచాయి. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కూడ లెక్కలోకి తీసుకుంటే సగటు ఆదాయాల్లో వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో మైనస్‌ 3.7 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో మైనస్‌ 1.6 శాతం ఉందని రేటింగ్‌ సంస్థలు వెల్లడిరచాయి. 2012-15 మధ్య కుటుంబ ఆదాయాల్లో వృద్ధి 8.2 శాతం కాగా, ఇది 2016-22 నాటికి 5.7 శాతానికి పడిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణం కూడ పరిగణలోకి తీసుకుంటే వృద్ధి మైనస్‌లోకి జారుకుంటుందని నివేదికలు తెలిపాయి. వాస్తవాలు ఇలా ఉంటే మోడీ ప్రభుత్వం, గోడీ మీడియా భారత్‌ ఆర్థికంగా వెలిగిపోతుందని ప్రచారానికి పూనుకోవడం ఆత్మవంచన తప్ప మరోటి కాదు.

పెరుగుతున్న జీవన వ్యయ సంక్షోభం :

కార్పొరేట్‌ అనుకూల విధానాలు విడనాడాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నా మోడీ ప్రభుత్వం వినడం లేదు- మోడీ తొమ్మిదేళ్లుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు చేయలేదని చెబుతున్నారు. 1991కి ముందు మన దేశంలో 16 మంది బిలియనీర్లు ఉండగా 2022 డిసెంబర్‌ నాటికి 169కి పెరిగారు. 1991లో ఒక్క శాతం మంది దగ్గర 10 శాతం సంపద ఉండగా, ఈ రోజు అదే 1 శాతం వద్ద 40 శాతం సంపద పోగుపడిరది. 10 శాతం కుటుంబాల వద్ద 74 శాతం సంపద పోగుపడిరది. అట్టడుగు 50 శాతం ప్రజల వద్ద కేవలం 6 శాతం సంపద మాత్రమే మిగిలింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితికి నిదర్శనం. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా!

మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటేనే పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుంది. డిమాండ్‌ ఏర్పడాలంటే ఉపాధిరంగం మెరుగుపడాలి. మోడీ ప్రభుత్వం అందుకు తగిన చర్యలేమి తీసుకోకుండా కేవలం దేశంలోని బడా కార్పొరేట్లకు లక్షల కోట్లు ప్రజాధనం దోచిపెడుతోంది. ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ, ఉద్దీపనలు అందజేస్తోంది. కాని ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి, మార్కెట్‌లో డిమాండ్‌ పెంచడానికి ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకోకుండా ఉండాలంటే  ప్రజల కొనుగోలు శక్తి పెంచడమొక్కటే పరిష్కారమని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. కార్మికుల కనీసన వేతనం రూ.26 వేలకు పెంచాలని, ద్రవ్యోల్బణంతో ముడిపడిన కరువుబత్యం అందించాలని సూచిస్తున్నారు. వ్యవసాయ కార్మికుల కోసం న్యాయమైన కనీస వేతనం, ఇతర ప్రయోజనాలతో కూడిన సమగ్ర చట్టం తీసుకు రావాలని, రైతుల పంటలకు గిట్టుబాటుగా స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలు చేయడం వల్లనే  గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆర్థిక వేత్తలు ఘోషిస్తున్నారు.

మోడీ ప్రభుత్వానికి శ్రామిక వర్గాల బతుకు గురించి అసలు పట్టడం లేదు. కార్మికుల ప్రయోజనాలు, రైతాంగ సమస్యలు మోడీ ప్రభుత్వ ఏజెండాలో లేవని తొమ్మిదేళ్ల అనుభవం రుజువు చేస్తోంది. పైగా వారికి మరింత హాని కల్గించే చట్టాలు చేస్తున్నారు. మనదేశంలో జరుగుతున్న వృద్ధి ఉపాధి కల్పనకు తోడ్పడడం లేదు. పరిశ్రమను సాంకేతికరించడంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. తయారీ రంగంలో ఉపాధి కల్పన జరుగడం లేదు. గత రెండు దశాబ్దాల కిందట విపరీతమైన ఆశావాహంతో ప్రవాహంలా దూసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఒక్క టిసిఎస్‌ కంపెనీ గత ఏడాది నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించగా ఈ ఏడు కేవలం ఎనభై వేల నియామకాలు మాత్రమే కల్పించింది. ‘పెట్టుబడి-లాభదాయకమైన రిటర్న్స్‌’ అనే కాన్సెప్ట్‌ అంతర్జాతీయంగా పెరిగింది. మానవాభివృద్ధిపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం లేదు.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు (1991)ఆరంభమైన నాటి నుంచి అనేక దఫాలుగా అంతర్జాతీయ వేదికలపై వాగ్దానాలు కురిసినప్పటికీ పెరుగుతున్న కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే తక్షణ చర్యలు అభివృద్ధి చెందిన దేశాలలో ఏమాత్రం కనిపించడం లేదు. అందుచేత విపరీతమైన పర్యావరణ మార్పుతో ప్రధానంగా ప్రభావితమయ్యేది ఆఫ్రికా ఆసియా ఖండాల ప్రజలు, ఎందుకంటే వాతావరణ మార్పులు పారిశ్రామిక ఉత్పత్తులపై ప్రభావం చూపడమే కాకుండా, ప్రకృతి మార్పులు ప్రజల ఆహార వినియోగం, స్వావలంబన, సమైక్య జీవన విధానంపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రదేశాలలోనే ఉపాధి సంబంధిత అంశాలపై ఆసక్తి గొలిపే గ్లోబల్‌ రిస్క్‌ రిపోర్టు(2023) రానున్న ఐదేండ్లలో ప్రపంచంలోని మొత్తం ఉపాధుల్లో 23 శాతం మార్పులు చోటు చేసుకుంటాయని హెచ్చరించింది. ఫలితంగా ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, తొలగింపులు, వేతన తగ్గింపులు, ఉపాధి సంబంధిత కాంట్రాక్టుల్లో మార్పులు వంటివి సంభవిస్తాయని తెలిపింది.

నిజానికి ఈ రిపోర్టు వెలువడక ముందే గత ఏడాది ప్రపంచ దిగ్గజ సంస్థలు అనేకమంది ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగించాయి. లేదా పీస్‌ రేట్‌ సిస్టమ్‌ అనే విధానంతో పనులు పూర్తి చేయించుకునేలా అంగీకారాలు కుదుర్చుకోవడం మనం చూశాం. ఇక మన వ్యవసాయ రంగం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించగలదన్న ఆశ లేదు. మన జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక సవాళుగానే ఉంది. మోడీ ప్రభుత్వం  2014 ఎన్నికల సమయంలో ఏటా రెండుకోట్ల ఉద్యోగాలన్నది మాటలకే పరిమితమైంది. ప్రభుత్వ అనుచిత నిర్ణయాల వల్ల ఉన్న ఉద్యోగాలు పోయి నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని ఐ.రా.స 2015లో తన సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నది. నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి మరో ఏడు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. అయితే యేటా ఆకలితో అల్లాడిపోతున్న వారి సంఖ్య పెరిగి పోతుండటంతో ఈ లక్షసాధన కనుచూపు మేరలో కన్పించడం లేదని తాజా ఐ.రా.స నివేదిక వెల్లడిస్తున్నది. 

చిన్న పరిశ్రమలకు గడ్డుకాలం :

కార్పొరేట్లు కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పరారవుతున్నా మోడీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా ఇలా పేర్లు మారుస్తూ కాలాన్ని దాటేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మాత్రం కేంద్రం చేయూత నివ్వటం లేదు. కరోనాకు ముందే కాదు.. కరోనా తర్వాత కూడా చిన్నపరిశ్రమలు మరింతగా చితికిపోతున్నాయి. ఎంతో మేథోశక్తి ఉండి కూడా తమ సంస్థలను నడుపుకోలేక మూసివేసుకోవాల్సిన దుస్థితి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తులు మన ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వరకు ఉంటున్నప్పటికీ ఆ పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రోత్సాహాకాల విషయంలో అదిగో… ఇదిగో అంటూ మభ్యపెడుతోంది. యువపారిశ్రామిక వేత్తల్ని నిరాశపరుస్తోంది. దీంతో, సుమారు 70 వేలకు పైనే ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి.

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. చిన్న పరిశ్రమలను పెద్ద మనస్సుతో చూస్తున్నామని, భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగులుతోన్నాయి. వెంటాడుతోన్న మందగమనం భయాందోళనలు, ఆర్థిక ఇబ్బందులకు తోడు ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిరాశజనకంగా ఉండటంతో వేలాది సంస్థలు మూతపడుతున్నాయి. దేశంలో 6.3 కోట్లకు పైగా మంది ఎంఎస్‌ఎంఇలపై ఆధారపడి జీవిస్తున్నారు. జిడిపిలో ఈ రంగం దాదాపు 33 శాతం మద్ధతును అందిస్తోంది. దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 30 శాతం మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఎంఎస్‌ఎంఇలకు చేయూత నివ్వకుండా కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తోందని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుత ప్రభుత్వపు తప్పుడు విధానాలు చిన్నపరిశ్రమల మూతకు కారణం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చేసే ఉత్పత్తుల స్థానాన్ని బడా పరిశ్రమల ఉత్పత్తులు ఆక్రమించాయి. అవే సరుకులు చిన్న పరిశ్రమల్లో గనుక తయారైతే, వాటిని తయారు చేయడానికి ఎక్కువ మంది కార్మికులు అవసరం అవుతారు. వాటిని ఇప్పుడు బడా పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నారు గనుక అందుకు తక్కువ మంది కార్మికులు సరిపోతారు. ఆ విధంగా కూడా కార్మిక వర్గపు స్థూల ఆదాయం తగ్గిపోతుంది. అది వారి కొనుగోలు శక్తిని మరింత దెబ్బ తీస్తుంది. అందువలన పారిశ్రామిక సరుకుల డిమాండ్‌ మరింత తగ్గుతుంది. గ్రామీణ పేదరికం పెరిగితే అక్కడివారు పట్టణాలకు వలసలు వస్తారు. దాంతో పట్టణాల్లో ఉద్యోగాల కోసం పోటీ పడేవాళ్ళు పెరుగుతారు. దానివలన పట్టణ కార్మికుల వేతనాలు కూడా తగ్గిపోతాయి. అందువలన కూడా పారిశ్రామిక సరుకుల డిమాండ్‌ తగ్గిపోయి మాంద్యం పెరుగుదలకు దోహదం చేస్తుంది.  

జారుడుబండపై పారిశ్రామిక రంగం :

దేశంలో పారిశ్రామికోత్పత్తి మళ్లీ పడిపోయింది. 6నెలల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపి) వృద్ధిరేటు 1.1 శాతానికే పరిమితమైంది. ఇక అంతకుముందు నెలతో పోల్చితే ఏకంగా 4.7 శాతం దిగజారడం గమనార్హం. ఫిబ్రవరిలో ఇది 5.8 శాతంగా ఉంది. నిరుడు మార్చితో చూసినా నిరాశాజనకంగానే ఈసారి ఐఐపి గణాంకాలుండటం ఒకింత కలవరపాటునే కలిగిసున్నది. నాడు ఐఐపి 2.2 శాతంగా ఉంది మరి దీంతో పోల్చితే ఇప్పుడు సగానికి క్షీణించినట్టు స్పష్టమవుతున్నది. ప్రజల కొనుగోలు శక్తికి కొలమానంగా నిలచే తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చడం ఆర్థిక వ్యవస్థ బలహీనతకు సంకేతం. ఇదే సమయంలో వ్యవసాయరంగం పెరుగుదల గత సంవత్సరం 7.1 శాతం ఉండగా 2022-23లో 4.6 శాతం మాత్రమే ఉంది. తయారీ, విద్యుదుత్పత్తి వంటి కీలక రంగాల్లో నిస్తేజమే ఇందుకు కారణమని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే గనులు, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల్లో కొంత పురోవృద్ధి ఉన్న  ఐఐపి సగటు పుంజుకోలేదు.

డిమాండ్‌ లేమితో ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. దీంతో అంతిమంగా తయారీపై ప్రభావం పడుతోంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) ఏప్రిల్‌ 7న వెల్లడిరచిన డేటా ప్రకారం.. 2023 మార్చిలో తయారీ రంగం కేవలం 0.5 శాతం పెరుగుదలను మాత్రమే నమోదు చేసింది. గనుల రంగం 6.8 శాతం పెరగ్గా.. విద్యుత్‌ రంగం ఉత్పత్తి 1.6 శాతం తగ్గింది. కన్స్యూమర్‌ డ్యూరెబుల్స్‌ సూచీ వరుసగా నాలుగో మాసంలోనూ పడిపోయింది. ఈ సూచీ మార్చిలో 8.4 శాతానికి తగ్గి.. మూడు నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. నిర్మాణరంగం 10 శాతానికి మందగించింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌ మాసంలో ఎనిమిది ప్రధాన మౌలిక వసతుల రంగాల ఉత్పత్తి 3.5 శాతానికి పడిపోయి ఆరు మాసాల కనిష్టానికి జారింది. ముఖ్యంగా ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్స్‌, విద్యుత్‌ రంగాల ఉత్పత్తిలో తగ్గుదల చోటు చేసుకుంది.

పెరిగిన వాణిజ్య లోటు :

దేశ ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ఎప్పటి మాదిరిగానే మూడడుగులు ముందుకు అరడుగులు వెనక్కిగానే రుజువవుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతులు 6.3 శాతం పెరిగి దిగుమతులు 16.5 శాతం ఎక్కువ కావడమే ఇందుకు రుజువు. పెరిగిన ఎగుమతుల విలువ 447.46 బిలియన్‌ డాలర్లు కాగా, ఎక్కువైన దిగుమతుల విలువ 714 బిలియన్‌ డాలర్లు. వాణిజ్య లోటు 2022-23లో 266 బిలియన్‌ డాలర్లు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో వాణిజ్యలోటు 15.24 బిలియన్‌ డాలర్లు. మన దేశ ఎగుమతులకు కీలక గమ్యస్థానాలైన ఐరోపా, అమెరికాలలో గిరాకీ తగ్గడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరది. అక్కడ గిరాకీ మెరుగవ్వడానికి మరికొన్ని నెలలు సమయం పట్టొచ్చని విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ సంతోష్‌ కుమార్‌ సారంగి మే 15న వెల్లడిరచారు.

కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు :

విదేశీ మారక నిల్వల్లో అధిక భాగమైన కరెన్సీ ఆస్తులు మే 19తో ముగిసిన వారంలో 4.6 బిలియన్‌ డాలర్ల మేర తగ్గి, 524.9 బిలియన్‌ డాలర్ల వద్ద నిలిచాయి. నాన్‌-అమెరికా కరెన్సీలు యూరో, పౌండ్‌, యెన్‌ విలువల తగ్గుదల లేదా పెరుగుదల కూడా కరెన్సీ ఆస్తుల నిల్వలను ప్రభావితం చేస్తుంది. మే 3వ వారంలో బంగారం నిల్వలు 1.2 బిలియన్‌ డాలర్ల్ల వరకూ తగ్గి 45.127 డాలర్ల వద్దకు పడిపోయాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డిఆర్‌లు) 13.7 బిలియన్ల మేర తగ్గడంతో ఈ నిల్వలు 18.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అలాగే ఐఎంఎఫ్‌ వద్దనున్న భారత్‌ నిల్వలు 35 మిలియన్లు తగ్గుదలతో 5.13 బిలియన్‌ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు 645 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత క్రమేపీ తగ్గుతూ ఒక దశలో 500 బిలియన్‌ డాలర్ల స్థాయికి పడిపోయాయి. రూపాయి నిలువునా పతనమైన నేపథ్యంలో క్షీణతను నిలువరించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమెరికా డాలర్లను ఖర్చు చేయడం, చమురు ధరలు భారీగా పెరగడంతో దిగుమతులకు  విదేశీ కరెన్సీని వ్యయపర్చాల్సి రావడంతో మారక నిల్వలు ఆవిరైపోయాయి.

పేదలకు ద్రవ్యోల్బణం దడ :

దేశంలో ద్రవ్యోల్బణం సెగలు రేపుతూనే ఉంది. ఆహార ధరలు ఏమాత్రం దిగిరాలేదు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. పాలకుల అస్తవ్యస్త విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పేద ప్రజలు కనీస కొనుగోలు శక్తిని కూడా కోల్పోయారు. పట్టణాల కంటే గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే తాము పొందుతున్న ఉపాధీ, ఉద్యోగాల్లో కనీస వేతనాలు కూడా పొందలేని పరిస్థితుల్లో ధరల మంట కొనసాగుతుండటం ప్రజలను ఆర్థికంగా కుదేలు చేస్తోంది. మార్చిలో ద్రవ్యోల్భణం 5.8 శాతం ఉంది.  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విషయంలో కేంద్ర పాలకుల మాటలు రోజుకో రకంగా ఉంటున్నాయి. కేంద్ర ఆర్థిక  మంత్రి ఈ విషయంలో భిన్న ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయితే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) భవిష్యత్‌ ద్రవ్యోల్బణం మరింత సవాలుగా ఉంటుందని ఇప్పటికే చెప్పకనే చెప్పింది.

పెరుగుతున్న నిరుద్యోగం :

నిరుద్యోగం విషయంలో అడుగడుగునా మోడీ వైఫల్యం కనిపిస్తున్నది. భారత జనాభాలో దాదాపు 54 శాతం మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. దేశ భవిష్యత్తులో యువత పాత్ర చాలా కీలకం. అయితే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఆ యువతను విస్మరిస్తున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతకు హామీనిచ్చి 2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి ఆ హామీని గాలికొదిలేసింది. దీంతో దేశంలోని యువత మునుపెన్నడూ ఎరగనంత తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది. ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ 2021 దేశంలో ఉన్న తిరోగమన పరిస్థితులకు అద్దం పడుతున్నది. ఈ సమాచారం ప్రకారం అధికారికంగా చదవుకున్న వారిలో ఉద్యోగావకాశాలు 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. బిటెక్‌లో 47 శాతం, ఎంబిఎలో 47 శాతం, బిఎలో 43 శాతం, బీకామ్‌లో 40 శాతం, బీఎస్సీ గ్రాడ్యుయేట్లలో 30 శాతం మంది మాత్రమే ఉపాధి నైపుణ్యాలను కలిగి ఉన్నారు. డిగ్రీ హోల్డర్లలో 22 శాతం మంది మాత్రమే ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఐటీఐ గ్రాడ్యుయేట్లలో 75 శాతం మందికి ఉపాధి నైపుణ్యాలు లేకపోవటం గమనార్హం. ఫార్మా గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 67 శాతంగా ఉన్నది. ఇతర రంగాలను కూడా కలుపుకుంటే, ప్రతి సంవత్సరం లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే 1.5 కోట్ల మంది యువకులలో 65 శాతం నుంచి 75 శాతం వరకు నిరుద్యోగులే కావటం గమనార్హం.

దేశంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఓ పక్కా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత జనవరి నుంచి నిరుద్యోగం రేట్‌ ప్రతి నెలా పైకి ఎగబాకుతూనే ఉంది గాని తగ్గుముఖం పట్టడం లేదు. మే చివరి నాటికి 8.11 శాతానికి చేరుకున్నది. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం’ ఇదీ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాని మోడీ ఇచ్చిన హామీ. అయితే ఆ హామీని అటకెక్కించిన బిజెపి ప్రభుత్వం.. కార్పొరేట్లకు మాత్రం దేశ సంపదను దోచిపెట్టే పనిలో బిజీగా ఉన్నది. దీంతో కార్పొరేట్లు బిలియన్‌ డాలర్లకు ఎగబాకుతుంటే… దేశంలోని యువత మాత్రం ఉద్యోగాలు లేక నిరాశలో కూరుకుపోతున్నది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన కేంద్రం… పట్టించుకోకపోవటంతో ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేక, దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది.

మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి పథకాలు అన్ని అటుకెక్కాయి. మరోవైపు ప్రభుత్వ రంగం కొడిగట్టుకుపోయింది. ఫలితంగా మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో 4.29 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు తగ్గారని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కరద్‌ తెలిపారు. మరోవైపు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పెరిగారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సిపిఎస్‌ఇ)ల్లో 2014 మార్చి 31 నాటికి 13.51 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు ఉంటే, 2022 మార్చి 31 నాటికి 9.22 లక్షల మంది ఉద్యోగలకు తగ్గారు. ఎనిమిదేళ్లలో 4.29 లక్షల మంది ఉద్యోగులు తగ్గారు. 2014 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో 3.08 లక్షల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉంటే, 2022 మార్చి 31 నాటికి 4.99 లక్షలకు పెరిగారు. అంటే 1.91 లక్షల కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పెరిగారు. 4.29 లక్షల శాశ్వత ఉద్యోగాలు తగ్గి, 1.91 లక్షల కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు పెరిగాయి.

ముగింపు :

గత మూడు దశాబ్ధాలుగా అమలు చేస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పర్యావసానంగానే దేశంలో ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి కుంచించుకుపోతున్నది. ఉపాధి రహిత అభివృద్ధి యువతకు శరాఘాతంగా మారింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి ఫలాలు శ్రామిక వర్గానికి అందడం లేదు. పేదరికం, నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతున్నది. నిరుద్యోగం, ఆదాయలేమితో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, కొవిడ్‌ సంక్షోభంతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) తీవ్రంగా నష్టపోయాయి. వీటికి వెన్నుదన్నుగా నిలవాల్సిన కేంద్రం బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకొంటున్నది. ఈ స్థితిలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక సంరక్షణల నుండి వైదొలగాలని, అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి సమానంగా పంపిణి చేయాలని, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, విద్య, వైద్యం, వసతి అందరికి ఉచితంగా అందజేయాలన్న డిమాండ్లతో శ్రామిక, కర్షక వర్గాలు సంఘటితంగా పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదు.

Leave a Reply