(కా. డప్పు రమేశ్ మొదటి సంస్మరణ సభ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం)

1967 లో నక్సల్బరీ తిరుగుబాటుతో నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా మనదేశంలో స్థిరంగా వేళ్లూనుకుంది. ఇది ‘నూతన మానవుల’ నిర్మాణం అనే భావనను దేశంలో బలంగా ప్రవేశ పెట్టింది. రాజకీయంలో విప్లవ పథాన్ని ఆవిష్కరించడంతో పాటు సాహిత్యం, కళలు, సినిమా వంటి అన్ని రంగాలలో వినూతన కోణంతో ఆలోచించడం నేర్పింది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అంటూ చరిత్ర రచనలో పీడిత వర్గాల కోణం నుండి చరిత్రను చూడటం నేర్పించింది. ఆ నూతన దృక్కోణం స్పృశించని రంగమంటూ లేదు.

అంతకు ముందు దాకా కమ్యూనిస్టు పార్టీ తెభాగ పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో, ఇతర కొన్ని పోరాటాలలో మాత్రమే దేశ విప్లవంలో రైతుల, రైతుకూలీల పాత్ర ప్రాముఖ్యతను ప్రముఖంగా ఆవిష్కరించగా, నక్సల్బరీ పోరాటం, ఆ తరువాత ఆ పోరాటంలో నుండి పుట్టిన సి‌పి‌ఐ (ఎం‌ఎల్)  నూతన ప్రజాస్వామిక పంథాకు వ్యవసాయక విప్లవమే కీలకమని నిర్ద్వంద్వంగా చాటి చెప్పాయి. అంటే ఈ విప్లవంలో కార్మికవర్గ నేతృత్వంలో రైతు కూలీలు (భూమి లేని రైతులు), పేద తరగతి రైతులే కీలక చోదక శక్తులు అని సూత్రీకరించింది. దేశంలోని అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సంబంధాలను ధ్వంసం చేయడానికి దేశంలోని విప్లవకారులను నడిపించింది. గ్రామీణ ప్రాంతాలే పోరాటాలకు ప్రధాన కేంద్రాలయ్యాయి.

అర్ధ భూస్వామ్య సంబంధాలను గ్రామీణ ప్రాంతంలో ధ్వంసం చేయడమంటే భూస్వాముల ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్యాన్ని కూలదోయడమే. దాని స్థానంలో భూమిహీనుల, పేద రైతుల నాయకత్వంలో ఇతర మిత్ర వర్గాలైన మధ్య తరగతి రైతాంగాన్ని, చేతి వృత్తుల వారిని, ధనిక రైతులలోని ఒక సెక్షన్ ను కూడా కలుపుకొని పీడిత వర్గాల రాజకీయ, సామాజిక అధికారాన్ని నెలకొల్పడమే. ఉత్పత్తి సంబంధాలను సమూలంగా మార్చి వేసి ఆర్థిక అధికారం కూడా ఈ వర్గాల చేతిలో నెలకొనాలంటే దేశవ్యాప్తంగా అధికారం చేపట్టాలి కాబట్టి ఆ దిశగా సాయుధ విప్లవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే పంథాను చేపట్టింది.

1970లలో గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములంటే ప్రధానంగా అగ్ర కులాలకు చెందిన వారే. కొన్ని మినహాయింపులు మాత్రమే ఉండేది. అట్లాగే భూమిహీనులైన రైతు కూలీలు, పేదరైతులంటే ప్రధానంగా దళితులూ,  ఇతర కింది కులాల వాళ్ళే. అంటే అర్ధ-భూస్వామ్య సంబంధాలను కూలదోయడమంటే ముఖ్యంగా అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూలదోయడమే. ఈ సామాజిక వాస్తవికత కారణంగానే సి‌పి‌ఐ (ఎం‌ఎల్) పార్టీ విప్లవకారులకు, ముఖ్యంగా విద్యార్థి యువజనులకు ‘గ్రామాలకు తరలండి’ అని పిలుపిచ్చినప్పుడు  గ్రామాలలో తప్పనిసరిగా ‘దళితుల’ ఇళ్ళలోనే ఆశ్రయం పొందాలని విద్య గరిపేవారు. విప్లవకారులు ప్రజలతో ఎంతగా మమేకమయ్యారు అనేదానికి గీటు రాయి వాళ్ళు ఎంత కాలం ‘భూమి హీనులైన’, సామాజికంగా అట్టడుగు స్థాయిన ఉన్న ‘దళితులతో’ ఎంత కాలం గడిపారు వారిని విప్లవంలోకి ఎంత సమీకరించారు అనేదే ఉండేది. విప్లవోద్యమం తీవ్రమైన క్రమంలో గ్రామీణ స్థాయిలో స్థాపించే రాజ్యాధికార అంగాలైన విప్లవ రైతాంగ సమితులకు ప్రధానంగా భూమిలేని రైతులైన దళితులను నాయకత్వ స్థానాలలోకి తీసుకు రావాలని ఆనాడు సి‌పి‌ఐ (ఎం‌ఎల్) నిర్ణయం తీసుకున్నది. దానితో చరిత్రలో మొట్ట మొదటి సారిగా చైతన్య పూర్వకంగా దళితులు గ్రామీణ స్థాయిలో నిజమైన అధికారం చేపట్టే అవకాశం లభించింది.

ఈ విధమైన దృఢమైన వైఖరి చేపట్టినందుకే మైదాన గ్రామీణ ప్రాంతాలలో విప్లవోద్యమానికి వెలివాడలు, దళిత బస్తీలే తొలి ఆశ్రయ స్థలాలు, పట్టుకొమ్మలు అయ్యాయి. అది దేభ్రా-గోపి వల్లభ్ పూర్ కావచ్చు; లఖింపూర్-ఖేరి కావచ్చు; భోజ్ పూర్ లోని అసంఖ్యాక గ్రామాలు కావచ్చు; మలి దశలో బిహార్ లోని జెహనాబాద్, గయా, ఔరంగాబాద్, పాట్నా జిల్లాల లోని గ్రామాలు కావచ్చు, లేదా తెలంగాణ లోని జగిత్యాల, సిరిసిల్లాలతో సహా కరీం నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలోని వందలాది గ్రామాలు కావచ్చు, పల్నాడు లోని గ్రామాలు కావచ్చు, తమిళ నాడు లోని ధర్మపురి గ్రామాలు కావచ్చు – దేశవ్యాప్తంగా నక్సలైట్ల పార్టీ అంటే ముఖ్యంగా దళితుల పార్టీ, అట్టడుగు కులాల పార్టీ అనే భరోసా ఆ కులాల ప్రజలలో కలిగించింది. విప్లవ పార్టీ దన్ను లభించగానే తరతరాలుగా కాళ్ళ కింద అణగి ఉన్న మట్టి ఎగిసి భూస్వాముల కళ్ళల్లో పడ్డది. ఇదంతా కులంపై ప్రత్యేక కార్యక్రమం తీసుకొని జరిగిందని చెప్పలేం కానీ, అట్టడుగు శ్రామిక వర్గాలకు చెందిన వాళ్ళంటే ప్రధానంగా తొంభై శాతం అట్టడుగు కులాలకు చెందిన వాళ్ళే అనే ఎరుకతోనే జరిగింది. అంతే కాదు అంటరానితనం అంటేనే కుల వ్యవస్థ మన దేశంలో  నెలకొల్పిన అత్యంత నికృష్టమైన, అమానవీయమైన ఆచరణ అనీ, దానిని రూపు మాపాలనీ కమ్యూనిస్టు విప్లవకారులకు ఉండే సహజమైన దృక్పథం నుండి కూడా అటువంటి ఆచరణను చేపట్టడం జరిగింది. అట్టడుగు శ్రామిక వర్గాల చేతిలో రాజ్యాధికారం ఉంటేనే అది విప్లవ విజయానికి గానీ, విప్లవ విజయానంతరం అది కొనసాగడానికిగానీ హామీగా ఉంటుందనే చైనా సాంస్కృతిక విప్లవ అనుభవంతో కూడా ఆనాటి విప్లవ పార్టీలైన సి‌పి‌ఐ (ఎం‌ఎల్), ఎం‌సి‌సి లు ఈ దృక్పథంతో పని చేసాయి. భారత దేశంలో ఉన్న అర్ధ భూస్వామ్య సంబంధాలను ధ్వంసం చేసినప్పుడే కుల వ్యవస్థ కూలిపోవడానికి మార్గం సుగమం అవుతుందనే అవగాహనయే ఆనాడు స్థూలంగా విప్లవ పార్టీకి ఉన్న అవగాహన.

నక్సల్బరీ పోరాట తొలి నాలుగైదేళ్ళలో వర్గ శత్రు నిర్మూలనపైనే ప్రధాన కేంద్రీకరణ ఉండింది. ఆ ఎత్తుగడలలో ప్రజా పంథా ను వదిలేసిన అతివాద దుస్సాహసిక వాదాన్ని గుర్తించి ఉద్యమం స్వీయ విమర్శ చేసుకున్న తరువాత భూ స్వామ్యాన్ని ఎదిరించడానికి చేసిన పోరాటాల్లో కొన్ని చోట్ల భూ పోరాటాలు తొలుత ముందుకు వస్తే, మరెన్నో చోట్ల సామాజిక పోరాటాలు, ఆత్మ గౌరవ పోరాటాలే తొలుత ముందుకు వచ్చి ఆ తరువాత అవి భూ పోరాటాలకు దారి తీసాయి. ఆ పోరాటాలు అగ్రకులాలవ్యక్తులు కింది కులాల వారిని ‘అరె, ఒరే, అసే’ అనే పిలుపులు మాని గౌరవప్రదంగా పిలవడం నేర్పాయి. కొన్ని చోట్ల దాదా, దీదీ అనో, కొన్ని చోట్ల ‘జీ’ (గారు) అనో, మరి కొన్ని చోట్ల పెత్తందార్లను ‘నీ బాంచెన్, కాల్మొక్త’ అనే స్థితి నుండి అగ్రకుల పెత్తందార్లే పీడిత కులాల విప్లవ నాయకులను, రాడికల్ యువతీ యువకులను, రైతుకూలీ సంఘాల నాయకులను ‘అన్నా, అక్కా’ అని పిలవడం అలవాటు చేసాయి. భూస్వాముల ఇండ్ల ముందు నుండి చెప్పులు విడిచి వెళ్ళే సాంప్రదాయం ఉన్న చోట చెప్పులు వేసుకొని తలెత్తుకొని వెళ్ళే ఆత్మ గౌరవాన్ని పీడిత కులాల ప్రజలకు అలవాటు చేసింది విప్లవోద్యమం. ‘రెండు గ్లాసుల’ ఆచారాన్ని పాటించే హోటళ్ళలో, టీ కొట్టులలో అటువంటివి మాన్పించేందుకు ఎన్నో పోరాటాలు చేసింది. బాజా భజంత్రీలతో ఊరి మధ్య నుండి దళితుల పెళ్లి ఊరేగింపులు వెళ్ళేలా స్థైర్యాన్ని ఇచ్చింది. దాని కోసం అవసరమైతే వీధి పోరాటాలకు సిద్ధమైంది. దొరల గడీల ముందు సంప్రదాయంగా ఆడే బతుకమ్మ ఆటను పీడిత కులాల వాడలకు, గేరీలకు, బస్తీలకు తీసుకొచ్చింది. విప్లవకారులు ప్రజల ఇళ్ళల్లో తిన్నప్పుడు తమ కంచాలు తాము కడగటం ఒక పద్ధతిగానే అలవాటుగా చేసుకున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లపై భారం తగ్గించడానికి, సాంస్కృతికంగా పితృస్వామ్య వ్యతిరేక పోరాటంలో భాగంగా ఇలా చేయడం పరిపాటి అయ్యింది. అయితే, ఆధిపత్య అగ్ర కులాల ఇళ్ళల్లో తిన్నప్పుడు సంప్రదాయకంగా కింది కులాల వాళ్ళు తమ కంచాలు తాము కడగటం జరిగేది కాబట్టి, అది ఆ ఆధిపత్య ధోరణిని కొనసాగించినట్టు అవుతుందనే కోణంలో వాళ్ళ ఇళ్ళల్లో మాత్రం మన కంచాలు మనమే తీయవద్దు అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ ఇళ్ల మహిళలకు కొంత పని ఎక్కువైనా, ఇక్కడ పితృస్వామ్య వ్యతిరేక పోరాటానికన్నా కుల ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా జరపాల్సిన పోరాటానికే అధిక ప్రాముఖ్యత ఇచ్చినందువల్లనే అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి వందలాది చిన్న చిన్న ఆచరణలు విప్లవోద్యమ క్రమంలో చాలా సాధారణమయ్యాయి.

ఈ మొత్తం క్రమంలో కులం పట్ల విప్లవ పార్టీ అవగాహన ఎట్లా అభివృద్ధి చెందుతూ వస్తున్నదో మరొక వ్యాసం ‘కులం-విప్లవోద్యమ అవగాహన, ఆచరణ’ (virasam.org 02.10.2.19) అన్న వ్యాసంలో వివరంగా ఉన్నందున ఈ వ్యాసంలో మళ్ళీ దానిని వివరించడం లేదు.

కుల నిర్మూలనకు నూతన ప్రజాస్వామిక విప్లవానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం వివరంగా చూడవలసి ఉంది.

ఆంగ్లేయులు మన దేశాన్ని స్వాధీన పరుచుకొనక ముందు ఉన్న భూస్వామ్య కాలమంతా కులానికి ఉత్పత్తి విధానంతో సన్నిహిత సంబంధం ఉంది. అందుకే ఆ భూస్వామ్యాన్ని కుల-ఆధారిత భూస్వామ్యం అని అంటున్నాం. అంటే అర్థం భూస్వామ్య సమాజంలో ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూ యాజమాన్యం నిర్దిష్టంగా కొన్ని అగ్రకులాల చేతిలో ఉండగా, ఆ భూమిపై శ్రమించే శ్రమజీవులు, ఇతర ఉత్పత్తిదారులు (వృత్తికారులు) శూద్ర, అతి శూద్ర కులాలకు చెందిన వారు అయి ఉండేవారు. ఇదే సాధారణ స్థితి. శతాబ్దాల కాలంలో ఇందులో కొన్ని మార్పులు జరుగుతూ వస్తున్నా స్థూలంగా ఉన్న స్థితి మాత్రం అదే.

ఆంగ్లేయులు మన దేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా పాలించిన కాలంలో భూస్వామ్య సంబంధాలలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి, వలస పెట్టుబడి ప్రవేశించినందు వల్ల కొంత మేరకు పెట్టుబడిదారీ సంబంధాలు కూడా మొదలయ్యాయి. కులాలకు, ఉత్పత్తి విధానానికి మధ్య ఉన్న సంబంధం పెను మార్పులకు గురయ్యింది. దళితులలో నుండి కార్మిక వర్గం మాత్రమే కాక, చరిత్రలో మొట్ట మొదటి సారిగా చదువుకున్న పట్టణ మధ్య తరగతి వర్గం తయారైంది. శూద్ర వ్యవసాయ కులాల నుండి మధ్య తరగతి రైతులు, ధనిక రైతులు, ఒక చిన్న భూస్వామ్య వర్గం కూడా తయారైంది. ఆంగ్లేయులు ప్రవేశ పెట్టిన ఆంగ్ల విద్య కారణంగా, అప్పటి దాకా అగ్రకులాలకు మాత్రమే పరిమితమైన చదువు శూద్రులకు, దళితులకు కూడా అందుబాటులోకి రావడం వల్ల బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమాలు ఉదయించి వారు తమ హక్కుల కోసం పోరాడటం మొదలైంది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటం, యూరోప్ లో జరిగిన సోషలిస్టు ఉద్యమాలు, జాతుల ఉద్యమాలు వంటివన్నీ భారత దేశంలోని మధ్య తరగతిలోనూ, ఒక సెక్షను బూర్జువా వర్గం లోనూ జాతీయ చైతన్యం, ప్రజాస్వామిక భావనలను రేకెత్తించాయి. ఆ ప్రభావం కింది కులాలనుండి ఎదిగిన విద్యాధికులలో కూడా గణనీయంగా ఉంది.  అవి తమ హక్కులకై  చైతన్యాన్ని పెంచాయి. తర తమ స్థాయిలలో ఎన్నో రైతాంగ ఉద్యమాలు కూడా జరిగాయి. వీటన్నిటి ప్రభావం వల్ల వర్గ పొందికలో మార్పులు వచ్చాయి.

వలస పాలన అనంతరం ఈ మార్పులు మరింత వేగవంతమైనాయి.

నక్సల్బరీ పోరాటం, తదనంతరం కొనసాగిన విప్లవోద్యమం వల్ల ప్రత్యక్షంగా పలు రాష్ట్రాలలో భూ సంబంధాలలో మార్పులు వచ్చాయి. పలు చోట్ల పాత భూస్వాముల స్థానంలో కొత్త భూస్వామ్య సెక్షన్లు తయారయ్యాయి. ఇందులో కూడా కుల పొందికలో మార్పులు వచ్చాయి. విప్లవోద్యమం నుండి ప్రజలను దూరం చేయడానికి తాయిలం రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన భూ పరిమితి చట్టాలు వంటివి చాలా బలహీనంగా, నామ మాత్రంగానే అమలైనా ఎంతో కొంత మార్పులకు దారితీసాయి. వెరసి కులాలకూ, వర్గాలకూ (ఉత్పత్తి వ్యవస్థకూ) మధ్య ఉన్న అవినాభావ సంబంధం విచ్ఛిన్నమైంది. అన్ని కులాలలోనూ అన్ని వర్గాలు ఏదో ఒక మేరకు ఆవిర్భవించాయి. ఇప్పుడిక కులాల ప్రయోజనాలు, వర్గ ప్రయోజనాలు ఒకటిగా ఉండటం ఆగిపోయింది. అదే సమయంలో క్రమంగా ఆర్థిక ప్రాబల్యం, సామాజిక చైతన్యం పొందిన వెనుకబడిన కులాలకు, దళిత కులాలకు చెందిన మధ్య తరగతి వర్గం, ధనిక వర్గం రాజకీయాలలో, విద్య, ఉద్యోగ రంగాలలో తమ వాటా కోసం రిజర్వేషన్ల వంటి డిమాండ్లతో పోరాటం చేయడం పెరిగింది. అప్పటి దాకా అన్ని రాజకీయ పార్టీలలో ప్రాబల్యంలో, ఆధిపత్యంలో ఉన్న అగ్రకులాలను తొలగించడానికి తమ తమ కులాల ప్రజలను సమీకరించుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. విడివిడి కులాలకే తగు సంఖ్యలో ప్రజలను సమీకరించే అవకాశాలు తక్కువ కాబాట్టి బహుజన కులాల ఐక్యత, బహుజన-దళిత ఐక్యత, బహుజన-దళిత-మైనారిటీ ఐక్యత అనే నినాదాలు ముందుకు వచ్చాయి. ఇందులో ఒక మేరకు ప్రజాస్వామిక ఆకాంక్ష ఉన్న మాట వాస్తవం. అగ్రకులాల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి ఎన్నో పదునైన ఉపకరణాలను ఈ చైతన్యం అందించింది. కానీ ఇందులో ఒక తీవ్రమైన సమస్య కూడా ఉంది. ఈ అన్ని కులాల ఉమ్మడి ప్రయోజనం పరిమితమైనది. అది ప్రధానంగా సామాజికమైనది మాత్రమే. ఆర్థికంగా ఎన్నో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయి.

ఉదాహరణకు ఈ రోజు గ్రామీణ పరిస్థితి చూసినప్పుడు – గత కొన్ని దశాబ్దాలలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి చేతులు మారింది అనే విషయాన్ని పైన పేర్కొన్నాము. ఎన్నో చోట్ల పాత అగ్రకులాల స్థానంలో శూద్ర వ్యవసాయ కులాల చేతులలోకి భూ యజమాన్యం మారింది. వీరి ప్రయోజనాలు, భూమి హీనులైన దళితుల, ఇతర అతి వెనుకబడిన కులాలకు చెందిన రైతు కూలీల, పేద రైతుల ప్రయోజనాలు ఒకటి కాదు. “దున్నే వారికే భూమి” నినాదం సహజంగా వీరిని పోరాటోన్ముఖులను చేసినట్టు భూ యజమానులైపోయినవారిని చేయదు. కూలీ రేట్లకు సంబంధించిన పోరాటాల విషయంలో కూడా ఈ పరస్పర భిన్న ప్రయోజనాలు ఉన్నాయి.

ఈరోజు దళితులలో కూడా కార్మిక వర్గం, మధ్యతరగతి వర్గం, ముఖ్యంగా పట్టణ మధ్య తరగతి వర్గం తయారయ్యాయి. ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ వంటి పెద్ద అధికారులతో, బడా రాజకీయ నాయకులతో, చాలా కొద్ది మంది ఐనా పారిశ్రామికులతో కూడిన బూర్జువా వర్గం కూడా తయారైంది. గ్రామీణ స్థాయిలో మాత్రం కొన్ని చోట్ల మధ్య తరగతి వర్గంగా ఎదిగినా ప్రధానంగా భూమిహీనులుగా, పేద రైతులుగానే ఉన్నారు. ఇన్ని వర్గ విభజనలతో ఉన్న వీరందరి ప్రయోజనాలు కూడా ఒకటి కావు. ఆచరణలో కూడా ఎన్నో సార్లు ఇది నిరూపితమవుతూ వస్తూనే ఉంది. ఇతర వెనుకబడిన కులాలకు సంబంధించి కూడా ఇదే స్థూలంగా వర్తిస్తుంది. ఐనా దళితుల మేరకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుల-వర్గాల ఐక్యత కొనసాగుతున్నదనే చెప్పవచ్చు.

మారిన ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కులం, వర్గం పూర్తిగా ఒకటి కావు. ఐనా సామాజిక, సాంఘిక, సాంస్కృతిక వివక్షతలకు, అణచివేతకు వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ, మనువాద సంస్కృతికీ, పీడక కులాల ఆధిపత్యానికీ వ్యతిరేకంగా పోరాడే మేరకు పీడిత కులాల ఐక్యత అనేది పూర్తిగా సమంజసమైనది, సరియైనదే. కుల నిర్మూలనా పోరాటంలో తోడ్పడగలిగేదే. కానీ పై భిన్న ప్రయోజనాల రీత్యానే పీడిత కులాలకు రాజ్యాధికారం అనే బి‌ఎస్‌పి నినాద కోణంలో “పీడిత కులాల ఐక్యత” అనేది పార్లమెంటరీ రాజకీయాలకు ఉపయోగపడేదే కానీ కుల నిర్మూలన కోసం ఉపయోగపడేది కాదు. వివిధ వెనుకబడిన కులాల మధ్యా, ఆ కులాలలో అంతర్గతంగానూ ఉన్న భిన్న వర్గాల మధ్య భిన్న ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మనువాద హిందూత్వ రాజకీయాలు ఎన్నో వెనకబడిన కులాలలో పట్టు సాధించాయి. చైతన్య రాహిత్యం, హిందూత్వ ప్రచార ప్రభావం వంటివి ఇందులో చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తున్నాయనే విషయాన్ని కాదనలేం. కానీ పరస్పర భిన్న ప్రయోజనాలను, వర్గ పొందికలో వచ్చిన, వస్తున్న మార్పులను గుర్తించకపోతే మనం కుల నిర్మూలన కోసం చేసే పోరాటం సరియైన దిశలో చేయలేము.

అంతే కాదు, ఈ రోజు పాలక వర్గాలలో ఆధిపత్య పాత్ర పోషిస్తున్న దళారీ బడా బూర్జువా వర్గంలో అతి పెద్ద కుబేర పెట్టుబడిదారులలో నూటికి తొంభై మంది అగ్రకులాలకు చెందిన వారే. ఈ వర్గంతో రాజీలేని విప్లవాత్మక పోరాటం చేయకుండా వారు తమ స్థానాన్ని వాదులుకోవడానికి  సిద్ధం కారు అని కూడా తెలుసుకోవాలి. అన్ని రంగాలలో పెరుగుతున్న ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడకుండా పీడిత కులాలలోని అత్యధికులకు జీవిక, మనుగడ కూడా దుస్సాధ్యం అయిపోతాయి. ఈ విషయాలను అజెండాలోకి తీసుకొని పోరాడే దృక్పథం కానీ, కార్యక్రమం కానీ వెనుకబడిన కులాల, దళిత నాయకత్వం ఉన్న ఏ పార్లమెంటరీ పార్టీకి కూడా లేదు.

కుల ప్రాతిపదిక మీద పీడిత కులాల ఐక్యత సాధ్యం కాదు, అది వర్గ ప్రాతిపదికనే జరగాలి అని కా. ఆనంద్ తెల్తుంబ్డే చేసే వాదనలోని అంతరార్థం ఇదే.

వర్గ ప్రాతిపదికన పీడిత కులాల, వర్గాల ఐక్యత అంటే పీడిత వర్గాలు చేసే పోరాటంలో కుల ఆధిపత్యానికి సంబంధించిన అన్ని పోరాటాలను, అన్ని కోణాలలో, పార్శ్వాలలో చేసే పోరాటాలను కలిపి చేయాలి. కుల ఆధిపత్యానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేక కార్యక్రమాలతో, ప్రత్యేక నిర్మాణాలు ఏర్పరుచుకొని పోరాటం చేయాలి.

ఈ నేపథ్యంలో, నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాను చేపట్టిన విప్లవ పార్టీ కుల నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమం ఏమిటో తెలుసుకుందాం.

కుల వ్యవస్థ ఆవిర్భావం నుండి ఉత్పత్తి వ్యవస్థతో అవినాభావ సంబంధం కలిగి ఉంది. అంతే కాకుండా వేలాది సంవత్సరాలుగా నెలకొని ఉండటంతో కుల వ్యవస్థ ఉత్పత్తి వ్యవస్థకు ఆవల  కూడా ఒక సామాజిక చట్రాన్ని ఏర్పరుచుకొని ఉంది. అదే సమయంలో అది సాంస్కృతికంగా ప్రజలలో నాటుకు పోయిన ఒక భావజాల వ్యవస్థ కూడా. కాబట్టి ఈ రెండు రంగాలలో కూడా పోరాటం జమిలిగా సాగాలి. కులం హిందూ మతపు ప్రత్యేక అంశం అని విశ్లేషించుకొని ఆ మతాన్ని వదిలేస్తేనో, సాంస్కృతికంగా మాత్రమే ఎదిరించి పోరాటం చేస్తేనో పోయే అంశం కాదు. భూస్వామ్య వ్యవస్థకే కాకుండా పెట్టుబడిదారీ ప్రయోజనాలకు కూడా నేటి అవసరాలకు తగిన మార్పులతో కూడిన కుల వ్యవస్థ ప్రయోజనకరమైనదే. ఆర్థికంగా, రాజకీయంగా కూడా దానికి ఉపయోగం ఉంది. కుల వ్యవస్థలో కింది కులాలకు తక్కువ చెల్లింపులు, వెట్టి అనేది ఒక అంగీకృతమైన వ్యవస్థీకృత రూపం. అది ఎన్నో విధాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థలో తక్కువ స్థాయి పనులకు తక్కువ వేతనాలు అనేదాన్ని సులభతరం చేస్తుంది. కొన్ని రకాల పనులు – ఉదాహరణకు పారిశుధ్య పనులు, శారీరక శ్రమ అధికంగా ఉండే పనులలో కింది కులాల వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉండి అతి తక్కువ వేతనాలకు పని చేయడం మనం చూస్తున్నదే. ఈ మిగులు దోపిడీ పెట్టుబడిదారులకు ఆర్థికంగా ఎంత ప్రయోజనకారో వివరించనవసరం లేదు. శ్రామికుల ఐక్యతను దెబ్బతీసే ఏ విభజన అయినా పాలకవర్గాలకు ప్రయోజనం చేకూర్చేదే. ఆ రకంగా రాజకీయంగా కూడా కుల వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎంతో ప్రయోజనకారి. అందుకే పెట్టుబడిదారీ సంబంధాలు కూడా ఎంత పెరిగినా కులతత్వాన్ని, కుల విభజనలను, కుల వైషమ్యాలను అంత పెంచి పోషిస్తున్నాయి.

కాబట్టి నిరంతరం, అనుక్షణం ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న ఉత్పత్తి సంబంధాలను అంటే అర్ధ-భూస్వామ్య, అర్ధ-వలస సంబంధాలను నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా సమూలంగా మార్చివేయడం ద్వారానే కుల వ్యవస్థకు ఉన్న ఆధారాన్ని తొలగించిన వాళ్ళమవుతాం.  ‘భూమిని జాతీయం చేయాలి’ అని అంబేడ్కర్ ప్రకటించిన లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా మాత్రమే ‘భూమిని సామాజిక పరం’ చేయడం ద్వారా సాధ్యమవుతుంది. మొదట దున్నేవారికి భూమిని దక్కేలా చేసి రైతుల చైతన్యం పెంచడం ద్వారా సమిష్టి వ్యవసాయం, సహకార వ్యవసాయం వంటివి చేపట్టి అంతిమంగా భూమిని సామాజిక పరం చేయాలనేది నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం. ఒక్క భూమి మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థలో రోజు రోజుకూ ప్రాముఖ్యత పెరుగుతున్న పరిశ్రమలను సామాజికపరం చేయడం కూడా నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం. ఈ విధంగా ఉత్పత్తి సాధనాలను సమాజ పరం చేయడమంటే కుల వ్యవస్థకు ఆధారభూతమైన ఉత్పత్తి సంబంధాలను సమూలంగా మార్చివేయడం. అంత మాత్రానే కుల వ్యవస్థ అంతమైపోదు. ఒక సాపేక్షికమైన స్వతంత్ర చట్రంలో అది విప్లవానంతరం కూడా కొనసాగుతుంది. కాబట్టి విప్లవానంతరం కూడా సాంస్కృతిక రంగంలో, సామాజిక రంగంలో, భావజాల రంగంలో పోరాటం కొనసాగించవలసి ఉంటుంది. కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న ప్రస్తుత ఆర్థిక, రాజకీయ వ్యవస్థను సమూలంగా కూల్చివేయడం ద్వారా ఈ రంగాలలో పోరాటం సులభతరమవుతుంది. కుల వ్యవస్థ అనాదిగా చేసిన కుల వృత్తుల విభజనను కూడా కార్మిక వర్గ రాజకీయాల ఆధిపత్యంలో రద్ధు చేయడం జరుగుతుంది.  ఇప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ కుల వృత్తుల విభజనను తన అవసరాలమేరకు చాలా వరకు మార్చి వేసింది. ‘నీచమైన’ వృత్తులుగా భావించబడినా, సమాజానికి అవసరమైన పనులను ఇప్పుటికీ కింది కులాల వాళ్ళు, దళితులు మాత్రమే చేపడుతున్నారు. వీటిని వీలయినంతగా యంత్రాలతోనూ, రోబోలతోనూ చేయగల టెక్నాలజీ ఈ రోజు అందుబాటులో ఉంది. అయినా ‘భారత దేశం ప్రపంచ అగ్ర రాజ్యాల’ సరసన చేరే సత్తాను ప్రదర్శిస్తున్నదని ఊదరగొడుతున్న ఈ దేశ పాలక వర్గాలు ఆ టెక్నాలజీని, ఆ యంత్రాలను అందుబాటులోకి తేవడం లేదు. నూతన ప్రజాస్వామిక రాజ్యం వాటిని విరివిగా వినియోగంలోకి తేవడంతో పాటు, మరింత పెంపొందించేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. అంతే కాక ఈ పనులను కులాలకు అతీతంగా అందరూ చేపట్టడం అనివార్యం చేస్తుంది. దీనికి అవసరమైన వివిధ చర్యలు చేపట్టడం జరుగుతుంది. సామాజిక అంతరాలు తొలగేంతవరకు అవసరమైన మేరకు, అవసరమైనంత కాలం అన్ని రంగాలలో రిజర్వేషన్లతో సహా పలు రకాల పాజిటివ్ వివక్షా విధానాలను అనుసరిస్తుంది. ఈ రోజు మానసిక శ్రమను ఉన్నతమైన దానిగా, శారీరక శ్రమను తక్కువ స్థాయి శ్రమగా సమాజం పరిగణిస్తున్నది. కానీ శారీరక, మానసిక శ్రమలకు ఉన్న అంతరాన్ని తొలగించేందుకు కార్మిక వర్గ రాజ్యం ఆర్థిక విధానాలతో సహా అన్ని రకాల విధాన నిర్ణయాలను తీసుకుంటుంది. దానితో పాటు, మెదళ్ళలో నాటుకు పోయిన ఈ అంతరాన్ని సాంస్కృతికంగా ఎదుర్కొని మార్చడానికి కూడా సకల ప్రయత్నాలను చేస్తుంది. పరువు హత్యల పేరుతో ఈరోజు జరుగుతున్న కులోన్మాద, మతోన్మాద హత్యలను నేటి రాజ్యం కూడా పరోక్షంగా ప్రోత్సహించడమో, చూసీ చూడనట్టు వదిలెయ్యడమో జరుగుతున్నది. కానీ కార్మిక వర్గ రాజ్యం ఇటువంటివి జరగకుండా అన్ని రకాల రక్షణాలను కల్పించడమే కాకుండా కులాంతర, మతాంతర వివాహాలను క్రియాశీలకంగా ప్రోత్సహిస్తుంది. అవి అతి సాధారణమైన వాటిగా మారేందుకు అవసరమైన అన్ని భావజాలపరమైన, సాంస్కృతిక పరమైన బ్రాహ్మణవాద, మనువాద వ్యతిరేక ప్రచారం, చర్యలు చేపడుతుంది. కులాంతర వివాహాలు సర్వ సాధారణం కావడమే కుల వ్యవస్థ సంపూర్ణ నిర్మూలన జరిగిందనడానికి సంకేతం.

ఈ పనులన్నీ చేయడానికి ప్రభుత్వంలోనూ, అన్ని ప్రభుత్వ, పార్టీ విభాగాలలోనూ, ప్రజా సంఘాలలోనూ, ఉత్పత్తి యూనిట్ల లోనూ ప్రత్యేక నిర్మాణాలను ఏర్పరుస్తుంది.

ఈ విధంగా –

కుల వ్యవస్థకు భౌతిక ప్రాతిపాదక ఐన ఉత్పత్తి వ్యవస్థను మార్చడం – అంటే దున్నే వారికే భూమి ప్రాతిపాదకగా భూ పంపకం చేసి, దళారీ బ్యూరాక్రటిక్ బడా పెట్టుబడిదారుల పరిశ్రమలనాన్నింటినీ సామాజిక పరం చేయడమే కాకుండా వాటి నిర్వహణ కూడా నిజమైన అర్థంలో కార్మిక వర్గమే చేపట్టే చర్యలను చేపట్టడం

కులానికి ఉత్పత్తి వ్యవస్థలో ఉన్న భౌతిక ప్రాతిపదికతో పాటు సామాజిక, సాంఘిక సంబంధాల సమాహారంగా ఒక సాపేక్షమైన స్వతంత్ర అస్తిత్వం ఉండి కొనసాగుతూ ఉంటుంది. ఆ సామాజిక చట్రాన్ని బద్దలు కొట్టేందుకు అవసరమైన చట్టబద్దమైన చర్యలను చేపట్టడం

దానితో పాటు భావజాల, సాంస్కృతిక, సామాజిక, సాహిత్య, భాషా క్షేత్రాలలో మార్పులు తీసుకువచ్చి కుల వివక్షను, కుల అంతరాలను రద్ధు చేయడం

వృత్తులు కులాలకు అతీతంగా సార్వజనికం కావడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం

శారీరక, మానసిక శ్రమలకు మధ్య, వివిధ శారీరక శ్రమల మధ్య, మానసిక శ్రమల మధ్య  అంతరాన్ని తొలగించి, సమానమైన విలువను స్థాపించడం

‘మురికి’ని శుభ్రం చేసే పనులను సామాజిక బాధ్యతగా విధిగా అందరూ చేయాలనే నియమం చేసి శ్రమ పట్ల గౌరవం పెంచడమే కాక, ‘మురికి’గా భావించే పనులు కింది కులాల వాళ్ళే చేస్తున్న అనివార్య పరిస్థితిని రద్దు చేయడం

గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ కొనసాగుతున్న ఊరు-వాడ విభజనను, పట్టణాల్లో కూడా ఇతర రూపాల్లో కొనసాగుతున్న ఇటువంటి విభజనను (సెగ్రెగేషన్) ను రద్దు చేసే చర్యలు చేపట్టడం

ఈనాడు కొనసాగుతున్న రకరకాల అంతరాల విద్యా వ్యవస్థను రద్ధు చేసి ఏక రూప, వైజ్ఞానిక విద్యా వ్యవస్థను నెలకొల్పడం

కులాంతర వివాహాలు చాలా సాధారణమైనవిగా పరిణమించేటట్టు అన్ని చర్యలను చేపట్టడం

విప్లవానంతరం కూడా కొనసాగవలసిన సాంస్కృతిక విప్లవంలో కుల నిర్మూలనను ఒక ప్రధానమైన అజెండాగా చేపట్టడం ద్వారానే కుల నిర్మూలన సాధ్యం.

కుల నిర్మూలన జరగాలంటే ఇంత సుదీర్ఘ పోరాటం అవసరం.

కాబట్టి కుల నిర్మూలన జరిగితేనే విప్లవం సాధ్యమవుతుంది అనే వాదన ఏ మాత్రం సరియైన వాదన కాదు. అది బండిని ముందు, ఎడ్లను వెనక కట్టేసినట్టు అవుతుంది. విప్లవం ద్వారా కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను కూలదోసినప్పుడే, కుల సామాజిక చట్రాన్ని కూల్చగలగడం సాధ్యమై కుల నిర్మూలనకు ప్రాతిపదిక ఏర్పడుతుంది.

దీని అర్థం ఈ రోజు కుల నిర్మూలనకై పోరాడకుండా విప్లవం విజయవంతం అయ్యేవరకు వాయిదా వేయడమని కాదు. ఈ రోజు కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, భావ పరమైన

విప్లవ పోరాటకాలంలో కులం పై పోరాటం:

కులాలకు అతీతంగా శ్రామిక ప్రజలందరి ఐక్యతను సాధించకుండా విప్లవం విజయవంతం కానే కాదు. అగ్రకులాలకు చెందిన వారితో సహా విభిన్న కులాలకు చెందిన రైతులు, కార్మికులు, ఇతర శ్రామికులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, చిన్న పారిశ్రామికవేత్తలు, ఆదివాసీలు నేటి అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్థలో పీడితులే. మన దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఆర్థిక సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగేకొద్దీ వారిపై దోపిడీ పీడనలు మరింత పెరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడటంలోనే వారి ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి.    ఈ ప్రయోజనాలే కులాలకు అతీతంగా విభిన్న కులాలకు చెందిన పీడిత ప్రజలు వర్గ ప్రాతిపదికన పోరాడటానికి కావలసిన ప్రాతిపదికను ఏర్పరుస్తున్నాయి. పెంచుతున్నాయి. విప్లవోద్యమం కులాలకు అతీతంగా ఇట్లా పీడితప్రజల ఐక్యతను గణనీయంగా సాధించిందనేది ఒక వాస్తవం. అది విప్లవోద్యమం సాధించిన ఒక ఘనమైన విజయం కూడా. రైతు కూలీ సంఘాల, యువజన సంఘాలలోనూ, ఇతర ప్రజా సంఘాలలోనూ పీడిత కులాలకు చెందిన వారి నాయకత్వంలో ఈ ఐక్యతను సాధించడం మరింత గొప్ప విజయం. పీడిత వర్గాల, కులాల పోరాటాలకు మద్దతుగా అన్ని కులాలకు చెందిన ప్రజాస్వామిక వాదులను సమీకరించగలిగిందనేది కూడా అంతే వాస్తవం. విప్లవ పార్టీ యూనిట్లకు పీడిత కులాలకు చెందిన వారు నాయకత్వం వహించినప్పుడు కూడా అది సర్వజన ఆమోద నాయకత్వంగానే అభివృద్ధి చెందింది. వర్గ ప్రాతిపదికన పీడిత కులాల ఐక్యత సాధ్యమే అనడానికి, అట్లా మాత్రమే పీడిత కులాల నాయకత్వం సాధ్యం అనడానికి విప్లవోద్యమ ఆచరణే రుజువు. ఇదంతా  ఒక కోణం కాగా శ్రామిక ప్రజలను ఐక్యపరచడంలో ప్రాంతీయ, జాతిపరమైన, మతపరమైన, తెగల పరమైన అడ్డంకులతో పాటు కుల అంతరాలు కూడా అతి ముఖ్యమైన ఆటంకం అనేది నిర్వివాదాంశం. ఈ అంతరాలకు, వివక్షకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా పోరాటం చేయడం అనివార్యం. ఆ పోరాటంలో విభిన్న అస్తిత్వ ఉద్యమాలు ముందుకు తీసుకు వచ్చిన ఆలోచనలలో, భావాలలో సరియైన వాటిని స్వీకరించాలి. అప్పుడే సైద్ధాంతికంగానూ, ఆచరణలోనూ కుల నిర్మూలనా కార్యక్రమాన్ని పదునుపెట్టుకోగలం. అదే సమయంలో శ్రామిక ప్రజలందరి ఐక్యతకు, నూతన ప్రజాస్వామికవిప్లవానికి  అడ్డం వస్తూ వర్గ పోరాటాన్ని, వర్గ దృక్పథాన్ని తోసిరాజనే  విభిన్న ‘పోస్ట్’ వాదాలను, అస్తిత్వ వాదాల లోని ‘అతివాద, తీవ్ర వాద ధోరణులను’ తిరస్కరిస్తూ ముందుకు పోవాలి. విప్లవ లక్ష్యంతో పోరాడే వివిధ ప్రజాసంఘాల పోరాటకారులలో, విప్లవకారులలో కులతత్వం, కులాధిపత్య ధోరణులు లేకుండా సంస్థాపరంగానూ, వ్యక్తిగతంగానూ, ఆయా కుటుంబాల పరంగానూ పోరాటం ఈ విప్లవోద్యమ కాలంలోనే తక్షణమే జరుగుతూ ఉండవలసినదే. అయితే వ్యవస్థాగత మార్పులు జరగకుండా ఇట్లా జరిగే పోరాటాలకు పరిమితులు ఉంటాయని కూడా గుర్తెరిగి ఉండాలి. లేకపోతే ఇది వ్యక్తుల వైయక్తిక మార్పుతో లేదా సాంఘిక, సామాజిక తలంలో మాత్రమే చేసే పోరాటంతో జరిగిపోయే విషయమని భ్రమపడే అవకాశం ఉంది. 

1990ల తరువాత మండల్ కమిషన్ అమలు, బహుజన సమాజ్ పార్టీ బలం పుంజుకోవడం, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో అధికారం చేపట్టడం, బీహార్, యూ‌పి లలో ఆర్‌జే‌డి, జనతా దళ్, సమాజ్ వాదీ పార్టీలు వెనుకబడిన కులాల నాయకుల నాయకత్వంలో అధికారం చేపట్టి అప్పటి దాకా ప్రధానంగా రాజకీయ అధికారాన్ని చెలాయిస్తున్న బ్రాహ్మణ, రాజ్ పుత్, కాయస్థ తదితర అగ్రకులాల రాజకీయ ప్రాబల్యాన్ని కూలదోయడంతో పార్లమెంటరీ రాజకీయాల ద్వారా బహుజనులు, దళితులు అధికారాన్ని చేపట్టవచ్చనే అభిప్రాయం, భ్రమ బలపడ్డాయి. బి‌ఎస్‌పి ఉత్తరప్రదేశ్ లో తప్ప మరెక్కడా అధికారాన్ని చేపట్టలేకపోయింది. ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఎక్కువ శాతం దళితులు ఉన్న పంజాబ్ లో (స్వయంగా కాన్షీరాం పంజాబ్ కే చెందిన వాడైనప్పటికీ) బి‌ఎస్‌పి ఎటువంటి రాజకీయ ప్రభావం వేయలేకపోయింది. ఉత్తరప్రదేశ్ దళితులలో ఉన్న ప్రత్యేక కుల పొందిక (జాతావులు పెద్ద సంఖ్యలో ఉండటం, మాయావతి జాతావులకు చెందిన వ్యక్తి కావడం) దీనికి కారణమని ఆనంద్ తెల్తుంబ్డే అంటాడు. ఏదేమైనా అట్లా అధికారం చేపట్టి కూడా కనీసం దళితుల జీవితాలలో కూడా ఏ మాత్రం గణనీయమైన మార్పును బి‌ఎస్‌పి తీసుకురాలేకపోయింది. ఇప్పుడున్న అర్ధ-భూస్వామ్య; అర్ధ-వలస వ్యవస్థను మార్చకుండా అటువంటి మార్పు సాధ్యం కాదు. ఆ వ్యవస్థతో రాజీ పడకుండా, దానికి సేవ చేయకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంటరీ అధికారాన్ని చెలాయించడం కూడా సాధ్యం కాదు. అందుకు పాలకవర్గాలు అనుమతించవు. అందుకే ఇటువంటి అధికారంతో సంఖ్యా బలం అధికంగా ఉన్న కొన్ని వెనుక బడిన కులాలు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఒకటి రెండు మెట్లు పైకి ఎక్కగలిగాయి కానీ, అవేవీ కుల నిర్మూలన కోసం ఇసుమంతైనా పని చేయడం లేదు. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుల తత్వాన్ని మరింత పెంచి పోషిస్తూ ఉన్నాయి. పైగా ఈ పార్లమెంటరీ అధికారానికీ, రాజ్యాధికారానికీ మధ్య ఉన్న తేడా పట్ల వీటికి పట్టింపే లేదు. పరిమిత ప్రయోజనాలతో పని చేసే ఈ పార్టీలు ఆ తేడాను గ్రహిస్తాయనికానీ, గ్రహించి అందుకనుగుణంగా దళిత, బహుజనుల నిజమైన రాజ్యాధికారం కోసం పని చేస్తాయనికానీ ఆశించలేము. ఆ ధీమా ఉండబట్టే ప్రధానంగా అగ్రకులాలకు చెందిన దళారీ బడా బూర్జువా వర్గమైనా, భూస్వామ్య వర్గమైనా, పెట్టుబడిదారీ రైతులైనా దళిత బహుజనులలోని ఒక సెక్షన్ ను తమలో ఇముడ్చుకోవడానికి ఆమోదం తెలుపుతున్నాయి. ఆ విధంగా కలుపుకోవడం ద్వారా దళిత బహుజనులలో పార్లమెంటరీ విధానం పట్ల భ్రమలను చిరకాలం నిలిపి ఉంచుకోవచ్చని వాటి అంచనా.

పాలకవర్గాలలో ఒక భాగం కావాలనుకుంటున్న దళిత, బహుజనుల పార్టీల, సంస్థల, వ్యక్తుల ప్రయోజనాలు వేరే. వారిని వదిలేస్తే కుల నిర్మూలన జరగాలన్న అంబేడ్కర్ ఆశయాన్ని మనస్ఫూర్తిగా వాంఛించే వ్యక్తులు, సంస్థలు; కుల నిర్మూలనతో పాటు, శ్రమ దోపిడీతో సహా సకల దోపిడీలు సమాప్తమై సమసమాజం నెలకొనాలని నిజాయితీగా ఆశించేవారు మాత్రం అందుకు మార్గం పార్లమెంటరీ పంథా కాదనీ, నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాయేననీ గ్రహించాలి. తద్వారా మాత్రమే పీడిత వర్గాలే కాదు, పీడిత కులాలు కూడా నిజమైన రాజ్యాధికారాన్ని చేపట్టగలవని గ్రహించాలి. పీడిత కులాల వైపు నుండి అవసరమైన నిశితమైన సంభాషణ, విమర్శ కొనసాగిస్తూనే నూతన ప్రజాస్వామిక విప్లవంలో, ఆ విప్లవం ఏర్పరిచి కొనసాగించే నిర్మాణాలలో అంతర్భాగం కావాలి.

సాయుధ ప్రతిఘటన ప్రాముఖ్యత:

మన దేశంలో డెబ్భైల నాటికి, ఎనభైలు-తొంభైల నాటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్యం భూస్వాములదే. అందులో ప్రధానంగా ఉన్నది అగ్రకులాలకు చెందిన భూస్వాములే. దళితులలో, వెనుకబడిన కులాల శ్రామికులలో, అగ్రకులాలకు చెందిన శ్రామికులలో తమ హక్కుల పట్ల చైతన్యం కలిగి భూస్వాముల ఆధిపత్యాన్ని ప్రశ్నించినప్పుడు తమ ఆర్థిక బలాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని, రాజ్యాధికార అంగాలపై తమకున్న పట్టును, తమ అంగ బలగాన్ని వినియోగించుకొని దేశంలో అనేక చోట్ల భూస్వాములు క్రూరమైన దాడులు జరిపారు. తమిళనాడులోని కీలవేన్మణి మొదలుకొని కారంచేడు, చుండూరు, లక్షింపేటలలో, బీహార్ లోని బెల్చి, పిప్రా తదితర గ్రామాలలో, ఇంకా అనేక రాష్ట్రాలలోని అనేక గ్రామాలలో అత్యంత పాశవికమైన మారణకాండలు జరిపారు. బీహార్ లోనైతే రాజ్య ప్రోత్సాహ ప్రోద్బలాలతో ఎన్నో ప్రైవేట్ సేనలను స్థాపించుకొని మారణకాండలు చేశారు.  తెలంగాణలోని పల్లెలల్లో గడీలలో, గడీల బయటా వారు జరిపిన అకృత్యాలకు లెక్కే లేదు. ఆ దాడులను వీరోచితంగా ప్రతిఘటించింది ప్రధానంగా విప్లవోద్యమమే. పోరాటాన్ని కోర్టుల చుట్టూ, చట్టబద్ద పోరాటానికి మాత్రమే పరిమితం చేయకుండా అవి చేస్తూనే వాటికి ఉన్న పరిమితులను కూడా గుర్తింపజేస్తూ సాయుధ, మిలిటెంట్ పోరాటాలను కూడా విప్లవోద్యమం చేపట్టింది. సాయుధ ప్రతిఘటనతో సహా ఈ అన్ని పోరాటాలలో కులాలకు అతీతంగా అన్ని కులాలకు చెందిన విప్లవకారులు తమది వర్గ బంధమే కానీ సంకుచిత కుల బంధం కాదని ఆచరణ ద్వారా తమ జీవితాలను ఆ పోరాటాలకు అర్పించి నిరూపించారు. అన్ని పోరాటాలలో దళిత, బహుజనులను సమీకరించడంతో పాటు ఆ పోరాటాలకు సంఘీభావంగా అన్ని కులాల ప్రజాస్వామిక వాదులను ఐక్యం చేయగలిగారు. కుల నిర్మూలనకు దారులు వేసేది సకల కులాలకు సంబంధించిన వారు చేసే ఇటువంటి సంఘటిత పోరాటాలే. ఆ పోరాటాలే ఆ భూస్వాముల దాడులకు, దురాగతాలకు చెక్ పెట్టగలిగాయి. చట్టబద్ద పోరాటాలు చేస్తూనే, చట్టబద్ధ పోరాట పరిమితులను దాటి పోరాటాలు చేస్తేనే దళిత, బహుజనుల, ఇతర శ్రామికుల, ఆదివాసీల హక్కులను కాపాడుకోగలుగుతాము.

ఆచరణలో పీడిత కులాల నాయకత్వం:

నక్సల్బరీ పోరాట కాలం నుంచి కూడా ప్రజా రాజ్యాధికార అంగాలను నిర్మించినప్పుడు వాటికి ప్రధానంగా నాయకత్వం భూమిలేని రైతులు, కూలీలు, పేదరైతులు వహించాలనే విధానం అమలులో ఉండేది. అందువల్ల వేలాది గ్రామాలలో ఏర్పడిన విప్లవ రైతాంగ కమిటీలకు, ప్రజా రాజ్య కమిటీలకు, విప్లవ ప్రజా కమిటీలకు; ఇవి ఏర్పడక ముందు రైతు కూలీ సంఘాలకు దళితులు, వెనుకబడిన కులాల నుండి వచ్చిన వారే ఎక్కువగా నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో ఆయా కమిటీలు చేసిన నిర్ణయాలు గ్రామాలలోని అగ్రకుల భూస్వాములకైనా శిరోధార్యం అయ్యాయి. చరిత్రలో మొదటి సారి ఆ విధంగా అసంఖ్యాక గ్రామాలలో దళితుల, వెనుకబడిన కులాల బడుగుల చేతిలో అధికారం కేంద్రీకృతమయ్యింది. దానిని సుసాధ్యం చేసింది విప్లవోద్యమమే.

విప్లవోద్యమంలో నాయకత్వంలో పీడిత కులాల భాగస్వామ్యం కూడా ఈ ఐదారు దశాబ్దాల కాలంలో ఏ ఇతర పార్లమెంటరీ లేదా వామ పక్ష పార్టీలతో పోల్చినా చాలా గణనీయంగా పెరిగింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలలోనే కాక కేంద్ర స్థాయిలో కూడా దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల నేపథ్యం నుండి వచ్చిన వారి సంఖ్య, అనుపాతం బాగా పెరిగింది. విప్లవోద్యమానికి అనుబంధ సంఘాలు అని ఆరోపరణను ఎదుర్కొంటున్న ప్రజా సంఘాల నాయకత్వంలో కూడా పీడిత కులాల నుండి వచ్చిన నాయకత్వమే ఎక్కువ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ‘కులం- విప్లవోద్యమ అవగాహన, ఆచరణ’ అనే మరో వ్యాసంలో ఉన్నాయి.

పై అవగాహన, ఆచరణల నేపథ్యంలో విశ్లేషించినప్పుడు నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గాన మాత్రమే కుల నిర్మూలన సాధ్యం. పార్లమెంటరీ పంథాలో కాదు.

One thought on “కుల నిర్మూలన – నూతన ప్రజాస్వామిక విప్లవం

  1. విప్లవ పోరాటకాలంలో కులం పై పోరాటం:
    ——————————————————-
    వ్యాసంలో పై సబ్ హెడ్డింగ్ పైన వాక్యం సంపూర్తిగా లేదు. దాన్ని సరి చేయగలరు లేదా పరిహరించగలరు. ఈ వ్యాసంలో చర్చించిన కుల నిర్మూలన మార్గం ఆచరణలో పెట్టటానికి కావలసిన ఆచరణాత్మక సాధనాలను, రాజకీయ కోణంలో ఆలోచన చేసి, కార్యకర్తలకు రోజువారి జీవితంలో వాటిని అమలుపరిచే విధంగా తయారు చేయాలి.

Leave a Reply