మహమూద్‌ నాకెంతో ఇష్టమైన కవుల్లో ఒకడు. ఆ మాటకొస్తే సొంత ఊరు వాడు కాబట్టి ఇంకాస్త ఎక్కువే ఇష్టం. మహమూద్‌ని నేను మొదటి సారి 1999 -2000 ప్రాంతంలో  ప్రొద్దుటూరుకు వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అప్పటి నుంచి నాకు అతనితో సాన్నిహిత్యం ఉంది. నాకు మహమూద్‌ అంటే మిత్రజ్యోతి సంస్థ వ్యవస్థాపక సభ్యుడు.  “సీమ కవిత’’ సంకలనం ఎడిటర్‌. “మిష్కిన్‌’’ కథా రచయిత. ఇప్పుడు “ఆస్మాని’’ కవి.
కవిగా, కథకుడిగా, కార్యనిర్వాహకుడిగా సీమ సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేసినవాడు. అక్కడి ఒక తరానికి స్ఫూర్తినిచ్చినవాడు. క్షణం క్షణం పొట్ట తిప్పల కోసం పాకులాడుతూనే మరోవైపు తాను పుట్టిన గడ్డ కోసం, సమాజం కోసం పరితపించినవాడు. కీర్తి కోసం కాకుండా నిజాయితీగా బడుగు, బలహీన వర్గాల తరపున స్వరాన్ని వినిపించినవాడు. నాకు తెలిసిన మహమూద్‌ ఇంకా ఉన్నాడు కానీ ఇప్పుడు అంత లోతుకు వెళ్లను. అయితే అతనిలో నాకు తెలియని మరో వ్యక్తిని పరిచయం చేసుకునే ప్రయత్నంలోనే ఈ ఇంటర్వ్యూ…


అన్నా నమస్తే..
1. “ఆస్మాని” పుస్తకం విరసం ప్రచురణగా రావడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?
           

నేను పూర్తిగా విరసం భావజాలంతో ఏకీభావం ఉన్నవాణ్ణి. కాకపోతే పర్సనల్ కారణాల వల్ల విరసం సభ్యత్వం తీసుకోలేదు. మూడునాలుగేళ్ళ క్రితం మాట నా పుస్తకం రావల్సిందే అని కథకుడు,  కవి నాకిష్టమైన సాహితీ మిత్రులలో ఒకడైన వెంకటకృష్ణ, ప్రొద్దుటూరు విరసం సభ్యుడు రవి నా దగ్గరికి వచ్చారు. నీ పుస్తకం రావాల్సిందే అని పట్టుబట్టారు. నా పుస్తక భారం ఇతరుల మీద వేయడం నాకిష్టం లేదు. నా దగ్గర పుస్తకం వేసుకునేంత డబ్బులూ లేవు. ఒకవేళ ఉండి ఉంటే ఇరవై ఏళ్ళ కిందట నా పుస్తకం వచ్చి ఉండేది. వెంకటకృష్ణ నా పుస్తకం కోసమే పదుల సార్లు ఫోను చేసేవాడు. నా అలసత్వం కొంతా మిగతా నా సొంత పనుల వత్తిడి కొంతా పుస్తకం ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ తర్వాత వెంకటకృష్ణ, పాణి ఇద్దరూ కలిసి నన్ను ఇంకా ఒత్తిడి చేయడం మొదలెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి మాటాడుకొని విరసం ప్రచురణగానే ఈ పుస్తకాన్ని తీసుకొని రావాలని నిర్ణయించారు.
ఈ పుస్తకం రావడం వెనుక నా శ్రమ బొత్తిగా లేదు. వెంకటకృష్ణ, విరసం మిత్రుల వల్ల ఈ పుస్తకం వచ్చింది.


2. నీ సాహిత్యాన్ని ఎవరైనా ముస్లిం అస్తిత్వ సాహిత్యం అంటే అభ్యంతరాలు ఉన్నాయా?
        

ముస్లీం అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన వేళ ప్రతి ప్రగతిశీల కవి వారి పై జరుగుతన్న హింస వివక్షతల గురించి రాయకుండా ఎలా ఉంటాడు? మైనారిటీ సమూహాల పై వివక్ష, హింస ప్రపంచవ్యాపితంగా ఉంది.  మొత్తంగా చూసినప్పుడు నాది అంతర్జాతీయ మానవ హక్కుల దృక్కోణం గా చూడవచ్చు. అందులో భాగంగానే నా ముస్లీం అస్తిత్వం అనడం సబబుగా ఉంటుందా? కాకపోతే మన తెలుగులో ముస్లీంవాద సాహిత్యం ఒక అస్తిత్వవాదంగా స్థిరపడింది. ఒక రకంగా అది ముస్లీం జీవితం గురించి గొప్ప సాహిత్యం రావడానికి కారణమైంది. అందులో వారు నన్ను భాగం చేసుకున్నారు. అంత వరకూ నాకు అభ్యంతరం లేదు. మౌలికంగా నాది విప్లవ దృక్ఫధం. అది లేకపోతే నేను లేను. ఆ రకంగా నన్ను ముస్లీం అస్తిత్వవాదిని అనలేను కదా? ఈ విషయం పాణి ముందు మాటలో బాగా వివరించారు.


3. సూఫీతత్వంతో నీకెందుకంత గాఢత ఉంది? నీ పుస్తకంలోని మొదటి కవిత “బహుమానం’’ ఆ గాఢతను పట్టిస్తుంది కదా?
        

చాలా ఏళ్ళ కిందట దీవి సుబ్బారావు గారు సూఫీకవిత్వం పై ఓ అనువాద సంకలనం తెచ్చారు. ఆ పుస్తకంలో రూమి వంటి పర్షియన్ సూఫీ కవుల కవిత్వం ఉంది. అది ఒక రకంగా నాకు చోదకశక్తిగా పని చేసింది. వివి ద్వారా చాలా సందర్భాల్లో సూఫీల మానవ ప్రేమ గురించి మాట్లాడడం విన్నాను. సూఫీలు ఒక గొప్ప ప్రేమ సంస్కృతిని భారతదేశానికి ఇచ్చారు. ఈ రోజు కూడా దర్గాలు హిందూ, ముస్లీం కలయికకు కేంద్రంగా ఉన్నాయి. ఇప్పుడు విరసం చెబుతున్న కౌంటర్ కల్చర్ లో భాగంగా అటు ఆదీవాసీల మూల సంస్కృతినీ, ఇటు సూఫీల తాత్వికతనీ, అటు బౌధ్ద ప్రవచనాలనీ, ఇంకా చెప్పాలంటే మనదైన ద్రవిడ ఆలోచనావిధానాన్నీ బిజెపి అవలంబిస్తున్న బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతికి విరుడుగుడుగా ముందుంచవచ్చు అనుకుంటున్నాను. ముస్లీంల సంస్కృతి సూఫీ సంస్కృతి అని చెప్పడం అవసరం. నీ కథలలో చాలా వాటిలో కూడా దీనిని చూడవచ్చు కదా. మొఘలుల రాచరికాన్ని ముస్లీంలకు అంటగట్టడం ద్వారా సాంస్కృతిక ద్రోహానికి పాల్పడుతున్న బిజెపిని ఈరకంగా కూడా మనం ఎదుర్కోవచ్చు. సూఫీల ప్రేమ సంస్కృతి ఈ దేశ ప్రజలను సంఘటితపర్చడానికి ఉపయోగపడుతుంది.


4. అసలు నువ్వు ఏమి రాయాలని మొదలయ్యావు? ఏమి రాస్తున్నావు? కవిగా నీ పరిణామ క్రమం పట్ల నీకు సంతృప్తి ఉందా?
          

కవి గానీ రచయిత గానీ ఎప్పుడూ సంతృప్తిపడకూడదు. తన రచన పట్ల నిర్మమకారం ప్రదర్శించాలి. నేను అభ్యుదయంతో మొదలయ్యి, సంపూర్ణ విప్లవ వికాసం వైపుకు మరలినాను. విప్లవోద్యమం నిర్దేసించే దశ దిశలోనే ప్రయాణిస్తూ వర్గపోరాట మౌలిక ‌దృక్ఫధంతోనే రాయడానికి పూనుకున్నాను. ప్రజలే నా హీరోలు వారి ఆరాటపోరాటాలనే నావస్తువులుగా తీసుకొని రాద్దామనుకున్నాను. ఆ రకంగా నా పరిణామక్రమం సరైన దిశలోనే నడిచిందని అనుకుంటున్నాను. కాకపోతే ఇటీవల కొంత ప్రేమ కవిత్వం కొంత పర్సనల్ కవిత్వం కూడా రాస్తున్నాను. ఇది కూడా పరిణామంలో భాగమే! ఆ రకంగా నా ప్రయాణం సంతృప్తికరమే!



5. కథల కన్నా ఎక్కువ కవిత్వం మీదే ఎందుకు గురి కుదిరిందో చెప్పగలవా?
      

2002 నుంచి 2016 మధ్య కాలం నా జీవితంలో అత్యంత కఠినంగా గడిచింది. కథ రాయలేకపోవడానికి ఈ గ్యాప్ కారణమైంది. ఆ సమయంలో ఏమీ రాయలేకపోయాను, చదవలేకపోయాను. ఇది నిజానికి ఒక స్పష్టమైన రాజకీయ సైద్ధాంతిక దృక్ఫధం ఉన్న రచయిత పరాజయం పొందడమే! ఆ రకంగా నేను దాదాపు సాహిత్య ప్రపంచం నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఉండింది. ఆ సమయంలో కవిత్వం నా సమస్యలతో పోరాడగలిగే నైతిక చైతన్యాన్ని ఇచ్చింది. ఇక్కడా మళ్ళీ నీలాంటి వెంకటకృష్ణ లాంటి వారి వల్ల కొంత బయటపడగలిగాను. విరసం నా పక్కన ఎప్పుడూ ఉంది.


6. సాహిత్యంలో నీకు స్ఫూర్తి ఎవరు? కవిగా నీ తొలిరోజుల గురించి చెబుతావా?
     

 మా ఇంట్లో సాహిత్య వాతావరణం కొంత ఉంది. మానాయన హిందూ పేపర్ చదివే వాడు. మా ఇంటికి చందమామ వచ్చేది. పదవ తరగతిలో భేతాళ కథలు ఇష్టంగా చదువుకున్న. మా అన్న యధ్ధనపూడి వీరాభిమాని. అలా నవలలు చదవడం మొదలయ్యింది. తర్వాత యండమూరి, మల్లాది మాయలో పడ్డాను. దీని నుంచి బయపడడానికి మా బావ కథా రచయిత దాదాహయాత్ కారణం. డిగ్రీ చదివే సమయానికి మహాప్రస్థానం, తిలక్ అమృతం కురిసిన రాత్రి పరిచయం కవిత్వం పట్ల ఇష్టాన్ని పెంచింది. ఆ తర్వాత 1993 సమయంలో మిత్రజ్యోతి సాహితీ సాంస్కృతిక సంస్థ పరిచయం నా జీవితంలో మేలి మలుపు. అందులో సభ్యుడిగా చేరి తర్వాత చురుకుగా కార్యక్రమాలలో పాల్గొన్నాను. 1998 లో మమ్మల్ని కలవడానికి పాణి, శ్రీనివాసమూర్తి ప్రొద్దుటూరు వచ్చారు. అప్పడప్పుడే నా కవితలు ఆహ్వానం, సాహిత్య నేత్రం లో అచ్చయ్యాయి. అప్పటి నుంచి మిత్రజ్యోతి, విరసం కలిసి కార్యక్రమాలు మొదలయ్యాయి. అలా కవిత్వం రాయడం ఆరంభమైంది. ఆహ్వానంలో వచ్చిన నా కవిత “నెత్తుటి బిడ్డలు” నా మిత్రులకు చాలా ఇష్టం‌. ఈ సారి సంకలనం వేసుకుంటే ఆ కవితని తప్పకుండా చేరుస్తా!


7. నీకు సాయంత్రాల పట్ల బెంగ ఎందుకు? ముఖ్యంగా ముస్లిం వాడల్లోని సాయంత్రాల అందమంతా నీ కవిత్వంలో కనబడ్డానికి కారణమేంటి?
       

మా వాడలు ఆమలిన ప్రేమికులకు నిలయాలు. ఈ విషయాన్ని చాలా మంది ఇప్పటికీ గుర్తించలేదు. అమాయకపు ప్రేమలు మా మొహాల్లాల్లో వెన్నెల్లా వికసిస్తాయి. ముస్లీం వాడల నుంచి ఎంత గాలీబులు పుట్టారో లెక్క లేదు. ఇదొక సాంస్కృతిక విషయం. ముస్లీంలు కష్ట జీవులని నీకు తెలియంది కాదు. పొద్దంతా కష్టపడి సాయంకాలం వేళల్లోనే కదా ప్రేమికులు సెదదీరేది. ఎంత గొప్ప ప్రేమ త్యాగాలవి. ఇంకా చాలా రాయాలని ఉంది‌. ముస్లీం పేదవాడల మీదుగా పరుచుకునే సాయంకాలాల గురించి.


8. ఈ పుస్తకంలో ఉన్న “దేశీయుడి కళ’’ కవిత గురించి చెబుతావా?
      

మా ఊరు ప్రొద్దుటూరుకు సిరిపురి అని పేరు కూడా ఉంది. బంగారు నగల వ్యాపారానికి మా ఊరు ప్రసిధ్ధి. రాయలసీమ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆభరణాల కోసం మా ఊరికి వస్తారు. ఇందులో పెట్టుబడిదారులు వైశ్యులు, కార్మీకులు ముస్లీంలు, ఆచార్లు ఉన్నారు. సింహభాగం కార్మీకులు ఇప్పటికీ ముస్లీంలే! గమ్మత్తైన విషయం ఏమంటే ఈ మార్కెట్ పరిసరాల్లోనే ఆంజనేయ స్వామి గుడి, అమ్మవారిశాల, చౌసేన్ హుసేన్ సాహెబ్ దర్గా ఉన్నాయి. కనీసం వంద సంవత్సరాల మతసామరస్యానికి ప్రతికగా ఈ షరాఫ్ బజారు ఉంది. ఇంకో ఆర్థిక పార్శ్వం ఏమంటే ఎనభైల దశకం నుంచి ముస్లీంల గల్ఫ్ వలస మొదలైంది. సౌది అరేబియా నుంచి సేఠ్ లు వచ్చి ఇక్కడ బంగారు కళాకారులను తిసుకెళ్ళడం మొదలైంది. అలా కొంత మందికి సంపద ఒనగూడింది. తిరిగి వచ్చి ఇక్కడే సొంత షాపులు ఏర్పాటు చేసుకునే స్థాయికి కొంత మంది ముస్లింలు ఎదిగారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఈ సామరస్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే దేశీయుడి కళలో చెప్పడానికి ప్రయత్నించాను. వైశ్యులు ముస్లీంల మధ్య గట్టి సంబంధాల వల్ల మా మార్కెట్ లోకి గుజరాత్, మహారాష్ట్ర నుంచి జైనులు ఇక్కడ పాగా వేయలేకపోయారు. కానీ కడపలో మాత్రం వైవి స్ట్రీట్ లో జైనులు బలమైన ఆర్థిక పరిపుష్టి సాధించారు.


9. పొద్దుటూరు ప్రాంతంలో మిత్రజ్యోతి ఒకప్పుడు చాలా చురుకైన సాహిత్య సంస్థ.. తర్వాతి రోజుల్లో అది ఆ చురుకుదనం కోల్పోవడానికి కారణం ఏంటి?
       

మిత్రజ్యోతి సాహితీ సాంస్కృతిక సంస్థ చాలా గొప్ప సాహిత్యసేవ చేసింది. అప్పటికి సాహిత్య సభల నిర్వహణలో ఉన్న ఫ్యూడల్ లక్షణాలకు భిన్నమైన ఆధునిక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాం. మా సంస్థలో నేనూ, బాష, దాదాఖలందర్ రెబెల్స్ గా మారాం. ఇది కేవలం ఒక సాహిత్య సంస్థగా ఉంచడం మాకిష్టం లేదు. దీనిని వర్గదృక్ఫధం కలిగన సాహిత్య సంస్థగా మార్చడం మా ఉద్దేశ్యం. దీని వల్ల చాలా మంది సభ్యులు సంస్థను విడిచి వెళ్ళిపోయారు. 2000 లో జరిగన ప్రొద్దుటూరు విరసం సాహిత్య పాఠశాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం. మా కార్యక్రమం గానే భావించి చేశాం.  తర్వాత మా ముగ్గురికీ అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. అప్పటి నుండి బలహీన పడతూ 2007 లో బాష మృతితో సంస్థ పూర్తిగా క్రియారహితంగా మారిపోయింది. ఈ మధ్య  మిత్రుల ఇతర సోదర సంస్థల సహాయంతో సంస్థను తిరిగి నిలబెట్టే పని మొదలెట్టాను. 


10. నువ్వు విప్లవాన్ని, ప్రేమని, సామ్రాజ్యవాదాన్ని, మతోన్మాదాన్ని, ప్రాంతీయ, బహుజన అస్తిత్వాన్ని స్పృశిస్తూ కవిత్వం రాశావు. కానీ ఇందులో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ  కవితలు ఎందుకు లేవు?
       

రాయలసీమ నేపధ్య కవిత్వం ఆంతా ఒక పుస్తకంగా వేద్దాం అనే ఆలోచన ఉంది కాబట్టి ఈ సంకలనంలో దానిని చేర్చలేదు. బహుశా ఈ సంవత్సరం చివరికల్లా ఆపని చేస్తానేమో? చూద్దాం.


11. నువ్వు “సీమ కవిత’’ పుస్తకం ఎడిటర్లలో ఒకడివి. ఆరోజులు నాకు గుర్తున్నాయి. ఆ పుస్తకం నుంచి ఈ పుస్తకం దాక నీకు సంతృప్తి నిచ్చిన పనులు ఏమి?
           

సీమ కవిత ఓ గొప్ప ప్రయత్నం. దానికి చాలా శ్రమ పడ్డాం. నిజానికి ఈ సంకలనం తేవాలన్న ఆలోచన పెన్నేరు పత్రిక ఎడిటర్ శర్మది. శర్మ అప్పుడు మిత్రజ్యోతి సభ్యుడు. ఆంధ్రభూమిలో విలేకరిగా పని చేసేవాడు. కవితల ఎంపికలో నేనూ, వెంకటకృష్ణ, పాణి పాలు పంచుకున్నాం. వివి అధ్బుతమైన ముందు మాట ఈ సంకలనానికి అదనపు ఆకర్షణ. ఈ సంకలనం రావడంలో సింగమనేని, వల్లంపాటి గారు కూడా సహకరించారు. సంకలనాన్ని విద్వాన్ విశ్వంకు అంకితం ఇవ్వాలనే ఆలోచన పాణిది. పెన్నేటిపాటలోని కొంత భాగంతో ఈ సంకలనం ప్రారంభం అవుతుంది. మిత్రజ్యోతి ఆధ్వర్యంలో సొంతంగా ఓ గ్రంధాలయం ప్రారంభించాం. ఈ గ్రంథాలయాన్ని కాళీపట్నం రామారావుతో ప్రారంభింపజేశాం. ఇదొక చారిత్రక ఘట్టం. ఆ రోజు సాయంత్రం జరిగిన సాహిత్య సభలో ఆయనతో పాటు సింగమనేని నారాయణ, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాధేయ, పాల్గొన్నారు. ఆ సభలోనే యగ్నం కథ చివరి ఘట్టం గురించి వచ్చిన వివాదం గురించి కారా మాష్టారు తొట్ట తొలిసారి వివరణ ఇచ్చారు. ఆ చివరి ఘట్టం అలా ఎందుకు ఏ ఉద్దేశ్యంతో రాసారో వివరించారు. ఇదే విషయాన్ని శశిశ్రీ సాహిత్య నేత్రంలో ప్రచురించారు. ఈ గ్రంధాలయానికి పుస్తకాలు కావాలని  చాలా మంది రచయితలకు పుస్తకాల కోసం ఉత్తరాలు రాసాం. వందల కొద్దీ పు‌స్తకాలు వచ్చాయి. కొన్ని రోజులు బాగా నడిచింది కూడా! కానీ మా ఆర్థిక స్థోమత నిర్వహణకు అడ్డంకి గా మారింది. అదీ కొనసాగించలేకపోయాం. సాహిత్య నేత్రం సంపాదకుడు శశిశ్రీ తెచ్ఛిన రాతిపూలు పరిచయ సభ చాలా బాగా నిర్వహించాం. ఇవి కొన్ని. ఆస్మానీ రావడం గొప్ప కాదు. అది ఎలా వచ్చింది అనేదే నా మటుకు నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. నా మిత్రులు ఈ పుస్తకం రావడానికి కారణం. స్నేహాల వల్ల కలిగే‌ ప్రయోజనం సాంస్కృతికమైనదీ, రాజకీయమైనదై ఉండాలి. ఈ సంకలనం దానికి ప్రతీక. ఈ పుస్తకం తెచ్చిన విరసానికి గానీ, సహకరించిన వెంకటకృష్ణ, వరలక్ష్మి, రవి, శ్రీను, రమణకి థ్యాంక్యూ అని కూడా ఇంత వరకూ నేను చెప్పలేదు. ఈ స్నేహం దానికి మించినది. ఫక్తు రాజకియమైనది.


12. నీ భవిష్యత్‌ కవి ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి?
       

ఎలా చెప్పగలను. ఇప్పటికైతే బోల్డు కవిత్వం రాస్తున్నాను. ఇలా కొనసాగుతూ ఉండనీ. రాయలసీమ కవిత్వం తెస్తాను. త్వరలో! కథలు రాయడానికి కూడా ప్రయత్నిస్తాను.

3 thoughts on “రచయిత తన రచన పట్లనిర్మమకారంగా ఉండాలి

  1. Thank you to the editorial team for conducting the interview. I hope that my answers have met the standards of the magazine.

  2. చాలా ఆలస్యంగా చదివినా, నీ గురించి ఎక్కువనే తెల్సుకున్న. సమాచారం రాబట్టటానికే అడిగిన ప్రశ్నలు, అడిగిన ప్రశ్నకు సరిపడా సమాచారంతో ఇచ్చిన జవాబులూ. ఎ పర్ఫెక్ట్ కాంబో…
    నీగురించే కాదు, రాయలసీమ ముస్లిం సమాజం గురించి కూడా కొంత తెల్సుకున్నాను. దాదాపు ఒక దశాబ్దం క్రితం సంవత్సర కాలం పొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో తిరిగినా అప్పటికి ఇన్ని విషయాలు తెలుసుకునే నాలెడ్జ్ లేకుండే అన్నా. థాంక్ యూ

Leave a Reply