ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు.

ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు. అందుకనుగుణంగానే విశిష్టాద్వైతుల జీవన విధానం కూడా వుంటుందని కూడా ఆయన వివరిస్తారు. కాబట్టి ఉత్పత్తి వర్గాల ప్రసక్తి రాదు. అందునా అప్పటికే సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థలోని అట్టడుగు వర్గాల జాడలు ప్రబంధ సాహిత్యంలో కనుపించవు. అప్పటికే శైవం బసవేశ్వరుని ప్రభావం వల్ల సరళీకరింపబడి సామాన్యుని దాకా చేరింది. దానికి అడ్డుకట్ట వేయడానికి విశిష్టాద్వైతం శాయశక్తులా కృషి చేసింది. బసవేశ్వరుని కంటే సరళీకరించే ప్రయత్నంలోనే అన్నమయ్య ముందుకొచ్చాడు. అటు ప్రబంధ సాహిత్యంలోని అన్నమయ్య గీతాల్లోకాని సామాన్యుని ప్రసక్తివుందేకాని  అగ్రవర్ణ ఆదిపత్యాన్ని వదలుకొని గాని, తాత్విక దృక్పథం మార్చుకొనిగాని కాదు. ప్రబంధాల్లో ముఖ్యంగా ఆముక్తమాల్యదలో వక్రీకరణ బుజ్జగింపుల్ని ఎండ్లూరి సుధాకర్‌ ‘గోసంగి’ అనే దీర్ఘ కావ్యంలో ఎత్తిపట్టాడు.

అస్తిత్వ ఉద్యమాల వల్ల తెలుగు సాహిత్యంలో పునర్మూల్యాంకనం అన్న భావన ఊపందుకుంది. గత సాహిత్యంలో తమ అస్తిత్వాన్ని వెదుక్కోవడం ప్రారంభమైంది. తెలుగు కావ్యాల్లో ఆముక్త మాల్యద పంచ కావ్యాల్లో ఒకటి. అసలు ఆ కావ్య కత్తృత్వం పైనే చర్చ జరిగింది. అందులో లేని కుల ప్రసక్తిని ఆ కావ్యానికి వ్యాఖ్యానం రాసిన వేదం వెంకటరాయ శాస్త్రి ‘‘మాల దాసరి కథ’’ను వ్యాఖ్యానించారు. కవి ఆ పదాన్నే ఉపయోగించలేదని కావ్యంలో ‘‘గోసంగీ’’ అని సంబోధించారని ఉదాహరణలతో గోసంగి కావ్యానికి  సీతారాం రాసిన ముందు మాటలో వివరించారు. ఎండ్లూరి సుధాకర్‌ పౌరాణిక, ప్రబంధాల నేపథ్యం గలవారు. కవి అనని మాటను ఆయనకు ఆపాదించి చెప్పడం సాహిత్యనేరం. ఎండ్లూరి సుధాకర్‌ వేదం వేంకట రాయశాస్త్రిని ఇక్కడ దొరకబుచ్చుకున్నారు. ఆముక్తమాల్యద కావ్యానికి వ్యాఖ్యానం రాసిన తుమ్మపూడి కోటేశ్వరరావు కూడా వారి అభిప్రాయాన్నే సమర్థించారు. ఈ తప్పును ఎత్తిచూపడానికి దళిత బహుజన దృక్పథమే అక్కరలేదు. పునర్మూల్యాంకనం అవసరంలేదు. విమర్శకునికి నిశిత పరిశీలనా దృష్టివుంటేచాలు. వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఇటువంటి సద్విమర్శకులు లేకపోవడం వారి కుటుంబానికే కాదు సాహిత్యలోకానికి కూడా లోటే.

నిజానికి చరిత్రకారులు పేర్కొన్నట్లు పదహారవ శతాబ్దం స్వర్ణయుగం కాదని ‘‘సర్వం విష్ణుమయం జగత్కాదు/……? సర్వం విషమయం జగత్‌’’ అని ఎండ్లూరి సుధాకర్‌ ఈ కావ్యంలో నిరూపిస్తారు. అగ్రవర్ణ సంస్కృతి దళిత సంస్కృతితో పోలుస్తూ దళిత సంస్కృతి ఎంత గొప్పదో కావ్యంలో వర్ణిస్తారు. ఇందులో వర్ణించిన సాంఘిక వ్యత్యాసాలు..

‘‘కౌటిల్యుని అర్థశాస్త్రంలో

క్రయ విక్రయాలలో అస్పృశ్య నాణేల మీద

నిషిద్ద ముద్ర ఎందుకెయ్యలేదో

టంక శాలలు మమ్మల్నెందుకు

ఆటంకపరచలేదో

ధనం మూలం ఇదం జగత్తులో

ఏ అంటూ వుండదని తేలిపోయింది’’

అని ఏ ప్రాతిపదికన వివక్ష ఏర్పదిందో వివరిస్తారు. వ్యాఖ్యాతల తప్పిదాన్ని ఆసరా చేసుకొని ఒక కావ్యాన్ని నిర్మించిన ఎండ్లూరి సుధాకర్‌ సృజన ప్రశంసనీయ శ్రామిక సంస్కృతి ఎంత విశిష్టమైనదో కావ్యం ప్రారంభంలోనే సుధాకర్‌ సూచిస్తారు. ‘‘నేనూ మాణిక్యాన్నే/కానీ మసిగుడ్డలో దాచబడ్డాను/నేను సాటి మనిషినే/కానీ అంటరాని గడ్డలో పుట్టాను’’ అని అణచివేతను గుర్తుచేస్తారు. అక్కడ మొదలై మానవ సంబంధాలోనూ, ఉత్పత్తిలోనూ, సామాజిక శ్రమలోనూ గోసంగి తను ఆత్మకథను వివరిస్తాడు. తనకు అవకాశమిస్తే భువన విజయంలో గొప్ప కవినై వుండేవాడినని రాయలవారికి గోసంగి చెప్పిస్తాడు సుధాకర్‌.

కర్ణాటక సంగీతంలోని కమాస్‌ రాగంలోంచి వచ్చింది మంగళకైశికి రాగం ప్రధాన రాగాలు డెబ్బై రెండు అయితే అందులోంచి పుట్టినవి వందలకొలది రాగాలున్నాయి. వేంకటేశ్వర సుప్రభాతంలో ఈ రాగాల పేర్లన్నీ వున్నాయి. శాస్త్రీయ సంగీతంలో మంగళకైశికి రాగాన్ని అద్బుతంగా పాడగలిగిన గోసంగికి ఆలయ ప్రవేశం లేదు. దేవుడికి స్నానం చేయించగా వచ్చిన నీటికి ఒక శూద్రుడు అందజేస్తే దాన్నేమహా ప్రసాదమని గోసంగి భావిస్తాడు. గోసంగిని అడ్డుకున్న రాక్షసుడు శాపానికి గురిఅయిన బ్రాహ్మణుడు. కావ్యంలోని వివక్షను అడుగడుగునా సుధాకర్‌ ఎత్తిచూపుతాడు. సారాంశంలో చరిత్ర వక్రీకరింపబడిరదని, దోపిడికొరకై కులపు అడ్డుగోడలు నిర్మితమైనాయని పాఠకుడు గ్రహిస్తాడు. పీడిత వర్గానికి సుధాకర్‌ అందించిన పరిశోధనా విధానమిది. ఆయనకు నివాళి.

Leave a Reply