భారతదేశ చరిత్రలో ఎన్నదగిన ఢిల్లీ రైతాంగ పోరాటం మరోసారి ప్రజ్వరిల్లింది. రెండేళ్ల కింద ప్రధానంగా పంజాబ్‌, హర్యాణా ప్రాంతాల నుంచి ఢిల్లీని చుట్టుముట్టి ఏడాది పాటు  పోరాడినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ  చట్టాలను రద్దు చేయాలని ఆ రోజు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ ఒత్తిడికి నరేంద్రమోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ ఉద్యమంలో వచ్చిన ఇతర ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంత వరకు వాటి ఊసే లేకుండా సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంలో రైతులు  మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 16న భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చారు.

             కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌ గతంలో జరిగిన ఉద్యమంలో కూడా ఉండిరది. దాన్ని పరిష్కరించడానికి నిపుణులతో ఒక కమిటీ వేస్తానని అప్పట్లో ప్రధాని హామీ ఇచ్చాడు. కానీ ఇంత వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అట్లాగే స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చులో యాభై శాతం కలిపి ఇవ్వాలనే ఇంకో అనుబంధ డిమాండ్‌ ఉండిరది. అట్లాగే కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఇస్తున్న ప్రభుత్వం రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయదనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు నోటి మాటగా ప్రకటించడం తప్ప ప్రభుత్వం ఆనాటి ఉద్యమంలో ఇచ్చిన హామీలేవీ పరిష్కరించలేదు. 

            దీంతో తిరిగి రైతు ఉద్యమం రగులుకున్నది. వేలాదిగా రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం వాళ్ల ఉద్యమం మీద దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. రైతులు ఢిల్లీ రాకుండానే అడ్డుకోడానికి అణచివేస్తున్నది. దాని కోసం డ్రోన్లతో భాష్ప గోళాలను ప్రయోగించింది.  ఉద్యమిస్తున్న రైతులను అక్రమంగా అరెస్టు చేస్తున్నది. గత ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలనే డిమాండ్‌ను ఇంత కాలమైన పరిష్కరించని ప్రభుత్వం తిరిగి ఉద్యమిస్తున్న రైతులను మళ్లీ అరెస్టు చేస్తున్నది. కేసులు నమోదు చేస్తున్నది.

            దేశాన్ని కార్పొరేట్ల రాజ్యంగా మార్చేసిన మోదీ ప్రభుత్వానికి రైతుల కేకలు వినిపించడం లేదు. వాళ్లు ఉద్యమించకుండా, నినదించకుండా రోడ్ల మీద మేకులు కొట్టి అడ్డుకోవాలని చూస్తున్నది. కానీ  ఉద్యమాన్ని దీర్ఘకాలికంగా నిలబెట్టడానికి రైతులు  గతంలో అనేక సృజనాత్మక పోరాట రూపాలను ఎంచుకున్నారు. ప్రజల సామూహికత ముందు ఫాసిస్టు శక్తులు నిలవలేవని నిరూపించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫాసిస్టు అణచివేతను తమ అద్భుతమైన సృజనాత్మక పోరాటశక్తితో రైతులు ఎదుర్కొంటున్నారు.             కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి చాలా ప్రాధాన్యత ఉంది. రైతుల పోరాటం మనందరిదీ అయినప్పుడే ఈ దేశంలో కార్పొరేట్‌ దోపిడీ నుంచి వ్యవసాయరంగాన్నేగాక అన్ని రంగాలను కాపాడుకోగలం. రైతుల ఉద్యమానికి జేజేలు పలుకుతూ అందులో భాగం కావాలని విరసం పిలుపునిస్తోంది.

Leave a Reply