కోబాద్ గాంధీ తన జైలు డైరీకి నా ప్రతిస్పందనను చదివి స్పందించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కొన్ని ఉద్యమ ప్రాథమిక సమస్యలపైన ఇది మంచి చర్చకు దారితీస్తుందనే ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించడానికి ప్రయత్నిస్తాను.

జార్ఖండ్ ఉద్యమం సమస్యపై నేను తనని తప్పుగా ఉదహరించానని కోబాడ్ గాంధీ అంటున్నారు. వాస్తవానికి, నేను ఈ అంశంపై అసలు ఉదహరించదమనేదే జరగనప్పుడు, తప్పుగా ఉదహరించాననే ప్రశ్న ఎక్కడనుంచి వస్తుంది? ఆ డైరీ మీద  నాకు ఏర్పడిన అభిప్రాయాలను చెప్పాను అంతే.  

కానీ ఇప్పుడు అతను రాసిన ఇతర విషయాలకు సమాధానం చెప్పే ముందు, ఆయన పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు ఉదహరిస్తాను, కోబాడ్ గాంధీ ఏమి చెప్పాలనుకుంటున్నారో పాఠకులు స్వయంగా నిర్ణయించుకోవచ్చు. అయితే, డైరీని పూర్తిగా చదివిన తరువాతనే తమ సంపూర్ణ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. కాబట్టి మొదట కోబాడ్ పుస్తకం నుంచే కొన్ని ఉల్లేఖనలు  –

 ‘నన్ను హజారిబాగ్ సెంట్రల్ జైలుకు మార్చినప్పుడు, ఇక్కడ మాఫియాలో వున్న అత్యధికులు నక్సలైట్ ఖైదీలేనని గుర్తించాను.  నేను యిక్కడికి రాగానే, ఆ వ్యక్తులు నేరుగా నా వద్దకు వచ్చారు, వారి ఉద్దేశ్యం ఒకటే, డబ్బు. జైలు వాతావరణం ఎలా వుంటుందంటే, ఉద్యమ నాయకులందరికీ (దిగువశ్రేణి నాయకులు కూడా) కుబేరులు అనే గుర్తింపు ఉంది. నా దగ్గర డబ్బు లేదని, వాస్తవానికి నాకే వారి సహాయం అవసరమని తెలియగానే వారు కనబడకుండాపోయారు.’ [పేజీ -168].

 ‘జార్ఖండ్ జైలు పూర్తిగా నగదుతో నడుస్తుంది. జైలులో ఉన్న ‘మావోయిస్టుల’ లోని అత్యధికులు ఈ మాఫియా నియంత్రణను  విచ్ఛిన్నం చేయడానికి బదులు ఇందులో భాగస్వాములయేవారు, అప్పుడప్పుడూ వారికి నాయకత్వం కూడా వహించేవారు. [పేజీ -129]

‘……. సైనిక సంస్థలో చేరిన తర్వాత, వారికి స్థానిక ప్రజలతో చాలా తక్కువ సంబంధం వుంటుంది. వారి ప్రధాన ఆకర్షణ సాహసిక జీవితం, అధికారం, సాపేక్షంగా మంచి జీవితం అవుతాయి. [పేజీ  – 128]

‘జార్ఖండ్ జైలులో, ప్రజల వ్యాఖ్య ఏమిటంటే నేను ఇతర నక్సల్ నాయకుల కంటే భిన్నంగా చాలా సాధారణంగా వుంటాను. ఇతరుల దగ్గర చాలా డబ్బు ఉంటుంది, అందుకే క్రింద స్థాయి నక్సల్ కార్యకర్తలతో సహా సాధారణ ప్రజలు వారి చుట్టూ తిరుగుతుంటారు. (130-131)

‘అణచివేత వల్ల ప్రజా ఉద్యమం పతనమైన తరువాత, మొత్తం పని అంతమైపోతుంది లేదా స్క్వాడ్ / పార్టీ ప్రజల నుండి దూరమైపోతుంది, లేదా తమ ఆహారం, మనుగడ కోసం కాంట్రాక్టర్ల నుండి డబ్బు సమీకరిస్తూ సంచార తిరుగుబాటుదారులుగా మారిపోతారు. [166-167]

 ‘…. అతను 2008 లో ఉద్యమాన్ని విడిచిపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. మావోయిస్టులను వదిలివెళ్ళేటప్పుడు ఆయన చేసిన అనేక ఫిర్యాదులలో నాయకత్వం చాలా నిరంకుశంగానూ (బ్యూరోక్రాటిక్),  అసహనంగానూ మారింది అనేది ఒకటి. అతని నిబద్ధతను విచ్ఛిన్నం చేసిన అంతిమ విషయం ఏమిటంటే, బస్తాలకొద్దీ డబ్బును సేకరించి , ఒక్క పైసా కూడా తాకకుండా నాయకులకు అప్పగిస్తే, నాయకత్వం ఆ డబ్బుని ఏ గ్రామాభివృద్ధిపనికీ ఖర్చు పెట్టలేదు.

అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, అవసరమైనప్పుడు, వారికి (లేదా వారి కుటుంబాలకి) ఏమీ ఇవ్వలేదు. పోలీసులు కూల్చేసిన గుడిసెలను తిరిగి కట్టాల్సి వచ్చినప్పుడు కూడా. తన సోదరి పెళ్లి కోసం కొంత డబ్బును అడిగినప్పుడు కూడా వారు యివ్వలేదు …….. నిజానికి అతని స్నేహితుడు, ఒకప్పుడు మావోయిస్టు అయిన రాజన్, ఇసుక మాఫియాతో కలిసి కోట్లు సంపాదించాడు. ఈ డబ్బులోంచే  కొంత ఖర్చు పెట్టి  జైలు నుంచి బయటకు వచ్చాడు.’ [174]

‘సారాంశంలో చెప్పాలంటే అధికారం, డబ్బు అవినీతికి దారితీస్తాయి.’ [178]

 ‘వాస్తవానికి, మార్క్సిజం పరిధిలో, కొత్త ఆలోచనలు సాధారణంగా ముప్పుగా కనిపిస్తాయి, కొత్త ఆలోచనలను తీసుకువచ్చే వ్యక్తికి ఏదో ఒక ముద్ర వేస్తారు  లేదా లక్ష్యంగా చేసుకుంటారు  లేదా పక్కకి తప్పించేస్తారు.’ (236)

ఇక ఇప్పుడు కోబాడ్ గాంధీ ఏమి చెప్పాలనుకుంటున్నారో, అందులోనూ మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాలనుకుంటున్నారనేదాని గురించి మీరే నిర్ణయించుకోండి. ఈ సందర్భంలోనే, నేను బెల్లం పాకం, దాని పైన తేలే మడ్డి గురించి మాట్లాడాను. కోబాడ్ గాంధీ రెండింటి మధ్య భేదం చూస్తారా ?

గోల్‌పోస్ట్‌‌ను మార్చడం అనే అంశంపై కూడా నేను తప్పుగా ఉదహరించానని కోబాడ్ గాంధీ అంటున్నారు. కాబట్టి నిజమైన కోట్ ఏమిటంటే – ‘ప్రారంభించడానికి, మనం  గోల్‌పోస్టులను మార్చాల్సి వుంటుంది, అసమానతకు వ్యతిరేకంగా అందరి ఆనందం కోసం పోరాడాలి’. అయితే నిస్సందేహంగా దాని వెంటనే, .ఆకలితో ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండలేడని. కూడారాశారు. (233)

మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో విప్లవం ‘అవసరం అనే రంగం’ నుండి ‘స్వేచ్ఛా రంగానికి’ ఒక గంతు వేస్తుంది అనేది నిర్ధారితమైన విషయం.  అలాంటప్పుడు గోల్‌పోస్టు మార్చాలనే ప్రశ్న ఎక్కడ నుండి వచ్చింది?

ఇక మిగతా ప్రశ్నల గురించి –

కోబాడ్ గాంధీ చెప్పిన విషయాలతో నేను ఏకీభవించనప్పుడు మరి, 1. మొత్తం ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ సోషలిస్ట్ / విప్లవోద్యమ ఓటమికి కారణం ఏమిటి. 2. మావో మరణం తరువాత చైనాలో శ్రామికవర్గ విప్లవం ఎందుకని విఫలమైంది. 3. ఒకవేళ విప్లవం అనివార్యమైతే, నా గ్రూపు లేదా పార్టీ దాన్ని ఎంతకాలంలో సాధిస్తుంది? 4. శాంతికాలంలో ఏ విప్లవం విజయవంతమైంది? వగైరా… వగైరా ప్రశ్నలెందుకు.

యిక్కడ నేను ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడం లేదు. ఈ ప్రశ్నలకు ‘సమాధానం’లాంటిదేమీ లేదు కూడా. ప్రపంచంలోని కమ్యూనిస్టులందరూ తమ ఆచరణ, సిద్ధాంతాలతో ఈ ప్రశ్నలతో పోరాడుతున్నారు. కానీ నేను యిక్కడ కోబాడ్ గాంధీ పద్ధతి (methodology) గురించి ప్రశ్నించాలనుకుంటున్నాను. 

పై ప్రశ్నలకు సంబంధించి ఇప్పటివరకు కమ్యూనిస్ట్ ఉద్యమం తెల్ల కాయితంలా ఉందా?  కోబాడ్ గాంధీనే మొదటిసారిగా ఈ ప్రశ్నలను ఎదుర్కొంటున్నారా?  కొన్ని దశాబ్దాల క్రితమే చురుకుగా ఉన్న RIM -CCOMPOSA -WPRM వంటి కమ్యూనిస్ట్ సంస్థలలో ఈ ప్రశ్నలపై ఏ చర్చా జరగలేదా?  నేపాల్ మావోయిస్ట్ పార్టీ 2005లో జరిపిన తన రెండవ మహాసభలో ‘21 వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం, కొత్త రకం రాజ్యాన్ని నిర్మించే సమస్య’ [The Question of Building a New Type of State]పై  పెట్టిన డాక్యుమెంట్ మీద, భారతదేశంతోసహా  ప్రపంచంలోని  వామపక్షపార్టీలన్నీ  తమ వాదాన్ని వినిపించాయి, చర్చలో కూడా పాల్గొన్నాయి.

ఇలాంటి ముఖ్యమైన సమస్యలను పరిశీలిస్తూ కోబాడ్ గాంధీ వాటిని ఎక్కడా ప్రస్తావించలేదు. చార్లెస్ బెత్లెహెమ్, రేమండ్ లోట్టా, పాల్ ఎమ్ స్వీజీ వంటి చాలా మంది మార్క్సిస్ట్ మేధావులు విప్లవం తరువాత సోవియట్, చైనా సమాజాల గురించి, వాటి  బలహీనతల గురించి వివరంగా రాశారు. మావో స్వయంగా సోవియట్ వ్యవస్థ, స్టాలిన్ పై విమర్శలను ప్రస్తావించాడు. కమ్యూనిస్ట్ ఉద్యమ ఓటమిపైన తన అభిప్రాయాన్ని, తన మూడు మంత్ర దండాలు, స్వేచ్ఛ-ఆనందం-మంచి విలువలను [freedom-happiness-good value] ఒక పరిష్కారంగా చెబుతూ, కోబాడ్ గాంధీ ఎక్కడా కూడా ఈ చర్చలు, నిర్థారిత విషయాలను ప్రస్తావించనే లేదు.

మావో మరణించిన వెంటనే చైనా సాంస్కృతిక విప్లవం ఎందుకు విఫలమైంది అని కోబాడ్ గాంధీ ప్రశ్నించారు. దాని కంటే పెద్ద ప్రశ్న, చైనాలో ఈ విప్లవం ఇంత ఆలస్యంగా ఎందుకు ప్రారంభమైంది అనేది. ఎందుకంటే 1966 నాటికి చైనా పూర్తిగా రష్యనీకరణ  అయిపోయింది. ఈ సమస్యలు, చర్చలను ఢీకొట్టకుండా, స్వేచ్ఛ-ఆనందం-మంచి-విలువ [ప్రజాస్వామ్యం-ఆనందం-మంచి విలువ] లకు అమూర్త పద్ధతిలో పరిష్కారాలను వెతకడం అంటే చీకటిలో రాయి విసరడం కాక మరేమిటి?

చైనా సాంస్కృతిక విప్లవంలో ‘పార్టీ కమిటీ’లను రద్దు చేసి, ‘విప్లవ కమిటీ’లు నిర్మిస్తున్నప్పుడు, కోబాడ్ గాంధీ లేవనెత్తిన   ‘ప్రజాస్వామ్యం’ సమస్యనే పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది.  కానీ ఆ ప్రయత్నం, నిర్దిష్ట రూపంలో ప్రజాస్వామ్యానికి ఒక కొత్త నిర్మాణాన్ని ఇవ్వడం ద్వారా జరిగింది తప్ప, కోబాడ్ గాంధీ చెప్తున్న అమూర్త పద్ధతిలో కాదు.  కోబాడ్ గాంధీ తన పుస్తకంలో, స్వేచ్ఛ – ఆనందం – మంచి విలువలు లాంటి అందమైన పువ్వుల్ని  ఏ పుష్పగుచ్ఛంలో ఉంచాలి అన్నప్పుడు, దాని నిర్మాణం ఎలా వుంటుంది అనే సమస్యను  అసలు తాకనేలేదు.

బహుశా ఈసారి కూడా, నేను పైన పేర్కొన్న విషయాలు కోబాడ్ గాంధీకి జడాత్మకవాదంగా అనిపించవచ్చు. కానీ గురుత్వాకర్షణ గురించి కొత్త విషయం చెప్పాలనుకునే, కొత్త అవగాహన లేదా ఫార్ములా ఇవ్వాలనుకునే వారు ఎవరైనాసరే న్యూటన్, ఐన్స్టీన్ లేదా ఆ రంగంలోని ఈనాటి శాస్త్రవేత్తలెవరితోనైనా ఘర్షణ పడకుండా ఇవ్వగలరా? భౌతిక శాస్త్రానికి సరైనది, సామాజీక శాస్త్రానికి కూడా సరైనదవుతుంది.

‘విప్లవం అనివార్యమైతే కనక, అతను లేదా అతని పార్టీ / గ్రూపు వారు ఎప్పటివరకు విప్లవం చేయగలరో చెప్పాలని’ కోబాడ్ నాపై వ్యంగ్యాస్త్రాన్ని వదిలారు. మళ్ళీ నేను వ్యంగ్యంగా సమాధానం చెప్పే బదులు, వారికి ఒక సంఘటన వివరించాలనుకుంటున్నాను

1915/16 సంవత్సరంలో, లెనిన్ తన ప్రవాస జీవితంలో ఒకసారి శ్రామికులకు క్లాసు తీసుకునేటప్పుడు వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా ‘బహుశా నేను నా జీవితకాలంలో విప్లవాన్ని చూడలేకపోవచ్చు, కాని మీరు ఇంకా చిన్నవాళ్ళు, మీరు తప్పకుండా మీ జీవితంలో విప్లవాన్ని చూస్తారు’ అన్నాడు. 2 సంవత్సరాల తరువాత లెనిన్ విప్లవం మధ్యలో ఉన్నాడు.  ఈ విప్లవకర ఆశ తప్ప, మనుషులకి ఈ రోజు వేరే మార్గం లేదు. ఒక కవి మాటల్లో, మనం  ఆశాజనకంగా ఉండాలనే శాపగ్రస్తులం.

అదేవిధంగా, కోబాడ్, శాంతికాలంలో ఏ విప్లవం జరిగింది అనే ప్రశ్నను కూడా విసిరారు. ఇప్పటివరకు జరగనిది యిక ముందు కూడా జరగదు అని అనడం నియతవాద (determinism) పరాకాష్ట. శాంతి సమయం అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలియదు. ఎందుకంటే విప్లవాలు శాంతికి భంగం కలిగిస్తాయి. బహుశా అతను ప్రపంచ యుద్ధం లేని సమయాన్ని గురించి చెప్తున్నారనుకుంటాను.

సమాధానం ఇవ్వడం కోసం మాత్రమే సమాధానం యివ్వాలనుకుంటే, క్యూబా విప్లవం ఎప్పుడు జరిగింది? కంబోడియా-వియత్నాం విప్లవాలు ఎప్పుడు జరిగాయి? ఆఫ్రికాలోని అనేక దేశాలలో జాతీయ విముక్తి యుద్ధాలు ఎప్పుడు జరిగాయి? బుర్కినో ఫాసోకి చెందిన థామస్ శంకర (మిలటరీ ఆఫీసర్, సోషలిస్టు విప్లవకారుడు, 1983 నుంచి 1987 వరకు అధ్యక్షుడిగా వున్నారు) గురించి ఏమి చెబుతారు. బొలీవియాలోని చావెజ్ గురించి ఏం చెబుతారు. వీటిలో కొన్ని శాస్త్రీయ అర్థంలో విప్లవ వర్గీకరణలోకి రాకపోయినా,  ప్రపంచ శక్తి సమతౌల్యాన్ని కొంతవరకు ప్రగతిశీల శక్తులకు అనుకూలంగా మలచడంలో వాటి పాత్రను తిరస్కరించలేము.

 ‘అధికారం భ్రష్టులను తయారుచేస్తుంది’, ‘సంపూర్ణ అధికారం పూర్తిగా భ్రష్టులను చేస్తుంది’ [Power tends to corrupt, and absolute power corrupts absolutely] గురించి కొన్ని మాటలు – ఈ సామెతని కోబాడ్ గాంధీ చాలాసార్లు ఉపయోగించారు. ఈ సామెతను ఎక్కడినుంచి తీసుకొన్నారో అందులోని తరువాతి పంక్తి ఏమిటంటే – ‘గొప్ప వ్యక్తులు సాధారణంగా చెడ్డవారై వుంటారు’. ఈ సామెతని సాధారణంగా ప్రధాన అధికారానికి ప్రమాదం లేకుండా వుండడం కోసం, అధికారం కోసం పోరాడుతున్న ప్రజలను నైతికంగా భయపెట్టడానికి ఉపయోగిస్తారు. ఏ విప్లవానికైనా ప్రాథమిక ప్రశ్న అధికారానికి సంబంధించిన ప్రశ్న అని మనం అర్థం చేసుకోవాలి. దేనికి భయపడి కోబాడ్ గాంధీ ‘అధికారాన్ని’ లేదా ‘పవర్’ ని  వదిలించుకోవాలనుకుంటున్నారో అది సమస్యకు పరిష్కారం కాదు.  అధికార వికేంద్రీకరణ, ప్రజాస్వామ్యంపై ఆధారపడటం సమస్యకు పరిష్కారం. సాంస్కృతిక విప్లవంలో యిలా  చేయడానికే ప్రయత్నం జరిగింది. అంటే, ఇక్కడ కూడా, కోబాడ్ గాంధీ అధికారం సమస్యను ఆదర్శవాద పద్ధతిలోనే పరిష్కరించాలనుకుంటున్నారు.

మార్క్సిస్ట్ సాహిత్యంలోంచి ఉదహరించడంపై  కోబాడ్ గాంధీకున్న చికాకును దృష్టిలో పెట్టుకొని, నేను అమెరికన్ బ్లాక్ మేధావి – కార్యకర్త జేమ్స్ బాల్డ్విన్‌ను ఉదహరిస్తూ ముగిస్తాను. ప్రజలు చరిత్రబోనులో ఇరుక్కున్నారు, చరిత్ర ప్రజలబోనులో ఇరుక్కుని వుంది  [People are trapped in history and history is trapped in them.]. ఈ బోనుతో ఢీ కొనకుండా గతం-వర్తమానం -భవిష్యత్తుల గురించి మాట్లాడగలమా? ఇదీ అసలు ప్రశ్న.

2 thoughts on “కోబాడ్ గాంధీ సమాధానంపై మ‌నీషా అజాద్‌

  1. ఈ విశ్లేషణాత్మక శాస్త్రీయ వివరణ గొప్ప ఆశను కలిగించింది. ధన్యవాదాలు.

Leave a Reply