సుమారు మూడు దశాబ్దాల క్రితం  తెలుగునాట తలెత్తిన అస్తిత్వ ఉద్యమాలు వివిధ అస్తిత్వాల సమస్యలపై ప్రత్యేక అధ్యయనాలను ప్రేరేపించాయి. ఆయా సమస్యల మూలాలను పునఃపరిశోధించడం, సరికొత్త పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నాలూ  ముమ్మరమయ్యాయి. అలాగే వర్గపోరాట పద్ధతులను, ఫలితాలను పునఃసమీక్ష చేసుకునే చారిత్రక అనివార్యతను కూడా అవి సృష్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- ఆయా సామాజిక అస్తిత్వ బృందాలు ‘తనలో తానుగా’ ఉన్న స్థితినుండి ‘తన కోసం తానైన’ స్థితి లోకి  మారడంగా ఆ అస్తిత్వవాద ఉద్యమాలను అభివర్ణించవచ్చు.

ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు, దళితవాద ఉద్యమం గాని దళితవాద సాహిత్యం గాని లేవనెత్తిన విషయాలన్నీ ఆహ్వానించదగ్గవే. సామాజిక వాస్తవికతలో భాగమై మరుగున పడ్డ దళిత జీవన వాస్తవికతను, వర్గ పోరాటాలలో భాగమై  కూడా గుర్తించబడని  తమ ప్రత్యేక కుల సమస్యలను బాహాటంగా వ్యక్తీకరించడం మొదలైంది. ఒక్క దళిత వాదమే కాదు, తమ నిర్దిష్ట అస్తిత్వాలపై అమలవుతున్న పీడనలు,వివక్షల నుండి విముక్తికై  డిమాండ్ చేస్తూ వివిధ అస్తిత్వ వాదాలు కూడా  ముందుకొచ్చాయి. అంతకు ముందు లేని విధంగా, అవి స్వయంచోదక శక్తితో ప్రత్యేకంగా పోరాడడం వల్ల  చారిత్రిక పురోగమనానికి అవి సరికొత్త బాటలు వేశాయని చెప్పవచ్చు. ఆ క్రమంలోనే పసునూరి రవీందర్ రాసిన ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ కథలను దళిత జీవిత వాస్తవికతను సజీవంగా ప్రతిఫలించిన కథలుగా పేర్కొనవచ్చు.

మనకు కనపడే లోకంలోనే కనపడని మరో లోకమూ  ఉంది. ఆ లోకంలో మనుషులు మన లాంటి వారు కాదు. వారు కులపీడితులు, కులశోషితులు. పైగా అంటరానివారు. వారి  వెలి బతుకుల వ్యథలను  పసునూరి కథలుగా  రాశాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో నెట్ వర్క్ కనెక్ట్ కానట్టుగానే, పసునూరి (అన్)కవర్ చేసిన ఈ కథలు సవర్ణ హిందూత్వ  ప్రపంచీకులకు కనెక్ట్ కానేకావు. అందుకే వీటిని అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలని సరిగ్గానే అన్నాడు పసునూరి రవీందర్.

కులం పేరిట దళితుల్ని అవమానించి, హింసించి, సంహరించే దేశం ఆధునిక భారతదేశం ఎట్లయితదని  పసునూరి ప్రశ్నిస్తున్నాడు. కారంచేడు నుండి వాకపల్లి  వరకు దళిత స్త్రీలను చెరచడంలో, దళితుల్ని  చంపడంలో ‘ప్రధాన స్రవంతి’ రాజకీయాలన్నీ పోటీ పడుతున్న చోట  కులం లేదని ఎలా అనగలం? ప్రేమైక నిలయమైన ఇంటిగుట్టును  కాపాడడంలో అర్థం ఉంది గాని, కులగుట్టును  కాపాడడంలో అర్థం ఏముంటుంది? కుల హింసను, కుల ద్వేషాన్ని కాపాడడం తప్ప కులగుట్టులో  మరేం లేదు. ఏ పట్టణానికేగినా, ఏ దేశాంతరాలకేగినా ఇంటా బయటా కులం నీడలా వెంటాడి హింసిస్తుంటే దళితులెలా కులగుట్టును దాచుకున్న దేశంగుట్టును  కాపాడుతారు. నిలువెల్లా మానవ ద్వేషంతో నిండిన, హింసాయుతమైన అలాంటి కులగుట్టును రట్టు చేసిన కథలే ఈ ‘అవుట్ ఆఫ్  కవరేజ్ ఏరియా’ కథలు.

అక్షరాన్ని తమ జాగీరుగానే  భావించిన బ్రాహ్మణవాద పండితులు తరతరాలుగా దళితుల్ని అక్షరానికి దూరం చేశారు. అవసరానికి, అక్షరానికి మధ్య లేని వైరుధ్యాన్ని సృష్టించి పబ్బం గడుపుకున్నారు. కడుపు నొప్పిలాగే కుల నొప్పిని  ఎలా చూపించగలరు? అది కనిపించని అంటరాని బాధ. అనుభవిస్తేనే తప్ప అర్థంకాని హింస. అలాంటి అనేక కులహింసా రూపాలను పసునూరి  ఈ కథల్లో  చిత్రించాడు.

సమాజం అంచుల్లో జీవిస్తున్న వేర్వేరు  ప్రజా సమూహాలపై సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ప్రభావాలను అర్థం చేసుకోవడంలో ప్రగతిశీలురుగా  పేరుబడ్డ వారు సైతం మొదట ఎలాంటి పొరపాట్లు చేశారో  మనకు తెలుసు. నానాటికీ తీవ్రతరమవుతున్న  వర్గ పోరాటాల వల్ల సమాజం కదలబారుతుందని, ఆ కదలికలోని చలనాలు యథాస్థితిని ఎంతోకొంత ప్రభావితం చేస్తాయని, ఆ  మార్పులు అనివార్యమని అర్థం చేసుకోలేకపోయారు. కనుకనే ప్రపంచీకరణను వ్యతిరేకించడంలో  భాగంగా తమకే తెలియకుండా యథాస్థితిని సమర్థించే పనికి పూనుకున్నారు. అనివార్యమైన సామాజిక మార్పు క్రమాల వల్ల  గ్రామీణ కుల వృత్తుల బంధనాల నుండి, ప్రత్యక్ష అంటరానితనం నుండి దళిత బహుజనులు ఎంతోకొంత బయటికి రావడాన్ని గుర్తించలేకపోయారు. అందులో భాగంగానే పల్లె సంస్కృతిని  కీర్తించే ధోరణులతో రచనలు చేయడం, గతం పట్ల నోస్టాల్జియాను ప్రకటించడమూ  మనం గమనించవచ్చు. అంటరానితనానికి, ఆర్థిక సమస్యకు  మధ్య లేని పోటీని తీసుకువచ్చి, ఆర్థిక సమస్యల పరిష్కారమే ప్రధానమని చెప్పిన/చెప్పే ప్రగతిశీలుర ధోరణులను పసునూరి  కూడా పసిగట్టాడు. అందుకే ‘ఆత్మగౌరవం లేని చోట అన్నం ఎలా సహిస్తుంద’ని పసునూరి ప్రశ్నిస్తున్నాడు.

అయితే పట్టణాలకు, దేశాంతరాలకు వలసవెళ్తే  కుల వివక్ష, అంటరానితనం పోయాయని కాదు. అవి రూపం మార్చుకుని సరికొత్త దాడి చేస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు, గోవర్ణ భూవెంచర్లు, కుల(బ్రాహ్మణ) కాలనీలు అటువంటి ఆధునిక అంటరానితనాన్ని, కులవివక్షను ఎత్తి చూపుతున్నాయి. ఈ మనువాద భాగోతాన్నంతా పసునూరి తన కథల్లో చూపించాడు.

స్థలకాల గమనాలలో  నిర్దిష్టత ప్రాధాన్యతను గుర్తించడమే ఈ పసునూరి కథల విశిష్టత. నిర్దిష్ట స్థలకాలాలలో  వాస్తవిక జీవితాన్ని పట్టించుకోకుండా సమకాలీన చారిత్రక గమనాన్ని సక్రమంగా అర్థంచేసుకోవడం సాధ్యం కాదు. అలాగే భవిష్యత్ చరిత్ర నిర్మాణంలో ఏయే సామాజిక శక్తుల పాత్ర ఏమిటో సరిగ్గా గుర్తించలేము.

వ్యక్తిగతమంతా  రాజకీయమేనని స్త్రీవాదులు అన్నట్టుగా మిగతా అస్తిత్వవాదులు అన్నా, అనకపోయినా అస్తిత్వ వాదాలు లేవనెత్తిన చర్చను రాజకీయ చర్చగానే నిజమైన మార్క్సిస్టులు భావిస్తారు. ఆయా వాదాలు సంధించిన   విమర్శనాత్మకతను వెయ్యి చేతులా  ఆహ్వానిస్తారు. అయితే ఆయా విమర్శనాత్మక వైఖరులను గతం నుండి నేటి దాకా సమాజం భిన్న రకాలుగా అర్థం చేసుకోవచ్చు. యథాస్థితి వాదులు,  పరివర్తనా శక్తులు పరస్పర వ్యతిరేకంగా, భిన్న విధాలుగా స్పందించారు. మార్పుకోరే  శక్తుల మధ్య, మార్పు కోసం పోరాడే ప్రజా సమూహాల మధ్య ఈ చర్చ నిరంతరంగా జరగాల్సిన అవసరం ఉంది. వివిధ అస్తిత్వాలు తమ తమ విముక్తిని సాధించడానికి సమస్యల ప్రాతిపదిక పైనైనా ఉమ్మడి సమన్వయ పోరాటాలను నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. అటువంటి ఉమ్మడి  పోరాటాల ద్వారానే మార్పు కోసం పోరాడే శక్తుల మధ్య మరింత ఐక్యత సాధ్యమవుతుందని భావిస్తున్నాను.

ఈ కథలకు వెనుక మాటలను, పసునూరి రాసిన  ముందుమాట ‘ వెలివాడల వ్యథ’నూ  నేను చదివాను. వెనుకమాటలలో  కొన్ని చర్చనీయాంశాలు ఉన్నప్పటికీ, పసునూరి రాసిన ‘వాస్తవాల మీద తలా పిడికెడు మట్టేసి నిజాలకు సమాధికట్టే మేస్త్రీలు మనలోనే, మన చుట్టూనే’ ఉన్నారన్న శక్తివంతమైన ఒక్కవాక్యమే  నాకెంతో భరోసాని  చ్చింది. ఆ అతి ముఖ్యమైన భరోసాతోనే ఆయన కథలపై ఈ నా నాలుగు  వాక్యాలు.

Leave a Reply