‘వారు తెలివైన ఆయుధాలను కనిపెట్టారు. కానీ మేము మరింత ముఖ్యమైనది కనిపెట్టాము: ప్రజలు ఆలోచిస్తారు, అనుభూతి చెందుతారు.’ ఫెడల్ కాస్ట్రో

అనేక పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రజారోగ్య విధానాలలో వైఫల్యాన్ని COVID-19 విపత్తు బహిర్గతం చేసింది. IMF, ప్రపంచ బ్యాంక్ పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడిన ఆరోగ్యం, విద్యా కార్యక్రమాలలో కోతలు చేసిన దశాబ్దాల నయా ఉదారవాద కాఠిన్యం, ఇప్పుడు లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా అంతటా వ్యాప్తిస్తున్న ప్రమాదకరమైన అంటువ్యాధులు, మరణాలలో ఫలితాలను చూపుతోంది.

పాశ్చాత్య దేశాలలో, క్యూబా సమర్థతకు ఒక ఉదాహరణగా నిలిచింది. విపత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరొక మార్గం సాధ్యమని చూపించింది. సంఖ్యలు తమంతట తామే మాట్లాడతాయి; క్యూబాను ఇతర దేశాలతో లేదా ఇలాంటి జనాభా ఉన్న పెద్ద నగరాలతో పోలిస్తే ఫలితాలలో వున్న వ్యత్యాసం మనకు స్పష్టమైన అవగాహననిస్తుంది. సుమారు 11,350,000 మంది జనాభా వున్న క్యూబాలో – ఫిబ్రవరి 21 నాటికి – కోవిడ్-19 కేసులు 45,361 వుంటే 300 మంది మరణించారు.

గ్రేటర్ న్యూయార్క్ సిటీ ప్రాంతంలో వున్న, సుమారు 18,800,00 మొత్తం జనాభాలో సంచిత కేసులు 700,815, మరణాలు 28,888; క్యూబా కంటే తక్కువ జనాభా, సుమారు 8,600,000 మంది ఉన్న స్విట్జర్లాండ్‌లో COVID-19 కేసులు 5,50,224, మరణాలు 95,022 ఉన్నాయి.

న్యూయార్క్ వంటి నగరం లేదా స్విట్జర్లాండ్ వంటి దేశం కంటే చాలా తక్కువ వనరులు ఉన్న దేశం విపత్తు వ్యతిరేక పోరాటంలో మరింత సమర్థవంతంగా పనిచేయడాన్ని ఎలా వివరించాలి?

సమాధానం చాలా సులభం: వైద్య భీమా ప్రణాళికలు, పెద్ద ఔషధ కంపెనీలు, ప్రైవేటీకరించిన వివిధ ఔషధం రంగాల ప్రయోజనాల కోసం, అభివృద్ధి చెందిన దేశాలు గర్వంగా చెప్పుకునే ఖరీదైన ‘హైటెక్’ ఔషధాల కోసం కాకుండా, దేశంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి వనరులతో ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను నిర్మించడంపై 1959 క్యూబా విప్లవం కేంద్రీకరించింది. విప్లవం తరువాత, క్యూబాలోని డాక్టర్లలో దాదాపు సగం మంది దేశాన్ని వదిలి వెళ్లడంతో, ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చగలగడంలో కొత్త ప్రభుత్వ సామర్థ్యం బాగా పరిమితమైపోయింది. కొత్త ఆరోగ్య నిపుణుల శిక్షణలో – ప్రజలలో – గ్రామీణ ప్రజలకు, ప్రత్యేకించి ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసిన నల్లజాతీయులకు వైద్య సంరక్షణను విస్తరించాలనేది విప్లవకర ప్రభుత్వ నిర్ణయం.

ఈ విధంగా, క్యూబా 1958లో 2,500 వున్న నర్సుల సంఖ్యను ఒక దశాబ్దం తరువాత 4,300కు పెంచగలిగింది. క్యూబా తన టీకాలు వేసే భారీ కేంపెయిన్‌ల ద్వారా, 1962లో పోలియోను, 1967లో మలేరియాను, 1972లో శిశు ధనుర్వాతాన్ని, 1979 లో డిఫ్తీరియాను, 1989 లో పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్‌ను (పొంగిన ఎర్ర పొక్కులు), 1993 లో పోస్ట్-కాజ్ మెదడు వాపు వ్యాధిని (మెనింజైటిస్‌ను), 1995 లో రుబెల్లాను, 1997 లో క్షయ మెనింజైటిస్‌ను తొలగించింది. నేడు, క్యూబా శిశు మరణాల రేటు యునైటెడ్ స్టేట్స్ కంటే తక్కువగానూ, అమెరికాలోని నల్లజాతి జనాభాలో సగం కంటే తక్కువగానూ ఉంది. క్యూబాలో అంతకుముందు 58.8 సంవత్సరాలు మాత్రమే వుండిన ఆయుర్దాయం 1983 నాటికి, అంటే విప్లవం తరువాత కేవలం రెండు దశాబ్దాలకి, 73.8 సంవత్సరాలకు పెరిగింది,.

లాటిన్ అమెరికాలో ఆరోగ్య సంరక్షణ దీర్ఘకాలిక కొరతకు వనరులు లేకపోవడాన్ని కారణంగా చాలా మంది ప్రజారోగ్య నిపుణులు చూపిస్తే, వున్న పరిమిత వనరులను సమానంగా పంపిణీ చేసినప్పుడు, ప్రజలు, నివారణ, ప్రజారోగ్యాలకు ప్రాధాన్యత ఇచ్చిన్నప్పుడు, గతంలో ఎన్నడూ ఊహించని ఫలితాలను సాధించగలం అని క్యూబా విప్లవం నిరూపించింది. అనేక దక్షిణాది దేశాలలో బలవంతంగా విధించబడిన, ఉత్తరాది దేశాలలో ఉన్నత ఆర్థిక వర్గాలు ప్రాధాన్యత యిచ్చిన నయా ఉదారవాద విధానం క్యూబాలో భిన్నమైన మార్గానికి దారితీసింది. ఏ మార్గం సరైనదో COVID-19 విపత్తు చాలా స్పష్టంగా చూపించింది

ఉత్తర ప్రాంతంలోని ధనిక దేశాలలో, నయా ఉదారవాద కఠినత్వం దశాబ్దాలుగా ఆరోగ్య బడ్జెట్లలో, ముఖ్యంగా అర్హులైన సిబ్బంది సంఖ్యను తగ్గించే రూపంలో, క్రమంగా కోతలకు కారణమైంది. దీనికి భిన్నంగా క్యూబా, అంతకంతకు పెరుగుతున్న ఆరోగ్య నిపుణుల శిక్షణకోసం పెట్టుబడి పెట్టింది. అంటువ్యాధులు వ్యాపిస్తున్నప్పుడు, పరిస్థితిని ఎదుర్కోవటానికి అవసరమైన సిబ్బందిని, వనరులను కేటాయించే సామర్థ్యం క్యూబాకు ఇప్పటికే ఉందని స్పష్టమైంది. ఇందుకు భిన్నంగా, ఉత్తరాదిలోని సంపన్న దేశాలలో, ఈ ప్రైవేట్ ప్రయోజనాలు ఘర్షణ పడినప్పుడు సరైన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల సిబ్బంది కొరత, ప్రజా మౌలిక సదుపాయాలు సంక్లిష్టంగా తయారయ్యాయి. పర్యవసానంగా, మొదటిసారి క్యూబాని ఇటలీ వంటి కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన ఉత్తరప్రాంత దేశాలకు సహాయాన్ని తీసుకురావాలని కోరింది. క్యూబా వైద్యులు, ఇతర ఆరోగ్య నిపుణులు కూడా అండోరాకు, ఫ్రాన్స్ లోని అల్ట్రా-మెరైన్ కరేబియన్ విభాగాలు మార్టినిక్, గ్వాడెలోప్‌లకు తమ సహాయాన్ని అందించారు. నయా ఉదారవాద నమూనా దివాలాతనానికి ఇంతకంటే గొప్ప ప్రదర్శనను ఎవరూ వూహించలేరు.

క్యూబన్ విప్లవం, ఆరంభం నుండే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనేక భౌతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇతర దేశాలకు సహాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. 1963లో, విప్లవం తరువాతి కేవలం నాలుగు సంవత్సరాలకి, తీవ్ర అంతర్గత సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ క్యూబా, ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్ర్యం పొందడానికి దశాబ్దాల తరబడి జరిగిన రక్తపాత యుద్ధంలో విధ్వంసమైన అల్జీరియాకు తన మొదటి వైద్య సహాయ బృందాన్ని పంపింది. 1966 లో, సోవియట్ యూనియన్, క్యూబా, క్యూబా వైద్య సిబ్బంది విరాళంగా ఇచ్చిన 200,000 మోతాదుల పోలియో వ్యాక్సిన్ సహాయంతో, కాంగో ప్రభుత్వ సహకారంతో, ఆఫ్రికాలో మొట్టమొదటి సామూహిక టీకా కేంపెయిన్‌లో క్యూబా 61,000 మందికి పైగా పిల్లలకు టీకాలు వేయడాన్ని సమన్వయం చేసింది. యిప్పటివరకు, 154 పైగా దేశాలలో వైద్య సహాయం అందించడానికి క్యూబా 124,00 మందికి పైగా ఆరోగ్య సిబ్బందిని పంపించింది.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తన సొంత వైద్య సిబ్బంది చేసిన ఈ అద్భుతమైన సహాయంతో పాటు, ఆరోగ్య నిపుణులకు, ప్రధానంగా పేద దేశాల నుండి, తన ‘ఎస్కుల లాటినో అమెరికానా డి మెడిసిన్’ (ELAM – లాటిన్ అమెరికన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)లో శిక్షణనివ్వడం క్యూబా చేసిన మరొక ముఖ్యమైన సహకారం. 1999 లో స్థాపితమైన ELAM క్యూబన్ సాధారణ సంగ్ర వైద్య విద్యా నమూనా ననుసరించి (మోడల్ ఆఫ్ మెడిసిన్ జనరల్ ఇంటిగ్రల్ – MGI – జనరల్ ఇంటిగ్రల్ మెడిసిన్) విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ప్రధానంగా ప్రజారోగ్యం, ప్రాధమిక సంరక్షణలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవటానికి సమగ్ర దృష్టికోణంతో, జీవశాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజకీయాలను కూడా బోధిస్తుంది. ELAM లో వున్న విదేశీ విద్యార్థులకు విమాన ఛార్జీలు మినహా మిగతా అన్ని ఖర్చులు క్యూబా రాజ్యం చెల్లిస్తుంది. ప్రధానంగా ఆఫ్రికా నుండి, అయితే అమెరికాలోని పేద ప్రాంతాలతో సహా, 2020 నాటికి, ELAM 100 కంటే ఎక్కువ దేశాల నుండి 30,000 మంది కొత్త వైద్య పట్టభద్రులను చేసింది. ఈ విద్యార్థులలో చాలామందికి తమ దేశంలో మెడిసిన్ అధ్యయనం చేసే అవకాశం ఉండదు. తిరిగి వచ్చిన తరువాత తమ తోటి పౌరులకు అమూల్యమైన, యింతకు ముందు కొన్నిసార్లు లేదా యిప్పటికీ అందుబాటులో లేని, అంటువ్యాధి సంబంధిత సంరక్షణతో సహా, సేవలనందిస్తారు. ELAM ప్రకారం, క్యూబా నుంచి సుమారు 52,000 మంది ఆరోగ్య నిపుణులు 92 దేశాలలో పనిచేస్తున్నారు, అంటే G-8 దేశాలు ఉమ్మడిగా యిచ్చిన ఆరోగ్య నిపుణులందరి కంటే కూడా క్యూబానుంచి విదేశాలలో పనిచేసే వైద్యులు ఎక్కువ మంది వున్నారు.

వచ్చే లాభాన్ని బట్టి వనరులను ఎక్కడ ఎలా కేటాయించాలో నిర్ణయించే ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థలో కాకుండా, ప్రజల ఆరోగ్యం పట్ల , ముఖ్యంగా పేదలు, అత్యంత అణగారిన ప్రజల పట్ల,వారికున్న నిబద్ధత కారణంగా సుదూర దేశాలలో పని చేస్తున్న క్యూబన్ వైద్యులు దాడులకు గురతున్నారు. బ్రెజిల్‌లో, ఎన్నికైన అధ్యక్షుడు దిల్మా రూసెఫ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగాక, జువార్ బోల్సోనారో అక్రమంగా అధికారంలోకి వచ్చాక క్యూబా వైద్యులు ఆ దేశాలు విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. బొలీవియాలో అధ్యక్షుడు ఐవో మోరలెస్‌కు పైనా, హోండురస్‌లో అధ్యక్షుడు జోలయాపై పైనా తిరుగుబాటు తరువాత కూడా అదే జరిగింది. అంతకు ముందు అందుబాటులో లేని వైద్య సేవలు చేసేది క్యూబా వైద్యనిపుణులు మాత్రమే కావడం వల్ల ఈ అన్ని సందర్భాల్లోనూ పేదలు ఎక్కువగా కష్టాలపాలయ్యారు. 1979 లో, క్యూబా గ్రెనడాకు ఒక మెడికల్ మిషన్ పంపింది; ప్రధానంగా క్యూబన్ నిపుణులు చేసిన కృషి వల్లనే, 1982 నాటికి దేశంలో శిశు మరణాల రేటు 25 శాతానికి తగ్గిపోయింది. కానీ 1983 లో అమెరికా గ్రెనడాపై దురాక్రమణ చేశాక క్యూబా ఆరోగ్య సిబ్బందిని బహిష్కరించారు.

అయితే, COVID-19 విపత్తుకి సంబంధించి, ఒక దేశం నుంచి క్యూబా డాక్టర్లను పంపించివేయడం, నిర్మాణాత్మక పున:సర్దుబాట్లను విధించడం – లాంటి రెండు చర్యలూ చేబడితే వచ్చే చాలా దారుణమైన ఫలితాలను సూచించే ఉదాహరణ ఈక్వెడార్. 2017 లో ప్రెసిడెంట్ లెనిన్ మోరెనో ఎన్నికైన తరువాత, మునుపటి అధ్యక్షుడు రాఫెల్ కొరియా మద్దతుతో పనిచేస్తున్న క్యూబా ఆరోగ్య నిపుణులు దేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అధ్యక్షుడు మోరెనో తీసుకున్న చర్య వల్ల, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆరోగ్య బడ్జెట్‌లో 36% కోత పెట్టాలని సిఫారసు చేసింది. ఈ రెండు చర్యలు దేశానికి దాదాపు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను లేకుండా చేయడంతో, COVID-19 విపత్తు నుంచి రక్షణ లేకుండా పోయింది. పర్యవసానంగా, ఈక్వెడార్ లోని అతిపెద్ద నగరమైన ఒక గుయాక్విల్‌లోనే , సుమారు 270 కోట్లమంది జనాభాలో 7,600 మంది మరణించారు. మొత్తం క్యూబా కంటే యిది 25 రెట్లు ఎక్కువ.

COVID-19 విపత్తుని ఎదుర్కోటానికి క్యూబా అందించిన అతిపెద్ద సహకారం మెడికల్ బ్రిగేడ్, ELAM. కానీ మరొక అత్యంత ముఖ్యమైనది: హవానాలోని ఫినాలే వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న సావరిన్ II వ్యాక్సిన్. ఈ ఏడాది చివరివరకు మొత్తం జనాభాకు తన స్వంత వ్యాక్సిన్‌తో టీకాలు వేయాలని క్యూబా ఆశిస్తోంది. మరోసారి చెప్పాలంటే, టీకా ఉత్పత్తి కోసం క్యూబా అనుసరించిన సోషలిస్టు విధానం ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలు అవలంబిన విధానానికి మౌలికంగా భిన్నమైనది. క్యూబా అంతర్జాతీయ అనుభవ ఫలితం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన అనేక కార్యాల (మిషన్) ద్వారా, క్యూబన్ వ్యాక్సిన్ కోసం అనేక పేద దేశాలు నిరీక్షిస్తున్నాయి, ఎందుకంటే, మళ్ళీ క్యూబా అంతర్జాతీయ సంఘీభావాన్ని ఆశించవచ్చు.

డబ్ల్యూ. టి. విట్నీ, జూనియర్ రాసిన ఒక వ్యాసం ప్రకారం (https://www.peoplesworld.org/article/cuba-develops-covid-19-vaccines-takes-socialist-approach/):: “తయారయ్యే పది కోట్ల సావరిన్ II మోతాదుల్లో మొత్తం క్యూబా దేశస్థులకు మార్చి లేదా ఏప్రిల్ నుండి ప్రారంభించబోయే వ్యాక్సిన్ ఇవ్వడానికి 11 మిలియన్లు సరిపోతాయి. మిగిలిన ఏడు కోట్ల వియత్నాం, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, వెనిజులా, బొలీవియా, నికరాగువాకు పంపిస్తారు.” వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్, ఫిడేల్ కాస్ట్రోలు 2004 లో స్థాపించిన సంఘీభావ కూటమిని సూచిస్తూ సావరిన్ II ‘ALBA వ్యాక్సిన్’ గా పిలుస్తారని వెనిజులా ఉపాధ్యక్షులు డెల్సి రోడ్రిగ్ వివరించారు.

“వ్యాక్సిన్లను వాణిజ్యీకరించడంలో క్యూబా వ్యూహం మానవజాతికి ఉపయోగకరమైన, ప్రపంచ ఆరోగ్యంపై ప్రభావం చూపే కలయిక. మేము ఆర్థిక లక్ష్యం ప్రధానంగా వున్న బహుళజాతి సంస్థ కాదు; అని క్యూబా యొక్క ఫినాలే వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ విసెంటే వెరెజ్ బెంకో వివరణ.వైద్య సేవలు, ఔషధాల ఎగుమతి విషయంలో లాగానే విదేశాలలో వ్యాక్సిన్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం క్యూబాలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పెన్షన్ల కోసం వినియోగిస్తారు……… క్యూబన్ విధానానికి భిన్నంగా, “ఫోర్బ్స్.కామ్ ప్రకారం, నవంబర్ 2020 లో మోడెర్నా [వ్యాక్సిన్] FDA ఆమోదం పొందగలిగితే, అవసరమైనన్ని మోతాదులను చేయగలిగితే, గత 12 నెలల్లో కన్నా దాని అగ్ర శ్రేణి దాదాపు 35 బిలియన్లు డాలర్లు ఎక్కువ కావచ్చు…. ”” అని వ్యాస రచయిత అంటారు.

మరొక నివేదిక ప్రకారం;కంపెనీలు (ఫైజర్, మోడెర్నా) ఈ సంవత్సరం తమ COVID వ్యాక్సిన్ల ద్వారా బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించాయి, రాబోయే సంవత్సరాలలో మరింతగా లాభాలు వస్తాయి. ఆ కంపెనీలు అధిక మొత్తంలో మేధో సంపత్తి హక్కులకు దావా చేస్తాయి.

కార్పొరేట్ సంస్థల అజమాయిషీ వల్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ల పంపిణీ తప్పుదారి పట్టింది. జనవరి 27 నాటికి, సుమారు 66.83 మిలియన్ మోతాదుల్లో 93 శాతం వ్యాక్సిన్ 15 దేశాలకు మాత్రమే సరఫరా అయింది. లాటిన్ అమెరికాలో, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, చిలీలు మాత్రమే మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి తగిన సేకరణ ఒప్పందాలను చేసుకొన్నాయి. ఆఫ్రికన్ దేశాలతో కంపెనీల ఒప్పందాలు 2021 లో ఆఫ్రికన్లలో 30 శాతం మందికి మాత్రమే టీకాలు వేయడానికి అనుమతిస్తాయి. అర్థవంతమైన టీకాలువేయడం ఇంకా ప్రారంభం కావాల్సి వుంది.

“సంపద విభజన పంపిణీ ప్రక్రియను నిర్ణయిస్తుంది. డ్యూక్ విశ్వవిద్యాలయంలోని ఎపిడెమియాలజిస్టుల (అంటువ్యాధుల నిపుణులు), నివేదిక ప్రకారం ; అధిక ఆదాయం ఉన్న దేశాలు ప్రపంచ జనాభాలో 16శాతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు 60% COVID-19 టీకాలను కొనుగోలు చేశాయి. క్యూబా జర్నలిస్ట్ రాండమ్ అలోన్సో నివేదిక ప్రకారం తక్కువ లేదా మధ్య ఆదాయం వున్న దేశాల మొత్తం జనాభాలో 27 శాతానికి మాత్రమే ఈ సంవత్సరం టీకాలు వేయవచ్చు.

విప్లవం జరిగినప్పటి నుండి క్యూబా, సామ్రాజ్యం, దాని మిత్రదేశాల నిరంతర దాడికి గురైంది. ఆర్థిక ఆంక్షలు, అంతరాయాలు వల్ల ప్రజలు కష్టాలకు లోనయ్యారు. క్యూబా కొనసాగించే అంతర్జాతీయ పని సామర్థ్యానికి గణనీయమైన హాని కలిగింది. ఏదేమైనా, అటువంటి మొండి పట్టుదల ఉదాత్తత కలిగిన ఈ చిన్న దేశం ప్రపంచానికి ఎల్లప్పుడూ ఒక ఆశా కిరణంగా ఉంది. అన్నింటికంటే మించి, క్యూబా గొప్ప దృఢత్వం , నిష్పాక్షికత, ధీరత్వం, అచంచలమైన ఆనందంతో ముందుకు సాగడానికి మార్గం చూపిస్తుంది.

అనువాదం : కె.పద్మ

Leave a Reply