దండకారణ్య విప్లవోద్యమంలో నాలుగు దశాబ్దాలు అలుపెరుగని, మడిమ తిప్పని గొప్ప విప్లవ కారుడు, ప్రజల ముద్దు బిడ్డ శంకరన్న. ఆయన 1960లలో సిరొంచ తాలూకాలోని అంకీస-ఆసరెల్లిలకు సమీపంలో కల సాతాన్ పల్లిలో నిరుపేద ఆదివాసీ వాసం వారి కుటుంబంలో పుట్టాడు. ఆయనకు తల్లి-తండ్రులు శివా అని పేరు పెట్టుకున్నారు. ఆయన వాసం శివా గానే పెరిగాడు. అందరాదివాసీ పిల్లల లాగే ఆయన చదువు సంధ్యలు నోచుకోలేదు. చదువుకోవాలనే కోరిక ఎంతున్నా పేదరికం అనుమతించలేదు. ఆయన నవ యవ్వన ప్రాయంలోనే విప్లవ రాజకీయాల ప్రభావంలోకి వచ్చి అనతికాలంలోనే పూర్తికాలం విప్లవకారుడిగా విప్లవోద్యమంలో చేరిపోయాడు. గడ్ చిరోలీ జిల్లాలో ఉద్యమంలో చేరిన తొలి పూర్తికాలం విప్లవకారుడు ఆయనే. పెద్ది శంకరన్న అమరుడైన తరువాత ప్రజలలో పోలీలసులు నెలకొల్పిన భయానక వాతావరణంలో నిర్భయంగా, త్యాగనిరతితో 1982 ఫిబ్రవరిలో విప్లవోద్యమంలో చేరి తన పేరును శంకరన్నగా నిలుపుకున్నాడు. అప్పటి నుండి ఆయన ఒక ద్రోహి చేతిలో 28 అక్టోబర్ నాడు తుది శ్వాస విడిచే వరకు ఒక గెరిల్లాగా, విప్లవ పార్టీ నాయకుడుగా, ఉద్యమాల ప్రజా నాయకుడిగా, గాయకుడిగా, రచయితగా, కళాకారుడిగా స్థానిక ప్రజల గుండెలలో నిలిచిపోయాడు. నాలుగు దశాబ్దాలు శంకరన్నగా విప్లవ సేవలు అందించిన వాసం శివాకు వినమ్రంగా తలవంచి విప్లవజోహార్లర్పిద్దాం.


పేద కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ శంకరన్నశ్రమజీవి. ఆయన చిన్నతనం నుండి కూలీ పనులకు ప్రధానంగా అటవీశాఖ వారి పనులకు వెళ్లేవాడు. పసుల గాచి, వ్యవసాయ పనులు చేసి ఇంటి వాళ్లకు తోడయ్యేవాడు. ఆయన పేదరికంతో పాటు సమాజంలోని దోపిడీ, పీడనలను అనుభవించాడు. తమ ప్రాంతంలో పేరుమోసిన భూస్వాములు వుండేవారు. వారి వద్ద కూలీలు, జీతగాళ్లు అనుభవించే నరకయాతన ఆయనకు తెలుసు. అలాంటి పరిస్థతులలో గోదావరి దాటి విప్లవోద్యమం తమ ప్రాంతానికి చేరడంతో సహజంగానే యువతరంలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. అయితే, ప్రారంభ దినాలలోనే పెద్ది శంకర్ ను కాల్చి చంపిన పోలీసులు విప్లవకారుల గురించి ప్రజలలో హంతకులనీ, దొంగలనీ, పిల్లలను అపహరించుకుపోతారనీ రకరకాలుగా భయం గొలిపే కథనాలను ప్రచారం చేయడంతో వాస్తవాలు తెలియని జనాలు ఆందోళనగానే వుండేవారు.


కామ్రేడ్ శంకరన్న వాళ్లకు అప్పటికే గోదావరి తీరం వెంట, ఇంద్రావతి, గోదావరి సంగమానికి అవతల కరీంనగర్ జిల్లాలో, బస్తర్ ప్రాంతంలో బంధువులు వుండడంతో, 1970లలో అక్కడ జరిగిన విప్లవ పోరాటాల గురించి ప్రజలకు వాస్తవమేంటో తెలుసు. కాబట్టి వారు పోలీసుల తప్పుడు ప్రచారానికి భయపడకుండా విప్లవకారులకు సహాయపడేవారు. గోదావరికి ఇరువైపుల విప్లవకారుల రాకపోకలలో తోడ్పడేవారు. నది దాటాడానికి ఓడలు వేసేవారు, చిట్టీలు అందించేవారు. ఆ క్రమంలో పెరిగిన పరిచయాలతో, విప్లవకారులతో సాన్నిహిత్యం పెరిగిన శివా ప్రజలను సంఘటితం చేసే పనులలో పాల్గొనసాగాడు. ఆ రోజులలో అటవీ శాఖవారంటేనే జనాలు విపరీతంగా జడుసుకునే వారు. వారిపైనే శివా పోరాటాలు మొదలయ్యాయి. మరోవైపు ఆ ప్రాంతంలోని దుష్ట భూస్వామ్య శక్తుల దోపిడీ అణచివేతలను వ్యతిరేస్తూ ప్రజలను సంఘటితం చేస్తున్న విప్లవ పార్టీ కార్యక్రమాలతో శంకరన్న చాలా ప్రభావితుడయ్యాడు.


శంకరన్న కదలికలు అర్థమైన పోలీసులు ఆయనపై నిఘా పెట్టి ఆయన్ని 1981లో అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలు జీవితం గడిపి బయటకు వచ్చేసరికి వాతావరణం అంతా కమలాపుర్ రైతు కూలీ మహసభలతో ఎర్రబారింది. పోలీసులు, అటవీశాఖ వారు అనేక కుట్రలకు పాల్పడి ఆ మహాసభ జరుగకుండా చేశారు. కానీ, ఆ వాతావరణంతో మరింత ఉత్తేజితుడైన వాసం శివా ను విప్లవోద్యమంలో చేరకుండా ఏ శక్తి ఆపలేకపోయింది. విప్లవోద్యమంలో చేరిన శివా అమరుడు పెద్ది శంకర్ స్మృతిలో శంకరన్నగా మారి అమరుల సాక్షిగా, వారి ఆశయాల సాధనకై తుదివరకూ అలుపెరుగని కృషి చేశాడు. ఆయన అజరామరుడు.

 
గడ్ చిరోలీ జిల్లాలోని అన్ని ఏరియాలు,  వందలాది గ్రామలు, వేలాది జనాలకు ఆయన సుపరిచితుడు. ఆయన పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, పురుషులకు ఆప్తుడు. స్నేహశీలి. పార్టీ కార్యకర్తలకు పెద్ద దిక్కు. జిల్లాలో జరిగిన ప్రజా పోరాటాలను, విజయాలను, ప్రజల బతుకులను, వారి కష్టాలను, కన్నీళ్లను, చరిత్రను, సంస్కృతిని నూతన తరాలకు అందించే సజీవ ఎన్ సైక్లోపీడియా ఆయన. అలాంటి శంకరన్న భౌతికంగా లేడని చెప్పడానికే మనసు అంగీకరించడం లేదు. కలం సాగడం లేదు. కానీ, అది వాస్తవం. పోలీసులతో సంబంధాలు నెరపుతున్న ద్రోహి శంకరన్న దేహాన్ని తుపాకీ గుళ్లకు బలిగొన్నాడు. కానీ, శంకరన్న ఆశయాలకు మరణం లేదు. అవి భౌతిక శక్తిగా ప్రజలకు నిత్యం కొత్త శక్తిని ఇస్తాయి.


శంకరన్న తొలుత దళ సభ్యుడిగానే విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. తన ఏరియాలోనే పని చేశాడు. కానీ, ఉద్యమ అవసరాలకు అనుగుణంగా ఆయన జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పని చేశాడు. ఆయన రాజకీయ, సైనిక శిక్షణా శిబిరాలలో పాల్గొంటూ అన్ని విద్యలు అభ్యసిస్తుండగానే దండకారణ్య విప్లవాభివృద్ధి క్రమంలో సాంస్కృతిక రంగ అభివృద్ధి మొగ్గతొడగింది. ఆదివాసీ ప్రజలను పోరాటాలలోకి దింపడంలో కానీ, వారిని విప్లవ ప్రజా సంఘాలలో సంఘటితం చేయడంలో కానీ తొలి గెరిల్లా దళాలు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు (ఆట-పాటలు) విప్లవ రాజకీయాలతో విడదీయలేనివి. గెరిల్లాలు తమ రాజకీయాలను ఆట-పాటలతోనే ప్రజలకు సునాయసంగా వివరించగలిగేవారు. పల్లె జనాలకు పాట ప్రాణం. ఆదివాసీ ప్రజలకు ఆట-పాటలు ఉగ్గుపాలతోనే అబ్బుతాయి. ఆ పాటలో వారి బతుకుండేది. ఆ పాటలలో వారి వెతలుండేవి. ఆ పాటలలో వారి కష్టాలు, కన్నీళ్లు, వారిపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు, పీడన అన్నీ వుండేవి. ఆ పాటలలో వాటి మూలాలుండేవి. ఆ పాటలలో బతుకు బాగుపడే బాటుండేది. అందుకే పాటలను ప్రజలు ప్రేమించేవారు. పాడేవారిని లాలించేవారు. ఆ జన సముదాయం నుండి వచ్చిన శంకరన్నకు పాటలంటే పిచ్చి ప్రాణం. ఆయుధం అంటే అంతకన్నా ప్రాణం. ఆ ఆయుధానికే ఆయన పాటలు అంకితం. ఆయన గెరిల్లా యోధుడు, సాంస్కృతిక సైనికుడు.  


విప్లవ రాజకీయాలు శంకరన్నకు పాటలు రాయడం నేర్పాయి. పాటలలో ప్రజల బతుకులను రంగరించి ప్రజల వద్దకు తీసుకెళ్లడం నేర్పాయి. సోదర సాంస్కృతిక సంస్థ జన నాట్య మండలి కళాకారులతో శంకరన్నపాడడం, పాటలపై నృత్యం చేయడం, హావాభావాల వ్యక్తీకరణను, ఆహర్య ప్రాధాన్యతను, వాయిద్య కళను అభ్యసించాడు. వారు దండకారణ్య కళాకారుల కోసం నిర్వహించిన అన్ని శిక్షణా కార్యక్రమాలలో పాల్గొని ఎరుపుతో పాటు నిపుణ కళాకారుడిగా ఎదిగి ఉద్యమానికి వన్నె తెచ్చాడు. ఆయన కోయలో, తెలుగులో, హిందీలో, మరాఠీలో వందలాది పాటలు రాశాడు. ఆయన అన్ని భాషలలో పాటలు పాడేవాడు. ఆయన పాటలు సంకలనం చేసి ఉద్యమం పాఠకులకు అందించింది. దండకారణ్యం ముఖ్యంగా గడ్ చిరోలీ జిల్లా ఉద్యమ ప్రజల నాలుకలపై ఆడే పాటలలో ఆయన పాటలే అధికం అనడం అతిశయోక్తి కాదు.


దండకారణ్య విప్లవోద్యమ అభివృద్ధిలో భాగంగా ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీ.ఎల్.జీ.ఏ), చేతనా నాట్య మంచ్ (సీ.ఎన్.ఎం) రెండూ దాదాపు ఏకకాలంలోనే ఆవిర్భవించాయనుకోవచ్చు. ఒకటి సాయుధ సైన్యంగా ఆవిర్భవిస్తే, మరోటి ఆ సైన్యానికి పూరకంగా ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే సాంస్కృతిక సైన్యంగా ఆవిర్భవించింది. దండకారణ్యంలోని పీ.ఎల్.జీ.ఏ వర్గ సంపుటిని చూస్తే అది ప్రధానంగా పేద వర్గాల వారితోనే నిండివుండడం ఎంత వాస్తవమో, వారిలో అధిక భాగం గ్రామాలలో సీ.ఎన్.ఎంలో వుండి పని చేసి తమ కళా ప్రతిభను చాటుకొని సాయుధమైనవారే ననడం వాస్తవాన్ని తెలుసుకోవడమే తప్ప మరేం కాదు. వారు జనతన సర్కార్ ల పటిష్టతకు, విస్తరణకు శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రజలలో ప్రజా ప్రభుత్వాల ఆవశ్యకతను తెలియచేసి తదనంతర కాలంలో దాని రక్షణకై సాయుధమైన వారేననడం వారి ఎదుగుదలను, వారి కర్తవ్యాల నిర్వహణను తెలుసుకోవడం అవుతుంది. వాటి మధ్య గల కార్యాకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. చేతనా నాట్య మంచ్ ను  సైతం ఛత్తీస్ గఢ్ లో ప్రభుత్వం ఎందుకు నిషేధించిందో తెలుస్తుంది. ఆ యావత్ కృషిలో శంకరన్న భాగం, ఆయన పాట భాగం, ఆయన ఆట భాగం. ఆయన జీవితమే అందుకు అంకితం.

        
2002లో ఆయన అఖిల భారత విప్లవ సాంస్కృతిక కార్యశాలలో పాల్గొని తన వంతు భూమికను నిర్వహించాడు. చేతనా నాట్య మంచ్ ను ఒక విప్లవ ప్రజాసంఘంగా తీర్చిదిద్దాలనే స్పష్టతతో ఆయన ఆచరణలోకి దిగాడు. ఆ తరువాత 2004లో దండకారణ్యంలో ఏర్పడిన దండకారణ్య సాంస్కృతిక సబ్ కమిటీలో ఆయన తొలి నుండి సభ్యుడు. దాదాపు గడచిన 18 సంవత్సరాల సాంస్కృతిక సబ్ కమిటీ కృషిలో ఆయన పాత్ర విడదీయరానిది. ఆయన గడ్ చిరోలీకి చెందినవాడే అయినప్పటికీ, దండకారణ్య వ్యాప్తంగా ఆయన పర్యటించి విప్లవ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాడు. దండకారణ్యంలో కొనసాగిస్తున్న ప్రజా సాంస్కృతిక పరంపరలలో ఆయన లేకుండా దాదాపు ఏవీ జరగలేదేమో! దండకారణ్యంలో నిర్వహించిన సాహితీ కార్యశాలలో కానీ, కళా శిక్షణ శిబిరాలలో కానీ, అమరుడు గంగన్న (ప్రభాకర్) నిర్వహించిన డోల్ శిక్షణా శిబిరంలో కానీ శంకరన్న లేకుండా జరుగలేదు. మరి ఇపుడో! ఔను. ఇప్పుడూ జరుగవు. ఆయన దగ్గర సుశిక్షితులైన వందలాది ఆదివాసీ కళాకారులున్నారు. దండకారణ్యంలో వేల లోనే వారి సంఖ్య వుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఇటీవలే సేకరించిన లెక్కలలో మిగితా ప్రజా సంఘాల కన్నా చేతనా నాట్య మంచ్ సభ్యత్వం గణనీయంగా హిందుత్వ పాలకుల కాలంలోనే పెరగడం నూతన సంస్కృతిక వికాసానికి హామీనిస్తున్నది.

కామ్రేడ్ శంకరన్న తన నాలుగు దశాబ్దాల విప్లవ జీవితంలో నిర్బంధాలు అనేకం చూశాడు. ఆయన విప్లవోద్యమంలో చేరిందే నిప్పులు చెరుగుతున్న నిర్బంధకాలంలో! ఊరికి వచ్చిన గెరిల్లాలాలకు  బుక్కెడు బువ్వ పెట్టాలనీ కడుపుతో ఎంతో తన్లాడిన తొలి నిర్బంధ భయాలు వారినీ అందుకు అనుమతించేవి కావు.        1984లో గడ్ చిరోలీలో ప్రజలపై విరుచుకుపడిన నిర్బంధ, అణచివేత నుండి మొదలుకొని వర్తమాన ప్రహార్ దాడుల వరకు ఆయన సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్, సమాధాన్ లను ఎదుర్కొన్నాడు. ఆయన వాటి ఓటమిని, అంతిమంగా ప్రజల గెలుపును తన రచనలలో శాశ్వతం చేశాడు. బూటకపు ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్న వారి జీవితాలను తన పాటలలో సజీవం చేశాడు. వారి తల్లి-తండ్రులకు బిడ్డల చెదిరిపోని జాౣపకాలను అందించి కన్నీరు తుడిచాడు. పోలీసుల సామూహిక అత్యాచారాలకు బలవుతున్న తోబుట్టువులను ఓదారుస్తూ ఆయన వారిని కన్నీటి ధారలతో వారిలో కసిని, వర్గకసిని నింపాడు. కార్పొరేటు వర్గాల కోసం అడవిని సైన్యకరణ చేస్తూ ప్రజలను విస్తాపితులు చేయడానికి జరుగుతున్న కుట్రలను తన కలం శక్తితో జనం ముందుంచాడు. గడ్ చిరోలీ జిల్లాలోని సుర్జాగఢ్ కొండలను, బాబులాయ్, దంకొడివాహి, ఆగ్రా మసేలీ మున్నగు వాటిని కాపాడుకుందాం రండి అంటూ ప్రజలను పోరాట మైదానంలోకి దింపడానికి ఆయన ఆటైండు, పాటైండు, తుపాకిలో తూటైండు. జనం కోసం శంకరన్నసర్వస్వం ధారపోశాడు. వర్తమానంలో ఒక వెల్లువలా సాగుతున్న ప్రజా పోరాటాలను ఆయన తన పాటలలో ఎత్తి పట్టాడు. ఆయన పాటల విశిష్టత్వం ఏమంటే అవన్నీ ఆదివాసీ జన జీవితాలలో నుండి రూపొందినవి. ఆయన రాగం, ఆయన దరువు, ఆయన గాత్రం అన్నీ ప్రజల స్వంతం. అటువంటి శంకరన్నను మనం మళ్లీ పొందాలంటే నిజంగా చాలా శ్రమ పడాలి. కానీ, ప్రజలలో కోటానుకోట్ల శంకరన్నలను సృష్టించగల వనరుంది, శక్తి వుంది. దాన్ని సాగు చేయడమే మనం శంకరన్న బాటలో చేయగలిగినపుడు ఉద్యమంలో శంకరన్నలకు కొదువుండదు.

        
శంకరన్న అమరవీరుల పాటలను చాలా శక్తిమంతంగా అల్లేవాడు. వారితో గల అనుబంధాన్ని తన పాటలలో విప్లవోద్యమ చరిత్రతో మేళవించి రూపొందించేవాడు. ఉద్యమంలో ముందుకు వచ్చే ప్రతి ప్రజా సమస్యపై ఆయన పాటలు రూపొందించడంలో మంచి దిట్ట. గడ్ చిరోలీలో పెసా గ్రామసభలపై రూపొందించిన పాటలు ‘రేల’ సాంస్కృతిక బృందాలకు, కోల టీంలకు ఎరువునిచ్చాయి. దేశంలో విరుచుకుపడుతున్న హిందుత్వ శక్తుల ఆగడాలను ఎదుర్కోవాలనీ ఆయన ఆదివాసీ ప్రజలను జాగరూకులను చేయడంలో తన కలాన్ని అద్భుతంగా ప్రయోగించాడు. ఆయన సాంస్కృతిక కృషి అంతటికి జీవనాడి రాజకీయలే. ఆయన చాలా లోతైన అధ్యయనం చేసేవాడు. ప్రజల జీవితాలలో చోటుచేసుకుంటున్న అనేక మార్పులను అధ్యయనం చేసి సోదర కామ్రేడ్స్ తో షేర్ చేసుకునేవాడు.

దండకారణ్య సాంస్కృతిక పత్రిక చేతనా నాట్య మంచ్ అధికార పత్రిక ఝంకార్ కు అరుదుగానే అయినప్పటికీ ఆయన తన క్షేత్ర నివేదికలను, అధ్యయన అంశాలను అందించాడు. ఆయన ఒక కళాకారుడిగా, దండకారణ్య విప్లవోద్యమ సాంస్కృతిక కృషిలో అపార అనుభవం వున్నవాడిగా, దండకారణ్య సాంస్కృతిక రచనలో భాగమైనవాడుగా జననాట్య మండలి 50 వసంతాల రచనలో ఆయన తన తోడ్పాటును అందించాడు. శంకరన్న ఉద్యమంలో భాగమై, భాగంగా వున్న గెరిల్లా యోధను తన జీవన సహచరిగా ఎంచుకొని వివాహమాడాడు. కామ్రేడ్ శంకరన్న అమరత్వం ఆయన సహచరి యమునకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కానీ, ఆయన ఆశయాలలో, ఆలోచనలలో, ఆచరణలో భాగమైన ఆమె త్వరలోనే దుఃఖాన్ని అధిగమిస్తుందని ఆశిద్దాం. శంకరన్న ఎత్తిన జెండాను ఆమె సమున్నతంగా ఎత్తి పడుతుందని కోరుకుందాం.  

కామ్రేడ్ శంకరన్న అమరత్వం దండకారణ్య వుద్యమానికి ముఖ్యంగా వర్తమాన పరిస్తితులలో గడ్ చిరోలీ ఉద్యమానికి పెద్ద లోటే. కానీ, ఆ వుద్యమం ఒక ఫినెక్స్ లాంటిది. అది అక్కడి ప్రజల పూర్తి అండదండలతో తప్పకుండా పురోగమించి తీరుతుంది. 1984 నుండి దాని చరిత్ర ఆటుపోట్లు తో కూడుకున్నదే. ఆటు కాలంలో పనిచేసి పోటులను శంకరన్న నుండి నవతరం నేర్చుకోవాల్సిందే. కామ్రేడ్ శంకరన్నఅమరత్వం వెంటనే పూడ్చుకోలేని లోటే. కానీ, ఆయన నాయకత్వంలో ఎదిగివస్తున్న కొత్త తరం త్వరలోనే తమ నాయకుడి బాటలో సాంస్కృతిక వుద్యమాన్ని మరింత శక్తిమంతం చేసి తీరుతారనీ నిశ్చయంగా చెప్పవచ్చు. కామ్రేడ్ శంకరన్న అమరత్వం ఉద్యమ సహచరులకు పూడ్చుకోలేని లోటే. కానీ, ఆయన పాట, ఆయన ఆట, ఆయన మాట రోజూ ఇంధనంలా వారిలో నూతన శక్తిని ఎందుకు నింపవు? కచ్చితంగా నింపుతాయి. అమరుల గొప్పతనం వారి త్యాగాల ద్వార ప్రపంచం తెలుసుకుంటుంది. వారిని వినూత్నంగా ఆవిష్కరించుకుంటుంది. దండకారణ్య ఉద్యమ పొత్తిళ్లలో ఎదిగి వచ్చిన తొలి భూమి పుత్రుడు మనకిక భౌతికంగా లేడు.  కానీ మన శంకరన్న కొత్త జీవితం మృత జీవిగా ప్రారంభమైంది. ఈ జీవితం అమరం. అమరుల జీవితాలు అజరం.

         కామ్రేడ్ శంకరన్న అమర్ రహే.

Leave a Reply