అది జనవరి 2024 కొత్త సంవత్సరం. ప్రపంచం సంతోషంలో మునిగి ఉంది.  కొంతమంది రాత్రి 12 (ఉదయం అనుకోవచ్చు) తాగిన మైకం గూడ దిగక ముందే పొద్దున మళ్ళీ తాగి సంతోషంతో మునిగి పోయి వుండొచ్చు. మాకు ఆదివాసులకు అలాంటివి తెలియవు. మాకు 2005 నుండి, కష్టాలు కన్నీళ్ళ, తర్వాత గ్రీన్‌హంట్‌ 2017 నుండి సమాధాన్‌ 2022 నుంచి సూరజ్‌కుండ్‌ దాడి  జరుగుతూనే వుంది. అందుకే కొత్త సంవత్సరం అంటే మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఈరోజు మంచిగా ఎలా గడుస్తుందనే. అదే మాకు  మంచి రోజు.

ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్‌ తర్వాత ఎక్కువ కేంద్ర బలగాలు ఉన్నది మా బస్తర్‌లోనే. దీనికి  తోడు మా గ్రామాల నుంచి పారిపోయి డీఆర్జీలలాగా  అవతారం ఎత్తిన నరరూప నెత్తురు తాగే దోంలు (ఇంక మీరు వీళ్ళను ఏమనాలో నాకు తెలువదు) ఏరోజు ఏ గ్రామం పైన పడతారో  ఏ ఆదివాసీ మహిళ  అత్యాచారానికి గురవుతుందో,  ఏ ఇల్లు  మంటలకు బూడిద అవుతుందో, అడవికి పోయే ఏ ఆదీవాసీ రైతు ఎన్‌కౌంటర్‌ పాలై  పొలంలో శవమై తేలుతాడో, ఏ మహిళ.. ఏ పురుషుడు తప్పుడు కేసుల్లో  సంవత్సరాల తరబడి జైలు గోడల్లో బందీ కాబడతారో, ఎప్పుడు మేం కూడపెట్టుకున్న నాలుగు డబ్బులు, కోళ్ళు, మేకలు, పందులు, చివరికీ మేం మా ఎదపైన ఉపయోగించే బట్టలు కూడా ఎత్తుకెళ్ళుతారో తెలియదు. అందుకే మాకు కొత్త సంవత్సరం అంటే తెలువదు.

ఇక మేం మా భూమి, మా అడవి, మా నీళ్ళు మాకు దక్కాలంటే మేం కొట్లాడక తప్పదు. రెండు మూడు సంవత్సరాల నుండి  మా బతుకు కోసం సంఘర్ష్‌ చేస్తూనే వున్నాం. అయినా పోలీసు క్యాంపులు, రోడ్లు, బర్జులు, ఏ సర్కారూ ఆపటం లేదు. ఎందుకంటే వారికి మా బతుకులకంటే మా అడివి సంపదే ముఖ్యం. కాబట్టి సంవత్సరం సంవత్సరం క్యాంవుల పైన క్యాంపులు వేస్తూనే వున్నారు.

మాది బీజాపూర్‌ జిల్లా గంగలూర్‌ ఏరియా. మూడు సంవత్సరాలలో 13 క్యాంపులు వేసారు. అందులో భాగంగా మావి రెండు గ్రామాలు అరగంట ప్రయాణ పరిధిలో వుంటవి. కావడ్‌  మహిళా అమరవీరుల స్తూపం చాలా పెద్దది. అక్కడి నుండి అరగంట దూరంలో మాగ్రామం.. మేం ముద్దుం అంటాం. ప్రభుత్వం ముదువెండి అంటది. పోలీసులు కావడ్‌లో క్యాంపు వేసి మా గ్రామం వరకు రకరకాల గాడీలను ఉపయోగించి చుట్టుముట్టు అడవిలో, దారిలో పోలీసులు వుంటూ  రోడ్డు పనిచేస్తున్నరు. వాళ్ళు వేసే రోడ్డుకు ఏ ఇండ్లు అడ్డం వచ్చిన వాటని  కూల్చేసి రోడ్డు వేస్తరు. ఎందుకంటే మోడి సర్కార్‌ వచ్చిం తర్వాత బుల్‌డోజర్‌ సంస్కృతి తెచ్చాడు. ఈ ఘనత చరిత్రలో మోడి పేరున నిల్చిపోతది.  ఇదే కదా వాళ్ళ హిందుత్వ సంస్కృతి. అలా మా గుడిసె కూడ రోడ్డుకు దగ్గర్లో వున్నందున నేను నా ఇల్లు కూల్చుతారా అనే భయంతోనే నా ఆరు నెలల పాపను చంకలో ఎత్తుకొని పొద్దున నుండి  ఎటు వెళ్లకుండా అటుఇటు తిరుగుతూ ఇంట్లో పనులు చేసుకుంటు చూస్తున్నాను. సరిగ్గా సాయంత్రం మూడు నుండి నాలుగు గంగల సమయంలో ఇంటి  ముందుకొచ్చి నిల్చున్నాను. ఒకేసారి ఆటో ఫైరింగ్‌ చేసారు. నేను తేరుకునేలోపే ఒక తూటా నాచేతి వేళ్ళకు తగిలి నా ఆరునెలల పాప కడుపులో నుండి వెళ్ళి పోవటంతో నాబిడ్డ నా చేతుల్లోనే ప్రాణం విడిచింది. నేను వాళ్ళను తిడుతూ ఏడ్చుకుంట వుంటే ఫైరింగ్‌ చేసిన బ్యాచ్‌ వెళ్ళి పోయి తొందరలోనే ఇంకొక పోలీసు బ్యాచి వచ్చి నన్ను, నా చనిపోయిన పాపను బీజాపూర్‌ తీసుకెళ్ళారు. అక్కడ మొత్తం కథ తయారు చేసి బీజాపూర్‌ యస్‌ఐ  రెండవ తేదిన మీడియాలో ప్రకటన ఇచ్చారు. జనవరి ఒకటో  తేదిన సాయంత్రం నక్సలైట్లకు పోలీసులకు జరిగిన ఎన్‌ కౌంటర్లో నక్సలైట్ల తూట తగిలి  ఆరు మాసాల పాప చనిపోయి, ఒక మహిళకు గాయం అయిందనే  తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. అంతేకాదు పాపకు ఐదు లక్షలు నాకు రెండు లక్షలు డబ్బులు ఇస్తాం అన్నరు. నిజం బయటికి రావొద్దని ఆ డబ్బులతో  నాబిడ్డ వస్తదా? అప్పటి నుండి మా గ్రామానికి ఎవ్వరినీ రాకుండ చూస్తున్నారు. పోలీసులు నాకు చేసిన ఈ ఘోరం ఎవ్వరికీ జరుగొద్దు. నేను నా పైన ఫైరింగ్‌ చేసి నాబిడ్డను పొట్టన పెట్టుకున్నోళ్ళకు శిక్ష పడే వరకు పోరాడుతా. మీరంత గీ అన్యాయానికి  వ్యతిరేకంగా మాకు అండగా వుంటారని ఆశిస్తాను.                                                    

4-1-2024

Leave a Reply