గత వారం చివర్లో గాజా కేంద్ర ప్రాంతంలోని ఖాన్ యూనిస్‌లో వున్న నాజర్ హాస్పిటల్‌లో, ఉత్తరాన గాజా సిటీలోని అల్-షిఫా హాస్పిటల్ మైదానంలో వందలాది మృతదేహాలను ఖననం చేసి, చెత్తతో కప్పారు.

గాజాలో సామూహిక సమాధుల గురించి కలతపెట్టే నివేదికలు వస్తున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల కార్యాలయం (ఓ‌హెచ్‌సి‌హెచ్‌ఆర్) ఏప్రిల్ 23 మంగళవారంనాడు తెలిపింది. పాలస్తీనా బాధితుల మృతదేహాల చేతులు వెనక్కు  కట్టేసి, నగ్నంగా ఉన్నాయి. ఈ సమాచారంతో ఇజ్రాయెల్ దాడుల్లో యుద్ధ నేరాలకు సంబంధించి  కొత్త ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గాజాలోని స్థానిక ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ  అల్-షిఫా ఆసుపత్రి నుండి మరిన్ని మృతదేహాలను కనుగొన్నారు.   మృతుల్లో వృద్ధులు, మహిళలు, క్షతగాత్రులు కూడా ఉన్నారని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ ప్రతినిధి రవీనా శ్యాందాసాని చెప్పారు.

2023 అక్టోబర్ 7 న యుద్ధం చెలరేగడానికి ముందు, గాజా స్ట్రిప్‌లో అల్-షిఫా హాస్పిటల్ కాంప్లెక్స్ అతిపెద్ద ఆరోగ్య కేంద్రం. అక్కడి నుంచి హమాస్ రాడికల్స్ యుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయెల్ కొన్ని వారాల క్రితం ఆ ఆసుపత్రి పైన పెద్ద ఎత్తున దాడి చేసింది.

రెండు వారాల తీవ్ర పోరాటాల తర్వాత ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ ఏప్రిల్ మొదటి వారంలో ముగిసింది. అల్-షిఫా హాస్పిటల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, చాలావరకు వైద్య సదుపాయాలు, పరికరాలు బూడిదగా మారాయని ఐరాస  మానవతావాద కార్యకర్తలు ఏప్రిల్ 5న ధృవీకరించారు.

గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి మైదానంలో 30 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను రెండు సామూహిక సమాధులలో పూడ్చిపెట్టినట్లు నివేదికలు వెల్లడించాయని రవినా శందసాని జెనీవాలో విలేకరులతో అన్నారు. వీటిలో ఒకటి మెడికల్ ఎమర్జెన్సీ భవనం ముందు, మరొకటి డయాలసిస్ భవనం ముందు గుర్తించారు.

అల్-షిఫా ఆసుపత్రిలో కనిపించి ఈ రెండు సామూహిక సమాధుల నుండి స్వాధీనం చేసుకున్న పాలస్తీనియన్ల 12 మృతదేహాలను గుర్తించామని, మిగిలిన మృతులను గుర్తించడం సాధ్యం కాలేదని; అల్-షిఫా హాస్పిటల్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో 200 మంది పాలస్తీనియన్లను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతున్నప్పటికీ, ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్లు కనిపిస్తోందని ఆ ప్రతినిధి తెలిపారు.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి తరువాత దాదాపు 200 రోజుల పాటు ఇజ్రాయెల్‌ చేసిన దాడుల వల్ల సంభవించిన మరణాలు, భయంకరమైన విధ్వంసంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నాసర్ హాస్పిటల్, అల్-షిఫా హాస్పిటల్‌లో జరిగిన భారీ విధ్వంసం; సామూహిక సమాధులలో ఖననం చేసిన వందలాది మంది వ్యక్తుల మృతదేహాలపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

యుద్ధంలో పాల్గొనని సాధారణ పౌరులు, ఖైదీలు, ఇతర వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా చంపడం యుద్ధ నేరమని, ఈ మరణాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరారు.

గాజా స్ట్రిప్‌లోని ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ, గాజా యుద్ధంలో ఏప్రిల్ 22 నాటికి మరణించిన 34,000 మంది పాలస్తీనియన్లలో 14,685 మంది పిల్లలు, 9,670 మంది మహిళలు ఉన్నారని, గాజా యుద్ధంలో 77 వేల మందికి పైగా గాయపడ్డారు, వీరిలో 7 వేల మందికి పైగా శిథిలాల కింద సమాధి అయ్యారు అని ఐరాస హైకమిషనర్ కార్యాలయం తెలిపింది.

ప్రతి పది నిమిషాలకు ఒక చిన్నారి ప్రాణనష్టం జరుగుతోంది. యుద్ధ చట్టాల క్రింద పిల్లలకు రక్షణ వున్నప్పటికీ ఈ యుద్ధంలో పిల్లలే అత్యధిక మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

ప్రజలు ఆశ్రయం పొందిన గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలో ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా హై కమిషనర్ హెచ్చరిక కూడా జారీ చేశారు. వీరిలో ఎక్కువ మంది గాజాలోని ఇతర ప్రాంతాలలో యుద్ధం నుండి తప్పించుకుని ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ సుమారు 1.2 మిలియన్ల గాజా వాసులను  ‘బలవంతంగా స్వాధీనంలోకి తీసుకున్నారు. రాఫాలో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి ప్రపంచ నాయకులు ఐక్యంగా ఉన్నారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఏప్రిల్ 19న తాల్ అల్-సుల్తాన్ ప్రాంతంలోని అపార్ట్‌‌మెంట్‌పైన జరిగిన దాడిలో మరణించిన  తొమ్మిది మంది పాలస్తీనియన్లలో  ‘ఆరుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు’ వున్నారు. దీనితో పాటు, ఒక రోజు తరువాత, రఫాలో అస్ షాబోరా శిబిరంపై కూడా జరిగిన దాడిలో మరణించిన నలుగురిలో ఒక బాలిక, ఒక గర్భిణి ఉన్నారు.

‘చనిపోతున్న తల్లి గర్భం నుండి తీసిన నెలలు నిండని శిశువు, 15 మంది పిల్లలు, ఐదుగురు మహిళలు మరణించిన పక్కనే ఉన్న రెండు ఇళ్ల ఫోటోలు – ఇవన్నీ యుద్ధానికి మించినవి’ అని అన్నారు

హైకమిషనర్ నెలల తరబడి జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ, వెంటనే కాల్పుల విరమణ జరపాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ నుండి మిగిలిన బందీలను, ఏకపక్షంగా నిర్బంధించిన వ్యక్తులందరినీ విడుదల చేయాలని, మానవతా సహాయానికి అడ్డంకులు కల్పించకూడదు అనే తన  పిలుపును పునరుద్ఘాటించారు.

వెస్ట్ బ్యాంక్‌లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు ‘నిరాటంకంగా’ కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఖండించినప్పటికీ, ‘ఏప్రిల్ 12-14 మధ్య శరణార్థి శిబిరాలపై పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఇజ్రాయెల్ భద్రతా దళాలు (ఇజ్రాయిల్ సెక్యూరిటీ ఫోర్సెస్) ఈ దాడిని సులభతరం చేసాయి. ఇజ్రాయెల్ భద్రతా దళాల మద్దతు, రక్షణ, భాగస్వామ్యంతో శరణార్థి శిబిరాల వద్ద హింస అమలు జరిగిందని’ టర్క్స్ నొక్కి చెప్పారు. నూర్ షామ్స్ శరణార్థి శిబిరం, తుల్కరేమ్ నగరంలో  ఏప్రిల్ 18న జరిగిన 50 గంటల సుదీర్ఘ సైనిక చర్య గురించి వివరించారు.

ఐఎస్ఎఫ్ పదాతి దళాలు, బుల్డోజర్లు, డ్రోన్లను మోహరించి శిబిరాన్ని మూసివేసాయని టర్క్ తెలిపారు. పద్నాలుగు పాలస్తీనియన్లు మరణించగా, వారిలో ముగ్గురు పిల్లలు.

ఒక ప్రకటనలో, నూర్ షామ్స్ సైనిక చర్యలో చాలా మంది పాలస్తీనియన్లను చట్టాతీతంగా చంపారనే నివేదికల గురించి కూడా టర్క్  నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతా దళాలు తమ బలగాలను దాడి నుండి రక్షించడానికి నిరాయుధ పాలస్తీనియన్లను ఉపయోగించడాన్ని కూడా ఇది నిర్ధారిస్తుంది.

 డజన్ల కొద్దీ ప్రజలను నిర్బంధంలోకి తీసుకున్నారని, వారిపట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని, “శిబిరాన్ని, దాని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసారని”  హైకమీషనర్ చెప్పారు.

https://thewirehindi.com/273014/gaza-israel-war-ohchr-mass-graves-in-gaza

Leave a Reply