భూస్వామ్య సమాజం నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ నడపడానికి చట్టాల నిర్మాణం జరిగింది. కానీ దీంతో పాటు పాలకులు తమ అధికారాన్ని నిలుపుకోడానికి చట్టాలను  ఉపయోగించుకున్నారనేది కూడా వాస్తవం. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ యుఏపిఏ చట్టం సందర్భంలో  ‘అనేక సార్లు చట్టం స్వయంగా చట్టాన్నే అవహేళన చేస్తుంది’ అని అన్నారు. యుఏపిఏ, దేశద్రోహ చట్టాల సందర్భంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ కూడా ‘భారత పౌరుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలంటే ఈ చట్టాల్ని మార్చాల్సిన అవసరం వుంది’ అని అన్నారు. దేశంలోని అనేక మంది మేధావులు, రాజ్యాంగ పండితులు, సామాజిక కార్యకర్తలు కూడా యుఏపిఏతో సహా అనేక చట్టాలపై ప్రశ్నలు లేవనెత్తినా, దేశానికి ప్రమాదకరమైనవని చెప్పినప్పటికీ ఆ చట్టాలను అంతం చేయడం లేదు. ఈ చట్టాల క్రింద ప్రజల్ని జైలుకు పంపే వేగాన్ని చూస్తుంటే దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన అవసరం లేదని, ఈ చట్టాలే ఆ అవసరాన్ని పూర్తిగా నెరవేరుస్తున్నాయని అనిపిస్తుంది. అయితే ప్రస్తుత ఫాసిస్టు కాలం అత్యవసర పరిస్థితి కంటే దారుణంగా వుంది. అత్యవసర పరిస్థితిలో కనీసం జీవించే హక్కుకి రక్షణ వుంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం బహిరంగంగా న్యాయప్రక్రియని నిరాకరిస్తూ, తానే న్యాయమూర్తిగా ‘నేరస్థుల్ని’ ‘ఉరి’ తీయమని ఆజ్ఞ జారీ చేసింది. యిది రాజ్యాంగం హామీ యిచ్చిన ‘జీవించే హక్కు’ను తిరస్కరించే బహిరంగ ప్రకటన. చట్టం, వ్యవస్థ ఈ రెండింటిలోనూ ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వపు గత అయిదు సంవత్సరాల చరిత్ర చాలా దారుణంగా వుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలే దీన్ని రుజువు చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గూండాలను, దుర్మార్గులను ఏమీ చేయలేకపోతోంది కానీ యిలాంటి అనేక ప్రజా వ్యతిరేక, ప్రజల ప్రజాస్వామిక హక్కులను క్రూరంగా కాలరాచే నియమాలు, చట్టాల్ని తయారు చేస్తోంది, లేదా ప్రతిపాదిస్తోంది. ఏదైనా దేశంలో లేదా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ మేరకు అమలవుతోంది  అనే అంచనాకు రావడానికి అక్కడి పాలకులు చేసే చట్టాల మీద దృష్టి పెట్టడం అవసరం. గత అయిదు సంవత్సరాలలో ప్రభుత్వం ఏ చట్టాల్ని ప్రస్తావించింది లేదా చట్టంగా రూపొందించింది లేదా నేరాలు అంతం చేయాడానికి ఏ పద్ధతులు అవలంబించింది అనే విషయాలను చూద్దాం.

యాంటీ రోమియో స్క్వాడ్ (రోమియోల వ్యతిరేక దళం)

అధికారంలోకి రాగానే యోగి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం, పేరులోనూ, అమలులోనూ భూస్వామ్య విధాన స్వభావాన్ని కలిగిన ‘యాంటీ రోమియో స్క్వాడ్‌’ని ఏర్పాటు చేసింది. ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉండకూడదు, కలిసి తిరగడం అనైతికం అనే ఆలోచన నుండి ఈ స్క్వాడ్ ఏర్పడింది. ఇది యువతపై భూస్వామ్య నైతికతను ప్రయోగించే బలగం. ఈ బలగం ఆవిర్భావ ప్రకటన కాగానే, వీధిలో అబ్బాయి, అమ్మాయి కలిసి కనపడితే, వారికి సభ్యత నేర్పడానికి ఈమతపర -భూస్వామ్య భావజాల పోకిరీల స్క్వాడ్ బయలుదేరడంతో, ఆరంభంలోనే యువత కోపానికి గురై వివాదాస్పదమైంది. ఆ తరువాత ప్రభుత్వం దీని దూకుడును తగ్గించడానికి ప్రయత్నించడంతో కాస్త వెనక్కు తగ్గింది కానీ యింకా చురుకుగానే వుంది. ‘యాంటీ రోమియో స్క్వాడ్’ 2017 మార్చి 22 నుండి 2020 నవంబర్ 30 వరకు మొత్తం 14,454 మంది యువకులను అరెస్టు చేసిందనే DIG కార్యాలయం ఒక విలేకరికి RTI ద్వారా యిచ్చిన సమాచారాన్ని బట్టి ఈ చట్టం వల్ల మహిళలపై వేధింపుల ఘటనలు ఏ మాత్రం తగ్గకపోగా అందుకు విరుద్ధంగా జరిగిందనేది స్పష్టం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, 2017కి ముందు మహిళలపై రోజుకు 153 కేసులు నమోదవుతుండగా, 2019లో అవి 164కి పెరిగాయి. బ్యూరో గణాంకాల ప్రకారం ఈ కాలంలో అత్యాచారాల సంఖ్య కొంత తగ్గింది కానీ, గత అయిదు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ పభుత్వం యంత్రాంగం అగ్రవర్ణ, ఉన్నత వర్గాల వారిని కాపాడిన విధానం సిగ్గుపడే విధంగా వుండి, మహిళలపై జరిగే అత్యాచారాల పట్ల దాని దృష్టికోణాన్ని కూడా బయటకు తెస్తుంది. హాత్రస్ బలాత్కార కాండ యిందుకు సజీవ ఉదాహరణ.

చట్టవ్యతిరేక మత మార్పిడి నిషేధ చట్టం 2021

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది, మహిళా హక్కులపై పెద్ద ఎత్తున దాడి. సమాజంలో భూస్వామ్య వర్ణ, కుల వ్యవస్థల స్వచ్ఛతను కొనసాగించడానికి మహిళల లైంగికతను నియంత్రించడానికి చేసిన అనేక చట్టాల్లో ఈ వివాహ చట్టం ఒకటి. ఈ మనువాద చట్టాలను పునరుద్ధరించేందుకు యోగి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రాధమికంగా ఒక ముస్లిం పురుషుడు, ఒక హిందూ స్త్రీని వివాహం చేసుకోవడాన్ని నిరోధించడానికి తెచ్చారు కాబట్టి వారు ‘లవ్ జిహాద్’ చట్టం అని కూడా పిలుస్తారు. ఈ చట్టం ఉనికిలోకి వచ్చిన వెంటనే పురుషుడు ముస్లిం అయిన  ప్రేమ జంటలలో పురుషులు జైలుకు వెళ్లారు. కేవలం అబ్బాయిని మాత్రమే కాదు, చాలా కేసుల్లో అతని కుటుంబ సభ్యులను కూడా జైలుకు పంపారు. అమ్మాయి ఫిర్యాదు చేయకుండానే, అమ్మాయిని మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని అబ్బాయిపై ప్రభుత్వం ఆరోపణ చేసింది. హిందూ మతం నుంచి ముస్లింగా మారిన అబ్బాయి పెళ్లి కోసం మతం మార్చుకుని అమ్మాయిని మోసం చేశాడని, లేక ప్రలోభపెట్టి ప్రజలను మతం మార్పిస్తున్నాడని ఆరోపించింది. కానీ, ఎవరైనా ముస్లిం అబ్బాయి లేదా అమ్మాయి హిందూ మతాన్ని స్వీకరిస్తే, అది ‘మత పరివర్తన’గా కాకుండా, ‘ఇంటికి తిరిగిరావడం’గా పరిగణించింది. ఇది స్పష్టంగా మతపరమైన, మహిళా వ్యతిరేక భావనతో కూడిన ఈ చట్టం ఇద్దరు వయస్కులు వివాహం చేసుకోవడానికి, తమకు యిష్టమైన మతాన్ని ఎంచుకునే హక్కుపై దాడి చేస్తుంది. మహిళా ఉద్యమం సాధించిన ‘ఎంపిక చేసుకునే హక్కు’ని లాగేసే ఈ చట్టం, ప్రేమ విషయంలో కూడా అమ్మాయి అభిప్రాయానికి ఏ మాత్రం విలువ లేదని, అబ్బాయే ఆమెని ప్రేమలో పడేస్తాడని ఈ చట్టం నమ్ముతుంది.

జనాభా నియంత్రణ బిల్లు 2021

2021లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన జనాభా నియంత్రణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైనది మాత్రమే కాకుండా మతపరమైనది కూడా. మొదటిగా, ‘ జనాభా అధికంగా వుండడమే  అన్ని సమస్యలకు మూలాధారం, అందుకు ముస్లింలే కారణం’ అనే విషయాన్ని ప్రభుత్వం ఏళ్ల తరబడి శ్రమించి, ప్రజల మనస్సుల్లో నాటింది. ఆ తరువాత, ఈ మతపరమైన అపోహను పెట్టుబడిగా వుపయోగించుకుని, ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ప్రభుత్వ ఉద్యోగాలతో సహా ప్రభుత్వం కల్పించే వివిధ సౌకర్యాలకు అర్హులు కాదు. వాస్తవానికి, తన వైఫల్యాలకు ఇతరులను బాధ్యుల్ని చేయడానికి ప్రభుత్వం చేపట్టిన మరో చర్య ఈ చట్టం.

కుటుంబ నియంత్రణ సాధనాల గురించి తెలియని లేదా అందుబాటులో లేని పేదలకు వ్యతిరేకమైనది ఈ చట్టం. అంతేకాకుండా ప్రభుత్వం నిస్సిగ్గుగా, వాటిని అందుబాటులోకి తేవడం తమ పని కాదని బహిరంగ ప్రకటన కూడా చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత ఘోరమైన భూస్వామ్య, పితృస్వామ్య సమాజంలో, ఈ చట్టం మహిళా వ్యతిరేకమైనది. కొడుకు కోసం ఆశతో కూతుళ్ల పుట్టుకకు కొంత వరకు మినహాయింపు వుంటుంది, కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చాక వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. మతపరమైన, పూర్తిగా వివక్షతో కూడిన, మహిళా వ్యతిరేకమైన ఈ చట్టం ప్రభుత్వాన్ని తన బాధ్యతలనుంచి తప్పిస్తుంది. దీనిని రద్దు చేయాలి, లేకుంటే ప్రభుత్వ సౌకర్యాలు, ఉద్యోగాలు, పదవులు పూర్తిగా అగ్ర వర్ణ, వర్గాలలో కేంద్రీకృతమవుతాయి.

ప్రభుత్వ, వ్యక్తిగత ఆస్తి నష్ట పునర్‌స్వాధీన చట్టం 2020

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రభావితమైన ప్రజలపై ప్రభుత్వం చేసిన ఎదురుదాడే ఈ చట్టం. రాష్ట్రంలోనూ, దేశంలోనే కాదు ప్రపంచంలోనే పౌరసత్వానికి సంబంధించి చేసిన మతపర చట్టానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఒక పెద్ద ఉద్యమానికీ, ప్రభుత్వ అణచివేతకూ కూడా ఉత్తరప్రదేశ్ సాక్షిగా నిలిచింది. తన రాష్ట్రంలో ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలను, రాజ్యాంగ పదవిలో కూర్చున్న అజయ్ సింహ్ బిస్ట్ @ యోగి గారు ‘చూసుకుంటాం’, ‘ప్రతీకారం తీర్చుకుంటాం’ అని బహిరంగంగా బెదిరించారు. ఆ బెదిరింపులను అమలుపరిచారు కూడా. వందలాదిమందిని జైలుకు పంపాడు. ‘ప్రతీకారం’ తీసుకోడానికి చట్టం కూడా చేశాడు, ఆ చట్టమే ప్రభుత్వ, వ్యక్తిగత ఆస్తి నష్ట పునర్‌స్వాధీన చట్టం 2020.

ఈ చట్టం ప్రకారం, ఏదైనా ప్రదర్శన, సమ్మె లేదా ఆందోళనలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగితే, దానిపై మూడు నెలల్లోగా క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయాలి. క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ప్రదర్శన నిర్వాహకులను, పాల్గొన్న వ్యక్తులను గుర్తించి, ఆస్తి అటాచ్‌మెంట్‌తో సహా దెబ్బతిన్న ఆస్తి రికవరీ కోసం ఆదేశాన్ని జారీ చేస్తుంది. ఈ చట్టం ఎలా అత్యంత చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైనదంటే, క్లెయిమ్‌ల ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమం కాబట్టి దానిపై అప్పీల్ చేయలేము. దోషిగా ప్రకటించబడిన వ్యక్తి ఆస్తిని ఎవరూ కొనకుండా వుండడానికి అతని ఫోటోతో సహా పోస్టర్ విడుదల చేస్తారు. ఈ చట్టం ఫలితంగా లక్నోలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన  ప్రదర్శనల తరువాత, నేరం రుజువు కూడా కానీ, రిక్షా నడిపి బతికే ఒకతనికి, కోట్ల రూపాయల రికవరీ నోటీసు వచ్చింది.

దేశంలో ప్రవేటీకరణ రథ చక్రాలు పరిగెత్తటం మొదలుపెట్టినప్పటినుంచే ఈ చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. పౌరసత్వానికి సంబంధించిన ఉద్యమాన్ని ప్రభుత్వం సాకుగా ఉపయోగించుకుంది. వ్యక్తిగత ఆస్తి సంపాదించుకునేవారు తమ ఆస్తి దేశ ప్రజల కోపాగ్నికి గురికాకూడదని కోరుకుంటారు. అందుకని వాళ్ళ కోరికను నెరవేర్చడానికి రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చట్టాన్ని యోగి ప్రభుత్వం తీసుకువచ్చింది.

శ్రామిక చట్టాల్ని అంతం చేసే ప్రతిపాదన

శతాబ్దాల పోరాటాల తర్వాత కార్మికుల రక్షణ కోసం సాధించిన చట్టాలను రద్దు చేయాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం. 2020లో, కరోనా కాలంలో ముందస్తు ప్రణాళిక లేకుండా  లాక్‌డౌన్ చేయడం ద్వారా ప్రభుత్వమే స్వయంగా పరిశ్రమలకు హాని కలిగించి, కార్మికులకు జరిగిన నష్టాల గురించి ఏడుపు నటిస్తూనే, కార్మిక చట్టాలపై దాడి చేయడం ప్రారంభించింది. ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అందరి కంటే ముందు వున్నాడు. మూడేళ్లపాటు అన్ని కార్మిక చట్టాలను రద్దు చేసే, పనిగంటలను 12కి కుదించే ఆర్డినెన్స్ జారీ చేసాడు. దీనిపై కార్మికులు, పౌరుల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది.

ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలే చేపట్టడం వల్ల  అంతర్జాతీయ కార్మిక సంస్థలు భారతదేశంలోని కార్మికుల దుస్థితి గురించి ప్రధానమంత్రికి లేఖ రాసిన తరువాత  ఈ ఆర్డినెన్స్‌ అమలును ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతానికి అపారు కానీ కార్మిక చట్టం ఇప్పటికీ ముప్పులో ఉంది. పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను తయారుచేసే  ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. కార్మికుల తొలగింపు చట్టాన్ని యజమానులకోసం సులభతరం చేయడం దీనికి ఉదాహరణ.

మొత్తం మీద చూస్తే ఈ చట్టాలను తీసుకురావడం వెనుక ప్రభుత్వం ప్రజాస్వామ్య విరోధ, ప్రజావ్యతిరేక ఉద్దేశ్యాన్ని కలిగి వుందని స్పష్టమవుతుంది. ఈ ప్రభుత్వం మనువాద, మతపర, ఫాసిస్టు స్వభావాన్ని కలిగివుంది. మహిళ, మైనారిటీ పత్యేకించి ముస్లింలు, దళిత, ఆదివాసీలు, ఆందోళనలు చేసే వర్గాలు దీని లక్ష్యంగా వున్నాయి. ఆందోళనలను నిరోధించడానికి, తన బాధ్యతలను వదిలించుకోవడానికి కొత్త కొత్త ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం తీసుకు వస్తోంది. ఈ చట్టాలు కేవలం వెనుకబడిన, భూస్వామ్య స్వభావాన్ని కలిగినవి మాత్రమే కాదు, సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వున్నాయనే అవగాహనతో, మానవ అభివృద్ధి కోసం వాటికి వ్యతిరేకంగా ఐక్యమవడం అవసరం.

అనువాదం : కొండిపర్తి పద్మ

(దస్తక్ పత్రిక నుంచి)

Leave a Reply