18 నవంబర్‌ 2021 మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు జిల్లా గడ్‌చిరోలీలోని ధనోరా తాలూకా గ్యారపత్తి పోలీసు స్టేషన్‌ పరిధిలోకల మర్దిటోల అడవిలో 10 గంటలకు పైగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్‌ దీపక్‌ (మిలింద్‌ బాబూరావ్‌ తేల్తుంట్లే) సహ 27 మంది కామ్రేడ్స్ అమరులైనారు. శతృవుతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరయోధులకు వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుదాం. చెరిగిపోని అమరుల జ్ఞావకాలలో మునిగిన వారి బంధుమితృలంతా ఈ విషాదకర సమయంలో నిబ్బరంగా నిలువాలనీ వారి ఆదర్శాలను నిలుపాలనీ కోరుకుందాం.

కామ్రేడ్‌ దీపక్‌దా ఫిబ్రవరి 1964లో యవత్‌మాల్‌ జిల్లా వణీ తాలుకా రాజూర్‌లో పేద కార్మిక కుటుంబంలో బాబూరావు, అనసూయలకు ఏడవ సంతానంగా జన్మించాడు. ఆయన హైస్కూల్ విద్య పూర్తి చేసి ఐటిఐలో ఫిట్టర్‌ కోర్సులో శిక్షణ పొందాడు. అ తరువాత మొదట ఐల్లార్‌పుర్‌ పేపర్‌ మిల్లులో అప్రెంటీస్‌గా ఆ తదుపరి వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్స్‌లో కార్మికుడిగా చేశాడు. అ క్రమంలో మొదట గని శ్రామిక ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా అ తదుపరి భారత గని కార్మికుల ఫెడరేషన్‌ నాయకులలో ఒకరిగా ఎదిగివచ్చి కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక మిలిటెంట్‌ పోరాటాల ద్వార కృషి చేశాడు. అ క్రమంలో ఆయనకు 1982నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్చిస్టు లెనినిస్టు) (పీపుల్స్‌వార్)తో పరిచయాలు ఏర్పడినాయి. కార్మికవర్గంలో పనిచేస్తూ విప్లవ రాజకీయాలతో రాటుతేలుతున్న కామ్రేడ్‌ మిలింద్‌ 1992లో పూర్తికాలం విప్లవకారుడిగా బాధ్యతలు చేపట్టాడు. కొంత కాలం ఆయన నౌజవాన్‌ భారత్‌ సభకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఆయన తను ప్రేమించిన కామ్రేడ్ ఎంజిలాను వివాహమాడాడు.

కామ్రేడ్‌ మిలింద్‌ కార్మికరంగంలో పనిచేస్తూన్న క్రమంలో 2000లో జరిగిన మహారాష్ట్ర రాష్ట్ర పార్టీ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. విదర్భలోని అనేక పట్టణాలలోని కార్మికులను, విద్యార్థిా-యువకులను ఎంతో చాకచక్యంగా అనేక సంఘాలలో ఆయన సంఘటితం చేశాడు. ముంబాయిలో విద్యుత్‌ కార్మికుల, సూరత్‌ బట్టల మిల్లుల కార్మికులతో ఆయనకు విసృతంగా సంబంధాలు ఉండేవి. అక్కడ నౌజవాన్‌ భారత్‌ సభ కార్యకర్తలతో కలిసి అనేక సమ్మెలలో పాల్గొని నాయకత్వం వహించాడు. 2005 నాటికి విదర్భలోని కార్మిక, విద్యార్థి, యువజన సంఘటిత శక్తికి కేంద్రబిందువుగా చంద్రపుర్‌ను నిలపడంలో ఆయన పాత్ర విశిష్టమైనది. ఆ సమయంలో విదర్భ విద్యార్థులలో విప్లవ బీజాలు బలపడకూడదనీ చంద్రపుర్‌ పోలీసులు చేపట్టిన కేంపెయిన్‌ ‘మిషన్‌ మృత్యుంజయ” పేరుతో విద్యార్థులపై నిఘా పెంచారు. అయినప్పటికీ విద్యార్థులను సంఘటితం చేయడంలో ఆయన దక్షత అనుపమానమైనది. ఫలితంగా, చంద్రపుర్‌, బల్లార్‌పుర్‌, రాజురా మున్నగు పట్టణాల నుండి విద్యార్థులు, యువకులు, కార్మికులు విప్లవోద్యమంలో సంఘటితమయ్యారు. ఒకవైపూ పట్టణరంగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపూ అడవి ఉద్యమాన్ని అర్ధం చేసుకుంటూ ఉద్యమం అప్పగించిన బాధ్యతల రీత్యా 20008లో కామ్రేడ్‌ మిలింద్‌ అటవీ ఉద్యమానికి బదిలీ అయ్యాడు. అప్పటినుండి ఆయన దీపక్‌గా విప్లవప్రజలలో తన విప్లవ కృషిని కొనసాగించాడు. 2008-2021 మధ్య ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)లో వివిధ స్థాయిలలో పని చేస్తూ భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. 2008 తర్వాతి నుండి మహారాష్ట్ర విప్లవోద్యమంలో ఒకదాని వెంట ఒకటి భారీ నష్టాలు చోటుచేసుకొని అది 2012 నాటికి తీవ్రంగా దెబ్బతింది. ఆయన జీవిత సహచరి కూడ 2011లో పోలీసుల అరెస్టుకు గురై దాదాపు దశాబ్దకాలం అనేక తప్పుడు కేసులను ఎదుర్కొంటూ కటకటాల వెనుకే గడపక తప్పలేదు. అప్పటికే ఆయనను రాజ్యం లక్ష్యంగా చేసుకొని ఎడతెరిపి లేని దాడులు కొనసాగిస్తున్న ఫలితంగా ఆయన ఆమెను చివరివరకూ ప్రత్యక్షంగా కలువలేకపోయాడు. తన మల్లియను కలవడానికి ఆయన తుదివరకూ చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది.

మహారాష్ట్ర విప్లవోద్యమాన్ని పునర్వికసింపచేయడానికి తుదివరకూ ఆయన ఎంతగానో శ్రమించాడు. మహారాష్ట్ర విప్లవోద్యమాన్ని తిరిగి పునరాభివృద్ధి చేయడం అయన జీవిత లక్ష్యాలలో అత్యంత ప్రాముఖ్యత కలగిన విషయంగా ఉండింది. కానీ, అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. అ ఆశయాన్ని ఆయన రాజకీయాలతో, ఆదర్శాలతో చైతన్యవంతులై వందలాది కార్మికులు, విద్యార్థులు, అభిమానులు, మితృలు తప్పక నెరువేరుస్తారని ఆశిద్దాం. 2013లో గడ్‌చిరోలీ జిల్లాలో జరిగిన అనేక నష్టాలతో అక్కడి ఉద్యమాన్ని త్వరలోనే ఇక సమూలంగా నిర్మూలిస్తామని పోలీసులు సవాళ్లు విసురుతున్నపుడు ఆ ఉద్యమాన్ని కాపాడుకోవడానికి ఆయన అనేక నూతన రూపాలలో ప్రజలను సంఘటితం చేయడానికి విప్లవోద్యమాన్ని సంసిద్ధం చేశాడు. జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడుతున్న ఆదివాసీ ప్రజలను విప్లవ రాజకీయాలతో సుసంఘటితపరుస్తూ కోర్చీ తహశీల్‌ జెండేపార్‌, అగ్రీ, మసేలీలలో ప్రాయోజిత గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు. యువతను సంఘటితం చేశాడు. వారిని ప్రజా మిలీషియాలో తీర్చిదిద్దాడు. మరోవైపూ, గ్రామపంచాయతీల సర్పంచులను సమీకరించి ప్రజా ప్రతినిధులుగా ప్రజల అడవులను రక్షించడానికి ముందుకు రావాలనీ కోరాడు. వారిని సంఘటితపరిచి వారితో నిరహారదీక్షలు జరిపించాడు. వారి దీక్షా పోరాటాలు ముంబాయిలో విధానసభలో పెద్ద చర్చలకు దారితీశాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రాయోజిత గనుల తవ్వకాన్ని నిలిపివేసింది. గడ్‌చిరోలీ జిల్లాలోని 25కు పైగా స్థలాలలో 40వేల ఎకరాలకు పైగా భూభాగంలో గనుల తవ్వకాలను చేపట్టడానికి ప్రభుత్వం రూపొందించిన పథకానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపర్చడంలో ఆయన ఎనలేని కృషి సలిపాడు. ఆ కృషి ఫలితంగా గడ్చిరోలీ జిల్లాలోని ఆదివాసీ గ్రామాలన్నిటా పెసా చట్టం ప్రకారం గ్రామసభలు ఏర్పడి చట్ట ప్రకారం అడవులపై ఆదివాసులకు హక్కులు దక్కాయి. గడ్‌చిరోలీ ఆదివాసీ ప్రజల పోరాట ఫలితంగా మహారాష్ట్రలోని నందుర్‌బార్‌ సహ అన్ని జిల్లాల ఆదివాసులకు అనేక ప్రయోజనాలు చేకూరాయి. మరోవైపూ దేశవ్యాపితంగా అదివాసులను పెసా – గ్రామసభల విషయంలో జాగరూకులను చేయడంలో అ జిల్లా ఉద్యమం చుక్కానిలా పనిచేసింది. 2018 నాటికి దేశంలోని ప్రబల అదివాసీ ప్రాంతాలలో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో పథల్‌గఢీ ప్రజా పోరాట రూపాన్ని సంతరించుకుంది.

కామ్రేడ్‌ దీపక్‌ 2018లో కేంద్రకమిటీ సభ్యుడయ్యాడు. 2016లో నూతనంగా ఏర్పడిన యంయంసీ జోన్‌కు ఆయన ప్రత్యక్ష నాయకత్వం వహిస్తూనే దెబ్బతిన్న మహారాష్ట్ర ఉద్యమాన్ని తిరిగి బలోపేతం చేయడానికి అకుంఠిత దీక్షతో పూనుకున్నాడు. కామ్రేడ్‌ దీపక్‌ మార్క్సిస్టు మూల గ్రంథాలను అధ్యయనం చేయడంతో పాటు అంబేడ్మర్‌ రచనలను ఔపోసన పట్టాడు. భారతదేశానికి ప్రధానంగా కుల నిర్మూలకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చేసిన కృషిని సోదర కామ్రేడ్స్ కు విశదీకరించడంలో ఆయన ఎంతగానో శ్రద్ధ కనపరిచేవాడు. ఆయనకు కార్మికుల సమస్యలపై మంచి పట్టు ఉండింది. భారత దళిత ప్రజల విముక్తి విషయంలో కుల నిర్మూలనకై జరుపాల్సిన అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంసృతిక కృషిపై మంచి స్పష్టత ఉండింది. భారతదేశ ఆదివాసులకు ప్రభుత్వాలు చట్టాల రూపంలో ఇస్తున్న అమలుకాని హామీల అమలుకు వారిని కదలించడంలో మంచి అనుభవాన్ని సంపాదించాడు. వ్యవసాయ ప్రధాన దేశమైన మన భారతదేశంలో, వ్యవసాయ విప్లవమే ఇరుసుగా సాగే భారత నూతన ప్రజాతంత్ర విప్లవంలో రైతుల పట్ల, వ్యవసాయ సమస్యల పట్ల లోతైన అవగాహన ఉండింది.

ఆయన దిల్లీలో రైతులు కొనసాగిస్తున్న వినాశకర సాగు చట్టాల వ్యతిరేక పోరాటంపై రాసిన అనేక వ్యాసాలే అందుకు ప్రబల నిదర్శనం. ఆయన మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ వినాశనం గురించి ఎంతగానో అందోళన చెందేవాడు. పర్యావరణంపై ప్రత్యేక అధ్యయనాన్ని చేపట్టాడు. కానీ, ఆయన ప్రాజెక్ట్‌ పూర్తి కాకముందే ఆయన్ని రాజ్యం పొట్టనపెట్టుకుంది.

కామ్రేడ్‌ దీపక్‌ అత్యంత విప్లవ క్రమశిక్షణ కలిగిన కామ్రేడ్‌. ఆయనకు పెద్దగా అనారోగ్య సమస్యలు లేవు. హెల్త్‌కేర్‌ విషయంలో కడు జాగ్రత్తగా ఉండేవాడు. ఆయన 57 ఏండ్ల వయసులో రోజూ ఉదయాన్నే తప్పనిసరిగా వ్యాయామం చేసేవాడు. దానికి ముందే ఆయన ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ రోజూ ఉదయాన్నే రెండు గంటలు తప్పనిసరి మార్క్సిస్టు మూల గ్రంథాలను (క్లాసిక్స్‌) అధ్యయనం చేసేవాడు. అ టైం అతను చాలా ప్రైం టైంగా భావించేవాడు. ఆ సమయంలో సాధారణంగా ఆయన ఎవరితోనూ వెచ్చించడానికి సిద్దపడకపోయెవాడు. చదవడం, నోట్సులు తయారుచేసుకోవడం, అ తదుపరి సహచరులతో సదరు విషయాలపై చర్చించడం ఆయన దినచర్యలో ఎంతో ఆసక్తితో చేసే పనులు. ఆయన మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడేవాడు. బ్రాహ్మణీయ హిందుత్వ ప్రభుత్వాలు గోమాంసంపై నిషేధాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రకటించనపుడు కొంతలో కొంతైనా పేద దళితులకు, ఆదివాసులకు, ముస్లిం సహోదరులకు దొరికే పౌష్టికాహారాన్ని బ్రాహ్మణీయ శక్తులు అందకుండా చేస్తున్నాయనీ మండిపడేవాడు.

కామ్రేడ్‌ మిలింద్‌ సాహితీ రచనలో మంచి ఆసక్తి కల్లినవాడు. విప్లవోద్యమంలో చేరిన తరువాతే ఆయన అనేక ప్రజా సమస్యలపై, ఉద్యమంలో అసువులు బాసిన సహచర కామ్రేడ్స్ పై జలపాతంలా రచనలు చేసేవాడు. భావస్పోరకమైన కవిత్వాలతో పాటు పాటలు రాసేవాడు. రాయడమే కాదు పాడేవాడు కూడా. ఆయన జ్బాలాముఖి పేరుతో రచనలు చేసేవాడు. ఇటీవలి సంవత్సరాలలో ఆయన అమితంగా ప్రేమించే మాతృమూర్తి జ్ఞాపకంగా తన కలం పేరు అనసూయ గా మార్చుకున్నాడు. ఆయన తన కుటుంబంలో తనకన్నా ముందరి సోదరిని, అనంద్‌ను ఎంతో ప్రేమించేవాడు. ఆయన తన విప్లవ సహచరులతో వాళ్లను తరచుగా గుర్తుచేసుకునేవాడు. తనకన్నా చిన్నవాడు అదివాసులపై పరిశోధనా పత్రం (పీహెచ్‌డీ) తయారు చేసే క్రమంలో గడ్‌చిరోలీ చేరి మలేరియా వాతపడగా తక్షణమే బయటికి చేర్చినప్పటికీ దక్కకుండా పోయిన తన చిన్న సోదరుడి జ్ఞాపకాలను తన గుండెల్లో భద్రంగా దాచుకున్నాడు. వాల్లందరి గురించి ఆయన అంతరంగంలో చెదిరిపోని అమరజ్ఞాపకాలెన్నో……! అన్నీ ఆయనతోనే, ఆయనలోనే ఉండిపోయాయి.

భారత దోపిడీ పాలకవర్గాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వర్తమాన హిందుత్వ శక్తులు కామ్రేడ్‌ దీపక్‌ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు పథకం రూపొందించి తన సోదరుడు ప్రముఖ మేధావీ ప్రా. అనంద్‌ తెలతుంబ్డే సహ అనేక మంది మేధావులను గైడ్‌ చేశాడంటూ చేసిన కల్పిత అరోపణలు జగద్విదితమే. మన దేశంలో బ్రాహ్మణీయ కుట్రలకు నగ్నమైన నమూనాగా నిలిచిన నయీ పేశ్వాయీల భీమా కోరేగాం విధ్వంసానికి ఆయనే సూత్రదారి అంటూ అనేక కట్టుకథలతో, తప్పుడు ఆరోపణలతో కొనసాగిస్తున్న దుష్ప్రచారం, ప్రజాస్వామికవాదులపై, రచయితలపై, కళాకారులపై, వకీళ్లపై, ఆదివాసీ శ్రేయోభిలాషులపై చేసిన/చేస్తున్న దాడులు, వారి ఇండ్లపై జరుగుతున్న సోదాలు, వారి అక్రమ అరెస్టులు దేశ ప్రజలకు తెలిసినవే. వారందరినీ అర్బన్‌ మావోయిస్టులంటూ తలోజా జైలులో నిర్బంధించడం, వారి వయస్సులు, అనారోగ్యాలనైనా పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్‌లు నిరాకరిస్తూ వారిని మృత్యువు ఒడిలోకి నెట్టడం చూస్తున్నాం. వారి పట్ల బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు 84 యేళ్ల వయోవృద్దుడు కామ్రేడ్‌ స్టాన్‌ స్వామి మరణంపై సహ్యద్రి పేరుతో మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి స్పందన కామ్రేడ్‌ దీపక్‌లోని మాననీయ సంవేదనకు అద్దంపడుతోంది.

ఒక పక్క అర్బన్‌ మావోయిస్టులపై దాడులు కొనసాగిస్తూ మరోపక్క అడవులలో గత మూడేళ్లకు పైగా రాజ్యం ఆయన్ని ఒక ముఖ్య లక్ష్యంగా చేసుకొని దాడులను ముమ్మరం చేసింది. ఆయన అనేక పోలీసు దాడులలో గెరిల్లాలకు నాయకత్వం వహిస్తూ శతృవును ప్రతిఘటిస్తూ సురక్షితంగా బయటపడగలిగాడు. కానీ తన బాధ్యతల రీత్యా గడ్‌చిరోలీ నుండి దాదాపు 40 మందికి పైగా సహచరులతో యంయంసీ వెళ్తున్న క్రమంలో దారిలో 18 నవంబర్‌ రోజు ఆయన శతృవు వలలో చిక్కాడు. పోలీసులు రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు సహ అధునిక ఆయుధాలతో వారిని చుట్టుముట్టి తూటాల వర్షం కురిపిస్తున్న సమయంలో ఎంతో ధైర్యంగా నిలిచి దాదాపు 10 గంటలు రణరంగంలో నిబ్బరంగా బలగాలను గైడ్‌ చేస్తూ పోరాడుతూ కామేడ్‌ దీపక్‌ వీరమరణం పొందాడు. భారత కార్మికవర్గ అగ్రగామి దళ శీర్ష నాయకులలో ఒకరైన కామ్రేడ్ మిలింద్‌ బాబూరావు తేల్తుంబ్దే తను నమ్మిన ఆశయాల సాధన కోసం దృఢంగా పోరాడుతూ అమరుడయ్యాడు. గడచిన ఎనిమిదేళ్లకు పైగా కామ్రేడ్‌ దీపక్‌ రక్షణ సిబ్బందిలో ఉంటూ ఆయనను కంటికి రెప్పలా చూసుకుంటూ నిల్చిన కామ్రేడ్‌ భగత్‌తో పాటు ఆయనకు వైద్యం, కంప్యూటర్‌ పనులలో సహాయకురాలుగా ఉంటున్న కామ్రేడ్‌ యోగితా ఆయనతో పాటే ఆ దాడిలో నేలకొరిగారు. వారిద్దరూ ఆ ప్రాంత ఆదివాసీ భూమి బిడ్డలే. ఈ దేశ నూతన చరిత్ర నిర్మాణంలో దళితులు, అదివాసులే ముందుంటారనీ వీరి త్యాగాలతో మరోసారి నిరూపితమవుతోంది.

కామ్రేడ్‌ దీపక్‌ అమరత్వంతో నిస్సందేహంగా విప్లవోద్యమం వివిధ రంగాలలో అనుభవమున్న ఒక  సీనియర్‌ నాయకత్వ కామ్రేడ్ ను విప్లవోద్యమం కోల్పోయింది. నేడు దేశంలో సామ్రాజ్యవాదానికి నమ్మినబంటుగా నిల్చిన బ్రావ్మాణీయ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంపొందుతున్న కార్మిక, కర్షక, విద్యార్థి, దళిత, అదివాసీ ప్రజాఉద్యమాల నేపథ్యంలో అన్ని రంగాలలో రాజకీయంగా, నిర్మాణపరంగా, సాంస్కృతికంగా, సైనికంగా మంచి పట్టు ఉన్న కామ్రేడ్ దీపక్‌ అమరుడు కావడం ఈనాటి పరిస్థితులలో భారత విప్లవోద్యమానికి తీవ్రమైన లోటు. అ కామ్రేడ్‌ పీడిత వర్గాల, ప్రత్యేకంగా సాంఘిక ప్రజా సముదాయాల – దళితుల, ఆదివాసీల, మహిళల, మత మైనార్టీల – అభిమాన నాయకుడు. ఆయన పీడిత ప్రజల, పార్టీ ‘కేడర్ల అపార విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడు. అలాంటి నాయకుల అవసరం ఈనాడెంతో ఉంది. కానీ, అలాంటి వారినే భారత దోపిడీ పాలక వర్షాలు లక్ష్యంగా చేసుకొని అంతమొందిస్తున్నాయి. వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, వారు అందించిన రాజకీయాలు, నెలకొల్పిన ఆదర్శాలు సదా విప్లవాభిమానులను ప్రేరేపిస్తుంటాయి. వారు అనుసరించిన మార్గంలో ఆయన విప్లవ వారసులుగా మనం వారి ఆశయాల సాధనకై తుదివరకూ పోరాడుతామని శపథంచేద్దాం.

కామ్రేడ్‌ దీపక్‌ గురించి మనం ఒక మాట కచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన భారత విప్లవోద్యమ నాయకులలో ఒకరిగా సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగిరావడం వెనుక ఆయన బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ బంధువు కావడమే కారణం అంటూ అవాకులు, చవాకులతో మీడియా వార్తలు రాస్తున్నది. ఆయన బాబాసాహెబ్‌కు దూరం బంధువే కావచ్చు, అంతకన్నా అనేక రెట్లు అధికంగా ఆయన్ని అభిమానించేవాడు. ఆయన బోధనలను నరనరాన జీర్ణించుకున్నాడు. వాటిలోని కొరవలను మార్క్సిస్టు అవగాహనతో అర్ధం చేసుకున్నాడు. తాను నమ్మిన మావోయిజం మార్గంలో భారత పీడిత ప్రజలకు అంకితం అయ్యాడు. అంతేకానీ అంబేడ్కర్‌తో ఉన్న చుట్టరికంతో ఆయన విప్లవోద్యమంలో గొప్ప నాయకుడు కాలేదు. అలా రాయడం ఆయన స్వయం కృషిని, మేధా సంపన్నతను, అంకితభావాన్ని పోరాట దృఢ దీక్షను, విప్లవ సంకల్పాన్ని శంకించడమే. నిజానికి ఇది బ్రాహ్మణీయ హిందుత్వ దుష్ట ఆలోచనే తప్ప మరేం కాదు. నిజం చెప్పాలంటే ఈరోజు భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న అ పార్టీలో పునాది వర్గాల నుండి, శ్రామిక కులాల నుండి ఎదిగివచ్చిన వారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇది ఆ ఉద్యమం, ఆ వ్యక్తుల గొప్పతనమే తప్ప ఆ పార్టీలో బూర్జువా పార్టీలలో లాగా పలుకుబడులతో పదవులను అలంకరించడం అనుకుంటే ఆ వర్గాలను, కులాలను బ్రాహ్మణీయ అల్ప దృష్టితో కించపర్పడం తప్ప మరేం కాదు.

కామ్రేడ్‌ మిలింద్‌ పార్ధీవ శరీరం స్వగ్రామం రాజురాకు చేరాక అక్కడికి ఆయన బంధు మిత్రులంతా చేరుకున్నారు. నిర్జీవంగా, ఆపాదమస్తకం నెత్తుటి గాయాలతో పాడెపై పడుకొని  ఉన్న అజానుభావుడు మిలింద్‌ పక్కన ‘“అధూరా అశయోంకో పూరా కరూంగీ” (అసంపూర్ణ ఆశయాలను పూర్తి చేస్తాం) అన్న ముద్రలో కామ్రేడ్‌ ఎంజిలాను చూస్తుంటే విప్లవోద్యమ త్యాగాలు వృధాపోవనే భరోసా కలుగుతోంది. ఆయన పార్థివ శరీరాన్ని మోస్తూ రాజూరా గ్రామ వీధుల వెంట నడిచి శ్మశాన వాటిక చేరి ఆయన భౌతికకాయానికి నిప్పంటిచ్చాక చితిమంటలలోనుండి ఎగిసిపడుతున్న అగ్నికీలల ప్రకాశవంతమైన వెలుతుర్లలో అమరుడు మిలింద్‌ బొగ్గుగని కార్మికుల వినువీధులలో విన్పించిన విప్లవ నినాదాలే హోరెత్తుతున్నాయి. అక్కడ కన్నీళ్లతో నిల్చిన ఆయన మిత్ర బృందంలోని ప్రతి ఒక్కరిలో మిలింద్‌ రూపమే, ఆయన చెప్పిన మాటలే, ఆయన విన్సించిన విప్లవ సందేశాలే పదే పదే పొటమరిస్తున్నాయి. కామ్రేడ్‌ మిలింద్‌ అమర్‌ రహే!




Leave a Reply