నీలం సర్వేశ్వర రావు సంపాదకత్వంలో వెలువడిన “మల్లయోధ” కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై రాజ్యం మను ధర్మ పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది.
రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో “వారు స్త్రీలు ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ” క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది ” అని జనజ్వాల వెటకారాన్ని పలికించారు.
శ్రీనివాస్ గౌడ్ తన తేటతెల్లం కవితలో మల్లగుల్లాలేం లేవు అంతా తేటతెల్లం అంటూ మత రాజ్యపు చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ “విషం దేశ దేహం నిండా ఎక్కక ముందే త్వర పడాలి” అంటూ హెచ్చరించారు. “ఆటస్థలం పచ్చి గాయాల ప్రదర్శనై నడి వీధి కొచ్చింది” అని వడ్డెబోయిన శ్రీనివాస్ చేతుల్లో చెరో తుపాకీ తో హీరాబెన్.. పూలన్ దేవి అంటూ నేటి ప్రజాస్వామ్య అపహాస్యాన్ని తుపాకీ యే జయించగల్గుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
ఆమె పాదం కవితలో అనిశెట్టి రజిత” ఆమె మానవతా శాస్త్రాన్ని కళ్ళు తెరిచి కాచుకోవాలిక ఆ విప్లవాస్త్రాన్ని ” అని ఆమె రౌద్రాన్ని పసిగట్టి “ఆమె ఉరుముతున్న ఆకాశం! హిమపాతం! పగులుతున్న నేల! పేలుతున్న పర్వతం! ఆవేశాన్ని ఆలోచన తో రంగరించి కొత్త సృష్ఠి కోసం అడుగులేయవలెనని హిత బోధ చేసారు. లైంగిక వేధింపుల పై ఎటువంటి చర్యలు తీసుకోలేని నపుంసక రాజ్యాన్ని ఎండగడుతూ శిఖా ఆకాష్ వ్రాసిన కవితలో ఆద్యంతం బాగా సాగి” వాళ్ళను నపుంసకులు గా కందాం రండి “అనే ముగింపు పేలవంగా ఉంది. వాస్తవ దూరం అనిపించింది.
నసీమా బేగం తన కవితలో ” కనిపించే అవయవాలను రాక్షస కళ్ళతో స్కానింగ్ చేసే సంస్కార హీనుడా! పరువు ప్రతిష్ట అంటూ ఓ మూలన నక్కి ఏడుస్తారని భ్రమ పడకు!” అని ఫత్వా జారీ చేసారు. శారద ఆవాల “బతుకు బరి లో” కవిత లో “దేశం పటం పై చేవ్రాలు కావలసిన పరిమళాలు మరణించక ముందే జాగృత చేతనులై వెలుగునదులను స్వేచ్ఛగా ప్రవహించ నివ్వండి ” అని విభిన్న శైలి లో చెప్పారు.
యుగాంతం కవితలో వైష్ణవి శ్రీ “ఆమె దేహం ఒట్టి దేహమేనా! అది జాతీయ పతాకం కాదూ?!” అని ప్రశ్నించిన తీరు కి తప్పక సెల్యూట్ చేయాల్సిందే!! మీ యుగాంతానికి ప్రారంభోత్సవ గీతాన్ని ఆలపిస్తున్నాం అంటూ సమర భేరి మోగించారు.
రూప రుక్మిణి ” ప్రపంచ పటం ముందు బిక్కు బిక్కు మంటూ వెర్రి చూపులు చూస్తుంటే ఆ ప్రపంచమే ఉలిక్కి పడేలా ఈ దేశపు జెండా ను ఎత్తి పట్టుకుంది ఈ జ్యోతులే ” అని మల్ల యోధుల ప్రతిభను చాటారు. నేలపూరి రత్నాజి తన కవితలో “సుతారపు దేహాల కన్నీళ్ళు బొట్టు బొట్లుగా ఈ నేలమ్మను తడుపుతుంటే పిచ్చి గా నవ్వుకుంటుంది ఆమని” అంటూ బాధను వ్యక్తీకరిస్తూ “నువ్వు విటుడి కన్నా పరాయి దేశపు శత్రువు కన్నా ప్రమాదకారి హంతకి వని” టార్గెట్ చేసిన తీరు ప్రశంసనీయం.
విశ్వ తన కవితలో” కీర్తి పతాకాలను క్రీడా మైదానంలో రెపరెప లాడించిన ఆ ప్రతిభ చీకటి గదిలో కామ క్రీడలాడమని తెగించి నిరసన గళ మెత్తింది” మీ వెంట నేనంటూ భరోసా ఇచ్చారు.
నీలం సర్వేశ్వర రావు సంపాదకుడు గా మలియత్నం ఈ సంకలనం. మల్ల యోధురాళ్ళ న్యాయం కోసం సంఘీభావంగా ఈ సంకలనం లో కొత్త పాత కలాల మేళవింపు ప్రశంసనీయం. ఇంకొన్ని మెళకువలు నేర్చుకోవాలని సలహా. అచ్చు తప్పుల వలన అర్థం మారే అవకాశం వుంటుంది. నీలం తన స్వీయ కవిత లో “నిజాం రజాకార్ కి ఎదురు తిరిగిన రొమ్ముకట్టు నంగేలమ్మ ” అని వ్రాసారు. చారిత్రకంగా నంగేలమ్మ ఘటన ట్రావెన్ కోర్ సంస్థానంలో జరిగిన సంఘటన . ఇలాంటి తప్పులు లేకుండా సరి చూసుకో గల్గితే మంచి సంపాదకుడు గా ఎదగ వచ్చు.
ప్రతులకు నీలం సర్వేశ్వర రావు అంబేడ్కర్ డెన్సిటీ కంచిక చర్ల కృష్ణా జిల్లా ఫోన్+91 6304 664 725