(త్వరలో విడుదల కానున్న కొకు నవల చదువు పునర్ముద్రణకు రాసిన ముందుమాట)
కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన నవలలో ఒక పెద్ద నవల చదువు. ఇది 1950లో మొదటిసారిగా అచ్చు అయింది. అప్పటి నుండి ఇది అనేక పర్యాయాలు పునర్ముద్రణ పొందింది. సహజంగానే చదువు అనే టైటిల్ ఆ నవలకు ఉండడంతో ఇది ఆనాటి విద్యా విధానానికి సంబంధించిన నవల అని చాలా మంది అనుకోవడం కద్దు. కానీ ఇది చదువులకు మాత్రమే పరిమితమైన నవల కాదు. 1915 నుంచి 1935 వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలపు ఆంధ్రదేశ సాంఘిక చరిత్ర చిత్రణ ఈ నవలలో వున్నది. అందులోనూ అప్పటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు, యువతీ యువకుల మనస్తత్వాలని, వాళ్ల ఆరాటాలని, వాళ్ల విజయాలని, వాళ్ల వైఫల్యాలని వాటికి గల కారణాలతో సహా చిత్రించారు.
ఈ నవలలో రెండు ప్రధాన పాత్రలు ఉన్నాయి. మొదటిది సుందరం పాత్ర. సుందరం చదువుకు సంబంధించిన నవల ఇది. రెండో పాత్ర సుందరం తల్లి సీతమ్మ. ఆమెకు చదువు మీద అపారమైన మమకారం. కానీ ఆమె పెరిగిన కుటుంబంలో ఆడవాళ్ల చదువుకు గుర్తింపులేదు కాబట్టి ఆమె చదువుకోలేదు. అందుకే తన కొడుకు చదువుకోకుండా చెడగొట్టేవాళ్ళు ఎవరయినా ఉంటారేమోననే భయం ఉండేది ఆమెకు. ఇక్కడే కుటుంబరావుగారు ఆ పాత్రచేత ఒక మాట చెప్పిస్తారు. చిన్న పిల్లలని కొత్తగా బళ్లో వేసేటప్పుడు వాళ్లు సహజంగానే బడికి వెళ్లటానికి నిరాకరించడం, ఏడవడం, తన్నుకోవడం, గుద్దుకోవటం ఇవన్నీ వుంటాయి. ఇవన్నీ సుందరం ఎక్కడైనా చూస్తాడేమో, చూస్తే బడికి వెళ్లటం అంటే ఇష్టం పోగొట్టుకుంటాడేమోననే భయం సీతమ్మకు ఉండేది. ఎవరైనా చుట్టుపక్కల వాళ్లు వచ్చి, ఇవాళ మా అబ్బాయిని బళ్లో వేశాం. బడికి వెళ్లడానికి వాడు నానా ఇబ్బందులు పెట్టాడు, అలాంటి మాటలు సుందరం చెవినపడకుండా ఆమె చూసేది.
తన కొడుకు ఉన్నతమైన చదువులు చదువుకోవాలనే ఏకైక లక్ష్యంతోటి ఆమ జీవితం గడుపుతూ వచ్చింది. కాని ఆ రోజుల్లో సామాజిక వాతావరణం ఎలా ఉండేదంటే, చిన్న పిల్లలకి చుట్టు పక్కల వాళ్లు చెప్పే విషయాలను బట్టి, ‘అమ్మో! చదువంటే ఇంత కిరాతకంగా ఉంటుందా’ అనే భయం పిల్లలకి కలిగేది. ‘వెధవా! బళ్లో వేస్తే గాని నీ పొగరు అణగదురా, ఇవ్వాల్టిదాక బాగా ఆడుకున్నావుగా, రేపట్నించి చూద్దువుగానిలే, నీ ఆటపాటలన్నీ బందయిపోతాయి. పంతులు చెప్పినట్టుగానే ఉండాలె అని అనేవాళ్లు. మంచి టీచర్ అంటే ఆ రోజుల్లో పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేవాడు. చదువు ఎలా చెప్పారన్నది ముఖ్యంకాదు. క్రమశిక్షణ అంటే వాళ్ల ఉద్దేశంలో శిక్షించడం. ఏ పంతులు పిల్లల్ని ఎక్కువగా దండిస్తాడో ఆయనే గొప్పవాడు. ఇలాంటి మాటలు సుందరం చెవిలో పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేసింది.
ఆవిడ ఆశించినట్లుగానే సుందరం విద్యాభ్యాసం బాగానే ప్రారంభమవుతుంది. స్కూలుకి వెళతాడు. స్కూలుకి వెళ్లిన కొద్ది కాలానికే స్కూలు స్వభావం ఏమిటో, పంతుళ్ల స్వభావం ఏమిటో అర్థం చేసుకొని, ఒకానొక రోజున ‘అమ్మా, నేను ఇక బడికి వెళ్లను. నువ్వే నాకు చదువు చెప్పు’ అంటాడు. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ‘‘నేను నీకు చదువుచెప్పడమేమిటి? నేను ఏమి చదుకున్నానని నీకు ఏమి చదువు చెపుతాను’’. ‘‘ఏముందమ్మా, నాతో నాలుగు అక్షరాలు దిద్దించలేవా? నేను దిద్దుతాను చూడు. నాతో దిద్దించు’’ అంటాడు. సుందరం తెలివిగల విద్యార్థి కావడంతో తల్లి నాలుగు అక్షరాలు రాసిస్తే వాటితో పాటు ఇంకో రెండక్షరాలు కూడా చెప్పగలిగేవాడు. చాలా వేగంగా అక్షరాలు కంఠతా వచ్చేవి. దేన్నీ పెద్దగా కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం వుండేది కాదు. తానే స్వయంగా కూడబలుక్కుని పదాలు చదివే నేర్పరితనాన్ని కూడా సంపాదించాడు. దానితో ఆవిడలో చదువురాని దాన్ని వాడికి చదువుచెప్పేటంత దాన్నయ్యానా అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
నిజమే, తల్లితండ్రులు బాగా పెంచాలి. కాని బడికి వెళ్లే పిల్లవాడు పాడయిపోతాడనో, చెడు సావాసాలు పడుతాడనో టీచర్లు కొడతారనో వాణ్ణి బడి నుంచి తప్పించి ఇంటికాడే చెప్పించుకుంటామనే భావన సరైంది కాదు. ఎందుకంటే నలుగురితోటీ కలిసి నడిస్తే తప్ప, చిన్నతనం నుంచి వాళ్లతోటి అనుభవాలుంటే తప్ప ఎవరూ వ్యక్తిత్వం కలిగిన మనిషి కారు. ఇతర పిల్లలతో కలిసి ఐదారు గంటలు కలిసి చదువుకుంటే ఏదైనా వాడి మనసుకు అంటుతుంది. అంతేగాని కేవలం పుస్తకాలు చదవటం మాత్రమే కాదు. అందుచేత ఎక్కడ నలిగిపోతాడోనన్నట్లు పిల్లల్ని సుకుమారంగా పెంచితే ఎందుకూ పనికిరారు అని చెప్పిస్తారు కుటుంబరావు గారు.
కుటుంబరావు గారు ముందుచూపుతో అన్న మాటలు సార్వకాలికమయినవి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు హోం స్కూలింగ్ అనే ఒక వేలంవెర్రిని పెంచుకున్నారు. ఇది అమెరికా నుంచి దిగుమతి అయిన సరుకు. స్కూలుకి వెళితే అక్కడ పాఠాలు సరిగా చెప్పరు, తల్లితండ్రుల ప్రేమకు దూరమవుతారు. ఇతరులతో, ముఖ్యంగా ‘అలగా’ పిల్లలతో కలిసి చెడు స్నేహాలు చేస్తారు కాబట్టి మా పిల్లలకి మేమే చెపుకుంటాం. ఇదీ ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆలోచన. మొక్క సరిగా అంటుకట్టకుంటే ఎట్లా ఉంటుందో స్కూలుకి వెళ్లి ఇతర పిల్లలతో ఆటపాటలు, సరదాలు లేకుండా పెరిగే పిల్లవాడు కూడా అట్లానే తయారవుతాడు. అంటే బోన్సాయ్ మొక్కలాగా.
సుందరం అక్షరాలని చాల వింతగా పరిశీలించేవాడు. కొన్ని అక్షరాలు సుందరాన్ని భయపెట్టేవి. కొన్ని అక్షరాలు చూస్తే, ఈ అక్షరాలతోటి ఏ ఒక్క పదం కూడా ఉండదే, ఎందుకు ఈ అక్షరాలు నేర్చుకోవాలి అనుకునేవాడు. ఋ, బుూ, అలు, ఆలూ, ఙ, ఞ లాంటి అక్షరాల పట్ల సుందరానికి కోపం ఉండేది. ఈ అక్షరాలు నిరర్థకం కదా, ఎందుకుండాలి భాషలో అని సుందరం అన్నాడో లేదో కాని, ఆ రోజుల్లో కుటుంబరావు గారికి తెలుగు భాషలో ఉండే ఇలాంటి అక్షరాలను సంస్కరించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
అట్లా కాలక్రమంలో సుందరం ఇంకాస్త పెద్దవాడయిన తరువాత ఆ వీథిబడి నుంచి పెద్ద స్కూలుకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అక్కడ సుందరానికి ముగ్గురు స్నేహితులవుతారు. వాళ్లలో ఒకతను మేదర వాళ్ల అబ్బాయి. ఈ ముగ్గురితో బాగా స్నేహం కుదురుతుంది. ఆ క్రమంలో సుందరం వ్యక్తిత్వం వికసిస్తుంది. తండ్రి, తల్లి అదుపాజ్ఞల నుంచి కొద్దిగా దూరమవుతాడు. స్వతంత్రంగా ఆలోచించడం, పరిశీలించడం నేర్చుకుంటాడు. సుందరంకు కలిగిన మొట్టమొదటి అనుభవం, స్కూల్లో పంతులు గారి నాయకత్వంలో దసరా పండగనాడు ఊరంతా పిల్లలు ఒక ఊరేగింపుగా వెళ్లటం. ఆ వెళ్లే క్రమంలో అంతకుముందు తన ఊర్లో ఎప్పుడూ చూడని వీధుల్లో ఉండే పేదవాళ్ల ఇళ్లల్లోకి కూడా వెళ్లే అవకాశం లభిస్తుంది. అతనిలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఒక కొత్త చైతన్యంలాంటిది తనకు తెలియనిదేదో కలుగుతుంది. అట్లా మేదరవాళ్ల ఇళ్లకు, గొల్లవాళ్ల ఇళ్లకు వెళ్లడం కూడా కొత్త అనుభవాన్ని ఇస్తాయి.
ఇట్లానే క్రమక్రమంగా క్రమంలోనే అనుకోకుండానే అతడికి జాతీయోద్యమంతో పరిచయం కలుగుతుంది. కాని, పాఠశాలల్లోగాని ఎక్కడైనా సరే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పతాకాలు ఎగరవేయటం లాంటి చర్యలు కూడా జరుగుతూ ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో అక్కడ ఒక చర్చ జరుగుతుంది. ఒక తెలివైన కుర్రవాడు వాళ్ల నాన్న చెప్పిన విషయాలను కథలు కథలుగా పిల్లలందరికి చెబుతూ ఉంటాడు. ‘మనం ఇంగ్లీషు వాళ్లం. ఈ సామ్రాజ్యం అంతా ఇంగ్లీషు వాడిదే. మనమంతా వాడి బిడ్డలమే. మనది కావలసిన దాన్ని జర్మనీ వాడు దొంగిలించుకుపోతున్నాడు. అందుకే మన మీద యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి జర్మనీ నాశనం కావాలని మనం కోరుకోవాలి.’ ఇదంతా అమాయకత్వంతో కూడిన అజ్ఞానం.
అదే సమయంలో కొత్తగా వెల్లివిరుస్తున్న జాతీయోద్యమ చైతన్యం కొంత మంది పెద్దల్ని ఆకట్టుకునేది. దాంట్లో భాగంగానే ఆ ఊరిలో ఒక వ్యక్తి జాతీయ పాఠశాల ఏర్పాటు చేస్తాడు. ఇలా జాతీయ పాఠశాలలు ఏర్పాటుచేయడం, సంఘ సంస్కరణోద్యమాల గురించి మాట్లాడడం, వాటిలో ఉండే డొల్లతనాన్ని సుందరం పాత్రవైపు నుంచి కుటుంబరావు గారు చదువు నవలలో చాలా గొప్పగా ఆవిష్కరించారు. ఉదాహరణకి, జాతీయ పాఠశాల పెడతారు. మీరు ఇప్పటివరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలనుంచి బయటికి వచ్చేయండి, లేకపోతే మీరు దేశభక్తులు కాకుండా పోతారు అని అంటారు. అయితే తల్లితండ్రులు ఎవరూ పిల్లల్ని ఆ కొత్త పాఠశాలలో చేర్చటానికి ఇష్టపడరు. చివరికి ఎట్లనో జాతీయ పాఠశాల ప్రారంభమవుతుంది. ప్రారంభమయిన తరువాత పెద్ద సమస్య వస్తుంది. ఆ ఊర్లో ఉండే హరిజన పిల్లలు ఆ పాఠశాలకు మేం కూడా వస్తామంటారు. ఊర్లో ఉండే మోతుబరులు మా పిల్లలతో కలిపి మీ పిల్లలు చదువుకోవడానికి ఇదేమన్నా ప్రభుత్వ పాఠశాలనా, ఇది మా పాఠశాల. కాబట్టి జాతీయ పాఠశాలలోకి హరిజనులను రానివ్వం అంటారు. జాతీయ పాఠశాల ఉద్యమానికి నాయకుడైన గాంధీజీ మాల వాళ్లనీ, మాదిగ వాళ్లనీ కలుపుకరావాలంటున్నాడు కదా అని అడిగితే ఆయన చెప్పేది వేరు, ఇది స్థానిక సమస్య అంటారు. సంఘసంస్కరణోద్యమం అని పోజులు పెడతారు తప్ప వీళ్లకి తమ చుట్టూ ఉండే సమాజంతోటి సరైన సంబంధం ఉండదు. సమాజ చలనాన్ని పట్టుకోలేరని కుటుంబరావుగారు అంటారు.
అట్లానే జాతీయోద్యమ కాలంలో రకరకాల సత్యాగ్రహాలు జరుగుతాయి. జైలుకి వెళ్లటాలు జరుగుతాయి. అయితే ఎవరు జైలుకు వెళ్లాలి, ఎవరి తరువాత ఎవరు వెళ్లాలి అనే విషయంలో కూడా గ్రామాలలో మోతుబరులదే మాట. మా గ్రామం నుంచి మా ప్రాంతం నుంచి నేను పది మందిని పంపానంటే మోతుబరులకు విలువ పెరుగుతుందన్నమాట. ఎవరిని పంపాలి ఎట్లా పంపాలి అది కూడా వాళ్ల ఇష్టమే. ఒకానొక సందర్భంలో కొడుకు ‘నేను జైలుకు వెళతాను’ అంటే తండ్రి, ‘నేను ఎలాగూ వెళ్లాలి తప్పదు కదా. నువ్వెందుకున నీ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటావు’ అని అంటాడు. అంటే ఒక పెద్ద ప్రజా ఉద్యమం జరుగుతున్నపుడు క్రింద స్థాయిలో మార్పు రాకుండా, ప్రజల ఆలోచనల్లో మార్పు రాకుండా వచ్చిన ప్రతి ఉద్యమాన్ని ఆయా ప్రాంతాలలో ఉండే మోతుబరులు తమకు అనుకూలంగా మార్చుకునే వైనాన్ని చాలా స్పష్టంగా కుటుంబరావు ఈ నవలలో చిత్రికరించారు.
అట్లానే మధ్యతరగతి మీద చెణుకులున్నాయి దీంట్లో. సమాజంలో చాలా మంది ఆదర్శవాదులుంటారు.ఈ సమాజం కుళ్లిపోయింది, అవినీతి పెరిగింది, వేశ్యలు ఉన్నారు, దొంగతనం ఉన్నది. ఇవేవి ఉండకూడదు అని కోరుకుంటారు వాళ్లు. కాని సమాజంలోకి ఈ లోపం అసలు ఎందుకొచ్చింది అని వాళ్ళెప్పుడూ ప్రశ్నించుకోరు. ఒక దొంగతనం జరిగిందంటే ఒక అరాచకం ఉన్నదంటే కొంతమంది ఆడవాళ్లుగా వేశ్యలుగా మారుతున్నారంటే వితంతు వివాహాలు జరగటం లేదంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయంటే సమాజంలో ఇవన్నీ వేళ్లూనుకోవడానికి అవకాశాలు ఎక్కువుగా వున్నాయని అర్థం. అయితే ఆ లోతుల్లోకి వెళ్లి పరిశీలించకుండా పైపైన సంఘ సంస్కరణలకోసం వ్యక్తిగతంగా ప్రయత్నిస్తారు మధ్యతరగతి ఆదర్శవాదులు. వాళ్ల ఆలోచనలు ఎట్లా వుంటాయంటే సమస్యలగురించి వల్లెవేయటమే గాని మూలంగా ఉండే కుళ్లు గురించి ఎక్కడ కూడా వాళ్లు మాట్లాడరు. అందుకే ఒకానొక దశలో వాళ్ళు ఈ సంఘం బాగుచేయనంతగా చెడిపోయింది. మేమెంత ప్రయత్నం చేసినా ఇది బాగుపడడం లేదని సంఘం మీద తిరస్కారంతోటి వైరాగ్యం లోకి మారిపోయే ప్రమాదం ఉన్నది. సుందరానికి కూడా అది వర్తిస్తుంది. సుందరం అన్ని జాతీయోద్యమ ఘట్టాలని చూస్తాడు. తరువాత ఇంకా బాగా చదువుకోవాలని కాశీ వెళతాడు. బెనారస్ హిందు యూనివర్శిటీలో చేరతాడు. అకస్మాత్తుగా అనుకోకుండా ఒకరోజున ఉత్తర భారత దేశంలో ఉన్న టెర్రరిస్టులు వేసిన కొన్ని కరపత్రాలు వాళ్ల హాస్టల్ రూములో దొరుకుతాయి. వాటిని చదువుతాడు.
ప్రతి ఘటనా అతడిని ఒక రకమైన భావోద్వేగానికి గురిచేస్తుంది. కానీ సుందరం దానినొక ఆచరణ స్థాయిలోకి తీసుకురాడు. దీని గురించి రాస్తూ కుటుంబరావుగారు ఏమంటారంటే, సమాజంతోటి సుందరానికి జరిగిన ప్రసారమంతా బయటనుండి లోపలికి జరిగిన ప్రసారమే గాని లోపల నుంచి బయటికి జరగలేదు. అందుకే ఏ వ్యక్తి అయినాసరే తనకి తాను ముందు కర్త కావాలి. తనకి తాను కర్త అయితే తప్ప అతనికి ఒక క్రియ
ఉండదు. కాని మధ్యతరగతి జీవి ఎప్పుడు కూడా తనకు తాను కర్త కాడు. కర్త కావడమంటే తనంతట తానుగా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తన భవితవ్యాన్ని తాను నిర్ణయించుకునే స్థితి. అలాంటి కర్తలు కావడానికి మధ్యతరగతి ఎప్పుడు సిద్ధంగా ఉండదు. వాళ్లది గాలివాటు ప్రయాణమే.
సుందరం లాంటి వాళ్లకు చదువు తప్ప వేరే ఆలోచన లేదు. దేనికోసం నీ చదువు అంటే దానికి అర్థం వారికి తెలియదు. చదువుకోవడం కోసమే చదువు. ఇంకా ఉన్నత చదువులు, ఇంకా పై చదువులు కోరుకుంటారు. ఇలాంటి వాళ్లందరూ చివరకు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఆత్మన్యూనతా భావానికి లొంగిపోతారు. సహజంగానే సుందరంది కూడా మధ్యతరగతి మనస్తత్వం కాబట్టి చదివి చదివి చివరికి ఆర్థిక మాంద్యం వచ్చిన రోజుల్లో కుటుంబాలన్నీ చితికిపోయిన సందర్భంలో చదువుకోవడానికి ఆర్థిక శక్తి లేక అట్లా వుండిపోతాడు. ఒకటి బయట వచ్చిన ఆర్థిక డిప్రెషన్. రెండవది సుందరంలో వచ్చిన మానసిక సంక్షోభం.
చివరగా ముగింపులో కుటుంబరావు గారు ఇదంతా ఒక వృత్తం అంటారు. అందుకే సుందరం కొడుకు అక్షరాలు దిద్దుతుంటే అతడు ఆనందించడంతో నవల ముగిస్తారు. అంటే మొత్తం మీద ఈ నవలలో ఆయన ఎందుకు చదువుకోవాలి? చదువు ఎందుకు ఆహ్లాదకరంగా ఉండాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్తుతారు. చదువు అంటే కేవలం పుస్తకాల చదువు మాత్రమే కాదు. సమాజాన్ని చదవడమే నిజమైన చదువు. దీనికి తల్లిదండ్రులు ఆటంకంగా ఉండకూడదనే భావాన్ని చాలా స్పష్టంగా, బలంగా ఈ ‘చదువు’ నవలలో చిత్రీకరించారు.
14 -12 -2023