‘చదువు’

ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది.

నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి.

అయితే చదువుకు కొత్త అర్థం ‘కారా’గా అనుభవమవుతుంది నాకు. ఆయన కథానిలయంలో పుస్తకాల మధ్య తిరగడమే కాదు, యెక్కువ సమయం చేతిలో పుస్తకంతోనే కనిపించేవారు. నోట్లో కిళ్ళీ  చేతిలో పుస్తకం లేకుండా మాస్టారిని చూసింది అరుదు.

మాస్టారికి చదువొక వ్యసనం. అంతకు మించి అవసరం. పత్రికల్లో వచ్చిన ప్రతి కథని చదివి ఆ రచయిత కొత్తవారయితే వారితో మాట్లాడి ఉత్తరాలు రాసి ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి ఆ రచయిత సరదాగానో సీరియస్సుగానో చేసిన పనిని పూర్తి శాశ్వత పనిగా వాళ్ళకే తెలియకుండా కట్టుబడేలా చేసేస్తారు. అందువల్ల కూడా చదువు అనేది ఆయనకు ఊపిరితో సమానమూ సహజమూ అయ్యింది.

కొత్త కథకులకు చదవాల్సిన పుస్తకాలని సిలబసుగా లిస్టు యిచ్చినా ఆ సిలబస్ యెప్పటికీ ఆయనకయితే పూర్తి కాదు. ఎవరికయినా యిది వేరు కాదు.

అంతే కాదు, పాత డైరీనో నోట్ బుక్కో తీసుకొని చదివిన పుస్తకం పేరు రాసి, చదివినాక బోధ పరచుకున్నదేదో నోట్సు రాసుకోమని మాస్టారు చెప్పేవారు. నెలల వారీగా చదివిన పుస్తకాల జాబితా రాసుకుంటే సంవత్సరానికి అసలు ఎన్ని పుస్తకాలు చదువుతున్నామో మనకే తెలుస్తుందనేవారు. ఈ విషయం కథలు రాసేవాళ్ళందరికీ చెప్పేవారు.

మనిషి జీవిత కాలం మనిషికి తెలియంది కాదు. మనకి యింకా యెంత కాలం మిగిలి వుందో కూడా తెలీదు. నిన్నటికంటే యివాల్టికి వున్నది తక్కువే. ఉంటే గింటే బోనస్. అందుకని మనం యెవరమైనా సెలెక్టివ్‌గా మాత్రమే  చదువుతాం. దొరికిందల్లా చదివితే జీవితం సరిపోదని మనకి తెలుసు. మరి మాస్టారికి ఆపాటి తెలీదా?, తెలుసును. తెలిసి మరీ దొరికిందల్లా కాదు, ప్రతి దాన్నీ ప్రయత్నించి దొరకబుచ్చుకొని మరీ చదివి తన కార్య క్షేత్రంలోకి లాక్కుపోయేవారు.

కథ కోసం సమయం చాలక ఉద్యోగాన్ని సహితం మారారు. ఆదాయాన్ని లెక్క చేయలేదు. అలా మిగిలిన సమయాన్ని రాత కన్నా చదవడానికే యెక్కువ కాలాన్ని వినియోగించారు.

కథకు సంబంధించిన మీటింగులకు వచ్చే రోజుల్లోనూ వసతి వుండే చోటన వున్నా సరే రేపే పరీక్ష వున్నట్టు మాస్టారు చదివేసుకుంటూ వుండేవారు. అది యెంత అంటే ఆయన చివరి రోజుల్లో కూడా కనీసం పది గంటలు చదివేవారు. అంతెందుకు వొక రోజు నే వెళ్ళేసరికి బోర్లా పడుకొని చదువుతున్నారు. కూర్చోలేక పోతున్నారు. మరొకరయితే హాయిగా నిద్రపోతారు. కాని మాస్టారు చదువుకుంటున్నారు. అడిగితే నడుం నొప్పని అన్నారు. మునుపటిలా చదువుకోలేక పోతున్నందుకు శరీరం సహకరించనందుకు అసంతృప్తితో గింజుకున్నారు. చదివింది గుర్తు రాకపోయినా  పెట్టిన పుస్తకం సమయానికి దొరకకపోయినా చిన్నపిల్లాడల్లే చేత్తో తలని కొట్టుకొనేవారు.

నాకయితే చూస్తుంటే ఆయన మాస్టారికన్నా విద్యార్ధిగానే కనిపిస్తూ వుండేవారు. నిత్యవిద్యార్థికి నిలువెత్తు నిర్వచనంలా తోచేవారు.

నిన్నటికి నిన్న శరీరం నుగ్గు అయి మాట్లాడలేని దశలో కూడా మాస్టారు కథకి యిచ్చిన నిర్వచనం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. “సాధారణ మానవులు గ్రహించలేని జీవిత సత్యాలను గ్రహించగలిగేటట్టు చెయ్యడానికే కథలు అవసరం” అన్నారు. ఆ సత్యాలను గ్రహించడానికీ గ్రహించింది చెప్పడానికే మాస్టారు నిరంతరం అధ్యయనం చేస్తూ వచ్చారు. ఆ అధ్యయనం కథకులకి చాలా అవసరం అని తన ఆచరణ ద్వారా చెప్పకుండా చూపించారు.

అనుసరించడం మనవంతు.

ఫేస్ బుక్కు తప్ప మరో బుక్కు చదువుకోలేని వాతావరణంలోకి మనల్ని మనం నెట్టేసుకుంటున్న కాలంలో- వాట్సప్‌లో మూడు వాక్యాలకు మించిన పోస్టు చదవడానికి పోస్టుపోను చేసుకుంటున్న కాలంలో- మన లైబ్రరీ బుక్సులో మనం చదివినవీ చదవనివీ మనకే తెలిసీ తెలియనట్టు రోజులు నెట్టేస్తున్న కాలంలో- మాస్టారు ఆపసోపాలు పడి చదువుకుంటున్న దృశ్యం మనల్ని వెక్కిరిస్తూనే వుంటుంది… మాస్టారి చెరిగిపోని గుంభన చిరునవ్వులా!

Leave a Reply