1943 లో జర్మనీలో జరిగిన యధా తధ సంఘటనల ఆధారంగా రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ “సోఫీ స్కోల్ – ది ఫైనల్ డేస్”. ఈ చిత్ర దర్శకుడు ‘మార్క్ రోథెమండ్’ (Marc Rothemund). దీని వ్యవధి 120 నిమిషాలు.
ఇతివృత్తం; 1943 లో, ఫిబ్రవరి 22 న , ‘సోఫీ స్కోల్’ అనే విద్యార్థినిని, ఆమె సోదరుడిని, ఇంకొక సహ నిరసనకారుణ్ణీ యుద్ధ వ్యతిరేక కరపత్రాలు పంచిపెట్టారనే నేరాన్ని మోపి, నాజీ హిట్లర్ ప్రభుత్వం గిలెటిన్ తో శిరఛ్చేదం చేసింది. ఈ శిరఛ్చేదానికి ముందు ముగ్గురికీ నేర విచారణ జరుగుతుంది. ప్రధానంగా మహిళా పాత్ర సోఫీ స్కోల్ దృష్టి కోణం నుంచి ఈ చిత్ర దృశ్యీకరణ కేంద్రీకరించబడింది. సోఫీ స్కోల్ తో నాజీ అధికార పరిశోధకుడు ‘రాబర్ట్ మోహ్ర్’ 6 రోజులు నిరంతరంగా జరిపిన ‘విచారణా-కోర్టు తీర్పులే’ – ఈ చిత్ర సారాంశం. వివరాల్లోకి వెళ్తే –
‘సోఫీ స్కోల్’, ఆమె సోదరుడు ‘హన్స్’ మ్యూనిచ్ ‘లుడ్విగ్ మాక్స్మిలియన్ మ్యూనిచ్ విశ్వవిద్యాలయం’ (Ludwig Maxmilian University of Munich) లో విద్యార్ధులు. జర్మనీ యుద్ధకాలంలో ‘వైట్ రోజ్’ అనే నాజీ ప్రతిఘటనా సంస్థలో పని చేస్తున్న చురుకైన, క్రియాశీల, రాజకీయ కార్యకర్తలు. 3,30,000 జర్మన్ సైనికులను బలి తీసుకున్న యుద్ధానికి వైట్ రోజ్ సభ్యులు కలత చెంది, యుద్ధవ్యతిరేక కరపత్రాలను సిద్ధం చేస్తారు. పోస్ట్ ద్వారా పంపిణీ చేయగలిగే వాటి కంటే చాలా ఎక్కువ ప్రతులను స్టెన్సిల్ పేపరు పరికరంతో తయారు చేస్తారు. మరుసటి రోజు విశ్వవిద్యాలయంలో వాటిని పంచాలని హన్స్ ప్రతిపాదిస్తాడు. వైట్ రోజ్ నాయకుడు ‘విల్లీ’ అది చాలా ప్రమాదకరమైన చర్య అనీ, ఆమోదయోగ్యం కాదనీ వాదిస్తాడు. కానీ హన్స్ తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇస్తాడు. సోఫీ సహాయం చేస్తానంటుంది. విల్లీ అదింకా ప్రమాదమంటాడు. ఒక మహిళ కైతే ఆ పని చాలా సులభమని నచ్చజెప్పి ఒప్పిస్తాడు హన్స్. మరుసటి రోజు సోఫీ, హన్స్ లు విద్యార్ధులు తరగతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు క్లాసులనుంచి బయటికి రాగానే కనిపించేలా త్వర త్వరగా కరపత్రాలను ఉంచుతారు. కొద్ది నిమిషాల్లో క్లాసులు ముగుస్తాయనగా సోఫీ హడావిడిగా పై అంతస్తుకు పరుగెత్తి, అక్కడ రైలింగ్ అంచుల పైనుండి కరపత్రాల కట్టలను హఠాత్తుగా నెట్టివేస్తుంది. సోఫీ కరపత్రాలను చెదరగొట్టడాన్ని చూసిన ఒక కాపలాదారుడు, వారిని అదుపులోకి తీసుకుంటాడు!
సోఫీ, హన్స్ లను అరెస్టు చేసి ‘మ్యూనిచ్ స్టేడెల్హీమ్’ జైల్లో పెడతారు. అక్కడ సోఫీని గెస్టపో అపరాధ పరిశోధనలో నిపుణుడైన ‘రాబర్ట్ మోహ్ర్’ విచారిస్తాడు. మొదట్లో ఆమె తనకూ, తన సోదరుడికీ ఎలాంటి రాజకీయాలతోనూ సంబంధం లేదని, హాల్లో కరపత్రాలను గమనించి, అల్లరిగా నెట్టానని చెప్తుంది. నీతో ఖాళీ సూట్‌కేస్ ఎందుకుందని మోహ్ర్ ప్రశ్నిస్తే, ఉల్మ్లోని తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్తున్నాననీ, వచ్చేటప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకునే ఆలోచనతో ఉన్నానని నమ్మిస్తుంది. అది నమ్మిన మోహ్ర్ ఆమె విడుదలకు ఆమోదించే లోపల, ఆమెను వెళ్లనివ్వవద్దని పై అధికారులనుంచి ఆర్డర్ వస్తుంది. ఆమెను తోటి అసమ్మతి కమ్యూనిస్ట్ సానుభూతి పరురాలైన ‘ఎల్స్ జెబెల్’ జైలు గదిలో ఉంచుతారు.
నాజీ వ్యతిరేక కరపత్రాల పంపిణీకి సోఫీ, హన్స్ లే మూల కారకులని దర్యాప్తులో నిస్సందేహంగా రూఢి అవుతుంది. సోఫీని శిక్షనుంచి తప్పించడానికి హన్స్, నేనొక్కణ్ణే కరపత్రాలను పంచానని చెప్పే అతని వాదనను ఖండిస్తూ, అందులో తన ప్రమేయం కూడా ఉందని నిర్ధిష్టంగా చెప్తుంది సోఫీ. ముందు తమకేం సంబంధం లేదని ఎటువంటి తొట్రుపాటూ లేకుండా అబద్ధం చెప్పి నమ్మించిన సోఫీ, తనకు ఏమైనా సరే, వైట్ రోజ్ ఇతర సభ్యులందరినీ రక్షించాలని తాపత్రయపడుతుంది. నగరాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వేలాది కరపత్రాల ఉత్పత్తి, పంపిణీ బాధ్యత అంతా పూర్తిగా తమ అన్నాచెల్లెళ్ళ పనులేనని ఆమె స్థిరంగా చెప్తుంది. ఆమె తండ్రి అసమ్మతివాదిగా ఖైదు చేయబడ్డాడని తెలుసుకున్న రాబర్ట్ మోహ్ర్, ఆమె సంక్షేమం, విద్యకు నిధులు సమకూర్చిన జర్మన్ సమాజంలో క్రమశిక్షణను పరిరక్షించే చట్టాలకు మద్దతు నివ్వాలని ఆమెకు సలహా ఇస్తాడు. 1933 కి ముందున్న చట్టాలు వాక్ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించాయి కానీ ఇప్పటి నాజీలు చేస్తున్న దురాగతాలకు అంతు లేకుండా పోయిందని ఆమె తన నిరసనను వ్యక్తం చేస్తుంది. యూరోపియన్ యూదులను నిర్మూలించడం వంటి కొన్ని ఆరోపణలను మోహ్ర్ నిరాకరిస్తాడు. యుద్ధకాల ప్రచారాలు, అప్రకటిత కార్యక్రమాలు వంటి వాటిని నిశ్శబ్దంగా ఆమోదిస్తూ, “కొత్త యూరప్ జాతీయ సోషలిస్టుగా మాత్రమే ఉంటుంది” అని గుర్తు చేస్తాడు మోహ్ర్.
సోఫీ, హన్స్ ల తోపాటు, వివాహితుడై ముగ్గురు చిన్నారులకు తండ్రైన ‘క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్’ పై కూడా దేశద్రోహం, యుద్ధంలో పాల్గొంటున్న సైనిక దళాలను నిరాశా నిస్పృహలకు గురి చెయ్యడం, శత్రువును ప్రోత్సహించడం మొదలైన అబద్ధపు నేరాలను అన్యాయంగా మోపుతారు. తర్వాత సీన్లో ముందుగా పీపుల్స్ కోర్ట్ ప్రెసిడెంట్ ‘రోలాండ్ ఫ్రీస్లెర్’, క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్ ని విచారిస్తాడు. తన పిల్లలకు తండ్రి లేకుండా అనాధలను చెయ్యొద్దని, తనని విడిచి పెట్టమని క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్ చేసిన విజ్ఞప్తులను రోలాండ్ ఫ్రీస్లర్ రవ్వంత సానుభూతి కూడా లేకుండా, అసలు ఖాతరే చేయకుండా మితిమీరిన అహంకారంతో హుంకరిస్తూ తిరస్కరిస్తాడు. తర్వాత హన్స్ వంతు వస్తుంది. రోలాండ్ ఫ్రీస్లెర్ పట్టరాని అసహనంతో వేస్తున్న ప్రశ్నలను స్థిర గంభీర చిత్తంతో ఎదుర్కొంటూ ప్రశాంతంగా జావాబులిస్తాడు హన్స్. అతను తనను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. తూర్పు ఫ్రంట్‌లో జర్మనీ చేస్తున్న యుద్ధం నేర పూరితమైనదని, అనైతికమైనదని నాజీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతాడు. నాజీ రాజ్యాన్ని మిత్రరాజ్యాలు ఓడించడం నిశ్చయమైనదని, హిట్లర్ చేయగలిగేది యుద్ధాన్ని పొడిగించడం మాత్రమేనని హన్స్ బలంగా ప్రకటిస్తాడు. హన్స్ ప్రభావంతో, అతడి నేతృత్వంలో, సోఫీ పని చేస్తుందని ఆరోపిస్తాడు రోలాండ్ ఫ్రీస్లెర్. అది తన నిర్ణయమని, హన్స్ ప్రభావంతో తాను పనిచేయడం లేదనీ, ఖచ్చితంగా చెప్తూ అతని ఆరోపణలను ఖండిస్తుంది సోఫీ. నిజం చెప్పాలంటే ‘వైట్ రోజ్ బృందంతో జర్మనీ ప్రజలందరూ అంగీకరిస్తున్నారనీ, కాని దానిని వ్యక్తపరచటానికి వారు ధైర్యం చేయడం లేద’నీ సోఫీ దృఢంగా ప్రకటిస్తుంది. రోలాండ్ ఫ్రీస్లర్ ముగ్గురు ముద్దాయిలను దోషులుగా ప్రకటించి, ఒక్కొక్కరిని చివరి కోరికలుగా ఏం చెప్పదలచుకున్నారో క్లుప్తంగా చెప్పమని పిలుస్తాడు. “మేము ఈరోజు నిలబడిన చోట, మీరు త్వరలో నిలబడతారు” అని సోఫీ రోలాండ్ ఫ్రీస్లర్ ని హెచ్చరిస్తుంది. ముగ్గురికి మరణశిక్ష విధించబడుతుంది!
నేరారోపణ రుజువై శిక్ష ఖరారైన తర్వాత, నేర నిర్ధారణకీ – శిక్ష అమలుకీ మధ్య చట్టప్రకారం సాధారణంగా 99 రోజుల వ్యవధి ఉంటుంది. కానీ కౄరంగా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, పౌరులుగా వారి కుండే హక్కుల నన్నింటినీ హరిస్తూ, 99 రోజులు కాదు గదా కనీసం ఒక రోజైనా కన్నవాళ్లతో గడపడాని కైనా టైమివ్వకుండా అదే రోజు మధ్యాహ్నం ముగ్గురినీ ప్రజలముందు బహిరంగంగా ఉరితీయాలని నిర్ణయించారని సోఫీ తెలుసుకుంటుంది! ఒక్కసారిగా విద్యుద్ఘాతానికి గురైనట్లు కలవర పడుతుంది. మళ్ళీ వెంటనే తనను తాను సంబాళించుకొని ఎప్పటిలానే ప్రశాంత గంభీర వదనంతో స్థితప్రజ్ఞతతో ఉన్నట్లు ప్రేక్షకులకు కనిపిస్తుంది. జైలు ప్రార్థనా మందిరం నుంచి ప్రీస్ట్ వచ్చి ఆశీర్వాదమిస్తాడు. బయట వేచి చూస్తున్న సోఫీ తలిదండ్రులను సోఫీ చివరిసారిగా కొద్ది సమయం సేపు కలుస్తుంది. వారు దుఃఖంతోనే అయినా దేశ ప్రజలందరి క్షేమం కోసం ధైర్యంగా నిలబడి, ఆమె చూపుతున్న ప్రతిఘటనకు ఆమోదం తెలుపుతారు!
సోఫీని వెంటనే హన్స్, క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్ వేచి చూస్తున్న సెల్ లోకి పంపిస్తారు. అక్కడ వారు ముగ్గురూ చివరి సిగరెట్ ను పంచుకుంటారు. అప్పుడు “మన చర్యలు వృధా కావని, ఖచ్చితంగా ఫలిస్తాయని హృదయపూర్వకంగా వ్యాఖ్యా ”నిస్తాడు క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్. సోఫీని ఉరిశిక్ష ప్రాంగణంలోకి నడిపిస్తారు. ‘సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశిస్తున్నాడు, కానీ మా స్వేచ్ఛ మాత్రం తిరస్కరించబడింది’ అని ఆమె వ్యాఖ్యానిస్తుంది సోఫీ. ముందుగా సోఫీనే గిలెటిన్లో శిరచ్ఛేదం చేయ్యాలనే ఆజ్ఞ వల్ల చిత్రం నల్లగా మారటంతో బ్లేడ్ పడిపోతుంది. తర్వాత హన్స్, “ఎస్ లెబే డై ఫ్రీహీట్!” (“లాంగ్ లైవ్ ఫ్రీడం!”) అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుండగా బ్లేడ్ చీకటిలో పడిపోతుంది. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆపై మళ్ళీ మూడవసారి నిశ్శబ్దంతో హన్స్, క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్ల లకు గిలెటిన్ మరణశిక్షలు అమలయ్యాయని ప్రేక్షకులకు అర్ధమవుతుంది. తరువాతి నెలల్లో వైట్ రోజ్, దాని డజన్ల కొద్దీ అనుబంధ సంస్థల సభ్యులు ఉరితీయబడ్డారని, మరి కొందరు కఠినమైన జైలు శిక్షలకు బలయ్యారని ఒక శీర్షిక తెలియజేస్తుంది. ప్రేక్షకుల హృదయాలు భారమవుతాయి.
వేలాది కరపత్రాలు ఆకాశం నుండి మ్యూనిచ్ నగరం మీద పడతాయి. “మ్యూనిచ్ వైట్ రోజ్ విద్యార్థుల మ్యానిఫెస్టో” కరపత్రాలు మిత్రరాజ్యాలకు రహస్యంగా రవాణా చేయబడ్డాయని, వారు తిరిగి మిలియన్ల కాపీలను ముద్రించి, వాటిని జర్మన్ నగరాలన్నింటిపై విసిరేశారని ముగింపు షాట్లో ఒక శీర్షిక వివరిస్తుంది. ఈ ముగ్గురి విద్యార్ధుల త్యాగం వృధా కాలేదని వారి ఆశయం ప్రజలకు చేరిందనే ఊహ ప్రేక్షకులకు ఊరట నిస్తుంది!
“సోఫీ స్కోల్ : ది ఫైనల్ డేస్” డాక్యుమెంటరీ ప్రత్యేకతలు
ఇటీవల చాలా సినిమాలు వాస్తవిక ఇతివృత్తాలనుండి ప్రేరణ పొందినప్పటికీ, వాటన్నిటిలోకీ మనం నివసిస్తున్న ఈ నేల మీదే జరిగిన విభ్రాంతి కలిగించే వాస్తవం నుండి నిర్మించబడిందీ చిత్రం. ఎందుకంటే చరిత్రలో రక్తమాంసాలతో చలాకీగా, చాలా సరదాగా జీవించిన సోఫీ స్కోల్ అనే 21 సంవత్సరాల యువతి మే 9, 1921 లో జన్మించి 21 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 22న, 1943 లో దారుణమైన గిలెటిన్ మరణశిక్షకు బలైంది.
అదనంగా ఏరకమైన చలనచిత్రపు హంగులూ, నాటకీయతలూ లేకుండా చూపిన శాంతియుత ప్రతిఘటనను చాలా సహజంగా వాస్తవికంగా దృశ్యీకరించింది. అంత పెద్ద హిట్లర్ రాజ్యాన్ని, అంత చిన్నవయసులో నిబద్ధతతో ప్రభుత్వం ప్రజలకు తలపెడుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎంతటి ప్రమాదానికైనా, చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి, పని చెయ్యడానికి ఆమెకు సమాజం పట్ల ఉన్న అవగాహనా, తండ్రి అందించిన గొప్ప స్ఫూర్తే కారణాలు. సోఫీ తండ్రి రాబర్ట్ స్కోల్ ఉదార రాజకీయవేత్త, తీవ్రమైన నాజీ విమర్శకుడు. “మీరు నిజాయితీగా, స్వేచ్ఛాయుతమైన జీవితాలను గడపాల”ని చెప్పారని మోహ్ర్ విచారణలో సోఫీ చెప్తుంది.
ఈ చిత్రం ప్రధానంగా చారిత్రక పత్రాలు, సోఫీ స్కోల్ తో నివసించిన వ్యక్తుల నివేదికల ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి విశ్వసనీయమైన సమాచారంతో విజయాన్ని పూర్తిగా విజయాన్ని సాధించింది. ఎక్కడా కూడా అవాస్తవంగా, ఊహాజనితంగా, కల్పించినట్లుగా అనిపించదు. శిక్షకు ముందు సోఫీ ధైర్యంగా ఎదుర్కొన్న చివరి ఆరు రోజుల విచారణల పోలీసు రికార్డులతో నేరుగా వ్యవహరిస్తుంది. ఆ రికార్డులు చాలాకాలంగా అందుబాటులో లేవు, కానీ స్క్రీన్ రైటర్ ‘ఫ్రెడ్ బ్రెయినర్స్ డోర్ఫర్’ (Fred Breinersdorfer) తన రచనా నైపుణ్యాల శక్తియుక్తులతో రూపొందించి, అద్భుతమైన కళా కౌశలంతో నిజమైన ప్రొఫైల్‌ను పునర్నించాడు. ఈ చిత్రంలో చిత్రహింసలు లేవు గానీ విచారణలు చాలా కఠినంగా ఉంటాయి. ఆమెను ప్రశ్నించిన పోలీసు అధికారితో సోఫీ చర్చించినప్పుడు, కోర్టు సన్నివేశాలు చాలా ఉద్విగ్నంగా, అత్యంత విలువైనవిగా ఉంటాయి. “హిట్లర్ యూరోపియన్ యూదులందరినీ నిర్మూలించాలనుకుంటున్నాడు. మానసిక రోగులను చంపడానికి నాజీలు గ్యాస్, పాయిజన్ ఉపయోగించారు. నేను నర్స్ గా పని చేసేటప్పుడు చూశాను. మానసిక ఆసుపత్రిలో పిల్లలను తీసుకెళ్లడానికి ట్రక్కులు వచ్చాయి. పిల్లలు ఎక్కడికి అని ప్రశ్నిస్తే ‘స్వర్గానికి’ అని చెప్పారు. దాంతో పిల్లలు పాడుతూ ట్రక్కుల్లో ఎక్కారు. వారి మనస్సుల్లో ఏమి జరుగుతుందో, బాధ నుండి ఎంత జ్ఞానం వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రతి జీవితం విలువైనది. నేను వారి పట్ల జాలి పడుతున్నానని నన్ను తప్పు పడుతున్నారు. మీకే సరైన ప్రపంచ దృక్పథం లేదు. నా ప్రజల ప్రయోజనాల కోసం నేనీ పనిచేశానని ముమ్మాటికీ నమ్ముతున్నాను. ఏ పరిణామాల నైనా అంగీకరిస్తాను. నా సోదరుడిలాగే మీ దృష్టిలో నేనూ దోషినే కాబట్టి నాకిచ్చే తీర్పు సున్నితంగా ఉండకూడదు” అని తన అభిప్రాయాలను విచారణలో సోఫీ వెల్లడిస్తుంది! ఆమె విశ్లేషణా శక్తిని మెచ్చుకుని మానవత్వంతో స్పందిస్తాడు మోహ్ర్. మరణశిక్షకు వెళ్ళబోతున్న సోఫీని, రాబర్ట్ మోహ్ర్ సానుభూతిగా, ఆరాధనగా చూస్తాడు.
యుద్ధం తర్వాత, నాజీ పాలనకు వ్యతిరేకంగా సోఫీ క్రియాశీలమైన పాత్ర పోషించినందుకు జర్మనీలో ప్రసిద్ది చెందింది!
సోఫీ మోహ్ర్, రోలాండ్ ఫ్రీస్లెర్ లతో పెద్ద వాగ్యుద్ధమే చేస్తుంది. వారి మధ్య సైద్ధాంతిక చర్చ నాజీ సిద్ధాంతతర్కం లోని అస్పష్టతనూ, డోలాయమాన స్థితినీ చూపిస్తుంది. సోఫీ మాత్రం తన అభిప్రాయాలను దృఢంగా, స్థిరంగా, నమ్మకంగా ధృవీకరిస్తుంది. ట్రయల్ దృశ్యంలో, అసలు నిజం వేరుగా ఉన్నా, కోర్టు మాత్రం ముగ్గురు యువ విద్యార్ధులను బహిరంగంగా గిలెటిన్ తో ఉరి తీయమని ఉత్తర్వ్యులిస్తుంది. ఈ తీర్పు ద్వారా భవిష్యత్తులో ఎవరైనా ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారికీ ఈ రకమైన శిక్షలే ఉంటాయని ఒక సంకేతాన్ని నాజీ ప్రభుత్వం ఇవ్వదలచుకున్నట్లు స్పష్టమవుతుంది. అప్పుడు కూడా తమ కరపత్రాలను ప్రజలకు చదివి వినిపించాలని అధికారుల్ని కోరుతుంది! తర్వాత విద్యార్థులు తిరుగుబాటు చేస్తారంటుంది. ఒక సందర్భంలో “ఈ దేశపు యువత హిట్లర్‌ను ఎదుర్కొని కొత్త మేధో ఐరోపాను నిర్మించ లేకపోతే భవిష్యత్తులో జర్మనీ ఎప్పటికీ ప్రపంచం ముందు తలెత్తుకొలేని అవమాన భారాన్ని మోయవలసిందే!”-అని అంటుంది. జర్మన్ రాజకీయ పరిస్థితులపై సోఫీ చేసే ఆసక్తికరమైన విశ్లేషణలు, ఆదర్శాల విజయం గురించి నిశ్చలమైన ఆమె ఆలోచనలు సమయస్ఫూర్తితోనూ, ఆకర్షణీయంగానూ ఉండి ప్రేక్షకులను ఉత్సాహంగా చిత్రంలో లీనం చేస్తాయి. సోఫీని ప్రశ్నించే దృశ్యాలు చాలా అర్ధవంతంగా శక్తివంతంగా, అద్భుతంగా రూపొందించబడ్డాయి. చిత్రమంతటా తీవ్రమైన డైలాగులతో హృదయాన్ని తాకే విషాదం భయవిహ్వలతకు కూడా గురి చేస్తుంది! చరిత్రప్రామాణికత, విశ్వసనీయత కోసం కృషి చేసిన గొప్ప చిత్రం!
మీ దేశ రక్షణ కోసం యుద్ధాల్లో పాల్గొనడం, మీ దేశానికి మద్దతు ఇవ్వడం మాత్రమే దేశభక్తి కాదు, దేశాధినేతలు ప్రజలకు హాని చేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడు యువత తమ దేశ ప్రజల క్షేమంకోసం “ఇది చాలా తప్పుడు నిర్ణయమ”ని ప్రతిఘటించడం కూడా దేశ భక్తే అని నిరూపిస్తుందీ సినిమా! ప్రపంచంలో ఏ మూలకైనా వర్తించే ప్రజాస్వామిక ప్రశ్నను శాశ్వతంగా నిలిపినందుకు కూడా ఇది గొప్ప విలువైన చిత్రం. ప్రతిదాన్నీ ప్రశ్నించాలనీ, దేన్ని ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోవాలనీ, అప్పుడు ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడాలనీ తెలిపే గొప్ప ఎరుక కలిగించే సినిమా. ప్రజలకు ఏది, ఎందుకు, ఎవరి ప్రయోజనాలకోసమో జరిగే చర్యలపట్ల వివేచన లేకపోతే ఏ దేశంలోనైనా ఇది జరగొచ్చు. ఇందులో ఈ రోజుకి కూడా మనం నేర్చుకోవలసిన పాఠాలెన్నో ఉన్నాయి!
సోఫీ తన జైలు గది నుంచి సూర్యుని వైపు చూస్తూ “ఇంత చక్కని నులివెచ్చని ఎండ రోజు, హాయి గొలిపే వాతావరణం, కానీ ఇదే నా చివరి రోజు… నా చర్యల ద్వారా, నేను వేలాది మంది ప్రజల్ని మేల్కొల్ప గలిగితే, కదిలించి ఆచరణకు ప్రాణం పోయగలిగితే నా మరణం సఫలమైనట్లే గదా?”- అని అంటుంది. అవే సోఫీ చివరి మాటలు.
మొదట్లో ఆమె చెప్పేది అబద్దం అయినప్పటికీ, ఆమె స్పందనలలో గానీ, హావ భావాలలో గానీ ఒక్కసారి కూడా రవంతైనా తొణకదు, జర్మనీ సామ్రాజ్య శాసనసభ పట్ల ఆమె అహింసాత్మక ప్రతిఘటన సరైనదే అని సగర్వంగా ప్రకటిస్తుంది! పైకి ప్రశాంతంగా, నిశ్చలంగా కనిపించే ఈ యువతి ఏకాంతంలో ఎలా తనలో తాను కుంగిపోతుందో, దుఃఖంతో బద్దలై ఎలా కదిలిపోతుందో ప్రేక్షకులు చూస్తారు. ఒకసారి వాష్ రూం వాడుకోవాలని అడిగి వెళ్ళి, నిశ్శబ్దంగా తనివితీరా ఏడుస్తుంది! ఎండ్ క్రెడిట్స్ సమయంలో చూపిన నవ్వుతున్న సోఫీ ఫోటోలు ఆమె ఒక ఆహ్లాదకరమైన విద్యార్థి అని తెలుస్తుంది.
ఇక నటి జూలియా జెంట్స్ (Julia Jentsch, ప్రభావవంతమైన పనితీరు, ప్రశస్తమైన నటన గురించి నటి ఎంత చెప్పినా తక్కువే! హన్స్ గా ఫాబియన్ హిన్రిచ్స్ (Fabian Hinrichs), రాబర్ట్ మోహ్ర్ గా జెరాల్డ్ అలెగ్జాండర్ హెల్డ్ (Gerald Alexander Held) తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో యూనివర్సిటీ,కోర్టు షాట్లు, దుస్తులు, వేష భాషలు చక్కగా అమిరాయి. సౌండ్‌ట్రాక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
నేనూ ఈ చిత్రాన్ని ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చూశాను. మళ్ళీ ఈ 2021, ఫిబ్రవరి 22 వ తేదీకి, 74 సంవత్సరాలవుతున్న సందర్భంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సినిమాగా అమెజాన్ సెలక్ట్ చేసి (ఫిబ్రవరి 25- మార్చ్ 3) వారమంతా ప్రదర్శిస్తే మళ్ళీ చూశాను. గతంలో జరిగిన సంఘటనలతో ప్రస్తుత సంఘటనలను బేరీజు వేసుకొని కొత్త వెలుగును ప్రసరింపజేయడానికి ఈ చలన చిత్రాన్ని ఎన్నుకున్నారు!
ప్రతి ఒక్కరూ చూడవలసిన విలక్షణమైన, అరుదైన ఒక గొప్ప చలనచిత్రం!
సాధించిన అవార్డులు
ఈ చిత్రానికి పంట పండింది. 2006 లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్‌కు నామినేషన్ కు ఎంపికైంది
దర్శకుడు మార్క్ రోథెమండ్, నటి జూలియా జెంట్స్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో సిల్వర్ బేర్‌ను సాధించారు.
అలాగే ఈ చిత్రం అనేక యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ నూ, జర్మన్ ఫిల్మ్ అవార్డ్స్ నూ గెలుచుకుంది.
55 వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2005 , యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్- 2005, బెర్న్‌హార్డ్-విక్కీ-ఫిల్మ్ప్రైస్- 2005.
సిల్వర్ బేర్: ఉత్తమ దర్శకుడు – మార్క్ రోథెమండ్, సిల్వర్ బేర్: ఉత్తమ నటి – జూలియా జెంట్స్, ప్రేక్షకుల అవార్డు, జర్మన్ ఫిల్మ్ అవార్డ్స్ (లోలాస్), ఉత్తమ చిత్రం – వెండి బహుమతి , గోల్డెన్ బేర్ కోసం నామినేట్ చేయబడింది, ఉత్తమ నటన (మహిళా ప్రధాన పాత్ర) – జూలియా జెంట్స్, 78 వ అకాడమీ అవార్డులు గెల్చుకుంది.