కామ్రేడ్ అనితక్క అమరత్వ వార్త వినగానే ఒక్కసారిగా తన మాటలు, గురుతులు, ఆత్మీయత గురుతొచ్చింది. ఎప్పుడూ తన ముఖం పై చెరగని చిరునవ్వు, ప్రతి పనిలో సమష్టి భావన, ప్రతి కామ్రేడ్ తో పెనవేసుకొనిపోయే తత్వం కా.అనితక్క సొంతం. ప్రజలత్, సోదర కామ్రేడ్స్ తో ప్రేమ పంచుకోవడం తనకు ప్రజలు నేర్పిన విద్య.

నేను దళంలోకి వచ్చిన మరుసటి రోజునే తెలంగాణ చరిత్ర పై క్లాసు మొదలైంది. క్లాసులో ‘‘నీవు కూడా కూర్చుంటున్నావు కదూ!’’ అంటూ కా.హరిభూషణ్ నన్ను అడిగాడు. ఆ క్లాసుకు ఆయనే టీచర్.  సభ్యుల నుండి డీవీసీ వరకూ అందులో పాల్గొన్నారు. ఆ క్లాసులో కా. అనితక్క కూడా పాల్గొన్నది. మధ్య మధ్యలో కా. అనితక్క పాటలు పాడుతూ, క్లాసుకు సంబంధించిన చర్చలు చేస్తూ కొత్తవారికి తెలియని విషయాలు తెలుపుతూ, తనకు అర్థం కాని విషయాలను సీనియర్ల నుండి అడిగి తెలుసుకుంటూ అందరితో కలిసిపోయేది. అన్ని పనుల్లో ఆమె పాలుపంచుకుంటూ క్యాంపులో అందరికి ఆదర్శంగా నిలిచేది.

క్లాసుల తరువాత నేను వాళ్ళ నుండి విడిపోయాను.  విడిపోతున్న సందర్భంగా చాలా మంది కళ్లు చెమ్మగిల్లడం గమనించాను. ఫాసిస్టు ప్రభుత్వాలు అమలు చేస్తున్న తీవ్ర నిర్బంధంలో బహుషా, తిరిగి కలుస్తామో లేదోననే ఆలోచనలు వాళ్లలో ముసురుకుపోయి వుంటాయి. మళ్లీ కలుసుకునే లోపు తమలో ఎవరి అమరత్వ వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వాళ్ల కళ్లను చెమ్మగిల్ల చేసి వుంటాయి. కామ్రేడ్ నిర్వచనానికి వాళ్ల వదనాలు ప్రతిబింబంగా నాకు తోచాయి. వాళ్లలో ఎవరిలో నాకు భయం ఛాయలు కానరాలేదు.

 వీడ్కోలు సమయంలో తనతో మాట్లాడానికి నాకు అవకాశం దొరకలేదు. తర్వాత కొద్ది రోజులకు మేము ప్రయాణంలో వుండగా, అనుకోకుండా, వాళ్ల దళం కలిసింది. అప్పుడు కొన్ని గంటల వ్యవధి మాత్రమే వుండింది. ఆరేళ్ల నాటి జాౢపకం ఇది. అక్క కలిసిన  సందర్భం కూడ చాలా విషాదంగా వుండింది. వాళ్ళ దళంపై పోలీసు కాల్పులు జరిగి ఒక సీనియర్ ఆదివాసీ కామ్రేడ్ జగత్ అమరుడయ్యాడు. జగత్ సహచరి కురుసం రాజక్క బీజాపుర్ జిల్లా మూకవెళ్లి అనే ఆదివాసీ గ్రామంలో అమరురాలై అప్పటికే పాతికేళ్లు గడిచిపోయి వుంటాయనీ ఆయన గురించి చెప్పినపుడు విన్నాను. ఆ అక్కను ప్రజలు, సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అందుకే వారు మ్రుత జీవులు.

కా. జగతన్న త్యాగభరితమైన విప్లవ చరిత్రను నాకు చెప్పిన తర్వాత అనితక్క అంతకు ముందు జరిగిన తెలంగాణ కామ్రేడ్స్ శృతి, సాగర్, వివేక్ ల అమరత్వాల గురించి చెప్పి చాలా బాధపడింది. ప్రత్యేక తెలంగాణ వచ్చినా ప్రజల ప్రయోజనాలు నెరవేరడం లేదని, అధికారం కొత్త భూస్వాముల చేతుల లోకి వచ్చిందనీ జనం గోస తీరలేదంది. బూటకపు ఎన్ కౌంటర్లు ఆగకనేపాయె అంది. అందుకే ప్రజాస్వామిక తెలంగాణే మార్గమని నమ్మి అందుకు పోరాటం తప్ప మార్గం లేదనీ ఆయుధాలు పట్టిన వాళ్లను కాల్చి చంపబట్టిరి. మీది నుండి దొర మావోయిస్టు ఎజెండాయే మా ఎజెండా అని ప్రజలకు నమ్మబలికబట్టే. ఆమె మాటల్లో ఎన్ని సార్లు నిరంకుశ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ పోలీసులు అతి క్రూరంగా హింసించి హత్య చేసిన కా.శృతి, సాగర్, వివేక్ లను గుర్తు చేసుకుందో!

ఆమె తన అనుభవం నుండి దోపిడీ పాలకుల నైజాన్ని విడమర్చి చెపుతూ,  ఈ టైం లో మీరు బయట వుండే కంటే మా దగ్గరికి దళాలలోకి రావడం చాలా మంచిదైంది అంటూ సంతోషించింది. మీరు చదువుకొని వచ్చింరు, జనం గురించి బాగా తెలుసుకోవాలి. ఇవేవీ మీకు పుస్తకాలల్లో, చదువులల్లో చెప్పరు. మీరు పార్టీ ఇచ్చిన బాధ్యతలు స్వీకరించి గట్టిగా పని చేయాలి. ఇక్కడి పరిస్థితులకు ముందు బాగా అలవాటు పడాలి అని ఎంతో ఆప్యాయంగా చెపుతూ తల్లి ప్రేమను అగుపరిచింది. కా. అనితక్క మాట్లాడినంతసేపు ‘చిన్నా, చిన్నా’ అంటూ చెపుతుంటే నాకు ఎందుకో కానీ ఆత్మీయబంధం ప్రతి మాటలో తొణకిసలాడింది. అక్క మంచి గాయని. చాలా చక్కగా పాటలు పాడేది. నవ్వుతూ, నవ్వించే ఆ అక్క, కష్టభరితమైన గెరిల్లా జీవితంలో కష్టాలను మరిపించే చాలా గొప్ప పాత్ర పోషించేది. నాకు ప్రారంభంలోనే ఆ అక్క పరిచయం కావడం నేను అడవిలో, గెరిల్లా జీవితంలో నిలబడడానికి నిస్సందేహంగా ఎంతో దోహదం చేసి నాచే ఆమె జాౢపకాలను రాయిస్తున్నది.

బీజాపుర్ జిల్లా టెక్ గూడలో ఎన్ కౌంటర్ జరిగి కామ్రేడ్స్ అనితక్క, అశోక్ ల మరణవార్త రేడియోలో చెప్పగానే నేను ఒక్క క్షణం షాక్ కు గురయ్యాను. ఆ రోజంతా మౌనం నను వెంటాడింది. అక్క నాతో పంచుకున్న మాటలు, ప్రేమ, ఆప్యాయత క్షణ క్షణం గుర్తుకు రాసాగాయి. తనతో మాట్లాడిన అనేక విషయాలలో ఆమె అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వాటిని ఎత్తిపడుతూ సదా ప్రేరణాదాయకంగా వుండేది. రాజకీయాలను, విప్లవోద్యమ పరిస్థితులను తన అనుభవం నుండి, ఆచరణ నుండి కొత్తవారికి అర్థం చేయించడంలో ఆమెకు ఆమెనే సాటి అని చెప్పవచ్చు.

వాళ్ల వివాహబంధం గురించి తడమకుంటే నిజంగా నేను రాసిన ఈ నాలుగు అక్షరాలకు ఎంతో వెలితిగానే వుంటుందేమో! తన జీవిత సహచరుడు తనకన్నా పై బాధ్యతలలో వుండడంతో వారు అరుదుగానే కలుసుకునేవారు. కానీ, ప్రతి కలయికలో వారు ఒక కొత్త ప్రపంచాన్ని పంచుకునేవారు. ఇద్దరు తమ తమ పోరాట అనుభవాలను చాలా ఫ్రీగా పంచుకునేది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం గాఢమైన కామ్రేడ్లీ అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ విప్లవ ఆదర్శాలను ప్రతిబింబించేది.

పునర్నిర్మాణమవుతున్న తెలంగాణ విప్లవోద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నపుడల్లా అలాంటి కామ్రేడ్స్   చెరిగిపోని జాౢపకాలు, విప్లవ కృషి కళ్లకు కడుతుంది. కా. అనితక్క లాంటి కాకలు తీరిన అమరయోధుల అమరత్వాలు పుంజుకుంటున్న తెలంగాణ విప్లవోద్యమానికి వెంటనే పూడ్చుకోలేని లోటే. కాని అలాంటి మోధుల క్రుషితో విప్లవోన్ముఖులవుతున్న నూతన తరాలు వారి ఆశయాల సాధనకై ముందుకు వచ్చితీరుతారు.

తన కలలు ప్రజల కోసమే,

తన జీవితం ప్రజల కోసమే

తన మరణం ప్రజల మధ్యేనని

ఆమె తన అమరత్వం ద్వార

మరో మారు చాటింది.

ఆమె వారసులు,

వేనవేల భావి తరాలు

విప్లవోద్యమంలో కదం తొక్కుతూ

అనితక్క ఆశయాన్ని సాధించితీరుతారు

ఇది జరగబోయే నిజం.

కామ్రేడ్ అనితక్క అమర్ రహే…

Leave a Reply