ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న జెండర్ వివక్షతను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు సంఘీభావం ప్రకటించి అండగా నిలవాల్సిన భాద్యత మనందరిపై ఉంది.మార్చి నెల ప్రాంరంభంలో హౕస్టళ్ళలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రారంభమైన విద్యార్థినుల ఉద్యమం నేడు స్వేచ్చ,సమానత్వం,ఆత్మగౌరవం వైపు ప్రయాణం చేస్తూ తెలంగాణ సమాజం మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ వైపు మరోసారి చూసే పరిస్థితి నెలకొంది.మార్చి 27 నాడు మద్యాహ్నం నుండి లేడిస్ హస్టల్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరవధిక దర్నాలో మద్దతుగా మేము పాల్గొన్నపుడు విద్యార్థులు లేవనెత్తిన అంశాలు మమ్మల్ని పోరాటంలోకి కదిలించాయి.ఆ దర్నాలో పాల్గొన్న విద్యార్థినులు వారిపై ఏ విధంగా అణచివేత సాగుతున్నదో చెబుతుంటే కళ్ళు చెమర్చాయి.వారు లేవనెత్తే అంశాలు సమాజ పురోగమనానికి దోహదం చేసేవిగా ఉన్నాయి.లేడిస్ హౕస్టల్ బయట జరుగుతున్న దర్నాను ఉద్దేశించి ఒక విద్యార్థిని మాట్లాడుతూ “విశ్వవిద్యాలయంలోని లేడిస్ హస్టల్ లో అసలేం జరిగిందంటే,ఇక్కడ విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోగా అధికారులు అణచివేత చర్యలకు పాల్పడుతూ మోరల్ పోలీసింగ్ చేస్తున్నారని,సాయంత్రం పది గంటలు దాటి హౕస్టల్ బయట కనపడితే విద్యార్థినులను ఒక స్లట్(వేశ్య)లాగా చూస్తున్నారని‌,అనరాని మాటలు అంటున్నారనీ,కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదని భారతరాజ్యంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కులను హరించివేస్తూ తమను అణచివేయం ఏవిుటి, విద్యార్థుల స్వయం నిర్ణయాధికారానికై విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలి” అని ప్రసంగించారు.

మరో విద్యార్థి మాట్లాడుతూ “ ఇదే క్యాంపస్ లో బాలుర వసతిగృహంలో నాణ్యమైన అన్ లిమిటెడ్(ఆంక్షలు లేకుండా) అల్పాహారం,కూరలు,అన్నం వడ్డిస్తున్నారని మాకు మాత్రం అల్పాహారంలో 4 ఇడ్లీలు మాత్రమే ఇస్తున్నారని,ఒక చెంచా కూర,నీళ్ళు అధికంగా ఉన్న చారు,సాంబారు అందిస్తున్నారని,ప్రతి పూట అర్ధాకలితో పస్తులు ఉంటున్నామని,యూనివర్సిటీలో లింగ వివక్ష ప్రదర్శించడం అనాగరిక చర్యగా ఆమె అభివర్ణించారు.నిజానికి బాలుర,బాలికల ఆహౕరం,ఆరోగ్యం విషయంలో శాస్త్రీయంగా ఆలోచిస్తే బాలుర కంటే బాలికలకే పౌష్టికాహారం అందించడం అత్యవసరం.వారం రోజుల కిందటనే రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య గారు ఓయూ లేడీస్ హాస్టల్ళో జరుగుతున్న లింగవివక్షత, ఆహౕరం,తాగునీరు ఇతర సమస్యలపై సుమోటోగా కేసు నమోదు చేసి హస్టళ్ళను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు.అనంతరం బాలికల ఆహౕరంపై ఆంక్షలు ఎత్తివేయాలని సమస్యలు పరిష్కరించాలని ఓయూ అధికారులను ఆదేశించించారు.మానవ హక్కుల కమీషన్ ఆదేశాలను బేఖాతరు చేసి ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం సమస్యలను పక్క దారి పట్చించేందుకో ఉస్మానియా తక్ష్-2022 పేరుతో మూడు రోజుల ఉత్సవాలు జరిపి లక్షల రూపాయలు వృధా చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ బాలికల పట్ల యాజమాన్యానికి ఎంతటి వివక్షత ఉందంటే ఓయూ వైస్ చాన్సలర్ ఒక్కసారి కూడా విద్యార్థులతో మౌలిక వసతుల కల్పనపై చర్చించలేదు,రివ్యూ జరపలేదు.విద్యార్థినులు దర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి రాలేదు.వి సి,రిజిస్ట్రార్ లు పట్టించుకోకపోవడంతో పాటు చీప్ వార్డెన్, హౕస్టళ్ డైరెక్టర్ ల నిర్లక్ష్యంతో విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.మార్చి రెండవ వారంలో జరిగిన దర్నాలో విద్యార్థులు కన్నీరు పెట్టుకొన్నారు.మార్చి 27 వ తేదినాడు దర్నాలో ఉన్న విద్యార్థుల వద్దకు వచ్చిన చీప్ వార్డెన్ అల్పాహారం విషయంలో మాట్లాడుతూ ఇపుడు ఇస్తున్న నాలుగు ఇడ్లీలకు అదనంగా రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆ అధికారి తీరుతో ఒక సందర్భంలో కోపోద్రిక్తులయ్యారు.మరో మహిళా అధికారి దర్నా వద్ద విద్యార్థులను బెదిరిస్తూ విద్యార్థినులకు మద్దతు తెలపటానికి వచ్చిన సోదర పురుష విద్యార్థులను హిజ్రాలుగా సంభోదించడం జెండరు వివక్షతకు మరో ఉదాహరణగా నిలిచింది.ఇక్కడ అధికారులు ట్రాన్స్ జెండర్ల పట్ల కూడా చిన్నచూపు వహిస్తున్నారనేది స్పష్టమైంది.ఆ మర్నాడు 28 వ తేదినాడు కొనసాగిన దర్నా వద్దకు వచ్చిన ఒయస్డీ అధికారి “నోరు మూయండి” అని విద్యార్థినులను బెదిరించాడు.ఈ దర్నాలలో వందల మంది పోలీసు పోర్స్ వచ్చిన,తోటి విద్యార్థులను అరెస్ట్ చేసినా విద్యార్థులు భయపడకుండా తమ ఆందోళనలు కోనసాగిస్తున్నారు‌.సమస్యల పరిష్కారంతో పాటు భాద్యత రాహిత్యంగా వ్యవహరించిన అధికారులను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని వందేమాతరం, తొలి దశ,మలి దశ తెలంగాణ ఉద్యమాలకు,అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన ఉస్మానియా యూనివర్సిటీ నేడు సమాజంలో మహిళలపై జరుగుతున్న పితృస్వామిక అణచివేత,లింగ వివక్షత వ్యతిరేక ఉద్యమాలకు కేంద్రమైంది.

తెలంగాణ ఆవిర్బవిస్తే యూనివర్శిటీలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దుతామన్న పాలకులు నేడు విశ్వవిద్యాలయాలను గల్లీ స్థాయిలో దిగజార్చుతున్నారని విద్యార్థుల ప్లేకార్డులు ప్రదర్శించారు.నూటికి నూరుశాతం ఇదే వస్తవం.తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో యస్సీ,యస్టీ,బిసి కులాల విద్యార్థులు,మైనారిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.ఈ సందర్భంలో యూనివర్శిటీలకు నిధులు కేటాయించకపోవడం,ప్రొపెసర్లను నియమించకపోవడం,సౌకర్యాలు మెరుగుపరచకపోవడం అణగారిన వర్గాలకు విద్యను నిరాకరించేందుకు అగ్రకుల భూస్వాములు చేస్తున్న మనువాద కుట్రగానే భావించాలి.మంచి విద్యను అందిస్తే రైతుకూలీల పిల్లలు,కార్మికుల పిల్లలు,చేతి వృత్తులు,సేవా వృత్తులు చేసుకునే వారి పిల్లలు రాజ్య పరిపాలనలో,రాజకీయ బ్యూరోక్రటిక్ వ్యవస్థను శాశిస్తారని,వారిని అజ్ఞానంలో ఉంచాలనే దోపిడి ఆదిపత్య భావజాలమే నేడు శోశిత జనసమూహౕల విద్యార్థులపై అణచివేతలకు కారణమవుతున్నది.మరో వైపు నూతన ఆర్థిక విధానాలు అమలు చేసేందుకు ఉవ్విల్లూరుతూ సామ్రజ్యవాదులతో మిలాఖతైన భూస్వామ్య, పెట్టుబడిదారీ స్వదేశీ శక్తులు కార్పోరేట్ నిర్భంధ విద్యపాలసీని సుస్థిరం చేసేందుకు ప్రైవేట్ యూనివర్సిటీలు,విదేశి యూనివర్శిటీలు విచ్చలవిడిగా నెలకోల్పుతున్నారు.నూతన విద్య పాలసీ పేరుతో సిలబస్ లో భగవద్గీత పాఠాలు చేర్చుతున్నారు.విద్యార్థులను మత మౌడ్యంలో,మూడో నమ్మకాలలో నెట్టివేస్తూ మహిళలను రెండవశ్రేణి పౌరులుగా దిగజార్చేందుకు కేంద్ర,రాష్ట్ర పాలకులు కార్యక్రమం ప్రారంభించారు. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు చేస్తున్న పోరాటం కడుపునిండా భోజనం ,త్రాగునీరు కావాలని, 24 గంటలు లైబ్రరీలో అనుమతించాలని.వారేమి మంత్రిమండలిలో మహిళల వాటకోసమో ఆందోళన చేయడం లేదు.ఒకవేల మహిళల వాట అడిగినా పురుషాదిపత్య పాలకులు ఇచ్చే పరిస్థతిలో లేరు.అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలనే చట్టాన్ని పార్లమెంట్ లో చర్చకు రానివ్వకపోవటం ఒక ఎత్తైతే కనీస మానవహక్కులు కూడ అమలు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం, స్వేచ్చ,సమానత్వం,ఆత్మగౌరవం వైపు సాగుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినుల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా విస్తరించే విధంగా పౌర,ప్రజా హక్కుల సంఘాలు,విద్యార్థి యువజన సంఘాలు, స్త్రీ విముక్తి కై పాటు బడే సంస్థలు,వ్యక్తులు,ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలి. విశ్వవిద్యాలయాలలో “వేయి పూలు వికసించాలి-నూరు ఆలోచనలు సంఘర్షించాలి” అని మావో అన్నట్లు మహిళలపై అణచివేత, దోపిడి పీడనలు,పితృస్వామిక వైఖరి,సాంప్రదాయక లింగ వివక్షత లేని సమసమాజం నిర్మాణానికి ఓయూ విద్యార్థినిల పోరాటం బాటలు వేస్తుందని ఆశిస్తున్నాము.వారి పోరాటానికి ప్రజలు మద్దతు తెలపటం తక్షణావసరంగా భావిస్తున్నాము.

29-03-2022.

కె.ఆనంద్, అల్లూరి విజయ్,
పిడిఎస్ యు(విజృంభణ).

One thought on “జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ఓయూలో విద్యార్థినుల పోరాటం

 1. ALL POLITICAL PARTIES —NEEDS TO PAY ATTENTION TO THE ISSUES
  CARE —CONCERN — CONSIDERATION – COMMITMENT . ARE VITAL
  EVERYONE
  NEEDS FREEDOM
  NEEDS EQUALITY
  NEEDS SELF RESPECT

  Students —- they are our future jaathi rathnaalu-
  LOOK BIG PICTURE
  ————————————————
  BUCHIREDDY GANGULA

Leave a Reply