పశ్చిమ బెంగాల్

30.03.2022

29.03.2022 రాత్రి కోల్‌కతా పోలీసుల స్పెషల్  టాస్క్ ఫోర్స్ (STF) సామాజిక కార్యకర్త జయిత దాస్‌ను అరెస్టు చేసింది. నిన్న ఉదయం 11 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జయిత నదియా జిల్లాలోని జగులియా క్రాసింగ్ దగ్గర ఆటో రిక్షా కోసం చూస్తుండగా జాగులియా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి తెల్ల రంగు  కారులో ఎక్కించుకెళ్ళారు. ఆమె చేతిలో వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కొంత డబ్బు ఉన్న బ్యాగును తీసేసుకున్నారు. తరువాత  ఆమెను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళి, అరెస్టును ధృవీకరించడానికి STF అధికారి రాత్రి 8 గంటలకు వచ్చే వరకు కూర్చోబెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తీసుకెళ్ళిన తరువాత జయతను లాల్‌బజార్‌ లాకప్‌కు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం ఆమెను బంక్షాల్ కోర్టులో హాజరుపరిస్తే, న్యాయమూర్తి 7 రోజుల పోలీసు కస్టడీకి ఆదేశించారు.

28.12.2021 నాడు మైదాన్ ప్రాంతం నుండి మైదాన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సిపిఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన కొన్ని పోస్టర్లు, మరికొన్ని పత్రాలు ఉన్న ప్యాకెట్ లభించాయని చెప్పిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా, సెక్షన్లు 120B, 121, 121A, 122, 123, 124A కింద STF (01/22) నమోదు చేసిన FIRలో ఎవరి పేరు లేదు. అయితే నిన్న జయతా దాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. అదే సమయంలో, ముర్షిదాబాద్ జిల్లా నవోదా ఠాణా ప్రాంతం నుండి ఇటీవల అక్రమంగా అరెస్టు చేసిన ప్రతీక్ భౌమిక్, హసిబుర్ షేక్‌లను కూడా ఈ కేసులో చేర్చారు.

జ‌యిత త‌న న్యాయ‌వాదిని పిలిపించమని కోరితే పోలీసు అధికారులు నిరాకరించారు. అంతే కాదు, ఆమెను అరెస్టు చేసి 24 గంటలు గడచిన తరువాత కూడా పోలీసు అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు.

కోల్‌కతా పోలీసుల ఈ చట్టవ్యతిరేక  చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. జయితా దాస్‌ను తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామికవాదులందరూ  తమ నిరసనను తెలియజేయాలని కోరుతున్నాం.

Leave a Reply