కిటికీ కవితలు – 1

ఒట్టి కిటికీ అనే అనుకుంటామా..
ఏదో కాసింత గాలీ , వెలుతురు ఇస్తుందని ప్రేమ దానిపై..
కానీ ..నాకనిపిస్తుంది..
కిటికీకి దేహం ఉంది.
హృదయమూ ..
కళ్ళూ ఉన్నాయి.
అది ఎలా చూస్తుందనుకున్నారు?
బయట భళ్ళున తెల్లవారటాన్ని?
లోపల ..కలలు కరిగి కన్నీరైన చీకటి రాత్రుళ్ళని?
కిటికీకి ఉపిరితిత్తులున్నాయి..
గది లోపలి మనుషుల ఆశ నిరాశలను…ఊపిరాడ ని ఉక్కిరిబిక్కిరి తనాలను తను కాదూ శ్వాసించేది..శ్వాసఇచ్చేది?

కిటికీ..
ఒకసారి అమ్మ అయిపోయి..
మరోసారి నాన్నగా మారి పోతుంది.
కిటికీ ..తనని పట్టుకుని వేలాడే మనుషుల దుఃఖంతో….
దీర్ఘ సంభాషణ చేస్తుంది… వాదోపవాదాలు చేస్తుంది.
రెక్కలు చాచి..
ఒంటరి మనుషుల్ని కావలించుకుంటుంది.
అమ్మ దేహం మీది వంటింటి వేడి సెగలని.. చమట ను చల్లని గాలితో చల్ల బరుస్తుంది
విరహాన వేగిపోయే ప్రియుడికి..
ఆకాశాన చందమామను చూపిస్తుంది.
నిద్ర పట్టని ప్రియురాలికి ..
వెన్నెల శాలువా కప్పుతుంది.
ఆకలి తీరని నిరుద్యోగికి..
తననొక ఆసరాగా నిలబెట్టుకుంటుంది.

కిటికీ..
ఇంట్లోంచి .. అందరూ వెళ్ళిపోయాక ఇల్లాలు పాడే ఒంటరి పాట దుఃఖపు తడిని తడుముతుంది.
తన లోపలా బయటా జరిగే జీవన మధనాన్ని కవిత్వం గా రాస్తుంది.
కిటికీ…నిద్రపట్టని రాత్రికి..
ఎక్కడినుంచో ఒక గజల్ ని … గాలి అలల మీద తీసుకొచ్చి
వినిపిస్తుంది.
కిటికీ ..
పాలు అందక గుక్క పట్టే శిశువు పాడే శైశవ గీతం అవుతుంది.
కిటికీ…
అప్పుడు…ఈ లోకానికి జోల పాడే అమ్మ అవుతుంది.

కిటికీ కవితలు-2

ఒట్టి కిటికీ అనే అనుకుంటామా..
ఒక మార్మిక చిత్రకారుడు లా
ప్రపంచాన్ని అధ్దం లా చూపించే కిటికీ మామూలిదా..?
నిటారుగా పెరిగిన కొమ్మల మధ్యలోంచి ..
ముక్కలై మెరుస్తున్న ఆకాశం.
సూర్య కిరణాలను అధ్దుకునే లేత చిగుర్లు..
ఎండి రాలి నేల మీద హృదయం పగల గొట్టుకునే ఆకులు..కిటికీనే కదా చిత్రించేది

కిటికీ పక్షుల పాటలను..మనుషుల దుఃఖాన్ని వినిపించే రేడియో.
కిటికీ ఆకాశాన్ని చూపించే టెలిస్కోప్ .
చుక్కలు..చందమామలు..సూర్యుళ్ళు..కిటికీకి వ్రేలాడే నేస్తాలు.
కిటికీ ఎంత ఆశావాదో..అంత వేదాంతి కూడా.
కిటికీ మనుషుల్నీ చూపిస్తుంది.
దూరాన ఎక్కడో..పొలం దగ్గరో… రోడ్డు పక్కనో..
ఆశ నిరాశలతో మనుషులు అందుకునే పాటలను మోసుకొస్తుంది
కిటికీకి మరి రెక్కలు కూడా ఉన్నాయి కదా..
తనలోపలికి తొంగి చూసే ఆశపోతు మనిషి మొఖాన్ని పగలగొట్టినట్లే దబ్బున మూసేస్తుంది.
ఒక ఆశల పిట్టని లోపలికి రానిచ్చి తన మీద కూర్చోనిస్తుంది.
దూరాన్నించి ఓ ఉత్తరాన్నో..న్యూస్ పేపర్ నో
ఆదాటున తనలోపలికి గుంజుకుంటుంది.
కిటికీ ఒక సాక్షి కూడా..
గది లోపల పంకాకి ఉరి పోసుకున్న అమ్మాయి..
చివరి రహస్యపు శ్వాసని
గది బయటకు వెళ్లిపోనివ్వకుండా తనలో దాచుకుంటుంది.
ఒట్టి కిటికీ అనే అనుకుంటామా ..
కిటికీ యుద్ధంలో బధ్ధలవ్వ బోతున్న
ఇళ్ల శబ్దాన్ని ముందే.. రెక్కలతో చేరవేస్తుంది.
కిటికీ..
లోపలా బయటా ..
మనుషులు చేసే యుధ్ధాన్ని
తన హృదయపు రెక్కలలో దాచుకుంటుంది.
కిటికీ….
మనుషుల కుట్రలను ..అబధ్ధాలను
రెక్కలు తెరిచి చూపిస్తుంది.
ఒట్టి కిటికీ అనే అనుకుంటామా…

నాలుగు కిటికీలు
–———————————–

1)పొధ్ధుటి కిటికీ…

చీకటి.. వెలుతురుతో కలిసిన రంగులో.. మత్థేక్కి ఉంటుంది
కానీ దృశ్యాల్ని ఆవిష్కరిస్తుంది.
చెట్టు మీది పిట్టల్ని ..
ఇంట్లోని మనుషుల్నీ నిద్ర లేపుతుంది.
సూర్యుడి కంటే ముందే
రాత్రి దెబ్బలకి ముడుక్కొని పడుకున్న ఇల్లాలిని ..
బహుశా.. ఆకలిని కూడా

2)మధ్యాహ్నపు కిటికీ …

నీటి మీద ఎండ పడ్డప్పటి రంగుతో..
సూర్యుణ్ణి నడి నెత్తిన ఎత్తిపట్టి..
కువ కువలాడే పిట్టల నోట్లో..
తల్లి పిట్టతో పురుగులు జార వేయిస్తుంది.
కిటికీ..
చెట్టు కింది శ్రామికులు ఆకలిగా నోట్లో వేసుకునే మొదటి ముద్ద రుచిని తానే గుటకలు..గుటకలుగా మింగుతుంది.

3)సాయంత్రపు కిటికీ—

పడమటి సూర్యుని బంగారపు రంగుని మనుషుల ఆశలకు పులుముతుంది.
పక్షులు, మనుషులు నిశ్శబ్ధం గా ,
నిరాశలో.. ఒకింత ఉషారులో ఎవరిదారుల్లో వాళ్ళు వెళుతుండటాన్ని,
ఎవరికోసమో ఎదురుచూడటాన్ని.,
మనుషులు ఒక్కోసారి పక్షుల్లా ఎగరడాన్ని చూస్తుంటుంది కిటికీ.

4)రాత్రి కిటికీ…
కాటుక రంగు చీకట్ల నడుమ..
చెట్లలో.. ఇళ్లల్లో .,
మనుషులూ.. పక్షులూ,
మెల్లిగా ఉదయపు కల్లోలాలను శ్వాసిస్తూ.. నిద్ర పోవడాన్ని కిటికీ చూస్తుంది.
నిద్ర పోలేని మనుషులు మెల్లిగా పాములుగా మారడాన్ని చూస్తుంది.
రాత్రి కిటికీ ..
మనుషుల కలలను జల్లెడ పడుతుంది…
తెల్లారు ఝామున
వాళ్లకు చూపియ్యడానికి.

One thought on “కవితా పరాగం

Leave a Reply