నెదర్లాండ్స్ దేశం నుంచి డచ్ భాషలో 2012 సంవత్సరంలో వచ్చిన అద్భుతమైన చిత్రం “కౌబాయ్”( Kauwboy) ఈ చిత్ర దర్శకుడ: “హెల్మర్ బౌడేవిజ్న్ కూలే” ( Helmer Boudewijn Koole). దీని నిడివి 90 నిమిషాలు.
జోజో అనే 10 సంవత్సరాల బాలుడికీ – మన కాకి పిల్ల లాంటి చిన్నపక్షికీ మధ్య ఏర్పడిన స్నేహమే ఈ సినిమా ఇతివృత్తం. Kauwboy అంటే డచ్ భాష లో “బుజ్జి పక్షి” అని అర్ధం.
హాలండ్ శివారు ప్రాంతంలోని ఒక ఆకుపచ్చని అందమైన గ్రామంలో పదేళ్ళ జోజో తన తండ్రితో నివసిస్తుంటాడు. ఒత్తైన బ్రౌన్ కలర్ జుట్టుతో, ఆరోగ్యంగా, అప్పుడప్పుడే యవ్వనంలోకి ప్రవేశించబోతున్నట్లు విలక్షణమైన ముద్దులొలికే రూపంతో ప్రేక్షకులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటాడు ‘జోజో’. జోజో తండ్రి ‘రోనాల్డ్’ (Ronald) మంచి శరీర దారుడ్యంతో, బలంగా ఉంటాడు కానీ ఎప్పుడూ కోపంతో అణుబాంబ్ లా పేలిపోతూ, ఎవరిమీదనో చిరాగ్గా ఉన్నట్లుగా కనిపిస్తాడు. అతనికి ఒక స్థిరమైన భద్రతతో కూడిన ఉద్యోగం కూడా ఉంటుంది గానీ ఈ ప్రపంచం నుండి వేరు పడినట్లు, తనలో తాను ఆలోచించుకుంటున్నట్లు, ఒంటరితనంతో విలవిల లాడుతున్నట్లుగా విచారగ్రస్తంగా విషాదంలో మునిగితేలుతున్న ట్లుంటాడు. తండ్రి ఉద్యోగానికి వెళ్ళినప్పుడల్లా చాలా సమయాల్లో జోజో ఎక్కువసేపు ఇంట్లో ఒంటరిగా గడుపుతుంటాడు!
తండ్రి దగ్గరగా ఉన్న సందర్భాలలో అతి వినయంగా చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు జోజో. తండ్రి కోపంతో రగిలిపోతున్నప్పుడు మాత్రం దాన్నుంచి తప్పించుకోవడానికి మేడ పైకి పరిగెత్తుతాడు. అక్కడనుంచి ఇంట్లో వినిపించే ఘోరమైన శబ్దాలు వినడానికి సంసిద్ధంగా ఉంటాడు. పెద్ద చప్పుడుతో ఇంటి ముఖద్వారం తెరుచుకోవడం కోసం చెవులు రిక్కించి వేచి చూస్తాడు. తండ్రి బయటికి వెళ్ళగానే నెమ్మదిగా ఇంటి లోపలికి నడిచి గోడపైన చిందర వందరగా చిమ్మి ఉన్న టమోటా సాస్ నీ, కాళ్ళకు చల్లగా తగులుతూ నేలపై మరకలు, మరకలుగా అసహ్యంగా పడి ఉన్న ఆహార పదార్ధాలనూ చూసి ఏమాత్రం కంగారు పడకుండా పెద్ద ఆరిందా లాగా నింపాదిగా “ఫరవాలేదు. మరీ అంత ఘోరమేమీ జరగలేదు” అని గట్టిగా పైకే తనలో తాననుకుంటూ క్షణాల్లో శుభ్రం చేయ్యడానికి తయారై పోతాడు.
ఎప్పుడు భగ్గుమంటాడో తెలియని తండ్రి కోపతాపాలను ఎదుర్కొంటూ, ఒంటరితనంతో గడుపుతున్న జోజోకి ఇద్దరు స్నేహితులు దొరుకుతారు. ఒకరేమో పాఠశాల వద్ద తన వాటర్ పోలో జట్టులో కలిసిన జోజో కంటే పెద్దదైన, పొడవైన “యెంథే ” అనే అందమైన అమ్మాయి. రెండోది చిన్న పక్షి.
పక్షి చెట్టుమీద నుంచి తానున్న గూడు నుంచి పడిపోతుంది. జోజో దాన్ని తిరిగి జాగ్రత్తగా యధాస్థానంలో పెట్టాలని ప్రయత్నిస్తాడు గానీ అది అతనికి సాధ్యం కాదు. తనలాగే అమ్మా-నాన్నల ప్రేమకు నోచుకోని ఆ పక్షి మీద జోజోకి ఎక్కడలేని ప్రేమా పుట్టుకొస్తుంది. జంతువులు, మొక్కలు ఇంటి బయట మాత్రమే ఉండాలని ఆంక్షలు జారీ చేసే నాన్నకు కోపమొస్తుందని తెలిసినా పక్షిని ఇంటిలోపలికి తీసుకొస్తాడు. తన గదిలో రహస్యంగా పెట్టి దానికి “జాక్” అని మురిపెంగా ముద్దుపేరు పెట్టుకుని ఆప్యాయంగా సాకుతుంటాడు. దాని అట్టలు కట్టిన రెక్కలను పట్టులా మెరిసిపోయేటట్లు చేస్తాడు.
ఉడకబెట్టిన ఆలు గడ్డలను మెత్తగా చేసి గోముగా తినిపిస్తాడు. కుక్కను చూపించి “ఇది చాలా ప్రమాదకరమైనది” అని జాగ్రత్తలు చెప్తాడు. మొదటిసారి ఎగరడానికి వీలుగా ఇది కుడి, ఇది ఎడమ అంటూ దిక్కులు కూడా చెప్పి నేర్పిస్తాడు. ఫొటోలో ఉన్న అమ్మను చూపిస్తూ “అమ్మ మ్యూజిక్ బ్యాండ్ తో ప్రదర్శనలిస్తుందని వివరిస్తాడు. జోజో తరచుగా అమ్మతో ఫోన్ లో మాట్లాడు తుంటాడు ”నేనూ, నాన్నా రోజులు చాలా సంతోషంగా, హాయిగా గడుపుతున్నామని చెప్తూ నమ్మింప జేస్తుంటాడు. కానీ తాను జాక్ ను పెంచుతున్నానన్న సంగతిని మాత్రం చెప్పడు. అమ్మ పుట్టిన రోజుకి ఒక కొత్త విషయంతో ఆశ్చర్యపరిచి ఉత్కంఠతో అమితానందాన్ని కలిగించాలనుకుంటాడు. కానీ తండ్రి మాత్రం ఇక్కడలేనివారి గురించి ఆలోచించ నవసరం లేదని కసురుకుంటాడు. ఆ వయసు పిల్లలందరూ అమ్మకోసం ఆరాట పడినట్లే జోజో మాత్రం తల్లి కోసం అలమటించి పోతుంటాడు. పిల్లవాడి సహజమైన భావాలను పట్టించుకునే మానసిక పరిస్థితిలో తండ్రి రోనాల్డ్ ఉండడు. జోజో వైపు నుంచి వినిపించే సంభాషణల వల్లే వాళ్ళమ్మ ఇంట్లో లేదనీ, ఆమె ఒక గాయని అనీ మనకి తెలుస్తుంది కానీ ఆమె గొంతు ప్రేక్షకులకు వినిపించదు. ఎప్పుడూ కర కర లాడుతూ, మొండిగా, నిలకడ లేని మనస్థత్వం గల తండ్రిని, జాక్ తో తన ప్రత్యేకమైన స్నేహం ద్వారా క్రమక్రమంగా తమ మధ్య సంబంధం చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు జోజో. రోనాల్డ్ మూడ్స్ ని గమనించి ఆయా మానసిక పరిస్థితులకు తగినట్లుగా మసలుకుంటూ చివరికి తండ్రి మనసుని గెలుచుకుంటాడు జోజో. విధి క్రూరత్వం జీవితాలను ఊహించని హఠాత్సంఘటనలకు గురి చేసినప్పుడు ఆ షాక్ ని తట్టుకుని నిలబడే విధానం పెద్దవాళ్ళకూ పిల్లలకూ తేడా ఉంటుంది. అసలు ఆ తండ్రీ-కొడుకుల బాధను పట్టుకునే భాష లేదు!
రొనాల్డ్ గా తండ్రి పాత్ర పోషించిన నటుడు “లొక్ పీటర్స్” (Loek Peters) తండ్రిగా పిల్లవాడిని అరిచి, భయపెట్టేలా ప్రవర్తించి నప్పటికీ మనకు తండ్రి మీద కోపం రాదు. అతని కఠినత్వం వెనక ఉన్న నిస్సహాయత అర్థమై సహానుభూతి కలుగుతుంది. తండ్రీ-కొడుకుల మధ్య కమ్యూనికేషన్ సమస్యకు, సామరస్య లోపానికీ లోతైన మూలాలు ఉన్నాయని ప్రేక్షకులకు తెలుస్తుంది. అంతరాంతరాలలో గూడు కట్టుకున్న బాధ, నిరాశా-నిస్పృహలు, అంతులేని వేదన, మానసిక కల్లోలాలను లొక్ పీటర్స్ ముఖంలో అసామాన్యంగా పలికించారు. లొక్ పీటర్స్ తండ్రి పాత్రలో నటించలేదు. ఆయన జీవించారు!
ఇక కౌబాయ్ గా నటించిన బాలనటుడు “రిక్ లెన్స్” (Rick Lens) నటన దిగ్భ్రాంతి గొలుపుతుంది. ఎంతోమంది వర్ధమాన యువ నటులు సాధించలేని పాత్రలో ఒదిగిపోయే గొప్ప స్పృహ ఈ బాల నటుడిలో కనిపించింది. ఎక్కువ సమయాలు ఒంటరితనం, ఆందోళనలతో గడపవలసి వచ్చినప్పటికీ జోజో “యెంథే” తో గడ్డిలో ఆడుకోవడం లోనూ, “జాక్” ఆలనా పాలనా చూసుకోవడంలోనూ తన బాధనంతా దిగమింగుకొని ఎప్పటికప్పుడు కొన్ని అద్భుతమైన సంతోషంగా గడిపే క్షణాల్ని తనకోసం సంపాయించుకుంటాడు. ప్రతిక్షణం కళ్ళు పెద్దవి చేసి రెప్పలార్పకుండా చూసేలా అప్రమత్తం ప్రేక్షకుల్ని చేస్తాడు. అపరిమితమైన ఆనందం కలిగించే సమయాల్లోనూ, దుర్భరమైన దుఃఖ వేళల్లోనూ కూడా అతి సహజంగా నటించి అందర్నీ మెప్పించగలిగాడు రిక్ లెన్స్. ఎక్కడా ఎక్కువ, ఎక్కడా తక్కువ కాకుండా సమపాళ్ళలో ఉండి రిక్ లెన్స్ అద్భుతమైన నటన ప్రేక్షకులందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. వాస్తవికంగా ఉండి సినిమాలా కాకుండా మన ఇరుగు పొరుగు ఇళ్ళల్లో నివసిస్తున్న, మన చుట్టూ ఉన్న వారి జీవితాలను చూస్తున్నట్లే ఉంటుంది.
సమస్యల వలయంలో చిక్కుకున్న కుటుంబంలో పసితనంలో ఉన్న ఒక చిన్నారి బాలుడు తన జీవితంలో ఎదురైన ప్రతికూల పవనాలను ఎదురొడ్డి నిలవడానికి, తనలోని సామర్థ్యం, అంతర్గత శక్తులను వెలికి తీసిన విధానం అన్ని వయసుల ప్రేక్షకులకు ఆదర్శనీయం. ఈ చిత్రంలో అద్భుతమైన దృశ్యాలు అంటే నిస్సందేహంగా జోజో – జాక్ తో ఆనందంగా గడిపినవే! ఈ ప్రతిభ దర్శకుడికి కూడా చెందినప్పటికీ చిన్నారి రిక్ లెన్స్ అనూహ్యంగా ప్రపంచ సినీ విమర్శకుల మన్ననలతో గొప్ప విజయం సాధించాడు!
ఈ కాలంలో స్త్రీ-పురుషులు వారి వారి అభిరుచుల కనుగుణంగా ఎంచుకుంటున్న ఉద్యోగాలు, వాటివల్ల చెదిరిపోతున్న వివాహ సంబంధాలు, అమ్మా-నాన్నల ముద్దు మురిపాల మధ్య అల్లారుముద్దుగా పెరగవలసిన పిల్లలు ఒంటరిగా పడుతున్న వెతలు – ఇలాంటి ఎన్నో అంశాలను అంతస్సూత్రంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు డైరెక్టర్ హెల్మర్ బౌడేవిజ్న్ కూలే (Helmer Boudewijn Koole). ఈ చిత్రం చాలా అందంగా సులభంగా అర్ధమైనట్లుంటుంది. జోజో- జాక్ ల మధ్య ఆత్మీయ సంబంధం అమోఘమైన స్నేహంగా పైకి చూడడానికి కనిపించినప్పటికీ, నేడు ప్రపంచీకరణ ప్రభావంతో విఛ్చిన్నమవుతున్న వివాహ సంబంధాలతో సహా సమాజంలోని అనేక సమస్యలను, అనేక పొరలలో పరోక్షంగా చెప్తూ, అద్భుతంగా చర్చిస్తుందీ సినిమా!
పిల్లల ఊహనీ, సృజనాత్మకతనీ పూర్తిగా వినియోగించుకున్నారు డైరెక్టర్ “హెల్మర్ బౌడేవిజ్న్ కూలే”. ప్రారంభ సన్నివేశం అనేకసార్లు పునరావృత మవుతుంది. రొనాల్డ్ ఉద్యోగానికెళ్తున్నప్పుడు అతని సెక్యూరిటీ వాహనం వెంట ప్రతిరోజూ జోజో ఏపుగా పెరిగిన పంటలు, ప్రకృతి శోభల మధ్య పరుగులు తీసే దృశ్యం ప్రేక్షకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. అది ఒక విధంగా జోజో ప్రపంచాన్ని సుందరమైన ప్రకృతిలో సున్నితంగా చిత్రించినట్లుగా ఉంటుంది. తండ్రి వెళ్ళిపోతుంటే “అయ్యో, పాపం పసివాడు, నాన్న తిరిగొచ్చేవరకూ జోజో ఒంటరిగా ఉండాలి” అని ప్రేక్షకులు బాధ పడతారు. ఇంటి బయట రమణీయమైన దృశ్యాలతో నయనానందం గావిస్తూ, ఇంటి లోపల తెలుసుకోబోతున్న విషాదానికి ప్రేక్షకులను సన్నద్ధం చేస్తారు ‘హెల్మర్బౌడేవిజ్న్ కూలే’. తండ్రి కోపాన్నీ, సృష్టించిన తుఫాన్ నీ ఎదుర్కోవడానికి సిద్ధపడి వంటగదిలోకి వెళ్తున్న జోజోని ఒక కదిలే సన్నివేశంలో దర్శకులు అద్భుతంగా దృశ్యీకరించారు!
అమ్మా-నాన్నలు నిర్లక్ష్యం చేసిన ఒక చిన్నారి బాబుని కేంద్రంగా చేసి, పిల్లల్ని ఒక వయసు వచ్చేవరకూ అవసరమైనంత బాధ్యతగా పట్టించుకోని పెద్దల గురించి ఆలోచించమని ప్రేక్షకులకు సున్నితంగా విజ్ఞప్తి చేస్తారు డైరెక్టర్ “హెల్మర్ బౌడేవిజ్న్ కూలే”. మూడంటే మూడు పాత్రలతో సినిమా నిర్మించి, సమాజాన్ని సుతి మెత్తగా మందలిస్తున్నట్లు, హితవు చెప్తున్నట్లు స్నేహపూరితంగా చిత్రీకరించడంలో డైరెక్టర్ నేర్పరితనం దాగి ఉంది. ”కూలే” డైరెక్షన్ చాలా క్లోజ్ షాట్స్ మీద ఆధారపడి ఉంది. ముఖాల్లో సందర్భానుసారంగా భావాలు పలికించ గలగడంలో నటులు, దర్శకుడి నైపుణ్యాలు, గొప్పతనాలు వ్యక్తమవుతాయి. విశ్వజనీనమైన కథావస్తువుతో చిత్రనిర్మాణం చేసిన దర్శకుడు ‘హెల్మర్ బౌడేవిజ్న్ కూలే’ చిరస్మరణీయుడు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందే!
“రికీ కూ” (Ricky Koole) పాడిన “You Are The One” అనే సినిమా థీం సాంగ్ అతి మధురంగా వినిపిస్తూ హాయి గొలుపుతుంది.తల్లి కొడుకుతో చేసే సంభాషణ వినపడకుండా ఆమె హమ్మింగ్ చేసే ధ్వనిని మాత్రం మిళితం చేసి సినిమా సౌండ్ ట్రాక్ ని వీనులవిందు చేశారు. చాలా పాటల్లోని సంగీతం వినగానే ఆకట్టుకునే విధంగా ఉండి కథకు సందర్భాను సారంగా చక్కగా అమిరింది!
ఫొటోగ్రఫీ చాలా శక్తివంతంగా, సుందరంగా కన్నుల పండుగ చేస్తుంది!
ఈ చిత్రంలో నటులుగా “లొక్ పీటర్స్”, “రిక్ లెన్స్”, దర్శకుడిగా “హెల్మర్ బౌడేవిజ్న్ కూలే’ కలిసి చాలా నిబద్ధతతో, నిజాయితీగా శ్రమ పడి తమ తమ ప్రతిభల్ని ప్రపంచానికి చాటి చెప్పారు!
ఈ సినిమా 10 సంవత్సరాల వయసు బాల బాలికలకుద్దేశించినప్పటికీ, అమెరికాలో ఈ చిత్రాన్ని 12 ఏళ్ళు పైబడిన వయసు వాళ్ళకి కేటాయించారు!
నిజానికీ చిత్రంలో ఎదుగుతున్న, ఎదిగిన తరాలకు చేసిన విజ్ఞప్తులు చాలా ఉన్నాయి! మెరుగైన భావి తరాల కోసం తపించే వారందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసి తీరాలి!!
సాధించిన అవార్డులు
యూరోపియన్ ఫిల్మ్ అకాడెమి యువ ప్రేక్షకుల అవార్డు
ఉత్తమ యూరోపియన్ యూత్ సినిమా జ్యూరీ బహుమతి
ఇటీవల ప్రతిష్టాత్మక FIPRESCI అవార్డును కూడా దక్కించుకుంది.
బ్రసీలియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, జ్యూరీ గ్రాండ్ ప్రిక్స్ లలో “రికీ లెన్స్” ఉత్తమ బాల నటుడుగా అపూర్వమైన గౌరవాన్నందుకున్నాడు!