ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్ సమస్యలు తెలుగు సాహిత్యంలో రావడం చూస్తున్నాం. ఇది ఆహ్వానించాలిసిన పరిణామం. కొన్ని కథలూ, కొన్ని కవితలూ, ఒక దీర్ఘ కవిత, స్వామి రాసిన “అర్ధనారి”, వరలక్ష్మి తెలుగు లోకి అనువదించిన లైంగిక వైవిధ్యాలు, ఇప్పుడు సోలోమన్ విజయ కుమార్ రాసిన చిన్న నవల “సన్ ఆఫ్ జోజప్ప” ఈ కోవకి చెందినవి.

భారత సమాజం ట్రాన్స్ జెండర్ అస్తిత్వాన్ని ఇంకా అంగీకరించలేక ఉంది. వారు కూడా మనుషులే అని గౌరవించలేక ఉంది. సమాజం సంగతి సరే, ఒక ట్రాన్స్ జెండర్స్ తన సొంత కుటుంబం నుంచి కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. నిరాదరణ ఒక్కటే కాదు తృణీకరణ ఎదుర్కొనేది కూడా వీళ్ళే కావొచ్చు. ఈ ధోరణి అస్పృశ్యత కు తక్కువేమీ కాదు.

 వాళ్ళు శారీరకంగా, మానసికంగా కుమిలిపోవడానికీ, ఒక అసహజ, అసంబద్ధ జీవితం గడిపే స్థితి కి వారిని ఈ సమాజం నెట్టివేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి మన దేశంలో గౌరవనీయమైన పౌరసత్వం లేదు. ఈ సమాజం దృష్టిలో వారు మనలాగే హృదయం, అంతరాత్మ ఉన్న మనుషులు కాదు. అర్థవంతమైన జీవితం గడపడం వారికి స్వప్నం లాంటిది. అలాంటి వాతావరణం ఇప్పటికీ మన సమాజం వారికి కల్పించడం లేదు.

ఈ థీం ఆధారంగా రాసిన ఇంకో నవల “సన్ ఆఫ్ జోజప్ప”

అయితే ఈ నవల ట్రాన్స్ జెండర్స్  బాల్యం నుంచి అడోలోసెన్స్ దాకా ( ఈ నవల లో ఇంటర్ చదువు వరకూ ) మాత్రమే ఇతివృత్తంగా తీసుకున్నారు. కథా నేపధ్యం బాల్యంలోనే “తాను ఏమిటీ” అనే “కన్ఫ్యూజన్” తో మొదలై అడోలోసెన్స్ లో లైంగిక హింస ను ఎదుర్కునే దాకా సాగుతుంది.

 ఆ రకంగా ఈ కథకు రచయిత ఒక పరిధిని విధించుకున్నారు. నిజానికి ఇది రచయిత స్వేచ్ఛకు సంబంధించింది. ఇందులో విబేధించవలసినదేం లేదు. అందుకే చివర అసంపూర్ణం అని కూడా రాసుకున్నారు రచయిత. దీనికి కొనసాగింపు ఉంటుందా? అనే‌ శంకని పాఠకులకు వదిలేస్తూ!

వారిలో లైంగికత, వారిలో పుట్టుకతో సహజంగా పొడజూపే స్త్రీత్వం, అది ఆపోజిట్ సెక్స్ పట్ల చూపే ప్రేమ భావన, ఆ భావనని శృంగార భావనగా పొరబడి ఆ పాత్ర తో ఏర్పడే తాత్కాలిక బంధాలు, ఈ సంబంధాలన్నీ తన శారీరక, మానసిక శాంతి ని ఇవ్వడంలో విఫలం అయి కేవలం సెక్స్ లౌల్యం తీర్చుకోవడం దగ్గరే ఆగిపోతాయి. అన్ని అసంపూర్ణంగా ముగియడంతో పాటు ప్రధాన పాత్రకు తీవ్రమైన అశాంతికి గురిచేస్తాయి. ఎవరిపై అయితే ఇష్టం పెంచుకుంటుందో వాళ్ళు మధ్యలోనే మాయమైపోవడం ఈ పాత్రని కలచివేస్తుంది. ఆ ఎగోనీ అంతా పాఠకుడికి అనుభవంలోకి వస్తుంది.  కథలో ప్రధాన పాత్ర  కోరుకున్నట్టు  ఏ మలుపులో కూడా ప్రేమ కీ, జీవన భరోసా కీ ఆస్కారం లేకుండా మగ పాత్రలు ప్రవర్తించడం ఈ కథ కి మూలం. ఇందులో మళ్ళీ స్వ కుటుంబీకులూ,స్నేహితులతో పాటు అపరిచితులు దాదాపు అందరూ దుఃఖభారాన్ని ఒదిలి వెళ్తారు. ఒక్క స్త్రీ పాత్రలు మాత్రమే ఎంతో కొంత బాధని పంచుకుంటాయి. నిజానికి ప్రోటాగనిస్ట్  ప్రేమని కామవాంఛ గా భ్రమ పడడం ఒకటైతే, ఆ పాత్ర శారీరక కదలికలను దానికి ఆహ్వానంగా భావించి, మీద పడి హింసించడం ఒక ఎత్తు. ఈ హింసని అత్యంత వాస్తవి కమైన వాతావరణంలో రచయిత చిత్రించారు. అయితే ఒక్క ప్రధాన టాన్స్ జెండర్ పాత్రకి తప్ప మిగతా ఏ పాత్ర కీ సరైన రక్తమాంసాలున్నట్టు అనిపించదు. ఈ లోపం స్పష్టంగా కనబడుతుంది. కథ గా మొదలెట్టి నవలగా మార్చారా అనే అనుమానం కలుగుతుంది.  కథలో ఇంకో ప్రధాన లోపం తమ కుటుంబంలోని ఏ ఒక్క పాత్రకి కూడా ప్రధాన పాత్ర లైంగికత తెలియక పోవడం. ఈ విషయం తల్లికి కూడా తెలియదు. చాలా తతంగం ఇంట్లోనే జరిగినా చాలా రహాస్యం గా ఈ విషయాన్ని పాత్ర దాచిపెట్ట గలుగుతుంది. ఇది కొంచెం అసహజంగా అనిపిస్తుంది. మగ పాత్రలన్నీ స్వార్థం లోనూ, మహిళ పాత్రలన్నీ ఉదాత్తంగానూ ఉన్నట్లు రచయిత చూసుకున్నారు. ఒక్క జోజప్ప పాత్ర తప్ప. ఆ పాత్రని కూడా ఆధివాస్తకవితని అన్వయించారు. సన్ ఆఫ్ జోజప్ప (క్రీస్తు తండ్రి జోసెఫ్)అనడంలో ఆంతర్యం దేవుడొక్కడే ఇలాంటి వారికి  దిక్కు అనీ, వీళ్ళు క్రీస్తు లాంటి వాళ్ళూ, సమాజం పెట్టే హింసని క్రీస్తులా భరిస్తుంటారు అని సింబాలిక్ గా చెప్పడం రచయిత ఉద్దేశ్యం. ఇంకేవరూ, చివరికి తల్లి కూడా ఈ పాత్రకి న్యాయం చేయదు.

ఈ లోపాలు పక్కన పెడితే, ప్రధాన పాత్ర చిత్రణ అత్యంత సహజంగా సాగింది. వారిని దగ్గర నుండి చూసి రచయిత ఈ నవల రాసాడా అనిపిస్తుంది. ఈ జెండర్ వాళ్ళ గురించి మనకు తెలియని చాలా విషయాలు ఈ పాత్ర చిత్రణ ద్వారా అర్థం అవుతాయి. ఇంకా ముఖ్యమైన పాజిటివ్ అంశాలు ఏంటంటే నేరేషన్  అంతా నెల్లూరు యాసలో  సాగడం వల్ల కథకి స్థానికత వచ్చి చేరింది. రెండు, సమాజంలోని నిమ్న వర్గానికి( ట్రాన్స్ జెండర్స్ అన్ని వర్గాల ప్రజల్లోనూ ఉండవచ్చు) చెందిన కథలాగా పాఠకులకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నవలాకారుడి డెలిబరేట్ అటెంప్ట్ గా చెప్పవచ్చు. నిమ్న వర్గాల ట్రాన్స్ జెండర్ సామాజిక హింసని ఎక్కువ అనుభవిస్తారా? అనేది చర్చనీయాంశం. అట్లాగే, ఈ కథనం కడుపేదరిక వాతావరణంలో సాగుతుంది కాబట్టి దాని తాలుకు సీరియస్ నెస్ కథనం నిండా అంతర్లీనంగా అల్లుకొని ఉంటుంది.

 ట్రాన్స్ జెండర్స్ లా ఎలా మారతారు అనే విషయం పట్ల సైంటిఫిక్ యనాలసిస్ ఇటీవలె మొదలైంది. వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి గట్టిగా వినిపించడం కూడా ఇటవలి పరిణామమే! కాగా వాళ్ళ జీవితాల్ని ఇంకా లోతుగా పరిశీలించి ఇంకా అనేక పార్శ్వాలు తడిమే సాహిత్యం రావాల్సి ఉంది. అటు వైపుగా  సన్ ఆఫ్ జోజప్ప ఇంకో అడుగు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Leave a Reply