ఒక మహా పర్వతం చుట్టూ అనేక మంది నిలబడి, తమకు కనిపిస్తున్నంత మేరా ఆ పర్వతం ఎలా ఉందో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.ఏ ఒక్కరికీ అటువంటి మహా పర్వతం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం కాదు,స్వభావమూ అర్థం కాదు.వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను మనం తెలుసుకుంటే తప్ప , ఆ పర్వతం యొక్క సంపూర్ణ రూప స్వభావాలు అర్థం కావు- ఒక గొప్ప మనిషి గురించి కూడా అలాగే ఉంటుంది.

కాళీపట్నపు రామారావు మాస్టారు మరణించి అప్పడే రెండు వారాలు గడిచాయి.వారి మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తూ రాస్తున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే, ఆశ్చర్యం కలుగుతోంది. రామారావు మాస్టారు ఎంత మందితో- కథారచయితలతో సంబంధాలు నెరిపారో పరమాద్భుతమైన విషయం లాగా అనిపిస్తుంది. ఒక మనిషి తన జీవితంలో చెయ్యగల,చెయ్యవలసిన కృషి ఎంత ఉంటుందో, ఎలా చెయ్యవలసి ఉంటుందో మాస్టారు కృషి చూస్తే బోధపడుతుంది. ఇటీవల కాలంలో ఓ కథారచయిత మరణానికి ఇంత స్పందన అపూర్వమైన విషయం. ఇప్పటికీ మిత్రుడు సంపత్ రావు గారు సేకరించిన నివాళి రచనలు దాదాపు రెండు వందల పేజీలు దాటాయి.అదంతా మాస్టారు వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

మాస్టారు కథల గురించి, మాస్టారు కథానిలయం ప్రాజెక్టు కోసం చేసిన కృషి గురించి, మాస్టారు తమతో వ్యవహరించిన తీరుతెన్నుల గురించి వందలాది మంది రచయితలు కవులు పాఠకులు తమతమ కోణాల్లో రాసారు.ఇంకా రాస్తూ ఉన్నారు.

నా పేస్ బుక్ వాల్ మీద ‘ మాస్టారు మాట’ అని ఒక సీరియల్ సుమారు రెండు సంవత్సరాల పాటు రాసాను.
మాస్టారు ద్వారా నేను గ్రహించిన విషయాలను- మాస్టారుతో నాకు గల సంబంధం గురించి, ఓ నలబై సంవత్సరాల అనుభవాలను గ్రంథస్తం చేసాను.ఆ పుస్తకాన్ని ప్రచురింప చేసి మాస్టారు చేతుల్లో పెట్టాలని నేను ఎంత ప్రయత్నించినా కోవిడ్ వైరస్ సెకెండ్ వేవ్ లాక్ డౌన్ మూలంగా సాధ్యం కాలేదు.మాస్టారుకు ఆ పుస్తకాన్ని చూపించలేక పొయ్యాను.ఇక ఎన్నటికీ చూపించలేను.

నేను ప్రస్తుతం మాస్టారు గురించి మేం తీసిన డాక్యుమెంటరీ చిత్రం గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను.

1993 సంవత్సరంలో నేను అల్లం రాజయ్య గారూ కలిసి ప్రసిద్ధ కథానవలా రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి గారిని చూడటానికి విశాఖపట్నం వెళ్లాం.అప్పుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి ఆరోగ్యం బాగా లేదు. ఎక్కువ కాలం బ్రతకడు అనిపించింది. మాతో చాలా సేపు వారి బాల్యం యవ్వనం తదనంతర జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పారు.నాకు ఎంతో విచారం కలిగింది. ఆ విషయాలను వీడియో రికార్డు చెయ్యలేక పోయినందుకు! ఓ మహా రచయిత ఎలా ఉంటాడు? అతను ఎలా మాట్లాడతాడు? అతని కంఠస్వరం ఎలా ఉంటుంది? అతని కథను అతని ద్వారా వింటే ఎలా ఉంటుంది? ఒక కాలంలో ఒక గొప్ప రచయిత ఇలా ఉండేవాడు,ఇలా మాట్లాడేవాడు,అని భవిష్యత్తరాలకు మనం చూపవచ్చు కద అనిపించింది. మేం ఆయన ఎదురుగా మౌనంగా వింటూ కూర్చుని ఉన్నప్పుడు,మాతో పాటు రామారావు మాస్టారు కూడా ఉన్నారు. అయితే మేం ఉఠ్ఠి చేతులతో వెళ్లాం.అక్కడికి వెళ్లి , వారిని వింటూ ఉండగా అప్పుడు అనిపించింది,అయ్యో ఇదంతా వీడియో రికార్డు చెయ్యలేక పోతున్నామే అని.

మేం విశాఖపట్నం నుండి గోదావరిఖని వచ్చిన తరువాత ఎలాగైనా రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి గురించి డాక్యుమెంటరీ చిత్రం తియ్యాలని ప్రయత్నాలు చేసాను.అది 1993 సంవత్సరం ప్రారంభపు రోజులు. ఇప్పటిలాగా అప్పుడు వీడియో గ్రాపర్లు అందుబాటులో లేరు.అటువంటి పనులు గొల్లకొండలో మాత్రమే చెయ్యగల సౌకర్యాలు ఉన్నాయి.

నా ప్రయత్నాలు అలా సాగుతుండగానే రాచకొండ విశ్వనాథశాస్త్రి గారు మరణించారు.

వారి గురించి తియ్యాలనుకున్న డాక్యుమెంటరీ చిత్రం ప్రయత్నాలను రామారావు మాస్టారు గురించి తియ్యడానికి మార్చుకున్నాను.నాకు తోడుగా నా గోదావరిఖని మిత్రుడు గజ్జెల నాగశంకర్ తన వీడియో కెమెరా తీసుకుని వచ్చాడు. అల్లం రాజయ్య గారు కూడా వచ్చారు.మా ముగ్గురం గజపతినగరం వెళ్లాం.మేం వెళ్లేసరికే మరో కథానవలా రచయిత వివినమూర్తి గారు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు.ఆ డాక్యుమెంటరీ చిత్రం సాంతం అయ్యేదాకా మాకు సహకారంగా ఉన్నారు.

అప్పుడు రామారావు మాస్టారు రిటైర్ అయి తన చిన్న కొడుకు ప్రసాద్ ఇందిర గార్ల దగ్గర ఉంటున్నారు.ఆ కారణంగా
గజపతినగరంలో ఉంటున్నారు.

అక్కడ ఒక పగలు రామారావు మాస్టారును, సీతమ్మ గారిని ఇంటర్వూ చేసాం.వారి నిత్యజీవన విధానాన్ని కొంత చిత్రీకరించుకున్నాం.మరునాడు మాస్టారు స్వగ్రామం మురపాకకు వెళ్లాం.

మురపాక గ్రామం మాస్టారు కథల కేంద్రం. ఒక ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామంలో మాస్టారు ముందు నడుస్తూ, తనకు గ్రామానికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి చెప్తూ,సంబంధిత వ్యక్తులను పరిచయం చేస్తూ, దేశ స్వాతంత్య్రానంతరం తమ గ్రామంలో జరిగిన మార్పుల మంచిచెడ్డలు, వాటికి సాక్ష్యాధారాలు అనతగిన విషయాలను చెప్తూ చూపుతూ ,అవన్నీ తన కథల్లో ఎలా వాడుకున్నాడో మాస్టారు స్వయంగా చెప్పడం మాకు మరిచిపోలేని అనుభవం. మురపాక నుండి విశాఖపట్నం వచ్చి అక్కడ మాస్టారు ఉద్యోగ జీవితం సాగిన స్కూల్ వద్దకు వెళ్లాం.రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి ఇంటికి కూడా వెళ్లాం.రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి ఫొటో పక్కన వారి భార్య సోమిదేవమ్మ గారు నిలబడి ఉండగా చిత్రీకరణ చేసుకుని సముద్రపు ఒడ్డున మాస్టారుతో నడుస్తూ ఉండగా మా డాక్యుమెంటరీ చిత్రం ముగిసింది.

తన తదనంతరం మాత్రమే ఆ డాక్యుమెంటరీ చిత్రం బయటకు చూపండి అని మాస్టారు కట్టడి.

ఆ కారణంగా- నాకు వీడియో క్యాసెట్ల భద్రత గురించి తెలియకపోవడం వల్ల, మా అయిదు గంటల నిడివి కలిగిన డాక్యుమెంటరీ చిత్రం స్వల్పంగా డ్యామేజి అయింది.ఫిల్మ్ రీల్ ఎగువ దిగువ స్వల్పంగా గీతలు పడినట్లు అయింది.అది అర్థం అయ్యాకా,ఆ క్యాసెట్లను అప్పటికే అందుబాటులోకి వచ్చిన సీడీల్లో మార్పించాను.ఎడిటింగ్ చేయించాను.సంగీతాన్ని జత చేసాను.

ఇప్పుడు సంవత్సరం గుర్తుకు లేదు కానీ, కథానిలయం వార్షికోత్సవాలలో మాస్టారు చేతుల మీదుగా ఆ డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేయించాను.కొన్ని సెట్లను‌ అక్కడ అమ్మకానికి పెట్టాం.

మాస్టారు గురించి మేం తీసిందే మొదటి డాక్యుమెంటరీ చిత్రం. ఆ మాట మాస్టారు చెప్తేనే తెలిసింది.
ఆ డాక్యుమెంటరీ చిత్రం తియ్యడం వల్ల మాస్టారు గురించి మరెన్నో విషయాలు నాకు తెలిసాయి.

ఒక రచయిత కథలకు నేపథ్యం ఏమిటో తెలుసుకోవడం, ఆ కథలు చదివిన పాఠకులకు మహా ఆసక్తికరమైన విషయం.నేను చదివిన  యజ్ఞం, చావు వంటి మాస్టారు కథలు మరింత అర్థం అయ్యాయి. అర్థం అయ్యాయి అని చెప్పడం కంటే ,ఆ కథలు కళ్లముందు సినిమాల వలె దృశ్యమానం అయ్యాయి.ఆ డాక్యుమెంటరీ చిత్రం తియ్యడం వల్ల మాస్టారు పుట్టిపెరిగిన జీవితానికి,గ్రామానికి, వారు రాసిన కథలకు ఎటువంటి సంబంధం ఉందో బోధ పడింది. అది ఒక పాఠకుడిగా,కథారచయితగా నాకు కలిగిన మేలు. ఓ రచయిత ఎంతటి బాధ్యతగా కథలు రాయవలసి ఉంటుందో తెలిసి భయం కూడా కలిగింది.

మాస్టారు గురించి డాక్యుమెంటరీ చిత్రం తీసిన తరువాత, మా అమ్మాబాపుల గురించి కూడా ఒక డాక్యుమెంటరీ చిత్రం తీసాను.
సమాజంలో- కుటుంబంలో పెద్దలను డాక్యుమెంటరీ చిత్రాలుగా నిర్మించాలని చెప్పడం కోసం ఉద్దేశించిన మాటలు ఇవి.

ఒక గొప్ప కథారచయిత కథలు చదవడం ఒకెత్తు- ఆ కథలు పుట్టిన ప్రదేశాలు తిరిగి చూడటం మరొకెత్తు.

Leave a Reply