యువ రైతు శుభ్ కరణ్ సింగ్ దారుణ హత్యకు, భద్రతా దళాలు రైతులపై కొనసాగిస్తున్న హింసకు నిరసనగా ఫిబ్రవరి 23ను బ్లాక్ డేగా జరపాలని సమైక్య కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్), రాష్ట్ర అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (సిఎఎస్ఆర్)లు ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా, జంతర్‌మంతర్ దగ్గర శాంతియుత ప్రదర్శన కోసం యిచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా, నేను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు నా సంఘీభావాన్ని తెలియచేయడానికి వెళ్ళాను.
నిరసనకారులెవరూ అక్కడ లేరు కానీ పోలీసులు, ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటిబిపి) పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడనుంచి మెట్రో స్టేషన్ కు వెళ్ళాను, అక్కడ వివిధ విద్యార్థి సంస్థలకు చెందిన సుమారు 25 మంది విద్యార్థుల బృందం, మరొక ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుడు ఎన్. సచిన్ వున్నారు, వారంతా కూడా నిరసన కోసం వచ్చారు. రైతులపై జరుగుతున్న అణచివేతకు నిరసన, వారి డిమాండ్లకు సంఘీభావం వ్యక్తం చేస్తున్న నినాదాలను రాసిన అట్టలను కొందరు తీసుకొచ్చారు. వాటిని పట్టుకొని, నినాదాలు చేస్తూ జంతర్‌మంతర్ దగ్గరికి వెళ్దామని నిర్ణయించాం.
జంతర్‌మంతర్ రోడ్ కు చేరుకున్నాక విద్యార్థులు శాంతియుతంగా బారికేడ్ ముందు కూర్చుని నినాదాలు చేస్తున్నారు. నిరసనకారులు బారికేడ్‌ను విచ్ఛిన్నం చేయడానికి లేదా ఏదైనా అడ్డంకిని సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శిస్తున్న విద్యార్థులపై పోలీసులు ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారో నాకు, సచిన్ కు తెలుసు. (ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అలా చేయడం సర్వ సాధారణం) అందుకని పోలీసులతో మాట్లాడి కొద్దిసేపు విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శన చేసి వెళ్లిపోతారని చేప్దామనుకున్నాం. అయితే, మేము అలా చేయడానికి ముందే, పోలీసులు ఎటువంటి హెచ్చరిక లేకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దారుణంగా దాడి చేసి, వారిని పోలీసు వాన్‌లోకి లాగడం ప్రారంభించారు. మహిళా పోలీసులు రాకముందే, పురుష పోలీసులు విద్యార్థినులపై దౌర్జన్యం చేయడం చూసి నేను నిరసన వ్యక్తం చేశాను.
గాజాలో జరుగుతున్న మారణకాండ బాధితులకు సంఘీభావం తెలుపుతూ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగే బహిరంగ సభకు వెళ్ళాల్సి వుండడం వల్ల సచిన్, నేను ఇద్దరమూ ఆ బృందానికి దూరంగా ఉన్నాం. అయితే, ఫోన్ ద్వారా కొన్ని సూచనలు తీసుకున్న పోలీసులు, మహిళలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బస్సులోకి తోసారు.
మరొక దిగ్భ్రాంతి కలిగించే విషయమేమిటంటే, ఈ ఘటనా స్థలానికి కొంత దూరంలో నిలుచుని వున్న ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు, ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఢిల్లీ) కార్యదర్శి, శారదా దీక్షిత్ అనే 65 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లమని వేడుకున్నాను కానీ, పోలీసులు ఆమెని ఆ స్థితిలో బస్సులోకి విసిరేసారు.
ఆ తర్వాత వారు మమ్మల్ని వాహనంలోనే అరగంట పాటు అటూ యిటూ తిప్పారు. ఆ సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి పంపమని, లేకపోతే ఆమె ప్రాణం ప్రమాదంలో పడుతుందని మేము ఎఎస్ఐ సంజీవ్ కుమార్, ఎఎస్ఐ సుభాష్ చంద్, కానిస్టేబుల్ అనితా సింగ్‌లను వేడుకున్నాం .
మా విన్నపాలన్నీ చెవిటి వాడి ముందు వూదిన శంఖమయ్యాయి. నిరాశతో నేను 100, సీనియర్ సిటిజన్స్ పోలీస్ 1291 నంబర్లకు ఫోన్ చేశాను. పార్లమెంట్ స్ట్రీట్, మాల్ రోడ్ పోలీస్ స్టేషన్‌ల నుంచి నాకు కాల్ వచ్చింది. వారు ఎఎస్ఐ సంజీవ్ కుమార్‌తో మాట్లాడించమన్నారు, కానీ అతను నిరాకరించాడు.
ఐటిబిపి సిబ్బందిలో చాలా మంది షర్టులకు పేర్ల గుర్తింపు బ్యాడ్జిలు లేవని మేము గమనించాం. బస్సులో గాలి లేక చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. తాజా గాలి కోసం విద్యార్థులు తమ తలలను బస్సు కిటికీల నుండి బయటకు పెట్టకుండా అడ్డుకోడానికి, పోలీసులు మందపాటి లాఠీలను ఉపయోగించారు.
ఈ క్రమంలో ఈ ఘోరం గురించి తెలుసుకుని దీక్షిత్ సోదరుడు చంద్ర శేఖర్ పరాశర్ ఢిల్లీ పోలీసులను సంప్రదించాడు.
చివరకు కాపశేరా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఒక ఫామ్ హౌస్ వద్ద వ్యాన్ ఆపారు. అక్కడి నుంచి స్థానిక ఎస్‌హెచ్ఓ నన్ను, దీక్షిత్‌ను సమీపంలోని దీపయాన్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె రక్తపోటు చాలా ఎక్కువగా ఉందని తేలింది, 177/97. కొన్ని మాత్రలను వేసి, తదుపరి చికిత్స కోసం ఆమెను ద్వారకా, సెక్టార్ 9 లో వున్న ఇందిరా గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఆమెను, నన్ను తీసుకెళ్లడానికి వచ్చిన ఆమె కుమార్తెకు ‘అప్పగించారు’. రాత్రి 9.30 గంటల సమయంలో మెట్రో రైలులో ఇంటికి చేరుకున్నాను. సచిన్‌తో పాటు అరెస్టు చేసిన విద్యార్థులను కూడా కపశేర నుంచి విడుదల చేసినట్లు తెలిసింది.
స్పృహ తప్పిన మహిళకు వైద్యసేవలు అందలేదు; పురుష పోలీసు అధికారులు మహిళా విద్యార్థినులను హింసించారు.
శుక్రవారం జరిగిన ఘోర గాయాల నేపథ్యంలో శనివారం దీక్షిత్ తీవ్రమైన ఒంటి నొప్పితో పాటు తీవ్ర తలనొప్పితో బాధపడింది. కనబడని దెబ్బలు వున్నాయేమోనని, అక్కడ ఇచ్చిన చికిత్స ఫలితంగా తలెత్తిన ఏవైనా ఇతర వైద్య సమస్యల కోసం పూర్తి వైద్య పరీక్ష చేయించుకోవాలనుకుంది.
(నందితా నారాయణ్ సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్టీఫెన్స్ కాలేజ్; డియుటిఎ, ఎఫ్‌యుడిసియుటిఎ ల పూర్వ అధ్యక్షురాలు; డెమోక్రాటిక్ టీచర్స్ ఫ్రంట్ అధ్యక్షురాలు, జాయింట్ ఫోరమ్ ఫర్ మూవ్ మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ చైర్మన్)
తెలుగు : పద్మ కొండిపర్తి