చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం ఏకంగా ఉద్యోగాల నుంచే తొల‌గించింది! స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స‌మ్మె చేస్తే.., ఉద్యోగాల నుంచి తొల‌గించిన చ‌రిత్ర బ‌హుశా ఇదే కావ‌చ్చు.

మోదీ ప్ర‌భుత్వం త‌పాలా ఉద్యోగుల ప‌ట్ల ఇంత క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌టానికి కార‌ణం ఏమై ఉంటుంది? త‌పాలా ఉద్యోగు లు ఏమైనా గొంతెమ్మ కోరిక‌లు కోరుతున్నారా?  వారు ఏమైనా ఎవ‌రికీ ఎప్ప‌టికీ సాధ్యం కాని డిమాండ్లు చేశారా? స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ వారేమైనా చ‌ట్ట‌వ్య‌తిరేక‌మైన  చ‌ర్య‌లకు పాల్ప‌డ్డారా?  అంటే అదేమీ లేద‌ని చూసిన‌వారికి ఎవ‌రికైనా   అర్థ‌మవుతుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న త‌పాలా ఉద్యోగుల స‌మ‌స్య‌లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఎన్నాళ్ల నుంచో కేంద్రాన్ని త‌పాలా ఉద్యోగులు అడుగుతున్నారు. అనేక విధాలుగా కేంద్ర ప్ర‌భుత్వానికి త‌మ విన్న‌పా ల‌ను విన్న‌విస్తున్నారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో వారు దేశ వ్యాప్త నిర‌వ‌ధిక స‌మ్మె కు పూనుకోవాల్సి వ‌చ్చింది. దానికి వారు కార్మిక చట్టాల ప్రకారం 45 రోజుల ముందు పోస్టల్ శాఖకు నోటీసు ఇచ్చి, 2023 డిసెంబ ర్ 12 నుంచి దేశవ్యాప్తంగా 2 ల‌క్ష‌ల 50 వేల‌ మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మె మొద‌లుపెట్టారు. వారి డిమాండ్ల‌లో అతి సాధార‌ణ మైన 8 గంట‌ల ప‌నివిధానాన్ని అమ‌లు చేయాల‌నీ,  కనీస వేతన చట్టాన్ని అమలు చేయాల‌నే త‌దిత‌ర 13 డిమాండ్లు ఉన్న‌వి. త‌పాలా ఉద్యోగులు ప‌రిష్క‌రించాలంటున్న స‌మ‌స్య‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మైన‌వి. మాన‌వీయ‌మైన‌వి. చ‌ట్ట‌స‌మ్మ‌త‌మైన‌వి.  త‌పాలా ఉద్యోగులు ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్న ప్ర‌ధాన డిమాండ్లు.. 1) 8 గంటల పని దినాన్ని అమలుచేస్తు, పెన్షన్ తో సహా అన్ని ప్రయోజనా లను మంజూరు చేయాలి. 2) సీనియర్ జిడిఎస్ లకు 12, 24, 36,సంవత్సరాల సర్వీసుకు అదనపు ఇంక్రి మెంట్లు మంజూరు చేయాలి. 3) గ్రూప్ ఇన్సూరెన్స్  రూ. ఐదు లక్షలకు పెంచాలి. 4) గ్రాట్యుటీ రూ. 5 లక్షలకు పెంచాలి.  5) జిడిఎస్ , వారి కుటుంబ సభ్యులకు వైద్యసౌకర్యం కల్పించాలి. 6) కమలేష్ చంద్ర కమిటీ  సిఫారసులను అమలు చేయాలి లాంటి సాధార‌ణ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు.

90 వ ద‌శ‌కంలో దేశంలో స‌ర‌ళీక‌ర‌ణ ఆర్థిక విధానాలు అమ‌లులోకి వ‌చ్చిన త‌ర్వాత అతి ఎక్కువ‌గా ప్ర‌భావితం అయిన ప్ర‌భుత్వ రంగాల్లో పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ రంగం ఒక‌టి. గ‌త మూడు ద‌శాబ్దాలుగా తంతి త‌పాలా శాఖ‌లో నియామ‌కాలు చేప‌ట్టడం లేదు. ఏటా దేశ వ్యాప్తంగా వేల సంఖ్య‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్నా, కొత్త నియామ‌కాల‌ను చేప‌ట్ట‌టం లేదు. దీంతో ఉద్యోగుల‌పై తీవ్ర ప‌నిభారం ప‌డుతున్న‌ది. ప్ర‌భుత్వ విధానాల ఫ‌లితంగా కొత్త నియామ‌కాలు లేక‌పోవ‌టంతో ప‌నిభారం పెర‌గ‌ట‌మే కాదు, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు బాధ్య‌త‌ల‌ను కూడా అద‌నంగా త‌పాలా ఉద్యోగుల‌పై మోప‌డంతో త‌పాలా ఉద్యోగులు మ‌రింత‌గా కుంగిపోతున్నారు.

 76 ఏండ్ల స్వాంత్య్ర భార‌తావ‌నిలో 150 ఏండ్ల నాటి ఎనిమిది గంట‌ల ప‌నిదినం కోసం కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఉద్యోగు లు పోరాడుతున్నారంటే దేశంలో కార్మికుల దీన‌స్థితికి అద్దం ప‌డుతున్న‌ది. క‌నీన వేత‌నం, ప‌నిప‌రిస్థితుల మెరుగు కోసం, ఉద్యోగులుగా త‌మ‌కూ, త‌మ కుటుంబ స‌భ్యుల‌కు  వైద్య స‌దుపాయం కోసం త‌పాలా ఉద్యోగులు పోరాడుతున్నారు. ఇంత‌టి న్యాయ‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని అడుగుతున్నా మోదీ ప్ర‌భుత్వం వాటిని ప‌ట్టించుకోకుండా వారిపై అణ‌చివేత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. సమ్మెలో పాల్గొన్నమొదటి రోజే 30 వేల మంది గ్రామీణ తపాల ఉద్యోగులకు టెర్మినేషన్ నోటీసులు ఇస్తున్నట్లు ప్రభుత్వం  ప్రకటించింది. స‌మ్మె ప్రారంభించిన మ‌రునాడే తపాలా  ఉద్యోగుల ఇండ్ల వద్ద, ఉద్యోగులు పని చేస్తు న్న ఆఫీసుల్లో తలుపులకు  గోడలకు టెర్మినేషన్ ఆర్డర్స్ అతికించారు. తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులకు టెర్మినేశన్ లెటర్స్ జారీచేశారు. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న ఉద్యోగాసంఘాల నాయకులను, సమ్మెలో క్రియాశీలకంగా పాల్గొంటున్న వేలాది మంది గ్రామీణ తపాల ఉద్యోగులను రూల్- 10 ఛార్జ్ సీట్ ద్వారా ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. స‌మ్మె చేస్తున్న ఉద్యోగుల‌ను పోలీసు కేసులు పెడుతామంటూ భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నారు. ఇలాంటి అణ‌చివేత చ‌ర్య‌ల కార‌ణంగా దేశ వ్యాప్తంగా ఉన్న త‌పాలా ఉద్యోగులు స‌మ్మె ప్రారంభించిన నాలుగ‌వ రోజు స‌మ్మె విర‌మించాల్సిన ప‌రిస్థితులు క‌ల్పించారు.

క‌నీస అవ‌స‌రాలు తీర‌క‌, అష్ట క‌ష్టాలు ప‌డుతూ ప‌ని ప‌రిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న త‌పాలా ఉద్యోగులు గ‌తంలో కూడా అనేక మార్లు దేశ వ్యాప్త స‌మ్మె పోరాటాలు చేశారు. చ‌రిత్ర‌లో చూస్తే…  1947 తర్వాత  10 కి పైగా దేశవ్యాప్త నిరవధిక సమ్మెలు జరిగాయి. 1960, 1968 , 1974లోను త‌పాలా శాఖ‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం దీర్ఘకాలం సమ్మెలు కొన‌సాగాయి. 1980, 1990ల త‌ర్వాత కాలంలోనూ దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న‌ పోస్ట‌ల్ ఉద్యోగుల స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం నిర‌వధిక సమ్మెలు జరిగాయి. 2000 సంవ‌త్స‌రంలో సుమారు 14 రోజులు దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్ మెంట్లోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. 2001 నుండి కూడా పలు దఫాలుగా కార్మికుల సమస్యలపై పోస్టల్ డిపార్ట్ మెంటు ఉద్యోగులు, గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మె చేశారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో అయితే,  ఏవో కొన్ని స‌మ‌స్య లు ప‌రిష్క‌రించి, మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌ను త‌ర్వాత ప‌రిష్కరిస్తామ‌నే హామీతో స‌మ్మె పోరాటాలు ముగిశాయి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం మాత్రం త‌పాలా ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకోకుండా, వాటి గురించి ఆలోచించ కుండా అణిచి వేత‌నే ప‌రిష్కాంగా ఎంచుకున్న‌ది. సమ్మె చేస్తున్న ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌ను, ఉద్యోగ సంఘ నేత‌ల‌ను బెదిరింపుల‌కు గురిచేసి, ఉద్యోగాల నుంచి తొల‌గించి స‌మ్మెను విచ్ఛిన్నం చేసింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేటి న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం  ఉద్యోగులను తొలగించే ప‌నికి పూనుకున్న‌ది. 30 వేల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులను ఒక కలం పోటుతో తొల గించడం మోదీ ప్ర‌భుత్వ‌ నిరంకుశ ధోర‌ణికి తార్కానం.

త‌ర‌త‌రాల చ‌రిత్ర‌లో స‌మాచారాన్ని, సందేశాన్ని చేర‌వేసేందుకు ఉనికిలోకి వ‌చ్చిన  త‌పాలా ప‌ని స‌మాజం వ్య‌వ‌స్థీకృతం అవు తున్న కొద్దీ అదొక విభాగంగా అభివృద్ధిచెందింది, విస్త‌రించింది. దేశంలో బ్రిటిష్ వారి రాక త‌ర్వాత స‌మాజం ఆధునికాభివృద్ధి చెందే క్ర‌మంలో పాల‌నా సౌల‌భ్యం కోసం 1854 అక్టోబ‌ర్ 1న బ్రిటిష్ వారు తంతిత‌పాలా శాఖ‌ను ప్రారంభించారు. ఇప్పుడది ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్య‌వ‌స్థ‌గా పేరు ప్ర‌ఖ్యాతులు పొందింది. దేశ వ్యాప్తంగా నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌తో 20,820.02 కోట్ల వార్షిక బ‌డ్జెట్ తో భార‌తీయ రైల్వే త‌ర్వాత అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా పోస్ట‌ల్ డిపార్ట్‌మెంటు ప్రాధాన్యం క‌లిగి ఉన్న‌ది.  దేశంలోని మూల‌మూల‌నా ఉన్న ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తూ దేశ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న‌ది.

 బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో పోస్టల్ డిపార్ట్ మెంటును ప్రవేశపెట్టినప్పుడు గ్రామాల్లో ఉన్న పట్వారిలకు, పటేళ్లకు, టీచర్లకు, గౌరవ వేతనం ఇచ్చి పోస్టల్ శాఖ పనులు నిర్వహించేవారు. కాల క్ర‌మంలో పోస్ట‌ల్ శాఖ చేసే ప‌నులు విస్త‌రించి రెగ్యుల‌ర్ ఉద్యో గుల‌ను నియ‌మించారు. నేటి ఆధునికాభివృద్ధి స‌మాజంలో నేటికీ 2 లక్షల 70 వేల మంది రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాం తాలలో, అట‌వీ ప్రాంతాల్లో, భౌగోళికంగా ఏమాంత్రం అనుకూలంగా, భ‌ద్ర‌త ఉండ‌ని కొండ‌ల ప్రాంతాల్లో, నిత్యం ఉద్రిక్త‌త‌లు ఉండే స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో  తపాల ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ‌తంలో మాదిరిగా కేవ‌లం త‌పాలా ప‌నులే కాకుండా ప్ర‌భుత్వా లు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు కూడా త‌పాల ఉద్యోగుల‌ను వినియోగించ‌టం ప‌రిపాటి అయ్యింది. దీంతో గ్రామీణ త‌పాల ఉద్యోగుల‌పై గ‌తంతో పోలిస్తే ప‌నిభారం విప‌రీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా 1980 ల తరువాత కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో భాగంగా ప్రభుత్వాల సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ఉన్న పోస్టల్ శాఖ ద్వారా  90 శాతం పనులు జరుగుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు- వృద్ధాప్య పింఛ‌న్లు చెల్లించడం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం సొమ్మ‌ను చెల్లించడం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతుబంధు పథకం,  రైతు రుణమాఫీ పథకం చెల్లించడం, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూ రెన్స్ చేయించడం, ఆక్సిడెంట్ పాలసీస్ చేయించటం, దేవాలయాల ప్రసాదాలను పోస్టల్ శాఖ ద్వారా డెలివరీ చేయడం లాంటి ప‌నుల‌ను ఎన్నింటినో చెప్పుకోవ‌చ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభిస్తున్న  కొత్త ప‌థ‌కాలను కూడా గ్రామీణ తపాలా ఉద్యోగుల ద్వారా చేయిస్తున్నారు. గ్రామీణ‌ తపాల పోస్టాఫీసులో ప్రజలు ప్రభుత్వ బ్యాంకుల కన్నా ఎక్కువ మొత్తంలో పొదుపు చేసుకుంటున్నారు. దీంతో ఎంతో ప‌నిభారం ఉంటున్న‌ది. రోజువారి ఉత్తరాల బట్వాడ కాకుండా ఈ స్కీముల ద్వారా గ్రామీణ తపాలా ఉద్యోగుల పని భారం పెరిగింది.

నేడున్న సామాజిక ప‌రిస్థితుల్లో త‌పాలా ఉద్యోగుల సేవ‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే.. వారు కోరుతున్న కోరిక‌లు ఎంత న్యాయ‌మైన‌వో అర్థ‌మ‌వుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, పోస్టల్ శాఖ అధికారులు, కక్ష సాధింపు చర్యలకు పాల్ప‌డ‌కుండా త‌పాలా ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి. గ్రామీణ తపాలా ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. 30 వేల మంది గ్రామీణ తపాల ఉద్యోగులకు జారీ చేసిన టెర్మినేషన్ ఆర్డర్స్ ని రద్దుచేయాలి. ఇప్ప‌టి దాకా జారీ చేసిన రూల్- 10 చార్జి సీట్లను ఉపసంహరించాలి.                  

Leave a Reply