2022 జనవరి 14న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఒడిస్సా రాష్ట్రం లోని జగసింగ్ పూర్ జిల్లా ధింకియా, గోవింద్‌పురా, పటానా, మహాలా గ్రామాల త‌మ‌ల‌పాకు రైతుల‌పై భారీ సంఖ్యలో పోలీసు బలగాలు విరుచుక‌ప‌డ్డాయి. వాళ్ల‌ను తోట‌ల‌కుకు వెళ్లకుండా  అడ్డంప‌డ్డాయి. అక్క‌డితో ఆగ‌లేదు. ఘోరంగా లాఠీ చార్జి చేశారు.   పైకి క‌నిపించే ఈ ఘ‌ట‌న వెనుక చాలా క‌థ ఉంది. 

దాన్ని తెలుసుకోడానికి  నిజ‌నిర్ధార‌ణ‌కు దేశంలోని ప‌లు పౌర‌హ‌క్కుల సంస్థ‌లు, వేదిక‌లు 2022, జనవరి 29-30 న వెళ్లాయి. ఇందులో కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్(CDRO) సభ్యులు  ఏడుగురు, గణతంత్రిక్ అధికార్ సురక్ష్య‌ సంఘటన్ (GASS) సభ్యులు ఇద్దరు,  ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (OPDR) సభ్యులు ఎనిమిది మందితో కూడిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ  బృందం  ఇందులో ఉన్నారు. వీరు  ఒడిస్సా రాష్ట్రం లోని జగసింగ్ పూర్ జిల్లా ధింకియా, గోవింద్‌పురా, పటానా, మహాలా గ్రామాలను సందర్శించారు.   ఈ బృందం కుజంగాలోని సబ్‌డివిజనల్ జైలులో ఉన్న నరేంద్ర మొహంతి, దేబేంద్ర స్వైన్‌లతో పాటు అభయ్‌చంద్‌పూర్ పోలీసు స్టేషన్ SHOని కూడా కలుసుకున్నది. గ్రామస్తులపై కేసులను విచారిస్తున్న సంబంధిత న్యాయవాదిని కూడా బృందం కలిసింది.

ఒడిషా ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (IDCO), జిందాల్ స్టీల్ అండ్ వర్క్స్ (JSW) ఉత్కల్ స్టీల్ లిమిటెడ్‌కు 13.2 MTPA, 900MW క్యాప్టివ్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్, 10MTPA సిమెంట్ ప్లాంట్, 52 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం కలిగిన ఒక క్యాప్టివ్ పోర్ట్ అభివృద్ధి కోసం మొత్తం 1193.974 హెక్టార్ల భూమి కేటాయించింది. ఇందులో అటవీయేతర భూమి 137.64 హెక్టార్లు. ఇందులో వివాదానికి మూలం అడవి కాని భూమి. అటవీ భూమిలోని అధిక భాగంలో గ్రామస్తులు తమలపాకు, ఇతర పండ్లు (ఉదా. జీడిపప్పు), వరిని తరతరాలుగా సాగు చేస్తున్నారు.

బర్ధమాన్ ఎస్టేట్ సమయంలో ఆ భూమిలోని కొన్ని భాగాలను అద్దెకు తీసుకున్నట్లు బృందం కొన్ని రుజువులను చూసింది. 1982లో రైతులకు హక్కులు కల్పిస్తూ ఒడిశా అటవీ శాఖ జారీ చేసిన కొన్ని పత్రాలను కూడా బృందం చూసింది. కాబట్టి గ్రామస్తులకు తాము చాలా కాలం నుంచి సాగుచేసిన భూమిపై హక్కులు లేవని ప్రభుత్వమూ, JSW చేస్తున్న వాదన నిజం కాదు.

2009లో ఒడిశా ప్రభుత్వం పోస్కో ద్వారా ప్రతిపాదిత ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్ట్ కోసం పెద్ద సంఖ్యలో భూమి హక్కుదారులైన రైతుల నుండి బలవంతంగా తొలగించడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ఒడిశా ప్రభుత్వం 2700 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుంది. 2017లో పోస్కో విడిచిపెట్టివెళ్లిపోవడం వల్ల భూమి ప్రభుత్వం వద్ద ఉండి, రైతులను భూమిలోకి ప్రవేశించకుండా నిరోధించింది. ఇప్పుడు రంగంలోకి వచ్చిన JSW డిమాండ్ చేసిన 1193.97 హెక్టార్ల భూమి కొరతను తీర్చడానికి ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ మందిన ప్రజల్ని తొలగించడానికి ప్రయత్నిస్తోంది. 2009లో సేకరించిన భూమిని తీసుకున్న అవసరాలకు వినియోగించలేదు కాబట్టి మా అభిప్రాయం ప్రకారం అప్పటి చట్టం ప్రకారం ఈ భూమిని ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచడం చట్టవిరుద్ధం, ఇది లావాదేవీ పట్టిక (table transaction) తప్ప మరొకటి కాదు. మీనా గుప్తా కమిటీ, సక్సేనా కమిటీ, పోస్కో విచారణ కమిటీతో సహా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు కూడా రైతులకు అనుకూలంగా కొన్ని పరిశీలనలు చేశాయి. స్వాధీనంలో వున్న భూమి రైతులకే చెందుతుంది, ప్రభుత్వం భూమి స్వభావాన్ని అక్రమంగా మార్చడానికి ఎంచుకుంది.

ఈ ప్రాంతంలోని ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోవడాన్ని వ్యతిరేకిస్తూ 2005 నుండి నిరంతరం ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం JSW కోసం తమను మరింత భూమి నుండి తొలగించబోతోందని తెలుసుకున్నప్పుడు నిరసనలు మరింగా శిఖర స్థాయికి చేరుకున్నాయి.

2021 జూన్‌లో నోటిఫికేషన్ జారీ అవడంతో మహాలా గ్రామస్థులు జూలై నుండి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. 2021 ఆగస్టులో JSW ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధింకియా గ్రామప్రజలు రెవెన్యూ శాఖ ముందు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. 2021 నవంబర్‌లో, పటానా గ్రామంలో 2021, నవంబర్ 30 నాడు సరిహద్దు గుర్తింపు (మార్కింగ్) పనిని నిర్వహిస్తామని పేర్కొంటూ నోటీసు అంటించారు. 2021, డిసెంబర్ 1నాడు మహలాలో కూడా ఇదే విధమైన నోటీసు జారీ చేసారు. హద్దుల నిర్ణయం అని పిలుస్తున్న ఈ ప్రక్రియలో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యకలాపాలన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి, దేశ చట్టాలకు విరుద్ధమైనవి. వారి జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నందున ప్రజలు ఈ చర్యలను ప్రతిఘటించడంతో ఆ మార్కింగ్ పని జరగలేదు. గ్రామస్థులతో పాటు, జిందాల్ ప్రతిరోధ్ సంగ్రామ్ సమితి (జేపీఎస్‌ఎస్) నాయకులపై వారికి చెప్పకుండానే పోలీసులు కల్పిత కేసులు పెట్టారు. ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో గత రెండు నెలల కాలంలో పోలీసులు ఈ ప్రాంతంలో కనీసం మూడు క్యాంపులను ఏర్పాటు చేశారు.

2022 జనవరి 14న తమ తమలపాకు తీగల వద్దకు వెళ్తున్న ధింకియా గ్రామ ప్రజలను,  పెద్ద సంఖ్యలో పోలీసులు తమ పనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఏర్పడిన గందరగోళ  పరిస్థితిలో మహిళలు, పిల్లలతో సహా అక్కడ చేరిన ప్రజలపై పోలీసులు క్రూరమైన లాఠీచార్జికి పాల్పడ్డారు. 200 మందికి పైగా చిన్నారులు, మహిళలు గాయపడ్డారని తెలిసింది. అప్పటి నుంచి ఇంతకు ముందు చెప్పిన గ్రామాలలో భయాత్పోతాన్ని సృష్టిస్తున్నారు.  ఎందుకంటే మహిళా కానిస్టేబుళ్లు, అధికారులు లేకుండా పోలీసులు తరచుగా రాత్రిపూట  దాడులు చేస్తారు కాబట్టి  యువత  రాత్రి సమయంలో గ్రామాల్లో ఉండరు అని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే వ్యక్తులు తమ ఐడి కార్డులను చూపించమని అడుగుతున్నారని కూడా వారు బృందానికి చెప్పారు. 2022, జనవరి 14 నుండి కొంతమంది పేర్లతోనూ, 500 మంది “ఇతరుల”పై పద్దెనిమిది కేసులు పెట్టామని అభయ్‌చంద్‌పూర్‌ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలియచేసారు. పోలీసులు ఏ వ్యక్తినైనా “ఇతరులలో” ఒకరిగా చేర్చగలరని మానవ హక్కుల కార్యకర్తలుగా మాకు బాగా తెలుసు. పద్దెనిమిది కేసుల్లో 12 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు సుమోటోగా నమోదు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలోని ఏ పోలీసు స్టేషన్‌లోనూ తప్పు చేసిన ప్రభుత్వ అధికారులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరేంద్ర మొహంతి, దేబేంద్ర స్వైన్ సహా ఆరుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచే ముందు పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో దేబేంద్ర స్వైన్‌ను కొట్టారని, అసభ్య పదజాలంతో దూషించారని తెలిసింది.

పరిశీలనలు:

1. JSW మొత్తం ప్రాజెక్ట్ అమలు అయితే కనక, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరచబడిన ప్రజల జీవించే హక్కు, జీవనోపాధిని పొందే హక్కును దోచుకున్నట్లవుతుంది, వారి పణంతో జిందాల్‌ మరింత సంపద్వంతమవుతుంది.

2.పర్యావరణ ప్రభావ అంచనా (EIA) చేసిన విధానాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి ఉదాహరణ, నీటితో కలిపిన ఇనుప ఖనిజం 330 కి.మీ పైపులలో కియోంజార్, సుందర్‌ఘర్‌లోని మైనింగ్ బ్లాక్‌ల నుండి ధింకియాలోని ప్లాంట్ స్థలానికి రవాణా చేయాలనే JSW ప్రతిపాదన. నీటి అవసరాలను తీర్చడానికి జగత్‌పూర్ వద్ద మహానది నుండి 48.5 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకురావాలని అంచనా వేశారు.

డిమాండ్లు :

1.గ్రామాల నుండి పోలీసు బలగాలన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలి; గ్రామస్తులపై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేయాలి.

2. JSW ప్రాజెక్ట్‌ను తక్షణమే నిలిపివేయాలి; రైతులను వారి భూమి నుండి బలవంతంగా ఖాళీ చేయించడంతో సహా అన్ని అంశాలను పరిశీలించడానికి సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలి.

3. తమలపాకు తీగలు నష్టపోయిన రైతులకు, కూలీలకు పరిహారం ఇవ్వాలి.

తపస్ చక్రవర్తి (CDRO)

ఆజాద్ స్వాతి (GASS)

చిలుక చంద్రశేఖర్ (పౌరహక్కులసంఘం )

నంబూరి శ్రీమన్నారాయణ (పౌరహక్కులసంఘం )

Leave a Reply