ఉల్గులాన్ అంటే గోండీలో ప్రజా తిరుగుబాటు. ఇవాళ దండకారణ్యమంతా పోటెత్తిన ఉల్గులాన్. అణచివేత, నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజా పోరాటాలు ఎట్లా ఉంటాయో దండకారణ్యంలో చూడాల్సిందే. దేశమంతా పోరాట క్షేత్రంగా మారుతున్న తరుణంలో దాన్ని ఉన్నత రూపంలో ముందుకు తీసుకపోతున్నది దండకారణ్యం.
బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా మనదేశంలో తొలుత పోరాట శంఖమూదినది లేదా విల్లంబులనెత్తినది, తుపాకినెత్తినది అదివాసులేనని చరిత్ర నమోదు చేసింది. ఆ వీరసంప్రదాయాన్ని ఎరిగిన ‘‘రాజ్యాంగ నిర్మాతలు’’ భారత రాజ్యాంగంలో మూలవాసుల సంరక్షణ, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఆర్టికల్స్‌ను రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్342లో మన దేశంలోని ఆదివాసులను గుర్తించడానికి కావలసిన ప్రక్రియను పేర్కొన్నారు. ఫలితమే షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది వునికిలోకి వచ్చిందంటారు. నిజానికి ట్రైబ్ అనేది ‘ఇండో ఆర్యన్ ఇమ్మిగ్రేషన్’తో ముడిపడిన పదంగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆర్టికల్ 342 ప్రకారం మన దేశంలో 550 తెగలతో కూడిన జాబితా తయారైంది. తరువాత ఓటు బ్యాంకు రాజకీయాలతో కేంద్రప్రభుత్వం గుర్తించిన అదివాసీ తెగల జాబితా పెరుగుతూ పోయి 705కు చేరింది.
మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 17, 46, 25ఏ, 192, 115, 29(2), 26, 335, 380, 332,334 244, 164, 388, 275, 3828లలో అనేక విషయాలు పేర్కొన్నారు. 1874లో షెడ్యూల్డ్ జిల్లాల చట్టం వచ్చింది.
మన దేశ చరిత్రతో, ప్రజల జీవన విధానంతో సంబంధం లేని వలస పాలకులు దాదాపు 200 తెగలను దొంగతనాలు, దోపిడీలు చేసి జీవించేవారుగా వర్గీకరిస్తూ క్రిమినల్ ట్రైబ్స్ అఫ్‌ఇండియా చట్టం చేశారు. కానీ, నిజానికి ఆదివాసీలకు దొంగతనం, దోపిడీ అంటే తెలియవు. వారికి స్వంత ఆస్తి చాల కాలం తరువాత ఉనికిలోకి వచ్చింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రధానంగా పోడు వ్యవసాయం సామూహికంగానే చేసుకుంటున్నారు. దోపిడీ తప్ప మరోటి తెలియని బ్రిటిష్ పాలకుల వారసత్వాన్ని స్వీకరించి అధికారాన్ని చేపట్టిన భారత పాలకులు తమ కౌటిల్యనీతితో ఆదివాసీ ప్రజలను అభివృద్ధి, రక్షణ పేరుతో నాశనం చేస్తున్నారు. అందుకు ఈనాడు మన దేశంలో మధ్యప్రదేశ్‌లోని బైగాలు మొదలు మాడ్లోని మాడియాలు, ఉత్తరాఖండ్‌లోని బోక్సాల వరకు దాదాపు 70కి పైగా తెగలను స్వయాన భారత ప్రభుత్వమే పీవీటీజీ (పర్టికులర్టీ వల్నరబుల్ ట్రైబల్(గ్రూపు) లుగా గుర్తించి వాటి అస్థిత్వం అంచులపై నిలిచిందని నిస్సిగ్గుగా ప్రకటించిందంటే తెగల అభివృద్ధి, రక్షణ విషయంలో దాని చట్టాలు, సంస్కరణలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఒక తెగ అంతరించి పోతుందంటే, మానవ జాతి వికాస క్రమంలో అనేక తరాలు అందించిన కృషి అంతమవుతుందన్న మాట!
దీనర్థం దోపిడీ పాలకవర్గాల విధాన నిర్ణేతలు తెగల వినాశనాన్నే కోరుకుంటున్నారనీ, అదే జరుగుతోందనీ మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఇటీవలే ఒడిశాలోని డజన్ల కొద్ది తెగల మూలవాసుల జీవిత సత్యాలను వెల్లడిస్తూ వెలువరించిన ఎన్సైక్లోపీడియా చూడవచ్చు! అలాగే, గత నాలుగు దశాబ్దాలకు పైగా దేశంలోని బహుళ ఆదివాసీ ప్రాంతాలైన రూర్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లలోని అదివాసీ ప్రజా సముదాయాల మధ్య పని చేస్తున్న ప్రభుత్వేతర సంస్థ ‘‘ప్రధాన్’’ తొలిసారిగా రూర్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలోని దాదాపు 5,000ల ఆదివాసీ కుటుంబాల జనజీవితాలను అధ్యయనం చేసి ‘‘ఆదివాసీ జీవనాధార వాస్తవ పరిస్థితులు – 2028’ సామ్రాజ్యవాద ప్రాయోజిత ‘‘ఫోర్టు’’ నంస్థ హసయోగంతో వెలువరించింది.
దానిని అధ్యయనం చేసినా అనేక వాస్తవాలు తెలుస్తాయి. కాలానుగుణంగా ఆదివాసులను ఉద్ధరించేపేరుతో ఎన్నెన్నో సవరణలు, నూతన చట్టాలు ముందుకువస్తునే వున్నాయి. వాటి సరసనే దేశం ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నమోదు కావాలనే పరుగు పందేరంలో పోటీ పడుతోంది. ఈ పందెంలో దేశం నెగ్గాలంటే వాల్టర్ ఫెర్నాందేజ్ పరిశోధనలో చెప్పినట్టు ఆదివాసులను బలిపెట్టడం తప్ప అన్యధా మార్గమే లేదు. కాకపోతే, నాగరిక ప్రపంచంలో ఘనమైన ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న మన దేశంతో ఇంత సూటిగా చెప్పడానికి సాహసం ఎవరికి వుంటుంది? అందుకే గ్రాంస్కీ పాలకవర్గాలకు తమ వెనుక ప్రజలను నిలుపుకోవడం అనివార్యం అంటాడు. కాబట్టే వారంతా డొంక తిరుగుడు మాటలలో వినాశకర చర్యలకు పాల్పడుతుంటారు. మన దేశంలో 1870ల నుండి రూపొందుతున్న ప్రతి చట్టం అంతిమంగా ఈ దేశ మూలవాసుల జీవితాలకు ఉరి తాడుగానే మారుతోంది. అందులోభాగమే నేటి మోదీ ప్రభుత్వ నూతన నియమావళి. ఈ చట్టాల సరసనే అనాదిగా తమ మనుగడ కోసం మూలవాసులు పోరాడుతునే వున్నారు. వారి పోరాటాలకు గతంలో తమ తెగ నాయకులే నాయకత్వం వహిస్తే 1970ల నుండి సాయుధ పోరాట మార్గంలో విప్లవకారులు నాయకత్వం వహిస్తున్నారు.
అదివాసీ ప్రాంతాలలో సంప్రదాయ పాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉనికిలోకి వచ్చిన పెసా ప్రకారం అదివాసీ ప్రాంతాలలో గ్రామపంచాయతీలకు బదులు గ్రామసభలను ఏర్పాటు చేసి వాటికి విశేషాధికారాలు ఇచ్చారు. దేశంలోని 5వ షెడ్యూల్డ్ ప్రాంతాలకు (అంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బిహార్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళం, మహారాష్ట్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్) వర్తిస్తుంది. ఒకే ప్రాంతంలో వుండే అదివాసులు గ్రామసభ పరిధిలోకి వస్తారు. పెసా ప్రకారం స్థూలంగా చెప్పాలంటే, అక్కడ వున్న సహజ వనరులు, అటవీ యాజమాన్యం మీద అదివాసులకే హక్కుంటుంది.
అక్కడి వనరులు, పాఠశాలలు, వైద్య కేంద్రాల పర్యవేక్షణ మొత్తం గ్రామసభలకే వుంటుంది. అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహారం పంపిణీ, గనుల తవ్వకాల లీజు, అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన వంటి వాటికి గ్రామసభ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమపథకాలకు లబ్దిదారుల గుర్తింపు చిన్న తరహ అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారులపై నియంత్రణ, నీటివనరుల నిర్వహణ వంటి విషయాలలో గ్రామసభలకే సర్వాధికారాలు వున్నాయి.
ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ దీని నిబంధనలు మాత్రం 2011లోనే రూపొందించారంటే, పాలకులు ఎంత చిత్తశుద్ధితో రాజ్యాంగాన్ని సవరించి చట్టం తెచ్చారో అర్ధం చేసుకోవచ్చు. 2013లోనే అదివాసీ మంత్రిత్వ శాఖ ద్వార గ్రామసభల గుర్తింపు ప్రారంభమైంది. గమనించాల్సిన విషయం ఏమంటే ఒక్క గుజరాత్ తప్ప పెసా నిబంధనలను మిగితా ఏ రాష్టం మూల పెసా చట్టానికి లోబడి రూపొందించుకోనేలేదు. హిందుత్వ ప్రయోగశాలగా రూపాంతరం చెందిన గుజరాత్లో పెసా నిబంధనలను రూపొందించారంటే, గుజరాత్ నమూనా అభివృద్ధిని మిగితా దేశానికి చూపడానికేననేది మనం తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర ప్రదేశ్ నుండి వలస వెళ్లి గుజరాత్లో స్థిరపడ్డ అగరియా ముస్లిం అదివాసీ తెగ గురించి తెలుసుకుంటే తప్ప మోదీ అభివృద్ధి నమూనా వెనుక దాగిన అదివాసుల విధ్వంసం అర్థం కాదు. వారు గుజరాతీ సమాజానికి దూరంగా విసిరివేయబడ్డట్టు ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా రెండవ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారు. నిజానికి ఈనాడు వీరిని ముస్లిం తెగగా వ్యవహరిస్తున్నారంటే, ఈ దేశంలో చారిత్రకంగా బ్రాహ్మణీయ భావజాలానికి బలైన అదివాసుల, దళితుల మతాంతరీకరణ జీవితాలను తెలుసుకోవాలి. గుజరాతీ ఉప్పును దేశమంతా తింటుందోని ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యానం వెనుక దాగిన అగరియాల జీవితాలను బలిగొన్నది హిందుత్వ శక్తులేనని అ తల్లి ఒక అదివాసీగా నిజాయితీగా గుర్తిస్తే అనేక తెగల అంతానికి కారణమైన రాష్ట్రపతి కిరీటాన్ని ధరించడానికి ఆమె సిద్ధపడేదే కాదు. ఆమె హిందుత్వ దాష్టీకాలను ఆమోదిస్తూ, జూన్ 28 నిబంధనలపై సంతకం పెట్టేదే కాదు. అ తరువాత రెండు మాసాలైనా తిరుగకముందే అదే హిందుత్వ ప్రయోగశాల గుజరాత్లో భగవాన్ బిర్సా ముండా అంటూ మన దేశ ప్రధాని కీర్తించే ‘పుణ్యభూమి’లో విశ్వ అదివాసీ దినం ఆగస్టు 9నాడు మహిసాగర్ జిల్లాలోని కడాణా తాలూకాలో కడాణా బ్రిడ్జి వద్ద వున్న బిర్సా ముండా స్టూపాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘోరాన్ని అడ్డుకోవడంలో ఏ కృష్ణుడు ముందుకు రాలేదని, ద్రౌపది అధికారం అక్కరకు రాలేదనీ తేలిపోయింది.
ఇవన్నీ ఇలా జరిగిపోతుంటే, కేంద్రంలోని వివిధ శాఖలలో భాగంగా ఆదివాసుల అభివృద్ధిని పరిగణిస్తూ వచ్చిన ప్రభుత్వం 1999 అక్టోబర్‌లో ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైౖబల్ ఎఫెయిర్స్ను ఏర్పర్చినప్పటికీ అది మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయిందంటే అది కేవలం ప్రజలను మోసపుచ్చుతూ దోపిడీదారుల ప్రయోజనాలు నెరవేర్చడానికే అనేది తేలిపోయింది.
రాష్ట్రాలలో నిబంధనలను రూపొందించుకోని ఫలితంగా కీలుబొమ్మ గవర్నర్లను చేతిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వాసర్గల పెట్టుబడుల ప్రయోజనాలనాశించి చట్టానికి భిన్నంగా, నిబంధనలను రూపొందటవిస్తున్నాయి. అందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం మూల పెసాను నామరూపాలు లేకుండా చేసే విధ్వంసకర చర్యల్లో భాగంగా2015లో మోదీ సంస్కరణలు గుజరాత్ అభివృద్ధి నమూనాను అనుసరించి నాలుగు రకాల పెసాలను రూపొందించి అడవుల మీదికి విసిరి ఆదివాసులను పరీక్షలకు పెట్టింది. రాష్ట్రాలు తమ నిబంధనలను, గత చట్టాలను మూల పెసాకు అనుగుణంగా మార్చుకోవాలి కానీఅసలు పెసాకే ఎసరు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం అని పాలకులకు చట్టాన్ని గుర్తు చేసి పోరాటమార్గాన్ని పట్టారు. యావద్ధేశంతో వారు తమ పోరాట మార్గాన్ని పంచుకున్నారు.
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సాయంతో ఏర్పడిన ‘ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ మేనేజ్మెంట్, పాలనా సంస్కరణల కమిషన్, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య కమిటీ (ఏకే శర్మ), భూ పరాయీకరణ, నిర్వాసితుల అధ్యయనకమిటీ (రాఘవ చంద్ర) పెసాను పటిష్టంగా అమలు చేస్తేనే ఆదివాసీ ప్రజల స్వయం పాలన సాధ్యమని తేల్చి చెప్పాయి. పెసాతో పాటుగా మరో డజన్ అదివాసీ రక్షణ చట్టాలున్నాయి. కానీ పెట్టుబడుల రక్షణే ఏకైకమైన చోట మరే రక్షణ వుండదని మన దేశంలోని ఉదారవాద ఆర్థికవిధాన అమలు చరిత్ర తేటతెల్లం చేస్తోంది.
బ్రిటిష్ వారు తమ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగిన అదివాసీ ప్రాంతాలను తమ చట్టాల అమలు ప్రాంతాల నుండి మినహాయించారు. ఆ ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పిలిచారు. కానీ, నేటి పాలకులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇదే నేటి ఉదారవాద అర్థిక విధానాల లేద సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విశిష్టత. నేటి పాలకులు తమ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రాంతాలను బ్రిటిష్ పాలకులకు భిన్నంగా తమ దాడులకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాటి మీద కేంద్రీకరించి ప్రాణాంతక దాడులకు పాల్పడుతున్నారు. అ ప్రాంతాలలోపరిశ్రమల అభివృద్ధికి ముమ్మరమైన సంస్మరణ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ప్రజల వ్యతిరేకతను, పోరాటాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి అ ప్రాంతాలను తమ భద్రతా బలగాలతో నింపేస్తున్నారు. దానితో దేశంలోని ప్రధానంగా మధ్యభారతంలోని అడవులను, ఆదివాసులను, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ శక్తులు కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదికను ఏర్పర్చుకొని పోరాటాలకు సిద్ధమయ్యారు.
తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలను, వారి పక్షాన నిలిచి, దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్ కోసం, ప్రజల పర్యావరణం కోసం పోరాడుతున్న అనేక వాళ్లను ఉగ్రవాద శక్తులుగా పేర్కొంటూ పాలకులు కటకటాలలోకి తోస్తున్నారు. అందుకు భీమాకోరేగాం తప్పుడుకేసులో పోలీసులు ఇరికించిన ప్రముఖ సంఘసేవకులు మన ముందు సజీవ ఉదాహరణగా వున్నారు. వారిలో ఫాదర్ స్టాన్సామి పాలకులు, జైలు అధికారుల నిర్లక్ష్యవైఖరి వల్ల కటకటాల వెనుక బలై కన్నుమూశారు. వీరే కాకుండా తమ హక్కుల కోసం పోరాడుతున్న వేలాది ఆదివాసులు దేశ వ్యాపితంగా వివిధ జైళ్లలో బందీలుగా వున్నారు. వారిలో నుండి గడ్చిరోలీ జిల్లా మురెవేడకు చెందిన మూడు పదులు నిండని యువకుడు పాండు నొరోటి నాగపుర్ జైళ్లో అగస్టు 25న అధికారుల నిర్లక్ష్యానికి బలైకన్ను మూశాడు. కుటుంబాలకు, తమ సమూహాలకు దూరంగా కటకటాలపాలై ‘ఖైదీ’గా సోదర ప్రజలలో గుర్తింపు పొందుతూ చెప్పనలవికాని బాధలనుభవిస్తున్న వారు ఒకవైపు వుండగా, అధికారుల నిరంకుశ ధోరణులతో, చట్టపరమైన హక్కులు మృగ్యమై, సాగుభూములు లభించక, ఉన్న పంటభూములు ఎప్పుడు కోల్పోవలసి వస్తుందోనన్న భయంతో, అక్టోపస్‌లా విస్తరిస్తున్న పెట్టుబడులమూలంగా నిర్వాసితులవుతున్న మూలవాసులు ప్రాణాలు కోల్పోతుంటే పోలీసులు ఆత్మహత్యలనిముద్రలు వేస్తున్నారు. ఇందుకు ఇటీవలే గడ్చిరోలీ జిల్లా ఏటపల్లి తాలూకా మల్లంపహడ్ గ్రామమూలవాసీ రైతు అజయ్ తొప్పో జిల్లా కలెక్టర్ చేసిన అవమానానికి తట్టుకోలేక ‘అత్మహత్య’ చేసుకున్నాడు. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని కవర్థా జిల్లాలో గర్రకోనాకు చెందిన బుధ్రాంవైగా ఇద్దరు అటవీ అధికారుల (డిప్యూటీ రేంజర్లు) కు రూ. 50 వేల లంచం ఇచ్చుకోలేక, వారి వత్తిళ్లను భరించలేక సెప్టెంబర్ 10నాడు అత్మహత్య చేసుకున్నాడు. ఆయన నేరమల్లా తన ఇంటి కిటికీకి అడవి నుండి కర్ర తెచ్చుకోవడమే!
నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు, కార్పొరేట్ల పెట్టుబడులకు దాసోహం చేస్తున్న పాలకులు, వారి ప్రభుత్వాలు, వారి భద్రతా బలగాలు, పోలీసులు మూలవాసుల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి, జీవికకు పెనుముప్పుగా పరిణమించుతుండడంతో వారు గతంలో ఎన్నడెరుగని రీతిలో చట్టబద్ధపోరాటాలు చేస్తున్నారు. నిజానికి మన దేశ అదివాసులంటేనే సమరశీల పోరాటాలకు, సాయుధతిరుగుబాట్లకు పెట్టింది పేరు. అయినప్పటికీ వారు రాజ్యాంగాన్ని నమ్ముతూ, చట్టాలను విశ్వసిస్తూ తమ హక్కుల సాధనకై శాంతియుతంగా పోరాడుతుంటే వారి ‘ప్రదర్శనలపైన, వారి సభలు,సమావేశాలపైన, వారి ర్యాలీలపైన పోలీసులు విరుచుకుపడుతున్నారు. లాఠీలతో వారినిబాదుతున్నారు. టియర్ గ్యాసులతో వారిని ఏడిపిస్తున్నారు. వారి ధర్నా స్థలాలపై దాడులు మామూలవుతున్నాయి. ధర్నా జరుపుతున్న స్థలాలలో వారు వేసుకున్న గడ్డి గుడిసెలను, తాటాకుపందిళ్లను తగులపెడుతున్నారు. వారి ప్రదర్శనలపై కాల్పులు జరుపుతున్నారు. తూటాలతో వారిప్రాణాలు తీస్తున్నారు. వారిపై మోర్టార్ షెల్లను ప్రయోగిస్తున్నారు.
ఇలా చేయడం తప్పని నిలదీస్తే తమకు అలవాటైన సహజ ధోరణిలో అ తప్పుడు పనులన్నీ మావోయిస్టుల ఘాతుక చర్యలేనంటూ ప్రజలతో అబద్దాలు చెపుతున్నారు. కానీ, అ ప్రజలు తమపై దాడులు చేస్తున్నదెవరో, చేయిస్తున్నదెవరో ఎలాంటి భయాందోళనలు లేకుండా, సందేహాలకు తావివ్వకుండా పేర్లతో సహా వెల్లడిస్తున్నారు.పాలకులు వారి ఓపికకు, సహనానికి పరీక్ష పెడుతున్నారు. వారికి మరెవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే దోపిడీ పాలకులు తాము నయా ఉదారవాద ఆర్థిక విధానాల పక్షమని, తాము అభివృద్ధి అని చెపుతున్నదంతా కార్పొరేట్ల అభివృద్ధేనని, వారు చేస్తున్న చట్టాలన్నీ బహుళజాతుల కార్పారేషన్ల, దళారీ పెట్టుబడిదారుల ప్రయోజనాలనాశించేనని, అందుకు ఆటంకంగా వున్న చట్టాలను చతురోపాయాలతో నీరుగార్చివేయడమో, అమలుకాకుండా చూడడమో, రద్దు చేయడమో చేస్తున్నామని తమ చర్యల ద్వారా చాటుకుంటున్నారు.
ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఎన్ని కుట్రలకు, కుహకాలకు పాల్పడుతున్నప్పటికీ, సైనిక దాడులకు పూనుకుంటున్నప్పటికీ, డ్రోన్లతో బాంబులు కురిపిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం తమ అడవుల కోసం, మనుగడ కోసం, అధికారం కోసం చట్టబద్ధంగా పోరాడుతునే వున్నారు.నూతనంగా గనుల తవ్వకాలకు పూనుకుంటున్నారని తెలిసిన వెంటనే, లేదా వాటికి కాపలాగా ఉంటూ ఆ పనులను నిరాఘటంగా సాగించడానికి, ముడిపదార్థాలను తరలించడానికి పోలీసు క్యాంపులను నెలకొల్పుతున్నారని పసిగట్టిన వెంటనే ప్రజలు నిరవధిక ధర్నాలకు కూచుంటున్నారు. సిలింగేర్ ప్రజా ధర్నా 2021 మే 12 నుండి నేటివరకూ వందలాది మంది ప్రజలతో కొనసాగుతునే వుంది. అక్టోబర్‌లో బీజాపుర్ జిల్లా ఎడ్స్మెట్టలో తమ ప్రజా ధర్నాకు 365 రోజులు పూర్తయ్యాయని వార్షిక సంకల్ప సభ జరుపుకున్నారు. డిసెంబర్ 7 నుండి 10 వరకు (ప్రపంచ మానవ హక్కులదినం) కాంకేర్ జిల్లా వెచ్చఘాట్లో ప్రజా ధర్నా వార్షిక దీక్షా సభను జరుపుకోబోతున్నారు. నెలలతరబడిగా అనేక చోట్ల ప్రజాధర్నాలు కొనసాగుతుండగా కొత్తగా పలు చోట్ల ప్రజలు అవే సమస్యలపై ధర్నాలకు పూనుకుంటున్నారు.
బస్తర్ డివిజన్ (7 జిల్లాలు) నడిబొడ్డున గల మాడ్ ప్రాంతంలో ఇపుడు కొత్తగా ప్రజాధర్నాలు మొదలయ్యాయి. వారు గత సంవత్సరమంతా గ్రామసభల నిర్మాణంలో నిమగ్నమైనారు. వాటిని ఈనాటి వరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గుర్తించనే లేదు. వారు పెసా అమలును కోరుతూనే అంతకన్నామిన్నగా తమ మాడ్‌ను అటానమస్ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ మధ్య నుండి మాడ్లోని ఇరక్బట్టిలో, నవంబర్ 1 నుండి బెహరావేడలో, నవంబర్ మూడవ వారంనుండి కుస్తుర్మెట్టలలో మూలవాసీ ప్రజలు ప్రజాధర్నాలు కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క గ్రామం నుండి వంతుల వారిగా ప్రజలు తిండి సరుకులతో (బత్తెం) తరలివెళుతున్నారు. నిజానికి తమ పోడు వ్యవసాయం, అటవీ వుత్పత్తుల సేకరణ, వంటపనులు తప్ప పెద్దగా కూలీపనులకు సైతం వెళ్లని మాడ్ మహిళలను ఏకంగా రాజ్య వ్యతిరేక ధర్నాల వేదికపైకే వుద్యమాలు తీసుకొని వస్తున్నాయి. ఇదంతా నయా ఉదారవాద ఆర్థిక విధానాల పర్యవసానాల ఫలితమేనని చెప్పుకోవాలి. ఆదివాసులు చట్టబద్ధ్ద పోరాటాలు కొనసాగిస్తునే, తమ పోరాటాలకు అడ్డుతగులుతున్న లేద కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై దళారీ పాత్ర నిర్వహిస్తున్న వారిని తమ సంప్రదాయ పద్దతులలో పంచాయతీలు నిర్వహించి శిక్షలు విధిస్తున్నారు. ఆదివాసీ తెగ సంప్రదాయం ప్రకారం 84 గ్రామాలకు రాజుగా వెలిగిన కాలం చెల్లిన కొరాచా రాజా అజంషాహ (గుద్దు) మండావిని ఇటీవలే సమాజ బహిష్కరణకు గురి చేశారు. అ పక్కనే వున్న దొడిదే గ్రామ పటెల్ నేహర్ సింగ్ తులావీ దళారీ పాత్ర నిర్వహిస్తున్నందుకు మరణశిక్ష విధించారు.
డిసెంబర్ 1 నాడు, బస్తర్ డివిజన్లోని నారాయణ్‌పుర్ జిల్లా బెహరావేడ ప్రజా ధర్నా స్ధలంపై మధ్యాహ్నం డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్స్) గూండాలు ఇతర ఖాకీ బలగాలతో కలసి దాడి చేశారు. ప్రజలపై చేయి చేసుకున్నారు. ధర్నా చేస్తున్న ప్రజలను నోటికి వచ్చినట్టు తిడుతూ అక్కడి నుండి వెళ్లిపోవాలని, కొద్ది రోజులలో పోలీసు క్యాంపు వచ్చి తీరుతుందని, ఎవరూ ఆపలేరని హెచ్చరించి వెళ్లారు. వారిలో కరుడుగట్టిన అదివాసీ ఖాకీ అధికారి చుక్కు నారోటీతో పాటు దిగజారిన నక్సలైట్లు నవీన్, కసురులాంటి దుర్మార్గులున్నారని ప్రజలు గుర్తుపట్టి వారిని హెచ్చరించారు. మాడ్ భూమిలో పుట్టి దోపిడీదారుల ఎంగిలి మెతుకులకు ఆశపడి తమ సమాజానికే హాని తలపెట్టిన డీఆర్జీ గూండాలకు జనం తప్పకుండా బుద్ధిచెపుతారనీ ప్రకటించారు. పోలీసులు క్యాంపు తెచ్చి పెట్టినా తమ ప్రజా ధర్నా ఆగేది లేదని, తమ న్యాయమైనపోరాటం కొనసాగితీరుతుందని, తద్వారా పాలకుల నైజం వెల్లడవుతుందని ప్రజలు ఘంటాపథంగా చెపుతున్నారు.