ఈ రోజు దేని గురించి
మాట్లాడగలను
మరణాల గురించి తప్ప
పాలస్తీనాలో పసికందుల
మరణాల గురించి తప్ప
ఈ రోజు దేని గురించి
మాట్లాడగలను
దండకారణ్యం గురించి తప్ప
ఆకాశం నుండి
నేలతల్లి ఒడిలోని
ఆదివాసీ పసిపాపలపై
జరుగుతున్న బాంబు దాడుల
గురించి తప్ప
ఈ రోజు దేని గురించి
మాట్లాడగలను
బుల్డోజర్ దాడుల గురించి తప్ప
మసీదుల కింద తవ్వుతూ
కొత్తగా లేని ఆనవాళ్ళేవో
దొరికాయని కూల్చి వేసే
కుట్రల గురించి తప్ప
ఈ రోజు దేని గురించి
మాట్లాడగలను
రైతు పండించిన ధాన్యానికి
గిట్టుబాటు ధర కోరితే
కాల్పులు జరుపుతున్న
వాడి నైజాన్ని గురించి తప్ప
ఈరోజు దేని గురించి
మాట్లాడగలను
కాలికింద నేలను తవ్విపోయుట
గురించి తప్ప!
Related