ఇది కె. సభాగారి శత జయంతి సంవత్సరం (01-07-1923  –  04-11-1980) దేశవాళీ గుభాలింపును, రాయలసీమ నుడికారాన్ని మానవ సంబంధాల వైచిత్రిని, పల్లె సొగసులని, సంస్కృతి సంప్రదాయాలని ఆటపాటలని వంటలని, పండుగలని, ప్రకృతి అందాలను ఇలా సమస్తాన్ని తన రచనల్లో అత్యంత హృద్యంగా చిత్రీకరించిన తెలుగు రచయిత కె .సభా గారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా, రైతు ఉద్యమాలలో ప్రత్యక్షంగా ప్రజలు, రైతులు, దళితులు వైపు నిలబడి పోరాడడానికి  పది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉపాధ్య వృత్తి నుండి   బయటపడి  పత్రికా రంగాన్ని ఎన్నుకొని ఉద్యమ స్పూర్తితో పాత్రికేయుడుగా, సంపాదకుడిగా ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసిన సంఘ సంస్కర్త రచయిత  కె.సభా. ఎదుటి వారి కష్టాలను గుర్తించి, స్పందించి, చలించే మనస్తత్వమే  అతడ్ని ఉపాద్యాయ వృత్తి  నుండి పత్రికా రంగానికి తీసుకు వచ్చింది.

పద్య కావ్యాలు, గేయాలు, కవితలు, కథలు, నవలలు, బాలసాహిత్యం, బుర్రకథలు, పాటలు,  సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సాంఘిక వ్యాసాలు, సమీక్షలు, సాహిత్య విమర్శ , సంపాదకీయ వ్యాసాలు, పరిశోధనాత్మక వార్తా కథనాలు.. ఇట్లా ఎన్నో ప్రక్రియలో ప్రతిభావంతమైన రచనలు చేసిన కేసభా మొదట ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఆ చట్రం నుండి బయటపడి పత్రికా రంగంలోకి స్వేచ్ఛగా వచ్చేశాడు. పాత్రికేయుడుగా సంపాదకుడిగా అతడు సామాజిక స్పృహతో ఎన్నో విలువైన వ్యాసాలను రాశాడు. జీవన భద్రతను కాదనుకుని  ఉపాధ్యాయ వృత్తి నుండి బయటపడి, ప్రజల కష్టాలకు బాధలకు సమస్యలకు దుఃఖానికి స్పందించి, చలించి ఉపాధ్యాయ వృత్తి నుండి ఆయన నేరుగా పత్రికా రంగంలోకి వచ్చేయడం ఒక విప్లవాత్మక సాహసోపేతమైన చర్య.

01-07-1923లో  తమిళనాడు సరిహద్దులో చిత్తూరు జిల్లా  గ్రామీణ మారుమూల ప్రాంతం కొట్రకోనలో జన్మించిన కనక రత్న సభాపతి అనే కే.సభా, 1940 ప్రాంతాల్లో రచనా రంగంలోకి వచ్చారు. రైతు రాజ్యం, పాంచజన్యం లాంటి బుర్రకథలు, దయానిధి వేద భూమి లాంటి పద్య కావ్యాలు, విశ్వరూప సందర్శనం లాంటి గేయ కావ్యం, బిక్షుకి, దేవాంతకుడు, దౌర్భాగ్యుడు, మొగిలి –నవలలు బాలల కోసం రాసిన నాటకాల  సంపుటాలు”:పరీక్షా ఫలితాలు ,చిట్టి మరదలు, స్వతంత్రోద్యయం, పురవది నాయక ,ఏటిగట్టున, చావు బేరం, చిన్నపిల్లల కోసం రాసిన నవలలు: పసి హృదయాలు, పావురాలు, సూర్యం, చంద్రం, కవి గాయకుడు, మత్స్య కన్యలు, పావురాలు బుజ్జి జిజ్జి ;అరగొండ కథలు, సీసా చరిత్ర, ఐకమత్యం ,చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారత విప్లవ గాధలు, ఎత్తుకు పై ఎత్తు, జాబిల్లి, అన్నయ్య- చిన్నయ్య మొదలైన కథా సంపుటాలు అద్భుతమైన వారి సాహిత్య కృషికి నిదర్శనాలు.

బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. పిల్లల కోసం ఆయన చేసిన రచనలన్నీ కలిపి 18 సంపుటాలుగా వచ్చాయంటే ఆయన  బాలసాహిత్యం పట్ల ఎంతటి బాధ్యతతో రచనలు చేశారో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కారణంగా ఉపాధ్యాయుడిగా అతడికి కల అనేక అనుభవాలు  అతడి రచనల్లో జీవం పోసుకున్నాయి. రైతు జీవితాన్ని రాయలసీమ గ్రామీణ జీవితాన్ని చితికరించిన కథల్లో సైతం అత్యంత సహజమైన పిల్లల పాత్రల ప్రవర్తన చాలా విశేషంగా పాఠకులను ఆకట్టుకుంటుంది. పిల్లల మనస్తత్వాన్ని ఆయన చక్కగా అర్థం చేసుకున్నాడు అనటానికి ఆయన కథల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.

గ్రామ స్వరాజ్య వ్యవస్థలో గ్రామీణ జీవితంలో అటు పల్లెలు, ఇటు  నగరాలు, సమాజాలు, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెత్తందారులు, చట్టాలు చట్టాల అమలు, కరువు కాటకాలు, కక్షలు, ఆత్మీయతానుబంధాలు, ప్రేమలు, పగలు, ప్రతీకారాలు, మానవ జీవితంలోని సుఖదుఖాలతో పాటు అనేక అనుభూతులను భావోద్వేగాలను అత్యంత ప్రతిభావంతంగా సహజంగా పాఠకులను ఆకట్టుకునేలా, ఆలోచింపచేసేలా రాసిన రచయిత కె.సభా.  వర్తమానాన్ని సక్రమంగా అర్థం చేసుకొని, భవిష్యత్తును అంచనా వేయగలిగిన దూరదృష్టి కలిగిన రచయిత కాబట్టే భవిష్యత్తులో ఏర్పడే ఎన్నో సామాజిక ఆర్థిక సాంఘిక రాజకీయ పరిణామాల్ని కాలాని కంటే ముందే గొప్ప దార్శనికుడిగా తన రచనల్లో చిత్రీకరించగలిగాడు.

చిన్నతనంలోనే చదువుకోవటం కోసం అతడు పశువుల కాపరిగా కూడా పని చేసాడు. పేదరికానికి దుర్భర పరిస్థితులకు అతడు చిన్నప్పటి నుండి బెదిరిపోలేదు. ప్రధానంగా గమనించవలసింది ఏమిటంటే అతడికి చురుకుదనం, తెగింపు, ఆత్మ విశ్వాసం, పది మందికి మేలు చేయాలనే తపన ఎక్కువ. నిస్సందేహంగా అతడిది  సంస్కర్త హృదయం. సాహసోపేత జీవితం, ఉద్యమ జీవిత నేపధ్యం, సృజానాత్మక సాహిత్యం అతడి ప్రత్యేకత.  తనకు ఎన్ని కష్టాలు  సమస్యలు ఎదురైనా అతడు చలించి పోలేదు. తనకు ఎదురైన ఎన్నో క్లిష్ట పరిస్థితులలో సైతం ధైర్యంగా నిలబడ్డాడు. ఎలాంటి పరిస్థితులనైనా సాహసోపేతంగా ఎదుర్కొన్నాడు. అతడికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం రెండు ఎక్కువే . ఎదుటి మనిషి కష్టాల్ని, సమస్యల్ని, పరిస్థితుల్ని  అర్థం చేసుకునే సంస్కారం, హృదయం ఉంది కాబట్టి, సమస్యలకు పరిష్కారాలను  ఆలోచించే మేధ వుంది కాబట్టి, పీడితుల పక్షాన నిలబడి సమన్యాయం  కోసం హక్కుల కోసం పీడన నుండి విముక్తి కోసం పోరాటం చేసే చైతన్యం ఉంది కాబట్టి అతడు కేవలం కవిగా, రచయితగా మిగిలి పోకుండా ఉద్యమకారుడిగా కార్యాచరణలోకి వెళ్ళాడు. తెలుగు సమాజాలలో ఏక కాలంలో ఉద్యమకారుడిగా, సాహిత్యకారుడిగా, సృజనకారుడిగా కొనసాగిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కె. సభా ముఖ్యులు. చిత్తూరుకు దగ్గరలో శివగిరిలో రైతాంగ విద్యాలయాన్ని అత్యంత సాహసోపేతంగా నిర్వహించిన రైతు పక్షపాతి కె.సభా గారు.

అతడిని కేవలం పద్య కవి గానో, వచన కవి గానో, కథా నవలా రచయితగానో, బుర్రకథా రచయితగానో,   సంపాదకుడిగానో, పాత్రికేయుడి గానో, పత్రికా నిర్వాహకుడిగానో, ఉపాధ్యాయుడి గానో, రైతుగానో .. ఏదో ఒక వృత్తికి లేదా ఒక ప్రవృత్తికి పరిమితం చేయలేం. ఎందుకంటే సాహితీ రంగంలో బహుముఖీన అన్ని రంగాలలో కృషిచేసిన సృజనకారుడు కె.సభా. 

రైతు జీవితాన్ని రైతు సమస్యలను రైతాంగ జీవితంలోని మానవ సంబంధాలను, వ్యవసాయ రంగంలోని పరిణామాలను బయట నుండి దూరం నుండి చూసి తెలుగులో చాలా మంది రచనలు చేసి ఉండొచ్చుగాక కానీ, సొంతంగా భూమిని సంపాదించి నేలను సాగు చేసి స్వయంగా వ్యవసాయం చేస్తూ, రైతుగా రైతు పడే కష్టం ఏమిటో రైతు అనుభవాలు ఏమిటో స్వయంగా అనుభవించి రచనలు చేసిన రచయితలు చాలా అరుదు. అలాంటి అరుదైన రచయిత కె.సభా.  అతను స్వయంగా వ్యవసాయం చేశాడు. రైతు కష్టాలు ఏమిటో రైతు సమస్యలు ఏమిటో అతడికి స్వయంగా తెలుసు. రైతులకి కూలీలకు మధ్య ఉండే అనుబంధం, రైతుకు రైతు కుటుంబాలతో ఉండే అనుబంధం, రైతుకు మట్టితో ఉండే అనుబంధం, రైతు- వ్యాపారస్తుల సంబంధాలు, రైతులు అధికారుల సంబంధాలు, కరువు కాటకాలు వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు ఇంకి పోవటం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం.సాగునీటి కోసం అలమటించడం, విత్తనాల కొరత, పంటల తెగులు, గ్రామీణ రైతాంగ జీవితంలో పంటల కాలాన్ని అనుసరించి పంట కోతల సందర్భాలను అనుసరించి, చెరుకు గానుగ ఆడే సందర్భాలను అనుసరించి కొనసాగే నవ దంపతుల ప్రేమానుబంధాలు, తల్లి బిడ్డల అనురాగాలు, అత్త మామ కోడళ్ళ

మధ్య అనుబంధాలు, ఆడపడుచుల వెక్కిరింతలు, ప్రేమలు, అలకలు, ఒక అద్భుతమైన భారతీయ ఆత్మను సజీవంగా చిత్రీకరించిన తెలుగు రచయిత కె.సభా సమాజంలో ఉండే వివిధ వర్గాలతో రచయితకు ఉండే సమీప్యాన్ని, అనుబంధాన్ని బట్టి, స్పందించే గుణం, సహానుభూతిని బట్టే  రచనలు మేలిమి రకం, తేలిక రకంగా వర్గీకరించబడుతాయి. కె. సభా గారివి మేలిమి రకం రచనలు,  హృదయ సంస్కారం స్పందించేగుణం, మంచి వ్యక్తిత్వం, సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ, సామాజిక శాస్త్రాల అవగాహన కలిగిన రచయితలు రాసే రచనలు ఎప్పుడూ వైవిధ్యభరితంగా విభిన్నంగా ఉంటాయి. సిద్ధాంతాల కోసం సాహిత్యం కాక, వాస్తవ జీవితాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తున్నప్పుడు ఆ రచనలు -కళాత్మకత, సహజత్వం మామూలు మాటలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలు, సామెతలు, పాత్ర చిత్రణ, రచయిత కంఠస్వరంతో గొప్ప శిల్ప సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. దీనికి తోడు సరిగ్గా ఎక్కడ ప్రారంభం కావాలో అక్కడ ప్రారంభం కావడం, ఎక్కడ మలుపు తీసుకోవాలో అక్కడ మలుపు తీసుకోవటం, ఎక్కడ కొస మెరుపు ఉండాలో అక్కడ కొస మెరుపు ఉండటం, ఎక్కడ కొస మలుపు ఉండాలో అక్కడ కొస మలుపు ఉండటం, ఎక్కడ కథ ముగింపు ఉండాలో అక్కడ సరిగ్గా కథను ముగించటం, ఎక్కడా వాచ్యత లేకపోవడం, అనవసరమైన పదాలు, మాటలు, వర్ణనలు లేకపోవడం, పాత్రలు పాత్రలుగా కాక, సహజ మానవ స్వభావంతో ప్రవర్తించడం కే సభా గారి రచనల ప్రత్యేకతలు.

1

కె. సభా గారికి ఇద్దరు పిల్లలు. కుమార్తె నిర్మల, అల్లుడు కుమారస్వామి చిత్తూరులో వుంటున్నారు. కె.సభా గారి కుమారుడు కే.యస్. రమణ సాహితీవేత్త, నిశికవులలో ఆయన ఒకరు. సహజమైన రచనా సౌందర్యాన్ని కలిగిన కవి, రచయిత. అయితే ఆయన అర్ధాంతరంగా చిన్న వయసులోనే మరణించడం తెలుగు సాహిత్యానికి ఒక లోటు. రమణ గారి శ్రీమతి మంజుల హైదరాబాద్ లో వుంటున్నారు.

“రమణా ప్రెస్” లో  “దేవదత్తం” పత్రిక నిర్వహించే క్రమంలో కే.యస్. రమణ సొంత ప్రెస్ లోనే కంపోజింగ్ నేర్చుకోవటం, కార్మికులతో సమానంగా పనిచేయటం, తన పనికి సరిపడా వేతనాన్ని వాళ్ళ నాన్న వద్ద తీసుకోవడం గమనిస్తే కే. సభా గారు ఎంతటి క్రమశిక్షణ కలిగిన తండ్రో తెలుస్తుంది. కష్టపడి పని చేసే మనస్తత్వం,మానవీయ విలువల పట్ల ఆయనకు గల నిబద్ధత ,శ్రమ సౌందర్యం పైన కె. సభా గారికి గల గౌరవం గురించి  అయన జీవితములో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

ఒక సెమినార్ కోసం సెక్స్ వర్కర్ల స్థితిగతుల గురించి ఒక పరిశోధన వ్యాసం రాయటానికి కేఎస్ రమణ ఒకరోజు రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇద్దరు సెక్స్ వర్కర్లను ఇంటర్వ్యూ చేసి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. అతనికోసం కాచుకుని ఉన్న కె. సభా గారు ఆ వివరాలు తెలుసుకొని, బెజవాడలో ఒక పత్రికకు పని చేస్తున్నప్పుడు ఆయన దాదాపు 20 మంది సెక్స్ వర్కర్లని ఎలా ఇంటర్వ్యూ చేశారో తెల్లవారెంతవరకు  వివరాలు చెబుతూ ఉంటే అప్పుడు అక్కడ తండ్రి కంటే కూడా ఆయన స్థానంలో  ఒక గొప్ప ఆత్మీయ స్నేహితుడిని కే.ఎస్. రమణ చూడగలిగారు అంటే, అదీ కె. సభా పిల్లలకు ఇచ్చిన స్వేచ్ఛకు ఉదాహరణ. వారి స్నేహ స్వభావానికి అది ఒక నిదర్శనం.

“ఒకే చెరకుపై రైతు ఆహార సమస్య తీరినట్లే ,ఒకే కథలో, లేక గేయాలో రాస్తే సాహిత్య సమారాధన సంపూర్తి కాదు” అనే సభా గారి మాటల్ని కే.ఎస్. రమణగారు ఎప్పుడు ఉదహరిస్తూ ఉండేవారు. అందుకే కె. సభా గారు వైవిధ్య భరితంగా, వివిధ ప్రక్రియల్లో విస్మృతంగా రచనలు చేసారు.

2

‘దేవదత్తం’ పత్రికలో ఎంతోమంది కొత్త వాళ్ళ రచనలకు అవకాశం కల్పించడం ఆయన గొప్పతనం. ఎంతోమంది ప్రముఖ రచయితల రచనలు ఆ పత్రికలో వస్తున్నప్పుడు కొత్త వాళ్ళ రచనలు కూడా అదే పత్రికలో రావడం ద్వారా కొత్తగా రాసిన వాళ్ళకి ఎంతగానో ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉండేది. అయన ప్రెస్ లో నిత్యం సాహిత్యవేత్తలు రచయితలు ఆత్మీయంగా కలుసుకొని సుదీర్ఘంగా చర్చించుకునే మంచి వాతావరణం వుండేది. యువ రచయితలు, కవులకు,   కొత్తవారికి రాయాలనే ఆసక్తిని కలిగించడమే కాకుండా, వారి  రచనలలోని మంచి చెడ్డలను విశ్లేషించి, వారిని సాహిత్య రంగం వైపు ప్రోత్సాహించడం కె. సభా గారి సాహిత్య వ్యక్తిత్వానికి ఒక మంచి ఉదాహరణ.

భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన అనేక సామాజిక ఆర్థిక సాంఘిక రాజకీయ భౌగోళిక మార్పులను , మానవ సంబంధాలలో ఏర్పడిన వైచిత్రిని, సంక్లిష్టతని, కులం మతం డబ్బు ప్రాంతీయ ఆధిపత్యం కుల వివక్షత గ్రామ కక్షలు, భూస్వామ్య జమీందారీ పెట్టుబడిదారీ వర్గాల దురహంకార ప్రవర్తన, సంస్కృతిలో వచ్చిన మార్పులు ఇలా ఎన్నో అంశాల పట్ల సునిశితమైన పరిశీలనతో విలువైన రచనలు చేసి తొలితరం ప్రాంతీయ ప్రాతినిధ్య రచయితగా, గ్రామీణ జనజీవన సౌందర్యాన్ని సత్యవంతంగా చిత్రీకరించిన గొప్ప రచయితగా, దార్శనికుడిగా, సామాజిక కార్యకర్తగా, పత్రికా విలేకరిగా, సంపాదకుడిగా, పత్రికా నిర్వాహకుడిగా ,ప్రచురణకర్తగా, కె. సభా  గారు చేసిన కృషి చాలా గొప్పది. ఆయన నిర్వహించిన ఆంగ్ల పత్రిక పేరు” పాంచజన్యం”. ఆంధ్రప్రభ, నాగేలు, వాహిని, జమీన్ రైతు, ప్రజారాజ్యం లాంటి పత్రికల్లో సంపాద వర్గంలో పనిచేస్తూ,ఆనాటి సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఆయన వెలువరించిన వ్యాసాలు, సంపాదకీయ వ్యాసాలు, ప్రత్యేక వార్తా కథనాలు ఎంతో విలువైనవి.

3

కె. సభా గారి సాహిత్యం గురించి,వ్యక్తిత్వం గురించి ప్రముఖ రచయితలు, విమర్శకులు తమ వ్యాసాలలో విపులంగా ప్రస్తావించారు. కొన్నిటిని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను.

“నోరులేని ప్రాణి – ఒక కుక్కను గురించి, ఎనిమిదణాల బహుమానం కోసం ఆ కుక్కను పట్టివ్వడం గురించీ – ‘అమూల్యం’ – కథ వ్రాశారు కె. సభా. ఈ కథ చెప్పిన తీరు ఎంతో హృద్యంగా వుంది. ‘కాలితో తన్నిన తాపుకు మంచి దెబ్బ తగిలి వుంటుందని అనుకొన్నాను. ఆ సమయానికి నాకు మా అమ్మ జ్ఞాపకం రావడం చాలా విచిత్రం’ – వంటి ఆత్మ నివేదన చదవగానే చూపు అక్కడే నిలుస్తుంది; లోచూపు అవుతుంది. మొగ్గలా మొదలై శతపత్రంలా విచ్చుకున్న కథా వృత్తాంతం- కథకుని రచనా నైపుణ్యానికి ఎత్తిన వైజయంతికగా తోస్తుంది. వస్తువు, శైలి, శిల్పం – ముప్పేటగా సాగి అచ్చమైన కలనేత వసనంలా తయారైన రచన ‘ పాతాళ గంగ ’కథ ”…. “ రాయలసీమ కథక రత్నాల్లో ఒక అనర్ఘరత్నం-సభా, వారి కథానికలు ఒక్కొక్కటీ ఒక్కొక్క బృహత్ విశ్లేషణకీ, పరిశోధనకీ అర్హమైనవే!” -అంటారు విహారి. –  ( ‘ కథాకృతి ’ పరిచయాలు- పరామర్శలు -2010 )

“సభా బహుముఖీనమైన సాహిత్య కృషిలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణం. దేశీయ వాస్తవికత. తను పుట్టి పెరిగిన నేల, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వాస్తవికతా ప్రతిఫలనమే దేశీయ వాస్తవికత . ఈ వాస్తవికత లక్షణం సభా కథల్లో తొనికిసలాడుతుంది” అంటారు కేతు విశ్వనాథరెడ్డి. ( నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారి ప్రచురణ కె. సభా ఉత్తమ కథలు 2010 కు రాసిన విపులమైన ముందు మాటలో )

“1950 నాటికి దేశంలో అర్బన్ నాగరికత ఇప్పటిలా ఇంతగా శ్రుతిమీరి రాగాన పడలేదు.. అయినా ప్రకృతి బీభత్సాల వల్ల, సాంప్రదాయక దురాచారాల వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని జీవన సరళి నిరంతర కల్లోలానికి గురవుతూనే వుంది. తెనుగు నాటగల పల్లెసీమలలోని ఈతిబాధలు, వేదనలు, యాతనలు, సుఖదుఃఖాలు, రాగద్వేషాలు మొదలై    వాటిని గురించి చింతా దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కరుణ కుమార, జమదగ్ని, మా. గోఖలే లాంటి రచయితలు అప్పటికే తమ రచనల్లో సమగ్ర చిత్రణ గావిస్తున్నారు. ఎటొచ్చీ రాయలసీమ పల్లెపట్టులకే సాహిత్యంలో స్థానం లేకపోయింది. అట్టి పరిస్థితిలో ఇక్కడ గూడా ఊళ్లున్నాయనీ, ఈ ఊళ్లల్లో మనుషులున్నారనీ, ఈ మనుషుల జీవితాల్లో ఎన్నెన్నో కథలు దాగి వున్నాయనీ ఎలుగెత్తి చెప్పడానికి ప్రభవించిన రచయితలా కనిపిస్తారు సభాగారు….. . అవిశ్రాంతంగా రైతుకూలీ, ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, పత్రికా రచయితగా, కవిగా, కథకుడుగా, నవలాకారుడుగా, గేయకారుడుగా, వ్యాసకర్తగా దుర్నీతినీ, దుర్నిర్ణయాలనీ ఖండిస్తూ వచ్చిన క్రియాశీల సృజనకారుడు కె.సభాగారు. ఆయన రాయలసీమలో కథా సాహిత్యానికి ఆద్యుడు.” అంటారు  – మధురాంతకం రాజారాం (తెలుగు కథకులు – కథనరీతులు: మొదటి సంపుటం, 1998)

“దేశీయత వాస్తవికతలు రెండు  సభా గారి సాహిత్య రథానికి రెండు చక్రాల్లా కనపడతాయి…. స్వాతంత్రపు యొక్క సంధి కాలంలో చిత్తూరు ప్రాంతపు జనాల గురించి ఇబ్బడి ముబ్బడిగా సభా గారు రాసిన కథలకు సార్వ జనీయత సార్వకాలీనత కూడా పెద్ద ఆభరణాలుగా ఉంటాయి… రాయలసీమ గ్రామీణ జీవితాన్నంతా ఆయన గొప్ప సామాజిక శాస్త్రవేత్త లాగా గ్రంథస్తం చేశారు.” అంటారు – మధురాంతకం నరేంద్ర అభ్యుదయ రచయితల సంఘం వారు  కథా స్రవంతి వరుసలో ప్రచురించిన  కె. సభా గారి కథా సంపుటికి రాసిన ముందు మాటలో.

4

స్వతంత్రానికి పూర్వపు మరియు అనంతర భారత దేశ గ్రామీణ పట్టణ రాజకీయ సాంస్కృతిక ఆర్థిక సామాజిక రంగాలలో, పరిస్థితులలో, మానవ ప్రవృత్తిలో, జీవన విధానంలో, ఆలోచనా  విధానంలో, సర్వత్రా రాజకీయం వ్యాపించి కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు, రాజకీయ అనుచరులు, దళారులతో , కొత్తగా తయారై  కొత్త వ్యవస్థల గురించి, కరువు కాటకాలతో అల్లల్లాడిపోయే రైతు కూలీల జీవనం గురించి, వారి మనోవేదన గురించి, ఆర్థిక ఆర్థికేతర సమస్యల గురించి, పట్టణీకరించబడుతున్న జీవితాల్లో వస్తున్న మార్పులు, మనుషుల మధ్య ఏర్పడుతున్న అంతరాలు, వస్తువుల పట్ల పెరుగుతున్న వ్యామోహం, ఆధునికత సాంకేతికత సమాజంలో తీసుకు వస్తున్న విపరీతమైన మార్పులు, కుల వివక్షత పై పోరాటం ,ప్రజాస్వామ్య విలువలు, ఉద్యమాలు, ప్రజల నిరంతర పోరాటాలు, దేశభక్తి, దేశీయత, దేశం కోసం ప్రజలు చేసే త్యాగాలు, సమాజం కోసం సమాజానికి ఏదైనా మంచి చేయడం కోసం సాధారణమైన మనుషులు కూడా చేసే గొప్ప సాహస కృత్యాలు, మనుషుల మధ్య  వుండే ప్రేమలు, మమతలు, అనుబంధాలు, కనపడీ కనపడని దోపిడీ రూపాలు, మార్గాలు, కారణాలు, పేదవాడు పేదవాడిని దోపిడీ చేయడం, ఉన్నవాడు పేదవాడిని దోపిడీ చేయడం, రైతులకు పశువులకు మధ్య ఉండే అనుబంధం, కసాయి కరువులో సైతం పశువులను అమ్ముకోకుండా కాపాడుకోవడానికి ఇంటి ఆడపడుచు చేసే సాహసం, త్యాగం, రైతుల కుటుంబాల్లో మూగజీవాల సైతం కుటుంబ సభ్యులుగా ఎలా ఉంటాయో ఆ అనుబంధాన్ని వాస్తవికంగా చూపించటం, సంవత్సరం పొడుగునా జరిగే ఉత్సవాలు, పండుగలు, ఊరేగింపులు, దేవర్లు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు సంతలు, అత్యంత దారుణమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల విషాద గాధలు, సంభాషణ మన చెవులకు వినిపించే విధంగా పాత్ర చిత్రణ ,సంఘటనలు, కథనం కంటికి కనిపించే విధంగా అత్యంత సహజంగా కథను కళ్ళకు కనపడేటట్టుగా రాయటం కే.సభా గారి రచనా విధానం లోని ప్రత్యేకతలు. ఆయనది నిరాడంబర శైలి. కథను చదవడం మొదలుపెట్టాక, ఎక్కడా ఆపడం అంటూ పాఠకులకు సాధ్యం కాదు. తేలికైన తెలుగు పదాలు,  సహజమైన మాటలు,  సహజ సౌందర్యం, శబ్ద సౌందర్యం ఆయన రచనలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాయి.

భారతదేశపు ప్రత్యేకత అయిన గాంధీయిజం  కాలం గడిచే కొద్దీ ఏ రకమైన విపరీతమైన మార్పులకు లోను అయిందో అన్ని రంగాలలోకి రాజకీయం ఎలా చొరబడిందో, రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయం చేసే పరిస్థితి నుండి, మధ్యతరగతి మనుషులు, పేదవారు కూడా రాజకీయాలు చేసే స్థితికి ఎట్లా నెట్టివేయబడ్డారో, రాజకీయం లేని రంగం అంటూ లేకుండా ఎలా పరిస్థితిలు  మారిపోయాయో అన్నిటిని అత్యంత సహజంగా తన రచనలలో చూపించారు.

వ్యవసాయ రంగంతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాలలో, వివిధ వృత్తులలో  పనిచేస్తున్న సామాన్య  జీవన వ్యధలను కూడా నేర్పుగా తన కథలలో చిత్రీకరించడం,ఆ కాలంలోనే పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన కథలను రాయడం, గొప్ప దళిత స్పృహతో, దళితులు ప్రధానంగా దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లోతైన అవగాహనతో నిశితమైన పరిశీలనతో అద్భుతమైన కథలను రాయటం, అనేక జానపద గీతాలు సేకరించి రేడియోలో ప్రసంగాలను అందించడం సామాజిక ఉద్యమాలలో ప్రత్యేకంగా పాల్గొని,  ఉద్యమ శీలత్వంతో కూడిన రచనలను ఉద్యమస్ఫూర్తితో రాయటం , ప్రకృతితో, అడుగంటి పోతున్న భూగర్భ జలాలతో,  దోపిడీదారులతో ,రాజకీయ నాయకులతో ,దళారీలతో వ్యాపారస్తులతో  రైతులు జరిపే నిత్య పోరాటాలను అత్యంత సహజంగా చిత్రీకరించటం, రాయలసీమ ప్రాంతంలోని అనేక ప్రాంతాలను, పల్లెటూర్లను, వాగులను, వంకలను, వాడలను, గుడాలను గుడిసెలను సైతం రచనల్లోకి తీసుకువచ్చి ఒక సజీవతతో పాఠకులకు ఒక గొప్ప సాక్షాత్కారాన్ని కలిగించడం.. ఇవన్నీ కలిసి    కె. సభా గారిని తొలితరం దేశవాళీ కథకుడిగా, రాయలసీమ ప్రాంతీయ ప్రాతినిధ్య కథా రచయితగా నిలిపాయి. సాహిత్యాకారుడిగా, ఉద్యమకారుడిగా, సంపాదకుడిగా ఎదిగిపోయానని అనుకుని అక్కడే ఆగిపోకుండా, నిరంతరం తనను తాను మెరుగు పరుచుకోవటానికి అతడు నిగర్వంగా నిబద్ధతతో అధ్యయనాన్ని అభ్యసనాన్ని కొనసాగించిన  కృషి నేటి రచయితలకు ఎంతైనా ఆదర్శనీయం.

                                                   5

తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రాంతంలో జన్మించి, చిన్నప్పటినుండి కష్టాల్ని అనుభవించి ఎనిమిదవ తరగతి పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ అనంతరం ఉపాధ్యాయుడుగా చేరి, సుమారు పది సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకు విద్యాబోధన చేసి, పిల్లలకే కాకుండా సమాజానికి కూడా నీతి పాఠాలు నేర్పించి, సొంతంగా భూమిని కొని రైతుగా మారి,  రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన నిలబడి రైతుల వ్యవసాయం చేసి, పీడితులు దళితుల పక్షాన నిలబడి, దళితుల దళిత మహిళల బాధలను, రైతు కుటుంబాలలోని స్త్రీల బాధల్ని సహానుభూతితో అర్థం చేసుకొని, ప్రకృతి పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం మానవీయ విలువల కోసం, సమాన హక్కుల కోసం నిజమైన స్వతంత్రం కోసం ప్రత్యక్షంగా ఉద్యమాలలో పాల్గొని, ఉద్యమకారుడిగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, కథా నవలా రచయితగా, ఉపన్యాసకుడిగా, సమాజ సేవకుడిగా సామాజిక కార్యకర్తగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి చూపించి, కూలిపోతున్న సామాజిక విలువల పట్ల ధర్మగ్రహంతో స్పందించి చలించి,చైతన్యవంతమైన రచనలు చేసి,చిత్తూరు జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణల సంఘం, కళాపరిషత్తు, శారదా పీఠం, శ్రీ రమణ పబ్లికేషన్స్ సంస్థలలో గొప్ప సాహిత్య సంస్కృతిక వాతావరణాన్ని సృష్టించి, కొనసాగించి, యువతరాన్ని , కొత్తగా రచనా రంగంలోకి వచ్చిన ఔత్సాహిక రచయితలను ఎంతగానో ప్రోత్సహించి,చివరిలో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లి, ఆధ్యాత్మిక సేవలో పాల్గొన్న కె. సభా గారి గురించి వారి సాహిత్యం గురించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. వారు 04-11-1980 న  మరణించారు.

నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు కేతు విశ్వనాథ రెడ్డి గారి సంపాదకత్వంలో “కె. సభా ఉత్తమ కథలు “ కథా సంకలనాన్ని 2010 లో వెలువరించారు. వల్లూరి శివ ప్రసాద్ గారి నేతృత్వంలో అభ్యదయ రచయితల సంఘం వారు కథా స్రవంతి వరుసలో కె. సభా గారి ఎంపిక చేసిన కథలతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. వారి సమగ్ర సాహిత్యం అందుబాటులోకి రావాల్సి ఉంది.

కోవిడ్ తదనంతర పరిస్థితులే  లేకపోతే ఈ శత జయంతి సంవత్సరం నాటికే కె.సభా గారి సమగ్ర సాహిత్యాన్ని మనసు ఫౌండేషన్ మనకు అందించే ప్రయత్నం నెరవేరి  ఉండేది. ఈ ప్రయత్నం త్వరలో ఫలించి సమీపకాలంలో కె.సభా గారి సమగ్ర సాహిత్యం తెలుగు పాఠకుల హృదయాలకు చేరువ అవుతుందని ఆశిద్దాం. తెలుగు కథ రచయితల వేదిక హైదరాబాద్ వారు 14,అక్టోబర్ 2023న ఆవిష్కరించబడుతున్న ‘మా కథలు 2022 ‘ కథా సంకలనాన్ని వారి శతజయంతి సంవత్సరం సంధర్బంగా కె.సభా గారికి అంకితం ఇచ్చారు.

Leave a Reply