46 ఏళ్లుగా చదువుకొంటున్న విప్లవోద్యమ సాహిత్యం మరీ ముఖ్యంగా కథ నవల ఉత్తర తెలంగాణా జిల్లాల  భూమి పుత్రుల, భూగర్భ ఖనిజాలు తవ్వి తీసే సింగరేణి కార్మికుల, ఆదిలాబాద్ అడవి బిడ్డల అక్కడి నుండి సరిహద్దులు చెరిపివేసి మొత్తంగా ఆదివాసుల  జీవన సంఘర్షణలను, బతుకు పోరాటాలను నావిగా చేసుకొనే సంస్కారాన్ని ఇచ్చాయి.  సకల సామాజిక ఆర్ధిక రాజకీయ మానవ సంబంధాల సారం భూసంబంధాల తో ముడిపడి ఉన్నదని, దానిని ఉత్పత్తి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మహత్తర యుద్ధం జరుగుతున్నదని అర్ధం అయింది. ఆ యుద్ధంలో భాగమైన మహిళల అనుభవ కథనాలు కథలుగా ఇన్నాళ్లుగా  చదువుతున్నవే. .వాటిని ఇప్పుడు ఇలా  ఆరు సంపుటాలుగా విరసం ప్రచురిం చటం అటు విప్లవ  సాహిత్యంలోనూ ఇటు స్త్రీల సాహిత్యం లోనూ  ఒక చారిత్రక ఘట్టం.

ఈ ఆరు సంపుటాలలో మొత్తం 52  మంది  రచయిత్రుల 282 కథలు ఉన్నాయి.  ఇప్పుడు వెలువడినవి మూడు.అడవిలో వెన్నెలను చూపించే వేగుచుక్కల వంటి కథల సంపుటాలు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.ఇప్పుడు ఈ మూడుసంపుటాలలోని 146 కథలు విప్లవోద్యమ నిర్మాణంలోనూ, సాహిత్య సృజనలోనూ స్త్రీల క్రియాత్మక భాగస్వామ్య సౌందర్యాన్ని అంచనావేయటానికి  తగినంత  పరిమాణాత్మక క్షేత్ర స్థాయి మూల వనరు.

ఇది అజ్ఞాత రచయిత్రుల కథా సమయం.  సాహిత్య అధ్యయన రంగంలో ఉండటం వలన, అందులోనూ   మహిళాజన జీవన అధ్యయనాల పట్ల ఆసక్తివల్ల  సాహిత్య చరిత్ర అంచులకు నెట్టివేయబడిన  మహిళా రచయితలను తెలుసుకొనటం నాకు ఇష్టమైన పని. ఆ దిశగా చేసిన ప్రయాణంలో పాత పత్రికల మడతల మరుగున పడి కనిపించని స్త్రీల రచనలు ఒక మేరకు వెలికి తీయగలిగినా  స్త్రీల విషయంలో అలవాటైన  సామాజిక సాం స్కృతిక నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు ఎక్కడపుట్టారో, యెట్లా పెరిగారో ఊరేమిటో, ఉనికి ఏమి టో తెలుసుకొనే అవకాశాలు చాల తక్కువ అని అర్ధం అయింది. ఆ రకంగా స్త్రీ రచయి తలు  అందరూ ‘అజ్ఞాత రచయిత్రులే’  అనుకొంటాను.

అటువంటప్పుడు స్వంత కుటుంబాలు, ఆస్తులు, జీవితం, తల్లీదండ్రీ పెట్టిన పేర్లు- అన్నీ వదులుకొని శ్రామిక వర్గ ప్రయోజనాలకోసం, ఉత్పత్తి సంబంధాలలో మార్పు కోసం, ఉన్నత మానవీయ విలువలతో నూతన సమాజాన్ని నిర్మించటం కోసం దండకారణ్యం పొడ వునా విస్తరిస్తున్న విప్లవోద్యమంలోకి  నడిచి వెళ్ళిన, వెళ్తున్న మహిళలను తెలుసుకొనటం, వాళ్ళ రచనలను గుర్తించటం,  సేకరించటం ఎంతవరకు వీలవుతుంది? అన్న సందేహం కలిగింది.ఎంతవరకు సాధ్యమో చూద్దామని చేసిన  ఒక ప్రయత్నం  2009 లో  ‘విప్లవోద్యమ కథ – తెలంగాణ రచయిత్రులు’ అనే  వ్యాసం  అయింది. అంతకు రెండేళ్ల ముందునుండే  (2007)  బెల్లపు అనురాధ  విప్లవోద్యమంలో ఉన్న అజ్ఞాత రచయిత్రుల కథల శోధన,  సేకరణ  ఒక ఉద్యమంగా చేస్తున్నదని నాకు అప్పటికి తెలియదు.  తెలియటానికి మరో పదమూడేళ్లు  పట్టింది.

2022 జులైలో అనుకొంటా అనురాధతో  జరిగిన  ఒక సుదీర్ఘ ఫోన్ సంభాషణ వల్ల  నాకు ఆ విషయం తెలిసింది. నా ఆసక్తిని గ్రహించి తాను అప్పటికి సేకరించినంత వరకు కథల ఫైల్స్ నాకు పంపించింది కూడా. అన్ని కథలు అలా ఒక్క చోట  చూసి ఎంత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానో చెప్పలేను. ఉత్సాహం పట్టలేక 2009 నాటి నా వ్యాసం పంపాను తనకు చూడమని. అలా అప్పటి నుండి ఇప్పుడిలా అజ్ఞాత రచయిత్రుల కథల సంపుటాలు రావటం వరకు  అనురాధతో  కలిసి ప్రయాణం చేసినట్లే ఉంది.

తెలుగులో‘నూరేళ్ళ పంట’ ‘తెలంగాణ రచయిత్రుల కథలు’   వంటి స్త్రీల కథా సంకలనాలు వచ్చినా వాటికి  స్త్రీల ఎంపిక, కథల ఎంపిక వంటి పరిమితులు ఉన్నాయి. వస్తు ప్రాతిపదిక మీద   స్త్రీవాద కథ (1993) సంకలనం వచ్చింది. 1901  నుండి  1980 మధ్యకాలపు   స్త్రీల కథలు  కె. లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో 2006 నుండి ఎనిమిది సంకలనాలుగా వచ్చాయి.  కానీ మొత్తం మీద  అవి 240ని మించవు. 1950 కి ముందే  స్త్రీలు  కథాసృజన రంగంలో ఎంత ఉత్సాహంగా, ఎంత చైతన్యంతో పని చేస్తున్నారో కొత్త తరానికి చూపించటం ఆ సంకలనాల కూర్పులోని ఉద్దేశం. ఈ వరుసలో  ఒక రాజకీయర్థిక సామాజిక  అవగాహనతో విప్లవ కార్యాచరణను ఎంచుకొని  ఆ పని క్రమంలో భాగంగా  స్త్రీలు రాసిన  లభ్య కథల సమగ్ర సంకలనాలుగా ఇవి కొత్త రికార్డును సృష్టించాయి.

వ్యక్తులుగా ఎవరు ఎన్ని కథలు రాసారన్నది చెప్పటం ఈ సంకలనాల ఉద్దేశం కాదు. సంపుటాలు వేసుకోగలిగినన్ని కథలు రాసినవాళ్ళైనా, ఒకటి రెండు కథలు రాసిన వాళ్ళయినా విప్లవ జీవితం అందరికీ సమిష్టి అనుభవం. అసలు స్త్రీలు, దళిత బహుజనులు, మతమైనారిటీలు ఎవరైతే సామాజిక సాహిత్యరంగాల చివరి అంచులకు నెట్టి వేయబడ్డారో వాళ్ళ సాహిత్య సమీకరణ విషయంలో ప్రధాన అప్రధాన, ప్రసిద్ధ అప్రసిధ్ధ  విశేషాలతో రచయితలను వేరుచేయకూడదు.ఒక చిన్న రచన చేసి ఆగిపోయిన వాళ్ళైనా చేర్చుకొదగినవాళ్లే. అందువల్ల  ఆయా సామాజిక వర్గాల భిన్నఅనుభవాలకు  అభివ్యక్తీ కరణలకు వున్న చారిత్రక ప్రాధాన్యతను  అర్ధం చేసుకొనటానికి,  ద్వారాలు తెరిచి ఉంచి నట్లవుతుంది. ఆ అవగాహన నుండే  ఒక పేజీలో వచ్చిన అనుభవ కథనాన్ని కూడా గౌరవం తో ఈ సంపుటాలలో చేర్చటం చూస్తాం.  విప్లవోద్యమ చరిత్రలో క్రమాన్ని తెలుసుకొనటానికి వీలుగా ప్రధాన కథా అంశాన్ని బట్టి  వివిధ శీర్షికల కింద కథలను వర్గీకరించటం జరిగింది.  అనేకులు వ్రాసిన రచనల కూర్పును సాధారణంగా సంకలనం అనాలి. కానీ  ఒకే వ్యక్తి రాసిన అనేక రచనల కూర్పును సంపుటి అన్నట్లుగా విరసం వీటిని కూడా సంపుటులు  అని పేర్కొన్నది.  కథలు రాసింది అనేకులు అయినా అందరిదీ ఒకే రకమైన జీవితం, దృక్పథం, ఆచరణ  కనుక ఆ భిన్నత్వంలోని ఏకతను బట్టి అలా సంపుటి అననటం సముచితం అనుకోని ఉంటారేమో!? మూడవ సంపుటిని పరిచయం చెయ్యటం ఈ వ్యాసం ఉద్దేశం.

వియ్యుక్క 3 వ సంపుటంలో  కథలు 44. పుటలు 564.   నిర్బంధం – ధిక్కారం, సల్వా’జులుం’, అమరత్వగానం, ధిక్కారమైన దుఃఖం  అనే నాలుగు ఉపశీర్షికల కింద ఈ కథలు కూర్చబడ్డాయి. విప్లవోద్యమ కథాసమయం అనే శీర్షిక తో బి. అనురాధ రాసిన సంపాదకీయం మూడు సంపుటాలకు సాధారణమే. కథల సేకరణ ఒక ఎత్తయితే భిన్నభిన్నమైన కలం పేర్లతో వచ్చిన కథలలో కథల అసలు  కర్తలను గ్రహించటం, ఏ పేరును ప్రమాణంగా స్వీకరించటమో నిర్ధారించటం మరొక ఎత్తు. దానికి సంబంధించిన  సంపాదకుల అనుభవం, అవలంబించిన పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక్కొక్క గడ్డిపరకను ఏరుకొచ్చి నివాసయోగ్యమైన గూడు అల్లుకొనే  పిట్ఠల పద్ధతి పరిశోధనకు ఎంత అనుకూలమైనదో, అవసరమైనదో అనురాధ పనిక్రమం సూచిస్తుంది. విప్లవోద్యమ సాహిత్య చరిత్ర రచనలను, ఇప్పటికే ప్రచురించబడిన అజ్ఞాత రచయిత్రుల కథల సంకలనాలు, వేరువేరు వ్యక్తుల రచనలలో వచ్చిన ప్రస్తావనలు, అమరుల సంస్మరణ రచనలు, ఇలా ఎన్ని ఆకారాలనుండో సేకరించిన సమాచారాన్ని సమన్వయం చేసుకొంటూ ఏ రచయిత్రి రచనలు యేవో నిర్ధారించిన  విధం అంతా ఒక శాస్త్రీయమైన పరిశోధనగా సాగింది. 

ఈ కథలకు వస్తువైన జీవితం, సందర్భాలు,  శకలాలు భిన్నమైనవి కావచ్చు. వాటిలోని సూక్ష్మ భేదాలను బట్టి భిన్న శీర్షికల కింద అవి వర్గీకరించబడి ఉండవచ్చు.   కానీ  సాధారణ ప్రజల అసాధారణ ధిక్కారం ఈ అన్ని కథలకు అంతఃసూత్రం. ధిక్కారం ఎవరి మీద? వేటి మీద? ఇళ్లల్లో బాధాకరమైన రీతి రివాజుల మీద, స్థానిక పెత్తందారుల మీద, ఆదివాసీ గూడాలకు సరకుల  అమ్మకాలకు వచ్చి ఆడవాళ్లను లైంగికంగా దోచుకొనే షావుకార్ల మీద, ఖనిజాల తవ్వకానికి, భారీ ప్రాజెక్టులకు  అనుమతులు ఇచ్చే ప్రభుత్వ విధానాల మీద, వాటి అమలులో భాగంగా  బహుళ జాతి కంపెనీల పక్షాన తమను అడవి నుండి పరాయీకరించటానికి దిగిన ప్రభుత్వ పోలీసు సైనిక వర్గాల మీద ధిక్కారం. మొత్తంగా పీడన మీద, అణచివేత మీద ధిక్కారం. ధిక్కారమే పోరాటం. ధిక్కారం నుండే పోరాటం. పోరాటాలు పదునెక్కే కొద్దీ కొత్త రూపాలలో భిన్న రూపాలలో మరింత పెరిగే   అణచివేత, నిర్బంధం. అణిచే కొద్దీ  బంతి ఎక్కువ శక్తితో పైకి లేచినట్లు అణచివేతలను , నిర్బంధాలను అధిగమిస్తూ ధిక్కారం మరింత శక్తిమంతంగా  కొండలను ఆవరించి లోయలలో ప్రతిధ్వనిస్తుంటుంది.  ధిక్కారం- అణచివేత, నిర్బంధం- ధిక్కారం ఈ క్రమం కొనసాగుతున్న చరిత్ర. దానిని ప్రతిఫలించిన కథలు ఇవి.   

ధిక్కారం సందర్భాలను బట్టి అనేక రూపాలు తీసుకొంటుంది.   దాని సారం క్రియాశీల సౌందర్యం.ఆ క్రమంలో  ప్రాణాలు కోల్పోవటానికైనా వెనుదీయని సంసిద్ధత, మృత్యువుతో క్రీడలు, దానిని అంటిపెట్టుకొన్న దుఃఖోద్వేగాలు అన్నీ వ్యక్తిగత స్థాయిని దాటి అత్యుత్తమ అవ్యాజ విశ్వ ప్రేమగా పరివర్తన చెంది వినూత్నంగా ఆవిష్కరించబడటం ఈ కథలలోని  ప్రత్యేకత.

1

ఈ సంపుటిలో నిర్బంధం – ధిక్కారం అనే శీర్షిక కింద ఉన్న కథలు 7. ‘తుపాకులు గుంజుకోండ్రి బిడ్డా’ కథలో రెండు ధిక్కారాలు ఉన్నాయి. ఒకటి విప్లవోద్యమ విస్తరణను అరికట్టాలని రాజ్యం చేసే పోలీసు దాడుల పట్ల ధిక్కారం ఆ పోలీసు స్టేషన్ల మీదనే దాడి చేసి ఉద్యమానికి అవసరమైన ఆయుధాలను సేకరించటంగా వ్యక్తమైంది.రెండవది ఆ ఘటన చూడటానికి వచ్చిన -వూళ్ళో పోలీసుల అరాచకానికి బిడ్డ బతుకు బలైన-  ఒక తల్లి   దళ చర్యకు మద్దతు ప్రకటించటం, పోలీసుల మీద తన కసిని తీర్చుకొనటం ఇన్నాళ్లు మోసిన దుఃఖాన్ని ధిక్కారంగా ప్రకటించటమే.

కర్తవ్యం సంక్లిష్టమైన కథ.  ఆదివాసీ గ్రామప్రజలు విప్లవ పార్టీ ప్రభావంలోకి వెళ్లి  స్థానిక  పెత్తందారు దోపిడీ పీడనలపై ధిక్కారం ప్రకటిస్తే అతను విప్లవ ప్రజా సంఘాలను అణచివేయటానికి కాషాయ రాజకీయాలను ఊళ్లోకి తెచ్చిఅటు మతాన్ని ఇటు సంఘాన్ని వదలమని ఒత్తిడి పెడుతూ  క్రైస్తవ ఆదివాసీల మీద దాడులు, అణచివేత, హింస అమలు చేసాడు.  దీనివెనుక ప్రజలు చేసుకొంటున్న భూములను ఆక్రమించి రాజకీయ ఆధిపత్యం పొందాలన్న పటేల్ ఉద్దేశాన్ని గ్రహించిన  చైతన్యశీల ఆదివాసీ  మహిళ ధిక్కారమే ఆయుధంగా ముందుకు సాగటం ఈ కథలో చూస్తాం.మణిపూర్ ఆందోళనలు, దాడులు ఈ కథ చదివాకా మరింతబాగా అర్ధం చేసుకోవచ్చు.

అమ్మాయికి ఇష్టం లేకపోయినా, బలవంతంగా ఎత్తుకు పోయి అయినా పెళ్లిచేసుకొనే అవకాశాన్ని మగవాడికి ఇచ్చిన రివాజు పై ధిక్కారంగా పార్టీని ఆశ్రయించిన ఆదివాసీ యువతి జనతన సర్కార్  మహిళా సంఘం పనులలో భాగస్వామి కావటం,  అందువల్ల అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొంటూ కూడా  ధిక్కారం జీవితంగా జీవించటాన్ని సాటి మహిళలలోకి ప్రసరింపచేయటం  నిరీమీల కథలో చూస్తాం. జీవితం ఒక ఆశయం కోసం అయినప్పుడు,ధిక్కారం జీవిత తాత్వికత అయినప్పుడు ప్రమాదకర సరిహద్దులలో సంచరిస్తున్నప్పుడు  కూడా  మరణాన్ని సైతం  ధిక్కరించి మునుముందుకు సాగగలిగిన  నైతిక ధృతి  ఎలా వికసిస్తుందో చూపిన మృత్యుకుహరంలోంచి కథ మరొక వైపునుండి ఆమెను  శత్రువు కంటపడకుండా జాగ్రత్తలు పడుతూ, స్థలాలు మారుస్తూ కడుపులో పెట్టుకొని కాపాడగలిగిన సాధారణ ప్రజలలోని అసాధారణ ధిక్కార తత్వాన్ని కూడా ఎత్తిపట్టి చూపుతుంది.

     2

 చత్తిస్ ఘడ్ లో తమ కార్యకలాపాలకు, ప్రయోజనాలకు  అవరోధంగా ఆదివాసీల పై ఉన్న మావోయిస్టు ప్రభావాన్ని నీరుకార్చటానికి స్థానిక ఆదివాసీ పెత్తందార్లు, వ్యాపారవర్గాలు 1990-91 లో జనజాగరణ అభియాన్ ను ప్రారంభిస్తే  2005 నాటికి  గనుల తవ్వకాలకు టాటా, ఎస్సార్, జిందాల్ మొదలైన కంపెనీలతో చేసుకొన్న ఒప్పందాలను సజావుగా అమలు చేయటానికి,  అవరోధంగా ఉన్న ఆదివాసీ మావోయిస్టు విప్లవకారుల సంబం ధాలను తెగగొట్టటానికి ప్రభుత్వమే సల్వాజుడుం అనే సైనిక పథకం రూపొందించింది.  సల్వాజుడుం అనే  ఈ గోండు భాషా పదానికి శాంతి యాత్ర అని అర్ధం. ఆదివాసీలనుండే కొందరిని వేరుచేసి సైనిక శిక్షణ ఇచ్చి వాళ్ళ మీదికే దాడులకు పంపి ఇళ్లు  వాకిళ్లు ధ్వసం చేసి అత్యాచారాలు, హత్యలు చేయించి  భీతావహులను చేయటం, గూడాలు  వదిలేట్లు చేయటం, మరొక వైపు నిర్వాసితులకు ఆశ్రయమిచ్చే శిబిరాలు నిర్వహించటం ఇదంతా పాలకవర్గాల శాంతి కోసం జరిగిన ఒక వికృత క్రీడ. ఈ నేపథ్యంలో వచ్చిన కథలు సల్వా’జులుం’ కథలు. ఇవి ఆరు ఉన్నాయి ఈ సంపుటిలో.

 కొత్తపాలకొండ కథ సల్వాజుడుం సాగించిన హింసాకాండను, పార్టీ నాయకత్వంలో దానిని ధిక్కరించి నిలవ గలిగిన ప్రజల చేవను  గ్రామ మిలీషియా బాధ్యుడుగా ఎదిగిన ఆదివాసీ యువకుడు బుద్రాం  జ్ఞాపకాలుగా ప్రస్తావించింది. 2009 నాటికి మావోయిస్టు ప్రాబల్యం గల ప్రాంతాలను అధీనం చేసుకొనటానికి భారత ప్రభుత్వం పారామిలటరీ బలగాలను మోహరించి పని చెయ్యటాన్ని ఆపరేషన్ గ్రీన్ హంట్ గా ప్రస్తావిస్తారు. ఈ సైనిక దాడులను ధిక్కరిస్తూ పార్టీ, ఆదివాసీ జనం తమ కార్యక్రమాలతో పురోగమిస్తున్న తీరును  లక్ష్మణ రేఖ కథ  చిత్రించింది.  దాడులు జరుగుతాయి, ఊళ్ళు వదిలి కాంపులకు చేరుకొని ప్రాణాలు కాపాడుకొనమని హెచ్చరికలు వస్తున్న తరుణంలో కార్పెట్ సెక్యూరిటీ  మధ్య అడవి అంతా రాజ్యం నిఘాలో ఉన్నప్పుడు  వందేళ్ల అంతర్జాతీయ మహిళా దినం వేడుకలు జరుపుకొనటానికి దండకారణ్య మహిళా సబ్ కమిటీ పిలుపు ఇయ్యటమే ఒక ధిక్కారం. వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా కంపెనీలు వచ్చి చేసిన రక్షణ ఏర్పాట్ల మధ్య వేల  సంఖ్యలో  ఆ సభ కోసం   వంటపాత్రల, తిండి గింజల మూటలను నెత్తికెత్తుకొని డప్పులు , డోళ్లు తీసుకొని బిడ్డలను చంకనేసుకొని పగలూ రాత్రీ నడుస్తూ సభాస్థలానికి చేరు కొన్న  మహిళలు, పురుషులు కలిసి  రెండురోజుల సభను విజయవంతంగా జరుపు కొనటం ధిక్కారం యొక్క ఆచరణ ముఖం. ఇవన్నీ  సల్వాజుడుం ఫాసిస్టు దాడులను  పరిహసించి నిలిచేవే. ఈ సభల కోసం వచ్చిన  గెరిల్లా కంపెనీలో  60 మంది ఫార్మేషన్ లో ఒకరివెనుక వస్తున్న తీరును కదులుతున్న 60 పెట్టెల రైలుబండి అన్న ఉపమానంతో సూచించటం చూస్తాం. రైలు బండి ఒక్కటే .. గమనం గమ్యం ఒకటే. కానీ ఈ రైలు పెట్టెలు ఇనుము, చెక్క తో చేసిన పెట్టెలు కాదుకదా! సజీవమైన చైతన్యవంతమైన మనుషులు. కనుక అరవై అనుభవాలు, జ్ఞాపకాలు కల మనుషులు. కనుకనే  మధ్య మధ్య మజిలీలతో పదిహేను ఇరవై గంటలు నడుస్తూ చేసిన ప్రయాణంలో దారిపొడుగునా తగిలే ఊళ్ళు వాళ్ళ జ్ఞాప కాలను తట్టి లేపుతాయి.జోగన్న జ్ఞాపకాలుగా పార్టీ నుండి ఆదివాసీలను వేరుచేయటానికి మహేంద్రకర్మ చేసిన ప్రయత్నాలు, మావోయిస్టులకు ఆహరం నీళ్లు సమకూరుస్తున్నారని సైన్యం ఆదివాసీ స్త్రీలను హింసించి చంపిన ఘటనలు, సల్వాజుడుం దాడుల సమయం లో ఆదివాసీలు  గూడాలు వదిలి అడవి లోతట్టు ప్రాంతాలకు తప్పించుకుపోయిన సంద ర్భాలు, అలా వెళ్లలేని స్త్రీల మీద జరిగిన అత్యాచారాలు, తాము మరణిస్తూ స్త్రీలు అనాథ లవుతున్న తమ  పిల్లలను పోరాడి చావాలన్న సందేశంతో దళాలకు అప్పగిస్తున్న దృశ్యాలు చూపిస్తుంది ఈ కథ. సల్వాజుడుం జులుం కేంద్రమైన ఈ కథలో ఆ దౌర్జన్యాన్ని ధిక్కరిస్తూ  జీవితాన్ని గెలుచుకొనటానికి సర్వశక్తులు కూడదీసుకొంటున్న జనం చేసే పోరా టమే కీలకం.  బహుళజాతి కంపెనీలు, వాళ్ళ వైపు ఉన్న పోలీసులు , కోర్టులు, సైన్యం కలిసి శాంతివేట మాకు ఇష్టం , హరిత వేట మేం  గెలుస్తాం అని విర్రవీగుతున్న అన్యాయ పక్షం  , ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం పట్ల  విశ్వాసంతో  పురోగమిస్తున్న పీడిత బాధిత  ప్రజా సమూహల  న్యాయపక్షం యుద్ధానికి మోహరించి ఉన్న ఒక సంఘర్షణాత్మక సందర్భాన్ని  న్యాయం అన్యాయ పక్షాల మధ్య సంవాదంగా భూంకాల్ స్కూల్ పిల్లలు  ఆడిన  ఒక ఆట ద్వారా సూచించటం ఈ కథకు కొసమెరుపు. 

తొలి సంజె కథ సల్వాజుడుం దాడులకు పీడనకు, హింసకు భయపడి రాహత్ శిబి రాలకు వెళ్లిన జన జీవితం స్వతంత్రత  నుండి  స్వచ్ఛంద నిర్బంధానికి, పరాధీనతకు,  పచ్చని ప్రకృతి నుండి ఇరుకు మురికి వాడలకు ఎలా పతనం అవుతుందో చూపింది. బానిసత్వం తప్ప భవిష్యత్తే లేదన్న నిరాశ నిస్పృహలు గడ్డకట్టిన ఆ దశలో కూడా జనాన్ని అంటిపెట్టుకొని నివురు ఊది ధిక్కారాగ్నిని ప్రజ్వలింప చేసేపనిలో పార్టీ ఎంత శ్రద్ద పెట్టిందో ఈ కథ ముగింపు సూచిస్తుంది.

 సల్వాజుడుం ఆదివాసీలమధ్య ఒక విభజనరేఖ. సల్వాజుడుం నిర్మాణ నిర్వహ ణలో భాగమై స్వజాతి హననంలో పాల్గొంటున్న ఆదివాసీ వ్యక్తులతో, పెత్తందారులతో  చైతన్యవంతమైన ఆదివాసీ సమాజానికి వుండే  ఘర్షణ కూడా స్త్రీల కథకు వస్తువు అయింది. ఆదివాసీ పురుషులు భయం వల్లనో, భ్రమలవల్లనో, ప్రలోభాలవల్లనో  జుడుంలో చేరిపోతుంటే సాధారణంగా ఆదివాసీ స్త్రీలందరూ జుడుం వ్యవస్థకే వ్యతిరేకులుగా ఉంటారు. లైంగిక అత్యాచారాల మొదలు, ఆ వేటలో పిల్లలను భర్త మొదలైన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ అందుకు కారణం కావచ్చు. జుడుం హింసకు గురైన వారికి జుడుంలో పనిచేస్తున్నవాళ్ళ పట్ల కోపం, కసి సహజం. అయితే  తప్పు తెలుసుకొని జుడుం నుంచి తిరిగివచ్చే వాళ్ళ పట్ల వాళ్ళ చర్యల స్థాయిని బట్టి చిన్నవో పెద్దవో శిక్షలు వేసి జనజీవితంలో భాగం కావటానికి అవకాశం ఇస్తుంది జనతన సర్కార్.  అలా గ్రామానికి తిరిగి వచ్చినవ్యక్తుల పట్ల జుడుం బాధితులు, వాళ్ళ పక్షాన ఆలోచించేవాళ్ళు,  ఇరుగూ పొరుగు అప్రకటిత బహిష్కరణను అమలు చెయ్యటం శిక్ష కథలో చూస్తాం.   అది భరించటం కష్టం అయి  వాళ్ళ విశ్వాసాన్ని పొందటానికి, తాము జుడుం పక్షాన లేమని నిరూపించుకొనటానికి పడిన ఆరాటం, చేసిన ప్రయత్నం అందులోని మంచి చెడ్డల చర్చ ఈ కథలో ఉన్నాయి.  

 జుడుం ఆదివాసీల మధ్యనే కాదు, కుటుంబంలోని మనుషులమధ్య కూడా విభజన రేఖే అవుతుంటుంది.మూసుకున్న హృదయం కథలో  జాతి జనులకు వ్యతిరేకంగా భర్త జుడుంలో పనిచేయటం, రాహత్ శిబిరాలలో వచ్చి ఉండటానికి ఇష్టపడని ఆదివాసీ గూడా ల జనంపై దాడులకు, అత్యాచారాలకు, హత్యలకు నాయకత్వం వహిస్తుండటం నచ్చని ఒక ఆదివాసీ ఇల్లాలు మల్లే కోణంలో నడిచింది. మూడు దృశ్యాలుగా ఈ కథలో ఆమె ఆంతర్యం అంతఃసంఘర్షణ  ఆవిష్కరించబడతాయి. మొదటి దృశ్యం ఆమె జుడుంతో సంబంధాలు ఒదులుకోమని భర్తకు నచ్చచెప్పటానికి ప్రయత్నించటం. పొలాలు, వ్యవసాయానికి అంది వచ్చిన కొడుకు, చదువుకొంటున్న పిల్లలు ఉన్న ఆమె కోరుకొనేది ఇతరులకు హానికరం కాని ప్రశాంత జీవితం. జుడుం కు జనానికి, జనం పక్షాన వున్న విప్లవపార్టీకి జుడుం కు మధ్య ఉన్న శత్రువైరుధ్యం ఆమెకు అర్ధం అవుతూనే వుంది. అది భర్తకు ప్రాణహాని కారకమని తెలుస్తూనే ఉంది. అందుకనే అతనిని ఆ హింసాజీవనం నుండి బయటపడెయ్యాలని అంతగా ఆరాటపడింది.

రెండవ దృశ్యం  కొడుకులు ఇద్దరినీ స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా జుడుంలో చేర్చటా నికి సిద్ధపడిన భర్తను అభ్యంతర పెట్టటం.  హింస బ్రతుకుతెరువు కాకూడదనుకొనే  చిన్న కొడుకు తండ్రి బలవంతం, బెదిరింపుల కారణంగా అందుకు అంగీకరిస్తే  తుపాకులు పట్టు కొని మోటారుసైకిళ్ల మీద తిరగటం హీరోయిజం అని,  నక్సలైట్లు పెరిగిపోకుండా చూడటమే యువకుల కర్తవ్యం అని జరుగుతున్న ప్రచార ప్రభావంతో పెద్ద కొడుకు ఇష్టంగా సిద్ధ పడ్డాడు. కన్న తల్లిగా వాళ్లకు ఏది మంచి జీవితాన్ని ఇస్తుందో  చెప్పే అవకాశం లేదని , తండ్రే పిల్లల జీవిత నిర్ణేత అని అర్ధమైన ఆ సందర్భంలో గాయపడ్డ హృదయంతో ఆమె కనబడుతుంది. ఇష్టంలేకుండా ఒప్పుకొంటున్న చిన్న కొడుకు, ఇష్టంతో ఒప్పుకొన్న పెద్దకొడుకు ఒకే  అన్యాయంలో భాగం కాబోతుంటే వాళ్ళను రక్షించుకొనటం యెట్లా అని ఆరాట పడింది. మిగిలిన పిల్లలు రేపు పెరిగి పెద్దయి ఈ బాటనే పట్టె ప్రమాదాన్ని వూహించగలిగింది.

మూడవ దృశ్యం ఆమె తెరిచిన తలుపుల ఇంటి గుమ్మలో నిలబడి  ఎవరో ఒక యువ కుడు తుపాకీతో వెంట తరుముతుండగా  ప్రాణ భయంతో పరిగెత్తి వస్తున్న భర్తను చూడ టం. గడపలో అడుగుపెట్టగానే ఆమె తలుపులు మూసేస్తే తాను బతికినట్లే అని భర్త  ఆశ పడుతుండగా అదే జరిగితే అవకాశం తప్పిపోయినట్లే అని  యువకుడు నిరాశ పడు తుంటే ఆమె చేసినపని భర్త లోపలికి వచ్చే అవకాశం  ఇయ్యకుండా ఇంటి తలుపులు మూసె య్యటం.  తనపిల్లలను, తన జాతిని  సల్వాజుడుం నుండి రక్షించుకొనటానికి ఆమె ఎంచు కొన్న మార్గం అది. అంత కఠినమైన నిర్ణయానికి రావటం వెనుక ఆమె పడిన ఘర్షణ ఎంతో..! ఆ ఘర్షణ నుండే ధిక్కారం తలుపులు మూయటంగా వ్యక్తమైంది. ఆలోపల ఎప్పుడో  భర్తకు  హృదయం మూసెయ్యటం జరిగిపోతే తప్ప సాధ్యంకాని భౌతికచర్య అది. విప్లవపార్టీతో గానీ, భావజాలంతో గానీ ఏమాత్రం సంబంధంలో లేని, జరుగుబాటుకు ఏ మాత్రం లోటు లేని  సాధారణ ఆదివాసీ మహిళ సల్వాజుడుం పట్ల ధిక్కారాన్నిఇలా  అత్యంత తీవ్ర స్థాయిలో ప్రకటించ గలగటం చుట్టూ ఆవరించి ఉన్న విప్లవోద్యమ విద్యుత్ శక్తి  ప్రభావ ఫలితమే అనుకోవాలి.

విప్లవోద్యమాన్ని అణచి వెయ్యాలని, సల్వాజుడుం జులుమే   దళాలలోకి ఆదివాసీ యువకుల చేరికను అనివార్యం చేస్తున్నదని   తల్లిప్రేమ కథ చదివితే తెలుస్తుంది.

  3

 స్మృతి సాహిత్యం తెలుగులో విస్తృతంగానే ఉంది. మరణించిన భార్యనో, పిల్లలనో తలచుకొంటూ విశ్వనాథసత్యనారాయణ,నాయని సుబ్బారావు వంటివాళ్ళు రాసిన వరలక్ష్మీ త్రిశతి , వేదనా వాసుదేవం వంటి కావ్యాలు  ఉన్నాయి. వ్యక్తిగత సంబంధాలు, సంవేదనలు వాటి పరిమితి. సంస్కరణ  జాతీయ అభ్యుదయ ఉద్యమాలలో పనిచేసి మరణించిన  నాయకులకు , కార్యకర్తలకు నివాళులు అర్పిస్తూ రాసిన కవిత్వం కూడా స్మృతి కవిత్వమే. దాని పరిధి సామాజికం. సమాన భావజాల క్రియాశీల సంబంధం.  విప్లవోద్యమ సాహిత్యంలో స్మృతి కవిత్వం మరీ ఎక్కువ. అది వర్గబంధం. ఎన్ కౌంటర్ల పేరిట 1970 లనుండి  ఎడతెగకుండా సంభవిస్తున్న అసహజ మరణాలకు బాధపడుతూ  సహచరులు, స్నేహితులు వాళ్ళను గుర్తుచేసుకొంటూ రాసిన కవిత్వం ఎంతో ఉంది.స్మృతిగీతం(1990)  జీవితమేయుద్ధమైనప్పుడు(1994) వంటివి కేవలం స్మృతి కవిత్వ సంకలనాలే. ఇక  మొత్తంగా విప్లవ కవిత్వంలో స్మృతి కవితలు ఇంకెన్ని ఉన్నాయో…!? తెలుగు సాహిత్యంలో స్మృతి కవిత్వం ఉన్నట్లుగా కథ ఉన్న జాడలు పెద్దగా కనబడవు. దుఃఖోద్వేగాల తక్షణ వ్యక్తీకరణకు కవిత్వం సాధనమైనట్లు కథ కాలేదు. దుఃఖపు పొంగు తగ్గి అది ఒక అనుభవంగా మథనానికి గురై స్మృతిగా మారి ఒక జీవిత తాత్విక అవగాహనగా కుదురుకొనే క్రమంలో వచ్చినవి విప్లవసాహిత్యం లో స్మృతి కథలు. వియ్యుక్క మూడవ సంపుటిలో అమరత్వగానం శీర్షిక కింద అలాంటి కథలు 12 ఉన్నాయి.

విప్లవోద్యమ బాధ్యతలలో ఉంటూ అమరులైన పద్మ, ప్రణీత( ఎల్లంకి అరుణ ) అరుణ(సుగుణ), రాధక్క, సాగర్,కిష్టయ్య,శ్యామల, ఫూల్ సింహ్, రమేష్, ఫాల్గుణ  మొదలైన వాళ్ళతో తమ స్నేహాన్ని, జ్ఞాపకాలను,వాళ్ళ నిబద్ధతను తలచుకొంటూ అజ్ఞాత  రచయి త్రులు  రాసిన కథలు ఇవి.  ఎల్లంకి అరుణ రాసిన కథలు రెండు.ఒకటి  ఆమె అడుగుల సవ్వడి 2002 జులై 2 న సంకెనబోరు గుట్టల వద్ద జరిగిన ఎదురు కాల్పులలో మరణించిన నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పద్మ స్మృతిలో రాసినది. తక్షణమే రాసింది కాదు. దాదాపు ఏడాది తరువాత రాసింది. ఈ కథ 2003 జులై లో అచ్చయితే  రెండు నెలల ముందే ఈ కథా రచయిత్రి  ఎల్లంకి  అరుణ మరణించటం విషాదం. రెండవ కథ సారన్న.  ఒక గెరిల్లా కాంప్ లో అయిదు రోజుల క్రితం పని మీద వెళ్లిన సారన్న టీమ్ కోసం ఎదురు చూపుల   ప్రస్తావనతో కథ మొదలు అవుతుంది.అది మార్చ్ 2 వతేదీ అని చెప్పబడింది  ఆరోజే  25 న పోలీసులులతో ఎన్ కౌంటర్ జరిగి సారన్న మరణించిన వార్త వస్తుంది. ఆ దుఃఖం సంస్మరణ సభ  కథా విషయం.  సారన్న మరణించింది  ఫిబ్రవరి 25 కావాలి. సంవత్సరం ఏదో సూచన లేదు. ఏమైనా ఈ కథ రాసిన అరుణ 2003 మే14 న అగరుగూడ ఎన్ కౌంటర్ లో మరణించింది కనుక  సారన్న అమరత్వం అంతకు ముందుదే.

గజ్జెల సరోజ రాసిన త్యాగాల గుర్తుల్లో   ప్రధానంగా ప్రణీత స్మృతి కథ. ప్రణీత అంటే ఎల్లంకి అరుణ. ఆమె అమరత్వం 2003 మే కనుక కథ ఆ తరువాత కాలపు రచన.   పీపుల్స్ వార్ గెరిల్లా బృందంలో ఒకరైన హేమ జ్ఞాపకం అరుణ. హేమ అంటే గజ్జెల సరోజే.  పార్టీ నిర్మాణంలో అరుణ  చురుకైన భాగ స్వామ్యం,   పని తీరులోని నైపుణ్యం,నాయకత్వ లక్షణం,స్నేహ శీలత, ఇతరులకు నేర్పిస్తూ నేర్చుకొంటూ ఉండే తత్వం భిన్న సందర్భాల నుండి హేమ జ్ఞాపకాల రూపంలో ఆవిష్కరించబడ్డాయి. అరుణ జ్ఞాపకాలతో కలగలసి  హేమ  ఉద్యమనుభవాల జ్ఞాపకాలు కూడా ఇతివృత్తంలో భాగం అయ్యాయి. ప్రస్తావనా వశంగా హేమ సహచరుడు  రాఘవులు అమరత్వం,( రాఘవులు అంటే నల్ల ఆదిరెడ్డి)  ఆర్కే, కమల,సరళ,కొండన్న,సరిత,సుదర్శన్,రవీందర్ మొదలైన అమరత్వం కూడా పేర్కొన బడ్డాయి. స్మృతి అంటే త్యాగాల గుర్తు. ఆ త్యాగాల గుర్తుల స్పూర్తితో ముందుకు సాగటం.

మైనా రాసిన అరుణ కథలో  అరుణ అసలు పేరు సుగుణ. పాలమూరు జిల్లా నుండి విప్లవోద్యమ నిర్మాణంలోకి వచ్చింది. 2003 లో తన సహచరుడు కౌముది తో సహా విశాఖలో పోలీసులకు పట్టుబడి చిత్రహింసలకు గురై చంపబడింది.  చదువు కథ రాధక్క స్మృతిలో రాయబడింది. ‘త్యాగాల  గుర్తుల్లో’ కథలో ప్రస్తావించబడిన కొండయ్య అమరత్వం తాయమ్మ కరుణ రాసిన ‘మీ చరిత్రను జెబుతాం’ కథకు వస్తువు.   అజ్ఞాత విప్లవోద్యమంలో ఉన్న సహచరుడి నుండి సుమకు వచ్చిన ఉత్తరం సాగర్ ఎన్ కౌంటర్ వార్తను చెప్తే ఆ ఉత్తరం తెచ్చిన శరత్ వివరాలు చెప్పాడు. సాగర్ అసలు పేరు కొండయ్య. అతను అతనితో పాటు ఎన్ కౌంటర్ అయిన కృష్ణ ఇద్దరూ పదహారు, పదిహేడేళ్ల పిల్లలు.  వాళ్ళ అంత్యక్రియలు ప్రజలు ఎంత దుఃఖంతో ఎంత ప్రేమతో జరిపించారో  శరత్ కథనం చెప్తుంది. ఆ సమయంలో సాగర్ తల్లి కొడుకు గురించి మాట్లాడిన మాటలు పిల్లలు విప్లవోద్యమంలోకి వెళ్ళటానికి వాళ్ళ దుర్భర జీవన పరిస్థితులే కారణమని సూచిస్తాయి. ఆరేడేళ్ళకే తండ్రి మరణించి, ఇద్దరు తమ్ముళ్లను తనను సాకటం తల్లికి కష్టంగా ఉంది కనుక జీతానికి ఉండటం అనివార్యమైన స్థితిలో వాడు చేయవలసి వచ్చిన చాకిరీ, హింస, కోల్పోయిన బాల్యం, చదువుకొనటానికి మూసుకుపోయిన అవకాశాలు కోటయ్యను అన్నల మార్గం ఎంచుకొనేట్లు చేసిందన్నది స్పష్టం. దళ జీవితంలో అతనిని దగ్గరగా చూసిన అనుభవాలు, చేసిన సంభాషణల  జ్ఞాపకాలు సుమకు ఆ వయసుకు అతను గ్రామాలలో భూస్వాములను, పెత్తందార్లను ధిక్కరించగల ధైర్యాన్ని ఇచ్చిన దళాల కార్యాచరణ ప్రభావం నుండి గెరిల్లా సైన్య  విస్తరణకు తాను సైతం దోహదపడాలన్నఅవగాహనను అభివృద్ధి చేసుకొనటాన్ని సూచిస్తాయి. 

ఆదివాసీ ప్రజలు స్వేచ్ఛగా , స్వతత్రంగా బతకటానికి సంఘం బలంగా ఉండటానికి మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకొనే క్రమంలో ఆదివాసీ మహిళ విప్లవోద్యమ నిర్మాణంలో భాగం కావటం ఎంత సహజంగా జరిగిపోతుందో శ్యామల కథ సూచిస్తుంది. విప్లవోద్యమం ఎన్ కౌంటర్లను ఎదుర్కొనటం, కొందరిని కోల్పోవటం అదే సమయంలో కొత్తవాళ్లు పార్టీ నిర్మాణం లో భర్తీ అవుతుండటం తెగింపు, వారసులు, ఉండవలసిన తీరు వంటి కథలలో సాధారణ అంశం. తెగింపు కథలో భర్త పోలీసు తూటాలకు బలైతే భార్య అతని మార్గంలో విప్లవోద్యమంలోకి వెళ్తుంది. వారసులు కథలో విప్లవోద్యమం నుండి మధు వంటి వ్యక్తులు  జారిపోతుండగా, ఉమ ఎన్ కౌంటర్ లో మరణించగా ఆమె తమ్ముడు విప్లవోద్యమం లోకి వస్తాడు. ఉండవలసిన తీరు కథలో ధనలక్ష్మి ఏ అన్న గారి  భావాలతో,  ఆదర్శాలతో, ఆచరణతో ప్రేరణ పొందుతూ  విప్లవోద్యమ నిర్మాణంలో భాగం కావటానికి వెళ్లిందో అక్కడ  యెన్ కౌంటర్లో గాయపడి మృత్యుముఖంలో వున్న అతనిని చూడవలసి రావటం పెద్ద విషాదం. మార్మిక వాతావరణంలో నడిచిన చైతు కథ సారం కూడా విప్లవోద్యమంలో అమరత్వం పునర్నవమై జీవించటమే. ఈ కథలో  విప్లవోద్యమం స్త్రీగా, తల్లిగా సంభావించ బడింది. చైతే  అత్యాచారానికి, హత్యకు గురై అర్ధనగ్న దేహంగా విసిరివేయబడటం ఆ తల్లికి దుఃఖ కారణం. తనను సజీవంగా ఉంచటానికి వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారని ఆమె అంటుంది.  ఆమె చేతిలోకి తీసుకొంటే ఆ మృత కళేబరం నవజాత శిశువై ఆమె గుండెలను కరుచుకొన్నది అన్న మాట  విప్లవ వీరులు ఒకరు మరణిస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి  వేలకొలదిగా  ప్రభవిస్తారన్నవిశ్వాస ప్రకటనే. విప్లవం అజేయం అన్నది నిర్ధారణ. 

ఫాల్గుణ కథలో కూడా కొంత మార్మికత ఉంది. నిర్బంధం, నిఘా విప్లవోద్యమంలో పని చేసే సంసిద్దతను సందిగ్ధంలో పడేస్తుంటే మనుషులు పడే సంఘర్షణ, కుటుంబ ఒత్తిడులు, కూడదీసుకొనటానికి పడే యాతన మొదలైన వాటితో పాటు విప్లవోద్యమ కార్యకలాపాలలో ఉన్నవాళ్ళను ఇళ్ల నుండి తీసుకువెళ్లి ఎక్కడో చంపి పారేసి, శవాలను కూడా  దక్కనీయని ప్రభుత్వ అణచివేత వ్యూహం వల్ల ఆ వ్యక్తులు మరణించినట్లా, జీవించి నట్లా తెలియని ఒక సందిగ్ధతలో కుటుంబం పడే వేదనను చిత్రించిన కథ ఇది. ఫాల్గుణ భార్య మణి  భర్త శవాన్ని చూడలేదు కనుక అతని మరణాన్ని నమ్మలేకపోయింది. జీవించే ఉన్నాడను కొనటంలో ఊరట ఉంది.  ఆశ ఉంది. అయితే అదేసమయంలో  తాను,  బిడ్డ భర్త సంబంధంలో బతకాలంటే అతని మరణాన్ని ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితిలో పడింది. అప్పుడే  ఆమె హక్కుగా పరిహారంగా వచ్చే ఉద్యోగం పొందగలుగుతుంది. మానసికంగా ఆమెకు అతను సజీవుడు. భౌతికంగా మృతుడు. ఆ మానసిక భౌతిక వాస్తవాల మధ్య సంఘర్షణలో నలిగిడి పడుతూనే  ఇరవై ఇరవై అయిదు సంవత్సరాలు కాలం గడిచింది.  చనిపోయిన ఫాల్గుణ అన్న కొడుకు మీదికి వచ్చి భార్య మణిని సంబోధించి మాట్లాడటం వల్ల ఆమె  అల్లాంటి భ్రమ నుండి విముక్తం అయినట్లుగా కథ ముగింపుకు వస్తుంది.

 అది హేతువిరుద్ధం కదా! విప్లవ కథ ఇలా ఉండకూడదు కదా అన్న ఆలోచన సహజంగానే వస్తుంది. అందువల్లనే కథకురాలు ఇది హేతువిరుద్ధమైనదే అన్న సూచన స్పష్టంగానే ఇచ్చింది. హేతువిరుద్ధమైనది అని తెలిసి కూడా రచయిత్రి ఆ పరిష్కారాన్ని ఎందుకు ఎంచుకొన్నట్లు? ఆదర్శం వేరు. వాస్తవం వేరు. విప్లవ మార్గంలో ఉన్నవాళ్లకు అదిహేతు విరుద్ధమైనది. కానీ సమాజం అంతా ఆ స్థాయి చైతన్యం వ్యాపించలేదు. ఫాల్గుణ పార్టీ కోసం పనిచేస్తున్నాడే కానీ పార్టీ నిర్మాణంలోకి పూర్తిగా పోలేదు. ఆ స్థితిలో అతను కుటుంబ కుల మర్యాదల చట్రంలోనే బతికాడు. అందువల్లనే పదిహేనేళ్ల మేనపిల్ల మణి తో తల్లిదండ్రులు కుదిర్చి చేసిన పెళ్లి చేసుకొన్నాడు. బిడ్డ తండ్రి అయ్యాడు. ఆ బిడ్డ నెలల పిల్లగా ఉన్నప్పుడే పోలీసులు ఇంటి నుండి తీసుకువెళ్లి చంపేశారు. అతని మీద మమతతో రెండవ పెళ్లి కులం రీత్యా ఆమోదయోగ్యమైనదే అయినా ఆమె చేసుకొనటానికి ఇష్టపడలేదు.ఉద్యోగం చేసుకొంటూ బిడ్డను పెంచుకొంటూ ప్రతియేడు ఫాల్గుణ సమాధి దగ్గర అత్తింటివారు జరిపే ఆరాధనకు బిడ్డతో వెళ్లి వచ్చే మణి చైతన్య స్థాయి కానీ, ఆ కుటుంబపు చైతన్య స్థాయి కానీ సాధారణమైనవే కానీ మార్క్సిస్టు దృక్పథంతో వికసించిన చైతన్యం కాదు అన్న విషయం పాఠకులు గుర్తించాలి. ఫాల్గుణ అన్న కొడుకు అనిల్ ఒంటి మీదికి రావటం ఆ కుటుంబంలో అందరికీ ఆమోదయోగ్యమైన వాస్తవమే.

అయితే దానిని కథగా మలచడంలో పద్మకుమారి విప్లవ చైతన్యాన్ని గానీ, మొత్తంగా పార్టీ పనితీరును గానీ శంకించవలసిన అవసరం లేదు. విశ్వాసాలను విప్లవీకరించే పని ఆమె చేసింది.  బావ కొడుకు అనిల్ అలా  ప్రవర్తించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని అనిల్ ఫాల్గుణ ఆచరణలో ఉన్నవాడు అని చెప్పిన మాటలను బట్టి అలా అనుకోవచ్చు. అనిల్ ఒంటి మీదికి ఫాల్గుణ రావటం కుటుంబమంతటికి ఒక ఓదార్పు ను ఇచ్చే నమ్మకం.   ఫాల్గుణ ఆచరణలో ఉన్న అనిల్ పినతండ్రి  మరణానికి సంబంధించిన వాస్తవికతలోకి పినతల్లి మణిని మేల్కొల్పటానికి దానినొక వైద్య విధానంగా స్వీకరించాడా? అంటే అవుననే అనుకోవాలి.

   4

విప్లవోద్యమంలో పూర్తికాలం పనిచేయటానికి వెళ్ళటం వాళ్ళ నిబద్ధతకు సంబంధించిన విషయం. వాళ్ళలా వెళ్ళిపోవటం వలన వాళ్ళతో రక్త రాగ సంబంధంలో ఉన్నవాళ్లకు మిగిలేది వియోగ దుఃఖం. ఎడబాటు దుఃఖం ఒకరకం. ఎప్పుడైనా వాళ్ళను కలుస్తామన్న ఆశ అందులో ఉంటుంది. వెళ్లిన వాళ్ళు అమరులు  అయినప్పుడు ఆశలన్నీ కూలిపోయిన అంతులేని దుఃఖమే మిగిలేది.ఆ దుఃఖంనుండే ధిక్కారం  జీవిత తాత్వికతగా మరింత పదునెక్కుతుంది.అది వ్యక్తం అయ్యే తీర్లు భిన్నభిన్నంగా ఉండవచ్చు. అలాంటి  కథలు ఈ సంపుటిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అవి 19.

వాటిలో కూడా విప్లవోద్యమంలోకి వెళ్లిన బిడ్డల గురించిన తల్లుల ఎదురుచూపులు, ఎడబాటు దుఃఖాలు, ఆ దుఃఖాల తీవ్రత,  పరిణామాలు వస్తువుగా వచ్చిన కథలు అధికం. ఇద్దరు తల్లులు (1998) కథ లో తల్లి అడివమ్మది  విప్లవోద్యమంలోకి వెళ్లిన కొడుకు క్షేమంగా వున్నాడా ? ఏ ఎన్ కౌంటర్ లోనైనా మరణించాడా అన్ననిత్య  సందిగ్ధాల మధ్య అంతులేని ఆరాటం. నక్సలైట్ల మీద పోలీసు కాల్పుల వార్త చెవినబడిందంటే వాళ్ళల్లో తన కొడుకు లేడుగదా అన్న భయసందేహాలమధ్య నలిగే జీవితం. ఆ భయ సందేహాల మధ్య ఆమెకు ఆసరా అయింది ఆ ఊరి బడి పంతులమ్మ రమ. నిజానికి  ఈ కథ అంతా రమ కోణం నుండే  చెప్పబడింది. రమ  తాను ప్రేమించిన వేణు విప్లవోద్యమ నిర్మాణంలో భాగమై పనిచేయటానికి పోతుంటే తల్లిదండ్రుల పట్ల తనకున్న బాధ్యత కారణంగా అతనితో వెళ్ళటానికి సిద్ధపడలేక, అలాగని అతనిని ప్రేమించకుండా వుండలేక లోలోపల బాధపడుతూ, అతని స్మృతులలో జీవిస్తుండటం ఈ కథలో ఒక పార్శ్వం. వేణు తనను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడని కూడా ఆమెకు తెలుసు. వేణు వియోగం గురించి ఎవరితో ఏమీ చెప్పుకోలేని ఒంటరి వేదనలో   వున్న రమకు అతని లాగే విప్లవోద్యమంలోకి వెళ్లిన  కొడుకు గురించిన వేదన ఎవరితోనూ పంచుకోలేని స్థితిలో ఉన్న అడివమ్మతో సంభాషణ స్నేహం సహజంగా కుదిరిపోయాయి.  నిజంగానే ఆమె కొడుకు  మరణించేసరికి ఆ వార్త ఆమెకు ఎలా చెప్పాలో తెలియక ఆందోళన పడిన రమ ఒంటరి అయిన ఆ తల్లి పోషణ భారం తాను స్వీకరించటానికి నిర్ణయించుకొనటం కథకు ముగింపు. వేణుతో ఎడబాటు  దుఃఖం రమది.  ఆ ఎడబాటు దుఃఖానికి ఆమె ఎన్నుకొన్న ఒక నివారణ అతనికి ఇష్టమైన పని, ఆతని ఆశయాలకు ఆచరణకు అనుకూలమైన పని చేపట్టటం. అందుకే కొడుకును పోగొట్టుకొన్న ఆ తల్లికి తాను బిడ్డ కావాలనుకొన్నది.    

 ప్రత్యక్ష విప్లవ కార్యాచరణలో ఉండటం అత్యంత ఉన్నతమైనదే అయినా మను షుల  ప్రత్యేక తత్వాలు, మనస్తత్వాలు, పరిస్థితులు, సంసిద్ధత లోని స్థాయీ భేదాలు ఇలాంటివి ఎన్నో అందుకు అవరోధం అవుతుంటాయి. అయితే ఆ పరిమితులలో కూడా వాళ్ళు ఏ విలువలతో జీవిస్తున్నారన్నది ముఖ్యం. రమ అడివమ్మ పోషణ భాధ్యత స్వచ్ఛందంగా స్వీకరించటం విప్లవ రాజకీయ విలువలతో జీవించటానికి చేసిన ప్రయత్నమే. ఆ రకంగా పోరాటాన్ని అంతిమ విజయం పర్యంతం నడపగలిగిన ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఆశావహంగా అభివృద్ధి చేయగల ఉన్నత మానవీయ సంస్పందన – ఈ కథలో పెనవేసుకొని దీనిని సత్యశివసుందరాత్మకం చేశాయి.

అమ్మ అందరికీ అమ్మ కథ(2001) లో విప్లవోద్యమంలో కొడుకును  కోల్పోయిన తల్లి  విప్లవోద్యమం లో భాగమైన వాళ్ళందరిని  తనబిడ్డలుగా ప్రేమించగల, ఆప్యాయతను పంచ గల తల్లి కావటం లో దుఃఖం నుండి విముక్తం కావటం చూస్తాం.నా బుధూది… చాలా గొప్పచావే(2006)  కథలో విప్లవ పార్టీలో చేరి పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కొడుకు జనజాగరణలో  తిరిగి గుండా అయితే ఇంత పేరు వచ్చేది కాదని అతని ఆచరణ పట్ల సంతృప్తిని ప్రకటిస్తుంది  ఒక ఆదివాసీ తల్లి. అమ్మ (2015) కథలో కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి మనసు సంక్రాంతి పండగకు వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు చివరి మాట దగ్గరే స్థిరపడి జీవితకాలపు ఎదురుచూపుల యాతనగా సాగటం చూస్తాం.

ఈ శోకం ఎందరిది ( 2003) కథకు  కొడుకు ఎన్ కౌంటరయినాడు అని   తెలిసి శవాన్ని గుర్తుపట్టి తెచ్చుకొనటానికి ఆసుపత్రికి వెళ్లిన ఒక తల్లి దుఃఖం వస్తువు.  మృతదేహం  కొడుకుది  కాదని తెలిసినా ఆ తల్లికి దుఃఖం తీరక పోగా,ఎన్ కౌంటరయిన ఆ మరొక వ్యక్తి తల్లికి ఈ మరణం సంగతే తెలియకపోవటం గురించి న ఆలోచనతో ఆమె దుఃఖం హద్దులు లేనిది అవుతుంది. తన కొడుకు ఎక్కడో బతికే ఉన్నా డు  అని సంతోషపడవలసిన సమయంలో అప్పుడక్కడ మృత దేహమై పడి ఉన్న ఆ   వ్యక్తి తల్లి గర్భశోకపు  బరువును  తానై  మోసే ఒక విప్లవమాత, విశ్వ మాత సాక్షా త్కారం ఈ కథ. నాబిడ్డనే(2010)  కథలో ఎన్ కౌంటర్ మృతులలో తన బిడ్డ లేకపోయినా మరొక పిల్ల ను తన పిల్ల అని చెప్పి ఏడ్చి గోల చేసి తెచ్చుకొన్న ఆదివాసీ స్త్రీని  చూస్తాం.  జుడుంలో కలిసి కాంప్ లో ఉంటున్న  ఆ పిల్ల తల్లిదండ్రులు శవాన్ని తీసుకొనిపోతే అంత్యక్రియలు గౌరవకరంగా జరగవు అన్న బాధతో ఆమె  చేసిన పని అది. తనది కాని గర్భశోకాన్ని మోయటానికి సిద్ధపడిన తల్లి ఆమె.  ముగ్గురుతల్లులు ( 2019) కథలోనూ కడుపున మోసి కనకపోయినా  అమరులపట్ల స్త్రీలం దరూ అమ్మలై అక్కున  చేర్చుకొనటమే కనిపిస్తుంది. సామాన్య మాతృత్వం అసామాన్య విప్లవ మాతృత్వంగా ఆకాశమే హద్దుగా వ్యాపించటం ఈ కథలలో ప్రత్యేకత.

స్పందన కథలో బిడ్డ పోలీసుల కాల్పులలో మరణించిందని తెలిసిన  తల్లి దండ్రుల దుఃఖం పార్టీలోకి వచ్చే సంసిద్ధతగా వ్యక్తం కావటం అలాంటిదే.ఆ రాజకీయాలు నాగ్గావాలె (2005-2006) కథ కూడా ఆ కోవలోదే. ఒక సాధారణ గ్రామీణ మహిళ  విప్లవోద్య మంలో అమరుడైన కొడుకు జ్ఞాపకంగా జరిగే స్థూప నిర్మాణంలో భాగమై అందుకు అడుగడుగునా అడ్డు తగిలిన పోలీసులతో ఘర్షణ పడుతూ, ధిక్కరిస్తూ  కొడుకును తలచు కొనటానికి ధైర్యం ఇచ్చే విప్లవ రాజకీయాలు తనకు గూడా కావలసినవే అని అమరుల బంధుమిత్రుల కమిటీలో చేరిన అసాధారణ ఘటన ఈ  కథలో చిత్రితమైంది.

కడుపుకోత కథలో  ఎదురు కాల్పులలో చనిపోయిన  కొడుకు మరణానికి దుఃఖించే తల్లిదండ్రులు అమరుల బంధుమిత్రుల సమావేశానికి వచ్చాక తనలాంటి అనేకమంది తల్లులను చూస్తూ వింటూ దుఃఖం తన ఒక్కదానిదే కాదని తెలుసు కొనటం, సమాన అనుభవం కల సమూహాల సాన్నిహిత్యం లో ఊరట పొందటం చూస్తాం. వేగుచుక్క(2023)  కథలో ఎదురు కాల్పుల పేరిట చిత్రహింసలకు గురై చనిపోయిన కొడుకును తలచుకొంటూ దుఃఖోద్వేగాలకు లోనయ్యే తల్లిదండ్రులు దుఃఖ విముక్తి మార్గం  అమరుల బంధుమిత్రుల అవసరాల కోసం నిలబడటమే అనుకొనటం గమనించవచ్చు. విప్లవోద్యమంలోకి వెళ్లి ఎదురు కాల్పుల లో కొడుకులను కోల్పోయిన తల్లుల జీవితంలోని వెలితి ఎలా పూడు తుంది? వెలితిని పూడ్చుకొనటానికి ఫోటోలు చూసుకొంటూ  జ్ఞాపకాలు తలపోసుకొంటూ ఆచరణను అర్ధం చేసుకొంటూ మరింత ప్రేమించటం, నలుగురితో కూర్చుని పంచు కొనటం, సంస్మరణ సభలను జరుపుకొనటం అన్నీ మార్గాలే. కానీ అవే సరిపోవు. అక్కడ ఆగిపోక అందరి మంచిని కోరి పోరాటం లోకి వెళ్లినవాళ్లను వెంటాడి వేటాడి ప్రాణం తీసే  శత్రువులను తెలుసుకొని నిలదీయటానికి సమూహంగా చెయ్యవలసిన పనులకు సంసిద్ధం అయ్యే క్రమంలోనేఆ వెలితి పూరించబడుతుంది అని సూచిస్తుంది వెలితి(2019)  కథ.  విప్లవోద్యమంలో మరణించిన బిడ్డల గురించిన దుఃఖాన్నే కాదు, వాళ్లు ప్రేమించిన ఉద్యమం పట్ల ప్రేమను, వాళ్ళ స్ఫూర్తిని నిశ్శబ్దంగా మోసే తల్లులు ఎందరో.. కొడుకులు వదిలిన యెర్ర జండాలు వాళ్లు పదిల పరచుకొన్న కలలు. తమ బతుకులు వాటి నీడనే వెళ్లిపోవాలన్న నిబద్ధత వాళ్లలో ఎంత గాఢంగా ఉంటుందో చూపిన కథ తల్లికోరిక (2018).  

ధిక్కారమైన దుఃఖం విభాగంలో వాళ్ళు, నిరీక్షణ అనే రెండు కథలు ఒకే ఘటన చుట్టూ అల్లుకొన్నవి. అది  2016 అక్టోబర్ 24 నుండి నాలుగు రోజుల పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మల్కనగిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో బలిమెల రిజర్వాయర్ సమీపంలో రామ్ గూడా కు దగ్గర మావోయిస్టుల మీద పోలీసులు జరిపిన దాడి. ఆ దాడిలో మరణించిన 21 మంది మావోయిస్టులలో మున్నాఒకడు. అతనిపేరు పృథ్వి. శిరీష ఆర్కే ల కొడుకు. కొడుకు పట్ల ఆ తల్లి ఆంతర్యంలోని ప్రేమ,  మనసుని దహించే మరణ  దుఃఖం, కొడుకు అలవాట్ల ఆలోచనల తలపోత అన్నీ కలగలసిన ఉద్విగ్న అనుభవం కథా విషయం. రెండు కథలలోనూ అందుకు ప్రత్యక్ష సాక్షులు దగ్గరి స్నేహితురాళ్లే. పృథ్వి బాల్యం, పృథ్వి నవయవ్వనం, అతని అలవాట్లు,అభిరుచులు, తల్లి పట్ల ప్రేమ, తండ్రి విప్లవాచరణ పట్ల గౌరవం, తల్లి అభ్యంతరాలను సున్నితంగా తోసి పుచ్ఛి తాను ఆ మార్గంలో సాగిపోవటం, శకలాలు శకలాలుగా ఈ కథలలో భాగమై పృథ్వి జీవితాన్ని చెబుతాయి. అదేసమయంలో మరణించిన పిల్లలు జీవించినకాలంలో మరొక ప్రపంచం కోసం కన్నకలలు నిజమయ్యే రోజుల గురించి ఆశలు పెంచుకొంటూ జీవించటానికి సంసిద్ధమవుతున్న తల్లుల తండ్రుల ఆరాటం ఎడమెదడులను ఏక కాలంలో కదిలిస్తాయి. ఆ ఎదురు కాల్పులలో మరణించిన ప్రభాకర్ తల్లి హృదయాన్ని ఆవిష్కరించే పయనించిన పాట   కథ కూడా ఈ సంపుటిలో ఉంది.

 అమరుల బంధుమిత్రుల సంఘం విప్లవోద్యమంలో పని చేస్తూ అమరులైన వారి శవాలను కుటుంబ సభ్యులకు చేర్చేక్రమంలో అవసరమైన సహాయం చేయటం  వారి  బాధను పంచుకొని ఓదార్పునియ్యటం , అండగా నిలబడి వారితో స్నేహ సంబంధాలు కొనసాగించటం,అమరుల సంస్మరణ సభలు నిర్వహించటం మొదలైన లక్ష్యాలతో 2002 లో ఏర్పడింది.ఆ పని క్రమం కూడా  విప్లవోద్యమ కథా వస్తువైంది.  పద్మకుమారి వ్రాసిన  ‘ప్రయాణం’(2013) కథకు తెలంగాణలోని బెల్లంపల్లి నుండి చత్తిస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లావరకు – ఎన్ కౌంటర్లో మరణించిన విప్లకారుడి శవాన్ని తెచ్చుకొనటానికి అతని రక్త బంధువులతో కలిసి అమరుల బంధుమిత్రుల కమిటీ చేసిన సుదీర్ఘ ప్రయాణం వస్తువైంది. అమరుడి తోటి ఉన్న అనుబంధాల జ్ఞాపకాలు, కనీస మానవధర్మాన్ని రాజ్యాంగ పద్ధతిని పాటించని పోలీసు వ్యవస్థ గురించిన ఆలోచనలు, ఆందోళనలు, దుఃఖం , తెగువ అన్నీ కలిసిన ఉద్విగ్నత ఈ కథను కరుణ రసాత్మకం చేశాయి.

ఈ కథలలో దుఃఖం కృంగదీసి నిష్క్రియాత్మకతలోకి నెట్టేసేది కాదు. ధిక్కార చరిత్ర కొనసాగింపుకు కొత్త లిపి అవుతుంది.

   5 

ఈ కథలలో విప్లవోద్యమ చరిత్రఘటనలు, విప్లవోద్యమ ప్రతిఘటనకు గురైన ప్రభుత్వ ఆర్ధిక విధానాలు, ఆచరణలు అనేకం వున్నాయి. ఆయా కథలు సరిగా అర్ధం చేసుకొనటానికి కథలలో ప్రస్తావించబడిన ఆయా ఘటనలు, విధానాల వివరణ అవసరం అవుతుంది. ఉదాహరణకు

తుపాకులు గుంజుకోండ్రి బిడ్డ కథకు ప్రేరణ ఇచ్చిన కోరాపుట్  దాడి

కర్తవ్యం కథలో రావు ఘాట్ గనులు,చాద్గార్  గనులు, బోధుఘాట్ ప్రాజెక్ట్  బీజేపీ కాషాయీకరణ రాజకీయాలు, నిరీ మిలా కథలో గ్రీన్ హంట్ అభియాన్ సీతాబాయి గెలుపు కథలో రావ్ ఘాట్ గనులు, గనుల తవ్వకానికి అక్కడ దొరికే ఇనుపఖనిజం వివరాలు, తవ్వకాలకు చొరబడుతున్న నెకో వంటి కంపెనీలు,  నాశనమయ్యే అడవి, కలుషితం అయ్యే నీరు, పాడయ్యే పంటపొలాలు,  ప్రమాదంలో ఆదివాసీ గ్రామాల ప్రజల అస్తిత్వం.

తొలి సంజె కథలో బస్తర్ వికాస్ విధానం,  బోద్ ఘాట్ లో వంద వూర్లను ముంచి డాం కట్టటం

కోవర్ట్ హత్యలు, రామ్ గూడా వంటి ఎన్నో ఎదురు కాల్పుల ఘటనలు  మొదలైనవి వాళ్ళ నిరసనలతో  ధిక్కారాల పోరాటాల కొనసాగింపు చరిత్రతో సహా ప్రస్తావనకు వచ్చాయి. 

అలాగే సుఖదేవ్, కిషోర్ మొదలైన వాస్తవ వ్యక్తులు,మరెన్నో వాస్తవ ఘటనలు, భౌగో ళిక ప్రాంతాలు  ఈ కథలలో  ప్రస్తావించబడుతూ  వాళ్ళ చరిత్రను తెలుసుకో మంటాయి .

వీటన్నిటికీ ప్రాచీన తెలుగు సాహిత్యంలో వ్యక్తులు,వాళ్లకు సంబంధించిన కథలకు పూర్వ గాథాలహరి అనే పేరుతో వివరణాత్మక నిఘంటువు ఒకటి ఉంది. ఆ పద్ధతిలో ఈ కథలలో ప్రస్తావించబడిన ఘటనలకు,వ్యక్తులకు ఒక వివరణాత్మక నిఘంటువు తయారు చేయటం ప్రయోజనాత్మకంగా ఉంటుంది/

 ఈ కథలు ఒక మేరకు మనకు తెలియని జీవిత సంవేదనలను, విప్లవోద్యమ గతిక్రమ రేఖా చిత్రాన్ని చూపిస్తూనే మనం తెలుసుకోవలసిన జనజీవిత చరిత్ర ఎంతో ఉందని తెలియచేస్తాయి.

నందినీ సుందర్ రాసిన The burning forest Indias war in busthar ( రగులుతున్న బస్తర్ తెలుగు అనువాదం రివేరా  , పాణి రాసిన జనతన సర్కార్ వంటి క్షేత్రస్థాయి పరిశోధనలు, విశ్లేషణ సంబంధంలో ఈ కథలను చదువుకొనటం అవసరం. 

మావోయిస్టుల కార్యకలాపాల గురించి, దళ  జీవితం గురించి,  గిరిజనులకు వాళ్లకు మధ్య సంబంధాల గురించి  పత్రికలలో వచ్చే పాక్షిక కథనాలు,  వక్రీకరణలు, ప్రధాన స్రవంతి సమాజంలో వున్న దురభిప్రాయాలు దాటి ఇతిహాసపు చీకటి కోణం అడుగున పడి కనిపించని వాస్తవాల వైపు మన చూపు తిప్పే ఈ కథలు తప్పక చదవ వలసినవి.

Leave a Reply