నా చిట్టి చేతుల్తో
అనేకసార్లు నా మొఖాన్ని తడుముకున్నాను

నా చిట్టి చేతుల్తో
అనేకసార్లు నా కన్నీళ్లను తుడుచుకున్నాను

నా చిట్టి చేతుల్తో
అనేకసార్లు ఆకలంటూ నా పొట్టను పట్టుకున్నాను 

బాంబుల శబ్దానికి ఉలిక్కిపడి
నా తల్లిని కౌగిలించుకునేవాడిని
నా తల్లి పొట్టమీద ఒక చేయి వేసి
హాయిగా నిదురపోయేవాడిని

నీళ్ళల్లో పడ్డ చందమామను
నా అరచేతులతో తీసి కాపాడేవాడిని
బాంబులతో నా తల్లిరొమ్మును పేల్చినట్టు 
చందమామనూ బాంబులతో నీళ్లలో పడవేసి ఉంటారో కాబోలు 

ఉదయాన్నే నా అరచేతుల మీద
సూర్యకాంతి పడుతుంటే ఎంత్అందంగా ఉండేవో
చేతులను చూసి మురిసిపోయేవాడిని
నా మురిపాన్ని చూసి
చేతులు కూడా సన్నగా నవ్వుకునేవి 
•

ఇప్పుడు
జోడీ తెగిపోయింది
ఇరు కన్నులలో ఒక కంటికి చూపు తెగినట్టు!
కళ్ళద్దాలకు ఒకవైపు అద్దం పగిలినట్టు!

ఆకలితో పాల కోసం
నా తల్లిరొమ్మును చేతుల్తో అందుకోవాలని చూసినట్టు
తెగిపడ్డ నా చేతిని
దుఃఖపు చూపుల్తో.. నా ఒంటరి చేతితో
ఇంకొక ఒంటరి చేతిని దగ్గరికి తీసుకోవాలని
తెగిన చేతిని ముద్దాడాలని
నాదొక చివరి కోరిక.
•••

పేలిన నా తల్లి స్తనాల ఆనవాలు దొరకలేదు
ఊడిన నా ఒంటరి చేయి దొరకలేదు
ఆకలి తీరలేదు. ఆఖరి కోరిక తీరలేదు.
పదేపదే కమ్ముకుంటున్నది
బాంబుల పొగ! దుఃఖపు సెగ!

One thought on “నాదొక చివరి కోరిక

Leave a Reply