మీకో నాలుగు ప్రశ్నలను… నాలుగు జవాబులను పరిచయం చేస్తాను. నాతో రండి… ఇంతకీ నేనెవరనుకుంటున్నారు? నేనో అండాన్ని అవును అనాదిగా స్త్రీ దేహంలో తయారవుతున్న అండాన్ని. ఆడగానో, మగగానో ఎవరిగానో పుట్టే తీరతాను లేదా పుట్టాక ఆడో మొగో కూడా తేల్చుకుంటాను. కానీ నిరంతరం ఒక భయంతో… ఆందోళనతోనే ప్రతీ నెల కోట్లాది మంది స్త్రీ దేహాల్లో తయారవుతూ… ఉంటాను… సందేహంగా రాలిపోతూ ఉంటాను కూడా ఆ స్త్రీలు పెళ్ళి చేసుకుంటే ఇక నేను ఆడపిల్లగా పుట్టేస్తానేమో అని వణికిపోతుంటాను. ఆ స్త్రీ భర్త వీర్యకణాల్లోని వై క్రోమోజోముతో అండాన్నై నాలోపని ఎక్స్‌ క్రోమోజోమ్‌ కన్నీరు కారుస్తూ భయపడ్తు బతిమిలాడుతూనే ఉంటుంది. తనతో కలిసి మగవాడిగా ఉట్టామని… కానీ మా చేతుల్లో ఏమీ లేదుగా… కానీ మా లోపలి రెండు ఎక్స్‌ క్రోమోజోములు కల్సిపోయి ఆడపిల్లగా పుట్టే అవకాశాలున్నాయి. అలా పుట్టాక ముందే ఆడపిల్లగా పుట్టాక అన్ని దశల్లో ఆడపిల్లలు ఈ భూమ్మీద ఎంత నరకయాతన పడతారో కళ్ళారా చూస్తుంటాను. అలా యుగాలుగా చూసీ చూసీ… దుఃఖిస్తూ… తిరుగుతూ స్త్రీల దేహాల్లో అండమై పుడుతూ పుస్తకాల్లో ప్రశ్నల్లో జవాబులు వెతుకుతూ వెతుకుతూ… ఉండే నాకు ఎందుకో ఈ పుస్తకంలో నాలుగో ప్రశ్న బ్రహ్మండంగా నచ్చేసింది. అండాన్ని కదా మరీ? రండి.. మీరూ ఈ ప్రశ్న జవాబులు చదవండి… ప్రశ్నలో నుండి ` జవాబుల్లోకి నడవండి.

1. మేడమ్‌! ఈ సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి. మా అమ్మాయి వయస్సు 26 సంవత్సరాలు పెళ్ళి ఒద్దు అంటుంది. కారణం ఎంతకీ చెప్పదు. కానీ, మొన్న మేమే నిర్ణయం తీసికొని ‘పెళ్ళి చేస్తాం’ అంటే అసలు విషయం చెప్పింది. అది విని మేం తీవ్రమైన షాకికి గురయ్యాం. ‘అమ్మాయికి పదేళ్ళ వయస్సున్నప్పుడు తన స్వంత బాబాయి అంటే నా తమ్ముడు తనతో వికృతమైన చేష్టలకు పాల్పడ్డాడని, దాంతో మగవాడన్నా, పెళ్ళి, సెక్స్‌ అన్నా తనకు అసహ్యమని’ చెప్పింది. నా తమ్ముడు క్యాన్సర్తో చనిపోయాడు. భగవంతుడు వాడు చేసిన పాపానికి ఈ శిక్ష విధించాడని భావిస్తున్నాం. ఇప్పుడు మా అమ్మాయి మనసు మారేదెలా? మా తర్వాత మా అమ్మాయిని చూసుకునే వైవాహిక తోడు లేక తను ఒంటరిగా మిగిలి పోవాలా? పరిష్కారం చెప్పండి. మీ పరిష్కారం మీదే మా అమ్మాయి జీవితం ఆధారపడి ఉంది.

నిజంగానే మీ అమ్మాయి జీవితంలో చాలా ఘోరం జరిగింది. పిల్లలపైన లైంగిక అత్యాచారాలు తెల్సిన వాళ్ళే ఎక్కువగా చేస్తుంటారు. రక్త సంబంధాల్లో లైంగిక సంబంధాలను ‘ఇన్సెస్ట్‌’ అంటారు. తల్లి దండ్రులు ఉద్యోగాల్లో బిజీగా ఉండటం, పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం, నిరంతరం కలహించుకునే దంపతులకు పుట్టిన పిల్లలు ప్రేమకోసం ప్రమాదకరమైన మనుషుల్ని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలై పోవడం జరుగుతుంది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి తల్లిదండ్రులకు దగ్గర ఉండే పిల్లలు కూడా ఈ తరహా లైంగిక అత్యాచారాలకు బలవుతుంటారు. తల్లిదండ్రులకు చెబితే వారిని చంపేస్తామని బెదిరిస్తుంటారు. భయంతో పిల్లలు ఈ విషయాలు పెద్దవాళ్ళను చెప్పరు ఎందుకంటే, అమ్మా న్నానలను చంపుతారేమోనని. కాబట్టి, పిల్లలకు తల్లిదండ్రులు తమ దగ్గర అన్నింటినీ నిర్భయంగా పంచుకునే స్వేచ్ఛనీ, స్నేహాన్ని ఇవ్వాలి. మంచీ, చెడూ, ప్రమాదం, ఆనందం, దుఃఖం, అయోమయం, వేధించే సందేహాలు, భయాలు, ప్రశ్నలూ అన్నింటినీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నిర్భయంగా పంచుకోగలగాలి.

తమ దగ్గర తమ పిల్లలకు ప్రేమ, భద్రత దొరకనివ్వని తల్లిదండ్రుల పిల్లలు ఈ విధమైన ప్రమాదానికి లోనవుతుంటారు. ఇతరులకు ప్రేమ కోసం, గుర్తింపు కోసం ఆశ్రయించే పరిస్థితి పిల్లలకు కలగనివ్వద్దు. పిల్లలు ఇటువంటి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తే వారిని నిందిచకుండా సహనంతో వినాలి. పిల్లల్ని నమ్మాలి. బాల్యంలోనే కామంతో, కోరికతో ఉండే స్పర్శకీ, ఆత్మీయత, ప్రేమతో ఉండే స్పర్శకీ తేడా ఏంటో పిల్లలకు చెప్పాలి. ఎంత రక్త సంబధీకులైనా ఆడపిల్లలున్నప్పుడు దూరాలు, జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఈ విషయాన్ని చెప్పినప్పుడు వెంటనే నేరస్థుడ్ని చట్టపరంగా శిక్షించడానికి వెనకాడకూడదు. పరువు పోతుందేమోనని, పెద్దయ్యాక పిల్లకుగానీ పిల్లాడికి గానీ పెళ్ళి కాదేమోనని చాలా మంది ఈ విషయాన్ని దాచి పెట్టడం వల్ల నేరస్థులు తప్పించుకుని ఈ నీచమైన పనిని ఇంకా ఎక్కువ చేస్తూ అమాయకమైన బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నారు. వారికి వెంటనే చట్టపరమైన శిక్షలు పడేలా చేయాలి.

ఇక మీ అమ్మాయి ‘పోస్ట్‌ ట్రామాట్రిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’ లో ఉన్నది. భరించలేని షాకికి గురైన తర్వాత కలిగే విభ్రాంతికరమైన, తీవ్రమైన ఒత్తిడితో కూడిన మానసిక స్థితి. ముందు మీ అమ్మాయికి మనుషుల పట్ల, సమాజంలో ఉన్న మంచి, మానవీయమైన విలువలున్న పురుషుల పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాలి. లోకంలో వాళ్ళ బాబాయి లాంటి నీచులే కాకుండా మంచి పురుషులు కూడా ఉంటారని, ఆమె దేహాన్ని, జీవితాన్ని, ఆమె ఆకాంక్షలను గౌరవిస్తారన్న విశ్వాసాన్ని కలిగించాలి. ఆమెకు కౌన్సెలింగ్‌ ఇప్పించండి. సెక్స్‌, పెళ్ళి, పురుషుడి పట్ల పాజిటివ్‌ ఆలోచనలు పెంచే హ్యూమనిస్టిక్‌ సైకోథెరపీ, కౌన్సెలింగ్‌ థెరపీ ఇస్తే ఆమె తన మనసు మార్చుకొనే అవకాశం ఉంటుంది.

2. మేడమ్‌! నా వయస్సు 16 సంవత్సరాలు. మా నాన్న లారీ డ్రైవర్‌ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అక్కకి ఆరేళ్ళ క్రితం పెళ్ళయింది. ఒక అన్న ఉన్నాడు. పెళ్ళి కాలేదు. నాకు 4 సంవత్సరాల క్రితం అంటే 14 సంవత్సరాలప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉండగా చదువాపి బలవంతంగా ఒక 30 సంవత్సరాలున్న దినసరి మేస్త్రీకిచ్చి పెళ్ళి చేసారు. చాలా ఏడ్చాను వద్దని, చదువుకుంటానని నా మాట ఎవరూ వినలేదు. నా భర్త భయంకరమైన శాడిస్టు. రోజూ తాగివచ్చి తలుపు మూసి మరీ నన్ను ఘోరంగా కొట్టేవాడు. కాళ్ళతో ఛాతీమీద, కడుపులో తన్నడం, తల గోడకేసి కొట్టడం, గొంతు నులమడం లాంటి హింసను భరించలేక పుట్టింటికి పారిపోయి వస్తే బుజ్జగించి మళ్ళీ పంపేవారు. సెక్సులో క్రూరంగా హింసిచేవాడు. ఆఖరికి ఒక రోజు ఆ హింస భరించలేక పుట్టింటికి వెళితే మళ్ళీ అక్కడికే పంపుతారని రాత్రి రైల్వేస్టేషన్‌ కెళ్ళిపోయి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. నా ఒంటినిండా రక్తపు గాయాలు, పంటిగాట్లు చూసి మా అత్త చాలా ఏడ్చింది. ఇక పంచాయితీ పెట్టి ‘పిల్లని చంపేస్తాడని’ చెప్పి విడగొట్టారు. ఇప్పుడు ఆ షాక్‌ నుంచి ఇంకా నేను కోలుకోలేదు. రాత్రిళ్ళలో ఉలిక్కిపడి వణికిపోతూ లేస్తాను. ఇంత వయసొచ్చినా వాడు గుర్తొచ్చి భయంతో నిద్రలో మూత్ర విసర్జన అయిపోతుంది. డాక్టర్‌ దగ్గరికి వెళితే నిద్ర మాత్రలు ఇచ్చారు. ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతోంది. మా ఇంట్లో ఇప్పుడు నన్ను భారంగా చూస్తున్నారు. పండగలకు భర్తా, పిల్లలతో పుట్టింటికొచ్చే అక్క నన్ను ఈసండిచుకుంటున్నాది. నిద్ర మాత్రలతో మబ్బుగా ఉండే నేను ‘పనిచేయడం లేదని’ తిడ్తుంది. అన్న కూడా నన్ను చురుకుగా ఉండమని కొడతాడు. నాన్న కూడా తాగొచ్చి చావమని కొడతాడు. అమ్మ ఒక్కొసారి అక్కలాగే తిడుతుంది. అత్తింట్లో హింస కంటే పుట్టింటి హింస ఎక్కువైంది. నేనేం చెయ్యాలి మేడం? నాకు చచ్చి పోవాలని వుంది. మా పుట్టింటికి నేను భారమయ్యాను. చదువు లేదు. ఏం చెయ్యాలో చెప్పండి మేడం?

చాలా చిన్న వయస్సులో వందేళ్ళకు సరిపడా హింసను అనుభవించావు. ఆడపిల్ల పుట్టుక, పెంపకం, చదువు, పెళ్ళి వీటి చుట్టూ హిందూమతం, పితృస్వామ్యం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ అనే ఉచ్చును బిగించింది. దీనిలో పడి స్త్రీలు అనేక సామాజిక, కౌటుంబిక నేరాలకు, హింసా కుట్రలకు బలైపోతున్నారు. పుట్టుక నుంచీ ఆడపిల్ల భారమనే భావజాలం కన్న తల్లిదండ్రులను కూడా అమానవీయంగా మార్చి పడేస్తున్నది. భర్త, పెళ్ళి అనే సామాజిక లైసెన్సు ఉన్నందున ‘ఇక ఉండలేనమ్మా’ అని పుట్టింటికి పారిపోయి వచ్చే తమ ఆడపిల్లల్ని మళ్ళీ ఆ హింసా కొలనుల్లోకి తోసేస్తున్నారు. క్రూర మృగాల్లా వెంటాడి హింసించే ఆ మానవ మృగాలతోనే చావైనా, బతుకైనా అని వదిలించేసుకుంటున్నారు. భారత వైవాహిక వ్యవస్థలోని అత్యంత అమానవీయమైన కోణం ఇది. నీకు నీ తల్లిదండ్రులు చేసింది బాల్య వివాహం. ఇది చట్టరీత్యా నేరం. అదీగాక హింస భరించ లేక పారిపోయి వచ్చిన నిన్ను మళ్ళీ నరకంలోనే తోసేయడం మరొక ఘోరమైన నేరం. మీ మేనత్త సాయంతో నువ్వు ఆ దుర్మార్గపు వైవాహిక జీవన చెరను తప్పించుకున్నావు. భర్తను వదిలి పెట్టి ఇంట్లో కూర్చున్న బిడ్డ భరించ లేని భారంగా, అవమానంగా మారిపోయి నీ ఉనికినే భరించ లేక నిన్ను చావమనో, పని సరిగా చేయమనో మానసికంగా శారీరకంగా హింసించడం మరో పెద్ద నేరం. భయంకరమైన హింస నుంచి బయటపడి, మానసిక ఒత్తిడికిలోనై సైకియాట్రిస్టు పర్యవేక్షణలో మందులు వాడుతూ ఉన్న నువ్వు కోలుకొని మామూలు మనిషిగా మారడానికి నీకు పూర్తిగా సహకరించాల్సింది పోయి. నీకు ప్రేమ, అప్యాయత, అనురాగం, బాధ్యత, భద్రతా అందించాల్సింది పోయి, నీ పుట్టింటి వారు నీ కిరాతక భర్త కంటే కూడా ఘోరంగా వ్యవహరిస్తుండటం చాలా అమానవీయం. భర్త నుంచి అతని హింస భరించలేక విడి పోయిన స్త్రీకి, ఈ స్త్రీ పుట్టింటి వారికీ ఈ సమాజంలో గౌరవం, భద్రత లేదని నమ్మే మీ వాళ్ళు చేయకూడని పని. అయినా సరే, నువు ధైర్యంగా ఉండాలి. నీకు నువ్వే ఊపిరి పోస్కోవాలి.

నువు ధైర్యంగా స్థానికంగా ఉన్న మహిళా సంఘానికి, అలాగే పోలీస్‌ స్టేషన్లో కూడా అత్తింటి హింసల పైనే కాదు, పుట్టింట్లో వారి హింసల మీదా ఫిర్యాదు చేయి. పీఎస్కి వెళ్ళే ధైర్యం లేక పోతే పుట్టింటిని వదులు కోవడం ఇష్టం లేకపోతే స్త్రీల సమస్యలను పితృస్వామ్య, ఆర్థిక పునాదుల నుంచి అర్థం చేస్కొని పోరాడే ప్రగతిశీల మహిళా సంఘాలను ఆశ్రయించు. వారు నీ పుట్టింటి వారికి మానవీయ విలువలతో కూడిన కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటుగా నీకు విద్యాపరంగా, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి చెందడానికి సరైన దారులు వేస్తారు. నీలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్నీ పెంచుతారు. నీకు నీ బాల్య, యవ్వనకాల హక్కులు, ఆనందాల్ని, ప్రశాంతంగా జీవించే హక్కునీ పొందే పూర్తి అధికరం ఉంది. చావాల్సింది నువ్వు కాదు, నిన్నీ స్థితిలోకి నెట్టిన పుచ్చిపోయిన పితృస్వామ్య భావజాలం. నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఆర్థికంగా నీ కాళ్ళమీద నువు నిలబడగలిగితే ఈ ఆధిపత్య భావజాలాన్ని ఎదిరించే ఆత్మవిశ్వాసంతో పోరాడ గలిగే మానసిక స్థైర్యం మరింతగా అలపడుతుంది. ఇంటర్నెట్‌లో ప్రగతిశీల భావజాల మహిళా సంఘాల ఆడ్రసులు, పోన్‌ నెంబర్లు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు. ధైర్యంగా ఉండు. నీ అత్తింటి వారే కాదు, నీ పుట్టింటి వారూ పగవారిగా మారినప్పుడు నువ్వు మరింత పోరాట పటిమతో వ్యవహించి జీవితాన్ని గెలివాలి.

3. మేడమ్‌! నా వయస్సు 52 సంవత్సరాలు. మా వారికి 58 సంవత్సరాలు. నాకు ఐదేళ్ళ కిందట గర్భసంచి తీసేశారు. అలాగే, ఒక అండాశయం ఇన్ఫెక్షన్‌ అయిందని తీసేశారు. నాకు షుగరు, బీపీ రెండూ ఉన్నాయి. నాకు ఇప్పుడు శృంగారం పట్ల ఏ ఆసక్తి లేదు. ఎందుకంటే, కలయికలో మంట, నొప్పి ఉంటున్నాయి. ఒక్కసారి కలిస్తే పదిహేను రోజులు మంటతో బాధ పడాలి, నీళ్ళు తగిలినా భగ్గుమని మండుతుంది. మా వారికి ఇది అర్థం కాదు. ఎప్పుడూ అనంతృప్తితో చిర్రుబుర్రు లాడుతుంటారు. ఇంటి నిండా మనవలు, మనవరాళ్ళు ఉంటారు. నేనిప్పుడు ఆయనకు పనికి రాకుండా పోయానట. ‘ఇంట్లది పనికిరాదు, బయటికి పోరాదు’ అని ఈసడిస్తుంటారు. నా దాంపత్య జీవితంలో అపరేషన్‌ కంటే ముందు మా వారికీ సెక్స్‌ సమస్యలున్నా నేనేనాడూ ఆయన్ను పల్లెత్తు మాటనలేదు. కానీ, నన్ను ఆయన ఇప్పుడొక పురుగులా చూస్తున్నారు. బయటకు వెళ్ళాలని ఉన్నా ఆయనకు ఎయిడ్స్‌ భయమట. నా ముందు ఇలా వాపోతూ ఉంటారు. నేనేం చేయాలి?

ఆపరేషన్‌ కంటే ముందే ఆయనకు సెక్స్‌లో సమస్యలు ఉన్నా మీరు పల్లెత్తు మాటలు ఆనకుండా ఆయన బాధపడతారని భరిస్తూ వచ్చారు. అందులోనే మీ ఔన్నత్యం, సంస్కారం తెలుస్తున్నాయి. కానీ, స్త్రీల ఆరోగ్య, శృంగారానికి పనికిరాని వస్తువుగా చూడటం చాలా అమాననీయం, అశాస్త్రీయం, అజ్ఞానం కూడా. గర్భాశయం పిండాన్ని మోసే ఒక సంచి మాత్రమే. శృంగారంలో దానికి ఏ పాత్రా ఉండదు. కోరిక, ఇష్టాలకు ఆధారం శృంగార హార్మోను ఈస్ట్రోజన్‌. ఒకే అండాశయం ఉన్నా ఈ సెక్స్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. కాకపోతే, కొద్దిగా తక్కువ. అలాగే, బాహ్య సెక్సు అవయవాలైన యోని, యోని నాళం అత్యధిక సెక్సు నరాలుండే స్త్రీకి భావప్రాప్తిని, సెక్సులో ఆసక్తినీ కలిగించే క్లైటోరిస్‌ షాఫ్ట్‌ ఇవే సెక్సుకు పనికి వస్తాయి. కానీ గర్భాశయం కాదు. మీకు డయాబెటిస్‌, బీపీ ఉండటంతో పాటు వాటికి వాడే మందులు కూడా శృంగారంలో ఆసక్తిని తగ్గించేవే! అయినా గానీ, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శృంగారంలో ఆసక్తిని (మీకు ఇష్టం ఉంటేనే) పెంచుకోవచ్చు. ఈస్ట్రోజన్‌ మెండుగా ఉండే సోయాబీన్స్‌ ఉత్పత్తులు రోజూ తీస్కోవడం. ఈస్ట్రోజన్‌ జెలు యోనిలో రోజూ వాడటం వల్ల అక్కడ తడిగా ఉండి కలయికలో మంట పుట్టదు.

ఇక, మీ భర్త విషయానికి వస్తే మీ ముందు మీ అస్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే చెత్తమాటలు మాట్లాడ వద్దని వార్నింగ్‌ ఇవ్వండి. మిమ్మల్ని కించ పరిచినప్పుడల్లా అతని లైంగిక లోపాలను గుర్తు చేయండి. గతంలో అతను మీ ముందు లైంగికంగా వైఫల్యం చెందినప్పుడు అతనిలా మీరు ‘అతను సెక్సుకు పనికి రాని వాడు’ అని కించపరచలేదని గుర్తు చేయండి. పరాయి స్త్రీల దగ్గరికి వెళితే భయంకరమైన సుఖరోగాలు, ఎయిడ్స్‌ వచ్చి చస్తాడు. సుఖవ్యాధులు, ఎయిడ్స్‌ వచ్చిన వాళ్ళు ఒక్కసారి చచ్చిపోరు. మరణించే వరకూ చస్తూ బతుకుతారు. ఆ విషయం చెప్పండి ఆయనకు. అలాగే, భరించ లేని నొప్పితో కూడిన శృంగారాన్ని భరించాల్సిన అవసరం లేదు. మీకసలే డయాబెటిస్‌ ఉంది. నేను చెప్పిన ఈస్ట్రోజన్‌ క్రీము వాడచ్చు. మీ వారు నిరోధ్‌ వాడచ్చు. దానివల్ల మీకు రాపిడి తక్కువై నొప్పి, మంట తగ్గుతాయి. అసలు భరించలేనంత బాధ ఉంటే సెక్స్‌ అవాయిడ్‌ చేయండి. మీ వారికి ఇక 60 ఏళ్ళు వచ్చాయి, కాబట్టి జీవితంలో కావాల్సినంత దాంపత్యం అనుభవించారు. మీకు అనారోగ్యం ఉంది కాబట్టి, పదహారేళ్ళ పడుచు వాడిలా కోరికలతో సతమతమవ్వాల్సిన అవసరం లేదు. తన వృద్ధాప్య జీవితాన్ని సమాజసేవకి కేటాయించమనండి. శృంగారమే జీవితం కాదు. ప్రేమ, బాధ్యత, నీతి – విలువలతో ఉండటం శృంగారాన్ని మించిన ఆనందాన్నిస్తుందని మీ వారికి చెప్పండి.

4. మేడమ్‌! నా వయస్సు 18 సంవత్సరాలు. ఇంటర్‌ చదివి తర్వాత ఆర్థిక సమస్యల వల్ల చదువాపేసాను. నాన్న నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు చనిపోయాడు. అమ్మ ఒక హాస్పిటల్లో ఆయమ్మగా చేస్తోంది. అమ్మకు రూ॥ ఐదువేలు వస్తాయి. నేను ఒక ప్రైమరీ స్కూల్లో పిల్లలకు చదువు చెబుతూ అమ్మకు చేదోడుగా ఉన్నాను. మేడం, నేను పెద్ద మనిషి కూడా కాలేదు. ఎందుకంటే నాకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. నాకు పెళ్ళి కాదని, అయినా పిల్లలు పుట్టరని అమ్మ అంటోంది. నిజమేనా మేడం? నా జీవితం ఇంతేనా?

అమ్మా-నిజంగా నీది చాలా బాధాకర సమస్య. ఈ స్థితిని ఎమ్‌.ఆర్‌.కె.హెచ్‌. సిండ్రోమ్‌ అంటారు. (మేయర్‌ రాకిటానిస్కై కస్టర్‌ హాసర్‌, ఎంఆర్‌ హెచ్‌) ఇది పుట్టుకతో వచ్చే శారీరక లోపం. గర్భాశయం, యోని నాళం పై భాగం ఉండవు. లేదా పూర్తి స్థాయిలో వృద్ధి చెందవు. దాంతో పాటు కిడ్నీ, ఎముకల సమస్యలూ రావచ్చు. హెచ్‌ఎఎక్స్‌ వై జీన్స్‌ శరీరంలో అవయవాల వృద్ధికి కారణమై లైంగిక అంతర్గత అవయవాల నిర్మాణంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. పిండాభివృద్ధి దశల్లో లైంగికాయవాల నిర్మాణానికి ముల్లేరియన్‌ నాళాలు, హార్మోన్లు కారణం. అండవాహికలు, గర్భాశయం, సర్విక్స్‌, యోనినాళం పై భాగం ముల్లేరియన్‌ నాళాలే కారణం స్త్రీలో. ముల్లేరియన్‌ నాళాల లోపాలు – స్త్రీలలో శారీరక లోపాలకు (చిన్నవి – పెద్దవి) దారితీస్తాయి. లోపాలే కాదు, మొత్తం అవయవమే లేకుండా ఉండచ్చు కూడా. ఈ స్థితి 5,00 మంది స్త్రీలలో ఒకరికి వస్తుంది. నీకు యోని నాళం కింది భాగం వుంది. కాబట్టి, వైవాహిక జీవతానికేం సమస్య ఉండదు. నిన్ను అర్థం చేస్కొని, ప్రేమించే మనిషిని వివాహం చేసుకో. గర్భాశయం లేకపోతే జీవితమేమీ ముగిసి పోదు. అనాథలకు అమ్మ కావడం ఇంకా గొప్పదైన, ఉన్నతమైన, మానవీయమైన పని. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ఆత్మహత్య ఆలోచన మానుకో. ఒకసారి అమ్మతో వచ్చి కౌన్సిలింగ్‌కు అటెండ్‌ అవు.

చదివారుగా… ఏమంటారు? ఈ నాలుగో ప్రశ్నలో నా భయాలకు… సమస్యకు పరిష్కారం బాగుంది కదూ… ఇక పుడతాను. అండాన్ని కదా… పుట్టాలి. కానీ… గర్భసంచీ వద్దు నాకు… నాలుగో ప్రశ్న వేసిన అమ్మాయిగా పుడతాను. అప్పుడు మొదటి మూడు ప్రశ్నలూ నా జీవితంలోకి రావు గాక రావు ఏమంటారు?

One thought on “నాలుగో ప్రశ్న వేసిన అమ్మాయి!

  1. Boy or girl —why the difference -needs EDUCATION//CHANGE OUR THINKING
    GEETANJALI GARU GREAT WRITER

Leave a Reply