స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. Marriage equality case (వివాహ సమానత్వం)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కేసు సంప్రదాయ పితృస్వామిక సమాజంలో సంచలనం అనే చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ట్రాన్స్‌ జెండర్‌ సమాహాలు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో స్వలింగ వివాహాల గుర్తింపు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తాను బదిలీ చేసుకుంది. ఆ తర్వాత దీని విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వివాహ చట్టాలపై వచ్చిన మౌలిక ప్రశ్నలను పరిష్కరించడానికి రాజ్యాంగ నిర్వచనాల దగ్గరికి పోవలసివచ్చింది. అంతే కాదు ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. దీనికి అంత ప్రాధాన్యత ఉన్న మాట వాస్తవం.

ఈ కేసులో కుటుంబం, వివాహ వ్యవస్థకు సంబంధించిన కీలక ప్రశ్నలను ట్రాన్స్‌ జెండర్‌ సమూహాలు లేవనెత్తాయి. హిందూ వివాహ చట్టం దగ్గరి నుండి ప్రత్యేక వివాహ చట్టం, పౌరసత్వ చట్టం దాకా వీరు అన్నిటినీ సవాలు చేసారు. ఆయా చట్టాలు స్త్రీపురుషుల వివాహ సంబంధాన్ని మాత్రమే గుర్తిస్తాయి. 2018లో స్వలింగ సంపర్కం నేరం కాదని, అందరిలాగే ఎల్‌జిబిటిక్యు (lesbian, gay, bisexual, transgender, queer) సమూహానికి కూడా లైంగిక హక్కులుంటాయని, వారికి గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది. అటువంటప్పుడు వారు చట్టబద్ధమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఉండాలి అని పిటిషన్‌దారులు అడుగుతున్నారు. అంత మాత్రమే కాదు కుటుంబం అంటే స్త్రీ పురుషులు వివాహం ద్వారా ఏర్పరచుకునేదో లేక రక్తసంబంధమో మాత్రమే అయితే అటువంటి కుటుంబాల నుండి హింసను, వెలివేతను మాత్రమే ఎదుర్కునే తమ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు.

ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులను సాధారణంగా కుటుంబాలు అంగీకరించవు. పుట్టుకతో వారికి ఆపాదించిన లింగ గుర్తింపుతో ఉండాలని, వెరే జెండర్‌ వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవించాలని తల్లిదండ్రులు బలవంతం చేస్తారు. వారి పిల్లలు అందరిలా ఎందుకు ప్రవర్తించడంలేదో అర్థం చేసుకునే పరిస్థితి వారికి ఉండదు. దాని నుండి పిల్లలను  తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేస్తారు. వీటిని భరించలేక ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులు ఇంటి నుండి పారిపోయి బైటికి వస్తారు. వారిని సమాజం కూడా ఆదరించదు. గేలి చేస్తుంది, చీదరించుకుంటుంది. ఎల్‌జిబిటిక్యు వ్యక్తులకు లైంగిక అవసరాలే కాదు, మనుషులుగా వారికి భావోద్వేగాలు పంచుకునే తోడు అవసరం. తమకిష్టమైన మనుషులతో వారు గౌరవప్రదంగా కలిసి జీవించగలగాలి. వారికి సామాజిక రక్షణ కావాలి.

ఆధునిక సమాజంలో కుటుంబానికి రాజ్యం గుర్తింపు కూడా అవసరం. పెన్షెన్లు, ఇన్సూరెన్సుల దగ్గరి నుండి ఆసుపత్రుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషికి తోడుగా ఉండడానికి, ఆ వ్యక్తి తరపున నిర్ణయం తీసుకోడానికి జీవిత బాగస్వామి అవసరం. ఇవన్నీ ప్రాక్టికల్‌గా వచ్చే సమస్యలు. అదలా ఉంచితే అసలు కుటుంబం అంటే ఏమిటి అనే మౌలిక ప్రశ్నను కూడా వీరు లేవనెత్తారు. మన ప్రమేయం లేకుండా ఏర్పడే రక్తసంబంధం మాత్రమే కుటుంబాన్ని నిర్ణయిస్తుందా? కుటుంబాన్ని మన ఇష్టప్రకారం ఎందుకు ఎంపిక చేసుకోకూడదు అని వీరు అడుగుతున్నారు.

కుటుంబాల నుండి బైటికి వచ్చి ఒక కమ్యూన్‌గా హిజ్రా సమాజం జీవించడం మనం చూస్తుంటాం. అది వారికైవారు చేసుకున్న ఒక ఏర్పాటు. అదెంతోకొంత రక్షణ ఇస్తుంది. చాలా ప్రతికూలతల మధ్య తమ పోరాటం తాము చేస్తూ వారు జీవిస్తుంటారు కానీ రాజ్యాంగ వ్యవస్థ వారికి ఎటువంటి రక్షణనూ ఇవ్వదు. సెక్స్‌ వర్కర్లుగా, భిక్షగాళ్లుగా బతికేవారిని ఉత్పత్తిలో భాగం చేసే ప్రయత్నం చేయదు. నిజానికి అట్లా ఎన్నో సమూహాలను సమాజానికి, ఉత్పత్తి వ్యవస్థకు దూరంగా పడేసి అంతా బాగుంది అన్నట్లు వ్యవస్థ మనుగడ సాగిస్తూ ఉంటుంది. వాళ్లు ఎప్పుడైతే ముందుకొచ్చి వ్యవస్థ మౌలిక స్వభావాన్ని ప్రశ్నిస్తారో అప్పుడది ఉలికిపడుతుంది.

కేంద్రప్రభుత్వం స్వలింగ వివాహాల విషయంలో అలాగే ఉలికిపడిరది. అసలు ఇటువంటివాటిని నిర్ణయించడానికి కోర్టులకు ఏమి అధికారం ఉంది అని బయలుదేరింది. హిందూ వివాహ చట్టంమైనా, ముస్లిం వివాహ చట్టమైనా, మతాంతర వివాహాలను గుర్తించే ప్రత్యేక వివాహ చట్టమైనా స్త్రీపురుషుల వివాహ బంధాన్నే గుర్తిస్తుంది అంటూ, అసలు వివాహమంటేనే ఒక స్త్రీ, ఒక పురుషుని కలిపే పవిత్ర బంధమని వేదాల నుండి మనుస్మృతి నుండి ఉటంకింపుల్ని తీసుకొచ్చాడు ప్రభుత్వ తరపు న్యాయవాది. పిల్లల్ని కనడం ద్వారా మానవజాతిని కొనసాగించడమే వివాహ ప్రయోజనమని కూడా అన్నాడు. స్వలింగ వివాహాలను అనుమతిస్తే వివాహ పవిత్రత దెబ్బతినిపోతుందని ఆయన కంగారుపడిపోయాడు. అలా కంగారుపడటానికి కారణం ఎంతైనా ఉంది.

ఆస్తి కేంద్రంగా పితృస్వామిక కుటుంబాన్ని, కులవ్యవస్థను పరిరక్షించే వివాహ వ్యవస్థను ఉన్నదున్నట్లుగా పరిరక్షించకపోతే వ్యవస్థ బీటలువారుతుంది. కుటుంబం అంటే భార్యా, భర్తా ఉండాలి. భర్త కుటుంబ యజమానిగా, కొడుకు వాడికి వారసుడిగా ఉండాలి. కూతురిని అదే కులంలో, అదే హోదాలో ఉన్నవాడికి కన్యాదానం చేయాలి. స్వలింగ వివాహాల దాకా ఎందుకు? వేరువేరు  లైంగికతలున్నా… జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు యువతీయువకులకు లేదు. ముఖ్యంగా అమ్మాయిలు హద్దు దాటితే చంపే హక్కు కూడా తండ్రికి ఉంటుంది. ప్రేమకు ఆస్కారం లేకపోయినా, డబ్బు లావాదేవీలు, కట్నాల కోసం హత్యలు, కుటుంబ హింస… ఎన్ని లుకలుకలున్నా ఈ వివాహవ్యవస్థ చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఇది బ్రాహ్మణీయ కులవ్యవస్థ పవిత్రతను చెక్కుచెదరకుండా, సంకరం కానివ్వకుండా తరతరాల బానిసలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది.

ఈ కుటుంబ వ్యవస్థనే సహాజమైనదిగా అందరూ భావిస్తారు. నిజానికి ఇదే చాలా అసహజమైనది. మొట్ట మొదట స్త్రీ పురుషుల మధ్య వివాహ సంబంధానికి ప్రేమ పునాదిగా లేదు. తాము ఎవరితో జీవితాన్ని పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కును కుటుంబం గుర్తించదు. భార్యాభర్తల సంబంధాన్ని ఇంచుమించు బానిస-యజమాని  సంబంధంలా మతగ్రంధాలు నిర్వచించాయి. గృహ నిర్వహణలో భార్య చేయవలసిన పనులేమిటి, భర్త చేయవలసిన పనులేమిటి స్పష్టంగా ఉంది. ఎంత అభ్యుదయంగా ఆలోచించేవారైనా కుటుంబం దగ్గరికి వచ్చేసరికి పితృస్వామిక కుటుంబ మానసికతకు లోబడే ఉంటున్నారు. ఈ కుటుంబం పరిరక్షించేది ఏమిటి అంటే కులం, వ్యక్తిగత ఆస్తి- అది కూడా పురుషుని వ్యక్తిగత ఆస్తి. ఆధునిక చట్టాలు ఎన్ని వచ్చినా కుటుంబంలోని ఆధిపత్య, హింసా సంస్కృతిని మార్చలేకపోతున్నాయి.

స్వలింగ వివాహాలు గుర్తించమని కోరే వాళ్ళు అడుగుతున్నదేమిటి? తమకు నచ్చినవారితో కలిసి జీవించాలనే కదా! కుటుంబం అంటే భార్య భర్త -వారి సంతానం మాత్రమే ఉండాలా? ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తూ పిల్లలని పెంచితే సమాజానికి జరిగే నష్టం ఏమిటి? లేదా నచ్చిన వారిని ఎంపిక చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకుంటే నష్టం ఏమిటి? అందరిలా తమకూ బంధాలు, అనుబంధాలు ఉండాలని కోరుకోవడం తప్పా? అయితే మన ప్రభుత్వం భయపడుతున్నదేమిటి? కుటుంబం అన్నాక భార్యా, భర్త ఉండాలి- ఎవరికి నిర్దేశించిన పనులు వారు చేయాలి. భార్య-భర్త అనే పాత్రలు లేకపోతే మనుధర్మం ఏం కావాలి అనేదేనా వారి భయం. అవును. ఈ తరహా కుటుంబమే కదా సనాతన సంస్కృతిని పరిరక్షించేది.  పురుషాధిపత్య భావజాలాన్ని పిల్లలకు, పిల్లల పిల్లలకు నూరిపోయకపోతే కట్టుబాట్లు ఏమైపోతాయి? అయితే భార్య భర్త అనే పాత్రలు లేని కుటుంబం ప్రజాస్వామిక కుటుంబంగా రూపొందే అవకాశం ఉందేమో.. పాత ఆధిపత్య కుటుంబ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కావాలనే వాళ్ళు తప్పకుండా ఆలోచించాలి.

వివాహ సమానత్వానికి సంబంధించిన కేసు వరకు కోర్టు మాత్రం తాను మతాలకు సంబంధించిన వివాహ చట్టాలను పరిగణలోకి తీసుకోనని, సెక్యులర్‌ (ప్రత్యేక) వివాహ చట్టంలోపలే దీనిని పరిశీలించాలని అన్నది. క్వీర్‌, ట్రాన్స్‌ జెండర్‌ కేసుల్లో కొన్ని ప్రగతిశీల తీర్పులున్నప్పటికీ సుప్రీం కోర్టుకు పరిమితులు కూడా ఉన్నాయి. 1950లలో ప్రత్యేక వివాహ చట్టం చేసినపుడు స్వలింగ వివాహాలను ఊహించలేదు. స్వలింగ జంటలకు వర్తించేలా ఈ చట్టంలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ ధర్మాసనమైనా శాసనసభకే సిఫారసు చేయవలసిరావచ్చు. స్వలింగ వివాహాలను చాలా దేశాలు ఇప్పటికే గుర్తించాయి. అటువంటి జంటలు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చని కూడా చట్టాలు చేసాయి. మనుధర్మాన్ని మాత్రమే ఆచరించాలని చెప్పే పాలకులున్న స్థితిలో ఇక్కడ ఆ అవకాశం కనిపించడం లేదు. నిజానికి ప్రజాస్వామికవాదులు కూడా ఈ విషయంలో గందరగోళంతో ఉన్నారు. స్వలింగ జంటల హక్కుల గురించి మాట్లాడటం పోస్ట్‌ మాడ్రన్‌ వ్యవహారమనో లేదా అలాంటివి కొద్దిమంది ఉన్నత వర్గాల వ్యక్తిగత సమస్యగానో కొట్టిపడేస్తున్నారు. అది చాలా తప్పు. ఆ సమూహం చదువులకు, ఉద్యోగాలకు, కుటుంబాలకు కూడా దూరంగా ఎంతో పీడనను అనుభవిస్తున్నారు. అశేషపిడిత జనసమూహంలో వారు కూడా భాగం. ఈరోజు వాళ్లంతట వాళ్లు చాలా కొద్దిమందైనా చదువుకుని చైతన్యాన్ని పెంచుకొని ఆత్మగౌరవ పోరాటంలో ముందుకు వస్తున్నారు. అంత మాత్రమే కాదు, సమాజం ముందుకు చాలా కీలకమైన ప్రశ్నల్ని పెడుతున్నారు.  ప్రత్యామ్నాయ సాంస్కృతిక విలువల గురించి, ప్రజాస్వామిక కుటుంబ సంబంధాల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. సమాజ మార్పుకు సంబంధించిన అన్ని ప్రత్యామ్నాయ ఆలోచనల్ని ఆహ్వానించాల్సిన, చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

3 thoughts on “స్వలింగ వివాహాలు- పితృస్వామిక కుటుంబ వ్యవస్థ

  1. 🙏
    మా సత్యం
    పి.వరలక్ష్మి గారు రాసిన
    ‘స్వలింగ వివాహాలు–పితృ స్వామికి కుటుంబ వ్యవస్థ ‘
    సమాజానికి, యువతకి ఒక ‘కొత్త పాఠం’
    ఇట్స్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్.
    చాలా లోతుగా సమాజాన్ని అధ్యయనం చేసి మనువాద మూలాల్లో దాగిన విష సంస్కృతిని తనదైన శైలిలో సరళంగా సూటిగా, స్పష్టంగా నిర్మొహమాటంగా, భారత సమాజంలోని సాంస్కృతిక, భావజాల తాత్విక మూలాలను సృచించారు.
    నేటి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక సంచలనాత్మకమైన రచనగా భావించవచ్చు.
    గరుడ చూపు విశ్లేషణతో రచయిత తెలియజేశారు. మానవ ఆలోచనలో భావాలలో ఒక కొత్త చర్చను ప్రవేశపెట్టింది. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత.

  2. 🙏
    మా సత్యం
    పి. వరలక్ష్మి గారు రాసిన ”స్వలింగ వివాహాలు–పితృ స్వామికి కుటుంబ వ్యవస్థ”
    సమాజానికి, యువతకి ఒక ‘కొత్త పాఠం’ఇట్స్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్.
    చాలా లోతుగా సమాజాన్ని అధ్యయనం చేసి మనువాద మూలాల్లో దాగిన విష సంస్కృతిని తనదైన శైలిలో సరళంగా సూటిగా, స్పష్టంగా నిర్మొహమాటంగా, భారత సమాజంలోని సాంస్కృతిక, భావజాల తాత్విక మూలాలను సృచించారు.
    నేటి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక సంచలనాత్మకమైన రచనగా భావించవచ్చు.
    గరుడ చూపు విశ్లేషణతో రచయిత తెలియజేశారు.
    మానవ ఆలోచనలో, భావాలలో ఒక కొత్త చర్చను ప్రవేశపెట్టింది. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత.

  3. All are human beings – justice /rights /freedom /respect —all are equal to every one —
    Needs change in our thinking //look big picture

Leave a Reply