ప్రపంచ సైనిక వ్యయం అల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022లో సైనిక వ్యయం అత్యధికంగా 2.24 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ సైనిక వ్యయంపై స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) మార్చి 13న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశాల నుండి సైనిక పరికరాలు కొనడానికి భారత్‌ 2020-21 లో రూ|| 4 లక్షల 71 వేల కోట్లు, 2021-22 లో రూ|| 4 లక్షల 78 వేల కోట్లు, 2022-23 లో రూ|| 5 లక్షల 25 వేల కోట్లు, 2023-24 లో రూ|| 5 లక్షల 93 వేల కోట్లు కేటాయించింది. వరుసగా ఐదో సంవత్సరం కూడా ప్రపంచ సైనిక వ్యయం పెరిగిందని.. ఐరోపాలో 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 13 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. రష్యా, యుక్రెయిన్‌ల సైనిక చర్యలను ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నప్పటికీ.. ఇతర దేశాలు కూడా సైనిక వ్యయం కోసం అధిక శాతం ఖర్చు చేస్తున్నాయని ఎస్‌ఐపిఆర్‌ఐ తెలిపింది.

          ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచితే అది జనాల మీద భారం పడుతుంది. ప్రజల జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ప్రపంచంలో రోజు రోజుకూ మిలిటరీ ఖర్చు పెరుగుతున్నది. ప్రజలు ఏమైనా సరే ఈ ఖర్చు ఎంత పెరిగితే అమెరికా ఆయుధ పరిశ్రమ కార్పొరేట్లకు అంతగా లాభాలు వస్తాయి.  ప్రపంచ దేశాల మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది. ప్రపంచ జిడిపి వృద్ధి 2.9శాతం మాత్రమే పెరిగింది. అంటే రక్షణ వ్యయం కంటే తక్కువే అని అంచనా వేస్తున్నారు. ఐరోపాలో గత మూడు థాబ్దాల్లో ఎన్నడూ లేనంత విపరీతంగా రక్షణ వ్యయం పెరిగింది. ప్రపంచం మొత్తం చేస్తున్న రక్షణ ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. దేశాల వారీ జిడిపిలో అమెరికా 39శాతం, చైనా 13శాతం, రష్యా 3.9శాతం, భారత్‌ 3.6శాతం, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి.

          ఇటీవల కాలంలో ప్రపంచ సైనిక వ్యయం నిరంతరం పెరగడం అంటే.. మనం అభద్రతతో కూడిన ప్రపంచంలో నివరిస్తున్నామని అర్థమని ఎస్‌ఐపిఆర్‌ఐ సైనిక వ్యయం, ఆయుధాల ఉత్పత్తి కార్యక్రమం సీనియర్‌ పరిశోధకుడు నాన్‌ టియాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. క్షీణిస్తున్న భద్రతా వాతావరణానికి ప్రతిచర్యగా దేశాలు భద్రతా బలగాలను పెంచుతున్నాయని.. ఇది భవిష్యత్తులో అత్యధిక వ్యయానికి కారణమౌతుందని ఊహించవచ్చు అన్నారు. రష్యా పొరుగున ఉన్న ఫిన్‌లాండ్‌ 36 శాతం సైనిక వ్యయం పెరుగుదల ఉండగా, లిథువేనియాలో 27 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. 2022లో యుక్రెయిన్‌లో సైనిక వ్యయం ఆరు రెట్లు పెరిగి 44 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని, ఎస్‌ఐపిఆర్‌ఐ డేటాలో ఇప్పటివరకు నమోదైన దేశాల సైనిక వ్యయాల జాబితాలో అత్యధికంగా ఒకే ఏడాదిలో అనూహ్యంగా పెరిగినట్లు ఆయన తెలిపారు.

          ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)తో పోలిస్తే 2022లో 3.4 శాతానికి పెరిగిందని… అంతకు ముందు సంవత్సరం 3.2 శాతంగా ఉందని అన్నారు. సైనిక వ్యయం కోసం కేటాయించిన మొత్తంతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. 2022లో అమెరికా సైనిక వ్యయంలో 0.7 శాతం పెరిగి 877 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని, ఇది మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో 39 శాతమని పేర్కొన్నారు. అలాగే అమెరికా యుక్రెయిన్‌కు అందించిన ఆర్థిక సైనిక సాయం గతేడాది 19.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని తెలిపారు. 292 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలవగా, 64 బిలియన్‌ డాలర్లతో జపాన్‌ మూడవ స్థానంలో నిలిచింది. భారత్‌ నాల్గవ స్థానంలో నిలిచింది.

ప్రచ్చన్న యుద్ధంనాటి స్థాయికి ఐరోపా రక్షణ వ్యయం :

          ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్సిట్యూట్‌(సిప్రి) తయారుచేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం 2022లో యుక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఐరోపా సైనిక వ్యయం 30 ఏండ్లలో ఎన్నడూ పెరగనంతగా పెరిగింది. ఇదేకాలంలో ప్రపంచ సైనిక వ్యయం 3.7 శాతం పెరిగింది. దీని వాస్తవ విలువ 2.24 ట్రిలియన్‌ డాలర్లు. గత సంవత్సరంలో ప్రపంచం మొత్తం చేసిన సైనిక వ్యయంలో అత్యంత సైనిక వ్యయం చేసిన మూడు దేశాల అమెరికా, చైనా, రష్యా వాటా 56 శాతంగా ఉంది. వీటిలో అమెరికా చేస్తున్న సైనిక వ్యయం తన భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉంది. అమెరికా 877 బిలియన్‌ డాలర్లు, చైనా 292 బిలియన్‌ డాలర్లు, రష్యా కేవలం 86.4 బిలియన్‌ డాలర్లు రక్షణ రంగంపై వెచ్చిస్తున్నాయని సిప్రి నివేదిక పేర్కొంది. అయితే అన్ని దేశాలకంటే ఎక్కువగా ఐరోపా సైనిక వ్యయం 13 శాతం పెరిగింది. మధ్య, పశ్చిమ ఐరోపా దేశాల సైనిక వ్యయం 345 బిలియన్లకు చేరింది. ఇది 1989లో ప్రచ్చన్న యుద్ధం ముగిసేనాటికి చేసిన సైనిక వ్యయాన్ని మించిపోయింది. దేశాలవారీగా పెరిగిన సైనిక వ్యయాన్ని తీసుకుంటే ఫిన్లాండ్‌ 36 శాతం, లిధ్యూనియా 27 శాతం, స్వీడెన్‌ 12 శాతం తమతమ సైనిక వ్యయాన్ని పెంచుకున్నాయి. అమెరికా పెంచిన సైనిక వ్యయంలో గణనీయ భాగం యుక్రెయిన్‌కు అందిస్తున్న ఆయుధ సరఫరా రూపంలో ఉంది. ప్రచ్చన్న యుద్ధం తరువాత గత సంవత్సరం అమెరికా యుక్రెయిన్‌కు ఇచ్చిన 19.9 బిలియన్‌ డాలర్ల సైనిక సహాయం మరేదేశానికి ఇవ్వలేదు. అయితే అమెరికా మొత్తం సైనిక వ్యయంలో ఈ సహాయం వాటా కేవలం 2.3 శాతం మాత్రమేనని సిప్రి నివేదిక వివరించింది.

భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారు :

          (సిప్రి) అధ్యయనం ప్రకారం, 2013-17 మరియు 2018-22 మధ్య ఆయుధాల కొనుగోళ్లలో 11 శాతం క్షీణత ఉన్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక పరికరాల దిగుమతిదారుగా ఉంది. డిఫెన్స్‌ తయారీ రంగంలో స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు భారత్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిన తరుణంలో ఈ నివేదిక విడుదలైంది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌లో దేశీయ కొనుగోళ్లకు రూ.1 లక్ష కోట్లు ఉన్నాయి, అంతకుముందు మూడేళ్లలో రూ.84,598 కోట్లు, రూ.70,221 కోట్లు, రూ.51,000 కోట్లు ఉన్నాయి. గత ఐదేళ్లలో ప్రపంచంలోని ఆయుధ దిగుమతుల్లో భారతదేశం అత్యధికంగా 11 శాతం, సౌదీ అరేబియా (9.6 శాతం), ఖతార్‌ (6,4) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా (4.7 శాతం), మరియు చైనా (4.7 శాతం). ఈ ఐదు దేశాల రక్షణ వ్యయం ప్రపంచ దేశాల రక్షణ వ్యయం మొత్తంలో 63 శాతం ఉంది.             గత ఐదు సంవత్సరాలలో, భారతదేశం రక్షణ స్వావలంబనను పెంచడానికి అనేక రకాల చర్యలను అమలు చేసింది. వాటిలో దేశంలోనే తయారు చేయబడిన సైనిక పరికరాలను కొనుగోలు చేయడానికి ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేయడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతం నుండి 74 శాతంకి పెంచడం మరియు రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో దేశీయంగా ఉత్పత్తి చేయబడే వందలాది ఆయుధాలు మరియు వ్యవస్థల గురించి విదేశీ ప్రభుత్వాలకు తెలియజేయడం వంటివి ఉన్నాయి. 2022లో చైనాతో వివాదాస్పద సరిహద్దు వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు సాయుధ బలగాలకు పరికరాలను మెరుగుపరచడానికి భారతదేశం చేస్తున్న ఖర్చు మొత్తం సైనిక వ్యయంలో 23 శాతం అని నివేదిక పేర్కొంది. మరియు మొత్తం సైనిక వ్యయంలో దాదాపు సగానికి పైగా ఉంది.

          గత ఐదేళ్లలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా 40 శాతతం సైనిక వస్తువులను ఎగుమతి చేసింది, రష్యా (16 శాతం), ఫ్రాన్స్‌ (11 శాతం), చైనా (5.2 శాతం), మరియు జర్మనీ (4.2 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2018-22 మధ్యకాలంలో అమెరికన్‌ ఆయుధ ఎగుమతులు 14 శాతం పెరిగాయి, రష్యాది 31 శాతం తగ్గింది. భారతదేశం రష్యా నుండి 37 శాతం తక్కువ వస్తువులను దిగుమతి చేసుకుంది. ఫ్రాన్స్‌ యొక్క ఆయుధాల ఎగుమతులు 2013 మరియు 2018 మధ్య 44 శాతం పెరిగాయి మరియు గత ఐదేళ్లలో భారతదేశం ఫ్రాన్స్‌ నుండి 30 శాతం పొందాయి, రష్యా తర్వాత భారతదేశానికి రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా అమెరికాను అధిగమించింది. భారత్‌ ఈ సంవత్సరం మూలధన వ్యయం గత సంవత్సరం బడ్జెట్‌ అంచనాల కంటే 6 శాతం ఎక్కువ మరియు 2022-23 సవరించిన అంచనాలతో పోలిస్తే 8 శాతం ఎక్కువ, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధనౌకలు, క్షిపణులు, ఫిరంగి తుపాకులతో సహా అనేక భూ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది.

ముగింపు :

          అమెరికా, చైనా ఆర్థిక సామర్థ్యాలు, వాటి భౌగోళిక రాజకీయాలు స్పష్టంగా తెలిసినదే. కానీ, మానవాభివృద్ధి సూచిలో 140వ స్థానంలో ఉన్న భారత్‌ ఇలా మిలటరీ ఖర్చును పెంచుకుంటూ పోవడం ప్రజా సంక్షేమానికి మేలు చేసేదేనా? దేశ రక్షణ పవిత్ర కర్తవ్యమని నమ్ముతున్న ఆ శాఖ అవినీతికి, అక్రమ లాభాలకు, బ్రోకర్ల కమీషన్ల నిలయమేనని రక్షణ రంగ నిపుణులే అంటున్నారు. భోఫోర్స్‌ స్కాండల్‌, రాఫెల్‌ వంటి కుంభకోణాల సంబంధిత వార్తలు థాబ్దాలుగా వింటూనే ఉన్నాం. మన దేశంలో ప్రభుత్వ పెద్దలకు, అశ్రిత పెట్టుబడిదారులకు, అమెరికా, ఇజ్రాయెల్‌ ఆయుధ వ్యాపార కంపెనీలకు రక్షణ వ్యయం బంగారు బాతులా ఉంది. రక్షణ శాఖలో లాబి చేసే ఏజెంట్లకు  క్లాసిఫైడ్‌ సమాచారమూ, లోగుట్టుతో కరతలామలకమేనని మాజీ సైన్యాధిపతి, ప్రస్తుత కేంద్ర మంత్రి వి.కె. సింగ్‌ లోగడ అన్నారు.           నిజానికి ఆయుధాల వ్యాపారంలో దేశరక్షణ కంటే పారిశ్రామిక వాణిజ్య ప్రయోజనాలు, లక్ష్యాలే ప్రధానంగా ఉంటాయన్నది బోధపడుతున్నది. మన సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా, మన భూభాగంలో ఒక్క అంగుళం కూడా దురాక్రమణకు గురికాలేదని స్వయంగా ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. అయినా, అమెరికా ప్రేరేపిత బూర్జువా మీడియా కట్టుకథలే మన దేశభక్తికి ఊతంగా మారాయి. దేశీ విదేశీ ఆయుధ వ్యాపారులకు శాంతి రుచించదు.  అంతర్యుద్ధాలను, రెండు దేశాల మధ్య యుద్ధాలను సృష్టించడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. దేశంలో సగం జనాభా అర్థాకలితో ఉంటే దేశ రక్షణ సాకుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తగునా? యుద్ధ ఆర్థిక విధానానికి అమెరికా పుట్టినిల్లు. ఆ వ్యూహంలో భారత్‌ పావుగా మారిందనేది అక్షర సత్యం. ప్రజా సంక్షేమాన్ని, దేశాభివృద్ధిని విస్మరించి ఇలా చేయవచ్చునా? ‘భారత-చైనాల మధ్య ఘర్షణలు అమెరికాకి మంచి అవకాశం’ అన్న న్యూయార్క్‌ టైమ్స్‌ శీర్షిక వాస్తవానికి దగ్గరగా ఉంది.

Leave a Reply