ఒక గ్రామంలో  –పిల్లల దగ్గర నుండి..

 మంచికంటి  

          ఊహ తెలిసినప్పటి నుండి సంఘర్షణ…   బతకడంలో సంఘర్షణ… చుట్టూ ఉన్న మనుషుల మధ్య సంఘర్షణ… అర్థం కాని ఎన్నో రకాల జీవితాలు…  ఉపాధ్యాయ వృత్తి లోకి ప్రవేశించిన తరువాత అక్కడ కూడా  సంఘర్షణ. ఉండాల్సినవి ఉండాల్సినట్టు కాకుండా… చేయాల్సిన వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం ఎంతో బాధ… ఎంతో అసహనం…. 

          మనం ఏమీ చేయలేమా! చెయ్యాలి…. ఏదో చేయాలి.. బాల్యం నుండి  ఉన్న ఆలోచన అదే. గ్రామంలోనూ బడిలోనే  కాదు.. జీవితంలో కూడా ఏదో చెయ్యాలి… ఏదో సాధించాలి.. ఇలా  ఎన్నో అర్థం కాని విషయాలు. అర్థం లేని ఆలోచనలు…

          ఈ విషయాలన్నీ కొద్దికొద్దిగా పుస్తకాలలో నుండి అవగాహన అవుతూ వచ్చాయి. అక్కడి నుండి సాహిత్యంలోకి రావడం. అక్కడ కూడా అర్థం కాని విషయాలు… అర్థం కాని మనుషులు… భిన్న మనస్తత్వాలు… విభిన్న రకాలైన సాహిత్యం… ఎలా చదవాలి… ఏమి చదవాలి… ఎలా రాయాలి… ఏమి రాయాలి… అన్నీ ప్రశ్నలే… చాలా కాలం కవిత్వం వెంట… పుస్తకాల వెంట …కవుల వెంట…. సాహిత్యం వెంట… కథల వెంట… మీటింగులు వెంట… ఇలా ఇలా చాలా కాలం  కరిగిపోయాక…

          కథలు, కవిత్వం రచనలు చేయడమేనా ఉపన్యాసాలివ్వడమేనా…. ఆచరణలో ఏమీ చెయ్యలేమా…. అనే ఆత్మ శోధన నుండి మొదలయ్యిందే శాంతివనం తాత్వికత.

          ఊపాధ్యాయుడిని కావడం వల్ల  జీవితమంతా పల్లెటూళ్ళ  సంబంధంతోనే   గడిచింది.వృత్తి పరంగా ఎదుగుదల గురించిన ఆలోచనే లేదు.సాహిత్యంలోనే యువతకు   ఏదో చెయ్యాలని ఎన్నో ప్రయోగాలు చేశాము. ఇది వృధా ప్రయాస అని అర్థమైంది. ఇన్ని రకాల ప్రయాణాల తరువాత  పిల్లల దగ్గర నుండి  మొదలు పెట్టి ఏదైనా నా చెయ్యాలని అర్థమైంది. 

           పేదరికం ఎన్నో రకాలుగా జడలు విచ్చుకుని బాల్యాన్ని ఎలా కబళించి వేస్తుందో అర్ధమవుతూ వొచ్చింది.ఏదో చెయ్యాలి.ఎక్కడో మార్పు తేవాలి .ఇదే నిత్య సంఘర్షణ.ఒంగోల్లో  ఒక ఆధునిక సాహిత్య వాతావరణం కోసం ఎన్నో  విధాలుగా ప్రయత్నాలు చేశాము.పాఠకులను పెంచడానికి మిత్రులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వారధి రచయితల సహకార వేదికను ఏర్పాటు చేశాము.సాహిత్య అభిమానుల్ని కూడా కార్యక్రమాలలో భాగస్వాముల్ని  చెయ్యడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మిత్రులతో కలిసి కొంతకాలం కార్యక్రమాలు నిర్వహించాము. పుస్తకాలు ప్రచురించాము.అంతే ఇంక కార్యాచరణలో మునిగి పోయాము.

          ఒంగోల్లో  రీడర్స్  క్లబ్ పెట్టాము, ఫిల్మ్ క్లబ్ పెట్టాము.సాహిత్య అభిమానుల్ని కార్యక్రమాలలో భాగస్వాముల్ని చేశాము.సర్జన్ డాక్టర్ సుధాకర్ తో కలిసి  రవీంద్రనాధ్ ఠాగూర్ శాంతినికేతన్ స్పూర్తితో శాంతివనం సంస్థను మొదలుపెట్టి కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాము.

           అప్పటి నుండి నిరంతర కార్యక్రమాలు  సమ్మర్ కేంప్స్…పిల్లల్ని శాంతివనం లోనే దత్తత తీసుకుని చదివించడం… వర్క్ షాప్స్ నిర్వహించడం….ఉపాధ్యాయులకు శాంతివనం ఉత్తమ అవార్డులనివ్వడం…  స్కూల్స్ లో   తెలుభాషోత్సవం ద్వారా భాషా స్పృహ పెంచడం…మొక్కలు నాటడం పెంచడం…సృజనాత్మక పోటీలు… పర్యావరణ…వినాయకచవితి  మట్టిబొమ్మలు తయారీ  ….దీపావళి కాలుష్యం పై అవగాహన… పాటల పోటీలు..పిల్లల చేత కథలు   చదివించడం…రాయించడం…మంచి సినిమాలు  చూయించడం…. ఇలా ఎన్నో  కార్యక్రమాలు ఒంగోల్లో నిర్వహించాము .

          కానీ ఇంకా చెయ్యాలి…  చెయ్యాలి…. ఏం చేయాలి …ఎలా చేయాలి…. మన అవసరం ఎక్కడ ఉంది అని ఆలోచించాక కార్యస్థానం పల్లెటూర్లు… గమ్యస్థానం ప్రభుత్వ పాఠశాలలు… అని అర్థమైంది. అందుకేశాంతివనం ఒంగోలు పట్టణంలో కాదు పల్లెటూళ్ళోనే  ఉండాలి. ఈ ఆలోచన రాగానే కార్యస్థానం ఒంగోలుకు 25 కిలోమేటర్లు దూరంలో ఉన్న గ్రానైట్ కు ప్రపంచ ప్రసిద్ధి కాంచిన చీమకుర్తికి 3కి.మీ దూరంలోని  పడమటి నాయుడుపాలెం అనే  గ్రామానికి శాంతివనం ను పిల్లల్ని కార్యక్రమాలను మార్చేశాము.

           జీవితానికి నిజమైన అర్థం ఇక్కడే తెలిసింది. ఇక్కడనే పిల్లలతో ఉంటూ పల్లె అందాలు ఆస్వాదిస్తూ పని చెయ్యడం మొదలు పెట్టాను . నా లోకం అంతా పిల్లలే.నా చుట్టూ పిల్లలే.జీవితానికి లక్ష్యమూ,గమ్యము కూడా పిల్లలే నిర్దేశించారు  .ఎక్కడ పని చెయ్యాలో,మార్పు ఎక్కడ అవసరమో రహస్యం తెలిసిపోయింది,

           ఎన్నో చోట్ల అనాధాశ్రమాలున్నాయి .ఆ పేరుతో వ్యాపారం వెర్రితలలు వేస్తుంది.అందుకే శాంతివనం  అనాధాశ్రమం కాకూడదనుకున్నాను.ఇది పేదపిల్లల సృజనాత్మక కేంద్రంగా ప్రయోగ కేంద్రంగా రూపొందించాలనుకున్నాను.

          ఈ  గ్రామంలో దాదాపు 1000 మంది పిల్లలు ఉంటారు.శాంతివనం ఒక సాంస్కృతిక  కేంద్రంగా,స్కూలొక విద్యా కేంద్రంగా, నిరంతరం కార్యక్రమాలు జరుగుతూ వున్నాయి.  ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులకు చదువుల పట్ల అవగాహన కలిగించడం,బాగా చదివే పిల్లలకు ఇంకా ప్రోత్సాహం అందించడం, వివిధ రకాల గురుకులాలలో పిల్లలను చేర్పించడం,పేదపిల్లలకు బట్టలివ్వడం, స్కూల్ బ్యాగులివ్వడం, పుస్తకాలివ్వడం, గ్రామంలో బడి అయిపోయిన తరువాత సాయంత్రాలలో యువకులకు ఆటలు పోటీలు, రాత్రి స్టడీ క్లాసులు  క్రికెట్ కు ప్రత్యామ్నాయ ఆటలు  ,పిల్లలకు పాటలు, సంగీతం, ఫీల్డ్ ట్రిప్స్ పుస్తకాలు చదివే అలవాటును పెంచడానికి సంచార గ్రంధాలయం బస్సు కారు సైకిల్ మోటార్ సైకిల్ ద్వారా పుస్తకాలను పాఠశాలలకు చేర్చడం…ఇలా శాంతివనంలో… గ్రామం లో…పాఠశాలల్లో…ప్రభుత్వ  పాఠశాలల్లో…జిల్లా వ్యాప్తంగానూ… వివిధ రకాలుగా…వివిధ స్థాయిలలో…  పిల్లలు యువకులకు  అనేక కార్యక్రమాలు నిర్వహించాము.

          గ్రామంలో పేదరికం అణువణువునా తాండవిస్తుంది.అందుకే శాంతివనం.. పిల్లలకు అవసరమైన సహాయ సహకారాలతో పాటు  అవగాహన తో కూడిన విద్య,ఆనందంతో కూడిన విద్య,సశాస్త్రీయమైన విద్య,అందరికీ అందించడం లక్ష్యం గా పెట్టుకుని  విద్యలో పరిశోధనలు కష్టసాధ్యమని భావించే ఇంగ్లీష్ కూడా సులభంగా ఇష్టంగా నేర్పించడం వంటి ప్ర క్రియలు కనుగొనడమే కాకుండా 10 వ తరగతి వరకు పాఠశాల  విద్య లో సులభంగా ఇష్టంగా ఎలా బోధించాలో కూడా పుస్తకాలు రాయడం జరిగింది.

          ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాలగా ఉన్న పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాల గా అభివృద్ధి చేయడానికి అనేక పోరాటాలు  చేయాల్సి వచ్చింది. అయినా సరే అయినా సరే పోరాటం చేసి ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాలను 8వ తరగతి వరకు అభివృద్ధి చేయడం జరిగింది.మొత్తం మీద ఒక గ్రామంలో విద్యాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ పాఠశాల తోపాటు ఒక సాంస్కృతిక కేంద్రము ఉండాలి. ఆ కేంద్రం ద్వారా పాఠశాల అనంతర కాలంలోనూ సెలవు దినాలులోనూ పిల్లలకు అవసరమైన సహాయ సహకారాలు ఈ కేంద్రం ద్వారా అంద చేయవచ్చు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటును పెంపొందించవచ్చు. పిల్లల స్థాయి నుండే రచనా వ్యాసంగము ను అభివృద్ధి చేయవచ్చు. యువతకు పోటీ పరీక్షలకు అవసరమైన సహాయ సహకారాలను అందించవచ్చు.

            ఈ కార్యక్రమాల నిర్వహణకు గ్రామంలోనే శాంతివనం విద్యా సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ కేంద్రం ద్వారా గ్రామంలో  విద్యాభివృద్ధికి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. గ్రామంలో  యువతకు సరైన అవగాహన కల్పించుటకు దిశానిర్దేశం చేయుటకు ఈ గ్రామాన్ని ఒక మోడల్ గా అభివృద్ధి చేశాము.

          పిల్లలతో చేసిన అనేక ప్రయోగాలు పరిశీలనలుతో… శాంతివనం.. పిల్లలు.. అనుభవాలు-ప్రయోగాలు పుస్తకం రాష్ట్ర  ప్రభుత్వమే గుర్తించి  ప్రచురించి ర్రాష్ట్రం లోని ప్రతి పాఠశాలకు పంపిణీ చేసింది.గ్రామంలో చదువుకునే ఆడపిల్లల  శాతాన్ని ఈ కార్యక్రమాల ద్వారా గణనీయంగా పెంచాము. జిల్లా వ్యాప్తంగా శాంతివనం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రధానం చేశాము.శాంతివనం పూర్తితో ఈ కార్యక్రమాలు ఇంకా అనేక గ్రామాలలో కూడా జరుగుతున్నాయి. 

          ఇంకా శాంతివనం కేంద్రం ద్వారా నిరంతరం  సంగీత,సాహిత్య నాటక,చిత్రలేఖన ప్రక్రియలు,వర్క్ షాపులు,యువసమ్మేళనాలు,సాహిత్య గోష్టులు,బోధనా ప్రక్రియల్లో పరిశోధనలు,ప్రయోగాలు,ఇంకా అనేకానేక సామాజిక  కార్యక్రమాలు జరిపించాలి .తాము చదువు కున్న ప్రభుత్వ పాఠశాలలుపై ప్రేమ వున్న మిత్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకునే ఏర్పాటు చెయ్యాలి. యువతను కూడా శాంతివనం రూపొందించే ప్రయోగాత్మక కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలి .

          10 సంవత్సరాల పాటు ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో శాంతివనంలో జరిగిన అనేక కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న విషయం ఏమంటే చాలామంది  పిల్లలకు సహాయ సహకారాలు తల్లిదండ్రుల ప్రోత్సాహం లేక నిరక్షరాస్యులు గానో నిరుద్యోగులుగానో మిగిలిపోతున్నారు. పాఠశాలల్లో  సరైన అవగాహన కలిగిన విద్య అందడం లేదు. చాలామంది  విద్యార్థులకు చదవడం రాయడం విషయంలోనే ఎంతో వెనుకబాటుతనంతో ఉంటున్నారు. 

          కాబట్టి ఈ కార్యాచరణ అంశాలను విస్తరించి ఉద్యమంగా రూపొందించాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నాము. ముఖ్యంగా పాఠశాల గ్రంథాలయ ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాము. అలాగే విద్యార్థిదశ నుండే పాఠకులను రచయితలను కవులను తీర్చిదిద్దటానికి అవసరమైన వివిధ వర్క్ షాప్ లను నిర్వహించాలని…. అవసరమైన పిల్లలకు  అన్ని రకాలైన సహాయ సహకారాలు అందించాలని ….విద్యలో బాగా రాణించే పిల్లలను ప్రోత్సహించి జీవితంలో వివిధ రంగాలలో  విజయం సాధించేలా…. సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని శాంతి వనమే కాకుండా సారూప్యత కలిగిన వివిధ సంస్థలతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నాము.

 శాంతివనం

 ఒంగోలు

Leave a Reply