పాలమూర్ అపురూప హృదయం రామ్మోహన్‌సార్
విద్య నారాయణస్వామి
1985 జనవరి 12 రాత్రి పది దాటింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నం మేము నలుగురం. చాలా చలిగా ఉండినదా రాత్రి. పొగమంచు కురుస్తున్నది. ఊపిరి తీసి వదిలితే పొగ వస్తున్నది సిగరెట్ తాగినట్టు. మాకది గమ్మత్తుగ ఉండెడిది. ఇగ సిగరెట్ యెందుకు ఇట్లే పొగ మబ్బులు చేస్తె చాలు అనుకునెటోల్లము. ఆ సాయంత్రం చాలా సేపు శివారెడ్డి సార్ దగ్గర ద్వారకా లో గడిపిన. ‘రాత్రికి గద్వాల పోతున్నం సార్’ అన్న. ‘విరసం సాహిత్య పాఠశాల జరుగుతున్నదక్కడ మేమంత కలిసి పోతున్నం’ అన్న ‘తప్పకుండ వెళ్ళు నాన్నా అని బుజం తట్టినరు సారు. అక్కడ్నుండి కూకట్ పల్లికి హాస్టల్ కు పోయి అక్కడ కిరణ్ నర్సన్న లను కలిసిన. అందరం కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్ కు వచ్చినం. అప్పటికే ప్రకాష్ సెంట్రల్ యూనివర్సిటీల యెం టెక్ ల చేరిండు. తను వాళ్ల హాస్టల్ నుండి కాచిగూడ స్టేషన్ కు వచ్చి మమ్మల్ని కలుసుకున్నడు. అందరం చలిల వణుకుతున్నం. కోఠీ ల కొనుక్కున్న నేపాలీ స్వెటర్ చలినాపుతలేదు. యెప్పుడొ అర్ధరాత్రి ఉన్నది ట్రేను గద్వాలకు, మబ్బుల చేరుతది. ‘ యెట్లా ఈ చలిని భరించేది అప్పటిదాక’ అనుకున్నం నలుగురం. ముచ్చట్లల్ల పడ్డం. రాజకీయ పరిస్తితుల గురించి, ఉద్యమాల గురించి, సాహిత్యం గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నం. వేడి వేడి రాజకీయ సాహిత్య విషయాల గురించిన ముచ్చట్లల్ల పడి, చలి పులి కోరల గాట్లను మర్చిపోయినం. నలుగురిట్ల నేనొక్కన్నే చలి పొగమబ్బులతో పోటీ పడుతూ నా పొగ మబ్బులను కూడ తయారుచేసిన. మతవాదమూ, పోలీసు నిర్బంధాలూ యెట్లా ప్రజా ఉద్యమాల మీద దాడి చేస్తున్నయో మాట్లాడుకునే సరికి మాకు సమయం తెలియలేదు.
ఇంతలో ట్రేన్ రానే వచ్చింది. జల్ది జల్ది జనరల్ కంపార్ట్మెంటులకు ఉరికి యెక్కి సీట్లు సంపాదించుకున్నం. ట్రేన్ లో సీటున్న మాటనే కానీ నాకెప్పుడూ ట్రేన్ తలుపు దగ్గర నిలబడడమే ఇష్టం. ఈ సారి కూడా అదే పని చేద్దామనుకున్న కానీ చలిగాలి అతి పదునైన కత్తిలెక్క ముఖాన్ని సర్రున కోసేసరికి ఆ ఆలోచన విరమించుకోని సప్పుడు జెయ్యకుండ సీట్ల కడుపుల కాల్లు పెట్టుకోని మలుసుకోని కూసున్న వెచ్చగ.
మబ్బుల చేరుకున్నది గద్వాలకు ట్రేన్. ఇంకా మా ట్రేన్లనే వేరే వాల్లు కూడా సభలకు వచ్చినరు. మేము స్టేషన్ ల దిగే సరికి మమ్మల్ని రిసీవ్ చేసుకునెటందుకు వాలంటీర్లు వచ్చినరు. వాళ్లు కూడ చలికి వణుకుతున్నరు. అంత చలిల కూడ మాకు స్వాగతం చెప్పెటందుకు వచ్చినందుకు వాళ్ళ నిబద్ధతా ఆత్మీయతా యెంతో ఆనందాన్నిచ్చింది మాకు. అందరం కలిసి సాహిత్య పాఠశాల జరుగుతున్న జాగకు పోయినం. గద్వాల సంస్థానం కోట అది. అక్కడ గద్వాల సంస్థానాధీశురాలైన మహారాణి ఆది లక్ష్మిదేవమ్మ పేరుతో డిగ్రీ కళాశాల, పక్కనే గుడి, గుడినానుకుని కోనేరు మంచుతెరలు విడిపోతున్న ఆ చలికాలం ఉదయకిరణాలు సోకి విప్పారుతూ చాలా ఆహ్లదంగా అద్భుతంగా ఉండిరదా ప్రదేశం. కోటలో ఒక పక్క ఇంతకు ముందు యేనుగులు కట్టేసే గజశాల ఉండేదట. అక్కడంతా చదును చేసి శుభ్రం చేసి సాహిత్య పాఠశాలకు అనువుగా సభాస్థలి ని యేర్పాటు చేసినరు నిర్వాహకులు. అంతకు ముందే అక్కడికి విమలక్క వచ్చి ఉన్నది. కొంచెం సేపటికి ఒకతను వచ్చి హైద్రాబాదునుండి వచ్చింది మీరేనా అని తాను రామ్మోహన్ గా పరిచయం చేసుకున్నరు. అట్లా మాకు రామ్మోహన్ సార్ పరిచయమైనరు.
మాకంతా బాగానే ఉందని నిర్ధారించుకుని సారు సభ యేర్పాట్లలో పడిపోయినరు. మేము మాకు చూపిన వసతిలో స్నాన కార్యక్రమాలు చేసుకుని తయారయి సాహిత్య పాఠశాల స్థలానికి పోయినము.
మధ్యాహ్నం సెషన్ లో రామ్మోహన్ సారు పాఠముండినది పాలమూర్ లేబర్ గురించి. సారు తన మృదు గంభీర స్వరంతో మొదలు పెట్టినరు ప్రసంగాన్ని. పాలమూర్ లేబర్ అంటే యెవరు వాళ్ళు యెట్లా ఆ జిల్లాలో ఉన్న భయంకరమైన కరువుని తప్పించుకునెటందుకు దేశంలో, ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని ప్రాంతాలకు వలసలు పోయినరో, యెట్లా భాక్రానంగల్ ప్రాజెక్టులో పాలమూర్ లేబర్ బలై పోయినరో, కలకత్తా బొంబాయి ఒకటేమిటి దేశం నలుమూలలకూ పాలమూర్ లేబరును అతి చవక రేట్లకు కాంట్రాక్టర్లు తోలుకు పోయి వారితో అన్ని కాలాలూ అలుపన్నది లేక పనిచేయించుకుని వారికి అతి తక్కువ ముట్ట చెప్పి తమ బొక్కసాలు నింపుకోని కోటీశ్వరులైనరో, యెట్లా దేశం లోని అన్ని భారీ ప్రాజెక్ట్లులు భారీ నిర్మాణాలు పాలమూర్ లేబర్ నెత్తురూ చెమటలతో తడిసిపోయినయో, యెట్లా అక్కడ పాలమూర్ జిల్లా గ్రామగ్రామాన దారిద్య్రం , పేదరికం ఆకలీ కరాళనృత్యం చేస్తున్నయో, యెట్లా అక్కడ నలభై యేండ్లకే ముసలితనం వచ్చేస్తదో. ముప్ఫై యేండ్లకే ముఖమ్మీద ముడుతలు వస్తయో, పుట్టుకకూ, చావుకూ నడుమ పెండ్లికీ మూడు సార్లు మాత్రమే ఆ పాలమూర్ కూలీలు తమ వూళ్లకు వచ్చిపోతరో, వూళ్లల్లో ముసలివారూ, పసివాళ్ళూ తప్ప వయసు మీద ఉన్నోల్లు ఒక్కరైనా కనబడరో, ఆ లేబర్‌ను వాళ్లకెరుకలేని కొత్త ప్రాంతాలకు తోలుకపోయి కాంట్రాక్టర్లు యెట్లా వాళ్లను కట్టుబానిసలు చేసి నిలువు దోపిడీ చేస్తరో మొత్తం కుటుంబాలకు కుటుంబాలనేబందీలుగా బానిసలుగా మార్చేసుకుంటరో సోదాహరణంగా రామ్మోహన్ సారు గద్గదమైన గొంతుతో వివరిస్తుంటే సభలో అందరి కళ్లలో నీళ్ళు. పెద్దా చిన్నా తేడా లేకుండా అందరూ దుఃఖిస్తున్నరు.
నా కండ్లపొంటి నీళ్ళు దుంకుతున్నయి. తుడుసుకున్నా మల్లా మల్లా ఆపుకోలేని దుఃఖం చివరగా సారు చెప్పిన ఒక విషయం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో యెక్కడ భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు కట్టినా పాలమూర్ లేబరే. బొంబాయిలో రోడ్లు వేయాలన్నా పాలమూర్ లేబరే. కలకత్తాలో హౌరా బ్రిడ్జి కి రిపేరన్నా పాలమూర్ లేబరే. అప్పుడప్పుడే తెలుగుగంగ నిర్మాణం ప్రారంభమవుతున్నది. ఆ నిర్మాణంలోనూ పెద్ద యెత్తున పాలమూర్ లేబరే! ఐతే తెలుగు గంగ నిర్మాణానికి బలి ఇస్తే, అదీ నరబలి ఇస్తే నిర్మాణం సజావుగా సాగుతుందనే ఒక దుర్మార్గమైన అనాగరిక నమ్మకానికీ పాలమూర్ లేబర్‌నే బలి ఇచ్చారనే ఘోరమైన వార్తను విన్నప్పుడు సభ మొత్తం స్థాణువైపోయింది. కూలీలు లోపలే ఉన్నప్పుడు ఒక సొరంగాన్ని బలవంతంగా పూడ్చేసినరట. అది విని హతాశులమై పోయినమంతా. కాంట్రాక్టర్లు తోలుకుపోయే పాలమూర్ లేబర్ యెందరో వాళ్ళలో మళ్లా యెంతమంది ఊర్లకు వాపస్ వచ్చినరో, యెంత మంది బంధువులను కలుసుకున్నరో, తమవాళ్ళు కనబడుత లేరని బంధువులు ఇచ్చే ఫిర్యాదులు యెన్నిటిని యెవరు పట్టించ్చుకున్నరో యే ప్రభుత్వాధికారులు యే పోలీసులు, యెన్నడు వారిని మనుషులుగా చూసినరో యెవరికీ తెలియని దయనీయమైన స్థితి. వాళ్లని వోట్లకే తప్ప మరేదానికీ పనికి రాని వస్తువులుగా చూసే రాజకీయ నాయకులు యెందుకు పట్టించుకున్నరో, లంచాల పాలనలో మూసుకుపోయిన యే ప్రభుత్వాఫీసుల తలుపులు వాళ్లకోసం తెరుచుకున్నయో, దొరికిన వాళ్లను ఇష్టమొచ్చినట్టు తన్ని గోజలకన్న కనాకష్టంగా హింసలు పెట్టే యే పోలీసు ఠానాలు వాళ్లను మూసేసినయో, వాళ్ళుంటే యెంత, పోతే యెంత అనుకునే దుర్మార్గమైన వ్యవస్థలో పాలమూర్ కూలీల జీవితాలు యెంత దుర్భరంగా ఉన్నయో రామ్మోహన్ సారు చెప్తుంటే ఆ రోజు కకావికలం కాని హృదయం లేదు. వేన వేలుగా వక్కలుగాని ఆలోచనలు లేవు. పాఠం ముగియగానే సారు దగ్గరికి ఉరికిపోయినం. సారు చేతిని ఆప్యాయంగా చేతిలోకి తీసికోని వెచ్చగా కన్నీటి తో తడిపినం. అప్పట్నుంచి సారు మాకు గొప్ప ఆత్మీయుడైపోయినరు.
తర్వాత సార్ గురించి చాలా విషయాలు తెలుసుకున్న. సార్ స్కూల్ టీచర్‌గా పని చేస్తూనే తన సమయాన్ని మొత్తంగా విప్లవ సాంస్కృతికోద్యమం కోసం అంకితం చేశారని, అటు ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూనే ఒక రచయితగా మేధావిగా పీడిత ప్రజల పక్షం వహించి ఒక సాంస్కృతిక సేనానిగా విరసం లో చురుకైన పాత్ర నిర్వహిస్తుండినారు. అప్పుడప్పుడే విరసం లో చేరిన మాకు ఒక మార్గదర్శిగా నాయకునిగా వ్యవహరించారు. విరసం లో ఉన్న రాజకీయ విభేదాల్లో మైనారిటీ రాజకీయ స్రవంతిగా ఉండిన మాకు ఒక బలమైన నాయకునిగా, గైడ్ గా రామ్మోహన్ సర్ చాలా శక్తివంతమైన పాత్ర నిర్వహించారు. ఎప్పటికప్పుడు సాహిత్యం లో చర్చల్లో విభేదాల్లో ప్రజాస్వామ్య సంస్కృతిని నిలబెట్టడం, అందుకు తానే ఒక ఉదాహరణగా నిలవడం రామ్మోహన్ సర్ చేసిన విలువైన సహాయం.
తర్వాత రోజుల్లో రామ్మోహన్ సర్ హైదరబాద్ కు ఉద్యోగరీత్యా మారారు. హిమాయత్ నగర్ లో ఇల్లు. సర్ ముగ్గురు కొడుకులతో, మేడమ్ తో ఆ ఇంట్లో ఉండే వారు. 1989 ఆగస్టు 12న విద్య నేనూ పెండ్లి చేసుకుంటున్నామని సార్ ని ‘పెండ్లి పెద్దగా’ ఉండాలని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. సంప్రదాయబద్ధంగా కాకుండా సభా వివాహం చేసుకుంటున్నందుకు, కట్నం వగైరాల జోలికి పోకుండా వీలైనంత సాధారణంగా పెండ్లి చేసుకుంటున్నందుకు మనఃస్ఫూర్తిగా అభినందించారు. శివారెడ్డి సర్, అరుణోదయ రామారావు, దేవీప్రియ గార్లతో పాటు తానూ ఒక పెండ్లి పెద్దగా వ్యవహరించారు. పెండ్లి దాని పుట్టు పూర్వోత్తరాల గురించి అనర్గళంగా ప్రసంగించారు. మా పెండ్లి తర్వాత విద్య సర్ కు ఒక కూతురై పోయింది. ఎప్పుడు పలకరించినా ‘బిడ్డా’ అని నోరారా ప్రేమగా పిలిచే వారు. బిడ్డలు లేని సార్ విద్యని తన అమ్మాయిలాగే ఎంతో ప్రేమ చేసే వారు. విద్యకు కూడా సర్ అంటే చాలా ఇష్టం. సర్ ఇంటికి పోయినప్పుడల్లా మేడమ్ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమ చేసేది. సర్ ఇల్లు ప్రేమాభిమానాలకు నెలవుగా ఉండేది. గొప్ప ఆత్మీయతలు అల్లుకున్న పచ్చని పందిరిలా ఉండేది.
విద్యా నేను పెండ్లి అయినంక రెండు ఇండ్లు మారి దోమల గూడ ఆంధ్రపత్రిక ఆఫీసు వెనక ఒక సన్నని గల్లీలో రూమ్ తీసుకున్నాం. పార్టీ సమావేశాలకు మా ఇల్లు ఒక పెద్ద సెంటర్ గా ఉండేది. సాహిత్య సమావేశాలు రామోహన్ సర్ ఇంట్లో జరిగేవి. సర్ ఇంటికి మేము నడిచిపొయ్యేటంత దూరంలో ఉండేవాళ్లం. అట్లా సర్ మరీ సన్నిహితుడయ్యారు. 1989-97 దాకా విప్లవ పార్టీలో, సాంస్కృతికోద్యమం లో జరిగిన ప్రతి ముఖ్య సంఘటనల్లో, కార్యక్రమాల్లో సర్ ముఖ్య పాత్ర నిర్వహించారు. సర్ తో పాటు మేమూ నడిచినమ్. జనశక్తి ఏర్పాటులో గానీ, జనసాహితీ వారితో కలిసి ఉమ్మడి సాహిత్య సాంస్కృతికోద్యమ నిర్మాణ నిర్వహణల్లో గాని, కొంత కాలం ప్రజాసాహితీ పత్రిక నిర్వహణ కమిటీలో భాగంగా కానీ సార్ నిర్వహించిన పాత్ర అపురూపమైనది.
సర్ తో మాట్లాడుతుంటే ఒక విజ్ఞానఖనితో మాట్లాడుతున్నట్టు ఉండేది. ఎన్నో విషయాలు నేర్చుకునే వాళ్ళం. ఐతే సర్ ఎక్కువగా ఉపన్యాసరంగాన్ని ఎంచుకోవడం వల్ల సర్ రాసింది తక్కువైంది. ఆయనతో మాట్లాడుకున్న సందర్భాలు కానీ, గడిపిన అపురూప క్షణాలు కానీ ఏవీ రికార్డ్ కాలేదు. ఆయన అద్భుతమైన ఉపన్యాసాలు కొన్ని రికార్డ్ అయినట్టున్నాయి. రామోహన్ సర్ గంభీరమైన ఉపన్యాసకులు. తను మాట్లాడే విషయం మీద మంచి పట్టు ఉండేది. అనర్గళంగా మాట్లాడే వారు. మంచి మృదు మధురమైన కంఠం. కవిత్వం చదివినా ఉపన్యాసమిచ్చినా సర్ ధోరణి వినూత్నంగా ఉండేది. తన ఉపన్యాస ధోరణి అనర్గళంగా ఉంటూనే ఆలోచింపచేసేదిగా ఉంటుంది. అందులో ఆయనకాయనే సాటి.
ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవడం, నేర్చింది నలుగురికి ఒక ఉపాధ్యాయునిగా విశదీకరించడం, ఉత్తేజపూర్వంగా ఆలోచింపజేయడం సార్ జీవితం లో దినచర్యగా మారిపోయింది. సార్ వ్యక్తిత్వం గొప్పది, ఒక చిన్న పిల్లగాడిలో ఉండే ఉత్సుకత, అమాయకత్వం ఆయనలో కొట్టొచ్చినట్టు కనబడేవి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపన, తనకు తెలిసింది తక్కువని ఇంకా తెలుసుకోవాలని నిరంతరకాంక్షతో ఉండేవారు సర్. తనకు తెలియనిది ఎవరి దగ్గరినుండైనా నేర్చుకోవడానికి వెనుకడేవారు కాదు. తన తప్పుల్ని ఎవరైనా ఎత్తి చూపితే వారి మీద ఎన్నడూ కోపగించుకునే వారు కాదు. తన తప్పులని నిర్మొహమాటంగా ఒప్పుకుని సరిదిద్దుకునే వారు. మేము అప్పుడు అరుణోదయ తరఫున పాటల కేసెట్లు రికార్డు చేశాము. మొదటి కేసెట్ సూపర్ హిట్ అవడం తో ఇంకా చేయమని అరుణోదయ బాధ్యులు అడగడమూ మేము సరే అనడం జరిగిపోయింది.
ఐతే ప్రతి పాటకు ముందు మూడు నాలుగు వాక్యాల ఉపోద్ఘాతం ఉండడం చాలా మందికి నచ్చడం తో అదే పద్దతిని రెండో కేసెట్ లో కొనసాగించాము. రెండో కేసెట్ లో సార్ తో ఉపోద్ఘాతం రికార్డ్ చెయ్యాలనుకుని సర్ ని అడగడంతో తను వెంటనే ఒప్పుకున్నారు. ఉపోద్ఘాతం రాసి సర్ కిచ్చి స్టూడియోలో రికార్డ్ చేయిస్తున్నాము.
సర్ గొంతు గంభీరంగా మృదు మధురంగా ఉంటుంది కానీ ఉచ్చారణ కొన్ని సార్లు సరిగా ఉండేది కాదు. రికార్డ్ అయినంక వింటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదే విషయం సర్ కు ఎట్లా చెప్పాలి అని సతమతమైనం. సర్ మాకంటే పెద్ద వారు. ఆయన పట్ల అపారమైన గౌరవం. ఎట్లా చెప్పడం? భయపడ్డం. అట్లా రికార్డ్ బయటకు పోతే బాగుండదు. సరే ఎదైైతే అదైందని ధైర్యం చేసినం. సర్ దగ్గరకు పోయి కొంచెం జంకుతూ ‘సర్ మీరేమీ అనుకొనంటే ఒక విషయం’ అన్నం. ‘ఏమిటీ’ అన్నారు సర్ తన నొసటిని ముడేస్తూ. మాకు మరింత బెరుకైంది. ఐనా సరే చెప్పేసినమ్. ‘ఓ ఇంతేనా? దీనికి ఇంత తటపటాయింపు ఎందుకు? పదండి మళ్ళీ రికార్డ్ చేద్దాం’ అన్నారు. అంతే మాకు ధైర్యం వచ్చేసింది. ఎక్కడెక్కడ ఉచ్ఛారణ సరిగా రాలేదు అనుకున్నామో అదంతా మళ్ళీ రికార్డ్ చేశాము. సరిగా వచ్చింది అనుకున్నంత వరకూ మళ్ళీ మళ్ళీ చేశాము. ఎంతో ఓపికగా రాత్రి ఎంత ఆలస్యమైనా సర్ మా పిల్ల చేష్టలకు సహృదయంగా నవ్వుతూనే అనేక టేక్ లకు ఒప్పుకున్నారు. చివరగా కేసెట్ ను విని ముగ్ధులయ్యారు.
‘’పీడనలో పడి నలిగిన జనజీవన స్వరాలు…పాడుతాం పాడుతాం ప్రజలే మా నేతలనీ ప్రజాశక్తి గెలుచునని’ అంటూ సర్ గొంతు తో వచ్చిన ఆ కేసెట్ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో భద్రంగా ఉంది. నాకు మటుకు ఆ సంఘటన సర్ ప్రజాస్వామిక స్వభావానికి, స్ఫూర్తికీ చిహ్నంగా నా స్మృతిపథం లో చిరకాలం సజీవంగా ఉంటుంది.
రెండు దశాబ్దాల పైగా విప్లవోద్యమం, విప్లవ సాంస్కృతికోద్యమం సంబరాల్లో సంక్షోభాల్లో ఉన్నారు సర్. ఆయన ఒక గొప్ప అనుభవాలగని. విజ్ఞాన ఖని. అటు పాలమూర్లోనూ ఇటు హైదరబాద్‌లోనూ తనదైన సొంత గొంతుకను వినిపించి ప్రజాస్వామిక వాదుల్లో, మేధావుల్లో, విద్యార్థుల్లో, రచయితల్లో తనదైన ముద్రను వేసిన గొప్ప వ్యక్తిత్వం సర్. అమెరికా వెళ్ళిన తర్వాత సర్‌తో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్న. నా రెండో కవితాసంకలనం సందుక వెలువరించినప్పుడు నా అశ్రద్ద వల్ల సర్ని సరిగా ఆహ్వానించలేకపోయిన.
తర్వాత ‘వానొస్తద’ సభకు ‘నడిసొచ్చిన తొవ్వ ‘ఆవిష్కరణ సభలకు సర్ ని వక్త గా ఆహ్వానిస్తే వచ్చి, ఎంతో ఆప్యాయంగా నా గురించి నా కవిత్వం గురించి తన అనుభవం లోంచి మా పరిచయం లోంచి మంచి మాటలు చెప్పారు. ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకునే వారు. సర్ పిల్లలు హరి, సృజన్, శ్రీకాంత్ చిన్నప్పటినుండి సన్నిహితులే.
మేడమ్ కాన్సర్‌తో పోరాడుతూ అకాలంగా వెళ్లిపోవడం సర్కి కోలుకోలేని దెబ్బ. పూడ్చలేని ఒంటరి తనం. ఐనా సర్ నిబ్బరంగా ఉన్నారు.స్నేహితులలో, ఆప్తులలో, పిల్లలలో ఆసరా వెతుక్కున్నారు. ధైర్యం పొందారు.ఎన్నడూ అధైర్యపడలేదు. నిరాశపడలేదు. మానసిక క్షోభ ఎంత ఉన్నా లోలోపలనే మింగి గరళ కంఠుడయ్యారు.
గత అయిదారేండ్లుగా సర్ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉన్నారు. దాదాపు ప్రతి పోస్ట్ ను చదువుతూ , కామెంటు చేస్తూ తనదైన సున్నితత్వంతో, తనదైన సునిశితత్వం తో వ్యాఖ్యానిస్తూ, లైక్ చేస్తూ సర్ ఒక నిత్య యవ్వనుడిలా ఆక్టివ్ గా ఉన్నారు. నిజానికి సోషల్ మీడియా సర్ కు పునర్జన్మనిచ్చింది, తనని మళ్ళీ యవ్వనుడిని చేసింది. ‘ఓ జీవితమా నా యవ్వనాన్ని మళ్ళీ నాకు తిరిగివ్వు’ అనే శివసాగర్ కవితా వ్యాఖ్యను సర్ సోషల్ మీడియా లో కనుక్కొన్నారు. మళ్ళీ తన విద్యార్థులతో, మాతో, ఇప్పటి తరంతో కనెక్ట్ అయ్యారు. సజీవమయ్యారు,
సమాజం పట్ల, ప్రజల పట్ల విపరీతమైన ప్రేమ, మానవీయమైన ఆకాంక్ష మమకారం ఉన్న సర్ ఎప్పుడూ నిత్య యవ్వనుడే. నిరంతర క్రియాశీలురే. తన ప్రజాస్వామిక స్వభావమే, నిరంతర చలనశీల స్వభావమే, మార్పు కోరే తత్వమే, పీడిత ప్రజలవైపు నిలబడే తాత్వికతే సర్ ని సజీవం చేస్తుంది.
తను ఎప్పుడు బిడ్డా అని పిలుస్తారా అని విద్యా నేనూ నిరంతరం ఎదిరి చూసే వాళ్లం.
కానీ పిలుపు వినపడనంత దూరం సర్ వెళ్లిపోయారు.
ఆయనకు కన్నీటి నివాళి.
(త్వరలో విడుదల కానున్న *మానవతా పతాక సి. రామ్మోహన్* పుస్తకం నుంచి..)
మంచి సమాచారం పరిచయం