ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జపాన్ దేశాల సంయుక్త ఆధ్వర్వంలో ఫార్సీ భాషలో, ఇంగ్లీష్ ఉపశీర్షికలతో వచ్చిన హృదయాల్నికలవరపరిచే మర్చిపోలేని చిత్రం“ఒసామా”. ఈ చిత్రదర్శకుడు “సిద్దిక్ బార్మాక్”. దీని నీడివి 84 నిమిషాలు.
ఇతివృత్తం: బాలికల, మహిళల అణచివేత అమానుషంగా అమలవుతున్నఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి ఒక బాలిక, ఆకలి బాధ భరించలేక బాలుడి అవతారమెత్తి పడరాని అగచాట్లు పడుతుంది. ఒక కుటుంబంలోని మూడు తరాల మహిళలను ప్రతినిధులుగా తీసుకుని తాలిబన్ పాలనలోని ఆఫ్ఘానీ మహిళల దుర్భరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలను దృశ్యీకరించడమే ఈ చలన చిత్ర సారాంశం.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనాలుండేవి. ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది. వారికి సామాజిక జీవితం నిషేధించబడింది. తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు. వారిని ఎవరూ చూడకూడదనుకుంటారు. ఎందుకంటే మహిళల ముఖంచూడడం వల్లసమాజంలోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశనమైపోతారని తాలిబన్ల బలమైన విశ్వాసం. పని హక్కు లేదు. పని హక్కు సరే, అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసివస్తే కాలికున్న చెప్పులు కూడా ఎవరి కళ్ళబడకుండా ఒబ్బిడిగా బురఖాలో వెళ్ళి, వెంటనే ఇంట్లోకొచ్చిపడాలి. యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్లో మహిళలు వారి భర్తల్నీ, తండ్రుల్నీ, కొడుకుల్నీ భారీ సంఖ్యలో పోగొట్టుకున్నారు!
ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు అమ్మమ్మ-అమ్మ- మనవరాలు పురుషుడే లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. మహిళ భర్త ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, ఆమె సొదరుడు రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు. ఆ ఇంట్లో సంపాదించి పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం ఆమె ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది. అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మకు సహాయంగా ఉంటుంది. స్త్రీలు బయటికొచ్చి పనిచెయ్యకూడదు అనే ఆంక్షలకు తోడు, తాలిబన్లు అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసిఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని ఆ పూటకి హాస్పటల్ నుండి ఇల్లు చేరడమే గగనమవుతుంది.
ఆకలితో అలమటించిపోతామని భయపడిన తల్లీ, అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ తెగ ఆలోచిస్తారు. కనుచూపు మేర దూరంలో ఏదిక్కూ తోచదు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో పాపకి మారువేషం వేసి అబ్బాయిగా తయారు చేసి ఎంత చిన్నదైనా ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు. పాప మాత్రం తాలిబన్లకు ఈ సంగతి తెలిస్తే చంపేస్తారని భీతిల్లిపోతుంది. నిస్సహాయంగా భయం భయంగా బేలచూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్మమ్మ – అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమైపోతుంది. అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలు జడలుగా అల్లికత్తిరిస్తుంది. అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ల నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది. మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిగా తయారవుతుంది. తండ్రి స్నేహితుణ్ణి బతిమాలుకుని చిన్న టీ దుకాణంలో పనికి కుదుర్చుకుంటారు. అందరూ మారువేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసిన “ఎస్పాండీ” అనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనే ఈ మారు వేషంలో ఉన్న బాలుడికి “ఒసామా” అని పేరు పెడతాడు!
ఒసామా బాలుడు కాదు బాలిక అనిమిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు. ‘నాకు తెలుసు. అతను బాలుడే. పేరు ఒసామా’- అని చెప్పి ఎస్పాండీ రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలేమీ ఫలించవు.
ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళకు ఎదురవుతున్న పరిస్థితులు ఆ రకంగా కూడా బతకనివ్వవు. గ్రామంలోని బాలురనందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఆ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారివారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయంలోనే మెన్సెస్ కూడా వచ్చి ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్ట్, మరొక విదేశీ వనితతో పాటు మన ఒసామాను కూడా జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ మరణ శిక్ష విధిస్తారు. బాలిక లేడికూనలా బెంబేలెత్తిపోతుంది. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహమాడతానంటాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ, అమ్మమ్మ కావాలి. నన్ను మా అమ్మదగ్గరకి పంపించండి” అని దీనంగా, హృదయవిదారకంగా వేడుకుంటుంది బాలిక. జడ్జి మనసు కరగదు. మూర్తీభవించిన పురుషాధిపత్య నిరంకుశ ఆఫ్గన్ సమాజంలో పన్నెండు సంవత్సరాల పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు. అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. అది ఒక శిక్షగా ఆమెను అతనికిచ్చేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరించి చెప్తారు. సహాయపడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు. ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి, ఒక ఇంటి పైభాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు.
కథ ఇంతే గానీ కథనమంతా గుండెలు బిగబట్టి చూస్తున్న ప్రేక్షకులు భయాందోళనలతో కకావికలమైపోతారు!
సిద్దిక్ బర్మెక్ సాహసం:
ఈ సినిమా దర్శకులు “సిద్దిక్ బర్మెక్”. ఆయనే ఎడిటర్. స్క్రిప్ట్ రచన కూడా ఆయనే రాశారు. ఇరానియన్ మానవతావాదంతో ప్రభావితులైన సిద్దిక్ బర్మెక్ ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా ఆర్ధ్ర్తతతో అధ్యయనం చేశారు. మహిళల గురించి తాలిబన్ల దుర్మార్గపు ఆలోచనలను ప్రపంచం ముందుంచడానికి “ఒసామా” చిత్ర దృశ్యీకరణను ఎంచుకున్నారు సిద్దిక్ బర్మెక్. కానీ ఆ మహిళల నరకయాతనల జీవితాలలో ఒసామా చిన్న జీవితశకలంగా మాత్రమే ప్రతిబింబిస్తుంది.
తాలిబన్ మహిళల జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండె నిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొదటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్ ను ఎంత ప్రశంసించినా తక్కువే! ఒక అమ్మాయి -అబ్బాయి వేషం వెయ్యడం గురించి ఒక వార్తా పత్రికలో చదివి ప్రభావితులయ్యారు సిద్దిక్ బర్మెక్. ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది!
ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి నిజంగా చాలా నిజాయితీతో పాటు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలవగలిగిన ధైర్య సాహసాలుండాలి. తాలిబన్ల రాక్షసత్వాన్ని చిత్రీకరించడంలో ఆయనెక్కడా రాజీపడలేదు. అద్దె పరికరాలతో, కాబూలీ వీధి ప్రజలే నటులుగా, బహు తక్కువ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారుసిద్దిక్ బర్మెక్!
ఒసామాగా నటించిన ‘మెరీనా గోల్బెహార్’ (Marina Golbahari), ఎస్పాండీగా నటించిన ‘ఆరిఫ్ హెరాటీ’ (Arif Herati), తల్లిగా నటించిన యువతి ‘జుబైడా సహార్’ (Zubaida Sahar), ముల్లాగా నటించిన ‘ఖ్వాజా నాదర్’ (Khwaja Nader), అమ్మమ్మగా నటించిన ‘హమీదా రెఫా’ (Hamida Refah) -వీరందరూ అద్భుతమైన నటులే కాదు, మనసున్న మనుషులు కూడా! వీళ్ళందరి సహకారానికి మహత్తరమైన ఇబ్రహీం గాఫ్యురి (Ebrahim Ghafur) సినిమాటోగ్రఫీ మరింత అమోఘంగా అమిరింది. యుద్దాలు జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యుద్ధ ధ్వంస వాతావరణాన్ని కళ్ళకు కట్టించారు. గొప్ప ఆత్మ విశ్వాసమే ఆధారంగా దృశ్యీకరించిన చిత్రమిది!
1996 నుండి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా చిత్ర నిర్మాణాల్ని నిషేధించింది. ఈసినిమా ఆఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్, జపాన్, ఐర్లాండ్, ఇరాన్ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది. తక్షణం చూడవలసిన మిరకిల్ ఈ సినిమా ! నటులే కాని తారాగణం నుండి అద్భుతమైన ప్రదర్శనలు! ఈసినిమా ఒక షాక్, ఒక విషాదం, ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, అన్నీ కలగలిపి ఒక అత్యంత అద్భుతమైన చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి!!
ఈ సినిమాకథ మహిళలపై వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం గురించి చెప్తుంది. ఒక శతాబ్దం కంటే వెనకున్న ఇటువంటి ఆలోచనలు నమ్మటం కష్టం. మహిళలకు “గౌరవం” సంగతి అటుంచి అమానుష భౌతిక, మానసిక హింసలు జీవిత కాలమంతా ఆఫ్గనిస్తాన్ లో అమలవుతున్నాయి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా ఉందీ సినిమాలో! బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని, యవ్వనాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని, తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో చూపించారు సిద్దిక్ బర్మెక్.
హృదయాన్ని కదిలించే సంఘటనలు
ప్రారంభ సన్నివేశాల్లో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే ‘నెల్సన్ మండేలా’ సూక్తితో సినిమా మొదలవుతుంది. మొదటి సీన్ లోనే పైనుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా నీలి రంగు బుర్ఖాలు ధరించిన మహిళలు గుంపులు గుంపులుగా కనిపిస్తారు.
“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”
“మేము వితంతువులం”
“మాకు పని కావాలి”
“మేము రాజకీయం చెయ్యడం లేదు”
అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు
చావుకి తెగించి మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను బాలిక తలుపు సందు గుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన దృశ్యం. తర్వాత సినిమా మొత్తం దీని కొనసాగింపుగా నడుస్తుంది!
ఇక మన ఒసామాను తాలిబాన్ కర్కోటక మతాధిపతులు పెట్టే చిత్రహింసలు, మతమౌఢ్యంతో కొట్టుకుంటున్న ఆ మూర్ఖ ప్రపంచంలో ఇరుక్కుపోయిన ఒసామా రూపంలో ఉన్న చిన్నారి బాలికను చూస్తుంటే ప్రేక్షకుల గుండెలు భయంతో బిగదీసుకుపోతాయి. ఒక్కోక్షణం గడిచేకొద్దీ ఏమవుతుందోననే ఉత్కంఠ ఊపిరి తీసుకోనివ్వదు .ప్రేక్షకులకు ఎవరికి వారికే సినిమా చూస్తున్నప్పుడు మనందరం ఆధునిక నాగరిక ప్రపంచమనుకుని నివసిస్తున్న ఈ లోకంలోని ఒక చోట స్త్రీలు-బాలికల మీద ఇంత దారుణమైన అకృత్యాలు జరుగుతున్నాయా అనే దిగ్భ్రాంతి కలుగుతుంది. స్త్రీజాతి మీద అవ్యాజమైన ప్రేమ పుట్టుకొస్తుంది. తాలిబన్ల మీద జుగుప్సా, అసహ్యం పెరిగిపోతాయి. ఈ భూమ్మీద మనుషుల మెరుగైన మనుగడ కోసం తపించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి! బాధ్యతగా ఆలోచించాలి!! పట్టించుకోవాలి!!!
ఈ చిత్ర ప్రభావం వల్ల మనం చాలా రోజుల వరకూ ప్రశాంతంగా ఉండలేం. బాగా కలవరపెడుతుంది. దాదాపు ప్రతివ్యక్తిలో ఒసామా(బిన్ లాడెన్) అంటే, కదిలించి కలతకు గురి చేసే ఒక పేరు. ఒక వృద్ధురాలితోనూ, ఒక చిన్న బిడ్డతోనూ పురుషుని తోడు లేని ఒక యువతి జీవితం ప్రమాదాలపాలు కానుందని సూచించడానికి డైరెక్టర్ ఈ పేరు పెట్టారేమోననిపిస్తుంది!
సినిమాకి మూలస్తంభం లాంటి కీలక పాత్ర “ఒసామా” ను పోషించిన ‘మెరీనా గోల్బెహార్’ కి ఇదే మొదటి సినిమా అన్నా, నటనానుభవం లేదన్నా తెగ ఆశ్చర్యపోతాం. ఆ మాటకొస్తే ఇందులోని నటీ-నట వర్గమంతా ఆఫ్గనిస్తాన్ ప్రజలే! తన బాధను స్త్రీజాతి బాధగా ఛాతీ చెప్పడంలో మేరీనా గోల్బెహార్ సఫలీకృతురాలైంది.
తాను బాలికననేదానికి గుర్తుగా ఆమె కత్తిరించిన జడలను నిలువుగా అపురూపంగా ఒక చిన్న కుండీలో పాతిపెట్టిన దృశ్యం మర్చిపోలేం. అందమైన, వెంటాడే దృశ్యాలూ చాలా ఉన్నాయి!
మానవాళికి చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చించి పరిశీలిస్తుందీ డాక్యుమెంటరీ. ఈభూమ్మీద మనుషులు ఒకరినొకరు తెలుసుకోవడానికి, చేరువకావడానికి, ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుందీ సినిమా. మనలో ఒక మనిషి చిత్రహింసల కొలిమిలో తన్నుకుంటుంటే అది మనుషులందరి హింసగా
భావించాలనే పాఠం కూడా ఉందీ చిత్రంలో.
ఈ చిత్రం అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. 13 సంవత్సరాల వయసు పైబడిన బాలల కుద్దేశింపబడిందిగానీ నిజానికిది పెద్దలందర్నీ, ఆమాటకొస్తే మనుషులందర్నీ ఆలోచించమని విజ్ఞప్తి చేస్తుంది.
ఇప్పటి మారిన పరిస్థితుల్లో తాలిబన్ల పితృస్వామిక మనస్తత్వాలలో మార్పు వస్తుందా? మహిళల స్థితిగతులు మెరుగు పడతాయా??
పాల్గొన్న పండుగలు, సాధించిన అవార్డులు
2003 లోప్రతిష్టాత్మక “AFCAE కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “కేన్స్ జూనియర్ అవార్డు” గెల్చుకుంది.
2004 లో అమెరికాలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంకేటగిరీ లో “గోల్డెన్ గ్లోబ్” సాధించింది.
2004 లో లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో సదర్లాండ్ ట్రోఫీ గెల్చుకుంది.