కంచన్ నన్నవరే వైద్య చికిత్సలో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది జ్యుడిషియల్ దర్యాప్తు మాత్రమే నిర్ణయిస్తుంది. ఒక విషయం స్పష్టంగా ఉంది: భర్తకు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా జైలు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారు. మెడికల్ బెయిల్ విషయంలో ఆమె న్యాయవాదులుగా బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది గాయత్రీ సింగ్, న్యాయవాది అంకిత్ కులకర్ణి, ట్రయల్ కోర్టులో (పూణే స్పెషల్ కోర్ట్) న్యాయవాదులు రోహన్ నహర్, రాహుల్ దేశ్ ముఖ్, పార్థ్ షా చేశారు.
—
ఎల్గర్ పరిషత్ కేసు విస్తృత, వివరణాత్మక మీడియా దృష్టిని ఆకర్శించగా, పూణే మహిళా సెంట్రల్ జైలులో అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, చివరికి ఫిబ్రవరి ప్రారంభంలో కన్నుమూసీన ఒక రాజకీయ ఖైదీ కేసు లోని కాఫ్కేస్క్ అసంబద్ధతలను (అధివాస్తవిక లేదా పీడకల పద్ధతిలో అయోమయంగా, అశాస్త్రీయంగా, సంక్లిష్టంగా ఉన్న పరిస్థితులను వివరించడానికి కాఫ్కేస్క్ అసంబద్ధత అని ఉపయోగిస్తారు. 1883 నుండి 1924 వరకు జీవించిన రచయిత ఫ్రాంజ్ కాఫ్కా పేరు నుండి కాఫ్కేస్క్ వచ్చింది) చూసి దిగ్భ్రాంతి చెందిన చాలా మంది కాలమిస్టులు దీనిని విశ్లేషించి, వ్యాఖ్యానిస్తున్నారు.
కంచన్ గాథ
కాంచన్ నన్నవరే ధీరోదాత్త కార్యకర్తలలో ఒకరు.
“అర్బన్ మావోయిస్ట్” అనే కొత్త ముద్రతో 2018 జూన్ లో నేను పూణేలోని యెరవాడ జైలుకు వచ్చినప్పుడు, ఇతర ఖైదీలు గత నాలుగు సంవత్సరాలుగా కాంచన్ అని పిలువబడే నక్సల్ ఖైదీకూడా అక్కడ ఉన్నారని నాకు చెప్పారు.
ప్రారంభంలో, ఆమె మరణశిక్ష యార్డ్‌లో వున్న ప్రత్యేక సెల్‌కు పరిమితం కావడంతో చాలా యిబ్బంది పడింది. ఆమె సెల్ కిటికీ బయట DDT చల్లడం వల్ల ఊపిరి తీసుకోవడంలో యిబ్బంది, ఉబ్బసం రావడంతో సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది, ఆ తరువాత బారక్ మార్చారు. కంచన్ ఇతరులతో కలసిమెలిసి ఉండటంతో, ఆమె అత్యంత ప్రాచుర్యం పొందిన ఖైదీలలో ఒకరు అయ్యారు, సలహాల కోసం, దరఖాస్తులు రాయించుకోడానికి యితర ఖైదీలు ఆమె దగ్గరకు వచ్చేవారు. జైలు సిబ్బంది, అధికారులు ఆమె పట్ల మృదు స్వభావాన్ని కలిగి ఉండేవారు.
మహిళలకు కేటాయించిన స్థలంలో వున్న నీటి పంపు దగ్గర, నేను మొదటి సారి కంచన్‌ను కలుసుకున్నాను. ఆమె పొట్టిగా, సన్నగా, తెల్లగా, చిన్నగా కత్తిరించిన జుట్టుతో వుండి, ముఖం మీద నిర్భయ, ప్రశ్నార్థక వ్యక్తీకరణ ఉండేది. జైలర్‌లు మమ్మల్ని మాట్లాడుకోనిచ్చేవారు కాదు, ఎప్పుడైనా మాట్లాడితే చీవాట్లు పెట్టేవారు. అందువల్ల, దురదృష్టవశాత్తు, మేము అప్పుడప్పుడు చాలా కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకోగలిగే వాళ్ళం,
కంచన్ గుండెలో ఒక రంధ్రం వుండనే విషయం కేవలం 7 లేదా 8 సంవత్సరాల వయసులోనే తెలిసినప్పటికీ, ఆమెను విద్యార్థి కార్యకర్తగా మారకుండా కానీ, మావోయిస్టులు పిలిచే ‘వృత్తిపర విప్లవకారిణి’గా కాకుండా కానీ అడ్డుకోలేకపోయింది. ఆదివాసీలు, గోవారిలతో పాటు, షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో చేరడానికి పోరాడుతున్న ‘మన’ సముదాయానికి చెందిన మహిళ కంచన్.
తండ్రి ప్రభుత్వ అధికారి కావడంతో, బలార్షా, చంద్రపూర్‌లలో లభించిన విద్యతోపాటు కంచన్‌కు కొద్దిపాటి ఇంగ్లీషు కూడా వచ్చు. ఆమె తన విద్యార్థి రోజుల నుండి పరిచయం వున్న తోటి కార్యకర్త అరుణ్ భెల్కేను వివాహం చేసుకుంది. వారి రాజకీయ విశ్వాసాలు, ఆశయం పట్ల నిబద్ధతతో పాటు, పరస్పర లోతైన ప్రేమ కంచన్‌ను ముందుకు నడిపించడానికి సహాయపడింది అని నాకన్పిస్తుంది.
కంచన్, అరుణ్‌లను మావోయిస్టులు లేదా నక్సలైట్ అనుమానితులుగా పూణేలో అరెస్టు చేశారు. ఫోర్జరీ సెక్షన్ క్రింద గరిష్టంగా నాలుగు సంవత్సరాల శిక్షను పడే కొన్ని తప్పుడు గుర్తింపు కార్డులు మినహా వారి దగ్గర ఏమీ దొరకలేదు. ఏదేమైనా, యుఎపిఎ, ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపడం, వారిని భయంకరమైన ఉగ్రవాదులుగా చూపిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒక పాత కేసులో బెయిలు దొరికిన తరువాత వారు బహూషా వేరే గుర్తింపుతో జీవిస్తున్నారు. చంద్రపూర్, ఆ చుట్టుపక్కల విద్యార్థి కార్యకర్తలను మావోయిస్టులుగా అరెస్టు చేసిన కేసు అది. రైతు ఆత్మహత్యలపై వీధి నాటక ప్రదర్శనలు , మరాఠీలో విద్యార్థి పత్రికను ప్రచురించడం, చట్టబద్ధమైన హక్కుల కోసం విద్యార్థులను సంఘటితం చేసే దేశ్‌భక్తి యువ మంచ్ అనే ప్రజాదరణ కలిగిన విద్యార్థి సంఘ సభ్యులు వారు. చాలా కాలంపాటు జైల్లో వున్న తరువాత (కంచన్ ఆసుపత్రిలో వున్నప్పుడు) ఈ కార్యకర్తలకు బెయిల్ దొరికింది. వారిలో చాలామంది “సాధారణ” జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించారు: జీవనోపాధి సంపాదించడానికి, పెళ్లి చేసుకోవడం, తల్లిదండ్రుల భావావేశ అవసరాలను తీర్చడం కోసం చేసే పోరాటంతో పాటు, కార్యకలాపాలతో సజీవ సంబంధాన్ని కలిగి వుండడానికి తాపత్రయపడ్డారు.
అనేక వ్యాధులు; సంక్లిష్టతలు
కాని కంచన్, విశాల హృదయంలో రంధ్రంతో, ధీరోదాత్త ఛాతీపై ఆపరేషన్లు చేసిన అక్షాంశ, రేఖాంశాల కోత గుర్తులతో , తన భాగస్వామితో కలిసి బయలుదేరిన రహదారిపై కొనసాగడానికి అజ్ఞాతంలోకి వెళ్ళింది.
నేను యరవాడ సెంట్రల్ జైలులో కలిసేప్పటికే రెండు గుండె ఆపరేషన్లు జరిగాయి. మూత్రపిండాలు పాడయ్యాయి, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు బలహీనమయ్యాయి. ఆమె ఉప్పు, మసాలా లేని ఆహారం , రెండు లీటర్ల నీరు మాత్రమే తీసుకోగలిగేది. ప్రారంభంలో, ఇద్దరు మరణశిక్ష నిందితులతో పాటు ఒంటరి నిర్బంధంలో ఉంచినప్పుడు వారు ఆమెను మానసికంగా హింసించారు. ఒకరి తరువాత ఒకరిని ఒక గంట సేపు తాళం వేసిన వరండాలో ఒంటరిగా కూర్చోడానికి సెల్ నుండి బయటకు తీసేవారు. ఈ బ్యారక్ మరింత సౌకర్యవంతంగా వుండి, మూలాఖత్‌లకు అనుమతి వున్నప్పటికీ కంచన్‌ను చూడడానికి వచ్చేవాళ్లు చాలా తక్కువ.
అరుణ్ అనే దళితుణ్ణి వివాహం చేసుకున్న రోజునే తండ్రి ఆమెతో బాంధవ్యాన్నితెంచుకున్నాడు. నక్సలైట్ సంబంధాల ఆరోపణలున్నాయని మీడియా ప్రచారం పెరగడంతో ఈ దంపతుల పట్ల వారి అసమ్మతి మరింత ఎక్కువైంది. ఆమెను బహిష్కరించాలని మొత్తం కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆమె పుట్టింటి నిరాదరణను, అత్తింటి ప్రేమానురాగాలు పూరించాయి. అరుణ్ కుటుంబం బలార్షా నుంచి పూణేకి దూర ప్రయాణం చేసి అప్పుడప్పుడు చూడ్డానికి వచ్చేవారు. UAPA ఖైదీ కావడంతో, కంచన్‌కు ఫోన్ చేసే అనుమతి లేదు, ఇతర ఖైదీలకు డబ్బు చెల్లించి ఫోన్ చేసే సౌకర్యం వుండింది.
ధీర సంకల్పి
న్యాయవాదులు ఆమె కోసం తీసుకువచ్చిన, జైల్లో వున్న చిన్న లైబ్రరీలోని పుస్తకాలనన్నింటినీ కంచన్ చదివేసింది, చెస్ ఆడేది, సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు రాసింది, మార్చి 8 న వేసిన నాటికలో పాల్గొంది. అప్పుడప్పుడూ ఆసుపత్రిలో చేరేది – యిలా ఆమె జైలు జీవితం గడిచింది. బారక్ వెలుపల ఉన్న పెద్ద చెట్టు క్రింద వార్తాపత్రిక చదువుతూ తరచుగా కనపడేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. మొదట కాళ్ళు, ఆ తరువాత శరీరం మొత్తం వాపు వచ్చేది. నడవడం, పడుకోవడం, నిద్రపోవడంలో ఇబ్బంది పడేది. దిండ్లకి చేరబడి ఏటవాలుగా పడుకోవాలని డాక్టర్ చెప్పినప్పుడు, జైలు సూపరింటెండెంట్ యు టి పవార్‌ను అనుమతి అడిగితే ఆయన వెంటనే, జైలు కర్మాగారంలో దిండ్లు తయారు చేయించడమే కాకుండా, కంచన్ అభ్యర్థన మేరకు ఖైదీలందరికీ కూడా పంపిణీ చేశారు.
సంక్షిప్త వివరణ
మమ్మల్ని ముంబై జైలుకి మార్చడానికి ముందు, కంచన్‌ను మా ప్రత్యేక ప్రాంగణం దగ్గర ఉన్న చిన్న హాస్పిటల్ బ్యారక్‌కు తీసుకువచ్చారు. పడుకోడానికి మంచం, సహాయానికి మనుషులను ఏర్పాటు చేశారు. అప్పటికే వైద్యులు ఆమెకు గుండె మార్పిడి చేయడం తప్ప మరో మార్గం లేదు అని చెప్పారు, కాని పూణేలోని సాసూన్ ఆసుపత్రిలో చేయలేదు.
జైలే, బెయిల్ లేదు
కొంతకాలం క్రితం, పూణే ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. విచారణ ఒక నత్త నడకలా జరుగుతోంది. ఆమె ఆసుపత్రిలో ఉన్న సుదీర్ఘ కాలంలో, యెరవాడ జైలులో ఖైదీగా వున్న ఆమె జీవన సహచరుడు అరుణ్‌కి ఒకసారి మాత్రం చూడడానికి అనుమతి దొరికింది. ఆమె అత్తమామలు కూడా వచ్చారు. తన సాధారణ ప్రభావిత ధోరణిలో కంచన్, తనను చివరిసారిగా చూడాలనుకుంటే, వెంటనే రావాలని తల్లిదండ్రులకు లేఖ రాశానని కానీ ఎలాంటి సమాధానం రాలేదు అని చెప్పింది. మేము కంచన్‌ని ఇలాంటి దయనీయ స్థితిలో వదిలి బైకుల్లా జైలుకు వచ్చాము. కరోనా విపత్తు వచ్చింది, చాలా కాలం నుండి కంచన్ గురించి ఏ సమాచారమూ తెలీలేదు.
బొంబాయి హైకోర్టులో కంచన్ బెయిల్ వాదనలు జరుగుతున్నాయని ఒక రోజు మేము పేపర్లలో చదివాము. విషమ పరిస్థితిలో వున్న ఆమెకు వెంటనే బెయిల్ మంజూరు చేయడానికి బదులుగా కోర్టు ‘గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లను జైలులో ఎలా నిర్వహిస్తారు’ అని ప్రశ్నించింది. సుదీర్ఘ విచారణల తరువాత కూడా, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ల కోసం పూణేలో వున్న ఆర్మీ ఆసుపత్రికా లేక వేరే ఏదైనా ఆసుపత్రికి పంపించాలా అని హైకోర్టు నిర్ణయించలేకపోయింది.
ఈ సంవత్సరం జనవరి 12 న, కంచన్ తీవ్ర తలనొప్పి, ఊపిరాడకపోవడం గురించి ఫిర్యాదు చేసినట్లు మాకు తరువాత తెలిసింది. సాసూన్ ఆసుపత్రికి తరలిస్తే, అక్కడ మెదడులో ఒక గడ్డ కనబడింది. ఐదు రోజుల తరువాత జనవరి 19న అరుణ్‌కు ఈ సమాచారం తెలియచేసారు. 19, 20 తేదీల్లో ఆమెను చూడటానికి తనను తీసుకెళ్తారని అరుణ్ ఎదురు చూశాడు. కానీ అతని సమ్మతి సంతకం తీసుకోకుండా, భార్యను చూడటానికి అనుమతించకుండానే, కంచన్ మెదడు శస్త్రచికిత్స జరిగింది, తత్ఫలితంగా, సాసూన్ హాస్పిటల్ ఐసియులో మరణించింది. ఆమె వయస్సు కేవలం 37 సంవత్సరాలు.
కంచన్‌కు బెయిల్ మంజూరు చేయకపోవడానికి కారణం ఏమిటి? తన శరీరంలోని ప్రతి అవయవమూ దెబ్బతిని, శిథిలమై పోయి బలహీనంగా వున్న ఒక ఆదివాసీ యువతిని వదిలిపెడితే దేశానికి అంతా ప్రమాదమా? రాజ్యం ఎందుకని అంతగా భయపడిపోతోంది? జి.ఎన్. సాయిబాబా 90% వికలాంగుడు, 19 అదనపు వ్యాధులతో వున్న సాయిబాబాకు పదేపదే బెయిల్ ఎందుకు నిరాకరించబడింది?
మావోయిస్టు ఖైదీలను పక్కన పెడితే, ఇతర విచారణా ఖైదీలకు కూడా వైద్యపరమైన కారణాలపై బెయిల్ దొరకడం చాలా కష్టం అని నా పరిశీలన.
ఒక ఎన్‌డిపిఎస్ (గంజాయి వగైరా) నిందితురాలు సంవత్సరానికి పైగా తీవ్రమైన స్త్రీ జననేంద్రియ వ్యాధితో బాధపడుతున్నది. చివరికి గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్నది, కాని బెయిల్ మాత్రం దొరకలేదు. మరొక ఖైదీకి మూర్ఛ వచ్చి, అది సాధారణ నిద్ర- మేల్కొవడంలాగా గంటల తరబడి అర్ధ స్పృహ స్థితిలో వుంటుంది. ఆమెకు జైల్లో క్రమం తప్పకుండా మందులు ఇస్తారు, కాని బెయిల్ రాదు.
కరోనా విపత్తు సమయంలో, హత్యా నేర నిందితుల్లో చాలామందికి మధ్యంతర బెయిల్ వచ్చింది, కానీ తీవ్రమైన వ్యాధులున్నవారికి రాలేదు. టి.బి., హెచ్‌ఐవి లేదా ఇతర సహ-అనారోగ్యాలతో నుండి బాధపడుతున్న చాలా మందికి రాలేదు. కటకటాల వెనుక ఉన్నవారి దృష్టిలో బెయిల్ అనేది ఒక జూదం లేదా లాటరీ. న్యాయమూర్తుల వ్యక్తిగత భావాలు, తప్పుదోవ పట్టించే దర్యాప్తు, వక్రీకృత చార్జిషీట్లు, లంచం యివ్వడం, యివ్వక పోవడం మొదలైనవన్నీ ఈ జూదంలో ఉన్న ఖైదీల “అదృష్టం”ని నిర్ణయిస్తాయి. సమీప కుటుంబ సభ్యులు చనిపోయిన సమాచారాన్ని ఖైదీలకు ఇవ్వరు: “ఒకవేళ వారు కలత చెందితే !” కోర్టు ఉత్తర్వు లేకుండా, చివరి కర్మల కోసం వారిని (పోలీసు అదుపు లోకి ) తీసుకెళ్లలేరు. తమ ప్రియమైనవారి బాధలను, కష్టాలను మళ్ళీ మళ్ళీ ఊహించుకొనే స్వేచ్ఛా మనస్సుతో, సంకేళ్లలో బందీలుగా కూచుని వుంటారు.
ఒక కఠోర, అమానవీయ న్యాయ వ్యవస్థ తన శక్తిని చూసుకొని మూసుముసిగా నవ్వుకొంటుంది.
భీమా కొరెగావ్ కేసులో వున్న 16 మందిలో లో షోమా సేన్ ఒకరు. 2018 జూన్ 6న నాగ్‌పూర్‌లోని ఇంటి నుండి అరెస్టు చేసినప్పుడు, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలోని ఇంగ్లీష్ విభాగానికి అధిపతిగా పదవీ విరమణ కోసం కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆమె సుప్రసిద్ధ పౌర హక్కుల ప్రతినిధి, మహిళా హక్కుల మేధావి, కార్యకర్త. ఆమె గ్లాకోమా, రక్తపోటు, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, తీవ్రమైన ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మందులు సూచించబడ్డాడు. కరోనా సమయంలో వైద్య బెయిల్ కోసం వేసిన దరఖాస్తును ముంబైలోని ఎన్ఐఏ కోర్టు రెండుసార్లు తిరస్కరించింది. (ఇందులో వ్యక్తీకరించిన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి.)
అనువాదం : కె.పద్మ