బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఘటనా స్థలం నుంచి ఎల్‌ఎమ్‌జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయి నివేదిక కూడా చేశాం.. మీరు మా గత నివేదికలు చూడవచ్చు.

ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సందేహాలు తలెత్తుతున్నాయి, పోలీసుల వ్యవహార శైలి, వారి వాదనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలు ఏమిటి, ఆరోపణలు ఏమిటి అనేది ఈ నివేదికలో చూద్దాం.

నమస్కారం, నేను ముఖేష్ చంద్రాకర్; మీరు బస్తర్ జంక్షన్ చూస్తున్నారు.

ఈ రోజు మనం 2024 ఏప్రిల్ 2 నాడు జరిగిన ఎన్‌కౌంటర్ గురించి చర్చిద్దాం. ఈ ఎన్‌కౌంటర్ జాతీయ స్థాయిలో చర్చకు రావడానికి కారణం చాలా కాలం తర్వాత, టిసిఒసి నెలలో, లోక్‌సభ ఎన్నికలకు ముందు, 13 మంది మావోయిస్టులను చంపేశామని పోలీసులు అంటున్నారు. మొత్తం 13 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, వారి గుర్తింపు కూడా జరిగింది. పోలీసుల వాదన ప్రకారం, మరణించిన 13 మంది పిఎల్‌జిఎ ప్లాటూన్ నంబర్ 2లో క్రియాశీల సభ్యులు. ఎల్‌ఎమ్‌జివంటి ఆటోమేటిక్ ఆయుధాలు, ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

పాపారావు వంటి సీనియర్ నక్సలైట్ నాయకుడి ఆధ్వర్యంలో గంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలీ అడవుల్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించబోతున్నారని సమాచారం తెలియడంతో సుమారు 1000 నుండి 1200 సిఆర్‌పిఎఫ్, కోబ్రా, డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్ బలగాలు ఏప్రిల్ 1 సాయంత్రం, కోర్చోలి ప్రాంతం వైపు వెళ్ళాయి, ఏప్రిల్ 2వ తేదీ తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి

ఈ ఎన్‌కౌంటర్ జరిగిన నాలుగైదు రోజుల తర్వాత, ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి, పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు ఏమిటో చూద్దాం.

బేలా భాటియా జీ మాతో ఉన్నారు, ఒక సీనియర్ సామాజిక కార్యకర్త, న్యాయవాది కూడా. ఇటువంటి కేసులలో ఆదివాసీల పక్షాన ఆమె ఎప్పుడూ వాదిస్తూ వుంటారు.. ఆదివాసీల కోసం పోరాడుతూనే ఉన్నారు.

ముఖేష్: బేలా జీ, మీరు సంఘటన స్థలానికి వెళ్లారు, అక్కడ సుమారు రెండు రోజులు ఉన్నారు, వాస్తవాలను దర్యాఫ్తు చేసారు, మీకు తెలిసిన విషయాలు ఏమిటి?

బేలా భాటియా: కొచోలిలో అడుగడుగునా తిరిగాం. నీంద్రాలో కూడా పూర్తిగా తిరిగాను. నేను చేసిన దర్యాప్తు ఆధారంగా తెలిసింది ఏమిటంటే, కొండ మీద ఎన్‌కౌంటర్ జరిగింది, అందులో చనిపోయిన ముగ్గురు వ్యక్తులు నిజమైన మావోయిస్టులు, అంటే యూనిఫాంలో ఉన్నారు, ఆయుధాలతో వున్నారు, ఎన్‌కౌంటర్ జరిగింది. ప్రజలు తమకు తెలిసిన వారి పేర్లు కూడా చెప్పారు. దూలా, సోను మరొకరు రీనా. వాళ్ళు ఏ వూరి వాళ్ళో తెలియదు. వారి గురించి ఇంకేమీ తెలీదు అని వాళ్ళు నాకు చెప్పారు.

అంతే కాకుండా, యూనిఫాం లేకుండా, ఆయుధాలు లేని మరో ఐదుగురు మావోయిస్టులు అక్కడ ఉన్నారని, వారు ఆ కొండ దిగి పారిపోయారని, అక్కడ నుండి తప్పించుకోవడంలో సఫలమయ్యారని తెలిసింది. కొండ దిగువన, వాగు ఒడ్డున వున్న కోర్చోలి గ్రామంలోని రెండు ఇళ్లలోకి వెళ్లారని, ముగ్గురు ఒక ఇంట్లోకి, ఇద్దరు మరో ఇంట్లోకి వెళ్లారని నాకు తెలిసింది. ముగ్గురు వెళ్ళిన ఇంట్లో వుండే ఒక తల్లి, ఆమె మైనర్ కుమార్తె, మహువా పంటకాలం కావడంతో బయటకు వెళ్లారు. ఆ ముగ్గురు ఇంటికి వెనుకవైపు నుండి లోపలికి వచ్చి లోపల వున్న ఒక గదిలో దాక్కున్నారు. ఈ గదిలో ఇంటివాళ్లు తమ ధాన్యంలాంటి వాటిని నిలువ చేసుకొంటారు.

ఈ తల్లీ కూతురూ ఇంటికి తిరిగి వచ్చి పెరట్లో తమ పని చేసుకుంటున్నారు, వరి నూర్పిడి, చింతపండు తీయడం లాంటి పనులు చేసుకుంటుంటే, ఒక్కసారిగా పోలీసులు, భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని, అన్ని చోట్లా వెతకడం మొదలు పెట్టారు, ఆ రోజు నీంద్ర, కోర్చోలిలలో చాలా బలగాలు వున్నాయి, అంటే, సల్వా జుడుమ్ కాలం తరువాత ఇక్కడ అంత పెద్ద సంఖ్యలో బలగాలను ఎప్పుడూ చూడలేదని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎక్కడ చూసినా భద్రతా బలగాలే వున్నాయి. మూత్ర విసర్జనకు కూడా బయటకు వెళ్లలేకపోయామని మహిళలు చెబుతున్నారు, ప్రతి ఒక్క ఇంట్లోకి దూరి ప్రతిచోటా వెతికారు. లోపల దాక్కున్న ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు.

ఆ తర్వాత ఆ ముగ్గురి చేతులను వెనుకకు కట్టేసి తమతో పాటు తీసుకెళ్ళారు. వారిలో ఉన్న ఒక అమ్మాయిని ఈ ఇంటికి దగ్గరలోనే, అంటే ఈ ఇంట్లో వున్నవారికి కనబడేంత దూరంలోనే, తీసుకెళ్లి కాల్చి చంపేసారు. మీరు అక్కడికి యిప్పుడు వెళ్ళినా రక్తపు మరక కనిపిస్తుంది. అక్కడ ఆకులు వేసి, కాల్చి ఆ రక్తపు మరకను తొలగించడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇప్పుడు అక్కడ ఆకులు, వాటి బూడిద కనిపిస్తున్నాయి. రక్తపు మరకను దాచిపెట్టాలని ప్రయత్నించారు కానీ యిప్పటికీ కొంత మరక కనిపిస్తోంది. ఆ అమ్మాయికి అలా జరిగింది. ఇక మిగిలిన ఇద్దరు అబ్బాయిలు నిక్కర్లు(షార్ట్), టీ-షర్టులు వేసుకుని వున్నారు. యూనిఫాం వేసుకోలేదు, వారి దగ్గర ఆయుధాలు లేవు.

బాలికను చంపేసిన ప్రదేశం నుండి మరో 10-15 నిమిషాలు దూరం నడిచి వెళ్తే అక్కడ కొన్ని గుంతలు, చెట్లు వున్న ప్రదేశం వుంది. అక్కడ ఇద్దరిని చంపేశారు. అక్కడ ఈ నాటికీ పెద్ద రక్తపు మరక ఉంది. అక్కడ కూడా ఆ మరకను దాచడానికి ఆకులు వేసి కాల్చినట్లు కనిపిస్తోంది, కానీ దాచలేకపోయారు, అంటే యిప్పటికీ అక్కడ ఇంకా చాలా రక్తం పడి ఉంది. అక్కడ వున్న కొన్ని చెట్ల మీద ఇప్పటికీ తుపాకీ గుళ్ళ గుర్తులు కనిపిస్తున్నాయి. అక్కడ మమ్మల్ని చూసిన ఒక మహిళ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొంత ముందుకు తీసుకెళ్ళి మరొక స్థలాన్ని చూపించింది. అక్కడ కూడా ఒక గొయ్యి లాగా వుంది. అక్కడ ఒక మహిళను దుస్తులు విప్పేసి నగ్నంగా చేసి కాల్పులు జరపడాన్ని తన ఇంటి దగ్గర నుండి చూశానని చెప్పింది. ఆమె స్వయంగా చూసింది, ఆ ప్రాంతాన్ని మాకు చూపించింది.

కొండ మీద నుండి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు దాక్కున్న ఇంట్లోకి మేం వెళ్లలేక పోయాం. అంటే ఆ ఇల్లు మరి కొంత దూరంగా వుండడంతో వారితో మాట్లాడలేకపోయాం. కానీ, వారిని కూడా పొలంలోకి తీసుకెళ్లి చంపేశారు అని మాకు తెలిసింది. ఇదీ ఆ అయిదుగురికి సంబంధించి…

ఇంతే కాకుండా, ఆ రోజు నేంద్ర గ్రామంలోని ఒక ఇంట్లోకి బలగాలు దౌర్జన్యంగా ప్రవేశించాయి, ఆ ఇంట్లో కమ్లీ కుంజం అనే 12-13 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆ రోజు మంగళవారం. క్రితం రోజు అంటే సోమవారం అక్కడ జరిగిన జాతరలో ఎప్పటిలాగే యువతీ యువకులంతా కలిసి పాటలు పాడారు, డ్యాన్స్ చేసారు. కమ్లీ కూడా అక్కడికి వెల్లివచ్చింది. అలసిపోయి, ఇంట్లో నిద్రపోతోంది. ఈరోజుల్లో ఎక్కడ చూసినా చాలా ఎండగా ఉంది. ఆమెకి కాస్త వంట్లో బాగా లేదు. జ్వరంగా ఉంది, అందుకే పెరట్లో పడుకుంది.

ముఖేష్:: కొండ క్రింద ఉన్న ఇల్లు కదా.

బేలా భాటియా: అవును, అదే ఇల్లు. ఆమె తల్లి, నానమ్మ కూడా దగ్గరలోనే ఉన్నారు. హఠాత్తుగా బలగాలు ఇంట్లోకి ప్రవేశించాయి, అక్కడ మేము విరిగిన కంచెను కూడా చూశాము. ఒంటరిగా వున్న కమ్లిని బలగాలు ఎత్తుకెళ్తుంటే, అంతలోనే అక్కడికి వచ్చిన తల్లి, నానమ్మలు మా కూతుర్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అని వాళ్ళతో చాలా గొడవపడ్డారు. అయినా వాళ్ళు కమ్లిని ఎత్తుకెళ్ళి పోయారు. వాళ్ళు ఆమెని ఏ దారిలో తీసుకువెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారో ఆ తల్లి మాకు చూపించింది. పోలీసులు వెళ్లిన తర్వాత చూస్తే అక్కడ కమ్లీ చేతికుండిన గాజు దొరికింది. దాంతో తమ కూతురిపై అత్యాచారం జరిపారని, ఆ తరువాత తీసుకెళ్లిపోయి వుంటారని ఊహించింది. తర్వాత తెలిసింది తన కూతురి హత్య కూడా జరిగిపోయిందని. 5వ తేదీన బీజాపూర్‌లోని ఆసుపత్రిలో తన కుమార్తె మృతదేహాన్ని తీసుకోవడానికి వెళ్లింది. మృతదేహం స్థితి ఎంత ఘోరంగా కుళ్లిపోయిందంటే వారు తమ బిడ్డని ఏ మాత్రం గుర్తు పట్టలేకపోయారు. కత్తిగాట్లతో మెడ పూర్తిగా తెగిపోయింది, మెడలో వున్న కంటే వల్లనే ఆమె తన కూతురిని గుర్తించగలిగింది. అదే నేంద్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డీఆర్‌జీ కావడంతో అతను కుమార్తె మృతదేహం అదే అని తల్లికి చెప్పాడు. అంటే ఆ మృతదేహం తన కుమార్తెను తల్లి కూడా గుర్తించలేని విధంగా ఉంది. పోలీసులు తయారు చేసిన 13 మంది జాబితాలో కమ్లీ కుంజమ్‌ పేరు కూడా మీకు కనిపిస్తుంది.

అదే 13 మంది జాబితాలో, మీకు మరొక పేరు కనిపిస్తుంది, అది చేతుది. చేతుది కొచోలి గ్రామం, మీరు అతని ఇంటికి వెళితే మీకు అతని పదేళ్ల పెద్ద కొడుకు కనిపిస్తాడు. బాబు పేరు కమలేష్. అతనికి ఆరుగురు పిల్లలు ఉన్నారు, అందరి కంటే చిన్నది తల్లి ఒడిలో ఉంది. చేతు ఆరుగురు పిల్లలకు తండ్రి. ఉదయం మహువ సేకరణకు వెళ్ళాడు. తాను ముందు వెళ్తానని, పిల్లలకు అన్నం వండి పెట్టి రమ్మని భార్యకు చెప్పాడు. ఆ తరువాత చేతు ఏమైపోయాడో అతని భార్యకు తెలియక పోవడంతో అతని కోసం వెతుకుతోంది. అతన్ని చంపేశారని ఆమెకు తరువాత తెలుస్తుంది. అదే విధంగా, వారిలో దూలా అనే మరో వ్యక్తి ఉన్నాడు.13 మంది జాబితాలో దూలా పేరు కూడా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ దూలా కోర్చోలి పక్కనే ఉన్న గ్రామం సబ్నార్‌కు చెందినవాడు. అతను అక్కడి నుండి వచ్చాడు, కాబట్టి ఈ విధంగా వారిలో ముగ్గురు వ్యక్తులు గ్రామస్తులు ఉన్నారు, ఒక బాలికపై అత్యాచారం చేసి హత్య చేసారు.

ముఖేష్: ఆ మూగ అమ్మాయి

బేలా భాటియా: అవును. మూగ అమ్మాయి, మైనర్ కూడా, 12-13 సంవత్సరాల వయస్సు మాత్రమే. ఇది కాకుండా, కనీసం ఐదు, లేదా ఆరు మంది ఉండవచ్చు ఎందుకంటే వారు దుస్తులు విప్పేసి నగ్నం చేసిన మహిళను కూడా లెక్కించినట్లయితే, వారు ఆరుగురు ఉన్నారు. మావోయిస్టు ఆర్గనైజేషన్‌ సంబంధం వున్నవాళ్లు .. కానీ యూనిఫారం లేకుండా, ఆయుధాలు లేకుండా, పారిపోయి కిందకు వచ్చి, దాక్కున్న వాళ్ళను, ఇళ్ల నుంచి బయటకు లాగి చంపేశారు. అంతే కాకుండా ఆ రోజు నీంద్రా గ్రామానికి వచ్చిన బలగాలు ఎనిమిది మందిని వారి ఇళ్ల నుండి తీసుకెళ్ళాయి.

ముఖేష్:, మేము మా మునుపటి నివేదికలో కూడా గ్రామస్థులైన ఎనిమిది నుండి 10 మంది వరకు తప్పిపోయినట్లు గ్రామస్థులు మాతో చెప్పారు.

బేలా భాటియా: వాళ్ళు కనబడకుండా పోయారు. మా వాళ్ళు మాయమైపోయారని ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు.. వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళలో ఒక అమ్మాయి, మైనర్ బాలిక, వీరి ఇంట్లో ఆ ముగ్గురు వ్యక్తులు దాక్కున్నారు, ఆమె వయస్సు కేవలం 12 ఏళ్లు.. ఆ అమ్మాయిని ఈరోజు వదిలేశారు.. ఆమె కాకుండా ఇంకా ఎంత మంది ఉన్నారు?

ముఖేష్: మొత్తం ఎనిమిది మంది

బేలా భాటియా:  అవును మొత్తం ఎనిమిది మంది వున్నారు. అంటే ఆ అమ్మాయితో కలిపి ఈ రోజు ఐదుగురిని వదిలేశారు. అంటే రెండవ తేదీన తీసుకెళ్లిన వాళ్ళని ఈ రోజు ఎనిమిదో తేదీన వదిలారు. వదిలిన వారిలో మైనర్ అమ్మాయి పేరు నేను చెప్పను. ఎనిమిదిమందిలో ఐదుగురిని వదిలారు. మిగిలిన ముగ్గురు ఇంకా పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చూపించారు మరో వ్యక్తి ఆచూకీ లేదు.

ముఖేష్: పోలీసులు ఏమంటున్నారు.. పోలీసులను కలిశారా?

బేలా భాటియా: అవును, పోలీసులను కలిశాను. సాయంత్రం 5:00 గంటలకు చెబుతాము అన్నారు. అంతకంటే ముందు పత్రికా ప్రకటన చేస్తాము. అది చూడమన్నారు.

నీంద్రా గ్రామానికి చెందిన సుక్కు లేదా చుక్కు కుంజం (తండ్రి బాస్కో) ఉన్నాడు. అతను కోర్చోలి వైపు పారిపోయి, ఎవరి ఇంట్లోనో నీళ్ళు తాగుతుంటే, అతన్ని బలగాలు ఎత్తుకెళ్ళాయి, ఇప్పటి వరకు ఇది సుక్కు కుంజం, సుక్కు కావచ్చు లేదా చుక్కు కావచ్చు, పలకడంలో తేడా వుంటుంది. చుక్కు (తండ్రి బాస్కో) కనబడడం లేదు. అదే పేరుతో మరొకతను సుక్కు కుంజం (తండ్రి మాసా) తో పాటు మరో ఇద్దరు కూడా విడుదలయ్యారు, ఎందుకంటే ఆ వ్యక్తులు పూజారులు. వారు పూజారులు కావడం వల్లనే వదిలేశారు అని ఒక డి‌ఆర్‌జి చెప్పాడు. ప్రతి గ్రామం నుంచి ఒక డి‌ఆర్‌జి వుండడు, లేదా ప్రతి ఒక్క డి‌ఆర్‌జికి మనకు సమాచారం యిచ్చే మంచితనం వుండదు. ఈ డి‌ఆర్‌జి చెప్పాడు కాబట్టి సరిపోయింది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన విషయం కదా “మీరు ఎనిమిది మందిని తీసుకెళ్లిపోతారు. సుద్రుని అరెస్టు చేసినట్లు చూపిస్తున్నారు, అతనికి 25 సంవత్సరాలు. చేతు కుంజమ్‌ని కూడా అరెస్టు చేసినట్లు చూపిస్తున్నారు, అతనికి 20 సంవత్సరాలు. అంటే ఇక్కడ యువకుడిగా ఉండటం ఒక నేరమై పోయింది.

ముఖేష్: బస్తర్‌లో పుట్టిన ప్రతి ఒక్కరు ఆదివాసీనే .. ఎందుకంటే ప్రతి రోజూ ఎవరో ఒకరిని చంపేస్తున్నారు.. సరే మేడమ్.. మళ్లీ ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడదాం. 13 మందిలో ఆరుగురిని చంపేశారని మీరు చెబుతున్నారు.. ఈ ఆరుగురు ఎన్‌కౌంటర్ సమయంలో కొండ పైనుంచి దిగివస్తున్నారు, వారి దగ్గర ఆయుధాలు కూడా లేవు, పెళ్లి బట్టలు వేసుకుని వున్నారు, వాళ్ళు నక్సలైట్లతో సంబంధం వున్నవాళ్లు అని అంటున్నారు.. ఈ విషయాన్ని మీరు యింత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?

బేలా భాటియా:  ఊరి వాళ్ళు చెప్పే మాటల ఆధారంగా మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళెవరూ ఈ గ్రామం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ముగ్గురు ఆ యింట్లో దాక్కున్నారు. వాళ్లెవరో కొందరు గ్రామస్థులకు తెలియదు.

ముఖేష్: మేడమ్, గ్రామస్థులకు తెలియనప్పుడు, నక్సలైట్లకు సంబంధించినవాళ్లు అని ఎలా చెప్పగలరు?

బేలా భాటియా : ఆ రోజు కొండపైన ఎన్‌కౌంటర్ జరుగుతుంది, వారు అటువైపు నుంచే కొండ క్రిందకి వచ్చి దాక్కున్నారు. కాబట్టి వారు మావోయిస్టులతో పాటు ఉన్నారని గ్రామ ప్రజలు అంచనా వేసారు. వీరంతా కలిసి దళంలో ఉండి ఉండాలి, వారి వద్ద ఆయుధాలు లేవు, యూనిఫాంలో కూడా లేరు. దళం నిబంధనల ప్రకారం, వారు దళ జీవితంలో ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తి చేయకపోతే వారికి యూనిఫాం, ఆయుధాలు కూడా ఇవ్వరు. ఇది గ్రామస్తుల ఒక అంచనా…

ముఖేష్: మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజినల్ బ్యూరో ప్రతినిధి ప్రతాప్ ఈరోజు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో కోర్చోలిలో 13 మందిని చంపేశారు అని వ్రాసారు. కానీ అందులో ఈ 13 మంది నక్సలైట్లా లేక గ్రామస్తులా అనేది వ్రాయలేదు.

బేలా భాటియా :  అందుకనే ప్రజలు అనేది వారు నేంద్ర గ్రామానికి లేదా కుచిలీ గ్రామానికి కానీ చెందిన వారు కాదు, కానీ వారందరూ ఆదివాసీలే, అందుకని వీళ్ళు లోపలివాళ్లతో వుండచ్చు, ఆ రోజు కూడా దళంతో ఉండి ఉండాలి అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. వాళ్ళు అక్కడినుంచే కిందికి వచ్చారు. యూనిఫాం, ఆయుధాలు లేవు కాబట్టి వారు క్రిందికి వచ్చారు. ఈ వ్యక్తులు దళంలో ఉండి ఉండవచ్చు, కొత్తగా చేరిన సభ్యులు అయి వుండచ్చు, అందుకనే వాళ్ళకి యింతవరకు మావోయిస్టులు యూనిఫాం, ఆయుధాలను ఇంకా ఇవ్వలేదని వారు అనుకుంటున్నారు.

ముఖేష్: ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఈ 13 మందిలో ఆరుగురు నక్సల్ సభ్యులు. ముగ్గురిని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి చంపేశారు, అయితే వారిని అదుపులోకి తీసుకున్నప్పుడు, వారిని అరెస్టు చేయాలి. ఆరుగురు+ ముగ్గురు అంటే తొమ్మిది మంది. మిగిలిన నలుగురు.. నిర్దోషులైన ఆదివాసీలు

బేలా భాటియా : ప్రస్తుతం ఉన్న నలుగురిలో ముగ్గురి గురించి తెలిసింది, ఒక్కరి గురించి తెలియలేదు, అంటే కమ్లీ అనే అమ్మాయి, చేతు, దూలల గురించి తెలిసింది. నాల్గవ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఇది కాకుండా నేను చెప్పదలచుకున్నదేమంటే , ఆ రోజు ఎంత అధికంగా పోలీసు బలగాలు వున్నాయంటే చాలా మంది ప్రజలు భయంతో పారిపోయారు, అందులో మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు పప్పు, పప్పు పదం, అతను కుచిలీకి చెందినవాడు, అతను అనారోగ్యంతో ఉన్నాడు.

ముఖేష్: అతని కథ నేను చేసాను.

బేలా భాటియా: అవును మీరు నివేదిక చేసారు. అతని పేరు ప్రభుత్వానికి తెలియదు, పోలీసులకు తెలియదు, లేకుంటే అతన్ని కూడా నక్సలైట్‌ అని ప్రకటిస్తారు. అనారోగ్యంతో ఉన్నాడుకూడా, పారిపోయి ఎక్కడో గొయ్యిలో పడి చనిపోయాడు

ముఖేష్: సరే, ఇప్పుడు ఈ మొత్తం విషయంలో కోర్టుకు వెళ్తారా?

బేలా భాటియా: ప్రస్తుతం, న్యాయం కోసం, ఆ ప్రత్యామ్నాయం మాత్రమే ఉంది వేరే ఏమీ లేదు, అంటే, న్యాయ కమిషన్ ఉండాలి, విచారణ ఉండాలి, దాని కోసం డిమాండ్ ఉండాలి, అంటే రాజ్యం నిర్ణయం తీసుకోవాలి. ఏ కమీషన్ అయినా కావచ్చు ఎస్టీ కమిషన్ ఉంది, ఎన్‌హెచ్‌ఆర్‌సి ఉంది, ఇందులో మహిళల సమస్య కూడా ఉంది, కాబట్టి మహిళా కమిషన్ వారు కూడా దీనిపై విచారణ జరపాలి. మనం వీరందరినీ డిమాండ్ చేయాలి.

ముఖేష్: ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారా? మీరు ఈ కమీషన్లకు లేఖలు వ్రాస్తారా?

బేలా: తప్పకుండా రాస్తాను.

ముఖేష్: బేలా భాటియా జీ చివరి ప్రశ్న. బెలా భాటియా వైట్ కాలర్ నక్సల్ అని, సైనికుల బలిదానంపై ఒక్క మాట కూడా మాట్లాడరు అని మా ఛానెల్‌లో ఒకరు వ్యాఖ్యానించారు. మితవాదులు కూడా మీపై ఆ ఆరోప‌ణ‌ చేస్తున్నారు. మీ సమాధానం ఏమిటి?

బేలా భాటియా : చూడండి, నాకు వైట్ కాలర్ అంటే ఏంటో తెలీదు. వైట్ కాలర్ నక్సల్ అంటే అర్థం ఏమిటో తెలియదు. నేను కేవలం ఒక పౌరురాలిలాగా నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఎవరైనా ఒక సైనికుడు లేదా పోలీసు చనిపోయాడు అంటే అతను ఒక డ్యూటీ చేస్తున్నాడు, అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. అతని కోసం ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అంటే, ప్రభుత్వం అతని సమస్యలన్నింటినీ బాధ్యతతో పరిష్కరిస్తుంది. ఎవరైనా సరే ప్రతి మనిషి జీవితం పట్ల నా సానుభూతి వుంటుంది. మేము కూడా వారి పట్ల సానుభూతి చూపుతాము.

కానీ నేను ఎవరి విషయం విచారణ చేస్తాను? ఎవరు ఎక్కువ కష్టాల్లో ఉన్నారో, ఎవరి గురించి అయితే ఎవరూ మాట్లాడరో, వారితో నేను మాట్లాడతాను. విషయాలు తెలుసుకుంటాను. నా సానుభూతి ప్రతి మనిషి పట్లా వుంటుంది. అతను లేదా ఆమె ఎవరైనా సరే, ఎవరి నిజం బయటపడదో వారి పక్షాన నేను నిలబడతాను. కాబట్టి ఎవరి మనసులోనైనా నేను సైనికుల కోసం మాట్లాడను అని అనుకుంటే అది సరి కాదు. ఇక్కడ జరగుతున్న యుద్ధం ఆగిపోవాలని నేను పదే పదే చెబుతున్నాను. ఈ యుద్ధంలోకి , పోలీసులను, సైనికులను నెట్టడాన్ని, వారి జీవితాలు ఇలా ప్రమాదంలో పడకుండా ఉండటానికి ఈ యుద్ధం ముగియాలని నేను చెప్తున్నాను.

ముఖేష్ : బస్తర్‌లో శాంతి నెలకొల్పాలని మనమందరం కోరుకుంటున్నాం. ఈ యుద్ధానికి పూర్తిగా స్వస్తి పలకాలి, ఈ విధంగా ప్రజలను చంపకూడదు, సైనికులు వీరమరణం పొందకూడదు, ఇలాంటి ఎన్‌కౌంటర్‌లు జరుగుతూనే ఉంటాయి. తరచుగా ఈ ఎన్‌కౌంటర్లపై ప్రశ్నలు ఉంటాయి. సైనికులపై కూడా సందేహాలు లేవనెత్తారు. ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు బీజాపూర్‌కు చెందిన ఏకైక ఆదివాసీ మహిళా జర్నలిస్టు పుష్పాదీదీ మన దగ్గర ఉన్నారు. ఆ 13 మంది నక్సలైట్ల మృతదేహాలను బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆమె కూడా కవరేజ్ కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడ కొంతమంది సైనికుల సంభాషణను విన్నాయనని చెబుతున్న పుష్పాదీదీని కూడా ఈ నివేదికలో చేర్చాలి అనుకున్నాను.

దీదీ, మీరు ఏమి విన్నారు? సైనికులు ఏం మాట్లాడుతున్నారు?

పుష్ప: మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులంతా వచ్చేసరికి నేనూ అక్కడే ఉన్నాను, మంగ్లీ అమ్మతో పాటు మరికొందరు కూడా వచ్చారు. మంగ్లీ కాదు క్షమించండి కమ్లి. మూగ అమ్మాయి. వారందరూ మృతదేహాన్ని చూసి, ఇది మా బిడ్డ కాదు అన్నారు.

అప్పుడు వెంటనే ఒక జవాన్ లేదు, లేదు, ఇది మీ బిడ్డనే, మీరు తీసుకెళ్ళాల్సి ఉంటుంది అని అనడం ప్రారంభించాడు. అతను డి‌ఆర్‌జి జవాన్. అంటే చాలా నమ్మకంతో చెబుతున్నాడు. కానీ తల్లి, యింత ఛిద్రమైన శరీరంతో వున్న పిల్ల నాది కాదు అని అంటోంది. నా బిడ్డకి వినపడదు, మాట్లాడలేదు. బులెట్ ఎలా తగిలింది. మీరు యింటినుంచి తీసుకెళ్లారు, మీరు ఆమెకి చికిత్స చేయిస్తాం, మందులు యిప్పిస్తాం అని ఇంట్లో నుండి తీసుకెళ్లారు, ఈ శరీరం ఆమెది ఎలా అవుతుంది? అని ప్రశ్నిస్తోంది. అది మీ అమ్మాయే మీరు తీసుకెళ్ళాల్సిందే అని జవాన్లు అంటున్నారు. నాకు విచిత్రంగా అనిపించింది. చాలా బాధగా కూడా అనిపించింది.

ముఖేష్: ఆమెకు వినబడదు, సరిగ్గా మాట్లాడలేదు కదా.

పుష్ప: అస్సలు మాట్లాడలేదు

ముఖేష్: పుట్టుకతోనే వినలేదు, మాట్లాడలేదు

పుష్ప: లేదు, ఆమెకి వినపడదు అని, మాట్లాడలేదని గ్రామస్తులు చెప్పారు. నిద్రపోతున్న ఆమె జ్వరంతో వుందనీ, ఆమెకు మందులు, బట్టలు యిప్పించడానికే ఆమెను తీసుకువెళుతున్నాము, అనారోగ్యంతో ఇక్కడ ఎలా వుంటుంది అని సైనికులు గ్రామస్తులతో చెప్పి తీసుకెళ్లిపోయారు. తమ కూతురు కనిపించకపోవడంతో వారు ఆసుపత్రికి వచ్చారు. చనిపోయినవారు ఎవరి పిల్లలు, వారి పేర్లు ఏమిటి అని అడుగుతున్నాం. అప్పుడు వాళ్ళు తమ కూతురు కనబడడం లేదు, ఆమె బతికే ఉందో లేక చనిపోయిందో తెలియడం లేదు అన్నారు. చనిపోయింది ఎవరో ధృవీకరణ కాలేదు. కాబట్టి గ్రామస్తులు వెళ్ళిపోయారు. ఆ సమయంలో వారు మృతదేహాన్ని గుర్తించలేకపోయారు.

ముఖేష్: చూసి కూడా గుర్తించలేకపోయారు.

పుష్పా: తమ బిడ్డని తల్లి గుర్తించలేకపోయింది, నానమ్మ కూడా గుర్తుపట్టలేదు. కానీ ఆ డీఆర్‌జి జవాను “ఆమెనే నాకు తెలుసు ఆమె కచోలి గ్రామస్థురాలు. ఆమెను మీరు తీసుకు వెళ్ళాల్సిందే” అని ఖచ్చితంగా చెబుతున్నాడు. ఏదో చాలా విచిత్రం జరుగుతోంది అని నాకు అన్పించింది, ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఒక తల్లి ఎనిమిది నెలలు తన కడుపులో పోషిస్తుంది, జన్మనిస్తుంది, తనతో వుంటుంది. సేవ చేస్తుంది, ఆ తల్లి ఆ బిడ్డని గుర్తించలేకపోయింది, దేహం అంతగా చిన్నాభిన్నమైపోయింది. అదే గ్రామానికి చెందిన డ్యూటీ చేస్తున్న జవాను, అతను ఎప్పుడు లొంగిపోయాడో, ఇక్కడ ఎప్పటి నుండి డ్యూటీ చేస్తున్నాడో నాకు తెలియదు. అతను మాత్రం వెంటనే ఆమెను గుర్తిస్తాడు, ఇది చాలా విచారకరం.

ముఖేష్: ఇది చాలా బాధాకరం, హృదయవిదారకమైన విషయం, ఆవేదన కలిగించేది. నక్సలైట్లు హతమైనట్లుగా చెబుతున్న ఈ ఎన్‌కౌంటర్‌ కథనం, పోలీసుల వాదనలను నేను చూపించాను. నేను కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాను. కొన్ని ఎన్‌కౌంటర్ గుర్తులను చూశాను. ఎన్‌కౌంటర్ కు సంబంధించిన కొన్ని విషయాలను మీకు చెప్పాను. ఈ ఘటనకు మరో కోణం వుంది, మరో కథనం వుంది. అది కూడా చెప్పడం చాలా అవసరం అని భావించాను. అందుకనే ఈ నివేదికను మీ కోసం తయారు చేశాను. ఎందుకంటే 13 మంది నక్సలైట్లుగా చెప్పబడేవారిని చంపేశామని పోలీసులు అంటున్నారు.

ఇప్పుడు ఆ వాదనలపై సందేహాలు కలుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అధికారం మారిన తర్వాత, నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లలో చాలా పురోగతి ఉంది. ప్రతిరోజూ సైనికులు అమరులవుతున్నారు. నక్సలైట్లు చంపబడుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎన్‌కౌంటర్ అని చెబుతున్న ఒక ఘటన 2023 డిసెంబర్ 31నాడు జరిగింది, ఇందులో ఆరు నెలల అమాయక శిశువు మరణించింది. ఇటీవలి రోజుల్లో, చీపర్ భట్టిలో ఒక పెద్ద ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని నివేదించడానికి నేను యిక్కడికి వచ్చాను. ఇందులో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారని చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు మావోయిస్టులు కావచ్చు కానీ అయితు హేమ్లా అనే వ్యక్తికి ఏ విధంగానూ సంబంధం లేదు అని గ్రామస్థులు అంటున్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆరుగురిలో ఒకరి ఫోటోను కూడా గ్రామస్థులు చూపించారు. ఆ ఫోటోలో ఈ ఆరుగురిలో ఒకరైన వికాస్ చేతులు కట్టేసి నేల మీద కూచుని వుంటే, వెనకాల సైనిక దుస్తుల్లో నిల్చున్న కొందరు కనిపించారు. ముందుగా అదుపులోకి తీసుకుని హత్య చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, బస్తర్‌లో జరుగుతున్న ఈ హింస- ప్రతిహింసల మధ్య ప్రతిరోజూ ప్రజలు చంపబడుతున్నారు. వీటిలో అమాయకుల జీవితాలు కూడా నాశనమవుతున్నాయి, ఇలాంటి బాధాకరమైన కథలు కూడా వస్తున్నాయి.

ఇలాంటి బాధాకరమైన కథలను మీకు చూపించాలి, చెప్పాలి అని నేను భావిస్తున్నాను, బస్తర్‌లో జరుగుతున్న ఈ రక్తపాత సంఘర్షణ కథలు ఇతరులకు కూడా చూపించాలని మీరు అనుకుంటున్నారా? మీకు కావాలంటే దయచేసి మా వీడియోలను షేర్ చేయండి. మీరు మా ఛానెల్‌కి కొత్త అయితే దయచేసి సబ్‌స్క్రైబ్ చేయండి, అది మా మనోధైర్యాన్ని పెంచుతుంది.

ధన్యవాదాలు

Leave a Reply