1. లేనప్పుడు "
    
అప్పుడు
గాలి చొరబడదు
మాట నిర్మాణం కాదు 
మనిషి లేనప్పుడే
ఉనికికి అర్థం, విలువ!

అప్పుడు 
రాత్రి ఎంతకూ కదలదు 
రాత్రంతా..
వస్తువులు మాట్లాడుతుంటాయి 
మనిషి లేనప్పుడు 
వస్తువులు పుస్తకాలు బొమ్మలే మనుషులవుతాయి, మాటలవుతాయి.

అప్పుడు
ఏదీ కుదరగా ఉండదు
ఎడబాటు తర్వాత సుదీర్ఘ తడబాటే!

అప్పుడు
పొలమారినట్టు ,
పొగ చూరినట్టు,
మబ్బు కమ్మేసినట్టు
కళ్ళ ముందరి వాళ్ళు
కన్నీటి పొరలైనట్టు...

అప్పుడు
మాట్లాడనీ, పోట్లాడనీ
అలగనీ, అదిరించనీ, 
బెదిరించనీ,భయపెట్టనీ..
నీ... నీ...నీ.....

అప్పుడు 
లోకంగా,ప్రాణంగా,దేహంగా
ఉండనీ...
మనసుని, మనిషినీ,
మనసైన మనిషినీ !!

2. కొత్తగా..
    
ప్రేమించే వాళ్ళు కాబట్టే 
-వాళ్ళట్లా ఉంటారు.
ఎండలకి వానలకీ చలిగాలులకీ పొదిగిన కవిత్వాన్ని
వెలికితీసి పక్షుల్లా ఎగరవేసినప్పుడు
కొందరలా 
రహస్యంగా 
అదృశ్యం అవుతారు 

అన్ని కాలాల్లో 
దాచుకోవాల్సినదేదీ లేదని,
మిగిలేది- మిగుల్చుకునేది  విరామాలే అని, ఇంకొంచెం
ముందుకే వెళ్లాలనేదే 
కొత్త పాఠం.


ఒప్పుకోవాలంటే 
తప్పులు ఒకటారెండా..
 ఆకాశంలో నక్షత్రాల్లా.!
ఒక పురాగానం కోసమే
ప్రయత్నమంతా..
పరివర్తన కోసమే
ప్రయాణమంతా...

పిట్టలేవో రివ్వున ఎగిరినట్టు,
వర్షం ధారలుగా పడినట్టు
అగ్ని నిలువెల్లా  మండినట్లు
కాలాల్సిందేదో కాలిపోయి మిగలాల్సిందేదో మిగిలిపోయి
తేలాల్సిందేదో తేలిపోయాక,
చివరికి తెలుస్తుంది...
వాళ్ళకు తెలిసిందంతా
మనకు తెలియదని,
వాళ్ళకు తెలిసినంతగా 
మనకు తెలియదని.

పాత పడేకొద్దీ ఫలాలు ఫలవంతమైనట్లు,
కలలు
వాళ్ళ సమక్షంలోనే ఫలిస్తాయి.

పాత పడే కొద్దీ పుస్తకాలు,
మనుషులు 
కొత్తగా అర్థం అయినట్లే,
పూర్తిగా పాతబడిన తర్వాత,
వాళ్ళ ఉనికిని అయినా పట్టించుకోని వాళ్లకి
ప్రేమగా ఇచ్చే కరచాలనంతౌ
మనిషి లోపల
ఏదో మొదలవుతుంది.

కొందరిని చూశాకే
మనుషులలా మొదలవుతారు.
కొందరిని చూశాకే మనుషులవుతారు.

ఒక్క కరచాలనం
చాలా చెపుతుంది!

3. ప్రతిజ్ఞ

 
జనాభా లెక్కల్లోనో
ఓటరు జాబితాల్లోనో
కాదు..
అధికారాల్లో హక్కుల్లో
అందరూ గుర్తించబడినప్పుడే
మనుషులందరూ సమానమవుతారు.  !

1.
పాఠాలు 
రాతల్లో,మాటల్లో లేనివి.

వాళ్ళిద్దరూ ఒక్కటే !
ప్రతి రాత్రీ ... నిద్రలో వెనుకబడినా 
మెలకువలో
 ఎప్పుడూ ఆమే ముందుంటుంది.

దేశాoతరాల్లో అయినా, 
దేహాoతరాల్లో అయినా
చెయ్యాల్సినపనులేవో 
నిద్ర వాకిళ్ళలో  కలవరపెడితే,
అంతవరకూ అలుపెరగక చేసినపనులెన్ని ఉన్నా,- అంతరాత్రప్పుడైనా సరే , 
అంత తెల్లవారుగట్టయినా సరే 
అవసరమొచ్చిన అన్ని వేళల్లో -
ఆమె వంటిల్లవుతుంది.
గ్లాసెడు పాలో, మజ్జిగ చెంబో, కాఫీ కప్పో,- అన్నం కంచమో అవుతుంది.
ఏ  ఇంట్లో అయినా 
 ఎప్పటికీ,- మూతబడని వంటిల్లు ఆమె !
రాత్రీ , పగలులా - నిర్విరామంగా, హద్దుల్లేని  ఆకాశంలా-విశాలంగా - ఆమె  ఇల్లవుతుంది,
వసారా అవుతుంది ,
పూల తోటవుతుంది,
ప్రహరి గోడవుతుంది, 
తాళం కప్పవుతుంది.
అతడు ఆమె కాలేక పోయినా ;  క్షమించి,  ప్రేమించి,- ప్రేమించి,క్షమించి-
ఆమె అతడవుతుంది.
పనులెప్పుడూ ఇద్దరివీ అయితేనే - 
ఏ ఇల్లయినా, జీవితమయినా ఇద్దరిదీ అవుతుంది !
అది మన ఇల్లు అవుతుంది.

2.

ఆకలి 
చాలా చెబుతుంది
 చాలా నేర్పుతుంది

ఆకలేసినప్పుడల్లా –
అన్నం పెట్టిన వాళ్ళు ,
అన్నం తినే సమయాల్లో- 
గుర్తొచ్చే వాళ్ళు ,
స్నేహంగా, ప్రేమగా  నవ్వే వాళ్ళు - మనుషులు !
అకారణంగా,  ఆజన్మాంతం మనుషుల్ని ఆదరించే వాళ్ళే-  మనుషులు.

యుద్ధాలే కాదు, - కలలు , మెలకువలు, కాసిన్ని ప్రేమలూ,నిర్మలమైన కన్నీళ్ళు -
మనుషుల్ని బ్రతికిస్తాయి 
నటనల్ల్లోంచి  లాక్కోస్తాయి .
అసమానత్వం నుండి సమానత్వం వైపు -కదలడటమే-కదిలించడమే
ఇప్పటి  యుద్ధం !
మాయ లోకం లో - ఆదాయ, వ్యయాల, మిగులు లెక్కల్లో
 దిగులు దిగులుగా, భయం భయంగా -బ్రతకడం ఎలా  వున్నా  -
ఒక్కో మనిషిదీ
ఒక్కోరకం నేర్పరితనం !
ఎవరి బ్రతుకుల్ని వాళ్ళు - 
ఎవరికి  వాళ్ళు -
ఏమరిపాటు లేకుండా -
సునాయాసoగానే  బ్రతుకుతారు.
సమస్తం సమయానుకూలంగా సమకూర్చుకోవడంలో
 మనిషి బహు విధాలా, 
బహుముఖీనా  నేర్పరి.

ఎదుటి వాళ్ళను 
వస్తువులు గానో,
పని ముట్లుగానో.
బానిసల్లానో చూసేకొద్దీ - మనుషులు పరాయీకరించబడతారు.

చరిత్ర నిండా బానిసత్వమే !  పరాయీకరణే..
మన బానిసత్వాలను
మనo గుర్తించనంత కాలం ,
మన సంకెళ్ళను మనo వదిలిoచుకోనంతకాలం
 రాజ్యానికి  -బానిసలుగానే - 
బంధీలుగానే ఉండిపోతాం .

ప్రేమున్నప్పుడే, 
స్వేచ్చ ఉన్నప్పుడే
అతడికి ఆమె, 
ఆమెకి అతడు  అర్థం అవుతారు  !

ప్రేమ, -స్వేచ్చ ఉన్నప్పుడే -  
రాజ్యం ప్రజలదవుతుంది !
అది ఒక దేశం అవుతుంది.

3.
కొత్తగా బ్రతకాలంటే
కొత్త శ్వాస 
కొత్త రక్తం కావాలి
కొత్త మాట కావాలి

పోరాడే శక్తినీ , ప్రేమించే ఔదార్యాన్ని- చనుబాలధారతో బాటే అందించాలి.
ప్రేమించే తత్వాన్ని, సమానత్వాన్ని - అన్నం పెట్టే తల్లుల నుండే నేర్చుకోవాలి .

ప్రతిజ్ఞల్ని ఆచరించే కాలంలోకి
మనిషి  చేసే ప్రయాణంలో
 ప్రేమల్ని ఆదరించే  వాళ్ళందరూ ఆచరించాల్సిన సూత్రం ఒక్కటే !
హక్కులెప్పుడూ అoదరికీ సమానం  అయితేనే -
ఏ ఇల్లయినా, 
ఏ దేశమైనా, 
ప్రపంచం అయినా  -
అందరిదీ అవుతుంది !

అందరికీ ఆకలి సమానమే-   
స్వేచ్చ సమానమే- 
అందరికీ జీవితo కూడా  సమానమే.
అవును కదా.. 

అప్పుడెప్పుడో
మనం
రోజూ ప్రతిజ్ఞలు కూడా చేసాం
చిన్నప్పుడే నేర్చుకుని అంతా  మరచిపోయాం-- 
మనుషులందరూ సమానమే !
అవునవును

జనాభా లెక్కల్లోనో
ఓటరు జాబితాల్లోనో
కాదు..
అధికారాల్లో హక్కుల్లో
అందరూ సమానమైనప్పుడే
మనుషులందరూ సమానమవుతారు.  !

Leave a Reply