విజయవంతమైన వ్యక్తి  జీవిత కథను మనం చదివినప్పుడు, వారు వారి జీవితంలోని సవాళ్లను ఎలా  అధిగమించారు అనే దాని గురించి మనకు చాలా అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ పాఠాలు మన జీవితాలను నడపటానికి,  మన ప్రియమైనవారి కోసం మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడంలోను  సహాయపడతాయి. నిజానికి మిస్టర్ ఏ  భారత ఆర్థిక వ్యవస్థ  ఆకాశంలో మెరిసే నక్షత్రం. 

మిస్టర్ ఏ, అంబానీల తర్వాత రెండవ సంపన్న కుటుంబం. కానీ ఇతర వ్యాపార దిగ్గజాల మాదిరిగా కాకుండా, మిస్టర్ ఏ తన తండ్రి నుండి అదృష్టాన్ని వారసత్వంగా పొందలేదు. బదులుగా, అతను తన విధిని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. మిస్టర్ ఏ  విజయగాథను పరిశీలిస్తే,  అతని బలమైన సంకల్పం, వ్యాపార చతురత, రాజకీయ నాయకులను అతను తయారు చేసిన విధానం అతని విజయాల మెట్లను నిర్మించడానికి ఉపయోగించిన కృషి తెలుస్తుంది. 

మిస్టర్ ఏ, చిన్నతనంలో, విభిన్న లక్షణాలను ప్రదర్శించాడు. అతను కెరీర్ ప్రారంభించటానికి ముందు  కళాశాల స్థాయిలోనే చదువు నుండి తప్పుకున్నాడు. అతని తండ్రి వస్త్ర వ్యాపారి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అతని తల్లిదండ్రుల ఏడుగురు పిల్లలలో అతను ఒకడు. కష్టపడి చదివి తెలివితేటలు సంపాయుంచడం కన్నా, తెలివి గల వాళ్ళను పనిలో పెట్టుకొని, వాళ్ల చేత పని చేయుంచడం మిన్న అని అతను గ్రహించాడు.

డైమండ్ వ్యాపారం చేయడం కోసం మిస్టర్ ఏ ముంబైకి వెళ్లాడు. అతని మొదటి ఉద్యోగం 2 సంవత్సరాలు కొనసాగింది.   అప్పటికే, అతను వ్యాపారం నిస్సందేహంగా  మార్కెట్‌ పరిస్థితులకు  అనుగుణంగా ఎలా మారుతుందో తెలుసుకున్నాడు. మార్కెట్ లను ఎలా వ్యాపారానికి అనుగుణంగా సృష్టించాలో కూడా నేర్చుకున్నాడు. తర్వాత వజ్రాల బ్రోకరేజీ కంపెనీ స్థాపించాడు. దానికి  వాణిజ్యం గురించి అతనికున్న జ్ఞానం సహాయపడింది. అతను తన చేతులతో ప్రయత్నించిన మొదటి వ్యాపారం ఇది. అతను దేశంలోనే ప్రముఖమైన వ్యక్తికి నీలం తరహా వజ్రం కొనాలనుకుంటున్నాడనే విషయాన్ని  ఆ ధనవంతుడి ఇంట్లో పనిచేసే డ్రైవర్ కి డబ్బు ఇచ్చి మరీ తెలుసుకున్నాడు.

తెలివిగా పట్టణంలోని నీలం తరహా వజ్రాలను పెద్ద ఎత్తున చిన్న మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి అతని పేరు మీద రిజర్వు చేసుకున్నాడు. ఆ ధనవంతుడికి ఎంత ప్రయత్నంచినా నీలం తరహా వజ్రాభరణాలను సంపాయుంచ లేకపోయాడు.

” సార్ నేను మిస్టర్ ఏ ను మాట్లాడుతున్నాను. తమరికి కావలసిన వజ్ర ఆభరణాలు నా దగ్గర వున్నాయి. మీకు మార్కెట్ రేటుకే ఇస్తాను ” మిస్టర్ ఏ అన్నాడు.

” నాకు కావలసినవి మీ దగ్గర వున్నాయి. సంతోషం. కాని రేటు విషయం చెప్పలేదు” ధనవంతుడు అసలు ప్రశ్న వేశాడు.

“సార్ మార్కెట్ రేటు మాత్రమే ఇవ్వండి. తమరు నన్ను గుర్తు పెట్టుకోండి చాలు” నమ్మగర్బంగా మిస్టర్ ఏ అన్నాడు.

అటు తర్వాత ఆ ధనవంతుడు ఆభరణాలకు సంభందించి ఏం  కావాల్సినా అతన్నే అడగడం ప్రారంభించాడు.

మిస్టర్ ఏ సోదరుడు మహాసుఖ్  అతను ప్రారంభించిన ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని చేయడానికి అహ్మదాబాద్‌కు మిస్టర్ ఏ ను పిలిచాడు.  అతని జీవితంలో అప్పుడు తదుపరి మలుపు వచ్చింది. ఆ ప్లాస్టిక్ ను భారత దేశంలో కొనడం కొన్నా వేరే దేశం నుండి  చవుకగా దిగుమతి చేసుకోవచ్చని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆ దేశంలో గతంలో మిస్టర్ ఏ సహాయ పడిన ధనవంతుడు ప్లాస్టిక్ రంగలో అతి పెద్ద టైకూన్.

త్వరలో మిస్టర్ ఏ పాలీ వినైల్ క్లోరైడ్ ( PVC) ని భారతదేశానికి దిగుమతి చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రపంచ వాణిజ్య రంగంలోకి అతన్ని దూసుకెళ్లేటట్టు చేసింది.

మిస్టర్ ఏ గుజరాత్ యూనివర్శిటీలో చదువుకోవడానికి చేరినప్పుడు ఒక విషయం గమనించాడు. మార్కెట్ లో జరుగుతున్న వివిధ రకాల సరుకుల ఉత్పత్తి, దాని మార్కెటింగ్ గురించి  యూనివర్సిటీలకు ఓనమాలు కూడా తెలియని. అవి చాలా వెనుక బడి వున్నాయు. అందులో పాఠం చెప్పే ప్రొఫెసర్లు వస్తువును ఎలా అమ్మాలో ఏ మాత్రం తెలీదు. లాభం అనే పదం వారి మాటల్లోనే కాని చేతల్లో ఎక్కడా కనపడదు. అందుకే రెండో సంవత్సరంలో తన కామర్స్ కోర్సు నుండి మిస్టర్ ఏ తప్పుకున్నాడు. 

మిస్టర్ ఏ ఎనభైలలో ముంబయిలో వజ్రాలకు సార్టర్‌గా పనిచేశాడు.  కాలేజీ చదువు మానేసిన తన తండ్రి వస్త్ర వ్యాపారంలో కొనసాగమ్మన్నా  నిరాకరించాడు. అత్యంత లాభాలు అతి త్వరగా సంపాదించే సరుకుగా అతనికి వజ్రం కనిపించింది.

20 ఏళ్ళ వయసులోనే మిస్టర్ ఏ లక్షాధికారిగా మారాడు.  చివరికి 1988లో కమోడిటీస్ దిగుమతి మరియు ఎగుమతి సంస్థను ప్రారంభించాడు. వజ్రాలతో పాటు అనేక వస్తువులను, సరుకులను దిగుమతి, ఎగుమతులు చేయడం ఆరంభించాడు.

పెట్టుబడిదారీ విధానాన్ని ప్రజలు ఏ విధంగా గౌరవిస్తారో మిస్టర్ ఏ కు తెలుసు. అతని వాదన కార్మికులు మార్కెట్ కోసం వస్తువులను ఉత్పత్తి చేయాలి. కాని మార్కెట్ శక్తులు కార్మికులు కాకూ డదు. వస్తువులను నియంత్రించే అధికారం తనకే ఉండాలి. ఉత్పత్తి సాధనాలపై పూర్తి నియంత్రణ కలిగిఉండాలి. దీనికి ఐ ఐ టి లాంటి విద్యాసంస్థలు బుర్ర వున్న టెకీలను తయారు చేయాలి. వాళ్ళను హై క్లాస్ కూలీలుగా మార్చాలి. మార్కెట్ తనకు అనుకూలంగా ఉండేందుకు రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇవ్వాలి.

1988లో అతను ఏ ఎక్స్‌పోర్ట్స్ కింద కమోడిటీస్ ట్రేడింగ్ వెంచర్‌ని స్థాపించాడు, అది చాలా విజయవంతమైంది. అది తన సొంత రాష్ట్రంలోని ఇతర వ్యాపార సంస్థల మూలాలను కుదిపేసింది.

1990ల మధ్య నాటికి, అతని వ్యాపార విజయాలు అవాంఛనీయ వ్యక్తుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాయి.

అతని సంపద ఇతరులకు అసూయను తెచ్చింది.
1997లో, కిడ్నాపర్లు మిస్టర్ ఏ ను కిడ్నాప్ చేయడం ద్వారా  $1.5 మిలియన్ల డాలర్లను డిమాండ్ చేశారు. జనవరి 1, 1998న మిస్టర్ ఏ , అతని స్నేహితుడు పటేల్‌  కర్ణావతి క్లబ్ నుండి కారులో బయలుదేరి మహ్మద్‌పురా రోడ్‌కు బయలుదేరారు.  ఓ స్కూటర్ వారి కారును బలవంతంగా ఆపింది.
ఆ తర్వాత కొందరు వ్యక్తులు వ్యాన్‌లో వచ్చి ఇద్దరినీ అపహరించుకుపోయారు.

భయానక సంఘటన గురించి బహిరంగంగా మాట్లాడటానికి మిస్టర్ ఏ చాలా సార్లు ఇబ్బంది పడ్డాడు.

అప్పటికే అతను భారతదేశంలోని సంపన్నుల్లో ఐదవ స్థానంలో వున్నాడు.

ప్రతి విజయాన్ని అతని సన్నిహితులతో సెలెబ్రేట్ చేసుకోవడం అతనికి అలవాటు. నవంబర్ 26, 2008న, అతను ముంబైలోని ఐకానిక్ తాజ్ హోటల్‌లో అతని స్నేహితులతో విందు చేస్తున్నాడు. అప్పుడే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు 160 మందిని హతమార్చడంతో మిస్టర్ ఏ నేలమాళిగలో దాక్కున్నాడు. కమాండోలు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఉగ్రవాదులను ఎదిరించడంతో అతను సురక్షితంగా తప్పించుకోగలిగాడు. అతని కోసమే భారత ప్రభుత్వం కమాండో ఆపరేషన్ ను చేపట్టిందనే అపవాదు ప్రభుత్వం పై వచ్చింది.

ఆ రాత్రి, మిస్టర్ దుబాయ్ పోర్ట్ సీఈఓ  షరాఫ్‌తో కలిసి  డిన్నర్ చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు హోటల్‌లోకి ప్రవేశించడం, విచక్షణారహితంగా కాల్పులు  గ్రెనేడ్‌లు విసరడం మిస్టర్ ఏ ప్రత్యక్షంగా చూశాడు. అతను ఎత్తులో కూర్చున్నందున, అతను స్విమ్మింగ్ పూల్ పాసేజ్ దిశలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం స్పష్టంగా చూడగలిగాడు. హోటల్ సిబ్బంది  సహా అతిథులను బేస్‌మెంట్‌కు తరలించడంలో సహాయం చేశారు. కొన్ని గంటల తర్వాత నేలమాళిగలో  ఊపిరాడక, పై అంతస్తులో ఉన్న తాజ్ ఛాంబర్ హాల్‌కు మిస్టర్ ఏ ని తరలించారు.

మిస్టర్ ఏ మాటల్లో
“మేము 100 ఏళ్లు పైబడి ఉన్నామని అనిపించింది.  ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితం కోసం ప్రార్థిస్తున్నారు. కొందరు సోఫా క్రింద దాక్కున్నారు. మరికొందరు అదే విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృత్యువు ఏ వైపు నుండి విరుచుకు పడుతుందో తెలీదు. సోఫాలో కూర్చొని, నేను దేవుని పై నమ్మకం ఉంచమని చెప్పాను. అదే సమయంలో నేను అహ్మదాబాద్‌లో నా బాధలో ఉన్న నా కుటుంబంతో మాట్లాడాను. హోటల్ వెలుపల నా కారులో ఉన్న నా డ్రైవర్,  కమాండోలతో కూడా మాట్లాడుతున్నాను.
నేను కేవలం 15 అడుగుల దూరంలో మరణాన్ని చూశాను”.

ఆ సంఘటన అతనికి మరో లైఫ్ ఇచ్చినట్టు అయింది. తన జీవితం చాలా అల్పమైనదని అతను గ్రహించాడు.. అందుకే తక్కువ సమయంలో అతి పెద్ద కుబేరుడుగా మారాలనే తలంపు అతని మదిని తొలచసాగింది.

మిస్టర్ ఏ ఒక అవకాశం  తలుపు తట్టినప్పుడు దానిని గుర్తించే నేర్పు ఉన్న వ్యక్తి.
దూరదృష్టి, అవకాశాన్ని పొందగల సామర్థ్యం అతని వుంది. విజయవంతమైన వ్యక్తిని ప్రజల నుండి వేరు చేసే విధానం తనకు తెలుసు. ఎదగడం ఎలా అయినా ఎదగడమే అనే నానుడిని మిస్టర్ ఏ నే సృష్టించాడు.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణకు తలుపులు తెరిచినప్పుడు అతను అవకాశాలను గుర్తించాడు. ఇది అతనికి ఒక ఆశీర్వాదంగా అనిపించింది. పరిస్థితులను తనకు తగ్గట్టుగా ఉపయోగించి, అతను కొత్త మార్కెట్‌ను పట్టుకోవడానికి వేగంగా పయనించాడు.

మిస్టర్ ఏ 1988లో ఏకంగా తన పేరుతోనే కంపెనీ గ్రూప్‌ను స్థాపించాడు. అయితే అతని కంపెనీ మొదట్లో వ్యవసాయ ఉత్పత్తులు పై వ్యాపారం చేసింది.  కానీ, 1991లో భారత ఆర్థిక వ్యవస్థలోకి కొత్త యుగం ప్రవేశించడంతో అది మారిపోయింది. మార్కెట్ డిమాండ్‌లో మార్పును పరిగణనలోకి తీసుకుని మిస్టర్ ఏ వైవిధ్యభరితమైన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. క్రమంగా ఏ  ఒక సమ్మేళనంగా ఉద్భవించాడు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు వ్యాపారం,  మైనింగ్, గ్యాస్ పంపిణీ, చమురు, గ్యాస్ అన్వేషణ, ఓడరేవులు ఇలా ఆక్టోపస్ లా ప్రపంచ మార్కెట్ లోకి దూసుకెళ్లాడు.

మిస్టర్ ఏ తన పేరుతోనే ఒక ఫౌండేషన్ ను స్థాపించాడు.   మేనేజింగ్ ట్రస్టీగా అతని భార్యనే పెట్టుకున్నాడు. పన్నులు ఎగ్గొట్టెందుకు ఇప్పుడు సంపన్నులు చేస్తున్న మాదిరే మిస్టర్ ఏ చేశాడు
 విద్య, కమ్యూనిటీ హెల్త్, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి కల్పన, ఇలా అనేక దాతృత్వ కార్యక్రమాల్లో  ట్రస్ట్ పనిచేస్తుంది.

అనుకున్నట్టుగానే మిస్టర్ ఏ విజయం సాధించాడు. ఫోర్బ్స్ ప్రకారం, జనవరి 4, 2022 నాటికి అతని నికర విలువ $80 బిలియన్లకు పైగా ఉంది. 59 ఏళ్ల అతను ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2021లో 24 మరియు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 14వ స్థానంలో ఉన్నాడు.

మిస్టర్ ఏ జీవితాన్ని పరిశీలిస్తే, అతని ఉన్నత స్థాయికి ప్రయాణం సులభం కాదు. అతను స్వయంసిద్ధ బిలియనీర్ కాదు. అయినా అతను సాధించాడు. ఎలా సంపాయుంచాడు అని ఎవరూ అడగడం లేదు. అతను వదిలేసిన విశ్వ విద్యాలయం అతనికి పిలిచి డాక్టరేట్ ఇచ్చింది. అందులో పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్లు అతని కంపెనీ లో పని చేస్తున్నారు. రిటైరన ఐ ఏ ఎస్, ఐ పీ ఎస్ లు అతని కంపెనీలలో పనిచేస్తున్నారు.  ఈ స్థానం సాధించడానికి, అతను అందరిలాగే పోరాడవలసి వచ్చింది. కానీ అతను ఒక దూరదృష్టి గలవాడు.  అతను అవకాశాలు వచ్చినప్పుడు వాటిని పొందడం ప్రారంభ జీవితంలోనే నేర్చుకున్నాడు. 

ఒక అవకాశం  సంభావ్యతను అర్థం చేసుకోవడం ముఖ్యం.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఓడరేవులు ఎంత ముఖ్యమో అతను గ్రహించాడు.  మర్చంట్ పోర్ట్‌ల సామర్థ్యాన్ని అర్థం చేసుకున్నాడు.  ఆ సెగ్మెంట్‌పై గుత్తాధిపత్యాన్ని స్థాపించడంలో విజయవంతమైనాడు.  నేడు, అతను భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు యజమాని.  విదేశాలలో కొత్త ఓడరేవుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు.  కాని అతనికి ఓడను ఎలా నడపాలో కూడా తెలియదు.

మార్కెట్ మారుతున్న కొద్దీ తన వ్యాపారాన్ని వైవిధ్యపరచడంపై మొదటి నుంచి దృష్టి సారించాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మారినప్పుడల్లా అతను దానికి అనుగుణంగా పావులు కదిపాడు.

మిస్టర్ ఏ ప్రధాన మంత్రిని  సందర్శించడానికి అతని ఛాంబర్ కి వెళ్ళాడు.

” సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రైల్వేలను, పోర్టులను అనుసంధానం చేయడం వల్ల దేశ ఆర్థిక వృద్ధి విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఉత్పత్తి ఖర్చులు తక్కువగా ఉండాలి. ఉత్పత్తి ధరను ప్రభావితం చేసే అంశాలు ఉత్పత్తి సౌకర్యంలోని ఖర్చులకు మాత్రమే పరిమితం కావు. షిప్పింగ్ ఖర్చులు తగ్గకుండా పరిశ్రమలు విదేశాలతో పోటీపడే అవకాశం మనకు లేదు” మిస్టర్ ఏ ఆవేశంగా చెప్తున్నాడు.

“రైలు,  రవాణా పరిశ్రమకు మాత్రమే అవసరమా?” ప్రధాని గంభీరంగా అడిగారు

“ఖచ్చితంగా లేదు. యుద్ధ ట్యాంకులు,  సైనిక వాహనాలు రైలు ద్వారా త్వరగా రవాణా చేయబడతాయి. రైల్వేల  మరొక ప్రయోజనం ఏమిటంటే, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల తర్వాత దెబ్బతిన్న రైలు మార్గాలను త్వరగా రిపేరు చేయవచ్చు.”

“పోర్ట్ రైల్వే కనెక్షన్ ఎందుకు ముఖ్యమైనది?” ప్రధాని మళ్ళీ అడిగారు.

“సార్, పోర్టుల లోడింగ్, అన్‌లోడ్ వేగం పెరుగుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. పోర్ట్ ఏరియాలో చేయాల్సిన ఇంటర్మీడియట్ స్టాక్   మొత్తం తగ్గించబడుతుంది. రైల్‌రోడ్‌ను రేవు వరకు తీసుకువస్తే ఇంటర్మీడియట్ సరుకులు తగ్గుతాయి.
ట్రక్ పార్కింగ్ ఏరియా అవసరం ఉండదు.
చక్రాల వాహనాల వల్ల పర్యావరణ నష్టం తగ్గుతుంది.
చక్రాల వాహనాల వల్ల హైవేపై జరిగే నష్టం తగ్గుతుంది. రోడ్డుపై ట్రక్-ట్రైలర్ ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి, సాధ్యమయ్యే ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గుతాయి. ప్రధాన రహదారులపై నిర్దిష్ట గంటలలో భారీ వాహనాలకు వర్తించే పరిమితుల కారణంగా పోర్ట్ లోడింగ్  అన్‌లోడింగ్  ప్రతికూల ప్రభావం నిరోధించబడుతుంది.

” ఇందులో ప్రభుత్వం చేయాల్సింది ఎమన్నా వుందా? ” ప్రధాని అడిగారు.

 ” లేదు సార్,  ఓడరేవు యజమానులు ఆయిన తర్వాత మా సొంత రైలు ట్రాక్‌లను మేమే నిర్మించుకుంటాం. సమీపంలోని రైల్‌హెడ్‌లకు నడపడానికి మీరు అనుమతిస్తే చాలు” మిస్టర్ ఏ వినయంగా అన్నాడు.

“అంటే రైల్వే వ్యవస్థ నీ నియంత్రణలోకి రావాలంటావ్ ” ప్రధాని చురక వేశారు.

” సార్, మన కంట్రోల్ లోకి. యధావిధిగా రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మన అభ్యర్థులకు అయ్యే ఖర్చు నేనే భరిస్తాను” మిస్టర్ ఏ నసిగాడు. అతని వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ప్రభుత్వాలను వాడుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.

 అతను వ్యాపార ఉపాయాలను గమనించడం ద్వారా వ్యాపారాన్ని నేర్చుకున్నాడు. ఇది అతనికి డిమాండ్,   సరఫరా  ప్రాముఖ్యతను నేర్పింది. అతను మరింత డిమాండ్ ఎక్కడ ఉత్పన్నమవుతుందో అర్థం చేసుకునే నిశితమైన పరిశీలకుడు.  అందరికంటే ముందుగా ముందస్తు అవకాశాన్ని చేజిక్కించుకోవాలని విశ్వసిస్తాడు.

మిస్టర్ ఏ తన ఓడరేవులో 2 కి.మీ పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించాడు. ఇది పెద్ద విమానాలకు ఎయిర్ పోర్ట్ లాంటిది. భారతదేశంలో ఎయిర్‌స్ట్రిప్ ఉన్న ఏకైక ఓడరేవు ఇది. డైమండ్,  ఫార్మాస్యూటికల్ వంటి అధిక విలువ, తక్కువ పరిమాణ వస్తువుల రవాణాను నిర్వహించడానికి అతను దానిని పూర్తి-ఫంక్షనల్‌గా మార్చాడు.  ప్రభుత్వంతో డీల్ చేయడమంటే లంచం ఇవ్వాల్సిందేనని  చాలా సందర్భాల్లో మిస్టర్ ఏ వ్యాఖ్యానించాడు. 

అతని అభ్యాసాలు చివరికి అతనికి గుత్తాధిపత్యాన్ని స్థాపించడంలో సహాయపడింది.
మిస్టర్ ఏ కి ఈ మధ్య విలేకరుల బెడద ఎక్కువ అయింది. ఎంత తప్పించుకున్నా ఎదో విధంగా అతన్ని ఇరకాటంలో పెడుతున్నారు. అనేక అనుమానాలను ప్రజలకు కల్పిస్తున్నారు. అందువల్ల ఒక్కోసారి షేర్ వాల్యూ పడిపోతోంది. అందుకే అతను ప్రెస్ కు ఇంటర్వ్యూ ఇవ్వాలని, వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయాలనుకున్నాడు.

స్టూడియోలో అతను కెమెరా ముందర, ఫ్లడ్ లైట్ల వెలుగులో కాలు మీద కాలు వేసుకుని చిరునవ్వును చెదరనీయకుండా కూర్చున్నాడు.

విలేకరి గొంతు సవరించుకుని, ఒకసారి అద్దంలో తన మెహం చూసుకుని, నేను సిద్ధం అన్నట్టు కెమెరామెన్ కు సైగ చేశాడు.

” పారిశ్రామిక వేత్తలు, భారతదేశ రాజకీయ నాయకత్వం మధ్య సంబంధాలు విస్తృత పరిధిని కలిగి ఉన్నాయి. ప్రభుత్వ భారీ రంగాలలోని సంస్థలు  భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద లాభాన్ని అందించాయి.  కొంతమంది   అధికారంలో ఉన్న పార్టీతో అవకాశవాద పొత్తులు పెట్టుకుని ఆ సంస్థలలో ప్రైవేటు పెట్టు బడులను ఆహ్వానించారు.  కొంతమంది  రాజకీయ నాయకులనే స్వంతం చేసుకుని పారిశ్రామిక రంగాన్ని ఏలుతున్నారు. మీరు ఏ కోవలోకి వస్తారు” విలేకరి దాడి ప్రారంభించాడు.

“రాజకీయ పోషణే అవకాశవాదంగా మిగిలిపోయింది. క్యాప్టివ్ కోల్ బ్లాక్ కేటాయింపు కుంభకోణం, అరుణాచల్ ప్రదేశ్ హైడెల్ స్కామ్ రెండింటిలోనూ, చెల్లించడానికి సిద్ధంగా ఉన్న సంస్థలు మరింత స్థిరపడిన ప్రత్యర్థులను ఓడించి, బొగ్గు బ్లాకులు, హైడల్ ఎంఓయూలను పొందాయి. దీన్ని విస్తృత-స్పెక్ట్రమ్ క్రోనీ క్యాపిటలిజం అని మీరు అంటారు.  రాజకీయ సంబంధాలు ఉన్న కంపెనీలు వారు కోరుకున్నవి పొందాయని మీరంటారు. మేము అధిక ధర పెట్టి కొన్నాం. ఇది పారిశ్రామిక వేత్తలు చేసే పనే” మిస్టర్ ఏ చెప్పాడు.

“మీరు చెప్పే విధానంలో డ్రైవింగ్ సీటులో ప్రధాని గారే ఉన్నారా. పారిశ్రామికవేత్తలు లంచాల ద్వారా ప్రభుత్వాలను తమ దారిలోకి తీసుకోవచ్చు. దీన్ని బట్టి ప్రభుత్వం ఎవరికి పెద్దపీట వేసిందో ప్రజలు నిర్ణయించగలరు.” విలేకరి స్వరం పెంచాడు.

“మిస్టర్ ఏ తో భారతదేశం కొత్తదనాన్ని చూస్తోంది. ఆర్థిక వ్యాఖ్యాతల ప్రకారం, ప్రభుత్వం నా బృందాన్ని ‘ జాతీయ ఛాంపియన్’గా ఎంచుకుంది. భారతదేశానికి కీలకమైన రంగాల క్లచ్‌గా దాని విస్తరణను నేను ప్రోత్సహిస్తున్నాను. ప్రభుత్వం, పారిశ్రామికుల స్నేహాన్ని మీరు తప్పుగా అర్ధం చేసుకోకూడదు.
ఈ కలయికను అర్థం చేసుకోవాలి. మిస్టర్ ఏ గ్రూప్ జాతీయ ఛాంపియన్‌గా ఎలా ఎంపిక చేయబడింది? ఇది భారతదేశానికి సరైన వ్యూహమే” మిస్టర్ ఏ నింపాదిగా వివరించాడు.

“ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నందున, భారతదేశ రాజకీయ పార్టీలు ఎక్కువ తెలివిగా వ్యవహరిస్తున్నాయి. మీ విషయానికొస్తే, మీరు మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి” కాగితాలు, కళ్ళజోడు సవరించుకుంటూ విలేకరి యుద్ధ రంగంలో దిగే సైనికుడి ఫోజ్ ఇచ్చాడు.

 గాంధీధామ్ నుండి ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ దిగుమతి చేసుకోవడం, విస్తృత వ్యాపారానికి అప్‌గ్రేడ్ చేయడం ఆపై ముంద్రా పోర్ట్‌ను కొనడం  అప్పటి ముఖ్యమంత్రి చొరవ వల్ల జరిగింది. 2001లో ఆయన సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే నేను జోస్యం చెప్పాను. అతను భావి ప్రధాని అని. ఆయన హయాంలో నా కంపెనీ గుజరాత్‌లో మంచి వృద్ధిని సాధించింది.  ముంద్రా  ప్రపంచ స్థాయి ఓడరేవు సముదాయమైంది. ముంద్రా వద్ద SEZ పర్యావరణ అనుమతితోనే  వచ్చింది. నిజానికి అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వుంది. దీన్ని మీరు ఎలా భావిస్తారు” అదాని తిరిగి విలేకరిని ప్రశ్నంచాడు.

ప్రశ్నించడమే కాని, సమాధానాలు చెప్పే తత్వం లేని విలేకరి 

” మీ జోస్యం నిజం చేయడానికి మీరు పెద్ద ఎత్తున ఆ పార్టీకి ఫండ్స్ ఇచ్చారు కదా. 2018లో, కేవలం రూ. 3,455.34 కోట్ల నికర లాభం మీ కంపెనీకి ఉన్నప్పటికీ  రూ. 167,000 కోట్ల భవిష్యత్తు వ్యాయాన్ని మీరు షెల్ కంపెనీలను ఆవిష్కరించి  డబ్బును సేకరించారు. ఆ విధంగా మీరు  మరిన్ని కొత్త సంస్థలను ప్రారంభించారు. దీనికి  ప్రభుత్వం అండగా నిలిచింది. మీ పవర్ కంపెనీ దివాలా ప్రక్రియలోకి జారిపోకుండా చూసేందుకు ప్రభుత్వం పేరుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మీ కంపెనిల్లో ప్రభుత్వ సంస్థలైన ఎల్ ఐ సి వంటి సంస్థలచే పెట్టుబడులు పెట్టించింది. అంతేందుకు, మీ కంపెనీ ఇతర ప్రభుత్వ నిర్ణయాల నుండి కూడా ప్రయోజనం పొందింది. శ్రీలంకలో  మీరు సంపాయించిన పవర్ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ. మీకు ప్రాజెక్ట్ ఇవ్వమని మన దేశ ప్రధాని రాజపక్సేను కోరినట్లు శ్రీలంక విద్యుత్ అధికారి వాళ్ల పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. అలాగే ఎయిర్ పోర్ట్ లను మీరు సొంతం చేసుకున్నారు. మీ కంపెని పేపరు లెక్కలు అబద్దమని హిండెన్ ఏజెన్సీ చెప్పింది వాస్తవం కాదా? కేవలం రొండేళ్లలో 8 లక్షల కోట్ల షేర్ మార్కెట్ మీరు ఇలాగే సాధించారు కదా. ఇవన్నీ అడిగిన దానికి నా మీద దావా వేయకండి” విలేకరి నవ్వుతూనే అన్నాడు.

” భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఐదు లేదా ఆరు పెద్ద వ్యాపార సంస్థలు వచ్చాయి. ఈ దేశం రిలయన్స్ సొంతం కాదు కదా. మొదటి టర్మ్‌లోనే కొన్ని సంస్థలు మాకు గట్టి పోటీ ఇచ్చాయి. మైనింగ్‌లో వేదాంత, నిర్మాణంలో దిలీప్ బిల్డ్‌కాన్, ఉక్కులో జస్వ, మౌలిక సదుపాయాలలో మేము  అందరి కంటే ముందుగా రాణించాం. అయితే 2019 నాటికి మేము వాటన్నింటి కన్నా ఎక్కువ విజయం సాధించాం.  డీకార్బనైజేషన్ వంటి అంశాలలో భారతదేశం మా కంపెనీ పైనే ఎక్కువ ఆధారపడింది. చివరికి రక్షణ, డ్రోన్లు, పాలీసిలికాన్ లోను మేము ప్రవేశించాం. మా విజయాన్ని ఓర్వలేని కొన్ని శక్తులు అబద్దపు ప్రచారాలు ప్రారంభించాయి. వాటిపై కోర్టులో తేల్చుకుంటాం” మిస్టర్ ఏ అన్నాడు.

“రక్షణ రంగంలో అంత వేగంగా పెట్టుబడులు ఎలా పెట్టగాలిగారు” విలేకరి అడిగాడు.

“10 లక్షల లారీల టమోటా అమ్మితే వచ్చే ఆదాయం, ఒక్క యుద్ధ విమానం అమ్మితే వస్తుంది. లాభాల కోసం పెట్టుబడులు వేగంగానే పెట్టాలి “మిస్టర్ ఏ చెప్పాడు.

విలేకరి యధావిధిగా కట్టె విరవకుండా, పాము చావకుండా మాట్లాడాడు. ఎందుకంటే అతను పనిచేస్తున్న ఛానల్ ను మిస్టర్ ఏ కొనేసినట్టు అతని సెల్ కి మెసేజ్ వచ్చింది. అదాని చిరునవ్వుతో అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ” మీకు ఉద్యోగం కావాలంటే నన్ను అడగండి” అని భుజం తట్టి వెళ్లి పోయాడు.

అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ టౌన్‌షిప్ ‘శాంతిగ్రామ్’లో గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ ఆఫీస్ లో 16వ అంతస్తు ఛైర్మన్ కార్యాలయంపై గణపతి విగ్రహం ప్రతిష్టాత్మకంగా కనబడుతోంది. అలంకరించబడిన ఛైర్మన్ లాంజ్‌లో తేలికపాటి సెమీ క్లాసికల్ వాయిద్య సంగీతం ఆడియో వినిపిస్తోంది. మిస్టర్ ఏ చురుగ్గా నడుస్తూ, వెచ్చగా, అనధికారికమైన ప్రవర్తనతో సోఫా మూలలో కూర్చున్నాడు. అతని గురించి ఎడతెగని వ్యతిరేకత అతనికి ఉక్కభోతను కలిగిస్తోంది.

మిస్టర్ ఏ కు 60 ఏళ్లు నిండుతున్నాయి. అయినా అతను ధిక్కరించే ముఖం లక్ష కోట్లు ఒక్కరోజులో షేర్ విలువ పడిపోయినా, కొత్త వ్యాపారాల పట్ల తృప్తి చెందని ఆకలితో అలమటిస్తున్నాడు. బహుశా డబ్బులో వున్న అసలు ఉపయోగపు విలువ అదేనేమో.

అప్పుడే మిస్టర్ ఏ దగ్గరకు అధికార పార్టీ రొండవ అతిపెద్ద నాయకుడు, మరో అతి ముఖ్య మైన

నాయకుడు వచ్చారు. మిస్టర్ ఏ సమస్య ఇప్పుడు దేశ సమస్య అయి కుర్చుంది. వాళ్ళు కళ్ళతోనే పలకరించుకున్నారు.

మిస్టర్ ఏ దీన్ని చాలా తేలికగా తీసుకున్నాడు. అతను కొత్త వ్యాపారాల గురించి మాట్లాడాలనే వాళ్ళను పిలిపించాడు.

మిస్టర్ ఏ  డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చాడు.

“నా దృష్టి భారత దేశ నిర్మాణం పైనే. ఇది భారీ వ్యాపార అవకాశాలను తెస్తుంది. శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక హైడ్రోజన్ వరకు ఇది జరుగుతుంది. 100 సంవత్సరాల శక్తి రూపాలలో ప్రపంచం చూసినదాని కన్నా రాబోయే 10 సంవత్సరాలలో తీవ్ర మైన మార్పులు ఈ రంగంలో తేబోతున్నాను. తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రాన్‌లను ఉత్పత్తి చేయడం, గ్రీన్ ఎలక్ట్రాన్‌లుగా మార్చడం. భారతదేశం వృద్ధి చెందాలంటే తలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచే మార్గాలను వెతకాలి. సేవలు, వ్యవసాయం కంటే పరిశ్రమలపైనే మన దృష్టిని పదును పెట్టాలి. స్వావలంబన, ‘ఆత్మనిర్భర లేకుండా, మేము 1.4 బిలియన్ల ప్రజలకు సేవ చేయలేము. ప్రస్తుతం ప్రపంచం గ్రీన్ ఎనరర్జీ కోసం చైనాపై ఆధారపడి ఉంది”

మీరు ‘ఆత్మనిర్భర’ ‘ను శక్తి పరివర్తనలోకి ఎలా తీసుకువస్తారు?” నెంబర్ 2 అడిగాడు.

“మేము దేనినీ దిగుమతి చేయబోము. సిలికా ఇక్కడ లభిస్తుంది. సిలికా నుండి మీరు పాలీసిలికాన్ కడ్డీలు తయారు చేయవచ్చు. పొరల నుండి, PV కణాలను తయారు చేయవచ్చు. కణాల నుండి సోలార్ మాడ్యూల్స్ తయారు చేయవచ్చు. మాడ్యూల్స్ చేయడానికి, గాజు అవసరం. అల్యూమినియం ఫ్రేమ్‌లు అవసరం. దేశంలోనే దాదాపు 98% వృద్ది ఇందులో సాధించొచ్చు” 

“చైనా ఉత్పత్తి చేసే ఖర్చుతో మీరు ఇవన్నీ తయారు చేయగలరా?” మూడొవ వ్యక్తి అడిగాడు.

“వారి లేబర్ ఖర్చులు పెరిగినందున భారతదేశం చైనా కంటే చౌకగా ఉత్పత్తి చేయగలదు. ఇది చాలా గొప్ప అవకాశం. మనం దీన్ని సరిగ్గా పట్టుకోవాలి” రాబోయే 8 సంవత్సరాలకు 70 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వస్తాయి. 2030 లక్ష్యంతో భారీ పెట్టుబడులను ప్రకటించిన ఏకైక గ్రూప్ మనదే అవుతుంది.” మిస్టర్ ఏ గాజు గ్లాసు లోని ద్రవ పదార్దాన్ని తాగుతూ చెప్పాడు.

” భారతదేశపు సహజ వనరులను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సూర్యరశ్మిని సరుకును చేయాలి. నీళ్లను సరుకు చేశాం. కరోనా కాలంలో గాలిని సరుకు చేశాం. కరోనా కాలంలో చాలా కంపెనీ షేర్లు పడిపోతే మన కంపెనీ షేర్లు లక్షల కోట్లకు పెరిగాయి. ప్రధాని చేత 2030 నాటికి 500 GW హరిత విధానపు మెరుగైన లక్ష్యాన్ని ముందుగా ప్రకటించాం. ప్రభుత్వం తన పాత్రను పోషిస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం వంటి పథకాలతో ‘ఆత్మనిర్భర’కు దారి తీస్తుంది” నంబర్ 2 కూడా తన లక్ష్యం ప్రకటించాడు.

” సోలార్ ప్యానెల్‌ల కోసం మనం చైనాపై ఆధారపడలేము. కోవిడ్ సమయంలో, చైనా ప్యానెళ్ల ధరలను 18 సెంట్ల నుంచి 30 సెంట్లుకు పెంచింది. చౌకగా ఎలక్ట్రాన్‌లను ఉత్పత్తి చేయడంలోనే మన విజన్ ఆధార పడి ఉంటుంది. . చౌక ఎలక్ట్రాన్లు లేకుండా, మనం స్థిరమైన శక్తి పరివర్తనను కలిగి ఉండలేము. దీనికి మా శాస్త్రవేత్తలు సిద్ధంగా వున్నారు. సో పెద్ద పెట్టుబడి, చిన్న పెట్టుబడిని మింగేస్తుంది. చైనాను మార్కెట్ నుండి తోసేయడం, హిందుత్వ జాతీయవాదంలో భాగం చేయాలి. తద్వారా ప్రస్తుత సమస్యను ఆధిగ మించవచ్చు” మిస్టర్ ఏ కాన్సెప్ట్ చెప్పాడు.

“నిజానికి ‘1857 తిరుగుబాటు వ్యవసాయ సంక్షోభం కారణంగానే ఉత్పన్నమైంది. భూమి సంబంధాలు, భూస్వాములు-రైతుల మధ్య ఉండే సంబంధాల గురించి తెలుసుకోవాలి. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభాన్ని మనకు అనుకూలంగా మలుచు కోవాలి. వ్యవసాయ భూముల్లో మన సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేద్దాం. ఇక జాతీయ వాదానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఒకటి ఉంది. ఇందులో ఒక్క ఫోటో గానీ, వీడియో గానీ ఇప్పుడు మన మధ్య వున్న ఒక్క స్వాతంత్య్ర సమరయోధుని గురించిన సమాచారం ఉండదు. అందులో ప్రధాని ఫోటోలు, వీడియోలు ఉంటాయి. బ్రిటీష్‌ వలసవాదం గురించి, అందులో ఉండదు. చిన్నగా అందులో దేశ ఆర్థిక నిర్మాణానికి వెన్నెముకలైన మిస్టర్ ఏ లాంటి పారిశ్రామిక వేత్తల గురించి పెడదాం.  సామాన్య ప్రజల పోరాటాలు, త్యాగాల నుంచే స్వాతంత్య్రం సిద్ధించింది. కాని మనం ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలలో చదువుకొని తిరిగి వచ్చిన వారి వల్లే స్వాతంత్య్రం వచ్చిందని ప్రచారం చేయాలి.    బ్రిటిష్‌ వలసవాదం భారతదేశంలో 44.6 ట్రిలియన్‌ డాలర్లు లూటీ చేసింది. మిస్టర్ ఏ దీన్ని మించి పోయిట్టు వున్నాడు.” నంబర్ 2 ఉపదేశం చేశాడు.

” అసలు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి కారణం ప్రతిపక్షాలు అనడం మానేద్దాం. బ్రిటీష్ వలసవాదం అందాం. అప్పుడు ప్రతి పక్షాలు మనకు మద్దతు పలుకుతాయి.  మన దేశాభివద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మిస్టర్ ఏ లాంటి వ్యక్తులు కావాలని ప్రకటిద్దాం. ఫోర్బ్స్‌ జాబితా లోని బిలియనీర్లలో భారతీయులు ఉన్నత స్థానాన్ని ఆక్రమించడాన్నే నిజమైన దేశభక్తి అని ప్రచారం చేద్దాం. ఆశ్చర్యకరమైన రీతిలో పెరుగుతున్న అసమానతలకు కారణం చైనా వస్తువులే అని చెపుదాం. గ్రామీణ పేదల సమస్యలు ఇంకా సమస్యలుగానే మిగిలి ఉన్నాయి. భయానకమైన వాతావరణ మార్పుల కారణంగా అవి మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మనకు మతోన్మాద దేశభక్తి అవసరం. దురభిమానపూరిత దేశభక్తి అవసరం” మూడవ వ్యక్తి గంభీరంగా ప్రకటించాడు.

ఈసారి గాజు గ్లాసులో ద్రవాన్ని ముగ్గురు తాగారు. వాతావరణం తేలిక పడినా మిస్టర్ ఏ తీక్షణంగా ఆలోచిస్తూనే వున్నాడు.

2 thoughts on “మిస్టర్ ఏ

  1. 75 ఏళ్ల స్వాతంత్రం లో –దేశాన్ని ఎలి న రాజకీయ పార్ట్ లు
    అన్ని –అంబానీ –అధాని కి చెంచాగిరి — ధాసోహం చేస్తూ
    పబ్బం గడుపుకుంటున్న –తెలియనిధి ఎవరికి
    వారసత్వ రాజకీయాలతో నేతలు ధోచుకొని స్విస్ అకౌంట్స్ లో
    ధాచుకొని —
    యిధి మన ప్రజాసామ్యం –ఎన్ని రాసినా ప్రశ్నించే జనం
    కరువు అయిపోయారు —
    నమ్మడం – మోసపోవడం — బరించడం –జరుగుతున్న తంతు -కథ
    ==================
    బుచ్చిరెడ్డి గంగుల

  2. 75 ఏళ్ల స్వాతంత్రం లో –దేశాన్ని ఎలి న రాజకీయ పార్ట్ లు
    అన్ని –అంబానీ –అధాని కి చెంచాగిరి — ధాసోహం చేస్తూ
    పబ్బం గడుపుకుంటున్న –తెలియనిధి ఎవరికి
    వారసత్వ రాజకీయాలతో నేతలు ధోచుకొని స్విస్ అకౌంట్స్ లో
    ధాచుకొని —
    యిధి మన ప్రజాసామ్యం –ఎన్ని రాసినా ప్రశ్నించే జనం
    కరువు అయిపోయారు —
    నమ్మడం – మోసపోవడం — బరించడం –జరుగుతున్న తంతు -కథ
    ==================
    బుచ్చిరెడ్డి గంగుల

Leave a Reply