‘యిళ్ల నుంచి వెళ్లగొట్టడంపై పాట పాడినందుకు యూపీ పోలీసు నోటీసు యివ్వడం సరైనదా కాదా అని ప్రజలు నిర్ణయించాలని కోరుకుంటున్నాను’
– నేహా సింగ్ రాథోడ్
ఉత్తర ప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వెనుక ఉన్న రాజకీయాలు బుల్డోజర్ సంస్కృతిగా దేశవ్యాప్త ప్రచారమైంది. అలాంటి ఒక ఘటనపై భోజ్‌పురి ప్రసిద్ధ జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ (24సం)కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆమె రాజకీయ స్పృహతో జానపద పాటలు పాడే గాయని.
ఫిబ్రవరి 15న కాన్పూర్ (రూరల్)లోని మదౌలీ గ్రామంలో ఆక్రమణల వ్యతిరేక చర్యలో 44 ఏళ్ల ప్రమీలా దీక్షిత్, 19 ఏళ్ల ఆమె కుమార్తె సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై ‘యుపి మే కా బా’ (ఉత్తర ప్రదేశ్ లో ఏమిటి) అని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యంగ్య శైలిలో నేహ పాట పాడింది. ‘యుపి మే కా బా సీజన్-2’ అనే ఈ పాట పాడినందుకు సమాజంలో అశాంతి, ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని యూపీ పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ పాట పాడి సమాజంలో అశాంతి, ఉద్రిక్తతలు సృష్టించారని ఆరోపిస్తూ ఆమెకు పోలీసులు నోటీసు పంపారు.
అయితే అధికారులు వాళ్ళే నిప్పంటించుకున్నారని చెప్పారు. వాస్తవానికి ఒక ఇంటి కూల్చివేత కార్యక్రమంలో అధికారులు ఒక గుడిసెకు నిప్పంటించారు. ఫలితంగా తల్లి, కుమార్తె మరణించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బుల్డోజర్ ఆపరేటర్‌పై హత్య కేసు నమోదు చేసారు. అక్కడే వుండిన పోలీసులు, జిల్లా పరిపాలన, రెవెన్యూ అధికారులు అగ్నిప్రమాదం తరువాత అక్కడి నుంచి పారిపోయారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యాయి. మృతురాలి కుమారుడు శివమ్ దీక్షిత్, ‘‘ప్రజలు మంటలు ఆర్పారు. నేను తప్పించుకోగలిగాను. నా తల్లిని, సోదరిని రక్షించేవారు లేకపోయారు. నిందితులు మా గుడిని బద్దలు కొట్టారు. డిఎం (జిల్లా మేజిస్ట్రేట్) కూడా ఏమీ చేయలేదు’’ అన్నాడు.
పోలీసులు నేహకు ఇచ్చిన నోటీసులో కొన్ని ప్రశ్నలు వేసి, వాటికి మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. ఆ సమాధానాలు తమకు సంతృప్తికరంగా లేకపోతే కనక, ఐపిసి, సిఆర్‌పిసి సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా బెదిరించారు.
ఈ సందర్భంగా నేహ మాట్లాడుతూ యోగి బుల్డోజర్ పాలనలో కాన్పూర్ పరిపాలనా యంత్రాంగం విధ్వంసకారకమైంది. ఆ కారణంగా ఆ తల్లి, కుమార్తె తమ స్వంత ఇంట్లోనే సజీవ దహనమయ్యారు. దీనిపై నేను పాట రాసి పాడినందుకు కాన్పూర్ (గ్రామీణ) పోలీసులు నోటీసుతో మా ఇంటికి వచ్చారు. అంబేద్కర్ నగర్‌లోని అత్తగారింట్లో ఒంటరిగాఉన్న మా మామగారికి మొదట నోటీసును యిచ్చారు. ఆయన తనకేమీ తెలియదనడంతో ఆ తరవాత అక్కడి నుంచి ఒక జీపు నిండా పోలీసులు ఢిల్లీకి వచ్చి రాత్రి 8 గంటలకు తనకు మళ్ళీ నోటీసు ఇచ్చారని అన్నారు.
దీని మీద ఆమె సహచరుడు హిమాంశు ‘‘మొదట అంబేద్కర్ నగర్‌లో వున్న మా నాన్న ఇంటికి నోటీసు పంపారు. పోలీసు జీపు ఇంటికి వెళ్లి పరిసరాల్లో కలకలం సృష్టించింది. ఒక రోజు తర్వాత, ఒక మహిళ నాకు ఫోన్ చేసి, తాను యూపీఎస్‌సి పరీక్షకు తయారవుతున్నానని, నా సహాయం కావాలని అడిగింది. మా ఇంటికి వచ్చి కలవచ్చా అని అడిగితే నేను నిరాకరించాను. కొద్దిసేపయ్యాక మళ్లీ ఫోన్ చేసి తాను కాన్పూర్ రూరల్ పోలీసు సిబ్బందినని, నోటీసు అందజేయడానికి వచ్చానని చెబితే, మా హౌసింగ్ సొసైటీ గేట్ దగ్గరికి రమ్మని నోటీసు తీసుకున్నాము’’ అని చెప్పారు.
‘‘నాకు నోటీసులు అందజేసేందుకు.. నేరస్థుడిని పట్టుకునేందుకు వల పన్నినట్లు చేశార’’ని నేహా అన్నారు.
తనను ట్రాప్ చేయడానికి నోటీసులో చాలా గమ్మత్తైన రీతిలో ప్రశ్నలు అడిగారని నేహా చెప్పారు. లాయర్‌ను సంప్రదించిన తర్వాత నోటీసుకు సమాధానం ఇస్తానన్నారు. గతంలో కూడా తాను రాసిన పాడిన కొన్ని పాటల మీద నోటీసులు వచ్చాయని, అయితే పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసు ఇవ్వడం తొలిసారి అని చెప్పారు.
ఆ నోటీసులో ఈ క్రింది ప్రశ్నలు వేసారు –
మొదటి ప్రశ్న- వీడియోలో నేహా సింగ్ రాథోడ్ స్వయంగా ఉన్నారా లేదా?
రెండవ ప్రశ్న- వీడియోలో ఉన్నది వారే అయితే, తన యూట్యూబ్ ఛానెల్ nehasingh rathore, Twitter ఖాతా nehafolksingerలో తన స్వంత ఇమెయిల్ ఐడితో వీడియోను అప్‌లోడ్ చేసారా లేదా – స్పష్టం చేయండి.
మూడవ ప్రశ్న – నేహా సింగ్ రాథోర్ ఛానెల్ nehafolksinger ట్విట్టర్ హ్యాండిల్ అమెదేనా కాదా? ఆమె వాటిని ఉపయోగిస్తుందా లేదా?
నాల్గవ ప్రశ్న- వీడియోలో ఉపయోగించిన పాటలోని పదాలను ఆమె రాశారా లేదా?
ఐదవ ప్రశ్న- పైన పేర్కొన్న పాటను ఆమె స్వయంగా వ్రాసి ఉంటే, ఆమె స్వయంగా ఆ విషయాన్ని ధృవీకరిస్తుందా? లేదా?
ఆరవ ప్రశ్న- పైన పేర్కోన్న పాటను మరెవరైనా రాసి ఉంటే, ఆ పాటను ఆ రచయిత ధృవీకరించారా? లేదా?
ఏడవ ప్రశ్న- పైన పేర్కొన్న పాటలో వుండే అర్థం వల్ల సమాజంపై పడే ప్రభావం గురించి ఆమెకు తెలుసా? తెలియదా?
నేహా సింగ్ రాథోడ్‌కి నోటీసు పంపడంపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు స్పందించాయి. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్‌లో నేహా సింగ్ రాథోడ్ పాట తరహాలో వ్రాస్తూ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పూర్వ ఐపీఎస్ సూర్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వానికి అద్భుతమైన సహనం ఉంది. జానపద గాయకుడి పాటంటే ఎందుకంత భయం. చిన్న సమస్యకైనా ప్రభుత్వ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి కేసు పెడతారు. కానీ ఏదో ఒక రోజు ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఏమవుతుంది?’’ అన్నారు. జర్నలిస్ట్ దీపక్ శర్మ ట్వీట్ చేస్తూ, ‘‘నేహా సింగ్ రాథోడ్ పాటపాడితేనే నోటీసు పంపితే, ఆడమ్ గోండ్వికి జీవిత ఖైదు విధించాలి. ఇది మాత్రమే కాదు, సాహిర్, ఫిరాక్, నీరజ్, జోష్, జిగర్ వంటి చాలా మంది కవి-గీత రచయితల సృష్టిని నిషేధించాలి. యోగి జీ సంగీతంపైకి బుల్డోజర్లను నడపవద్దు, కనీసం రెండు-నాలుగు ఇళ్లను వదిలివేయండి’ అన్నారు.
0 0 0
నేహా సింగ్ రాథోడ్ 1997లో బీహార్‌లో జన్మించారు. ఆమె కైమూర్ జిల్లాలోని జలదహన్ గ్రామ నివాసి. ఈ పాట కంటే ముందు, నేహా భోజ్‌పురిలో కోవిడ్ అవగాహనపై పాట పాడిందిది. ఆ పాట వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 66 వేలకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది. ఆమె భోజ్‌పురి ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె కాన్పూర్ యూనివర్శిటీ నుండి బీఎస్‌సిలో పట్టభద్రురాలైంది. 2018 సంవత్సరంలో తన గాన వృత్తిని ప్రారంభించింది. ఆమె ప్రధానంగా రాజకీయ వ్యంగ్య పాటలను పాడిరది.. నేహా సింగ్ రాథోర్ మొదటి ఉత్తమ పాట ‘‘రోజ్గర్ దేబ్ కా కర్బా నాటక్” అని, దీని అర్థం ‘ఉద్యోగం ఇస్తారా కేవలం నాటకాలాడుతారా’.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది, ఇలాంటి పరిస్థితుల్లో నేహా సింగ్ రాథోడ్ ‘యుపి మే కా బా’ పాట అందరి నోళ్లలో నానుతోంది. నేహా సింగ్ రాథోడ్ తన ‘యుపి మే కా బా’ పాట రవి కిషన్ ‘యుపి మే సబ్ బా’ (యూపీలో అన్నీ వున్నాయి) అనే పాటకు ప్రత్యుత్తరమని తానే స్వయంగా అంగీకరించింది.
నేహా రాథోడ్ తన ప్రసిద్ధ వ్యంగ్య హిట్ ‘యుపి మే కా బా-సీజన్ 2’ అని పిలిచే పాటలో మరణాలకు పరిపాలనను బాధ్యులుగా చేస్తుంది.
‘ప్రజలు స్వయంగా పాటను వినాలని, నాకు వ్యతిరేకంగా వచ్చిన ఈ నోటీసు సరైనదని లేదా వారు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను’’ అని ఆమె చెప్పింది. సోషల్ మీడియా నుండి తాను ఆ పాటను తీసివేయబోనని రాథోడ్ తెలిపారు. ‘పోలీసులు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు’ అని అన్నారు.
రాథోడ్ అత్యంత ప్రసిద్ధ వ్యంగ్య గీతం, అసలైన ‘యుపి మే కా బా’, రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై దాడి చేసింది. ఆమె ఇతర పాటలు రాజకీయ నాయకులను విమర్శిస్తూ, ఎగతాళి చేస్తాయి. ఆమెకు ట్విట్టర్‌లో 146,100 మంది అనుసరిస్తున్నారు. యూట్యూబ్‌లో 867,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. రాథోడ్‌పై పోలీసుల చర్యను పలువురు రాజకీయ నాయకులు విమర్శించారు.
‘ఇవి బెదిరింపు వ్యూహాలు. అయితే, ప్రభుత్వం అటువంటి వ్యూహాలను అమలు చేస్తున్నప్పుడు, పౌర హక్కులను పరిరక్షించడానికి మనం అంతా ఐక్యంగా ఉండాలి’ అని కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ అనీస్ సోజ్ అన్నారు, ఆమెకు అవసరమైతే తమ పార్టీలోని న్యాయవాదులు సహాయం అందిస్తారన్నారు.
నేహా సింగ్ రాథోడ్‌కి సంఫీుభావం తెలుపుతూ, ‘‘గాయని నేహా సింగ్ రాథోడ్‌కు యోగి ప్రభుత్వం నోటీసు పంపడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, విమర్శల స్వేచ్ఛపై దాడి అని, ఈ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని యోగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇటువంటి ప్రభుత్వ చర్యలు ప్రజల అనుకూల వ్యక్తీకరణలను నిరుత్సాహపరుస్తాయని, సమాజానికి ప్రతికూల సందేశాన్ని పంపుతాయి. సాంస్కృతిక, సాహిత్య, కళా రంగాలపై ప్రభుత్వాలు దాడులు చేయడం ప్రమాదకరం. సాధారణ ప్రజల హక్కుల కోసం గొంతు వినిపించడం ఒక కళాకారులు-రచయితల ప్రాథమిక విధి. రాజ్యాంగం అతని ఈ ప్రాథమిక కర్తవ్యాన్ని పరిరక్షిస్తుంది. నేహా సింగ్ రాథోడ్‌కు పోలీసులు నోటీసు పంపడం సామాన్యుల సాంస్కృతిక ఉద్యమాన్ని ఖైదు చేసే నీచమైన చర్య. సామాజిక-సాంస్కృతిక స్వరాలను అణచివేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలి, ఎందుకంటే భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. సామాజిక కార్యకర్తలపై దాడులు చేయకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధమైన పాలనను, రాజ్యాంగాన్ని నెలకొల్పాల’ని డిమాండ్ చేస్తూ పియుసిఎల్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) ఉత్తరప్రదేశ్ ఒక ప్రకటన చేసింది.
నేహా సింగ్ తన పాటల ద్వారా నిరుద్యోగం, అణచివేతతో సహా ప్రజల అన్ని సమస్యలను ప్రముఖంగా లేవనెత్తారు. ప్రస్తుత పాటలో కూడా ప్రభుత్వ నియంతృత్వ బుల్డోజింగ్ చర్యను ప్రశ్నించారు. యూపీ పోలీసుల ఈ చర్య వాక్ స్వాతంత్య్రంపై దాడి చేయడంతోపాటు వారికి నోటీసులు జారీ చేయడం ప్రభుత్వ అణచివేత విధానంలో భాగం అని తన ప్రకటనలో పేర్కొన్నది..
దృష్టి ఐఏఎస్ వ్యవస్థాపకుడు వికాస్ దివ్యకీర్తి ఇన్‌స్టిట్యూట్‌కు రాజీనామా చేస్తూ, నేహా సింగ్ రాథోడ్ భర్త హిమాంశు ఫేస్‌బుక్‌లో ‘‘నేను 2 రోజుల క్రితం నన్ను రాజీనామా చేయమని కోరడం వాస్తవం. నేను నిన్ననే నా రాజీనామాను సమర్పించాను. కానీ నోటీసుకు, దీనికి కొంత సంబంధం ఉండవచ్చు. ఉపాధ్యాయుడిగా, యజమానిగా నా పట్ల వికాస్ దివ్యకీర్తి సంస్థ ప్రవర్తన నా పట్ల ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగానే ఉంది. నన్ను పని మానేయడం కేవలం నోటీస్ వల్ల అని చెప్పలేను. కానీ యాదృచ్ఛికం ఏమిటంటే, నోటీసు అందిన వెంటనే నన్ను పిలిచి రాజీనామా చేయమని అడిగారు. నేను సరిగా ఆఫీసుకు వెళ్ళడం లేదు. గత 10 రోజులుగా ఈ గొడవల వల్లే ఆఫీసుకి వెళ్ళలేదు. ఈ రెండు విషయాలు వున్నాయి. నా రాజీనామాను ఒక సమస్యగా చేసి ఆ సంస్థ ప్రతిష్టను దిగజార్చడం నాకు ఇష్టం లేదు. దయచేసి అలా చేయవద్దని నా అభ్యర్థన.’’అని రాశారు.
దృష్టి ఐఏఎస్ అకాడమీ చాలా గౌరవనీయమైన సంస్థ. సంస్థాపకులు వికాస్ దివ్యకీర్తి మీద ఎలాంటి ఆరోపణాలూ లేవు కొద్ది రోజుల క్రితం వికాస్ శివకీర్తి గారి మీద ఇదే బీజేపీ వ్యక్తులు దుమారం రేపినప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ ఇవాళ అదే బీజేపీ ఒత్తిడికి లొంగిపోవాల్సి రావడం, ఐఏఎస్ ఆఫీసర్లను తయారుచేసే ప్రైవేట్ సంస్థలు ఒత్తిడికి గురికావడం శోచనీయం అని, నేహా సింగ్ రాథోడ్‌కు నోటీసు అందిన తర్వాత ఆమే భర్తను దృష్టి ఐఏఎస్ నుండి వైదొలగమని కోరడం దురదృష్టకరం. సహజ న్యాయం ప్రకారం, భార్య చేసిన నేరానికి భర్త దోషిగా ఉండడు, ఇక్కడ నేరం అనే పదం లేదు అని ట్విట్టర్ వ్యాఖ్యానాలు వచ్చాయి.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఉత్తరప్రదేశ్ పోలీసులు నాకు పంపిన నోటీసు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. న్యాయానికి అనుకూలంగా భారత న్యాయవ్యవస్థ నాకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. నేను, నా కుటుంబం పడుతున్న బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని నేహా ఆవేదన చెందారు. తనకు పాటలు పాడడమంటే చాలా ఇష్టమని, ప్రశంసలు వినడం తనకు మంచిగా అనిపిస్తుంది అని అన్నారు. ఆమె ఒక ట్వీట్‌లో, ‘‘మేము నిట్టూర్చినా, మాకు నోటీసు వస్తుంది, వారు హత్య చేసినా ఏ చర్చా జరగదు.’’ అన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ‘‘అనిశ్చితం’గా వుంది. ‘ఆందోళన చెందాను’, కానీ ‘భయపడలేదు’ అని చెప్పింది.
‘నేనెందుకు భయపడాలి? నేను ప్రజాస్వామ్య దేశ పౌరురాలిని. నా రాజ్యాంగం నాకు కొన్ని హక్కులను హామీ ఇస్తుంది. నేను రాజ్యాంగం నుండి ధైర్యాన్ని పొందుతున్నాను ’ అన్నారు.
‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా విమర్శించడం కూడా నేరం కాదు. విమర్శ అనేది ప్రజాస్వామ్యాన్ని పరిశుభ్రంగా ఉంచే సబ్బు లాంటిది. అక్కడ తగినంత మంది అవార్డులు, డబ్బు కోసం ప్రభుత్వానికి వంతపాడే కళాకారులు చాలామందే వున్నారు. నేను ప్రజల కోసం మాట్లాడుతున్నాను. సామాన్యులకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడమే నా పాటల ద్వారా నేను చేసాను ‘‘ అని రాథోడ్ అన్నారు.
పోలీసులు తమ హౌసింగ్ సొసైటీకి వచ్చిన తర్వాత, ‘‘రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోని కొందరు మేము అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ చాలా మంది మాకు మద్దతుగా నిలిచారు. బీహార్‌లోని జందాహా గ్రామంలో నివసించే తల్లి పోలీసుల నోటీసు గురించి విన్నప్పుడు, రక్తపోటు పెరిగి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ‘‘ప్రతి ఒక్కరూ చాలా ఒత్తిడికి లోనవుతారు. నన్ను జైల్లో పెడతారేమోనని, ఎలుకలు కొరుకుతాయేమోనని మా అమ్మ కంగారుపడుతోంది’’ అంటూ హాస్యం చేసింది.
‘రాజకీయేతర విషయాల గురించి పాడమని మా నాన్న నన్ను అడుగుతూనే ఉన్నారు. కానీ ఇది కేవలం నా గురించి మాత్రమే కాదు కదా? నేను ఇతర విషయాల గురించి పాడినా కానీ, నేను లేవనెత్తిన అంశాలు మాయమైపోయినట్లు కాదుకదా’’ అని తన పాటలు తానే వ్రాసి, పాడి, రికార్డ్ చేసే రాథోడ్ అంటున్నారు.
ఆమె చేసిన పని ఇంతకుముందు కూడా ఆమెను ప్రమాదంలో పడేసింది.
‘ఒకసారి నేను వారణాసిలోని విశ్వనాథ్ ఆలయంలో ఉన్నప్పుడు, కొందరు వ్యక్తులు నన్ను గుర్తించి, నామీద దాడి చేయడానికి రాళ్లు తీసుకున్నారు. అదృష్టవశాత్తూ, సమీపంలో వున్న నాకు తెలిసిన ఒక పోలీసును పిలవడంతో నన్ను బయటకు పంపించారు. న్యూఢల్లీిలో కూడా, వీధుల్లో కొన్నిసార్లు నన్ను రెప్పవేయకుండా చూసి గొణుగుతుంటారు అన్నారు. ఈ పరిస్థితి కష్టమనిపిస్తోందా అనే ప్రశ్నకు ‘‘నేను ఈ మాత్రం భయపడను. ఒక మహిళగా లొంగిపోవడం మొదలుపెడితే యిక దానికి అంతంటూ ఉండదు. నాకు పూర్తిగా అండగా నిలిచే కుటుంబాన్ని కలిగి ఉండటం నా అదృష్టం. నోటీసు వచ్చినప్పటి నుండి, నా భర్త నన్ను సురక్షితంగా ఉంచడానికి ఎంతో పాటుపడుతున్నాడు. ఒకవేళ ప్రభుత్వం నిజంగా నన్ను లక్ష్యంగా చేసుకుంటే కనక ‘‘నా స్థాయిని పెంచుతోంది ’ అన్నట్లే. ‘‘నేను ఇంట్లో కూర్చుని పాడే అమ్మాయిని. వారు నన్ను చాలా సులభంగా విస్మరించవచ్చు. కానీ నా గొంతు నొక్కడానికి ఇంతలా ప్రయత్నించడం వల్ల నన్ను గొప్పదాన్ని చేస్తున్నారు తమని తాము తక్కువ చేసుకుంటున్నారు’అని రాథోడ్ అన్నారు.