పిల్లలు దయాత్ములు ఎవరినైనా దేనిదైనా ఇట్టే క్షమించడం వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య ✤ పిల్లలు తప్ప ఇంకెవరు అల్లరి చేస్తారని వొక తల్లి నాకు సుద్దులు చెప్పింది ✤ పిల్లలతో ప్రయాణం చేయడమంటే పూలతో పక్షులతో కలిసి నడవడమే ✤ ఉమ్మెత్తపూలువంటి పిల్లలు ఈ పూట తరగతిగదిలోకి లేలేత కాడలతో వొచ్చారు ✤ పిల్లలు నక్షత్రాలు పగలూ రాత్రి వెంటాడుతూ నన్నూ కాస్తా వెలిగిస్తున్నారు ✤ పిల్లలు నవ్వితేనే భూమి నాలుగుకాలాలు బతుకుతుంది ✤ ఒక మహావృక్షం కింద పిల్లలంతా చేరిన తర్వాతే మహావృక్షం మహావృక్షంగా ఎదిగిందని నానుడి ✤ పూలగౌనుపిల్ల సీతాకోకచిలుకలతో ఆడుకుంటుంది ✤ నీడలు చెట్ల కింద సేదదీరుతుంటే పిల్లలొచ్చి చెరిపేసి ఏంచక్కా వెళ్లిపోయారు ✤ లేకలేక కాసిన నీడలగుత్తులను తెంపి చెల్లాచెదురుగా పడేసిందెవర్రా అని ముసిలోడు కేకలేస్తున్నాడు ✤ నీడలన్నీ నలుపుగానే ఎందుకున్నాయని చిన్నోడు నీడలకు రకరకాల రంగులద్దుతున్నాడు ✤ పెన్సిల్తో బొమ్మ గీస్తున్న పిల్లాడ్ని కదిపినా కదపకపోయినా అతను నిజమే చెప్తాడు బొమ్మెప్పుడూ అబద్ధం మాట్లాడి ఎరగదు ✤ రాలిన పసుప్పచ్చని పూలు వొకవైపు ఎగిరే పిల్లకాల్వల్లా తుళ్లిపడుతూ పిల్లలొకవైపు ✤ ఎండి మట్టిరంగులోకి మారుతున్న ఆకుల మధ్య ఒకడ్నే నిల్చున్నాను పిల్లలు కెరటాల్లా ఉరికురికి నావైపే వస్తున్నారు ✤ గోడకవతలవైపు నిల్చుని దారంట వెళ్తున్న ప్రయాణికుల వైపు చేతులూపుతున్న చిన్నపిల్లలకు ఏమి రహస్యం తెలిసిందో ఏమో ✤ పూల మాటున ముళ్లుంటాయని పిల్లలకు తెలుసో తెలియదో ✤ హృదయం గడ్డకట్టింది ఆలోచనలు పెచ్చుబారాయి బాల్యం చనిపోయింది ✤ పిల్లలూ ఊదారంగు పూలులాంటివారే ముట్టుకుంటే పిండిలా రాలిపోతారు ✤ పిల్లలు మాట్లాడలేరు వాళ్లింకా పిల్లలు అప్పుడే ప్రశ్నను కత్తిలా వాడటం తెలీనివాళ్లు ✤ వరిసొప్పలు ఏరి ఏరి అంబలేళ నీడపట్టున కూకుని అన్నం తింటున్న ఆమెలో ఇంటివద్ద పిల్లల ఏడుపు వినిపిస్తుంది ✤ విషమావరణంలో ఎన్ని అవమానాలు పడ్డారని పిల్లలకంటే తెలియదు బతుకు లోతు బరువు పెద్దలకేం ✤ తరగతి గది బయట పిల్లలు తలలు దించుకుని దోషుల్లా నిల్చున్నారు విఫలమైన పాఠశాలకు ఇదొక మహా తార్కాణం ✤ నిన్నటి వరకూ పిల్లల అల్లరితో ఆకాశంలో తేలి మేఘాలతో జట్టుకూడిన తరగతిగది ఇప్పుడు కన్నీళ్లను రాల్చుతుంది ✤ లోకం పోకడలు తెలియని పాదాలు మహా ప్రయాణానికి నడుం బిగించాయి శిఖరాలనూ లోయలనూ సరిసమానంగా చూడమని చిట్టచివరి పాఠాన్ని వల్లెవేస్తున్నాను ✤ నడుస్తూ నడుస్తూ నడుస్తూ వుంటే చుక్కలులేని ఆకాశం వొకటి ఎదురౌతుంది తడిలేని నేల పొడిపొడి దుఃఖాన్ని రువ్వుతుంది నడక ఆపొద్దు భయం దరిచేరనీయొద్దు ✤ వెళ్లిపోతున్నారు పిల్లలు టాటా చెప్పి మళ్లీ ఏ నదీతీరాన కలిసి తడి హృదయాలతో చిగురిస్తారో ఎవరైనా చెబితే బాగుణ్ణు ✤ నడిచిన దారిని పదేపదే పరికిస్తూ జ్ఞాపకాల పుటల్లో ముద్రించుకున్న రాతల్ని ఎప్పుడు చూసుకున్నా అదే తృప్తి అదే ఆర్తి అదే పరిమళం అదే అదే అదే ఉద్వేగ ఉన్మత్త సంబరం ✤ సెలవంటూ పిల్లలెలిపోయారు ఖాళీ తరగతిగదులన్నీ పుస్తకాల వాసన వేస్తున్నాయి ✤ దేశపటానికి రంగులద్దుతున్నాదొక విద్యార్థిని హిమాలయాలను చిత్రించింది హిందూ అరేబియా బంగాళాఖాతాలను చిత్రించింది ప్రజలకు మాత్రం ఎందుకనో రంగు వేయడం మరిచిపోయింది ✤ నల్లజినపరాయల్లాంటి గేదెలలో అతను అతని బాల్యాన్ని తడుముకుని భవిష్యత్తుని స్వప్నిస్తున్నాడు ✤ పిల్లల కథలు రాసిన కథకుడుని నిర్బంధించి ఉరివేసిందొక దేశం వాక్యాల చేతులను విరిచి అక్షరాల మీద హత్యాకాండ మొదలుపెట్టింది పిల్లల కథలు రాసే కథకులు ఉసుల్లలా పుట్టుకొచ్చారు.
