(ఇటీవ‌ల విడుద‌లైన పి. చిన్న‌య్య క‌థా సంపుటి ఊడ‌ల‌మ‌ర్రి ముందుమాట‌)

మిత్రులు పి.చిన్నయ్య తన ఊడలమర్రి కథల సంపుటికి ముందుమాట రాయమని, పదిహేనేండ్ల కాలంలో తాను రాసిన పదహారు కథలు పంపారు. ఈ కథల్లో దాదాపు అన్నీ విరసం కథల వర్క్‌ షాపుల్లో చదివినవే. కథల గురించి రకరకాల చర్చలు జరిగినవే. ఒక్కొక్క కథ చదువుతుంటే.. ఆ సన్నివేశాలన్నీ రూపుకడుతున్నాయి.

సాధారణంగా రచయితలు కనపరిచే ఉద్విగ్నతలు, ఆవేశకావేశాలు ప్రదర్శించకుండా సీదాసాదాగా.. ఏమాత్రం డాంబికం లేకుండా చిన్నయ్య మాట్లాడే పద్ధతి – స్థిరమైన ఆ కంఠస్వరం నాకిప్పటికీ గుర్తే. ఇవి అంతిమ తీర్పులో… పరమ సత్యాలో… అనే భావనతో కాకుండా మార్పుకు లోనయ్యే ప్రతి అంశంలో మనం నిలబడి చర్చించుకుంటున్న విషయం గురించి, వెనుకా ముందు – లోతు పాతులు ఆలోచించేవారికే ఇది సాధ్యమయ్యే విషయం. ఇది గతితార్కిక పద్ధతి.

ఈ కథలన్నీ మళ్లీ చదివి దాదాపు నెల అవుతున్నది. కథల వెంట ఈ నెల దినాలుగా నేనెరిగిన – నాలో భాగమైన… నల్లగొండ గురించి పుట్ట చెదిరి చీమలు బయటకు వచ్చినట్లు అనేక జ్ఞాపకాలు…

నల్గొండ కృష్ణా నదీ తీరంలో అశోక చక్రవర్తి కాలం నుంచి ఇప్పటిదాకా అతి పురాతన యుద్ధభూమి. ఆ తర్వాతి కాలంలో అనేక రకాలుగా ఆ రక్తసిక్త చరిత్రను ధ్వంసం చేయడమో, వక్రీకరించటమో జరిగింది.

పల్లవులు, చాళుక్యులు, యాదవులు, బహమనీలు, ఖిల్జీలు, కాకతీయులు, ఔరంగ జేబు, నిజాం, రేచర్ల పద్మనాయకులు, రెడ్డిరాజులు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్‌ దాకా ఎన్ని రకాల తాత్విక, రాజకీయ ఆర్థిక మార్పులకు లోనయ్యిందో నల్గొండ! కామ్రేడ్‌ దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు, రావి నారాయణరెడ్డి వర్తమానంలో… తమ వంతు కర్తవ్యంగా జితేంద్రబాబు,  సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్‌.హరగోపాల్‌ ఇక్కడి చరిత్రను రాశారు. పోరాటయోధులైన మహిళలు, వారు నిర్వహించిన పోరాట త్యాగపూరిత చరిత్ర గురించి మనకు తెలియని మన చరిత్రలో… మహిళా రచయితలు, స్త్రీవాద మేధావులు రాశారు.

బౌద్ధం – నాగార్జునకొండ, జైనం – కొలనుపాక, హిందూ, ముస్లిం, క్రైస్తవ ఆదివాసీ తెగల నుంచి ఆంధ్రమహాసభ, తెలంగాణ సాయుధపోరాటం – విరమణ; నక్సల్బరి, శ్రీకాకుళం నుంచి నేటి రైతాంగ పోరాటాలు.., మలిదశ తెలంగాణ పోరాటానికి ఊపిరిపోసిన దగాపడ్డ తెలంగాణ 1997 భువనగిరి  సభ… దాకా ఎన్నెన్నో ఘట్టాలు… మరెన్నో త్యాగాలు.

కడివెండి, బైరానుపల్లి, దేవరుప్పల, రామసముద్రం ఊచకోతలు; రజాకార్లు, నిజాం మిల్ట్రీ, భారత సైనికుల దౌర్జన్యకాండ, హత్యలు.., దొడ్డికొమురయ్య, చాకలి అయిలమ్మ, బందగీ, పులి అంజయ్య, సంతోష్‌రెడ్డి, కోనపురి అయిలయ్య, రాములు, బెల్లి లలిత,  రాచకొండ గుట్టల్లో పోలీసులు చుట్టుముట్టి కాల్చిచంపిన దివాకర్‌ (ధర్మన్న)తో పదిహేను మందిదాకా… ఎందరెందరో ఈ జిల్లా పోరునేలలో అమరులయ్యారు. యాదయ్య, శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణాలిచ్చారు. కారణాలేవైనా… పోరాటా లేవైనా… లక్ష్యాలేవైనా… నల్గొండ ఒక పురాతన దీర్ఘకాల యుద్ధక్షేత్రం. ఇలాంటి యుద్ధక్షేత్రంలో గత ముప్ఫై సంవత్సరాలుగా నేను తిరుగుతూనే ఉన్నాను. చిన్నయ్య లాంటి మనుషుల ముఖాలు… బోనగిరి, నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌ నగర్‌, కోదాడ, సూర్యాపేట చుట్టూ విస్తరించిన పల్లెల్లో చూస్తూ… వాళ్ల గురించి ఏమన్నా రాశారేమోనని వెతుకుతూనే ఉన్నాను. దొరికినదల్లా చదువుతూనే ఉన్నాను. ఎందుకంటే… వీళ్లంతా చరిత్ర నిర్మాణంలో తమవంతు రాళ్లెత్తిన కూలీలు. ఇంకా నిర్మాణం అవుతున్న వర్గ పోరాటపు చరిత్రలో వీళ్లు పాత్రలు. మౌనంగా సుదీర్ఘంగా పోరాటంలో అలలు అలలుగా కదులుతున్న ప్రజలు వీళ్లు.

వట్టికోట ఆళ్వారుస్వామి, చెరబండరాజు, కాంచనపల్లి చినవెంకటరామారావు కథలు; సుద్దాల హన్మంతు, యాదగిరి పాటలు; స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్యగుప్త క్రియాశీలత; ముదిగంటి సుజాతారెడ్డి- మలుపు తిరిగిన రథచక్రాలు, సంకెళ్లు తెగాయి నవలలు; రత్నమాల కథలు, బోయ జంగయ్య కథలు, దేవులపల్లి కృష్ణమూర్తి – బతుకు పుస్తకం; బల్లా సరస్వతి ‘కలనేత’ ఆత్మకథ నుంచి, విరువంటి గోపాలకృష్ణ, మేరెడ్డి యాదగిరిరెడ్డి, వేణుసంకోజు, విఠలాచారి, నోముల సత్యనారాయణ, శేషు సారు, బోధనం నర్సిరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, స్కైబాబా, ఎలికట్టె శంకర్‌, తాయమ్మ కరుణ కథలు, జి.అనసూయ కథలు, వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు; కార్టూనిస్టులు- శంకర్‌, నర్సిం, రవినాగ్‌, ఆర్టిస్టు సుదర్శన్‌, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, విద్యావంతుల వేదిక నాగయ్య, ఎందరో రచయితలు, కళాకారులు, చింతనాపరులే గాక, ఆత్మీయులైన డాక్టర్‌ సాహితి, సాంబశివరావు, మా కిరణ్‌ మిత్రుడు శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడ సుబ్బారావుసార్‌ లాంటివారు ఎందరెందరో గుర్తుకు వస్తారు. గుర్తుకు రానివారు మరెందరో.

చిన్నయ్య కంఠస్వరంలో లాగే నేనెరిగిన వీళ్లందరి కంఠస్వరంలో నల్గొండ తరతరాలుగా పోరాడి సాధించిన వివేచన విస్తృతి కన్పిస్తుంది..

ఇంతా రాసి కూడా… నా లోపలగల వీళ్లందరి ద్వారా ఇంకిన అనుభవం గురించి, వాళ్లు నేర్పిన నడక గురించి చెప్పలేకపోయాను. నల్లగొండ జిల్లా పోరాటాలు, త్యాగాలు… మనసంతా తల్లడమల్లడం…

*        *        *

పాత నల్గొండ జిల్లాలో పదకొండు మండలాలు. మళ్లీ ఉత్పత్తి వనరుల రీత్యా మూడు రకాలుగా, మూడు భాగాలుగా చూడవచ్చు. ఆలేరు, బోనగిరి, తుంగతుర్తి, నకిరేకల్‌.. నీటి వనరులు లేని మెట్ట ప్రాంతాలు. మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్‌ కూడా మెట్ట ప్రాంతాలు. పైగా లంబాడ లాంటి గిరిజన తెగలు నివసించే ప్రాంతాలు. ఫ్లోరైడ్‌, కొండప్రాంతాలు కావటం మూలంగా… ‘మెట్ట భూమోడు’, ‘జీవచ్ఛవాలు’ కథల్లో చిన్నయ్య రాసినట్లుగా.. చాల వెనుకబడిన ప్రాంతాలు.

ఇక కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ దాకా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరీవాహక ప్రాంతాలు. వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. ఈ మూడు ప్రాంతాలు ఒకదానికొకటి పొసగని భిన్న ఆర్థిక నేపథ్యాలున్న ప్రాంతాలు.

ఇంగ్లీష్‌ వారి రాకతో ఆంధ్ర ప్రాంతంలో (1927 ప్రాంతంలో) ఏర్పడిన డొక్కల కరువుతో పొట్టగడువక కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జీవనం, చేతి వృత్తులు కోల్పోయిన చాలా వ్యవసాయ కుటుంబాలు, దళిత బహుజనులు పొరుగునే ఉన్న నల్గొండ జిల్లాకు వలస వచ్చారు. అలా వలసవచ్చిన తొగట (మన దగ్గర పద్మశాలి) కులానికి చెందిన సామాజిక సమూహానికి చెందినవారే చిన్నయ్య. చిన్నయ్య తాతలు 1927కు పూర్వం గుంటూరు ఫిరంగిపురం నుండి వలస వచ్చి వాడపల్లి మీదుగా వలిగొండ దగ్గరి వెల్వర్తి గ్రామంలో వ్యవసాయ కుటుంబంగా స్థిరపడ్డారు. పైగా మతమార్పిడితో క్రిష్టియన్‌ రోమన్‌ క్యాథలిక్‌లుగా మారారు. ఇది ఇంకో రకమైన వలస.

రెండవసారి… 1955లో నాగార్జునసాగర్‌ నిర్మాణానికి చాలామంది కూలీలు, మేస్త్రీలుగా వలస వచ్చారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింది భూముల కోసం, ఆ తర్వాత చాలామంది కమ్మ రైతాంగం పెద్ద ఎత్తున వలస వచ్చి ఈ నాలుగు మండలాల్లో స్థిరపడ్డారు. తెలంగాణ సాయుధపోరాట కాలంలో కూడా వలసలు సాగాయి. వరి పంట పెరగటంతో అప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మిల్లర్లుగా అనుభవం గడిరచిన వైశ్యులు మిర్యాలగూడెంలాంటి చోట్లకు వచ్చి ఆసియాలోనే పెద్దదైన అనేక రకాల ధాన్యం మిల్లులు స్థాపించి.. దాదాపుగా ఈ నాలుగు మండలాల్లో వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారు.

ఇక హైదరాబాద్‌కు శివారు ప్రాంతాలైన ఆలేరు, బోనగిరి, చౌటుప్పల్‌ దాకా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రాప్రాంతపు క్రోనీ-క్యాపిటల్‌, అనుత్పాదక పెట్టుబడితో (సినిమా, చిట్‌ఫండ్‌) రామోజీరావులాంటి వాళ్లు వందల ఎకరాల పంట భూములు ఆక్రమించి… రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో, రాజకీయ అధికారం చేజిక్కించుకున్నారు. వీరే సామ్రాజ్యవాద పెట్టుబడికి, పరిశ్రమలకు వాహికలయ్యారు. ఈ పెట్టుబడితో పరిశ్రమలను నిర్వహించే వారిచేత నేరగాళ్లుగా ముద్రపడినవారు – శ్రామికులు శివార్లల్ల చిన్న చిన్న కిరాయి ఇండ్లల్లో తెలంగాణ కూలీ నాలీ జనం ఈ పుస్తకంలోని ‘శివార్లల్ల’ కథలోలాగా బతుకుతున్నవారు. ఇక ఎదుగు బొదుగులేని ఈ అసమ అభివృద్ధి కూడా లేని కన్నీటి విషాద గాథ నాగార్జునసాగర్‌, దేవరకొండ గాథ. పుట్టడమే అనాకారిగా అంగవైకల్యంతో పుట్టడంతో పాటు… బతుకు మొత్తం అనేక రుగ్మతలతో తాగునీరు విషమైన విషాద గాథ వారిది. కడుపున పుట్టిన పసిబిడ్డలను అమ్ముకోకపోతే పూటగడువని గర్భశోకం వారిది. హైదరాబాద్‌ నగరపు జిలుగువెలుగుల వంద కిలోమీటర్ల లోపుగల విధ్వంసకర విషపు పడగనీడ అది. చిన్నయ్య రాసిన ‘జీవచ్ఛవాలు’ కథలో లాగా… మిగతాప్రాంతం వాళ్లు తమ పిల్లను పెండ్లి చేసుకోరు. వాళ్ల బిడ్డను ఈ ప్రాంతంవారికి యివ్వని.. నల్గొండలోనే అంటరాని ప్రాంతం వాళ్లు వారు. ఈ వలసలు నల్గొండ సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో అనేక హింసాత్మక ఘర్షణలకు మూలాలయ్యాయి. ఫలితం మాత్రం… నల్గొండలోని స్థానిక పై కులాలు, పై వర్గాలు రాజకీయంగా ఎదిగి వలస వాదులతో విజేతలతో కలిసిపోవడమో, కలుపుకపోవడమో చేశాయి. కిందికులాల వాళ్లు, కింది వర్గాల వాళ్లు తమ వృత్తులు, భూములు కోల్పోవటమేగాక, తమ శ్రమ శక్తిని అగ్గువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇక మొదలే చెప్పుకున్నట్లుగా… నల్గొండ నిరంతర రక్తసిక్త యుద్ధభూమి. వశపడనివారు కింది కులాలవాళ్లు ముఖ్యంగా పద్మశాలీలు బివాండి, హైదరాబాద్‌ లాంటి చోట్లకు వలసపోయారు. నల్గొండ సమస్త  ఉత్పత్తి వనరుల లెక్కలు తీస్తే… ఆర్థికంగా, సామాజికంగా నల్గొండ ఎన్ని రకాలుగా, ఎంత కొల్లగొట్టబడినదో, అణిచివేతకు గురైందో మనకు అర్థమవుతుంది.

*        *        *

నల్గొండ రాజకీయ చరిత్ర కూడా చాలా రకాల మలుపులతో భిన్న మతాల, భావజాలాల ఘర్షణలమయం. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాట కాలంలోనే… అంటే – 1968లోనే విప్లవకారుల పునఃసమీకరణ ఈ జిల్లాలో ఆరంభమయ్యింది. వీటన్నింటినీ అధ్యయనం చేస్తూనే… 1977 అత్యవసర పరిస్థితి ఎత్తేసిన తర్వాత రాడికల్‌ విద్యార్థులు గ్రామాలకు తరలి గ్రామీణ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రను రికార్డు చేశారు. అలాంటి ప్రగతిశీల విద్యార్థి బృందానికి చెందినవాడుగా, విప్లవ రచయితల సంఘం సభ్యులుగా చిన్నయ్యకు ఈ చరిత్ర గమనం… వివరాలు తెలుసు.

*        *        *

కాకతీయుల పతనానంతరం (క్రీ.శ. 1323) ఢల్లీ సుల్తానుల పరిపాలనలో కాకతీయ రాజ్యం రెండు భాగాలయ్యింది. ఢల్లీ దూరం కావడంతో రాజ్య పాలన పలుచబడి సంస్థానాదీశులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. అట్లా రేచర్ల రెడ్లు కాకతీయ రాజ్యంలో కొంత భాగాన్ని పొందారు. రేచర్ల నామిరెడ్డి మేనల్లుడు చెవిరెడ్డి వైష్ణవ మతం స్వీకరించి పద్మనాయక రాజ్యం (క్రీ.శ. 1326-1482) స్థాపించాడు. అట్లా రెడ్లు శైవ మతస్థులుగా, పద్మనాయకులు (వెలమలు) వైష్ణవ మతస్థులుగా మారిపోయారు. రెండూ ఒకే కులం నుంచి చీలినవే.

పద్మనాయక రాజు సింగభూపాలుడు (క్రీ.శ. 1365 నుంచి 1475) (పోతన, శ్రీనాథుడు, లింగమనీయుడు) రాచకొండ దుర్గం కేంద్రంగా నల్గొండను పాలించాడు. ఆ తర్వాత క్రీ.శ. 1509 నుంచి 1529 దాకా శ్రీకృష్ణదేవరాయలు పాలించాడు.

నిత్యం యుద్ధాల్లో మునిగి తేలే సంస్థానాధీశులను ఓడిరచి టర్కీ దేశస్థుడైన సుల్తాన్‌ కులీ కుతుబ్‌షాతో మొదలై (1496 నుంచి 1687)కుతుబ్‌ షాహీలు గోలుకొండ కోట కేంద్రంగా పాలించారు. కుతుబ్‌షాహీలను ఓడిరచి మొఘలులు 1687 నుంచి 1724 దాకా పాలించారు. భూస్వామ్య, జాగిర్దార్ల దోపిడీ పీడనలు, అణిచివేతలే గాక.. పిండారీలనే దోపిడీదొంగల దోపిడీతో నాటి తెలంగాణ నలిగిపోయింది.

తర్వాత అసఫ్‌జాహీలు క్రీ.శ. 1724 నుంచి 1948 దాకా పాలించారు. ఈ మొత్తం కాలంలో (హైందవ, బౌద్ధ, జైన, శైవ, వీరశైవ, వైష్ణవ) మతాలు – కులాల అంతర్గత కొట్లాటలతో తెలంగాణలో భాగమైన నల్గొండ కునారిల్లింది. అంతులేని రక్తాన్నోడిరది. ఈ కొట్లాటలు భరించలేక చాలామంది మాల, మాదిగలు, కిందికులాల బహుజనులు ముస్లిం, క్రైస్తవులుగా మారిపోయారు. కులపీఠాలు గల కొలనుపాకలో రాగిరేకుల మీద కులాల చరిత్ర… నేటికీ కుల గురువుల దగ్గరున్నది.

1920-22, 1930-33 కరువు కాటకాల మూలంగా తెలంగాణలో పన్నులు కట్టలేని రైతుల భూములు జమీందారుల వశమయ్యాయి. జమీందారీ వ్యవస్థ నిజాం పాలనలో కీలకమయ్యింది. నల్గొండ జిల్లా జమీందారులైన జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి (సూర్యాపేట) లక్షా యాభైవేల ఎకరాల భూములుండేవి. విసునూరు రామచంద్రారెడ్డికి నలభై వేల ఎకరాలు, అరవై ఊర్లల్లో అధికారం ఉండేది.

ఈ విధమైన అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల మూలంగా తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ ప్రజానీకం ఊపిరాడనంత ఒత్తిడి అనుభవించింది. హైదరాబాదుకు అనగా పరిపాలన కేంద్రానికి మిగతా జిల్లాల కన్న దగ్గరలో (వంద కిలోమీటర్ల లోపు) నల్లగొండ ఉండటం చేత… రకరకాల వలసలు, మత ఘర్షణల మూలంగా… నల్గొండ ప్రజల్లో సంక్లిష్టమైన జీవన సంస్కృతి, విలువలు, ఆచార వ్యవహారాలు, కొంత చదువుతో, గతితార్కిక ఆలోచనలు ఆరంభమయ్యాయి. తెలంగాణలో పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీ అలాంటి ప్రజల్లోకి వెళ్లి ఆంధ్రమహాసభ, రైతు కూలీ సంఘాలు లాంటి వాటి నిర్మాణం చేపట్టింది. ఫలితంగా గ్రామాల్లో 1945 నాటికి రైతాంగ పోరాటాలు ఆరంభమయ్యాయి.

1946 జూలై 4న కడివెండి గ్రామంలో దొడ్డి కొమురయ్యను దొర గూండాలు హత్యచేశారు. దాంతో ఆగ్రహించిన ప్రజలు దొర గడిమీద దాడి చేశారు. ఈ నేపథ్యంలోంచే 1946 సెప్టెంబర్‌ 11న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. నాలుగువేల మంది గెరిల్లాలు, పదివేల మిలీషియాతో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో విముక్తిప్రాంతాన్ని నిర్మించుకున్నారు. ఈ విముక్తిప్రాంత గ్రామసీమలపై 1948 సెప్టెంబర్‌ 17న భారత సైన్యాల దాడి, ఆక్రమణ మొదలయింది. దీనికి తోడు 1948 ఫిబ్రవరి నుంచి రజాకార్లు గ్రామాల మీద దాడులు మొదలుపెట్టి నాలుగువేల మందికి పైగా అమాయక ప్రజలను హత్యచేశారు. 1948 సెప్టెంబర్‌ 17 నుంచి 1952 మార్చి 6 దాకా సైనిక పాలన సాగింది. ఆ క్రమంలోనే 1951 అక్టోబర్‌లో తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది. 1952 మార్చిలో ఎన్నికలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం, 1956 ఫిబ్రవరి 19న పెద్ద మనుషుల ఒప్పందం.., ఆంధ్రప్రదేశ్‌ అవతరణ… ఒకదాని తర్వాత ఒకటిగా జరిగి పోయాయి. ఈ కాలమంతా కూడా ఊళ్లు తరిమేసిన దొరలు కాంగ్రెస్‌ పేరుతో గాంధీ టోపీలు పెట్టుకొని మళ్లీ గ్రామాల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో తెలంగాణలో కొత్త వలస దోపిడీకి తెర లేచింది.

తెలంగాణపై రజాకార్ల సాకుతో భారత సైన్యాల దాడితో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పోరాట విరమణ చేసింది. కానీ, పోరాడే ప్రజలకు పోరాటం విరమణ చేయటం అనుకున్నంత సులువు కాదు. పోరాడే సాధారణ ప్రజలకు పోరాటం ఒక విలువ. కట్టుబానిస జీవితానికి స్వేచ్ఛను ప్రసాదించిన నూతన జీవితం, సాయుధపోరాట విరమణతో… తలెత్తి నిలిచి పోరాడినచోటనే తిరిగి జీతగాళ్లుగా, కూలీలుగా బతకాల్సిన దీన స్థితి వచ్చింది. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు మారలేదు. ఈ పోరాటాల అనుభవం ద్వారా ప్రజలు ఇంతదాకా వాళ్ల మీద దోపిడి పీడనలకు కారణమేమిటో, కారకులెవరో తెలుసుకున్నారు. వర్గపోరాటంలో ప్రజలు గతితార్కిక చరిత్ర అర్థం చేసుకున్నారు.

అది చూడటానికి తాత్కాలికంగా నివురు గప్పిన నిప్పు. ఆ నిప్పు ప్రజల లోలోపల రగులుతూనే ఉంది.

నక్సల్బరి, శ్రీకాకుళం… తెలంగాణ సాయుధపోరాట అనుభవ గుణపాఠాలతో తిరిగి 1968లోనే తెలంగాణలో నల్గొండలో విప్లవోద్యమం ఆరంభమయ్యింది. అత్యవసర పరిస్థితి ఎత్తేసిన తర్వాత కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ప్రాంతంలో ఆ నిప్పు రాజుకున్నది. అదేమిటో..? అది విద్యార్థిరంగంలో, రైతాంగంలో, కార్మిక రంగంలో కాలూని ఎట్లా పనిచేసిందో.. నల్గొండ సహచరులు రాయవల్సిందే. అలాంటి చారిత్రక సందర్భంలోనే, ఉద్యమ ప్రారంభ రోజుల్లోనే.. నల్లగొండ జిల్లాలో నగర నడిబొడ్డున ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీస్‌ అధికారి వ్యాస్‌ ఆధ్వర్యంలో విప్లవకారులు రవీందర్‌రెడ్డి, పర్సయ్యలను కోర్టు ఆవరణలోనే కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు. ఓ ప్రత్యేక భౌగోళిక, ఆర్థిక కారణాల మూలంగా… ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్‌ భూముల కారణంగా మొదటి నుంచి నల్గొండ జిల్లా తీవ్ర నిర్బంధం నీడలో ఉన్నది. పులి అంజయ్య, సంతోష్‌రెడ్డి, మేకల దామోదర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, సాంబశివుడి లాంటి వారు రాష్ట్ర నాయకత్వందాకా ఎదిగిన ఉద్యమ నేతలను వేటాడి, వెంటాడి చంపటానికి ఈ రాజకీయార్థిక భూమికే కారణమయ్యింది. గ్రేహౌండ్స్‌, నల్లదండు ముఠాలు, హంతక ముఠాలు.. ప్రభుత్వం అనేక మారువేషాలతో చేసిన హత్యాకాండలు నల్గొండ ప్రజలు అనుభవించారు. ఈ క్రమంలోనే భువనగిరి – దగాపడ్డ తెలంగాణ డిక్లరేషన్‌ 1997 సభ రూపొందింది. బెల్లి లలిత హత్య ఎలాంటి ప్రజా సంఘాన్ని సహించని వలస దురహంకార స్థితిని చాటిచెప్పింది. ఇలాంటి పెనుగులాటలో చిన్నయ్య ఊపిరి బిగపట్టుకొని 1993 నుంచి విరసం సభ్యుడిగా ఈ ప్రాంతంలో జీవిస్తున్నాడు. ఈ ప్రాంతపు దుఃఖావేశాలను అనుభవించాడు. తనకు అర్థమైన పద్ధతిలో దాదాపు ముప్ఫైకి పైగా కథలు రాశాడు. 2005లో పదమూడు కథలతో పైలం కథల సంపుటి తెచ్చాడు.

*        *        *

ఈ చారిత్రక నేపథ్యంలో 2005 నుంచి ఇప్పటిదాకా రాసిన పదహారు కథలను ‘ఊడల మర్రి’ సంపుటిగా తేదలుచుకున్నాడు. నల్గొండ జిల్లాలోని రకరకాల వైవిధ్యాలు, వైరుధ్యాలు – ఆ వైరుధ్యాల్లో అతలాకుతలమవుతున్న ప్రజలు… అవి పరిమాణాత్మక పోరాటాలుగా రూపుదిద్దుకుంటున్న క్రమం గురించి… ఆ చారిత్రక నేపథ్యంలో రూపొం దాల్సిన మానవీయ సంబంధాలు, నూతన మానవుని ఆవిష్కరణ… స్థితుల గురించి సంవత్సరానికొక కథ చొప్పున చిన్నయ్య రాశారు.

ఉత్పత్తి వనరులు – నీటిపారుదలగల ప్రాంతం, మెట్ట ప్రాంతాలల్లో బతికే మనుషుల జీవన సరళిలో, ఆలోచనా విధానంలో ఎంత తేడా ఉంటుందో? అది కూడా ఆధిపత్యానికి- సాంస్కృతిక తేడాకి ఎట్లా మూలమై ఏ దిశగా ఎదుగుతాయో… చాలా సూక్ష్మంగా చర్చించిన కథ ‘మెట్ట భూమోడు’. గునుగుపూవు లాంటి మెట్ట భూమోనికి రెల్లిపూవు లాంటి నీళ్ల ప్రాంతమోనికి గొడవలు అసమానతలు ఎప్పుడు పోతయి?! చిన్నయ్య ప్రశ్న.

ఇదే అవగాహనతో… మెట్టభూమి ప్రాంతంలో కూడా ఫ్లోరిన్‌ కలిసిన తాగునీళ్లు కల్గిన ప్రాంతానికి… ఆ పక్కనే ఉన్న సామాన్యమైన మంచినీరు తాగే ప్రజలకు ఉండే వైరుధ్యం… అది మనుషులను ఎట్లా కకావికలు చేస్తుందో ‘జీవచ్ఛవాలు’ కథ.. చెప్తుంది.

ఈ కాలంలో తెలుగు సమాజంలో ప్రముఖంగా రంగం మీదికి వచ్చిన కులసమస్య మూలాలను చిన్నయ్య చర్చించాడు. పోరాడే విప్లవ పార్టీలన్నీ భారతీయ సమాజంలో కులాన్ని పునాదిగా గుర్తించటానికి ముందు జరిగిన అనేకానేక చర్చలు, వ్యక్తీకరణల నేపథ్యంలో చిన్నయ్య నాలుగు కథలు రాశాడు. ‘పంపకాలు’ కథ… నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ప్రతి పై కులం కిందికులం మీద అధికారం ఎట్లా నెరుపుతుందో..? అదేవిధంగా ఆర్థిక వనరుల పంపకంలో కూడా ఇది ఏ విధంగా ప్రతిఫలిస్తుందో..? విప్లవోద్యమ అవగాహన నేపథ్యంలో చర్చించిన కథ. పై కులపోడు మెట్టుదిగి కిందికి రాడు. కింది కులం పై మెట్టుకు ఎక్కకుండా పై కులం అడ్డుకుంటుందంటాడు… చిన్నయ్య.

అట్లాగే… సాంస్కృతిక రంగంలో దాదాపు ఒకే ఆర్థిక హోదాలో ఉన్నా కూడా కులం ఎట్లా వ్యక్తమవుతుందో ‘అంటరాని బతుకమ్మ’ కథ చెప్తుంది. తిండి – అలవాట్ల మధ్య ఘర్షణను ‘స్టోరి ఆఫ్‌ వరాహా’ కథగా రాశాడు.

మిర్యాలగూడలో పరువు పేరిట జరిగిన ప్రణయ్‌ హత్య ఎంత సంచలనం సృష్టించిందో.., దాని వెనుక ఉన్న సామాజిక కుల సంబంధాలే కాదు, ఆర్థిక సంబంధాలు చర్చలోకి రావటం మనందరికి తెలిసిన విషయమే.

గతించి పోవాల్సిన పాత భూస్వామిక కుల సంబంధాలు, రూపొందాల్సిన ప్రజాస్వామిక స్త్రీ, పురుష సంబంధాలు… ఉద్యమాల నేపథ్యంలో ఎట్లా మారుతూ వచ్చాయో చర్చించిన కథ ‘ఆ కాలం కోసం’. ఈ కథలో.. కింది కులాలల్లో కొత్త పెత్తందార్లు ఏర్పడి.. కుల సంఘాలను బలోపేతం చేసి దళారీ అవతారమెత్తి లాభపడటం.., ఇలాంటి పరిస్థితిలో… ఇలాంటి కులాలున్నంత కాలం స్త్రీ, పురుషుల మధ్య ఎంత సహజప్రేమ వున్నా కూడా… వైరుధ్యాలు లేకుండా జీవించటం ఎంతో కష్టం… అంటాడు చిన్నయ్య.

నిచ్చెనమెట్ల కుల సంబంధాలు  ఉపరితలాంశాలైన సంస్కృతి, విద్యారంగంలో ఎట్లా వ్యక్తమవుతాయో చర్చించిన కథ ‘కానికాలం’. కరోనా, కులం కొంత మంది స్వార్థపర శక్తుల వలన పుట్టినదేనంటారు చిన్నయ్య. కరోనా కన్నా బలమైంది కులం అంటూ.. దానిపై ఎన్ని విధాలుగా పోరాడాలో హెచ్చరిక చేస్తాడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా విప్లవోద్యమాల్లో అనేక దశలకు దిశలకు నాయకత్వాన్ని అందించిన నల్గొండలోనే, ప్రతీఘాతుక శక్తులు కూడా రాజ్యం అండదండలతో పురుడు పోసుకున్నాయి. విప్లవోద్యమాలను అణచడానికి నల్లదండు ముఠాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

దోపిడీ, పీడనల మీద ఆధారపడిన రాజ్యానికి… దాని రక్షణయంత్రాంగం అయిన పోలీసులు ఉన్నా కూడా ఓ ప్రత్యేక సామాజిక సందర్భాల్లో ప్రైవేటు సైన్యం అవసర మవుతుంది. నల్లదండు, నల్లమల కోబ్రాలు, ఫియర్‌ వికాస్‌లు అట్లా ఉనికిలోకి వచ్చినవే. ఈప్రైవేటు కిరాయి సేనలు విప్లవోద్యమం ఉధృతి కారణంగా ఊర్లు వదిలి నగర శివార్లకు చేరాయి. మరోవైపు… సమాజాన్ని మార్చే నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ కార్యకర్తలు రాజ్యనిర్బంధం మూలంగా… రక్తపింజర అయిన నగరానికి వలసపోక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఈ పరస్పర విరుద్ధ శక్తులు నగరశివార్లల్లో అనివార్యంగా ఉండటం గురించి.., ఫలితంగా ఏర్పడిన హింస గురించి, ప్రజలు సాలెగూటిలో చిక్కిన జీవుల్లా విలవిలలాడిన తీరును ‘శివార్లల్ల’ కథ చెప్తుంది. పరస్పర విరుద్ధ లక్ష్యాల మధ్య ఘర్షణలో రాజ్యం ప్రైవేటు సేనలకు వత్తాసుగా నిలిచిన వైనం చెప్తుంది. ప్రజలు మాత్రం చట్టం దృష్టిలో హింసావాదులుగా, నేరం చేసినవారుగా మిగిలిపోయిన విషాదాన్ని తెలుపుతుంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో… వృత్తులు కోల్పోయిన వారిలో పాత వృత్తులను అంటి పెట్టుకున్నవారు తెలంగాణలో కాలానుగుణంగా మారిన చారిలాంటి వారి గురించి చర్చించిన కథ ‘నీలాంటోడు’. మధ్యతరగతి – స్టాక్‌ మార్కెట్‌ మాయలో కొట్టుకుపోయి… సకలం పోగొట్టుకోవటం.., పాత సమాజంలో విధ్వంసమైన తమ కలలకు, పరాయీకరించ బడిన సృజనాత్మకత వికృతరూపంలో వ్యక్తమయ్యే స్టాక్‌మార్కెట్‌ స్వరూపం ‘దలాల్‌ స్ట్రీట్‌’. పెట్టుబడికి పుట్టిన వికృత రూపాల్లో స్టాక్‌ మార్కెట్‌ ఒకటి. కంపెనీ పెట్టి వస్తువులను   ఉత్పత్తి చేసి లాభాలు పొందేకన్నా, డబ్బుకు డబ్బు పుట్టించడం… లాంటి పోకడలను ప్రపంచంలో ఈ దోపిడీని ఎక్కడికైనా విస్తరించవచ్చు అని అంటాడు చిన్నయ్య.

రైతుబంధు పథకం గురించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు లబ్ధిదారు లుగా మారిన స్థితిలో.., కౌలుదారులుగా అసలు రైతులు పడిన సంఘర్షణ, వివక్ష గురించి ‘సాగుదారు’ కథ చెప్తుంది. ప్రపంచీకరణ తర్వాత… ఊళ్లు తరిమేసిన దొరలు… లాభసాటి సర్వీసు రంగమైన విద్య, వైద్యంలోకి ప్రవేశించారు. ఫలితంగా ప్రభుత్వ బడులు, హాస్పిటళ్లు మూతపడి… ప్రైవేటు రంగంలో బడులు, హాస్పిటళ్లు వెలిసి ప్రజలను దోచుకోవటం ప్రారంభించాయి. ఈ మార్పు క్రమాన్ని చిత్రించిన కథ ‘కొడిగట్టిన దీపాలు’.

పర్యావరణం ధ్వంసం కావటం… నదులు, వాగులు, వంకల్లోని ఇసుకను తరలిం చుకుపోవటం… ఫలితంగా గ్రామీణ ప్రజలు తాగునీటికోసం కటకటలాడటం… దీన్ని ఏ విధంగా ఐక్యంగా ఎదుర్కోవాలి? పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలో… చిత్రించిన కథలు ‘ఈత’, ‘అడిగేటోళ్లు’.

ఎన్నికలు ఎంత బూటకమో చిత్రించిన కథ ‘కొన్ని దృశ్యాలు’. శిల్పరీత్యా ఈ కథ భిన్నమైన కథ. ప్రత్యేకమైనది.

ఈ పదహారు కథలకు సారాంశంగా రాసిన కథ ‘ఊడల మర్రి’. భారతదేశంలో మూడు వేల సంవత్సరాలుగా సహజ పరిణామక్రమమైన బానిస – భూస్వామ్య, పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక, సోషలిస్టు సమాజాలుగా సహజ పరిణామం చెందకుండా, అభివృద్ధి కాకుండా బ్రాహ్మణీయ భూస్వామ్యం నిరోధించింది. అనేక పరిమాణాత్మక పోరాటాలు జరిగినా కూడా… గుణాత్మక మార్పులకు లోనుకాకుండా అడ్డుకుంటున్న అనేక వైరుధ్యాల దశదిశలు ఈ కథలు.

చిన్నయ్య చెప్పినట్లు… మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అని చెప్పి అధికారం లోకి వచ్చినవారు… పేద ప్రజలు విప్లవోద్యమానికి సానుభూతిపరులుగా ఉంటే అరెస్టు చేస్తారు. దీనికి కారణం… ఊడలుదిగిన మర్రిలాంటి బ్రాహ్మణీయ భూస్వామ్యం. దానితో మిలాఖతు అయిన సామ్రాజ్యవాద మర్రిచెట్టు. అర్ధ భూస్వామ్య, అర్ధవలస రాజ్యానికి మర్రిచెట్టు కొండ గుర్తు. అలాంటి చెట్టు కిందనే అనేక ఉద్యమాలు రూపొంది కొనసాగుతున్నాయి.

ఇలాంటి విప్లవోద్యమాలను గతితార్కికంగా, చారిత్రకంగా అధ్యయనం చేయాలనే ప్రతీకాత్మకత… ఊడల మర్రి కథలో వట్టికోట అళ్వారుస్వామి లైబ్రరీ ఏర్పాటు చేయాలనే యువకుల సంకల్పం…

ఒకప్పుడు విప్లవకారులు ప్రజలను సమావేశపరిచి విప్లవోద్యమాలు నిర్మించినది ఆ ఊడలమర్రి కూడలిలోనే. నేటి వర్తమానకాలంలో యాభై సంవత్సరాలుగా మూడు తరాలుగా విప్లవోద్యమం కొనసాగుతున్నది. అట్లా నిర్మితమైన విప్లవోద్యమాలు అనేక ఆటుపోట్లు అనుభవించి – వేలాది మంది విప్లవకారుల త్యాగాలతో దేశ వ్యాప్తంగా విస్తరించాయి. మూడువేల సంవత్సరాల పుక్కిటి పురాణాల బ్రాహ్మణీయ భూస్వామిక భావవాద సమాజంలో… శాస్త్రీయమైన భౌతికవాద ఆలోచనలను వర్గపోరాటం పునాదిలో-ఉపరితలంలో నిర్మించటానికి దీర్ఘకాలిక యుద్ధంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం, కమ్యూనిస్టు ప్రణాళిక రచించుకొన్నప్పటి (1848) నుంచి ఇప్పటిదాకా 172 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇది (1976నుండి) ఆరో దశ. నాటి నుంచి నేటిదాకా భారతదేశ విప్లవోద్యమం సాగిన, విస్తరించిన క్రమం ఇవ్వాళ ప్రపంచ విప్లవోద్యమాలకు మార్గదర్శి. మధ్యభారతంలోని దండకారణ్యంలో జనతన సర్కార్‌ల సారథ్యంలో ఆవిష్కృత మవుతున్న నూతన మానవుడు నేటి ప్రపంచానికి చుక్కాని (రికన్నాయిటర్‌).

వర్తులాకారపు విప్లవోద్యమ అభివృద్ధి క్రమంలో సుదీర్ఘ విప్లవోద్యమం కాకలుదీరిన వీరయోధులు ఎందరినో అందించిన నల్గొండ జిల్లాలోని అతిపురాతన గ్రామానికి ఊడల మర్రి కేంద్రబిందువు, సంకేతం. నేడు అదే ఊడలమర్రి కింద… గ్రామంలోని అన్ని కులాల ప్రాతినిధ్యంగా రమేశ్‌, శంకర్‌, కిష్టయ్య, వెంకటేశ్‌ సమావేశమై… విప్లవోద్యమం విస్తృతి గురించి దారుల జాడలు వెతుకుతున్నారు. కులాల పునాదులు కూలగొట్టడానికి ఎత్తుగడలు, వ్యూహం రచిస్తున్నారు.

ఇప్పుడు భారతదేశంలో… అన్ని ప్రాంతాలు, కులాలు, వర్గాలు, మతాలు, జాతులు, లింగాలు వేరువేరుగా తమలో తాము ఘర్షణపడి పెనుగులాడిన స్థితి నుంచి… వైరుధ్యాల నుంచి బైటపడి నదీ ప్రవాహంగా అనివార్యంగా విస్తరించాల్సిన సమయంలో గతితార్కిక అధ్యయనం వివేచన బలపడుతోంది.

ఆదివాసులు నిర్మించిన ఇంద్రప్రస్థ నగరం పక్కనేగల అతిపురాతన యుద్ధభూమి ఢల్లీి సరిహద్దులు టిక్రీ, ఘాజీపూర్‌, సింఘూర్‌ సరిహద్దుల వద్ద భారత రైతాంగం లక్షలాది మంది స్త్రీ, పురుషులు, వృద్ధులు, పిల్లలు అన్ని వర్గాలు, కులాల వాళ్లు నాలుగు నెలలుగా మోహరించి ఉన్నారు (నవంబర్‌ 26నుంచి నేటిదాకా). భారతదేశ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టి.., మరణశయ్య మీద ఉన్న సామ్రాజ్యవాదానికి దాసోహం అంటున్న భారతదేశ కుళ్లిపోయిన అర్ధభూస్వామ్య-అర్ధవలస రాజ్యాధికారం ఫాసిజంగా ప్రజల మీద దాడికి దిగుతోంది.

ఉత్పత్తి శక్తుల – ఉత్పత్తి సంబంధాల వైరుధ్యాన్ని పరిష్కరించాలనే స్థితికి ఇది కొండ గుర్తు. ప్రజలు ఈ స్థితిని మార్చటానికి అతిపురాతన అభివృద్ధి నిరోధకమైన వైరుధ్యాన్ని పరిష్కరించటానికి సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు..

ఈ సమయం సందర్భంలోనే అంతర్‌, బాహిర్‌ వైరుధ్యాలను శోధిస్తున్నారు. అనగా ఉత్పత్తి శక్తులను, ఉత్పత్తి సంబంధాలను స్థల కాలాల్లో, వర్గపోరాటంలో అలాంటి వైరుధ్యాలు వర్గ, కుల, లింగ, ప్రాంత వైరుధ్యాలు ఎట్లా వ్యక్తమవుతున్నాయో అధ్యయనం చేస్తున్నారు. ఆవాహన చేసుకుంటున్నారు.

ముఖ్యంగా పునాది అయిన ఉత్పత్తి శక్తుల స్వభావం నిరంతరం మార్పు చెందేది. ఉత్పత్తి సంబంధాలైన రాజకీయ, సాంస్కృతిక భావజాల రంగం స్వభావం కొంతకాలం నిలకడగా ఉండేది. అనగా పునాది-ఉపరితలాంశాల మార్పు వేగంలో తేడా ఉండటం వలన-ఉపరితలాంశాలు కూడా పునాదిమీద బలమైన ప్రభావం చూపించే అవకాశమున్న దనేది 1966 తరువాత చైనాలో జరిగిన సాంస్కృతికవిప్లవ సారాంశం. ఈ నేపథ్యంలోనే విప్లవోద్యమం భారత దేశంలోని అన్ని రకాల వైరుధ్యాలను అధ్యయనం చేయాల్సి వస్తున్నది. యుద్ధం-నిర్మాణం అనివార్యమైంది. ఊడలమర్రి కింద సమావేశమైన నల్గొండ అన్నికులాల యువకుల్లాగే ఢల్లీి సరిహద్దులో మోహరించిన రైతులు – దేశ వ్యాప్తంగా ఉన్న పోరాడే ప్రజలు, ఈ నేపథ్యంలో భారతదేశ గతితార్కిక చరిత్రను అధ్యయనం చేస్తున్నారు. ప్రజల గతితార్కిక చరిత్రను, వైరుధ్యాలను, వర్గ పోరాటాలను అర్థం చేసుకోవటానికి, అడుగులు వేయటానికి చిన్నయ్య లాంటి విప్లవరచయితలు సృజించిన సాహిత్యం ఉపకరిస్తుందని తలుస్తూ…

2021 మార్చి 18

Leave a Reply